చరిత్ర విస్మరించిన అస్తిత్వాల మనోధర్మపరాగం

Don’t you think that society, while condemning those poor women and treating them as outcasts, but at the same time receiving those male culprits who resort to those women into their fold, as honorable members of the society, undermine the very fundamental principles of morality and justice?… (These devadasis are not the victims of their own inclinations as ordinary prostitutes are, but rather the victims of custom, which teaches them to practice vice as their caste dharma.

– Muthulakshmi Reddi.

తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చిన గొప్ప నవల మధురాంతకం నరేంద్ర రాసిన మనోధర్మపరాగం. అన్ని చారిత్రక నవలల లాగానే ఈ నవల కూడా వేరొక కాలంలోకి, ప్రాంతంలోకి తీసుకెళుతుంది. ఈ స్థలకాలాలు వాస్తవికతలో బలంగా వేళ్ళూనుకొని వున్నాయని ఈ నవలలో ప్రతి పేజి తెలియజేస్తుంది. సాధారణంగా చారిత్రక నవలకి, అది ఎంత భావుకతతో కూడుకున్నదయినా, పరిశోధన అనివార్యం. తద్వారా మాత్రమే తాను చిత్రించిన పాత్రలు, వాటి కాలం గురించిన విషయాల్ని రచయితలు పాఠకులకు విశ్వసనీయంగా చెప్పగలుగుతారు. ఆ విషయంలో నరేంద్ర విజయవంతమయ్యారు. ఈ నవలలో రచయిత తీసుకున్న పాత్రలు, వాటి జీవన శైలులు మనకు ఏదో ఒక స్థాయిలో పరిచయం వున్నవే. నమూనా వ్యక్తుల జీవితాలనుంచి రచయిత తన పాత్రలను రూపకల్పన చేసుకున్నాడనటం కంటే ఆ నమూనాలనే పాత్రలను చేశాడనటంలో అతిశయోక్తి లేదు. ఆయా చారిత్రక వ్యక్తుల ఆంతరంగిక ప్రపంచంలోకి మనల్ని తీసుకెళతాడు రచయిత. అదే సందర్భంలో వాటివాటి కాలానికి చెందిన సామాజిక స్థితిగతుల్ని గురించి కూడా అద్భుతంగా మనకు పరిచయం చేస్తాడు. అలాగే ఆయా వ్యక్తులు, ముఖ్యంగా కుముదవల్లి, రంగనాయకి లాంటివాళ్ళ జీవితాలకు సంబంధించిన అపరిచిత విషయాలనుకునే వాటిని, వాళ్ళుగా చెపితే తప్ప తెలియని విషయాలను, వాళ్ళ ద్వారానే చెప్పిస్తాడు రచయిత. కొన్ని పాత్రలు సమకాలీన సంగీత చరిత్రలో భాగమయినవిగా గుర్తించటం అసాధ్యం కాకపోవటంవల్ల ఆ పాత్రల వైయక్తిక భావనల, అభిప్రాయాలపట్ల పాఠకులకి ఆసక్తి అనివార్యంగా కలుగుతుంది. ఆ పాత్రల చుట్టూ అల్లుకున్న, అల్లబడ్డ కథనం ఎంతవరకు నిజమో తెలుసుకోవాలనే ఆసక్తి పాఠకులకి అనివార్యంగా కలుగుతుంది. ఈ ఆసక్తిని రేకెత్తించటంలో రచయిత విజయవంతమయ్యాడు. అలాగే ఆ పాత్రల అనుభవాల్ని వాటి ద్వారానే వినిపించటం ద్వారా రచయిత వాటిని మరింత ఆసక్తికరంగా మలిచాడు. ‘Historical fiction comes out of greed for experience’ అంటుంది హిలరీ మాంటెల్ (Hilary Mantel) అనే నవలా రచయిత్రి. అటువంటి తపన ఏదో ఈ రచయితకు వుంది. అందుకనే పాత్రలు వాటికవే మాట్లాడితే తప్ప ఆ అనుభవాల్ని యథార్థంగా ఆవిష్కరించటం కుదరదనే భావనలోంచి రచయిత పాత్రలు ప్రత్యక్షంగా తమ కథల్ని తామే చెప్పుకునేటట్లు, అలా చెప్పటాన్ని ఈ నవలాశిల్ప విశేషంగా చేశాడు రచయిత.

వ్యక్తుల చరిత్రల్ని, సామాజిక చరిత్రని మిళితం చేస్తూ ఈ నవల రాయబడింది. దాదాపు ఒక శతాబ్దన్నర కాలాన్ని, ఆ కాలంలో ఉన్న దేవదాసీ వ్యవస్థ స్వరూప స్వభావాల్ని, ఇంగ్లీషువాళ్ళు వచ్చిన తరువాత దేవదాసీల ఈనాం భూములు రద్దు చేయటంవల్ల వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు, ఆ మార్పుల ఫలితంగా వాళ్ళు నమ్ముకున్న సంగీతం, నాట్యం మొదలైన వాటిలో వచ్చిన మార్పులు అన్నీ ఈ నవలలో నేపథ్యంగా రచయిత చెప్పుకుంటూ వస్తాడు. అయితే అన్ని ఆటంకాల మధ్య దేవదాసీలు కర్ణాటక సంగీతాన్ని, నాట్యాన్ని వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చారు. తమ వారసత్వాన్ని కొనసాగించటానికి ఆడపిల్లలు అవసరం అని బలంగా నమ్మారు. ఈ నవలలో చిత్తూరు స్కంద కుముదవల్లి దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తుంది: అంతా బాగానే జరిగిపోతావుండాది కానీ సామీ, యింట్లో ఆడబిడ్డ లేదు. ఆడబిడ్డ లేకపోతే నా వంశం నాతోనే అంతమైపోతుంది. నా వంశాన్ని నిలిపేదానికోసరం, నా సంగీతానికి వారసురాలుగా వుండేదానికోసరం, నా కడుపులో వొక ఆడబిడ్డను పుట్టించు. యెన్ని జన్మలయినా యిదే మాదిరిగా నిన్ను సేవించుకుంటూ బతికేస్తాను. (పే.33)

సంగీతజ్ఞానం వుండే సంతానం కావాలని కోరుకున్న కుముదవల్లి తనకు పుట్టబోయే కూతురు తన అమ్మమ్మ, తల్లి తనకిచ్చిన సంగీతవారసత్వాన్ని తన కూతురితో కూడా కొనసాగింపజేయాలనే బలమైన ఆకాంక్షతో వుంటుంది. తను పోయిన తరువాత తన తల్లి తనకిచ్చిన వీణను తన దేవుడి దగ్గర వాయించేందుకు తనకు ఆడబిడ్డనివ్వమని కోరుకుంటుంది. కుముదవల్లి ధ్యాసంతా సంగీతం మీదనే వుంటుంది. దాన్ని కొనసాగించటంలో తనకు అనివార్యంగా అవసరమైన పోషకులు చిదంబరయ్యర్, వెంకటరమణ అయ్యర్, రామగిరి అయ్యర్ – అందరూ కూడా కేవలం పోషకులు కాదు, తన మనసుతో మాట్లాడే భాష తెలిసినవాళ్ళు. అలాగే కుముదవల్లికి తన జీవితం పట్ల ఎటువంటి ఏవగింపు వుండదు. అత్యంత బలమైన ఆత్మవిశ్వాసంతో వుండే పాత్ర అది. తనకున్న సంగీత భావమే తనకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. అయితే తన తరువాత తరం ఆ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం కుముదవల్లికి బాధగా వుంటుంది. తమ కుటుంబంలో విద్యలేని మొద్దులు పుట్టుకొస్తున్నారని బాధపడుతుంది. ఆడబిడ్డ లేకుండా తన వంశం నిర్వంశం కాకూడదని బలంగా కోరుకున్న కుముదవల్లికి తాను కోరుకున్న లక్షణాలతో నాగలక్ష్మి పుడుతుంది.

ఈ నవలలో కొన్ని పాత్రలు అనివార్యంగా సంగీత ప్రపంచంలో మనకు తెలిసిన కొన్ని పాత్రలకు చాలా దగ్గరగా వుంటాయి. అంటే ఈ పాత్రలకు మనకు పరిచితమయిన చరిత్రలో నిజంగా జీవించిన వ్యక్తుల జీవితాలను ఊహించి సృష్టించిన పాత్రలు. ఈ ఊహకు రచయిత ఆయా వ్యక్తుల జీవిత చరిత్రలను, ఆత్మకథలను ఆధారం చేసుకున్నాడని ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. అయితే అన్ని పాత్రలు యథార్థ పాత్రలు కాకపోవచ్చు. కొన్ని సంఘటనలకు అనుగుణంగా జోడించబడిన పాత్రలు కావచ్చు. అయితే రచయిత అన్ని పాత్రలు వాస్తవం అనిపించేటంతగా చిత్రించాడు. సంఘటనలు కల్పితమయినా కొన్ని వాస్తవ సంఘటనలతో జతచేశాడు. పాత్రల వర్ణన చాలా గాఢంగా, పాఠకులు గుర్తించేట్టుగా చేశాడు. ముఖ్యంగా భాష. దాదాపు ఆయా పాత్రలు జీవించి వున్నప్పటి భాషలాగా వుండేటట్లు చూసుకున్నాడు. అలాగే ఊరి పేర్లు, వీథుల పేర్లు కొన్ని కల్పితమయినవి అయినా అవి ఆ కాలంలో అలా పిలువబడే పేర్లు అనేంత నమ్మశక్యంగా పేర్లు పెట్టాడు. పాత్రలు, ముఖ్యంగా, కుముదవల్లి, నాగలక్ష్మి తమతమ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలు, సందిగ్ధతలు, సంఘర్షణలు అన్నీ అత్యంత సహజంగా చిత్రించాడు. ఆయా పాత్రలు మాట్లాడే భాష, ఎక్కువగా చిత్తూరు జిల్లా మాండలికం, కొంత తమిళ ప్రభావంతో వుండటం వల్ల ఆ పాత్రలు, ముఖ్యంగా వాటి జీవితాలు మదురై, మద్రాసులతో పెనవేసుకుని వుండటం వల్ల సరిగ్గా సరిపోయింది. దేవదాసీలు ఎంతో సంస్కారవంతంగా, గొప్ప అభిరుచితో జీవించారనే చారిత్రక వాస్తవాన్ని అత్యంత శక్తివంతంగా, వారి హుందాతనం ఏమాత్రం తగ్గకుండా చూశాడు రచయిత. వాటి ఆత్మకు, లైంగిక, అభిరుచుల్ని, వాంఛల్ని హుందాగా ప్రకటింపజేశాడు. ఏమాత్రం అసభ్యతకి ఆస్కారం లేకుండా చూశాడు.

