ది వేస్ట్‌ లాండ్: 3. గేమ్ ఆఫ్ చెస్ 2వ భాగం

[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్‌ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]


గేమ్ ఆఫ్ చెస్ మొదటి దృశ్యంలో రెండవ భాగం:

మొదటి భాగంలో యింతవరకు మనం చూచిన మొదటి భాగం వర్ణన. రెండవ భాగం పూర్తిగా సంభాషణారూపం. మొదటి భాగంలో, శైలి ఆలంకారికము, భాష ఉదాత్తము, ఛందస్సు సాంప్రదాయికము (iambic).

ఇప్పుడు ఒక్కసారి అన్నీ మారిపోయాయి. ఇంతవరకు మనం చూచిన ‘మహారాణి లాంటి’ వైభవం బాహ్యం. అందులో, సుస్థితి స్థైర్యం స్వస్థత చూచాం. ఇప్పుడు మనం చూడబోయేది అంతరంగం. లోకానికి చూపే ముఖం వేరు, లోపలి ముఖం వేరు. ముఖం లోకానికి చూపించడానికి కావలసిన వస్తుసామగ్రి మొదటి భాగం ప్రదర్శించింది, తలుపులు మూసి: waiting for a knock upon the door. ఇప్పుడు మనం చూడబోయేది, ముఖానికి అద్దిన రంగులు రాలిపోయి, అత్తర్లు ఆవిరైపోయినపుడు కనిపించే వాస్తవ రూపం. అత్తరుల ఘాటులో రూపమే కాదు, బుద్ధి కూడా నశించింది: drowned the sense in odours.

‘My nerves are bad tonight. Yes, bad. Stay with me.
Speak to me. Why do you never speak. Speak.
What are you thinking of? What thinking? What?
I never know what you are thinking. Think.’

I think we are in rats’ alley
Where the dead men lost their bones.

‘What is that noise?’
           The wind under the door.
‘What is that noise now? What is the wind doing?’
           Nothing again nothing.
           ‘Do
‘You know nothing? Do you see nothing? Do you remember
‘Nothing?’

       I remember
Those are pearls that were his eyes.
‘Are you alive, or not? Is there nothing in your head?’
           But

O O O O that Shakespeherian Rag—
It’s so elegant
So intelligent
‘What shall I do now? What shall I do?’
‘I shall rush out as I am, and walk the street
‘With my hair down, so. What shall we do tomorrow?
‘What shall we ever do?’
           The hot water at ten.
And if it rains, a closed car at four.
And we shall play a game of chess,
Pressing lidless eyes and waiting for a knock upon the door. (l. 138)

ఇది స్త్రీపురుషులిద్దరి సంభాషణ. వారి మాటలలో వ్యక్తమవుతున్నది ఆందోళన ఆగ్రహం అనిశ్చయం అభద్రత. వారి భగ్నజీవితాలను ప్రతిఫలిస్తున్నది యీ భాగంలోని భగ్నఛందస్సు. ఇక్కడ మాట్లాడుతున్న స్త్రీ ఇంతవరకు మనం చూసిన స్త్రీయేనా? మనం ఆమెను చూచామా? ఆమె గదిని చూచాం. ఆమె కేశపాశకీలలు, కంటిమంటలు చూశాం.

ఈ సంభాషణలోని భాగం యిప్పటికి రెండు చోట్ల ప్రస్తావించుకొన్నాం. ఇంతదాక మహారాణి’లా’ జీవిస్తున్నట్టు అనిపించిన స్త్రీ, వాస్తవంలో చాలా సాధారణ స్త్రీ. ఆమె మనసు దుర్బలం. ఆమె జీవితంలో అనిశ్చయం. జీవితగమ్యం అనిర్దిష్టం. స్త్రీపురుషులిద్దరి మాటలలో మనకు తెలుస్తున్నదేమంటే, వారిద్దరు మాట్లాడుకోవడం లేదు. మాట్లాడుకోలేకపోతున్నారు. అదే వారి సంభాషణ విషయం. అతడు మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. కారణం తెలియదు. ఆ రహస్యమేదో తెలియక ఆమె అనుమానం ఆందోళన భయం పెరిగిపోతున్నాయి. ఆమె అస్వస్థ. ఆమె అస్వస్థతకు అతడు కారణమా? అతడి ఆందోళనకు ఆమె అస్వస్థత కారణమా? ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. కాని ఎవరి గదిలో వారు తలుపులు వేసుకున్నారు. ఎవరి లోకంలో వారు. ఒకరి తలపులు మరొకరికి తెలియవు, అర్థం కావు.

