ఇసుక గడియారాలమై…

ఒక కన్ను ఇంకో కన్నుకై వెదుకుతుంటుంది
అదేమో ఎక్కడో వుండి
పికాసో చిత్రంలోలా
ఇంకొక దేన్నో వెతుకుతూ చూస్తుండిపోతుంది
ఎండమావులకై తిరిగి
గరగరలాడే ఇసుక నింపుకున్న
రెండు కనులూ కలిసి
అర్థం కాని మనసుకు
ఏదో నేర్పాలని ప్రయత్నిస్తుంటై

కలిసీ కలవనట్లు పోయే
రెండు దారుల్లా వెళుతూనే
ఎక్కడికో ఒకచోటికి
ఇష్టంతోనో నిష్టూరంతోనో చేరుతూనే వుంటాం

సాయంత్రం తెచ్చిన చీకటిలో మనలను మనమే వెతుక్కుంటూ
పొంతనలేని కలలతో కలవరపడతాం
మళ్ళీ తెలవారంగానే
తెలిసిందే అయినా సరే
ఏదో ఒక దారి ఎంచుకుంటూ
సమాధానపడుతూ
ఖాళీలను పూరించాలనుకుంటూ
ఒక ఘడియ నుంచి ఇంకో ఘడియలోకి జారుతూ…

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...