కుముదవల్లి ఇలా అనుకుంటుంది: “ఆయనతో బాగా దగ్గరయిపోయాను. వొక్కసారి ఆయన రాకపోతే, వొళ్ళంతా అదో మాదిరయిపొయ్యి నిద్రకూడా పట్టేది కాదు… అంత బాగా స్నేహితంగా వుండేవాడు మొగుడే అయితే యింక చానాసేపు సంతోషంగా వుండవచ్చుగదా అనుకుంటూ వుంటాను.”

అలాగే తంజావూరు ధనకోటితాయారు ఇలా అనుకుంటుంది: “యెన్ని అలంకారాలు జేసినా, ఈ ఆడోళ్ళు ఆ మగవాళ్ళంత రంజుగా వుండరు.”

శ్రీరంగం ఆముదవల్లి కూడా ఇలా అనుకుంటుంది జయమాంబాల్ సంగీతం ప్రత్యక్షంగా విని: “యీమెకింత పరవశం యెట్లొస్తావుండాది? ఆమె వొంటికుండే ముసలితనం ఆమె పాటకు కొంచెం గూడా అంటడం లేదు. ఆమె పాటకింత యవ్వనం యెట్లొస్తావుంది? ఆ పాటకుండే యవ్వనానికి, ఆమెకు పోషకుడితో వుండిన ప్రేమకు మధ్య యేదో సంబంధముందని మాత్రం అనిపిస్తావుంది నాకు.”

రచయిత తన రచనకోసం ఎంచుకున్న యథార్ధ వ్యక్తులు వాళ్ళ జీవితాలు చాలా ప్రాచుర్యం పొందినవి కావటంవల్ల సహజంగా వాటి చుట్టూ అనేక పురాణాలు పుకార్లు ప్రచారంలో వుంటాయి. ఈ రచయిత వాటి ఉచ్చులో పడలేదు. అలా పడివున్నట్లయితే ఈ నవలకి నాటకీయ లక్షణాలు వచ్చివుండేవి. చాలా నిగ్రహంతో రచయిత వాటిని పరిహరించి నవల రాశాడు.

ఈ నవల (కుముదవల్లి) చిత్తూరు స్కంద కుముదవల్లి కథతో మొదలవుతుంది. కుముదవల్లి తన చరిత్ర చెపుతూ తన చుట్టూ వున్న సమాజ చరిత్ర చెపుతుంది. ఇది రచయిత చాలా చాకచక్యంగా చిత్రించాడు. మదురైనుంచి దేవదాసీగా చిత్తూరు చేరుకుని ‘భోగమోళ్ళు’గా పిలవబడటంలో ఉన్న కారణాల్ని కుముదవల్లి ద్వారానే చెప్పిస్తాడు రచయిత. కుముదవల్లి కోదండరాముణ్ణి కోరుకున్న కోరిక తన అస్తిత్వం పట్ల తనకున్న గౌరవాన్నే కాక దాన్ని తన తరువాత తరం కూడా కొనసాగించాలనే తపన ఆమెలో కన్పిస్తుంది.

ఈ నవలలో కథ చెప్పే వ్యక్తి కేవలం కథనంలో లింకులు కలపటం మాత్రమే చేస్తాడు. పాత్రలు తమకు తాముగా స్వీయ చరిత్రల్ని చెప్పుకునే అవకాశం కల్పిస్తాడు. ‘మా వర్ణమేదో మేమే చూసుకుంటాం. నువ్వు నీ కలాన్ని నాట్యం ఆపమని చెప్పు’ అని రచయితని పాత్రలు హెచ్చరిస్తాయి.

ఈ నవలలో కథకుడి పరిస్థితి సల్మాన్ రూష్దీ (Salman Rushdie) రాసిన షేమ్ (Shame) లోని కథకుడి లాంటిదనిపిస్తుంది. ఆ నవలలో కథకుడు ఇలా అంటాడు:

I had thought, before I began, that what I had on my hands was an almost excessively masculine tale, a saga of sexual rivalry, ambition, power, patronage, betrayal, death, revenge. But the women seem to have taken over, they marched in from the peripheries of the story to demand the inclusion of their own tragedies, histories and comedies, obliging me to couch my narrative in all manner of sinuous complexities, to see my ‘male’ plot refracted so to speak, through the prisms of its reverse and ‘female’ side. It occurs to me that the women knew precisely what they were up to that their stories explain, and even subsume, the men’s. (p.173)

నరేంద్ర మామూలుగా అత్యంత సమకాలీన అంశాల మీద కథలు, నవలలు రాసిన రచయిత. అయితే ఈ నవల ఒక రకంగా చారిత్రక నవల. దాదాపు 130 సంవత్సరాల దక్షిణ భారతదేశ దేవదాసీ వ్యవస్థ పూర్వాపరాల మీద, ఆ వ్యవస్థనుంచి వచ్చి ప్రముఖులయిన కొందరు స్త్రీల జీవితాలను చిత్రించిన నవల. ఈ నవల దేవదాసీ వ్యవస్థ గురించి, దాని పెరుగుదల, క్షీణతల గురించి కొంత విశ్లేషణాత్మకంగా రాయబడిన నవల. దక్షిణ భారత సాంస్కృతిక చరిత్రలో సింహభాగం పోషించిన దేవదాసీల జీవన చరిత్ర. కొంతమంది దేవదాసీ కుటుంబాలలో పుట్టి క్రమంగా సంఘంలో ప్రధాన సంస్కృతి లేక సంగీత ప్రపంచంలో ప్రముఖులుగా ఎదిగినవాళ్ళ చరిత్ర. సామాజిక, చారిత్రక విషయాల గురించి అవసరమైనంత వరకు మాత్రమే ప్రస్తావిస్తూ వాటితో సంఘర్షించిన వ్యక్తుల జీవితాల్ని పరిచయం చేసిన నవల. శైలీగతంగా నరేంద్ర ఈ నవలలో ఒకానొక మార్పుకి గురయ్యారు. చిత్తూరు మాండలికాన్ని, అందులో కనిపించే తమిళ యాసని, అందులోవుండే ఆకర్షణని చాలా అద్భుతంగా ఈ నవలలో వాడుకున్నాడు రచయిత. ఈ నవలలో నరేంద్ర ఒక కొత్త టెక్నిక్‌ను వాడుతూ కన్పిస్తారు. పాత్రలు తమ కథల్ని తామే వినిపిస్తాయి కాబట్టి దానివల్ల రచయితకు అనేక శైలుల్ని పరిచయం చేసే వీలు కలిగింది. రోజువారీ జీవితంలో తరచుగా వినపడే సామెతలనుంచి కర్ణాటక సంగీతం దాకా వున్న పరిభాషని, పాత్రల సంభాషణల్లో భాగం చేయటంవల్ల కూడా ఆయన వచనానికి ఒక కొత్తదనం వచ్చింది.

ఈ నవలలో రచయిత ఎక్కడ కూడా నీతులు చెప్పే ప్రయత్నం చేయడు. సంఘటనలను కలపటంలో రచయిత పాత్ర అనేది చాలా బాధ్యతాయుతంగా నిర్వర్తించాడు. అదే సందర్భంలో అనేక పాత్రల ద్వారా సామాజికంగా జరుగుతున్న మార్పులు అన్నీ మంచివే కాదనే విషయాన్ని ఆ పాత్రల విశేషణాలనుంచే బహిర్గతం చేశాడు. దేవదాసీలను భోగమోళ్ళని పిలవటం వెనుక వున్న ఆర్థిక, సామాజిక హింస గురించి ఆ పాత్రలు చేసిన వ్యాఖ్యానాల ద్వారా తెలియజేశాడు రచయిత. గత మాటయాభై సంవత్సరాలలో దక్షిణ భారతదేశంలో వచ్చిన సాంస్కృతికమైన మార్పులు కూడా ఈ నవలలో కథకుడి వ్యాఖ్యల ద్వారా రేఖామాత్రంగా తెలియవస్తాయి. అదే సందర్భంలో ఈ మార్పులు దేవదాసీ వ్యవస్థ మీద, అందులో వున్న వ్యక్తుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపాయి? ఆ వ్యక్తులు ఎటువంటి అస్తిత్వాల సంకటస్థితి ఎదుర్కొన్నారు? ఆ క్రమంలో ఆ పాత్రలు తమకు తాముగా వేసుకున్న ప్రశ్నలు యేమిటి? మేం ఎవరం? మా స్థితి ఇలా ఎందుకుంది? మా స్థితికి కారణం ఎవరు? అని ఆ స్త్రీ పాత్రలు దేవుడికో లేక తమ చుట్టూ వున్నవాళ్ళకో లేక తమ పోషకులకో ప్రత్యక్ష, పరోక్ష రూపాలలో ప్రశ్నలు వేస్తూ వున్నప్పుడు – అవి కేవలం వాళ్ళకు మాత్రమే పరిమితం కాదు. మొత్తం సామాజిక వ్యవస్థ క్రమాన్ని వాళ్ళు నిలదీస్తున్నారనే స్పృహ పాఠకులకు అనివార్యంగా కలుగుతుంది.

