అశాంతి

ఉదయాలన్నీ
వికసించిన పూలతో
ప్రకాశిస్తున్న సూర్యునితో
ఒకే తీరుగా తీరువగా
వెలుగు పుప్పొడి వెదజల్లుతూ
అయినా లోపలేదో చెదలా
కొరుక్కుతింటూ

దినాలన్నీ
మంచుగదుల్లో
హంసతూలికల్లో
సుతిమెత్తగా సయ్యాటలాడుతూ
అయినా లోపలేదో
అలజడి కుదిపేస్తూ

నిన్నా మొన్నటి గాయాలను
రేపటి గురించిన భయాలనీడలను మోస్తూ
జీవితాన్ని వడగట్టి
ఆనందాల ఆనవాళ్ళను ఆవిరిచేసి
దుఃఖాలను మాత్రమే మిగుల్చుకుని
మనసంతా పొగిలి
బ్రతుకును కుంటినడక నడిపిస్తూ

ఎండకు ఎండి
వానకు తడిసి
తుపానులకు తట్టుకున్న
ఆ చిట్టి పిట్ట
ఈ చిన్ని ఉడుత
నిన్నా రేపులను త్యజించి
ఆకలిపొట్ట నింపుకుని
కొమ్మలపై అల్లరి చేస్తూ

గుప్పెట నిండా విశ్వం ఉన్నా
పాదాక్రాంతమై సర్వం ఉన్నా
ఏమిటో ఇక్కడ ఇంత అశాంతి
ఇంతకీ
ఈ ఆరడుగుల
రెండు కాళ్ళ ఆకారానికి
ఏం కావాలి?