సార్థకనామ వృత్తములు – 2

పరిచయము

బడిలో చదువుకొనేటప్పుడు మనము ఉత్పలమాలకు గణములు భ/ర/న/భ/భ/ర/వ, శార్దూలవిక్రీడితమునకు గణములు మ/స/జ/స/త/త/గ, ఇలా చదువుకొని జ్ఞాపకములో పెట్టుకొనేవాళ్ళము. ఒక్కొక్కప్పుడు అనిపించేది మఱేదైనా సులభ మార్గము ఉంటే బాగుంటుందని. అనగా వృత్తపు పేరులోనే ఈ సమాచారము దాగి ఉంటే బాగుంటుంది కదా? హిందీలో ఛందఃప్రభాకర వంటి గ్రంథములలో లక్షణపద్యముల ప్రారంభములో ఈ గణముల పేరులో చెప్పినారు. అలాటిది తెలుగులో మత్తేభవిక్రీడితమునకు నేను ఒక పద్యమును కల్పించినాను. ఆ పద్యము:

సభ రానిమ్ము యువాంగినిన్ రయముగా – సద్ధర్మనిష్ణాతుఁడౌ
శుభయోగీంద్రు ననుంగు కూతురికి నీ – సుస్వాగత మ్మిమ్ము, యీ
ప్రభు వే వేళల సత్యసంధుఁడు ప్రజన్ – రక్షించుఁ దా మఱ్వఁ డా
నభ మందెప్పుడు వర్ణమయమౌ – నక్షత్రముల్ సాక్షిగా

ఇందులో స/భ/ర/న/మ/య/వ గణములు వరుసగా మొదటి కొన్ని అక్షరములుగా వచ్చాయి. ఇలా వ్రాయుట కొద్దిగా కష్టము. అంతే కాక గణసూత్రమునకు బదులు పద్యమును జ్ఞప్తిలో నుంచుకోవాలి. కాని సార్థకనామ గణాక్షర వృత్తములలో ఈ ఇబ్బంది ఉండదు. గణముల పేరులు వృత్తముల పేరులో ఉంటాయి. తెలుగు ఛందస్సులో ఎనిమిది త్రిక గణములను (మ, భ, జ, స, న, య, ర, త), రెండు ద్వ్యక్షరగణములను (వ, హ), తఱువాత గురు లఘువులను (గ, ల) వాటి అక్షరములచే గుర్తు పట్ట వీలగును. అంతే కాక రెండు గురువులను గా అని కూడ లాక్షణికులు సూచించినారు తమ పద్యములలో. హేమచంద్రుని ఛందోనుశాసనములో గుణింతములను గణముల సంఖ్యగా కొన్ని చోటులలో ఉపయోగించబడినది. కొన్ని ఉదాహరణములు – సీస్తోటకమ్ (సీ – నాలుగు సగణములు), తీః కామావతారః (తీ – నాలుగు తగణములు), రీః స్రగ్విణీ (రీ – నాలుగు రగణములు), భీగావంగరుచిః (భీ – నాలుగు భ-గణములు, తఱువాత ఒక గురువు), నీగౌ త్వరితగతిః (నీ – నాలుగు నగణములు, తఱువాత ఒక గురువు), నీసౌ శశికలా (నీ – నాలుగు నగణములు, తఱువాత ఒక సగణము), భుగౌ సంగతమ్ (భు – ఐదు భగణములు, తఱువాత ఒక గురువు), న్జభజిరా సిద్ధిః (న,జ,భ, జి- మూడు జగణములు, తఱువాత ఒక రగణము – ఇది చంపకమాల లక్షణము), ఇత్యాదులు. ఇలా అక్షరముల గుణింతములను ఉపయోగించి కొన్ని నూతన వృత్తములను కల్పించవచ్చును. అలా చేసినప్పుడు మనకు ఒక అర్థవంతమైన పదము దొఱకినప్పుడు, ఆ పదము పేరుగా గలిగిన వృత్తమునకు గణములను జ్ఞాపకముంచుకొనుట సులభమవుతుంది. ఇట్టి వృత్తములను సార్థకనామ గణాక్షర వృత్తములని నేనుపిలుస్తాను. ఇలా ప్రయోగము చేసి కల్పించిన 60 వృత్తములను ఇంతకుముందే ఇక్కడ ప్రచురించియున్నాను. ఇప్పుడు ఇంకొక 60 వృత్తములను మీకు పరిచయము చేస్తున్నాను. వీటిలో కొన్నింటిని ఇంతకు ముందే లాక్షణికులు వేఱు నామములతో తెలిపియున్నారు. పాదములో తక్కువ అక్షరములనుండి ఎక్కువ అక్షరములవఱకు వరుసగా వీటిని పేర్కొన్నాను. అందులో కొన్ని లయ వృత్తములు కూడ.

