బొమ్మల మలారం

మూడు లాంతర్ల మొగకి వెనక వీధిలో ఉన్న ఎత్తరుగుల మేడే సోమయాజులుగారి ఇల్లు. సంస్కృతి పరంగా, క్రతువులు పరంగా వేద మంత్రాలు చదువుతూ, వైదిక కర్మకాండలు జరిపించడంలో సమాజంలో ఈయనకున్న గిరాకీకి ఆ మేడే తార్కాణం! దేశం అంతా ఇంజనీరింగు, మెడిసిను అంటూ ఇంగ్లీషు చదువులు చదవడానికి ఎగబడుతూ ఉంటే కొడుకు అవధానిని సంస్కృత పాఠశాలలో చదివించి, వేదం, ఆగమశాస్త్రాలు, స్మార్తం నేర్పించి, తన తదనంతరం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వెలుగుతున్న తన అనుష్ఠాన సంప్రదాయాన్ని కొడుకు చేతిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నాడాయన.

అవధాని తండ్రి యెడల భయభక్తులతో, తల్లి చాటున పెరిగిన బిడ్డ. మారుతున్న కాలానికి ఎదురీదే ధైర్యం లేక శాస్త్రానికి పిలకని ఉండనిచ్చి, కాలానికి అనుగుణంగా క్రాఫింగ్ చేయించుకున్నాడు. పాఠశాలలో లఘు సిద్ధాంత కౌముది, రఘువంశం అధ్యయనం చేసేడు. సహాధ్యాయులు చాలామంది బ్రాహ్మణేతరులు కావడంతో పౌరోహిత్యానికి కాని, అర్చకత్వానికి కానీ బ్రాహ్మణులకి ఉంటూ వచ్చిన గిరాకీ ఇటుపైన ఉండదేమో అనే భయం పట్టుకుంది అవధానికి.

పెళ్ళి చేసుకుని కాపురం చేస్తున్న పురోహితుడంటే ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతారని శ్రేయోభిలాషులు బోధ చెయ్యగా, పెళ్ళి గురించి ఆలోచించడం మొదలుపెట్టేడు అవధాని. అష్టవిధ వివాహాలలో బ్రాహ్మము, ప్రాజాపత్యము అనేవే బ్రాహ్మణులలో ఆచరణయోగ్యమైన పద్ధతులు. బ్రాహ్మము అనగా విద్యావంతుడు, సదాచార సంపన్నుడు అయిన వరుని వధువు తండ్రి ఎంపిక చేసి, ఆహ్వానించి, అలంకరించి, పూజించి, కన్యనిచ్చి చేసే వివాహము. ప్రాజాపత్యము అనగా ‘మీరిరువురు కలిసి ధర్మము చేయుడు’ అని వరునితో పరిభాషించి కన్యని ఇచ్చి చేయు వివాహము. స్వయంవరం అనేది ఉభయుల ఇష్టం మీద జరిగే గాంధర్వ పద్ధతి. ఇది క్షత్రియులలోనే యున్నది. ఇలాంటి శషభిషలతో రెండేళ్ళు గడిపేడు అవధాని.

సంప్రదాయబద్ధంగా తల్లి, తండ్రి చూసిపెట్టి కుదిర్చిన ముక్కు, మొహం తెలియని అమ్మాయి మెళ్ళో తాళి కట్టడానికి మనస్సు ఒప్పలేదు. అలాగని తనంత తానుగా ఒక అమ్మాయిని కలుసుకొని, సినిమాల్లోలా ప్రేమలోపడి, గాంధీనగరం పార్కులో స్టెప్పులు వేసి… అబ్బే! అంత ధైర్యం లేదు. ఆరేళ్ళపాటు డుకృమ్ కరణాలు చేసుకుంటూ, ఆడదాని పొడ పడకుండా, అన్నవరంలో, ఆ వేద పాఠశాలలో, ఋష్యశృంగుడిలా గడిపేడేమో ప్రస్తుతానికి తరుణోపాయం ఏమిటా అని ఆలోచిస్తూ, పత్రిక చదువుతున్న అవధాని కంట ఆడబోయిన తీర్థం ఎదురయినట్లు, ఒక చిన్న ప్రకటన కనబడింది! ‘మీ ఈడుకి తగ్గ జోడీ కావాలా? మమ్మల్ని సంప్రదించండి! పె. పేరయ్య.’ అవధాని కళ్ళు మెరిసేయి.