‘My nerves are bad tonight. Yes, bad. Stay with me.
Speak to me. Why do you never speak. Speak.
What are you thinking of? What thinking? What?
I never know what you are thinking. Think.’

ఆమె ప్రశ్నకు అతడి సమాధానం:

I think we are in rats’ alley
Where the dead men lost their bones.

యుద్ధదృశ్యమేదో గుర్తుచేసుకొంటున్నాడు, కందకాలలో సైనికులు ఎముకలతో ఎలుకలతో సహవాసం చేసిన క్షణాలు.

‘What is that noise?’
           The wind under the door.
‘What is that noise now? What is the wind doing?’

గాలి కదిలినా భయంతో వణికిపోతున్నది ఆమె: ‘గాలి అక్కడే ఉందా, తలుపుకింద? ఏం చేస్తోంది?’ (Is the wind in that door still? ఇది వెబ్‌స్టర్ నాటకం, ది డెవిల్స్ లా కేస్‌లో వాక్యం.)

ఆమె భయానికి ఆధారముందా? అతడు, ఆశ్వాసించే దుర్బలప్రయత్నం చేస్తున్నాడు: ‘ఏం లేదు. ఏం లేదంటున్నాను కదా?’ అంటాడు. (Nothing again nothing.) ఈ శూన్యమే (Nothing) ఆధునిక జీవితవాస్తవభయకారణం అని ధ్వని.

ఆమె ప్రశ్న, మళ్ళీ:

‘You know nothing? Do you see nothing? Do you remember
‘Nothing?’

ఆమె ప్రశ్నలలో మనకు ఏం తెలుస్తోంది? అతడు మతి పోగొట్టుకొన్నవాడా? ఎవరినీ దేనినీ గుర్తించలేకుండా ఉన్నాడా? ఆమెను కూడా?

I remember
Those are pearls that were his eyes.

ఇతడికి నిజంగానే మతిపోయింది. ఆమె అడుగుతున్న ప్రశ్నకు అదేం సమాధానం? (Those are pearls that were his eyes – ఈ షేక్స్‌పియరు వాక్యం సోసోస్ట్రీస్ సోదిలో విన్నాం.)

నీకేమీ జ్ఞాపకం లేదా? అంటే అతడిచ్చిన సమాధానం, వేల సంవత్సరాల క్రితం (సముద్రయుద్ధంలో) చనిపోయినవాడి ‘కళ్ళు ముత్యాలలా ఉండేవి’ అంటున్నాడు. సైనికుల కందకాలు, సముద్రాలపై యుద్ధాలు, మునిగిపోయిన సైనికులు, యివి అతడి జ్ఞాపకాలు. యుద్ధభీభత్సం చూచి మతి చెడినవాడు మతి లేనివాడు. మనిషి జీవన్మృతుడు.

Are you alive, or not? Is there nothing in your head? – యుద్ధానంతరం జీవితం మృతప్రాయంగా మారిపోతుంది. గమ్యం లేని గానుగెద్దు జీవితం.

What shall I do now?
What shall I do? I shall rush out as I am, and walk the street
With my hair down, so.
What shall we do tomorrow? What shall we ever do?

ఇవేళ కాదు, రేపు కాదు. ఎప్పుడైనా చేయడానికేముంది?

The hot water at ten.
And if it rains, a closed car at four.
And we shall play a game of chess.

యాంత్రికజీవితం. లేకుంటే, ఎవరినైనా వంచించడం, మిడిల్‌టన్ నాటకంలో చదరంగం ఆట లాగా. (బ్రాంకాను డ్యూక్ వశపరచుకొనే సమయంలో, బ్రాంకా అత్తగారిని గది వెలుపల లివియా చదరంగం ఆడించినట్టు.) ఈ దృశ్యంలోని పురుషుడు, వేస్ట్ లాండ్‌లో దీని తరువాతి అంకం దై ఫైర్ సెర్మన్ లోని విటుడిలాంటివాడు కూడా కావచ్చు. (Carbuncular clerk, టైపిస్టు యాంత్రిక శృంగారదృశ్యం.) ఇంత మాత్రానికేనా, యీ అంకానికి ‘ఎ గేమ్ ఆఫ్ చెస్‌’ శీర్షిక? కాదు. ఇక్కడ కేవలం ధర్మబాహ్యమైన వివాహేతర కామక్రియను చెప్పడం లేదు ఎలియట్. జీవితమే ధర్మదూరమయింది అని సూచిస్తున్నాడు. జీవితం జీవితం కోసం కాదు, చదరంగం ఆట ఆటకోసం కానట్టు. మనలను మనం మభ్యపెట్టుకొని, ఒక పని ఒకందుకు చేస్తూ, మరేదో ప్రయోజనం చెప్పుకొంటున్నాం. ఈ ఆత్మవంచన నుండి మనలను ఎవడు రక్షిస్తాడు?