61. నవ (అభిముఖీ, కమలముఖీ, ధృతి, మృగచపలా): న/లగ IIIIU 5 సుప్రతిష్ఠ 16
భవనములో
రవములతో
నవనవమై
కవనములే

62.జయ (అరజస్కా): జ/య IUII UU 6 గాయత్రి 14
జయా యని పిల్వన్
జయమ్ముల నిచ్చున్
బ్రియా యని పిల్వన్
బ్రియమ్ముగఁ బల్కున్

63.యాగ (అభీక): య/య/గ IUU IUUU 7 ఉష్ణిక్కు 10
అభీకుండు నీవేనా
ప్రభాతాన నీ సృష్టిన్
ప్రభూ నేను కావ్యమ్మా
శుభాంతమ్ము యాగమ్మా
(అభీకుడు = నిర్భయుడు)

64. హవ్య (భర్గ, హోడపదా): హ/వ/య – UII UI UU 7 ఉష్ణిక్కు 23
సంబర మెల్ల నేఁడే
యింబుఁ బతంగ బృంద
మ్మంబరమందు నాడెన్
రెంబలఁ బూలవోలెన్
(ఇంబు = ఇంపు)

65.జాల (ఉపోదరి): జ/జ/ల IUII UII 7 ఉష్ణిక్కు 110
పదమ్ముల జాలము
ముదమ్ముల మేలము
హృదిన్ గల తాళము
సదాశివ మూలము

66. నవలా (వాసకి): న/వ/(ల)2 – న/జ/ల IIII UII 7 ఉష్ణిక్కు 112
కన నవలా నిను
మనమున గానము
దినమును రాత్రియు
ననయము మ్రోఁగెను
(నవలా = స్త్రీ)

67. సర్వ (శల్లకప్లుత): స/ర/వ – స/ర/లగ IIU UI UIU 8 అనుష్టుప్పు 84
జయముల్ గల్గు నీకు నా
భయముల్ బాప రమ్ము ని-
శ్చయమై సర్వ విఘ్నముల్
దయతో నాపు శాంకరీ

68.జన్మ: జ/న/మ IUII II UUU 9 బృహతి 62
స్ఫురించెను మృదు తానమ్ముల్
స్మరించితిఁ బలు నామమ్ముల్
వరించితి హరి రూపమ్మున్
తరించిన దొక జన్మమ్మే

69. నామ (భుజగశిశుభృతా): (న)2/మ – న/న/మ IIIIII UUU 9 బృహతి 64
పొగడఁ దరమె నామమ్మున్
నగవు విరుల దామమ్మున్
సొగసు వెలుఁగు ధామమ్మున్
జగతి కొసఁగు ప్రేమమ్మున్

70. నవలయ (శరలీఢా): న/వ/ల/య – న /జ/య IIII UII UU 9 బృహతి 112
నవలయ వృత్తము నీకే
భవ మను పొత్తము నీకే
రవములు క్రొత్తవి నీకే
శివమయ చిత్తము నీకే

71. రాస: (ర)2/స – ర/ర/స UIU UIU IIU 9 బృహతి 211
వృత్తకేంద్రమ్ములో హరియే
నృత్తకేంద్రమ్ములో హరియే
చిత్తకేంద్రమ్ములో హరియే
మొత్తమై రాస మా హరియే

72. భాస (ప్రియలతికా): భ /భ/స UIIU IIIIU9 బృహతి 247
భాసముతోఁ బ్రియలతికా
వాసము చేయఁగ నిట రా
హాసముతో నవకుసుమా
రా సరసన్ రసమయమై

