చెట్టు

చెట్టు ఎపుడూ ఒంటరి కాదు
పత్ర పరివారాన్ని
ఏకకాండంపై మోసే ఇంటి పెద్ద.
ఎండ నదిలో మునుగుతున్న
బాటసారుల్ని
నీడవల వేసి పట్టుకునే జాలరి

చెట్టు ఎపుడూ విలపిత కాదు
పూలపిట్టల, పిట్టపూల నవ్వులతో
విచ్చుకునే వికసిత.
ఏకాకి కానే కాదు
చెట్టంటే – అడవికి ఏకవచనం.

చెట్టు ఎపుడూ అరూపి కాదు
కొమ్మ ఒంపులతో
ఋతువుకో రూపుకట్టే
మృణ్మయాత్మ సౌందర్యం.
చెట్టు ఎపుడూ నిర్బల కాదు
అడ్డంగా పడదోసినా
చిగురునవ్వులతో
నిలువుగా ఎదిగి నిలిచే
నిత్య చేతనా నైపుణ్యం.

చెట్టు ఎపుడూ పరాయి కానే కాదు
చెట్టంటే – గాలిచీర చెంగుతో
దేహాల్ని తడిమి
లాలించే ఆదిమ అమ్మ.