బయట తలుపు చప్పుడయింది. గడియ వేసి లేదేమో ఎవ్వరో తలుపు తెరుచుకుని చొరవగా లోపలి వస్తున్నారు.

“ఎవరు వారు?”

“నేనేనండీ. పేరయ్యని. ఒకసారి రమ్మనమని కబురు చేసేరు కదా అని గమ్మున వచ్చేను.”

చీకటిగా ఉన్న వసారాలో మసకమసకగా కనిపిస్తున్న వ్యక్తి తెరిచిన కిటికీ నుండి వస్తున్న సూర్యకిరణాల వెలుగు చారికలోకి వచ్చేసరికి, “దయచేయండి! అలా ఆ కిటికీ పక్క బల్ల దగ్గర వెలుతురు బాగా ఉంటుంది, చల్లటి గాలి కూడా వేస్తుంది,” అంటూ కుర్చీ చూపించేడు అవధాని.

ఆగంతుకుడు ఐదడుగుల పొడుగు కూడా లేడు. ఓ ఏభయ్ ఉంటాయేమో.

“పె. పేరయ్య అని రాసేరు. పె అంటే?”

“పె అంటే పెళ్ళిళ్ళ అని అయ్య! నన్ను అంతా అలాగే ఎరుగుదురండి.” ఇకిలిస్తూ సమాధానం చెప్పేడు.

తాంబూలచర్వణం వల్ల కాబోలు, గారపళ్ళు. ఒక కట్టుడు పన్ను! పాతకాలపు పంచెకట్టు, ఒంటి మీద జుబ్బా, భుజం మీద కండువా! చంకలో చుట్టచుట్టిన సంచి. ఇదీ ఆ ఆగంతుకుని ఆహార్యం.

“పేరయ్యగారూ! మా స్వగ్రామం కాకినాడ. మా తల్లిదండ్రులకి నేను ఒక్కడినే సంతానం. మా తండ్రిగారు కాకినాడలో పేరున్న పురోహితుడు. ఆస్తి, అంతస్తు ఉన్న వాళ్ళమే. గత ఆరేళ్ళు చదువుతోటే నా కాలం గడచిపోయింది. చదివింది సంస్కృతం, వేదం, స్మార్తం. తరగతిలో అమ్మాయిలు లేరు కనుక అమ్మాయిలతో పరిచయం అయే అవకాశం చిక్కలేదు. నేను చదివిన చదువుకి, నా వృత్తికి, నా ఆహార్యానికి ఈ కాలపు అమ్మాయిలు ఆకర్షితులై వస్తారన్న నమ్మకమూ లేదు. ఈ రోజుల్లో అమెరికా మోజులో ఉన్న అమ్మాయిలు ఆగమశాస్త్రాలు నేర్చుకున్న సనాతనుడితో కాకినాడలో కూర్చోమంటే ఇష్టపడతారా? నా తల్లిదండ్రులేమో, ‘నీకు నచ్చిన పిల్ల ఉంటే చెప్పు. అక్షతలు వేస్తాము’ అంటున్నారు. అనుభవం లేని అర్భకుడిని. ఈ విషయంలో మీరు సహాయం చెయ్యకలరేమోనని….” అంటూ బయట ఉన్న ముద్దమందారాలని చూస్తూ కిటికీ దగ్గర నిలబడ్డాడు అవధాని.

ఈ మాటలని ఒక చెవితో వింటూనే కిటికీ వెలుగులో సన్నని మీసకట్టుతో నవనవలాడుతున్న అవధానిని ఓరకంట ఎగాదిగా పరీక్షగా చూసేడు, పేరయ్య. కుర్రాడి కనుముక్కు తీరు బాగుంది. దబ్బపండు రంగులో ఉన్న ముఖంలో సరస్వతీ కటాక్షం ఉట్టిపడుతోంది. సంతృప్తితో తల పంకించేడు.