73. భరత: భ/ర/త UII UI – UUUI 9 బృహతి 279
శోభల నిండు – సొంపై యుండు
వైభవ దీప్తి – ప్రాగ్భూజ్యోతి
ఈ భరతమ్ము – హృద్రాగమ్ము
శ్రీ భగవంత, – శ్రీలందిమ్ము

74. హరహర (కర్ణపాలికా, పంక్తికా, మరాళికా, మౌక్తిక): హ/ర/హ/ర – ర/య/జ/గ UIUIU – UIUIU 10 పంక్తి 331
సోమసుందరా – సోమశేఖరా
రామపూజితా – రామకా ధృతీ
కామనాశనా – కామితార్థమై
శ్రీమహేశ్వరా – క్షేమ మీయరా

75. మల్హార (విరాట్టు): మ/(ల)2/హ/ర – మ/స/జ/గ UU UII – UIUIU 10 పంక్తి 345
రా మల్హారపు – రాగగీతిగా
రా మాణిక్యపు – రమ్య కాంతిగా
రా మంద్రానిల – రాగగంధమై
రా మై పొంగ వి-రాట్స్వరూపమై

76. తమాల: త/(మ)2/ల – త/మ/మ/ల UUI UU – UU UUI 10 పంక్తి 517
హా, యా తమాల – శ్యామాకారమ్ము
నా యీ యెడందన్ – నాట్యమ్మాడంగఁ
గాయమ్ము పొంగెన్ – గాలమ్మో నిల్చె
నాయాశ తీవల్ – నవ్యమ్మై మొల్చె

77. రసాల: ర/స/స/ల UI UII – UII UI 10 పంక్తి 731
నిన్న జూచితి – నీ సరసాల
నిన్ను జూచితి – నీకు రసాల
మన్న దొప్పిద-మైన పదమ్ము
చెన్నుగా నిటఁ – జెంతకు రమ్ము

78. వాగ్భామ: (వ)2/(గ)2/భ/మ – జ/మ/భ/మ12 జగతి 390 IUI UUU – UII UUU
వరాల వాగ్భామా – పల్కుల పొత్తమ్మా
స్వరాల సామ్రాజ్ఞీ – సత్యఁపు చిత్తమ్మా
విరాట్స్వరూపమ్మా – విద్యల దైవమ్మా
వరమ్ము లీయంగా – భారతి రావమ్మా

79. సజయా: స/జ/(య)2 – స/జ/య/య IIUI UII – UUI UU 12 జగతి 620
సజయా యనంగను – సంతోషమై యా
వ్రజమందు గానము – వ్యాపించుఁ గాదా
యజరమ్ము హాసము – లానంద దీప్తుల్
విజయోత్సవమ్మున – వ్రేపల్లె వెల్గెన్

80. తనయా: త/న/(య)2 – త/న/య/య UUI IIII – UUI UU 12 జగతి 637
ఆనంద వరతన-యా పూల బాలా
కానంగ మనసును – కవ్వించు హేలా
యీ నాకు ప్రియమగు – హృత్పద్మమాలా
వేణూ నినదముల – ప్రేమాగ్నికీలా

81. భ్రమర: భ/ర/మ/ర UII UIU – UUU UIU 12 జగతి 1047
రాగము నిండెఁగా – రమ్యాకాశమ్ములో
రాగసుధానిధీ – రావా నా గానమై
మూఁగగ డెందమే – మ్రోఁగేనే వీణగా
వేగము వత్తువా – ప్రేమాబ్ధిన్ మున్గెదన్

82. తారా: (త)2/(ర)2 – త/త/ర/ర UUI UUI – UIU UIU 12 జగతి 1189
తారాసమూహమ్ము – ధ్వాంతమం దందమై
యీరాత్రి వెల్గంగ – నెన్నియో యాశలే
నారాజు వేగమ్ము – నన్ గనన్ వచ్చునో
గారాన ముద్దాడి – కాన్క లందిచ్చునో

83. భారత: (భ)2/ర/త – భ/భ /ర/త UII UII – UIU UUI 12 జగతి 2231
భారతదేశము – భవ్యమై సాగంగ
కీరితి టెక్కెము – కేలలో నూఁగంగ
హారతు లీయఁగ – హాయిగా నుండంగ
కోరుద మెప్పుడు – కోరికల్ నిండంగ

