ఎందాకని?

ఎన్నాళ్ళని
ఆ ఒక్క ప్రశ్నను ఈడ్చుకుంటూ
దగ్గరతనాన్ని కలగంటూ
ఎందాకని దూరాన్ని మోస్తావు?

చాటేసిన ముఖంతో
మౌనాన్ని తప్పతాగి
వేళకు మనసుకు రాని జవాబుకు
ఎందాకని తీవాచిగా పరుస్తావు?

చూపులరిగి చుక్కలై
అలిసిన ఆశకు దప్పిక తీర్చాలని
కన్నీళ్ళను గొంతులో రహస్యంగా
ఎందాకని దాస్తావు?

కాలం తొక్కిడికి
ఒరిగిన కోరికను
సున్నితంగా కడుపున దాచి
ఎందాకని గుట్టు పెడతావు?

కళ్ళకు తెలియకుండా కన్న కలను
ఆరకుండా, ఆగకుండా
చెరగకుండా మూటకట్టి
ఎందాకని కాపలా కాస్తావు?

నిజం నిప్పుల సెగకు
ఎండిన నవ్వులనదిలా
నెర్రెలుబారిన ముఖంలో పుట్టిన కవితకు
ఎందాకని కన్నీరవుతావు?

ఎందాకని
నీలో నిన్ను దూరంగా విసురుకుని
నీకు అన్నీ దగ్గరని భ్రమిస్తావు?

నీవు పగిలి నమ్మకం ముక్కలైనా
నిజం నలిగి సహనం సొమ్మసిల్లినా
మౌనం ధాటికి మాట ఇంకిపోయినా
నిన్ను నీకు శత్రువుగా మర్చినా.