“అదెంత పని! చిటికెలో మీ సమతుకి పరిష్కారం చూపెడతాను కదా!” అంటూ పేరయ్య చంకలో ఉన్న సంచిని బల్ల మీద పెట్టి, సంచి తెరచి, అందులోంచి గాజుల మలారం లాంటి గొట్టాన్ని బయటకి తీసేడు. ఆ గొట్టానికి సొరుగులలా అమరి ఉన్న ఒక సొరుగులోంచి మూడు చిన్న ఫోటోలని బయటకి లాగి, బల్ల మీద పేక ముక్కలని పరచినట్లు పరుస్తూ, “బాబూ! ఆస్తి ఉన్నవాడివి. ఒక్కడివే పిల్లాడివి. చెల్లెలి పెళ్ళి అని కానీ, తమ్ముడు చదువు అని కానీ బెదడలు లేని వాడివి. ఈ రోజుల్లో వేరే కాపురం అంటే చాల మంది ఆడపిల్లల తల్లి తండ్రులు మక్కువ చూపిస్తున్నారు. కొంచం తెలివి, లౌక్యం, విచక్షణ ఉన్న అమ్మాయిలు పై పై రంగులకు, హంగులకు పోకుండా నిలకడగా ఉద్యోగం ఉందా లేదా అని చూస్తున్నారు. తరువాత మనిషిగా మీరెవరు, మీరు ఎంత బాధ్యతగా ఉన్నారని చూసి, ఆ తర్వాత మీ సంసారపు నేపథ్యం ఏమిటి, మీ ఆస్తిపాస్తులు ఏమిటి అని చూస్తున్నారు. కనుక ఇది నల్లేరు మీద బండి నడక కాకపోవచ్చు…”

అంటూ, బల్ల మీద పరుస్తున్న వరస నుండి ఒక ఫోటోని ఎంచి, బయటకి లాగి, “ఇదిగో! ఈ అమ్మాయిని చూడండి. పేరు రవణ. సినిమా తారలా లేదూ? బి. ఏ. చదివింది. వయస్సు ఇరవై నాలుగు. దురదృష్టవశాత్తు ఏడాది క్రితమే వైధవ్యం ప్రాప్తించింది. పిల్లలు లేరు సుమండీ! కాపురానికి కూడా వెళ్ళలేదు. తండ్రి కమిషన్ వ్యాపారంలో బాగా గణించేడు. కట్నం బాగానే ఇస్తానంటున్నాడు. సంప్రదాయమైన కుటుంబం…”

“పేరు మరీ మగ పేరులా ఉందే.”

“పేరు నచ్చకపోతే మార్చేసుకుంటాం. పెళ్ళయిన తరువాత ఇంటిపేరు మార్చటం లేదూ?”

“రెండో పెళ్ళంటే….”

“ఈ అమ్మాయి కాపురానికి కూడా వెళ్ళలేదు. కుర్రాడి గుండెలో ఏదో జన్యులోపంట. ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేకుండానే పెళ్ళయిన మర్నాడే, అనుకోకుండా, హరీమనిపోయేడు. కనుక ఆ పెళ్ళి చెల్లదు. రద్దు చేసుకోవచ్చు. ఆ పెళ్ళి జరగడమే పొరపాటు అయింది.”

“వైధవ్యం పొందిన అమ్మాయిని చేసుకుని సంఘాన్ని ఉద్ధరిద్దామనే ఆలోచన ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు తెగించినా లోకులు హర్షించకపోతే నా వృత్తి దెబ్బతింటుంది.”

“విధవని చేసుకోవడంలో లాభాలు ఉన్నాయి నాయనా. వైధవ్యపు చెర నుండి విడిపించినందుకు నీకు ఆజన్మాంతం రుణపడి ఉంటుంది. నేను ఈ కాలంవాడిని అయితే ఇటువంటి పిల్లనే ఏరి కోరి చేసుకుని ఉండేవాడిని! ఇప్పుడు సమాజంలో అన్ని సామాజిక వర్గాలూ రెండో పెళ్ళి విషయంలో విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నాయి. వితంతువుల వివాహం విషయంలో వెటకారాలు, వెక్కిరింతలూ తగ్గాయి.”

అవధాని ఒక్క క్షణం పాటు ఆలోచించి చప్పరించేసేడు.