84. నాన్న (తరలనయన): (న)2/న/న – న/న/న/న, యతి (1, 7) IIIIII – IIIIII 12 జగతి 4096
తడబడుచును – ధరఁ బడగను
గడు ముదమునఁ – గరముల ననుఁ
బుడమినిఁ గడు – పులకల నిడ
నడిపితివయ – నను వదలక

85. లాలసరాగ: (ల)2/ల/స/(ర)2/గ – న/స/ర/ర/గ III IIU – UIU UIUU 13 అతిజగతి 1184
లలన హృదిలో – లాలసార్ద్రా సరాగా
మొలచె వలపుల్ – మోహనాంగా పరాగా
చెలువ మలరన్ – జేర రావా చెలిన్, నా
కలలు నిజమై – కన్నులన్ దోఁచుఁ గాదా

86. రాగవల్లి: (ర)2/గ/వ/(ల)3/ల – ర/ర/ర/న/ల UIU UIU – UIU IIII 13 అతిజగతి 7827
రాగవల్లీ సదా – రమ్య రాగనిలయ
భోగమల్లీ సఖీ – మోహ మోదవలయ
వేగ రావే దరిన్ – బ్రేమవిశ్వవిజయ
యోగవేళన్ మన – మ్మూయె లూఁగ సదయ
(ఇది తేటగీతికి కూడ సరిపోతుంది)

87. నల్లనయ్య: న/ల/ల/న/(య)2 – న/న/న/త/గగ III III III – UUI UU 14 శక్వరి 2560
ఉదధి యగుచు హృదయ – మో నల్లనయ్యా
యదరి పడెను గదర – యందాల నెయ్యా
నిధులు వలదు నిజము – నీవుండ దేవా
ముదము లొలుకు మురళి – మ్రోఁగించ రావా

88. హీరా: (హ)4/(ర)2 – ర/జ/ర/య/లగ UI UI UI UI – UIU UIU 14 శక్వరి 4779
రమ్ము దేవి యిందిరా వ-రమ్ము లీయంగ రా
సొమ్ము నీవె మాకు సోమ-సోదరీ సుందరీ
యమ్మ రావె నమ్ముచుంటి – మమ్మ నిన్నే సదా
యిమ్ము శాంతి నింట, వద్దు – హీరముల్ హారముల్

89. భాస్వర: (భ)2/స/వ/ర – భ/భ/స/య/లగ UII UIIII – UI UUIU 14 శక్వరి 4855
కానఁగ నంబరమునఁ – గాంతి శోభిల్లెఁగా
నా నవ భాస్వరముఖ – మందమై వెల్గెఁగా
వీనుల సుస్వరములు – వెచ్చఁగాఁ దాఁకెఁగా
మానసమందునఁ బలు – మాధురుల్ బ్రాకెఁగా

90. సలిలనాగ: స/(ల)3/ల/(న)2/గ – స/న/న/న/లగ, యతి (1, 8) IIU IIII – IIII IIU 14 శక్వరి 8188
అరుణోదయమున – హరుసపు సరసిన్
సరసీరుహముల – చలనము సొబగుల్
విరు లా వనమున – వికచము సరసా
సరసన్ బరుగిడి – చకచక కనరా

పై పద్యము కంద పద్యముగా –
అరుణోదయమున హరుసపు
సరసిన్ సరసీరుహముల – చలనము సొబగుల్
విరు లా వనమున వికచము
సరసా సరసన్ బరుగిడి – చకచక కనరా

91. తన్వి: త/(న)3/వ – త/న/న/న/లగ UUI IIII – III IIIU 14 శక్వరి 8189
సాయంసమయమున – సరస గతులతో
మాయామయ మగును – మనసు స్మృతులతో
వ్రాయంగను గవిత – వఱలె తరఁగలై
ప్రాయమ్మున గలల – వఱద నురఁగలై

92. నాగానన: (న)2/(గ)2/న/న – న/న/త/న/లల IIII IIU – UII IIII 14 శక్వరి 16192
కరుణను గను నా-గానన సతతము
శరణని యనెదన్ – స్కంధుని సహజుఁడ
వర సుర వినుతా – వందనములఁ గొను
హరుని తనయుఁడా – హర్షము నొసఁగఁగ

