సగుణబ్రహ్మముగా నెరింగి గొలువన్ స్వామీ! సమస్తంబు నా
కగుపించున్ భవదీయ దివ్య విభవాకార ప్రసన్నంబుగా
జగమున్రోయుచు మిథ్యగా మిము జగత్సాకల్య నిర్ణేతగా
బొగడన్నొప్పునె హేళనల్నొసట నవ్వుల్నోటితో ధూర్జటీ! 1
ఇల్లూ వాకిలి లేని నిన్నగజ తా స్వేష్టానఁ బెండ్లాడఁగా
‘నిల్లాలిన్ మృడుఁ డుంచు నెక్కడ’నుచు న్నింద్రాదిసర్వుల్ మదిన్
తల్లిన్ దల్చుచు తావులన్ వెదుకఁబో దాంపత్యతాత్పర్య! త
ద్వల్లీదేహను వర్ష్మ మందుఁ గొనితీ వర్ధాంగిగా ధూర్జటీ! 2
సాలెను పామునేనుగునజాది విశిష్టులతో సమమ్ముగా
నేలిన నీవుగాక పరమేశ్వరుడెవ్వడు భూతకోటికో
ఫాలపురోహితాక్ష! సమవర్తియు నీ అరికాలి బంటు, మా
కేల విచారమెల్లి పుటకేది కలుంగునొ యంచు ధూర్జటీ! 3
అప్పుడు నీవు అంబికకు ఆంగిక లాస్య విశేష పాఠముల్
జెప్పుచు నాయికల్ బ్రియులజేరుట లాడుచు జూపువేళ క
న్రెప్పలమాటు నవ్వు లలరించిన ఆ సుకుమారి మేనిపై
చప్పున దెబ్బ వేసితివి సాక్షి గణాధిపు దల్తు ధూర్జటీ! 4
అంగజు గెల్చినావనెదరంగన నిత్యము కౌగిలింత! ప్రా
జంగమ లింగధారివయు సంతతమాంతర రామచింత! స
ర్వాంగము బూది యీశ్వరుడవంటలు చక్కని వెక్కిరింత! వే
భంగుల వింత దైవమవు భావుక లోక విహార ధూర్జటీ! 5
తోలును బట్ట గట్టుటలు తొయ్యలిబాయకనంటియుండుటల్
జూలుగ జుట్టు బెంచుటలు చూపుకుదాపున చిచ్చునుంచుటల్
మేలగునూర జీవనము మిద్దెల సేయగ డబ్బు లేక ము
క్కాలము మంచుగట్టు మల కాపురముండుట చేత ధూర్జటీ! 6
రూకలు గల్గు వాని కొమరుల్గన నొక్కడు వేదమంతయున్
వాకున బట్టు సూరి, చెలువల్నలరించు కళన్నొకండు రా
జ్రూకలు లేని వాని కొమరుల్పరికింపగ చుట్టు పక్కలన్
మూకల నాయకుండొకడు మొగ్గర దండు నొకండు ధూర్జటీ! 7
కట్టిన పుట్టమేమి, కనకాంబరమా? కరితోలు! నెత్తిపై
బెట్టినదేమి, మత్త శిఖిపింఛమ? ఉమ్మెత గడ్డిపువ్వు, మై
దట్టిన దేమి, చందన కదంబరమా? తెలి బూది! నిన్ను జే
పట్టిన రాచ పట్టి చలువన్ పరమేశ్వరుడైతి ధూర్జటీ! 8
ఇరువది చేతులార తమ ఇంటిని నొక్కడు పెళ్ళగించెత
త్పరతనొకండు మిమ్ము తన వాకిలి కావలిగా నొనర్చె పెం
జొరవను వేరొకండు తమ జూటపు నెత్తిన చేయి బెట్టగా
నురుకుచు వచ్చె! మిమ్ము మరియొక్కడు పొట్టన బెట్టుకొన్నభా
సురుడయి పొల్చె! చూడ బహు చోద్యము మీ కథ లిట్లుధూర్జటీ! 9
నెత్తిన బెట్టుకొంటి విధునెన్న సగంబె సితాద్రి కన్య క
న్హత్తుక మేన దాల్చినది యయ్యదియున్ సగమే రతీపతి