బేరం తూగిపోయినందుకు కలిగిన నిరాశని బయటకి కనబడనీయకుండా, భుజాలు ఎగరేసి, “సరే! దేశం గొడ్డుపోలేదు” అంటూ బల్ల మీద ఉన్న మరొక ఫోటోని తీసి, కళ్ళజోడు సర్దుకుని దాన్ని పరకాయించి చూసి, “ఇదిగో ఈ అమ్మాయి సుజాత. ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు టీచరు. తండ్రి జిల్లా ఆసుపత్రిలో డాక్టరు. అమెరికాలో తరిఫీదు పొంది వచ్చేడు. అమ్మాయి అమెరికాలో తండ్రితోపాటు ఉండి వచ్చింది. మంచి అభిరుచులు ఉన్న సంసారం నుండి వచ్చిన పిల్ల….”

“అమ్మాయి వయస్సు ఎంతుంటుందో చెప్పేరు కాదు.”

“వయస్సా?” ఆ ప్రశ్న అడిగినందుకు కాసింత ఆశ్చర్యం ప్రకటిస్తూ, “అమ్మాయి వయస్సు, వయస్సు… ముప్ఫయ్.”

అవధాని కాస్సేపు తటపటాయించి, “వయస్సు ఎక్కువయిపోయింది” అన్నాడు.

పేరయ్య ఒక నవ్వు నవ్వేసి, “నీ వయస్సు ఎంత బాబూ?”

“ఇరవై ఆరు.”

“ఏమిటండీ! ముప్ఫయ్‌కీ ఇరవై ఆరుకీ మధ్య తేడా? నాలుగేళ్ళు! నా కంటే నా భార్య నాలుగేళ్ళు పెద్దది. ఇప్పుడు నాకొచ్చిన నష్టం ఏమిటిట? సీతాదేవి శ్రీరాముడి కంటే పెద్దదని అంటారు కదా. తన కంటే పెద్ద పిల్లని చేసుకున్నాడనే కదా రాముడిని దేవుడంటున్నాం? నీ కంటే పెద్దదయిన బిర్లా కూతురో, అంబానీ కూతురో కోరి వస్తే కాదని కాలదన్నుకుంటావా?”

అవధాని ముఖం విడలేదు.

“ఒక మాట చెబుతా. తన కంటే పెద్దదయిన అమ్మాయిని చేసుకోవడంలో లాభాలు ఉన్నాయి. యుక్తవయస్సు పొందిన పరిణీత తరుణ దశలో ఉన్న అమ్మాయి కంటే ఎన్నో రెట్లు మెరుగు. ప్రపంచ జ్ఞానంతో అనుభవం ఉన్న అమ్మాయి అత్తమామల్ని గౌరవంగా చూసుకునే అవకాశాలు ఎక్కువ. ఆలోచించుకో.”

“ఉన్నత పాఠశాలలో ఏమిటి బోధిస్తుంది అన్నారు?”

“ఇంగ్లీషు. అమెరికాలో ఉండి రావడం వల్ల ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతుంది. ఒకరు సంస్కృతం, తెలుగులో పండితులైతే మరొకరు ఇంగ్లీషులో దిట్ట. సరస్వతీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది.”

అవధాని కొంచెం సేపు ఆలోచించి, అంగీకారం ఇవ్వలేదు. అలాగని కాదననూ లేదు. హతాశుడైన పేరయ్య దొంతి నుండి మరొక ఫోటో తీసేడు.

“ఈ అమ్మాయి పేరు శారద. పందొమ్మిది ఏళ్ళు. తండ్రి కేంద్ర ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగి. నచ్చిన పెళ్ళికొడుకు దొరికితే బాగా కట్నం ఇచ్చి ఘనంగా పెళ్ళి చేస్తానంటున్నాడు.”

“పందొమ్మిదేళ్ళన్నారా?”

“పద్దెనిమిది నిండి పందొమ్మిది వచ్చి ఫట్టుమని పది రోజులు కాలేదు. కావాలంటే ఆ అమ్మాయి తండ్రిని అడిగి బర్త్ సర్టిఫికెట్ పట్టుకొస్తాను.”