93. నిగ్గు: (న)3/(గ)5/గ – న/న/న/మ/మ III III III – UU UU UU 15 అతిశక్వరి 512
మిలమిలమని మెరిసె – మింటన్ బారుల్ దారల్
తళతళమని వెలిఁగెఁ – దారాజువ్వల్ నేలన్
కిలకిలమని నగిరి – కేళిన్ బాలల్ లీలన్
కలకలమున గదలెఁ – గాంతుల్ నిగ్గుల్ మ్రోతల్

94. మల్లారి: మ/(ల)2/ల/(ర)3 – మ/న/ర/ర/ర UUU III UI – UUI UUIU 15 అతిశక్వరి 9401
మల్లారీ మనవి నీకు – మన్నించి మమ్మేలుమా
ఫుల్లమ్మౌ మనమునందు – మోదమ్ము చిందించుమా
మెల్లంగాఁ బలుకనిమ్ము – మేలైన వంశీధ్వనుల్
చల్లంగా సరస రమ్ము – సౌందర్య మందారమై

95. తామరస: (త)2/మ/ర/స – త/త/మ/ర/స UUI UUI UU – UUI UIIU 15 అతిశక్వరి 13349
నందమ్ముగా నిందుఁ బూఁచెన్ – నవ్వించఁ దామరస
మ్మందమ్ముగా నాకుఁ దోఁచెన్ – హ్లాదంపు సోమరస
మ్మందించె నేదేవుఁడో యూ-హాతీత మీ క్షణమే
సౌందర్య గీతమ్ము లేచెన్ – ఛందమ్ము లారవమే

96. భాతి: (భ)2/(త) 3- భ/భ/త/త/త UII UII – UUI UUI UUI 15 అతిశక్వరి 18743
రంగులె యెల్లెడ – రాజిల్లు రత్నాలొ వజ్రాలొ
పొంగెను ధారుణి – మోదాల నాదాల నందాల
బంగరు శోభల – భాసిల్లి నర్తించె శ్రీదేవి
నింగియు నేలయు – నిండెన్ గదా భాతితో నేఁడు

97. సనాతన: స/(న)2/త/న – స/న/న/త/న IIUI IIIII – UUI III 15 అతిశక్వరి 31228
వసివెల్గు కిరణముల – వక్త్రమ్ము, రుచిర
హసనా తనరె జగము – హ్లాదమ్ము నెఱయ
రసరాస కళిక కడు – రమ్యమ్ము నుడువ
మిసిమించు రజని యిది – మృష్టమ్ము హృదియు

98. రాసలీలా: (ర)2/స/(ల)4/(ల)2 – ర/ర/స/న/న UIU UIU – IIUI IIIII 15 అతిశక్వరి 32467
మాధవా రా దరిన్ – మనసెల్ల రసమయము
శ్రీధరా రా దరిన్ – సిరులెల్ల శివమయము
యాదవా రా దరిన్ – హరుసమ్ము సుఖమయము
భూధరా రా దరిన్ – భువనమ్ము శుభమయము

99. భవభయహర: భ/వ/భ/య/హ/ర – భ/య/న/మ/జ/గ, అక్షరసామ్య యతి (1, 8), ప్రాసయతి (1, 11) UIII UUI – IIU – UUI UIU 16 అష్టి 20943
భావముల కర్థమ్ము – వరదా – నీవంచు నమ్మితిన్
జీవముల కర్థమ్ము – శివుఁడా – జీవేశుఁ డంటి నిన్
నీవభయ రూపమ్ము – నిజమై – కావంగా మమ్ము రా
ఈ వసుధ మాతోడు – నెపుడై – మావైపు చూడరా

100. రత్నహార: ర/త/న/(హ)2/ర – ర/త/న/ర/జ/గ UI UU UI III – UI UI UIU 16 అష్టి 21987
రావె రావే వేగ మిటకు – రత్నహార మీయనా
నీవె నాకా నిర్మలమగు – నిత్య నూత్న శోభగా
భావవీణా నాదములను – భవ్య రీతి మీటవా
శ్రీవిలాసానందమయము – చిన్మనోజ్ఞవాటికా