ఎవడో వస్తాడని ఎదురుచూడడం, కళ్ళు కాయలు కాచి: Pressing lidless eyes and waiting for a knock upon the door.

వాడెవడో ఎన్నటికీ రాడు, వెయిటింగ్ ఫర్ ది గొడోలో లాగా. (ఈ బెకెట్ నాటకం వేస్ట్ లాండ్‌కు దాదాపు ముప్పై సంవత్సరాల తరువాత వచ్చింది.) ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూడడంతోనే జీవితం వ్యర్ధమైపోతుంది.

ఎ గేమ్ ఆఫ్ చెస్‌లో రెండవ దృశ్యం – పబ్ సీను

When Lil’s husband got demobbed, I said—
I didn’t mince my words, I said to her myself,
HURRY UP PLEASE ITS TIME

Now Albert’s coming back, make yourself a bit smart.
He’ll want to know what you done with that money he gave you
To get yourself some teeth. He did, I was there.
You have them all out, Lil, and get a nice set,
He said, I swear, I can’t bear to look at you.
And no more can’t I, I said, and think of poor Albert,
He’s been in the army four years, he wants a good time,
And if you don’t give it him, there’s others will, I said.
Oh is there, she said. Something o’ that, I said.
Then I’ll know who to thank, she said, and give me a straight look.
HURRY UP PLEASE ITS TIME

If you don’t like it you can get on with it, I said.
Others can pick and choose if you can’t.
But if Albert makes off, it won’t be for lack of telling.
You ought to be ashamed, I said, to look so antique.
(And her only thirty-one.)

I can’t help it, she said, pulling a long face,
It’s them pills I took, to bring it off, she said.
(She’s had five already, and nearly died of young George.)
The chemist said it would be all right, but I’ve never been the same.
You are a proper fool, I said.
Well, if Albert won’t leave you alone, there it is, I said,
What you get married for if you don’t want children?
HURRY UP PLEASE ITS TIME

Well, that Sunday Albert was home, they had a hot gammon,
And they asked me in to dinner, to get the beauty of it hot—
HURRY UP PLEASE ITS TIME
HURRY UP PLEASE ITS TIME

Goonight Bill. Goonight Lou. Goonight May. Goonight.
Ta ta. Goonight. Goonight.
Good night, ladies, good night, sweet ladies, good night, good night.

వేస్ట్ లాండ్‌ లోని యీ భాగం ఎలియట్ కవిగా సాధించిన ప్రముఖవిజయం అనవచ్చు. ‘అలగాజనాల ఆదికవి’ సాహసించని ఛందోభాషాప్రయోగం, యీ అమెరికాంగ్ల విశ్వనాథ సాధించాడు. నిరక్షరులభాషను సాంప్రదాయికఛందోబద్ధం చేసి విజయం సాధించాడు, ఛందో’బద్ధ’మనిపించకుండా. (అమెరికన్ ఎలియట్, త్వరలోనే ‘ఇంగ్లీషు’ భాషను పట్టుకొన్నాడు.) గ్రామ్యభాషను సాంప్రదాయికఛందస్సును కూడా సహజంగా నిర్వహించాడు. కాదేదీ కవితకనర్హం అని నిరూపించాడు.

ఈ సంభాషణ ఒక చౌకబారు పబ్‌లో జరిగింది. ఒక స్త్రీ మాట్లాడమే మనం వింటాం. ఆమెకు మరో మూడవ స్త్రీకి జరిగిన సంభాషణ, పబ్‌లో తనతో ఉన్న ఒక స్త్రీకి రిపోర్ట్ చేస్తున్నది.

లిల్ భర్త ఆల్బర్ట్‌ను సైన్యంనుండి యింటికి పంపించేస్తున్నారు. లిల్‌తో తనకు జరిగిన సంభాషణ చెబుతోంది యీమె. లిల్‌కు ముప్పైఒక్క ఏళ్ళు. అప్పుడే ముసలిదైపోయింది. అయిదు గర్భస్రావాలు. మందులషాపువాడు ‘ఏం కాదు’ అంటాడు. ఆమెకు పళ్ళన్నీ కదిలిపోయాయి. అన్నీ పీకేసి కొత్త సెట్టు కట్టించుకోమని ఆమె భర్త డబ్బుకూడా యిచ్చి వెళ్ళాడు. పాపం! ‘మీ ఆయన నాలుగేళ్ళు సైన్యంలో పనిచేసి వస్తున్నాడు, కాస్త సరదా ఆశించడం తప్పా? నీవివ్వలేకపోతే మరొకరిస్తారు. అప్పుడెవర్నీ తప్పుబట్టలేవు. నిన్ను నీవే తిట్టుకోవాలి’ అని చెప్పేశా లిల్‌కు, అంటుంది.