“అంత పెద్ద ఉద్యోగి కూతురు, ఇంత పిన్న వయస్సులో ఉన్న పిల్ల! ఈ రోజుల్లో ఒక పెళ్ళిళ్ళ పేరయ్య సహాయం అర్థించిందంటే ఏదో తిరకాసు వ్యవహారం అయి ఉంటుంది.”

“బాబూ, పెద్దవాడిని. అడుగుతున్నానని తప్పట్టుకోకు. చదువుకి చదువు, అందానికి అందం, ఉన్నవాడివి. తల్లిదండ్రుల చాటున సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి పెరిగినవాడివి. నువ్వు ఎందుకు పెళ్ళిళ్ళ పేరయ్య సహాయం కోరుకుంటున్నావో అందుకే ఆ అమ్మాయి కూడా అని ఎందుకు అనుకోరాదు?”

“నాకు అనుభవం లేక!”

అవధాని ముఖం కాసింత ఎర్రబడడం గమనించిన పేరయ్య తన తొందరపాటుకు ఒకింత చింతించి, “ఆ అమ్మాయి అడగలేదు. ఆమె తండ్రి అడిగేడు. ఉద్యోగపు బాధ్యతలు ఒక పక్క, దేశాంతరాలలో తిరుగుడుతో తీరుబడిలేక కూతురుకి అన్ని విధాలా తగిన వరుణ్ణి వెతికే బాధ్యత నాకు అప్పగించేడు. అన్ని అర్హతలు ఉన్న అబ్బాయి దొరికితే వారిరువురిని ఒకరితో ఒకరిని పరిచయం చేసి, అప్పుడు అమ్మాయి మనస్ఫూర్తిగా నచ్చుకుంటేనే ముందుకి కదులుతారు వారు. విద్యావంతుడివి. ఈ విషయం విడమర్చి చెప్పక్కరలేదనే అనుకున్నాను.”

పేరయ్య స్వరంలో మార్పు గమనించి, మాట మార్చటానికా అన్నట్లు “అడగడం మరచేను. అమ్మాయి ఆరోగ్యవంతురాలేనా?” అడిగాడు అవధాని.

“ఆరోగ్యానికి ఢోకా లేదు. ఫొటోలో ముఖం చూస్తే తెలియటం లేదా? ఉన్న మాట ఉన్నట్లు చెప్పాలి కనుక చెబుతున్నాను. చిన్నతనంలో పిల్ల కాలికి చిన్న దెబ్బ తగిలింది. దానికి ఆపరేషను చేసేరు. అంతా నయం అయిపోయింది కానీ కొంచెం మెక్కుతూ నడుస్తుంది. కానీ ఆ అమ్మాయి అందాన్ని, తెలివి తేటల్ని చూడగానే ఈ చిన్న లోపం కంటికి ఆనదు.”

అవధాని కుర్చీలోంచి లేచి, కిటికీ దగ్గరకి వెళ్ళి, శూన్యంలోకి చూడ్డం మొదలు పెట్టేడు. ఈ పెళ్ళిళ్ళ పేరయ్యతో ఈ లంపటం ఎందుకు పెట్టుకున్నానా అని విచారిస్తూ, తల అడ్డుగా పంకించేడు.

తాను పడ్డ శ్రమ అంత కంచి గరుడ సేవ అయిపోతోదన్న అనుమానంతో, “ఇప్పుడు ఈ సంబంధానికి ఏమి లోపం?” అన్నాడు పేరయ్య.

“నాకు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగులంటే ఇష్టం లేదు.”

“ఇదేవూరు సాకు బాబూ! తండ్రి ఏ ఉద్యోగం చేస్తే నీకేమిటయ్యా? నువ్వు ఇల్లరికం వెళ్ళటం లేదు కదా. పిల్లకి సంబంధం చూడడానికే తీరుబడి లేని ఆ ఆసామి ప్రతి ఆదివారం మీ ఇంటికి వచ్చి తిష్ట వేస్తాడననా నీ భయం?

ఈ సంభాషణ పక్కదారిలో పడుతున్నాదని అవధాని గ్రహించి పేరయ్యని దయచేయమని దారి చూపేడు.