101. జయలలితా: జ/య/ల/(ల)3/(త)2 – జ/య/న/య/య/ల IUII UU – IIII UUI UUI 16 అష్టి 37838
జయమ్ముల నెన్నో – జయలలితా యీయు మోయమ్మ
భయమ్ములఁ బల్ నీ – వభయము సేయంగ రావమ్మ
ప్రియమ్ముగ నా యీ – వినతుల నాలించ వేలమ్మ
నయమ్ముగ నీ యా – నగవులఁ జిందించు మాయమ్మ

102. స్వరాత్మ: స/వ/(ర)2/త/మ – స/య/య/య/ర/గగ IIUI UUI UUI – UU UIU UU 17 అత్యష్టి 8780
వనజాక్షి వందింతు నేనిన్ను – బ్రాహ్మీ కావఁగా రావా
మన మొక్క దేవాలయ మ్మయ్యె – మాతా విద్య లందీవా
యనుమాన మేలమ్మ నీకింక – యార్యా భారతీదేవీ
కొను సుస్వరాత్మా ప్రగీతమ్ముఁ – గొల్తున్ జ్ఞానసంజీవీ

103. హరవిజయ: హ/ర/(వ)3/జ/య – ర/జ/ర/జ/భ/గగ UI UI UI UI – UI UI UII UU 17 అత్యష్టి 27307
మానసమ్మునందుఁ బుట్టు – మారుఁ జంపినావు మహేశా
జ్ఞానబిందు వీవు గాన-సార మీవు దేవ యుమేశా
ప్రాణవాయు వీవె మాకు – శ్వాసయందు నెప్డు నవాంశా
దీనబంధు వంచు ప్రస్తు-తింతు నిన్ హరా విజయాంశా

104. భవతారా: భ/వ/(త)2/(ర)2 – భ/య/ర/ర/య/లగ UI IIUU UI – UUI UIU UIU 17 అత్యష్టి 38031
రావె శుభతారా నాకు – ప్రత్యూష కాంతులన్ జూపఁగా
రావె భవతారా నాకు – రాజిల్లు మార్గమున్ దెల్పఁగా
రావె నవతారా నన్ను – రాగాంబరమ్ముతోఁ గప్పఁగా
రావె యువతారా నన్ను – బ్రాణామృతమ్ముతో నింపఁగా

105. లీలావిలాస: (ల)4/(ల)2/(వ)3/(ల)2/స – న/న/జ/ర/న/లగ IIIII IIUI – UIU IIIIU 17 అత్యష్టి 62848
మిలమిలల నెలరాజు – మెత్తనౌ వెలుగులతోఁ
దళుకుమని యలరారెఁ – దారకా సరములతోఁ
గలల కొక నెలవైన – కమ్మనౌ వలపులతోఁ
జెలగె మది జెలువంపు – చిందుగా మలుపులతో

106. లాహిరి: (ల)2/(హ)3/(ర)3 – స/జ/ర/య/య/లగ IIUI UI UI – UIU UIU UIU17 అత్యష్టి 37548
మెఱయంగఁ జంద్రుఁ డిందు – మెల్లఁగా నూఁగు నీ యుల్లమం
దరయంగ లేచుచుండు – నాశలం దుంటి నా లాహిరిన్
మఱువంగ నన్ను నేను – మత్తులో మున్గితిన్ హాయిగా
మురియంగ వచ్చె వేళ – మోహనా రమ్ము ముద్దాడఁగా

107. రామస్వర: (ర)2/మ/స/వ/ర – ర/ర/మ/స/య/లగ UIU UIU UU – UII UIU UIU 17 అత్యష్టి 38419
రామునిన్ దల్చఁగా నిండున్ – రాగము డెందమం దెప్పుడున్
రామునిన్ బిల్వఁగా నిండున్ – రాగము గొంతులో నెప్పుడున్
ప్రేమ రామస్వరమ్మేగా – ప్రీతికి నామ మారాముఁడే
రాముఁడే జీవిత మ్మీ నా – ప్రాణపు పేరు శ్రీరాముఁడే