న్మొత్తము జంపలేదు విషమున్ బరిపూర్తిగ తాగలేదు గ
మ్మత్తు సగాల దేవర శివా నిను చిందులు వేసి బాడెదన్! 10
పుట్టని వాని బట్టుకొన పుట్టల దూరి తపంబుజేసినన్
గిట్టునె మూడు లోకములు గెల్కిన ఘోర విషంబు దాగియున్
గిట్టని వాని గుట్టెరుగ గెల్తుమె పాపిట సూర్యబింబమున్
బొట్టుగ దిద్దికొన్న విరిబోణి దయన్ గనకున్న ధూర్జటీ! 11
అందము చంద్రశేఖరుని దంగజు గెల్చిన వానిదద్రిజా
సుందరి చూడ్కుటమ్ములకు సోలిన వానిది యోగి రాజ హృ
ణ్మందిర చింతనోత్సవమునందు సభాపతిదార్ష వాజ్ఞ్మయా
నంద తరంగ లోలునిది నాదతనూ అది నీది ధూర్జటీ! 12
వొంటికిబూది కంఠమున నుస్సుల బుస్సుల పాము నూనె బొ
ట్టంటని జుత్తు నుమ్మెతలు డామరుకమ్మొక పిచ్చి మేళమో
గుంటడ! ఎద్దుమీద తిరుగుళ్ళివియన్నియు తల్లి లేక నీ
కింట తలంటి బోసెదను కృష్ణ జలమ్ముల రమ్ము ధూర్జటీ! 13
చెప్పితి నీపయిన్ కవిత చెప్పిరి పెద్దలు మున్నె నీకు నే
చెప్పక పోయినన్ పిసరు చిన్నతనంబును లేదు కాని నే
చెప్పగ నీవె చేస్తివని చెప్పెద నీచెవియొద్ద గట్టిగా
చప్పుడు చేసి, సుంత విన జాలుదొ శ్రీగిరి మల్లనాయకా! 14
కానగలేఁడు నిన్నజుఁడు గాసిలి, లచ్చి మగండె యైన గా
నీ నినుజూడలేఁడు గద! నిన్నునుతింప శుకుల్పతంజలు
ల్మాణికవాచకుల్విబుధులందరు జాలరటంచెఱింగియున్
నే నుడిగట్టి పల్కుటలు నీ దయచేత ననంతకంకణా! 15
ఏమిటి యీ మనస్సు ముసలెద్దువలెన్బడియున్న దేహమున్
గోముగ దువ్వుచున్నదటు కొండపయిన్సరదాలుచూడ బో
దామని సాంబ దీని నొక దారికి దెచ్చుట నాకు గాదు బే
ర్మిన్మరలించి సంతతము మిమ్మె దలంచుమతిన్నొసంగవే! 16
కోరిన విద్యలన్నొసగి కొంచము గాని ధనమ్ము నిచ్చి ల
క్ష్మీరమణీ విలాసవతి శీలవతిన్ సహయాన నిచ్చి బం
గారము వంటి పుత్రులను గారపు కూతుల ముద్దునిచ్చి సం
సారము దాట జేసెదవు సారపు ధర్మము నిచ్చి శాంభవీ! 17
[చిన్నతనాన నేను ఎనిమిదవ తరగతిలో ఉన్న రోజుల్లో నన్ను దగ్గరకు పిలిచి తెలుగు ఛందస్సును పరిచయం చేసి, ఇప్పటికీ నన్ను సాహిత్య సాంస్కృతిక విషయాలలో ప్రేమతో సాకుతూ వస్తున్న నా పెద్దన్న, ఈ మధ్యనే ‘ధూర్జటీ!’ శతకాన్ని వెలువరించిన శ్రీ యరికలపూడి సుబ్రహ్మణ్యశర్మకి (సమవర్తిగా ఈమాట కవి) పాదాభివందనాలతో; అప్పుడప్పుడు పంపిన ఈ రచన లోని కొన్ని పద్యాలను చూసి పరిష్కారాలను సూచించిన ఆచార్య ఏల్చూరి మురళీధరరావుగారి సౌజన్యానికి కృతజ్ఞతలతో – ర.]