పేరయ్యని పొమ్మన్నాడే కాని అవధానికి మనస్సులో నిలకడ లేకుండా పోయింది. తనకెటువంటి పిల్ల కావాలో తనకే తెలియదా? వేళకి తిండి తినటం లేదు. రాత్రి నిద్ర పట్టటం లేదు. ఎవరి మీద కోపం? పనికిమాలిన ఫోటోలు చూపించిన పేరయ్య మీదా? తనంత తానుగా ఒక అమ్మాయిని కలుసుకుందుకి అవకాశం దొరకనందుకా? ఈ పని చేసిపెట్టవలసిన బాధ్యతని తప్పించుకున్న తన తల్లిదండ్రుల మీదా? పొమ్మని కసిరి కొట్టిన తరువాత పేరయ్య తిరిగి వస్తాడా? కాలు కాలిన పిల్లిలా ఇల్లు, వాకిలి తిరిగేడు.

నాలుగు రోజులు పోయిన తరువాత పేరయ్య పిలవని పేరంటంలా తిరిగి రానే వచ్చేడు. వస్తూనే, “మహాశయా! పొరపాటు జరిగిపోయింది. తప్పు నాదే!” అంటూ నేరుగా కిటికీ దగ్గర బల్ల మీద తన బొమ్మల మలారం అమర్చి కుర్చీలో కూలబడ్డాడు.

“ఏమిటి జరిగిన పొరపాటు?”

“సుజాత లేదూ? ఆమె వయస్సు ముప్ఫయ్ కానే కాదు. అది వేరొక అమ్మాయి. మన సుజాత వయస్సు ఇరవైఏడే! మీ ఇద్దరికి ఒక్క ఏడాది తేడా! చెబితేగాని తెలియదు. పక్కనే నిలబడితే నీ చెవులదాకా వస్తుంది. శంఖం లాంటి మెడ. టీవీలలో కనిపించే లంగరమ్మాయిలలా ఉంటుంది. ఒక్కసారి చూస్తే మారు మాట్లాడవు.”

“పెళ్ళి చూపులా?”

“ఈ కాలంలో పెళ్ళి చూపులంటే అమ్మాయిలు ఆమడ దూరం పరిగెడుతున్నారు. మీరిద్దరూ కలుసుకొనే ఏర్పాటు చేసే వచ్చేను. కలుసుకుని మాట్లాడి చూడు.”

“…”

“నేను పరిచయం చేసి కూతవేటు దూరంలోనే ఉంటాను.” పేరయ్య ధైర్యం చెప్పేడు.

ఏ కళనున్నాడో అవధాని ఒప్పుకున్నాడు.


“పేరయ్య మహాశయా! ఒక నమస్కారం. నాకు పిల్లా వద్దు, పెళ్ళీ వద్దు, పెటాకులూ వద్దు. మీరిక నా గుమ్మం తొక్కనూ వద్దు. దయచేయండి!”

“ఇప్పుడేమి ఉపద్రవం వచ్చిపడింది?”

“మీరు నా గురించి ఆ అమ్మాయికి ఏమని చెప్పేరు?”

ప్రశ్నార్థకంగా చూసేడు పేరయ్య.

“నాకు అమెరికాలో హిందూ దేవాలయంలో ఉద్యోగం వచ్చిందని చెప్పేరా?”

“ఈ రోజుల్లో అమెరికాలో మన దేశపు వంటలు చేసేవాళ్ళకి, పురోహితులకి, దేవాలయాల్లో అర్చక స్వాములకి ఉన్న గిరాకీ సాఫ్ట్‌వేర్ వాళ్ళకి కూడా లేదు, తెలుసా? అక్కడ వీధికో గుడి, వాడకొక భోజనశాల వెలుస్తున్నాయి. అక్కడ మనవాళ్ళ పుట్టుకలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, చావులు… వీటన్నిటికీ మంత్రాలు చదవడం వచ్చినవాళ్ళ అవసరం ఉంది కదా. అక్కడ మనవాళ్ళ దగ్గర డబ్బు దండిగా ఉంది. కొత్త కారు కొన్నప్పుడు వాహన పూజ అంటారు. దానితో పురోహితులకి, నిమ్మకాయలకి గిరాకి పెరిగిపోయింది. ఇల్లు కొనే ప్రతివాడు వాస్తు అంటాడు. దక్షిణం వైపు వీధి గుమ్మం ఉంటే ఇళ్ళు అమ్ముడు పోవడం లేదుట. నీకొచ్చిన స్మార్తం కొంత, జ్యోతిషం కొంత, వాస్తు కొంత మేళవించేవంటే కనకధారా స్తోత్రం పఠించినంత ఫలితం…”

“ఆ అమ్మాయిది కమ్మ కులం అని ముందుగానే ఎందుకు చెప్పలేదు?”