108. సత్యవ్రత: స/త/య/వ/ర/త – స/త/య/య/య/గల IIU UU IIU – UIU UIU UUI 17 అత్యష్టి 70244
వరునిన్ సత్యవ్రతునిన్ – భానువంశాబ్ధిసోమున్ రాము
నరయన్ భక్తిన్ గొలుతున్ – హర్షవారాశిలో ముంచంగ
స్థిరమై నా చిత్తములో – శిల్ప రూపమ్ముగా నేనుంతు
హరి పాదాబ్జమ్ముల నే – నాశతోఁ బూలతోఁ బూజింతు

109. లీలామయి (నీలశార్దూలము): (ల)4/(ల)2/మ/(య)3 – న/న/మ/య/య/య IIII IIU – UUI UUI – UUI UU 18 ధృతి 37440
వెలుఁగుల విరియై – వేగమ్ముగా రమ్ము – ప్రేమమ్ము పూయన్
సలలిత మధువై – సాగంగ గానమ్ము – సంతోష మీయన్
చెలువపు నదియై – శ్రీగంగయై రాగ – చిత్రమ్ము గీయన్
వలపుల తలఁపై – వాగర్థ మందుండు – వైచిత్రి మోయన్

ఇందులో గర్భితమైయున్న లయగ్రాహి లేక ప్రాకారబంధము: త/త/త/గగ UUI UUI – UUI UU 11 త్రిష్టుప్పు 293
వేగమ్ముగా రమ్ము – ప్రేమమ్ము పూయన్
సాగంగ గానమ్ము – సంతోష మీయన్
శ్రీగంగయై రాగ – చిత్రమ్ము గీయన్
వాగర్థ మందుండు – వైచిత్రి మోయన్

110. జననీ: జ/న/(న)4 – జ/న/న/న/న/న IUI III III – III III III 18 ధృతి 262142
కలంగ మనసు వెతలఁ – గనులఁ దుడుచు జనని
నలంగ హృదియుఁ గలఁత – నగుచు పిలుచు జనని
వెలుంగ బ్రదుకు లిలను – బ్రియము నిడును జనని
కలుంగ ముదము సుఖము – కరఁగి యొరగు జనని

111. హిలరీ: (హ)3/ల/(ర)4 – ర/జ/జ/త/త/త/గ UIU IUII UIU – UIU UIU UIU 19 అతిధృతి 149867
ఎవ్వ రా జయమ్మును భూమిపై – నెప్పు డాపేక్షతో నెంతురో
యెవ్వరిన్ జయమ్ము వరించునో – యేవిధంబో యనన్ సాధ్యమే
నవ్వుపాలు ట్రంపు నమేరికా – నాయకుండై యవన్ నిక్కమై
యివ్వసుంధరన్, హిలరీ యగున్ – హెచ్చు నా యాశ లోదైవమా

112. భవానీ: భ/(వ)2/(న)4 – భ/జ/భ/న/న/న/ల UIII UIU – III III – III III 19 అతిధృతి 524207
భావము భవానియే – ప్రణవమునకు – ప్రథమ రవము
జీవము శివానియే – చెలువ మలరఁ – జెలఁగు శివము
నావయు నపర్ణయే – నగుచుఁ బిలుచు – నయము ధ్రువము
కావఁగ మృడాని నన్ – గరుణ సుధలఁ – గరుగు భవము

113. హనుమ: హ/(న)5/మ – భ/న/న/న/న/స/గగ UII IIII IIII – IIII IIU UU 20 కృతి 131071
అంజని కొక ప్రియపు నిసుఁగు – హనుమ యెగిరె నానింగిన్
భంజనునిగఁ గుజనులకును – వఱలు నతఁడు సద్భంగిన్
రంజనమగు హృదయ మెపుడు – లలితహృదయుఁ గానంగా
నంజనమయమగు మనికియు – నలరు వెలుఁగు లీనంగా

114. గురు: (గ)5/(ర)5 – మ/మ/య/య/య/య/లగ UUUU – UUI UUI UUI – UUI UUIU 20 కృతి 299585
ఈభూమిన్ నా – కెవ్వారు బోధించిరో వారె – యేవేళ నొజ్జల్ సదా
ఈభూమిన్ నా – కెవ్వా రిటుల్ నిల్పిరో వారె – యేవేళ గుర్వుల్ గదా
ఈభూమిన్ నా – కెవ్వారి ప్రోత్సాహమో వారె – యేవేళ నాచార్యులే
ఈభూమిన్ న – న్నెవ్వారు దీవించిరో వారె – యేవేళ నాదైవమే