నరేంద్ర తన రచనకు వస్తువుగా దక్షిణ భారత చరిత్రలో ఒక మహత్తర ఘటన అనదగినదాన్ని తీసుకున్నాడు. అందులో పున్న రాజకీయ, సాంస్కృతిక మార్పులతో సహా, ఈ నవలలో అతను తీసుకున్న జీవితం వాస్తవం, గతానికి చెందిన వాస్తవం. దీన్ని చిత్రించటానికి రచయిత చరిత్రతో సంభాషణకు దిగాడు. ఆ సంభాషణలో రచయితకు అనేక పాత్రలు తారసపడ్డాయి. అతనితో ఘర్షణపడ్డాయి. ఆ తరువాత అతని నుంచి స్వయం ప్రతిపత్తి కల్పించుకుని తమని గురించి తామే యథార్థంగా పరిచయం చేసుకుంటామని కథకుడితో తెగేసి చెప్పాయి. ఆ చెప్పుకునే తీరు వివిధ రకాలుగా వుంటుంది. అదే సందర్భంలో ఆ పాత్రలు కొన్ని అసాధారణ శక్తియుక్తుల్ని కలిగివుంటాయి. ప్రతి పాత్ర తన కథని అదే సంక్లిష్ట సందర్భాలలో చెపుతుంది. అవి తమకు తెలిసిన కళ గురించి పూర్తి అవగాహనతో వుండడమే కాక, జీవితాన్ని గురించి కూడా విస్తృత పరిజ్ఞానాన్ని కలిగివుంటాయి. తమ జీవితాన్ని గురించిన తమ దృక్పథాన్ని వినిపిస్తాయి. అందులో జోక్యం చేసుకుని వాటిని వక్రీకరించే అవకాశం రచయితకు లేక కథకుడికి ఇవ్వవు. అలాగే ఈ పాత్రలకి తల్లితో మాత్రమే బలమైన ఆత్మయిక సంబంధం వుంటుంది. తండ్రి అనేవాడు నామమాత్రపు అస్తిత్వాన్ని కూడా కలిగివుండడు. అతనిది కేవలం తాత్కాలిక పోషకుడి పాత్ర మాత్రమే.

ఐరోపాలో నవల అనేది రూపపరంగా బలపడటంలో కీలకపాత్ర వహించిన ఫ్లూబేర్, తోల్‍స్తోయ్ లాంటి వాళ్ళు తమ నవలలను నవలలుగా చూడటం కంటే సాంస్కృతికంగా తమ సమకాలీన సమాజంలో జరుగుతున్న చర్చలలో జోక్యంగా, ప్రయోగాలుగా చూసుకున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర నవలను కేవలం దేవదాసీ జీవితాన్ని ప్రతిఫలించిన నవలగా మాత్రమే చూడకూడదు. సమకాలీన సమాజంలో మళ్ళీ ఒకసారి దేవదాసీ జీవితాన్ని గురించి, ముఖ్యంగా అందులో ప్రముఖులుగా ఎదిగిన సంగీతకారుల గురించిన చర్చలో భాగంగానే చూడాలి.

చారిత్రక నవలా రచయితలు తాము ఎంచుకున్న చరిత్రలో సమాజ సంబంధమైన, వ్యక్తిగతమైన ఖాళీలను భావాలను ఏదో ఒక స్థాయిలో పూరించే పనిచేస్తారు. ఈ నవలా రచయిత ఆ పనికి పూనుకున్నట్లుగా లేదు. నిజానికి రచయితకి తానెంచుకున్న వ్యక్తుల వల్ల ఆ అవకాశం లేదు. ఆ వ్యక్తుల యథార్థ జీవితాల గురించిన రేఖామాత్రమైన అవగాహన మాత్రమే వుంది. వాళ్ళమీద దొరికే సమాచారం కూడా నిర్దిష్టంగా లేదు. అలాగే వాళ్ళ చుట్టూ విపరీతమైన కట్టుకథలు కూడా అల్లబడలేదు.

“The spirit of a period is like the self-hood of a human being something that cannot be handed on; try as we may, it is impossible for us to breath the atmosphere of a bygone time, since all those thousand-and-one details which went to the building up of both individual and general experience, can never be reproduced.” – Jonathan Nield (as quoted in The Historical Novel, p.5)

అయితే ఈ నవల చదివినప్పుడు జోనథన్ అభిప్రాయం సరికాదనిపిస్తుంది. ఎందుకంటే తను తీసుకున్న కాలపు బాహ్యవాతావరణాన్నే కాక, ఆ పాత్రల అంతరంగాలని కూడా వీలైనంతగా మనకు రచయిత పరిచయం చేశాడు. ఒక కాలపు ఆత్మను గ్రహించి దాన్ని నవలలో ప్రతిఫలింపజేయటం అంత సులువయిన పనికాదు. నరేంద్ర ఆ పని చాలా శక్తివంతంగా చేశారు.

నవలలో ప్రతిపాత్ర రంగం మీదకు వచ్చి తనను తాను ఆవిష్కరించే ముందు కథకుడు ఆ పాత్ర జీవితంతో సంబంధం వున్న ప్రాంతాన్ని, దాని సాంస్కృతిక, చారిత్రిక విశేషాల్ని క్లుప్తంగా పరిచయం చేస్తాడు. ఇదొక రకంగా నవలలో కాలసంబంధమయిన క్రమాన్ని సూచిస్తూ రావటానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి నవల 5వ భాగం మొదలై మదురై మోహనాంబ తన కథ చెప్పబోయే ముందు కథకుడు దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ సంస్కర్త, 1920లో బ్రిటిష్ ఇండియాలో మొదటిసారిగా మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నియమింపబడిన ముత్తులక్ష్మి రెడ్డి గురించిన ప్రస్తావన తెస్తాడు. ఈ తరహా ప్రస్తావనలవల్ల రచయిత నవలకున్న చారిత్రక లక్షణాన్ని నొక్కి చెపుతూవుంటాడు.

నవలలో ముత్తులక్ష్మి రెడ్డి శిష్యురాలు మదురై మోహనాంబ రాకతో దేవదాసీలను సంస్కరించే పని మొదలవుతుంది. ‘సంప్రదాయమనే ముసుగులో మిమ్మల్నంతా వేశ్యలుగా తయారుచేశారు వాళ్ళు’ అని అంటుంది మోహనాంబ. గుళ్ళో పొట్టుకట్టుకి తీసుకురాబడిన ఆడపిల్లల్ని చూసి ఈ సందర్భంలో వయసు ముదిరిన ఒక దేవదాసి మోహనాంబతో ఇలా అంటుంది: “పాపా! నీది చిన్న వయసు. నీకేమీ తెలవదు. వేశ్యలకూ, దేవదాసీలకూ చానా తేడా వుండాది. మేము మా బతుకులనంతా దేవుడి సేవలో పెడతావుండామనే ఆ తెల్లదొరలు కూడా మా జోలికి రాలేదు. యిప్పుడెవరో గాంధీ అని కద్దరు గుడ్డలు కట్టుకోమనే కాంగ్రెస్సాయన బయల్దేరినాడు. యీ వూర్లో మాకు పోషకులుగా వుండే వకీల్లు కూడా కొందరు ఖద్దరు గుడ్డలు కట్టుకోని ‘ఆంటినాచ్’ అని బయలుదేరినారు… అయిదునూర్లు, ఆరునూర్లు సంవత్సరాలుగా శైవాలయాల్లో, విష్ణువాలయాల్లో నృత్య నైవేద్యాలు సమర్పిస్తా బతకతావుండే కులం మాది. నృత్యాలూ, సంగీతమూ యీ మాత్రమైనా బతికుండాయంటే మావల్లే. మాకు బతుకంటే సంగీతమూ, నృత్యమే! తిండీ సంపద గూడా మాకు పన్లేదు.” (p.74)

ఈ సందర్భంలో రచయిత మోహనాంబకి దేవదాసీలకు మధ్య ఆసక్తికరమైన చర్చ నడుపుతాడు. మోహనాంబ చేత ఆంటీనాచ్‌గా వుండి దేవదాసీలను ముఖ్యంగా చూడటానికి కూడా ఇష్టపడని అతనొకతను గుడికి వస్తున్నాడని అక్కడ గుమిగూడిన దేవదాసీలను తరిమేస్తున్న పట్టారులనుద్దేశించి ఆమె ఇలా అంటుంది: “ఆలయంలో నుంచి తరమాల్సింది వాళ్ళు చేస్తావుండే పనిని మాత్రమే. దేవదాసీలు లేకుండా వుండేటట్లుగా పని చెయ్యాలి గాని, వాళ్ళ ముఖం చూడకుండా నిప్పుకోళ్ళ మాదిరి యిసుకలో తలదూర్చుకోవటం గాదు మీరు చేయాల్సింది.“(p. 76)

ప్రముఖ మార్క్సిస్టు విమర్శకుడు జార్జ్ లూకాచ్ చారిత్రక నవల పని చారిత్రక సంఘటనల్ని తిరిగి చెప్పటం కాదని చెపుతూ ఇలా అంటాడు: “What matters therefore in the historical novel is not the retelling of great historical events, but the poetic awakening of the people who figured in those events.” (The Historical Novel, p. 42)

నరేంద్ర నవలలో దక్షిణ భారత సాంస్కృతిక చరిత్రలో ముఖ్యంగా సంగీత ప్రపంచంలో కీలక పాత్ర వహించిన వ్యక్తులను తన భావుకతతో పాఠకుల ముందుకు తీసుకవచ్చారు. ఈ భావుకత్వ ప్రదర్శనలో ఎంత నిరాపేక్ష ప్రదర్శించాడు, ఎంత సాపేక్షత చొచ్చుకొచ్చింది అనేది ఆయా పాత్రల వెనుకువున్న నమూనా వ్యక్తుల నిజజీవితాల్ని గురించి రాయబడిన యథార్థ జీవిత కథల్ని చూస్తే తప్ప నిర్ధారించటం కుదరకపోవచ్చు. నిజానికి ఒక రచయిత తాను రాయబోయే నవలకు నమూనా పాత్రల్ని ఎంచుకోవటంలోనే ఆ రచయితకు ఆ పాత్రలపై అనివార్యంగా అభిమానమో, ఆరాధనా భావమో వుంటుంది. అందువల్ల ఆ రచయిత వాళ్ళ గురించి రాయటంలో ఒకానొక ఆదర్శపూరితమైన ఆలోచన ఆ పాత్రల గురించి రాయటాన్ని నిర్దేశించలేదని చెప్పలేం. ఈ నవలలో కుముదవల్లి, నాగలక్ష్మిల గురించి రచయిత చిత్రీకరణ చూస్తే రచయిత అచేతనంగానయినా అటువంటి ఆరాధనాభావం లోంచి రాయలేదని, వారిని ఆదర్శవ్యక్తులుగా పరిచయం చేయలేదని చెప్పటం కుదరదు.