“చూడబ్బాయ్! రోజులు మారుతున్నాయి. అమ్మాయిలు దొరకడం కష్టంగా ఉంది. అమ్మాయిలు కూడా అబ్బాయిలని ఎంపిక చేసుకుంటున్నారు. కులం, గోత్రం, వయస్సు, ఉద్యోగం అని అన్నీ చూసుకుంటూ కూర్చుంటే పనులు తెమలవు. అయినా ఆ అమ్మాయి ఏ కులం అయితేనేమి? వారంతా శుద్ధ శాకాహారులు. అమ్మాయి తండ్రి అమెరికాలో వైద్యంతో పాటు వేదం నేర్చుకుని, అష్టావధానాలు కూడా చేసేడు. పూర్వకాలంలో బ్రాహ్మణుల తీరు ఎలా ఉండేదో ఈ రోజుల్లో కమ్మల తీరు అలా ఉంది!”

అబద్ధం చెప్పేడని కాదు కానీ, నిజం పూర్తిగా చెప్పలేదని అవధానికి చిర్రెత్తుకొచ్చి పేరయ్యని పొమ్మన్నాడు. పేరయ్య సంచి సర్దుకుంటూ మలారం సొరుగునుండి ఫోటోలతో ఉన్న చిన్న కాగితం సంచిని తీసి, బల్ల మీద పెట్టి, “నీ మనస్సు కుదుటపడ్డ తరువాత ఈ ఫోటోలలో ఏదైనా నచ్చితే చెప్పు,” అంటూ మౌనంగా బయటకి వెళ్ళిపోయేడు.

అవధాని ఆ ఫొటోల వైపు కన్నెత్తి అయినా చూడలేదు.

ఇది పెళ్ళిళ్ళ పేరయ్యల వల్ల అయే పని కాదని ఒక నిశ్చయానికి వచ్చేడు అవధాని. ప్రేమించి – వీలయితే సహనివాసం చేసి – తనకి నచ్చిన పిల్లనే పెళ్ళి చేసుకోవాలి కానీ – కానీ, ఎలా?

రోజులు గడుస్తున్నాయి. కప్పు కాఫీ కలుపుకుని, కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని, తాగుతూ బయటకి చూస్తున్నాడు.

ఎదురుగా బల్ల మీద వారం రోజుల క్రితం పేరయ్య వదిలిపెట్టిన కాగితపు సంచి కనబడింది. యధాలాపంగా సంచి విప్పి, లోపల ఉన్న ఫోటోలని నిరాసక్తంగా చూడడం మొదలుపెట్టేడు. ప్రతి బొమ్మలోను ఒక ఆకర్షణ కనిపిస్తే ఏదో వెలితి కనిపిస్తోంది! ఏ ఒక్కటి అన్ని విధాలా బాగున్నట్లు అనిపించలేదు. అందం, ఆకర్షణ చూసేవాడి కళ్ళల్లో ఉందంటారు. ఎవ్వరూ నచ్చకపోవడానికి తన కళ్ళ వెనక ఉన్న బుర్రగుజ్జులో లోపం తప్ప… ఇలా ఆలోచిస్తూ ఆ మూడు ఫోటోలని ఒక దొంతిలా చేసి తిరిగి ఆ సంచిలో పెడుతూ ఉంటే ఆ సంచి లోపల నుండి మరొక చిన్న ఫోటో కింద నేల మీద పడింది.