115. రాగవల్లరి: (ర)2/గ/వ/ల/ల/(ర)3 – ర/ర/ర/స/య/య/లగ UIU UIU UIUII – UIU UIU UIU 20 కృతి 300691
ఆలపించంగ రా రాగవల్లరి – నాలపించంగ రా తీయఁగా
ఆలకింతున్ గదా రాగరాగిణు – లాలకింతున్ గదా హాయిగా
పూలు బూయున్ గదా మానసమ్మున – మోదగంధమ్ముతో ముగ్ధమై
శ్రీలు జిందున్ గదా డెందమందున – చిద్విలాసమ్ముతో స్నిగ్ధమై

ప్రాసయతితో –
ఆలయమ్మందు శిల్పమ్మువా – సకి – లీలలన్ జిందు చిత్రమ్మువా
తేలు యా నీల మేఘమ్మువా – చెలి – వేల పుష్పాలలో తావియా
రాలు యా తారలో కాంతియా – సిత – డోలలో నూఁగు యా దేవియా
చాల హర్షమ్ముతోఁ జూతుఁగా – నిను – దూలుచున్ సోలుచున్ జూతుఁగా

116. రాజీవ: (ర)2/(జ)4/వ – ర/ర/జ/జ/జ/జ/లగ UI UUI UI UII – UII UII UIIU 20 కృతి 449463
జీవ రాజీవ సూర్యబింబము – చెన్నుగఁ దోఁచెను గాంతులతో
భావ రాజీవ రాశి బూచెను – వంద పదమ్ముల చింతనతో
త్రోవలో నెల్ల పారిజాతపు – రుంద్ర సుగంధపు తావియెగా
నీవె నా జీవనమ్మునందున – నిండగు చంద్రుని వెన్నెలగా
(రుంద్ర – వ్యాపించిన)

117. లీలావతీ: (ల)4/(ల)2/వ/(త)4 – న/న/య/ర/ర/ర/గల IIII IIIU UUI – UUI UUI UUI 20 కృతి 599168
చదువుల పడఁతి నేనందాల – ఛందమ్ము నీయంగఁ గోరంగ
ముదమున నొసఁగెఁగా నానంద – మొందంగ లీలావతీ యంచుఁ
బదముల నమరికన్ జక్కంగ – భావమ్ముతో నుంచఁ బద్యమ్ము
నదివలె పరుగుఁగా వేగమ్ము – నర్తించుచున్ జిత్త మింపార

118. సహస్రానన: స/హ/(స)2/ర/న/న – స/భ/జ/య/జ/న/లల IIU UIII – UII UUI – UII IIII 20 కృతి 1037172
నను పాలింపు మయ – నమ్మితి నిన్నెప్డు – నా సురతరువని
మనమం దుండెదవు – మాధవ నీవెప్డు – మాయని సిరిగని
విని నా ప్రార్థనల – వేగము రావేల – ప్రేమకు నెలవుగ
తను వీ నాయదియు – ధారుణి నీకిత్తు – తప్పని సెలవుగ

119. నానననలు: (న)2/న /న/న/(ల)5- (న)6-లల IIIII IIIII – IIIII IIIII 20 కృతి 1048576
ననలు బలు వనలతల – నయముగను విరిసినవి
కొనలు చెలు వలరుచును – గొమరుగను మురిసినవి
కొనిరి యపు డలరులను – కురుల నిడ సువదనలు
వనితలకు ముద మొసఁగు – పదములగుఁగద ననలు

120. సాగరతనయా: (స)2/గ/ర/త/న/(య)2 – స/స/త/మ/న/స/ర/గ IIU IIU UUI UU – UII IIIU UI UU22 ఆకృతి 651548
సరిగా నల క్షీరాంభోధిలోనన్ – సాగరతనయవై యుద్భవించన్
హరి నిన్ వలచెన్, బాణిన్ గ్రహించెన్ – హర్షమె యలలుగా నింగి ముంచెన్
వరలక్ష్మియు నీవే గానగంగా – పద్మిని వనజనాభాంతరంగా
సిరులన్ గురియంగాఁ జేయు మమ్మా – శ్రీకరముల మమున్ గావుమమ్మా

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...