నాగలక్ష్మి గాత్రానికి ముగ్ధురాలై తనని తన ఇంటికి తీసుకుపోయిన గాయత్రికి నాగలక్ష్మి దేవదాసీ అని తెలిసిన తరువాత ఆ యింట్లోవాళ్ళు ఆమెను చూసిన తీరులో గాయత్రికి కులం గురించిన వివక్షత స్పష్టంగా తెలుస్తుంది. రచయిత ఆ విధంగా సంఘటనను చాల సూక్ష్మంగా చిత్రించాడు. ముఖ్యంగా గాయత్రి ఇలా అనుకుంటుంది: “మా అవ్వ గొడవ అనీ మా నాన్న గోల అనీ దేన్ని గురించి మాట్లాడుకుంటున్నారో నా కర్థం కాలేదు గాని, దేవదాసీలనే వాళ్ళు మా బ్రాహ్మణులంత గొప్పవాళ్ళు కాదని మాత్రం అర్థమయింది. అంతేకాదు, సంగీతం పాడేది దేవదాసీలు చేసేపని అని, మాలాంటి బ్రాహ్మణులు ఆ పనిచేస్తే అవమానమని గూడ అర్థమయింది.” ఈ అవగాహనతో గాయత్రి తమ కుటుంబాలలో దేవదాసీల పట్ల వున్న వివక్షత గుర్తిస్తుంది. ఆ వివక్షత తన తల్లి మీద కూడా పరోక్షంగా వుండే విషయాన్ని కూడ సులభంగానే గాయత్రి గ్రహిస్తుంది. ఆ గ్రహింపువల్లే “మా అమ్మ గొంతు నాగలక్ష్మి వాళ్ళమ్మ గొంతు కంటె యెంతో బాగుంటుంది. మా అమ్మకు గూడా నాలాగే కచేరీల్లో పాడాలనే యిష్టం వుందేమో! వీళ్ళకు భయపడి ఆమె అట్లా వుండిపోయిందేమో!” అని అనుకుంటుంది. ఈ ప్రస్తావన ద్వారా స్త్రీల కోర్కెలను తమకి తాముగా అణిచివేసుకునే వాతావరణాన్ని కల్పించిన కుటుంబవ్యవస్థ కుట్ర బహిర్గతం అవుతుంది.

నవలలో చాలా వ్యావహారికంగా, నిర్మొహమాటంగా వున్న పాత్రలలో కాళహస్తి దాక్షాయణి ప్రసూనవల్లి ఒకటి. కాళహస్తి దేవాలయానికుండే ఆస్తులు తగ్గిపోయి పోషణ లేక భోగంవాళ్ళయిన దేవదాసీలలో ప్రసూన ఒకతి. పోషకుడి అన్వేషణలో మదురై వెళుతున్న కుముదవల్లితో తనకు ఒక పోషకుణ్ణి చూసి పెట్టమని బయలుదేరిన ప్రసూన కుముదవల్లిని కొన్ని మౌలికమైన ప్రశ్నలు వేస్తుంది. ‘మదురైలో కచేరీలకు వచ్చే పెద్ద అయ్యర్లు, నాటుకొటె, పుదుక్కోటి శెట్లదంతా నిజమైన సంగీత అభిమానం కాదని, అదంతా పైపై షోకులని అసలు వాళ్ళంతా వయసు దాటిపోయిన వాళ్ళని, ఘాటయిన ఆడదంటే వాళ్ళకు భయం’ అని అంటుంది ప్రసూన. ఆమె ఇంకా ఇలా అంటుంది కుముదవల్లితో: “పాపం మంచి వయస్సులో వుండే యీ దేవదాసీ ఆడపిల్లలకు ఆ మాదిరి ముసలి మొగుళ్ళతో యేం కోరిక తీరుతుంది? యిదంతా డబ్బులు చేస్తావుండే మోసం, ఘోరం! అన్యాయం.” ప్రసూన మాటలు కుముదవల్లికి కొంత స్పష్టంగా తన లైంగికతను గురించి చెప్పేందుకు పురికొల్పుతాయి. తన లైంగికత గురించి తనకు పూర్తి గుర్తింపు కలగక ముందే తనకు పోషకుడు వచ్చాడు. సంభోగాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కుముదవల్లి ఇలా అంటుంది: “సంభోగమంటే యేందో కూడా పోషకుడి దగ్గరికి పోకముందే నాకంటే పెద్దాళ్ళయిన మన ఆడోళ్ళే అంతా వివరంగానే చెప్పినారు. అయితే దాని అవసరం యీ వొంటికి రాకముందరే పోషకుడూ వచ్చేసినాడు. ఆ సంభోగాలూ జరిగినాయి. వయసు కొంచెం వచ్చినాక ఆ అవసరం గూడా తెలిసింది. అయితే యిద్దరు మనుషులు – వొక మొగోడూ, వొక ఆడదీ కలుసుకోని సంభోగం జేసుకుంటే వుండే సుఖం కంటే ముందుగా వొక కీర్తన వాయించినప్పుడు దొరికే ఆ పెద్ద ఆనందం – అదేందో సరిగ్గా చెప్పలేను నేను – కచేరీలో వాయించినప్పుడుండే ఆనందం వొకరకం. సాధన జేసేటప్పుడు దొరికే సుఖం యింకోరకం. మనం వాయించిందేందో తెలిసిన మనిషి తోడుగా వుంటే, అప్పుడా యిద్దురూ పొందే సుఖమింకోరకం. దేనికదే! సంగీత జ్ఞానముండే పోషకుడు దొరకడమంటే అంత సులువుగాదు. అదురుష్టం వుండాల. నాకయితే యీ పూర్లోనే ముందుగా చిదంబరయ్యర్ పోషకుడిగా వుండినాడు. ఆయిన వయిసప్పుడు అరవై పైన్నే! నాది పదహారో, పదిహేడో! అయితే ఆయనకు సంగీతం భలే యిష్టం. ఆయినతో సంభోగ సుఖం కంటే సంగీత సుఖమే జూస్తే! ఆయినిప్పుడు లేడు. అయినా ఆయినతో పొందిన సుఖం మాత్రం మరవలేను.” (p.99-100)

లైంగికత అనేది మనిషికి చాలా కీలకమైన విషయం. సెక్స్, జండర్ గుర్తింపు, లైంగిక ప్రాధాన్యం, సుఖం అన్నీ దీంట్లో వుంటాయి. లైంగికత అనేది ఆలోచనల్లో వ్యక్తీకరింపబడుతుంది అనుభవం ప్రాతిపదికగా. అలాగే ఇది మనుషుల వాంఛల్లో, వైఖరుల్లో, ఏర్పర్చుకున్న విలువల్లో, ప్రవర్తనల్లో కూడా వ్యక్తీకరింపబడుతుంది. లైంగికతను సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, నైతిక అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. కుముదవల్లి ప్రసూనతో పంచుకున్న ఆలోచనల్లో అదే తెలుస్తుంది. కుముదవల్లి తన లైంగికతను గుర్తించి చేసిన ప్రస్తావన ద్వారా దేవదాసీలు కేవలం పోషకుల్ని కాక సంగీతజ్ఞానం వున్న పోషకుల్ని కోరుకున్నారనే విషయాల్ని చెప్పిస్తాడు. అటువంటి పోషకుడు దొరకటం అదృష్టంగా కూడా భావిస్తుంది. తనకు పోషకుడిగా వున్న చిదంబరయ్యర్ పట్ల ఆమెకు ఏర్పడ్డ ఇష్టానికి అతని సంగీతాభిరుచే ప్రధానకారణం. స్త్రీలు తమ లైంగికతల్ని అణచివేసుకోవటంలో ఆర్థికాంశాల పాత్రని కూడా రచయిత కుముదవల్లి చేత ఇలా చెప్పించటం ద్వారా బహిర్గతం చేస్తాడు: “యిప్పుడొకసారి సంగీతంకంటే పోషకుడే చాలా అవసరం. అట్లని చెప్పి యీ వొంటి పైన మాత్రం మరులుండే పోషకుడు దొరికితే యేం చెయ్యాలి? వుండే దాంతోనే సర్దుకోవాలి.” (p, 100)

ఈ నవల తొమ్మిదో అధ్యాయంలో కథకుడు అన్న మాటలు గమనార్హం.

‘హిందువుల జీవితాన్ని అనేక యుగాలపాటు నిర్దేశించిన మనువు యెనిమిది రకాల పెళ్ళిళ్ళున్నాయంటాడు. అవన్నీ కాదని మదురై దేవదాసీ వ్యవస్థ పోషకుడు పోషితురాలు అనే చిత్రమైన సంబంధాన్ని తయారు చేసింది.’ ఈ సంబంధాల్ని కొనసాగించటంలో దేవాలయాలు చాలా కీలకపాత్ర పోషించాయి. మనుషులకు అందుబాటులో వుండే అన్ని భోగాల్ని దేవుడికి కూడా అందిస్తున్నామనే వ్యక్తాత్మకలోంచి ప్రతీకాత్మకంగా దేవుడికి అందించే ఆచరణ బలపడింది. ఈ నవలలో చాలా సందర్భాలలో రచయిత ప్రస్తావించిన ‘రంగభోగం’ అందులో ఒకటి. పాటలు పాడటం, నృత్యం చేయటం, దేవుడి విగ్రహాలకు విసనకర్తలా విసరటం ఇందులో జరిగే ఆచరణలలో కొన్ని. ఈ పనులు చేస్తున్నవాళ్ళు దేవదాసీలుగా పిలవబడ్డారు. అయితే ఈ కార్యక్రమాలు నిర్వహించే దేవదాసీలకు ఏదో ఒక స్థాయిలో ఒకప్పుడు గుర్తింపు వుండేది. ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ బి. వి. సుధామని అనే ఆమె ఇలా అంటుంది:

The importance given to the role of Devadasis by the temples was so great that when a Devadasi of a temple breathed her last all the usual and traditional activities of the temple like offering puja, food, Kumbarathi, etc., come to a grinding halt and all the resources of the temple both men and materials were diverted towards offering a decent burial to the Devadas. [from the Institution of Devadasis – A Study in the Princely State of Mysore, 1610-1910. Proceedings of the Indian History Congress, 1999, Vol.60, Diamond Jubilee (1999), pp.667-674]