యథాలాపంగా ఆ ఫోటో వంక చూసేడు. ఏదో తళుక్కుమంది. ఆ ఫొటోని చేతిలోకి తీసుకుని ఆ అమ్మాయిని ఎగాదిగా మరోసారి చూసేడు అవధాని. దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్యలా కనిపించిందా అమ్మాయి. ఇన్నాళ్ళబట్టి తనకి కనబడకుండా ఆ మలారంలో దాగొని ఉందా? ఎవరీ అమ్మాయి? ఎక్కడో చూసినట్లు ఉందే! పరిచయమైన పోలికలు ఆ సుందరాంగి ముఖంలో చూచాయగా కనిపిస్తున్నాయి కానీ, ఎప్పుడు, ఎక్కడ చూచేడో చెప్పలేకపోయాడు అవధాని.

ఎవ్వరీ అమ్మాయి? పేరయ్య వెళ్ళిపోయేడు. పేరయ్యని పట్టాలి. పట్టి పిల్ల ఆచూకీ తియ్యాలి.


“ఆహాహా! ఆ ఫోటో నీ కోసం కాదు, ఇటివ్వు” అంటూ పేరయ్య అందుకోబోయాడు.

“ఈ ఫోటో ఎవ్వరిది? ఈ అమ్మాయి గురించి చెప్పండి” అంటూ ఫొటో ఉన్న చేతిని పేరయ్యకి అందకుండా వెనక్కి లాగేడు అవధాని.

“అబ్బెబ్బే! నీలాంటి కుర్రాడికి ఈ అమ్మాయి తగదు.”

“అదేదో నేను నిర్ణయిస్తాను. ఈ అమ్మాయిని నాకు పరిచయం చెయ్యండి.”

“ఆ అమ్మాయి బరితెగించిపోయింది. ఆ అమ్మాయి నీకు తగదు. పురోహితుడి భార్యకి ఉండవలసిన లక్షణాలు లేవు. తల్లిదండ్రుల మాట వినదు. ఆ అమ్మాయిని అంటగట్టేనన్న అప్రతిష్ఠ నాకు వద్దు.”

“పిల్లని నచ్చుకునేది నేనయ్యా, నువ్వు కాదు.”

“జెర్రిగొడ్డులా పిరుదులు కిందకి దిగజారిన బారెడు జుత్తు కత్తిరించింది. గోళ్ళకి, పెదాలకి రంగు వేసింది. ఆ టింగు, ఆ రింగు!”

“ఆ పిల్ల ఎవ్వరో చెప్పవయ్యా.”

“ఆ పిల్ల… నా అవతారం! నీకు అంటగట్టాననే అపప్రథ నాకు వద్దు బాబూ!”

“ఆ అమ్మాయిని నాకు పరిచయం చెయ్యండి!”

“అదిగో, కిటికి లోంచి అలా చూడు బాబూ. ఆ దీపస్తంభం పక్కన ఉన్న బట్టల దుకాణంలో చీరలు కట్టుకోవడం ఎలానో చూపిస్తూ నిలబడ్డదీ ఈ అమ్మాయే!”

అవధాని అటువైపు చూసేడు. ఆమె ఒక మెరుపుతీగ. అధునాతన వస్త్రాలంకరణ! భుజాలు దిగకుండా పొట్టిగా కత్తిరించిన జుత్తు! ముఖం మీద దోబూచులాడుతున్న ముంగురులు! దొండపండు రంగులో పెదవులు! ఎత్తు మడమల జోళ్ళు! ఒక్క మాటలో చెప్పాలంటే, కళ్ళు తిప్పుకోలేని రూపం. వడ్డాది పాపయ్య అభిసారిక అట్ట మీద గీసిన చిత్రపటంలా నిలబడి ఉన్న ఆమెని చూసి, ఒక్క నిమిషం పాటు స్థాణువులా ఉండిపోయేడు.

రెండేసి మెట్ల చొప్పున కిందకి దిగి, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పెరట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, కిటికీ పక్క చెట్టునున్న ముద్దమందారాన్ని ఒకటి కోసి, చేత్తో పట్టుకుని బట్టల దుకాణం వైపు పరిగెత్తేడు, అవధాని.

తాను కావాలనే ఈ కథని ఇలా నడిపించేడా అనే ఆలోచన అవధాని బుర్రలోకి వస్తే ఎలా అనే అనుమానం చతికిలపడ్డ పేరయ్య బుర్రలోకి రావడమైతే వచ్చింది!

వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...