ఈ సంభాషణ జరుగుతుండగా మధ్య మధ్య, పబ్ మూసేవేళయింది, కానీయండి కానీయండి (HURRY UP PLEASE ITS TIME) అని గుర్తుచేస్తూనే ఉంటాడు వెయిటర్. ఇంక ఒకరికొకరు గుడ్‌నైట్ చెప్పుకుని వెళ్ళిపోతారు.

ఇది యీ భాగంలో విషయం. కాని యింత సాధారణంగా కనిపించే అతిసాధారణజనాల చిత్రణలో ఎలియట్ ప్రత్యేకమైన ప్రయోజనం సాధిస్తాడు.

బడుగువర్గం స్త్రీల జీవితాలలోనూ స్త్రీపురుషసంబంధాలు మెరుగుగా లేవు. సంతోషం లేదు. సంతానం లేదు. పిల్లలను పోషించలేని భయం. గర్భస్రావాలు. (What you get married for if you don’t want children?)

ఉన్నతవర్గంలోను స్త్రీ పురుషులు ఎవరిలోకంలో వారు తలదూర్చుకొని పోయారు. అన్యోన్యత అనురాగం అక్కడ లేనట్లే యిక్కడా లేవు. స్త్రీపురుష సంబంధంలో సాఫల్యం లేదు, సంతానం వద్దు. భౌతికమైన యీ వంధ్యత ఆధ్యాత్మికవంధ్యతకు ప్రతిఫలం. పునరుజ్జీవనభావమే అభావం. జీవితాలు అలానే ముగిసిపోతాయి. పబ్‌లో ఒకరికొకరు గుడ్‌నైట్ చెప్పే సందర్భం హామ్లెట్ నాటకంలో ఒఫీలియా చెప్పే గుడ్‌నైట్‌ను గుర్తు చేస్తుంది.

ఈ రెండు వర్గాలను ఏకం చేయడంలో కూడా ఎలియట్ నైపుణ్యం చూపుతాడు. Goonightతో Good night, ladiesను కలిపేశాడు. రెండు వర్గాలకు ఒకటే గుడ్ నైట్.

సంభాషణమధ్య మళ్ళీ మళ్ళీ HURRY UP PLEASE ITS TIME, అని సమయం అయిపోతోంది అని గుర్తుచేసే వెయిటర్ కేవలం పబ్ వెయిటర్ కాదు. ప్రూఫ్రోక్ లోని ఎటర్నల్ ఫుట్‌మాన్ (eternal Footman) కూడా:

And I have seen the eternal Footman hold my coat, and snicker,
And in short, I was afraid.

జీవితాలు వ్యర్ధంగా గడిచిపోతున్నాయి, త్వరపడండి, సార్థకం చేసుకోండి, అన్న హెచ్చరిక. ‘ఎ గేమ్ అఫ్‌ కోర్స్‌’ ప్రారంభదృశ్యం లోని సంపన్నస్త్రీ అయినా, ముగింపుదృశ్యం లోని లిల్ అయినా జీవితాల ముగింపు ఒకటే. క్లియోపాత్ర లాగానో ఒఫీలియా లాగానో కథ విషాదాంతమే – మరణమో, సదృశమైన జడజీవనమో. ఈ రెండు దృశ్యాలమధ్య జరిగే సంభాషణ (My nerves are bad tonight) రెండు సన్నివేశాలను సంధించగలదు. స్నానానికి వేన్నీళ్ళు, కారులో షికారు లేకపోవచ్చు. కాని జీవితచదరంగం యిద్దరికీ సామాన్యమే. మనలను మనం మభ్యపెట్టుకొని, వాస్తవజీవిత పరమార్థం ప్రయోజనం మరచి జీవిస్తున్నాం, మిడిల్టన్ నాటకంలో (Women Beware Women) చదరంగం ఆటలాగ. లౌకిక ఆధ్యాత్మిక పునరుజ్జీవనంలో, సంసారసాఫల్య విషయంలో (spiritual fertility) వర్గభేదం లేదు.