దవేష్ సోనేజీ (Davesh Soneji) అభిప్రాయం ప్రకారం దేవదాసీలు 16వ శతాబ్దపు చివరిభాగం నుండి పడుపుకత్తెలుగా, నాట్యగత్తెలుగా, దేవస్థానాలలో నర్తకీలుగా వుంటూ వచ్చారు. దక్షిణ భారతీయ సమాజంలో వాళ్ళ స్థితి సందిగ్ధతతో కూడుకునివుంది. పితృకేంద్రక సంబంధాలు వీళ్ళను నియంత్రించలేదు. నిజానికి వాటి వెలుపల మాతృకేంద్రక సంబంధాలలోనే జీవించారు. అగ్రవర్ణాలకు చెందినవాళ్ళతో వైవాహేతర లైంగిక సంబంధాలు కలిగివున్నారు. దక్షిణ భారతదేశంలో చాలా మంది ఆడవాళ్ళు అక్షరాభ్యాసం లేకుండా వున్న సందర్భంలో వీళ్ళు విద్యావంతులుగా వున్నారు. ఈ సందర్భంలో ఆయన ఇలా అంటారు:

“On the other hand, records from centers of political power such as the court at Tanjore in Tamil Nadu document the fact that courtesans were commodities regularly bought and sold through the intercession of the court. In other contexts, as the concubines, mistresses, or “second wives” of South Indian elites, they were implicated in a larger world of servitude focused on the fulfillment of male desire. Beginning in the mid-nineteenth century. vociferous social reform movements in South India aimed to dislodge communities of professional dancing women from their hereditary performance practices. Over the next hundred years, their lifestyles were criminalized on the basis of their nonconjugal sexuality, which was understood as prostitution. The Madras Devadasis (Prevention of Dedication) Act, implemented in 1947, officially outlawed the social ritual, and aesthetic practices of these women.” (Unfinished Gestures: Devadasis, Memory, and Modermity in South India, p.3)

చారిత్రకంగా దేవదాసీ వ్యవస్థలో వచ్చిన మార్పుల ఫలితంగా దేవదాసీలు తాము సమాజంలో పొందుతున్న ఏదో ఒక స్థాయి గౌరవానికి దూరమయి ఆస్తిత్వ విలుపుదల కోసం కొంతమంది వేశ్యలుగా మారుతున్న సందర్భాన్ని, తమ యథాస్థితిని గుర్తించి దానితో రాజీపడాల్సిన అవసరాన్ని గురించి ఈ నవలలో హంసవేణి మూగాంబిక ఇలా అంటుంది: “వదినా! మనం కళల్ని నమ్ముకొని బతకతా వుండామని మనం గొప్పగా అనుకుంటాం. కాని వాళ్ళంతా మనల్ని కిందిరకం కులమోళ్ళని కేవలంగా చూస్తారు… కానీ మన పాండిత్యమెంతుండాదో తెలుసుకునేదానికి వాళ్ళేమయినా పండితులా చెప్పు, కాదుగదా! వాళ్ళొచ్చేది మన అందాల్ని జూసి సప్పరించటానికే! మనం గూడా అది తెలుసుకొని గోప్యంగానైనా మన అందాల్ని కనబడేటట్టుగా జూసుకోవాలి” (p. 116).

‘దేవదాసీలకు వుండే స్వేచ్ఛ కుటుంబ స్త్రీకి లేదని, ఎందుకూ తరంగాని ఆడవాళ్ళు మాత్రమే పెండ్లాలుగా మిగులుతారు’ అని అంటుంది స్వీయానుభవంలోంచి మూగాంబిక. కోయంబత్తూరు శెట్టితో పోతే పోషకుడిగా ఆయన అన్నీ అందిస్తాడు. తన మాదిరిగా ఇంట్లో మొగుడికి భార్యగా వుంటే, ఆమెకు గూడా ఇంకో స్త్రీతో తిరిగినా అడిగే ధైర్యం వుండదని నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తుంది మూగాంబిక, తను నాగలక్ష్మిని పోషకుడితో వెళ్ళమని నచ్చచెప్పే ప్రయత్నంలో. కుటుంబస్త్రీల జీవితం కంటే, దేవదాసీ స్త్రీల జీవితాలు మెరుగ్గా వుండాయని సోదాహరణంగా వివరిస్తుంది. ఇదే అభిప్రాయాన్ని శ్రీరంగం కుముదవల్లి రూపరాణి కూడా వేరే ఒక సందర్భంలో నిర్ధారిస్తుంది. ఆమె ఇలా అంటుంది: “పెద్ద పెద్ద పోషకులు వెతుక్కుంటూ వచ్చినా కాదని మా అమ్మ మా బంధువుల్లోనే వుండే మా నాన్నను కావాలని పెండ్లి చేసుకుందట! దాంతో యిప్పటివరకూ కష్టాలే పడతావుంది.” (pp. 130-131)

దేవదాసీలకు మిగతా కుటుంబ స్త్రీలకంటే కొంత స్వేచ్ఛగా జీవించే అవకాశం వున్నప్పటికీ మిగతా స్త్రీల లైంగికత మీద అణిచివేత వున్నట్లుగానే దేవదాసీ లైంగికత మీద కూడా అణిచివేత అమలయింది.

…devadasis, like all women, were subject to stringent restrictions on their sexuality and autonomy, for example, devadasis were expected to be sexuality available to upper caste men and were thus open to exploitations at the hands of male elite.” (Creating Conjugal Subject: Devadasi and the Politics of Marriage in Colonial Madras Presidency” – Mythili Srinivas (Feminist Studies, Spring 2011, Vol. 37, No.1, p.64).

కొంతమంది చారిత్రక వ్యక్తుల్ని యథాతథంగా నవలా నేపథ్యంలో ప్రస్తావిస్తాడు రచయిత. అలాంటి వాళ్ళలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది డా. ముత్తులక్ష్మి రెడ్డి ఒకరు. 1888లో పుదుక్కోటయ్‌లో పుట్టిన ముత్తులక్ష్మి రెడ్డి చంద్రమ్మాల్ అనే దేవదాసి కూతురు. దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా అదే కమ్యూనిటీ నుంచి వచ్చి ఉద్యమించినవాళ్ళలో ముత్తులక్ష్మి పాత్ర చాలా కీలకమైంది. స్త్రీ సమస్యల గురించి గొంతెత్తిన వాళ్ళలో ఆమెను ప్రముఖంగా చెప్పుకోవాలి. 1927లో ఆమెను ఉమెన్స్ ఇండియా అసోసియేషన్, మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి నియమించిన తరువాత 1930లో ఆమె దేవదాసీ రద్దు చట్టాన్ని తీసుకురావటంలో కీలకపాత్ర వహించింది. అనేక రకాలుగా దేవదాసీల ఉద్ధరణ కోసం ప్రయత్నించింది. ఈ రచయిత ఆమెను నవలలో పాత్రను చేయకుండా నేపథ్యంలో వుంచి నవలలోని పాత్రల ద్వారా ఆమె గురించిన అభిప్రాయాలు కొన్ని చెప్పిస్తాడు.

సర్వమంగళ నాగలక్ష్మి సమస్యకు పరిష్కారంగా ముత్తులక్ష్మిని సూచిస్తూ ‘మన మదరాసులో వొక ఆడ డాక్టర్, దేవదాసీ కుటుంబంలో పుట్టిన ఆవిడే, రద్దు చట్టం చేయాలని వుద్యమిస్తోందట గదా! ఆమెనేమయినా అడుగుతా?’ అని అన్నప్పుడు నాగలక్ష్మి స్పందన ‘ఆమెకు సంగీతం నాట్యం అంటే యిష్టం లేదేమో?’ అలాగే ఆ సంభాషణ కొనసాగింపులో ముత్తులక్ష్మి గురించి ఆ రోజుల్లో కొంతమందికి వున్న అభిప్రాయాన్ని రచయిత సర్వమంగళ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. సర్వమంగళ ఇలా అంటుంది: “ముత్తులక్ష్మి రెడ్డి అనే డాక్టరు రాజకీయ నాయకురాలు ఇటీవల మా యింటికి వచ్చినట్లు లేదు. ఆవిడొచ్చి వెళ్ళినప్పుడు మా ఆయన ‘యీమెదంతా వితండవాదం, యెవరో కొందరు దేవదాసీలు వ్యభిచారంలోకి దిగినారని మొత్తం దేవదాసీ వ్యవస్థనే రద్దు చేయాలంటుంది. అసలు తప్పు ఆ వ్యవస్థలో లేదు. బీదతనంలో వుంది. వ్యభిచారంలోకి దిగిన బీద దేవదాసీలకంటే, బీదతనంవల్ల వ్యభిచారంలోకి దిగినవాళ్ళే అయిదారు రెట్లు యెక్కువ వున్నారిప్పుడు. జబ్బొక చోట వుంటే మందింకొక చోట వేస్తానంటుందీవిడ.” (p. 195)

1980లలో ముందుకు వచ్చిన నవ్య చారిత్రకవాదం (New Historicism) అనే విమర్శాపద్ధతి సాహిత్యవాచకాల్ని సాంస్కృతిక సందర్భంలోంచి, మేధోచరిత్రని సాహిత్యంలోంచి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. చరిత్ర పుస్తకాలు, నవలలు లాంటివి ఆయా కాలాల, ప్రాంతాల, చారిత్రక సందర్భాల ఫలితాలు. రాసే క్రమంలో చారిత్రక సందర్భాలు, సంఘటనలు, వ్యక్తులు గురించిన వ్యాఖ్యానాలు రచయితలు చేస్తారు. అవి తమ పాత్రల ద్వారా కూడా చేయిస్తారు. అందువల్ల నవ్య చారిత్రకవాదం ప్రకారం రచయిత మానసిక, సామాజిక, నేపథ్యాలను పరిశీలించటం అవసరం.(Through reading literature we can make ghosts speak to us, and we can speak back to them” – Stephen Greenbelt.) ముత్తులక్ష్మి రెడ్డి మీద సర్వమంగళ భర్త చేసిన వ్యాఖ్యానం రచయిత ‘సర్వమంగళ’ అనే ఆత్మతో మాట్లాడటమే. ఇదొక రకంగా రచయిత చారిత్రక సందర్భాన్ని పునఃసృజించటమే. అయితే ఈ సృజన క్రమం సమగ్రంగాకాక శకలాలుగా వుంటుంది. మొత్తం ముత్తులక్ష్మి కృషి ఒక పాత్ర చేసిన ఒక ప్రకటన ద్వారా మాత్రమే నిర్ధారించబడుతుంది.

