కచేరి తర్వాత…

ఆమె పేరు ఏదైనా కావచ్చు
నేనెప్పుడూ తెలుసుకోవాలనుకోలేదు.
సృష్టి నిర్మాణ రహస్యాలేవో పొడి చేసి
పౌడరులా పూసినట్టున్న ఆమె ముఖంలోకి
తేరిపారా చూడాలనుకోలేదు.

ఆమె ఇరవై, ఇరవై రెండేళ్ళ ఈడులో
తతిమ్మా ప్రపంచాన్ని పలుగుతాడు చేసి
తనొక వైపు, నా ఈడు కుర్రలోకాన్ని మరోవైపు
ఉర్రూతలూగిస్తున్నప్పుడు
మూర్ఛపోతున్న నా జతగాళ్ళ గుంపును తట్టిలేపటం
తప్పని వంతయ్యేది.

కొన్ని గాంధర్వాలు కురిసి వెళ్ళాక-
తన కోసం సిద్ధం చేసిన ఒక చిటికెనవేలు పట్టుకొని
కొంగుముడితో వెళ్ళటం వరకే గుర్తుంది.
బహుశా
మకరంద వర్షాలు కురిసే మరో ఇంటిని
తుమ్మెద రెక్కలతో నింపి ఉంటుంది.

మళ్ళీ ఇన్నేళ్ళకు-
అయ్యంగారి చీరకట్టుతో పీట మీది త్యాగరాజుకు
ధూపం వేసి పాడినప్పుడు
నాలాంటి ఎన్నో జతల మెచ్చుకోలు కళ్ళు
వర్షధారలై మహిత మంగళం పాడాయి.

సంగీతం నిర్వచనాలకు అందుతుందని ఎప్పుడూ అనుకోలేదు
పెదవుల్లో తుళ్ళిపడే వినమ్రత కన్నా
తన సృజనకు బహుమతి ఏముంది?