సంగీతాన్ని గురించిన పాటలో బ్రాహ్మణ స్త్రీలకు దేవదాసీలకు మధ్య అప్రకటితంగా కొనసాగుతూవున్న పోటీ ఈ నవలలో అక్కడక్కడ ప్రస్తావనకు వస్తుంది. అదే సందర్భంలో బ్రాహ్మణ అగ్రవర్ణ స్వభావాన్ని రేఖామాత్రంగా బహిర్గతం చేస్తాడు రచయిత. నాగలక్ష్మి బ్రాహ్మణ స్త్రీ కాదని దేవదాసి అవి తెలుసుకుని సుశీల రంగరాజన్ ఆలోచన ఇది: ‘అయ్యయ్యో ఆమె బ్రాహ్మణురాలు గాదా! మొన్న మన యింటికి వచ్చినప్పుడు మన గ్లాసులోనే కాఫీ ఇచ్చాను మడీ శుచీ పట్టించుకోకుండా! యిప్పుడెలా?’

దానికి ఆమె భర్త ఇచ్చిన వివరణ కూడ ఈ కుల ఆధిక్యతను తెలియజేస్తుంది. అతను ఇలా అంటాడు: “పర్వాలేదులే! నువ్వు తప్పేమీ చెయ్యలేదు. బ్రాహ్మణ స్త్రీ తనకంటే తక్కువ కులంవాడ్ని చేసుకుంటే తప్పనే చెప్తుందీ ధర్మశాస్త్రం. అయితే బ్రాహ్మణుడు వైశ్య, శూద్ర, క్షత్రియ స్త్రీలను గూడా చేసుకోవచ్చు. దానికి శాస్త్రం గూడా వొప్పుకుంటుంది. బ్రాహ్మణుడ్ని చేసుకున్నా ఆమెను బ్రాహ్మణ స్త్రీగా వొప్పుకోదు. కానీ యిప్పుడామె శూద్రులకంటే గొప్పదవుతుంది.

అలాగే ఇంకో సందర్భంలో సుశీల రంగరాజన్ ఇలా అంటుంది నాగలక్ష్మితో: “నువ్వు బ్రాహ్మణుడ్ని పెళ్ళిచేసుకున్నావు కదా! యిప్పుడు నువ్వు బ్రాహ్మణురాలైపోయావని మా ఆయనే చెప్పాడు. ఆయనకు మన ధర్మశాస్త్రాలన్నీ నోటికొచ్చు.

నాగలక్ష్మి సహవాసం సుశీల రంగరాజన్‌లో మార్పు తీసుకురావటమే కాక ‘నాగలక్ష్మి భుజంపై వాలిపోయి, ఆవిడ వీపునంతా నా కన్నీళ్ళతో తడిపేసినా నాలోవున్న మాలిన్యం పోలేదనే అనిపిస్తోంది’ అని అంటుంది ఆమె ఆత్మవిమర్శతో. అలాగే విజయరంగం మంగతాయారు కచేరిని ప్రస్తావిస్తూ ఒక పత్రికలో ‘ఆడవాళ్ళు పాడేటప్పుడు గంభీరంగా, తొణక్కుండా, కదలకుండా, మర్యాదగా పాడాలనీ మగవాళ్ళు మాత్రమే మనోధర్మం ప్రకారం పాడగలరని, ఆడవాళ్ళు మనుధర్మానుసారమే బుద్ధిగా పాడాలనీ’ ఒక విమర్శకుడు రాస్తాడు.

ఈ నవలలో కుంభకోణం విజయరంగం మంగతాయారు కచేరి విన్న ఒక ముసలిదేవదాసీ మంగతాయారు గొంతు విప్పారాలని, గొంతు విప్పారాలంటే శరీరం విప్పారాలి, శరీరమంతా పువ్వులా వికసించాలి, అందుకు కామశాస్త్రం పుస్తకం చదవాలని సలహా ఇస్తుంది. ఆ సలహా పాటించిన మంగతాయారు ఆ తరువాత చేసిన కచేరీలలో ఆమె గొంతులో, ప్రదర్శనలలో వచ్చిన మార్పుని చాలా స్పష్టంగా ఆమె భర్తే గుర్తిస్తాడు. ఈ సందర్భంలో రచయిత చాలా స్పష్టంగా మనోధర్మాన్ని అనుసరించి పాడుతున్న దేవదాసీలకు, మనోధర్మాన్ని అనుసరించి పాడక తప్పని స్థితిలో వున్న బ్రాహ్మణ స్త్రీలకు మధ్య వుండే వ్యత్యాసాన్ని సున్నితంగా చూపిస్తాడు.

Many have argued that it is the nature of music, as a form of artistic expression, to be related to human emotions and sexualities. Art and creative expression have always made up out social and sensitive nature, from telling stories, to performing primal dances, to painting scenes of human experience on cave walls. Pablo Picasso claimed that ‘sex and art are the same thing’ while Sigmund Freud’s Sublimation theory suggested that ‘true’ artists made artwork out of an excess of sexual energy. – Tara Mewawalla. (From Sexualisation in Music: Liberation or Objectification? Cherwell, May 2, 2021)

ఈ నవల మొత్తాన్ని ఆక్రమించుకుంది స్త్రీ పాత్రలే. ఒక్క విశ్వనాథన్ తప్ప ఏ పురుష పాత్రయినా మనసులో మిగలదు. అన్నీ అనామకంగానే మిగిలిపోతాయి. నిజానికి విశ్వనాథన్ పాత్ర కూడా నాగలక్ష్మి పాత్ర సంబంధంలో మాత్రమే చర్చించబడుతుంది తప్ప, ఆ పాత్రకు ప్రత్యేకత ఏమీ లేదు. స్త్రీల అనుభవాల కేంద్రంగా రాయబడిన ఈ నవల స్త్రీవాదం బలంగా ముందుకు వచ్చిన నేపథ్యంలో రాయబడటంలో ఆశ్చర్యం లేకపోయినప్పటికీ ఒక మగ రచయిత రాయటం గుర్తించదగిన విషయం.

గమనించాల్సిన మరొక విషయం రచయిత ఆయా పాత్రలకు ప్రాతినిధ్యం వహించటం గానీ లేక వాటి సమస్యలను తను చెప్పటం కాకుండా రంగం సిద్ధం చేసి వాటినే వాటి గోడు చెప్పుకునేటట్లు చేయటం. ఈ నవలలో వున్న అనేక స్త్రీ పాత్రలు ఎక్కువ భాగం పితృస్వామ్యపు లైంగిక అవసరాల కోసం వయస్సు, మనసు అనే వాటితో నిమిత్తం లేకుండా ఉపయోగపడిన పాత్రలు. సంప్రదాయ కొనసాగింపు వాంఛలోంచి ఆర్థిక దుస్థితి నుంచి వాళ్ళు ఆశ్రయించిన పోషకులు వాళ్ళను అర్ధాంతరంగా మధ్యలో వదిలివేస్తే విలవిలలాడిన పాత్రలు కొన్నయితే, ఆర్థిక అవసరాలకు అతీతంగా సంగీతాన్ని, నృత్యాన్ని తమ అస్తిత్వాన్ని ఆధారభూతంగా చేసుకున్న పాత్రలు మరికొన్ని. కొన్ని పాత్రలు విస్మయం కలిగిస్తే మరికొన్ని గాయపడినవిగా అనిపిస్తాయి. కొన్ని పాత్రలు ధాటీగా వుంటే మరికొన్ని పాత్రలు ఉదాసీనంగా వుంటాయి. అయితే అన్ని పాత్రలు తమ స్వగతాల్ని ప్రత్యక్షంగా వినిపించడం వల్ల ఏదో ఒక స్థాయిలో వాటి అనుభూతిలో నిజంగా అనిపిస్తాయి. కొన్ని పాత్రలు, ఉదాహరణకు హంసవేణి, మూగాంబిక లాంటివి మిత్‌లను ఛేదించి వాస్తవాల్ని నిర్మొహమాటంగా ప్రకటిస్తాయి. వాళ్ళ ప్రకటనల్లో చాలా మౌలికమయిన ప్రశ్నలు కూడా వుంటాయి. ఈ పాత్రలు తమ అనుభవాల కేంద్రంగా మాట్లాడటంవల్ల మనం, వాటికున్న యథార్థాన్ని చూడగల అధికారాన్ని, ఆవశ్యకతనీ అనివార్యంగా గుర్తించాలి. ఆధునికానంతరవాదులు నవలలలో బహుధ్వనిత్వం (polyphony) సమర్థనీయ అంశంగా చూశారు. అంతకంటే ముందే ప్లూరలిజమ్ ఆఫ్ వాయిసెస్ గురించి మిఖయిల్ బఖ్తిన్ (Mikhail Bakhtin) ప్రస్తావించాడు.

“Postmodernist fiction prefers polyphony as a positive principle, it is a pluralization of worlds of discourse.” Edmund J. Smyth. (Postmodernism and Contemporary Fiction, p. 145)

నరేంద్ర ప్రవచనాల ప్రపంచాన్ని బహుళీకరించే పనిని అనేక పాత్రల స్వగతాల్ని విడివిడిగా చెప్పించటం, ఆ విడివిడి స్వగతాలు ఒకే విషయానికి, ముఖ్యంగా దేవదాసీ జీవితానికి సంబంధించి చెప్పించటం ద్వారా చేశాడు. చరిత్రలో అంత నిర్దిష్టంగా చెప్పటం సాధ్యం కాని విషయాన్ని పాత్రల కథనాల ద్వారా శక్తివంతంగా చెప్పించగలిగాడు రచయిత. ‘Most great novels exist to reveal and explore character’అంటాడు హార్వీ (W.J. Harvey) అనే విమర్శకుడు. సరిగ్గా ఈ నవలలో అదే జరిగింది.

వ్యక్తిగతం (Private) బహిరంగం (Public) మధ్య తలాన్ని (space) చెరిపేసి పాత్రల స్వగతాల్ని పాఠకుల ముందు పెట్టాలనుకున్న రచయిత తన అచేతనంలో ఎక్కడో వున్న బెరుకువల్ల వాటిని కొంత నిలువరించే ప్రయత్నం చేసినట్టు అన్పిస్తుంది. అందుకే, చాలా సందర్భాలలో చాలా పాత్రలు తమని పూర్తి స్థాయిలో ఆవిష్కరించుకోవటానికి సిద్ధపడుతున్న సమయంలో వాటిని విలువరించి వేరొక పాత్రను ప్రవేశపెడతాయి. ఇందుకు కారణం రచయితకు వున్న నైతిక చట్రం అనలేం కాని, జంకు అని స్పష్టంగా అనవచ్చు. ఒక సందర్భంలో కథకుడు ఇలా అంటాడు: ‘మదురై మోహనాంబ మాటలు మరికాసేపు వినాలనే వుంది గానీ ఆమెకు తీరిగ్గా చెప్పేంత తీరికలేదు (8వ భాగం).’ మనం వినేంత ధైర్యం కథకుడికే లేదు అనవచ్చు. ఆ విషయం అలా వుంచితే ఈ నవలలో రచయిత పాత్రలకు చెందిన ప్రాంతాల, కులాల, సామాజిక స్థితుల, మానసిక, లైంగిక ప్రపంచాల అంచుల్లో పాఠకుడిని తిప్పుతాడు. తద్వారా ఆయా అంశాలను గురించిన లోతయిన వివరణలు పాఠకుడు కోరుకుంటాడు. ఆ కోరిక పాఠకుడు నవలను మరింత ఆసక్తిగా చదవటానికి పురికొల్పుతుంది.

కళాకారుల్లో బ్రాహ్మణులు/దేవదాసీలు అనే వర్గీకరణ అనివార్యంగా దేవదాసీలను ద్వితీయం చేసింది. నిజానికి దేవదాసి అనే పదం వర్గీకరణ పరమయింది. బ్రాహ్మణీయ వ్యవస్థ దేవదాసీని ఇతరులుగా (others) మార్చింది. దేవదాసిగా వుండటం అంటే గౌరవప్రదమయిన జీవితాన్నించి దూరమయి వుండటమేననే భావనను బలపర్చుతూ వచ్చింది. ప్రధాన ప్రవచనాలలో (Discourses) దేవదాసీలకు చోటు లేకుండా చేయాలని ప్రయత్నించింది. ప్రముఖ ఫ్రెంచి తాత్వికుడు తూకే (Toucault) భాషలో ‘Proprietorship of discourse’ అనేది వాళ్ళకు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమాన్ని సవాలు చేసే ప్రకటనలు ఈ నవలలో అనేకచోట్ల కన్పిస్తాయి. ఉదాహరణకు తంజావూరు భాగ్యలక్ష్మి ఇలా అంటుంది: “యిప్పుడు మనల్ని జూసి పోటీపడుతూవుండే యీ బ్రాహ్మణ ఆడవాళ్ళు, మగవాళ్ళూ యెన్ని జన్మలెత్తినా మన యెత్తు పెరగలేరు. వాళ్ళంతా పులిని జూసి వాతలేసుకుంటూ వుండే నక్కలు మాత్రమే.” (p.149)

స్త్రీలను ఏ విషయం మాట్లాడకుండా మౌనం (silence) వహించేటట్లు చేయగలగటం పితృస్వామ్యం చేసిన దారుణాల్లో చాలా ప్రముఖమైనది. ఎందుకంటే మౌనంలోనే వాళ్ళ అస్తిత్వం. పితృస్వామ్య అధికారం, భాష అన్నీ కూడా ఈ మౌనాన్ని మరింతగా స్థిరీకరింపజేస్తాయి. స్త్రీల మౌనం పురుషుడివి బలోపేతం చేస్తుంది. అయితే ఈ నిర్ధారణ దేవదాసి స్త్రీలకు వర్తించదు. స్థూలంగా పితృస్వామ్య ఆధిపత్యం దేవదాసీ వ్యవస్థ ఏర్పడటంలో, కొనసాగించటంలోనూ పున్నప్పటికీ ఆచరణలో దేవదాసీలు ఏదో ఒక స్థాయిలో తమ మౌనాన్ని ఛేదించి తమని తాము నిర్ధారించుకోగలిగారు. అందుకు ఈ నవలలో అనేకమంది సాక్ష్యం. నామమాత్రపు స్వయంప్రతిపత్తయినా దేవదాసీలలో కన్పిస్తుంది. అది బ్రాహ్మణ స్త్రీలలో శూన్యం. సాధికారీకరింపబడిన సామాజిక కుటుంబ సంబంధాల వెలుపల జీవించే దేవదాసీలకు ప్రేమ, సెక్స్, మొదలైన విషయాలలో ఏదో ఒక స్థాయిలో స్వేచ్ఛాపూరితంగా వుండగలిగే అవకాశం వుంటుంది. అదే విషయాన్ని ఈ నవలలో అనేకంగా వున్నా దేవదాసీ పాత్రలు రుజువు చేస్తాయి.

సమకాలీన సమాజంలో చరిత్ర, చరిత్రకారులు చరిత్రను రాయటంలో నిరాపేక్షత (objectivity) వుంటుందనే భావనలు సమస్యాత్మకం చేయబడ్డాయి. ముఖ్యంగా ఆధునికానంతర చరిత్రకారులు – చరిత్రను రాయటంలో చరిత్రకారులు పూర్తిస్థాయిలో ఎటువంటి రాగద్వేషాలు లేకుండా వుంటారనేది వాస్తవం కాదని, అందువల్ల వాళ్ళ ఇష్టాలు వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న చరిత్రలో ఏదో ఒక రూపంలో ప్రతిఫలిస్తాయని అంటారు. సహజంగానే చరిత్రకు ఇప్పటిదాకా ఇవ్వబడిన శాస్త్రీయత, వస్తుగతత్వం అనేవి అలా నిరాకరింపబడ్డాయి. అలాగే అందులో వుండే ఆత్మాశ్రయత (subjective) అంశాన్ని, బహిరత్వాన్ని లేక బహుళ వ్యాఖ్యానాల అవకాశాన్ని నొక్కి చెప్పటం జరిగింది. ఈ సందర్భంలో ప్రముఖ ఆధునికానంతర చరిత్రకారుడు హేడెన్ వైట్ (Hayden White) అన్న మాటలు కొంత విస్తృతంగా వున్నా ఉదహరించటం అవసరం. ఆయన ఇలా అంటాడు:

Michel de Certeau maintained that “fiction is the repressed other of historical discourse.” Why? Because historical discourse wages everything on the true, while fictional discourse is interested in the real – which it approaches by way of an effort to fill out the domain of the possible or imaginable. A simply true account of the world based on what the documentary record permits one to talk about what happened in it at particular times, and places can provide knowledge of only a very small portion of what ‘reality” consists of. However, the rest of the real after we have said what we can assert to be true about it, would not be everything and anything we could imagine about it. The real would consist of everything that can be truthfully said about its actuality plus everything that can be truthfully, said about what it could possibly be something like this may have been what Aristotle had in mind when, instead of opposing history to poetry, he suggested their complementarity, joining both of them to philosophy in the human effort to represent, imagine and think the world in its totality, both actual and possible, both real and imagined, both known and only experienced. (Introduction: Historical Fiction, Fictional History, and Historical Reality, in Rethinking History, Vol. 9, No.2/3, 2005, p. 147)

చరిత్రకుండే సాహిత్య లక్షణం అనివార్యంగా దాన్ని గురించిన బహుళ వ్యాఖ్యానాలకు అవకాశం ఇస్తుంది. దీని ఫలితం చరిత్రకారుడు లేక రచయిత అనే వ్యక్తి పక్కకు నెట్టబడి పాఠకుడు ముందుకువస్తాడు. ఆ క్రమంలో ఒక సన్నివేశానికి సంబంధించిన బహుళ వ్యాఖ్యానాలు ముందుకు వస్తాయి. ఈ నవలలో చారిత్రక అంశాలకు వైయక్తిక అంశాలను జతచేసి చెప్తాడు రచయిత. అనేకమంది దేవదాసీలు ఆవిష్కరించిన తమ వైయక్తిక అనుభవాలలో చారిత్రక అంశాలు కూడా చూపబడ్డాయి. అలాగే ఆయా సందర్భాలలో అమలయిన రాజకీయ, వైతిక ప్రతిమానాలు (paradigms) కూడా బహిర్గతం చేయబడ్డాయి. ఈ రచయిత ఈ నవలలో చాలా సమర్థవంతంగా చారిత్రక- వైయక్తిక అంశాలను సమ్మిళితం చేసి చిత్రించాడు. సల్మాన్ రూష్దీ తన నవలలో (Midnight’s Children) Memory’s Truth అనే భావనను వాడతాడు. జ్ఞాపకం అనేది తనదైన ‘నిజా’న్ని ముందుకు తెస్తుందంటాడు. ఈ తెచ్చే క్రమంలో జ్ఞాపకం ఆ ‘నిజా’న్ని ఎన్నిక చేసుకుంటుంది. మార్పుకు గురిచేస్తుంది. కొన్నింటిని తొలగిస్తుంది. అతిశయోక్తుల్ని జోడిస్తుంది. అంతిమంగా తనదైన వాస్తవికతను నిర్మిస్తుంది అంటాడు రూష్దీ. సరిగ్గా ఈ నవలలో తమ స్వగతాల్ని చెప్పటంలో ఆయా పాత్రలు పాఠకుల ముందుంచింది ఈ జ్ఞాపకాల నిజాన్నే.

ఈ నవల కాలసంబంధంగా 1899 కుముదవల్లి పుట్టుకతో మొదలై 2020లో నాగలక్ష్మి మునిమనవరాలు నాగలక్ష్మి నటరాజన్ సంగీత కచేరి మొదలుకావటంతో ముగుస్తుంది. దాదాపు 130 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనల్ని కాల్పనిక దృష్టితో ఆవిష్కరించింది. అదే సందర్భంలో 7వ శతాబ్దం నుంచి ఇప్పటి దాకా దక్షిణ భారతదేశంలో దేవదాసీ వ్యవస్థ దానిపట్ల ప్రజల, ప్రభుత్వాల వైఖరి మొదలైన వాటి గురించిన నిర్దిష్ట చరిత్ర సందర్భాలను, సన్నివేశాలను, వ్యక్తులను నేపథ్యంలో రేఖామాత్రంగా రచయిత ప్రస్తావిస్తూ వచ్చారు. నవలలో ప్రతి భాగం మొదలు కావటానికి ముందు ఆ పాత్రకు వున్న చారిత్రక నేపథ్యాన్ని రచయిత వివరిస్తాడు. అంటే చారిత్రిక కథనం (historical narrative) అనేది కాల్పనిక కథనానికి (fictional narrative) సమాంతరంగా నడుస్తూ వస్తుంది. చరిత్ర జరిగిన సంఘటనల ప్రస్తావన రికార్డుగావుంటే, కాల్పనిక సాహిత్యం ఈ చరిత్రలో జరిగిన సంఘటన గురించిన ఊహగా వుంటుంది. అలాగే జరగని, జరిగి వుండటానికి ఆస్కారం వున్న సంఘటనల ప్రస్తావనగా కూడా వుంటుంది. ఊహ మీద ఆధారపడి చేసే రచనలు వాస్తవికత నుంచి దూరమయ్యే స్థితి రచయితకి అనివార్యంగా ఎదురవుతుంది. అలా దూరం కావటం అనేది రచయిత ఇచ్ఛాపూర్వకంగా కూడా చేయవచ్చు. అసలు చరిత్ర అనేదే కథన రూపం (narrative form) తప్ప చరిత్రకు సంబంధించిన సత్యం (Truth) గురించిన రికార్డు కాదంటాడు హేడెన్ వైట్. అలాగే చరిత్ర రచనలో అనివార్యంగా ఆలంకారికత, రూపకాలు కూడా వుంటాయి. అలా చూసినప్పుడు కాల్పనిక సాహిత్యం ఈ విషయంలో మరింత ఆలంకారికంగా, భావుకతతో నిండి వుంటుంది. ఫలితంగా ప్రామాణికత అనేదానిని నిర్మించటం కుదరదు. నరేంద్ర చాలా స్పష్టంగా తన ‘మనవి’లో ఇలా చెప్పుకున్నాడు: ‘యిందులోని ప్రధాన పాత్రలతో పాటు, మిగిలిన అన్ని పాత్రలకు చారిత్రక మూలాలున్నాయి గానీ అవేవి చారిత్రక వ్యక్తులుగావు. జరిగిన సామాజిక చరిత్రకు ఆధారాలున్నాయిగానీ, ఆయా పాత్రల జీవితాల్లో జరిగిన సంఘటనలకు సాక్ష్యాల్లేవు, అందుకే ఈ పాత్రలన్నీ చరిత్రలోని వ్యక్తుల్లా గాకుండా, కాల్పనిక పాత్రలకున్న జీవన పార్శ్వాలనంతా తొడుక్కొని నవలా ప్రపంచంలోకి నడచివచ్చాయి.

చారిత్రక నవలకు చరిత్రలో ఒక నిర్దిష్ట కాలం భూమికగా వుంటుంది. రచయిత ఆ కాలపు చేతనాల్ని, పద్ధతుల్ని, సామాజిక స్థితిగతులు వీలున్నంత authenticగా ప్రయత్నించాలి. ఈ విషయంలో నరేంద్ర విజయవంతమయ్యాడు. చరిత్రను, కథనాన్ని, వాస్తవాన్ని, కాల్పనికతను శక్తివంతంగా సమ్మిళితం చేసి చిత్రించాడు.

ఈ నవలలో ప్రధానపాత్ర నాగలక్ష్మి. ఈ నాగలక్ష్మి వర్తమాన సంగీత ప్రపంచంలో మనకు పరిచితమయిన సంగీతకారురాలు జీవితం ఆధారంగా రూపొందిందని నవలలో మనకు చాలా సులభంగానే తెలిసిపోతుంది. అయితే రచయిత ఎక్కడ కూడా ఆ పాత్రని ప్రత్యక్షంగా మాట్లాడనివ్వలేదు. నాగలక్ష్మి పాత్ర మొత్తం ఆమెకు పరిచయమున్న వ్యక్తుల జ్ఞాపకాల్లోంచి మాత్రమే మనకు చూపుతాడు. ఇది శైలీపరంగా ఒక విలక్షణత, అన్ని పాత్రలు తమ గురించి తాము చెప్పుకుంటాయి. నాగలక్ష్మి గురించి మాత్రం వేరే పాత్రలు చెపుతూవుంటాయి. అంటే నాగలక్ష్మి జీవితాన్ని గురించిన అనేక కథనాలు (versions) మనకు ఈ నవలలో విభిన్న పాత్రలు ఇస్తాయి. అసలు నాగలక్ష్మి తన గురించి తాను ఏమనుకున్నది. తన జీవితాన్ని గురించి తాను ఏ విధంగా ప్రతిఫలించుకున్నదీ మనకు తెలియదు. అందువల్ల ఆ పాత్ర మనకు కొంతవరకు విస్మయంగా (enigmatic) అన్పిస్తుంది. అయితే నాగలక్ష్మి పాత్ర గురించి మిగతా పాత్రలు చేసిన విశ్లేషణలు నిర్ధారణలు నిజాయితీతో వున్నాయనిపించటం వల్ల మనకు మనంగా ఆ పాత్ర గురించి, ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని గురించి ఒక అంచనాకు వచ్చే ఆస్కారం వుంది. అలాగే నాగలక్ష్మి వ్యక్తిత్వంలో వుండే వైరుధ్యాల్ని కూడా ఈ నవలలో కొన్ని పాత్రల చేత చెప్పించటం జరిగింది. ఉదాహరణకు అర్ముగాంబ ఇలా అంటుంది: “యీ నాగలక్ష్మికేమయిందనేది నా ప్రశ్న. ఆమె కూడా నాలాగే ఈ దుర్మార్గపు దేవదాసీ కులంలో పుట్టిందిగదా! ఆమెకు తన వాళ్ళయిన ఆడవాళ్ళంతా యిబ్బంది పడుతున్నారనే విషయం పట్టనే పట్టదు. నేనొకవైపు దేవదాసీల ఇళ్ళకే వెళ్ళి, వాళ్ళుండే ఆలయాలకు వెళ్ళి విమోచన సంఘాలూ సభలకు వెళ్ళి దేవదాసీ రద్దు చట్టాన్ని తేవాలని శతవిధాల పనిచేస్తూవుంటే, నాగలక్ష్మి మాత్రం కాంగ్రెస్ వాళ్ళకోసం సంగీత కచేరీలు చేస్తానంటుంది. రోమ్ నగరం తగలబడి పోతూవుంటే నీరో చక్రవర్తి యిలాగే ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడు.” (p.292)

అలాగే ఉత్తర భారతం నుంచి నాగలక్ష్మికి హిందూస్తానీ సంగీతం నేర్పటానికి వచ్చిన జ్ఞానేశ్వరీదేవి నాగలక్ష్మి గురించి అనుకున్న మాటలు కూడా ఒకరకంగా నాగలక్ష్మి వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి ఉపయోగపడతాయి. ఆమె ఇలా అంటుంది: “యీమెలో యిద్దరు మనుషులున్నారని యిక్కడికొచ్చిన కొద్ది రోజుల్లోనే కనిపెట్టేశాను. మామూలుగా వున్న మనిషి పాడ్డం ప్రారంభించిన కాస్సేపటికంతా మాయమైపోతుంది. తరువాత ఆ రెండో మనిషి చురుగ్గా ఆమెలో చేరుకుంటుంది… యిలా తాను యీ లోకపు గొడవల్లో నుంచి గానం ద్వారా పారిపోతున్నానని ఆమెకు తెలియదుగానీ, ఆ పలాయనాన్ని ఆమె యెంతో ప్రేమిస్తోంది… నాగలక్ష్మి జీవితం ఈ రెండు లోకాల మధ్య లోలకంలా వూగుతోంది.“(p.330)

తన పెళ్ళాడిన విశ్వనాథన్ నీడలా మారిపోయిన నాగలక్ష్మి విపరీతమయిన పేరు ప్రఖ్యాతలు వచ్చిన తరువాత కూడా మదురై రత్నమాల అన్నట్టు పెళ్ళి చేసుకుని నాగలక్ష్మి తన చేతులారా తన స్వాతంత్ర్యాన్ని ఆ మొగుడికి ఎందుకప్పగించింది? అలాగే అభిరామసుందరి అభిప్రాయపడినట్టుగా తనను పెళ్ళి చేసుకున్నప్పుడే పిల్లలు పుట్టకుండా నాగలక్ష్మి భర్త విశ్వనాథన్ ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసి నాగలక్ష్మి మౌనంగా ఎలా వుండగలిగింది? అలాగే నాగలక్ష్మి తన ఆత్మని మొత్తాన్ని ఎలా అణిచివేసుకోగలిగింది? దీపాచంద్రన్ అభిప్రాయపడినట్టుగా ‘మగవాడి నిరంకుశత్వానికి తలవంచిన భీరత్వం’ ఆమెలో ఎలా ఏర్పడింది? అలాగే ఈ నవలలో నాగలక్ష్మి తల్లి కుముదవల్లి నుంచి తన మునిమనవరాళ్ళుగా భావించినవాళ్ళు వేసిన అనేక ప్రశ్నలకి రచయిత రేఖామాత్రంగానయినా సమాధానాలు చెప్పించగలిగినట్లయితే నాగలక్ష్మి పాత్ర మరింత సజీవంగా వుండేది. అలాగే నాగలక్ష్మి పాత్ర మరణాన్ని గురించి ఒక వాక్యంలో చెప్పించటం కూడా పాఠకులకి నచ్చదు. చారిత్రక నవల గురించి డేనియల్ జస్ట్‌ (Daniel Just) అనే విమర్శకుడు అన్నమాటలు ఈ నవల విషయంలో కూడా నిజాలు:

Literature, although it does not present itself as a work of history, is a poetic mediator of historical understanding in its own manner. Both the historical novel, which complements historiography by capturing the past in its sensual detail, and other fiction, which utilizes historical material in a more creative fashion, make the past alive and contemporaneous to the present via the poetic operation (The poetics of Elusive History: Marguerite Duras, War Traumas, and the Dilemmas of Literary Representation Author(s), The Modern Language Review, Vol. 107, No. 4 (October 2012), p. 1064).

ఆ విషయాలు అలా వుంచితే ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన నవలల్లో మనోధర్మపరాగం అత్యంత గొప్ప నవల అని చదివినవాళ్ళు ఎవరయినా వొప్పుకుంటారు. ఈ నవలకున్న మహాకావ్య (epic) లక్షణాల్ని ఎవ్వరయినా అంగీకరిస్తారు.

[23 ఆగస్ట్ 2021, ఆంధ్రజ్యోతి దినపత్రిక వివిధ విభాగంలో ప్రచురించబడిన వ్యాసపు సమగ్రరూపం ఇది, కొన్ని మార్పులతో – సం.]