కేతన ఆంధ్ర భాషాభూషణము-4

తెలుగు విభక్తులు

వ్యాకరణ రచనల్లో సంజ్ఞ (వర్ణాక్షరాల, పదాల పరిచయం), సంధి తర్వాత చెప్పే అంశం ‘విభక్తి’, ‘విభక్తి’ నామాలకు సంబంధించింది. వాక్యాలలో అర్థం బోధపడేందుకై పదాల మధ్య సంబంధాన్ని తెలుపుతూ దోహదపడేవి విభక్తులు. కేతన కూడా ఈ భారతీయ వైయాకరణ సంప్రదాయాన్నే పాటించి సంధుల తరువాత విభక్తులను వివరించాడు.

వ.
అనంతరంబ విభక్తులు చెప్పెదఁ బ్రథమయుఁ ద్వితీయయుఁ దృతీయయుఁ జతుర్థియుఁ బంచమియు షష్ఠియు సప్తమియు సంబోధనంబు నన నెనిమిది తెఱంగుల విభజింపఁబడుటం జేసి విభక్తు లనంబరఁగె. చేయువాఁడు ప్రథమయుఁ, జేయంబడినది ద్వితీయయు, నుపకరణంబు తృతీయయుఁ, జేయించుకొనువాడు చతుర్థియుఁ, బాయుటకు న్బట్టయినది పంచమియు, నొడయండు షష్ఠియు, నునికిపట్టు సప్తమియు, సమ్ముఖంబు సేయునది సంబోధనంబును నగు. వానికి నేకవచన బహువచన భేదంబులన్ బ్రత్యేకంబు రెండు విధంబులఁ జెందు నందుఁ బ్రథమ యెట్లనిన.

అనంతరంబ = తర్వాత; విభక్తులు = నామాలతో చేరి వాక్యంలో మాటలమధ్య అర్థాల సంబంధాలను తెలిపే ‘విభక్తి’ అనే పేరుగల వ్యాకరణాంశాన్ని; చెప్పెదెన్ తెలియజేస్తాను; ప్రథమయు ప్రథమా విభక్తి అనీ; ద్వితీయయున్ = ద్వితీయావిభక్తి అనీ, తృతీయయున్ = తృతీయా విభక్తి అనీ, చతుర్థియున్ = చతుర్థి విభక్తి అనీ, పంచమియు = పంచమీవిభక్తి అనీ; షష్ఠియు = షష్ఠీ విభక్తి అనీ; సప్తమియు = సప్తమీ విభక్తి అనీ, సంబోధనంబును = సంబోధనా విభక్తి అనీ; అనన్ = అనే విధంగా; ఎనిమిది తెఱంగుల = ఎనిమిది విధాలుగా; విభజింపబడుటంజేసి = విభాగింపబడటం వల్ల; విభక్తులు+అనన్+ పరఁగె = విభక్తులు అనే పేరుతో పిలువబడుతున్నాయి. చేయువాఁడు ప్రథమయున్ = చేసేవాడు కర్త ‘ప్రథమావిభక్తి’ అనీ; చేయంబడినది ద్వితీయయున్ = చేయబడ్డ దానిని ‘ద్వితీయా విభక్తి’ అనీ; ఉపకరణంబు తృతీయయున్ = సాధనం (ఉపయోగించేది) తృతీయా విభక్తి అనీ; చేయించుకొనువాఁడు చతుర్థియున్ = ఎవరైనా ఏదైనా పని చేయించుకుంటే (తనకోసం) ఆ వ్యక్తికానీ, పదార్థం కానీ చతుర్థి విభక్తి అనీ; పాయుటకున్ పట్టయినది పంచమియున్ = విడిపోవడానికి, (వేరై పోవడానికి) మూలకారణమైనది పంచమీ విభక్తి అనీ; ఒడయండు షష్ఠియున్ యజమాని, స్వామి షష్ఠీ విభక్తి అనీ; ఉనికి పట్టు సప్తమియు = ఆధారం లేదా నివాసం అయినది సప్తమీ విభక్తి అనీ; సమ్ముఖము సేయునది సంబోధనంబునున్ = పిలిచే వ్యక్తిగానీ, పదార్థంగానీ సంబోధనా విభక్తి అనీ; అగు = అవుతాయి. వానికిన్ = ఆ విభక్తులకు; ఏకవచన, బహువచన భేదంబులన్ = ఏకవచనం (ఒక్కటి తెలిపేవి) అనీ; బహువచనం (= అనేకం తెలిపేది) అనీ భేదాలతో; ప్రత్యేకంబు వేరుగా; రెండు విధంబులన్ = రెండు రకాలుగా; చెందున్ = అవుతాయి; అందు = వాటిలో; ప్రథమయెట్లనిన = ప్రథమావిభక్తి ఏ విధంగా ఉంటుందంటే.

“తర్వాత విభక్తులగురించి తెలియజేస్తాను. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన అని విభక్తులు ఎనిమిది రకాలు. వీటిలో ప్రథమ అంటే చేసే వాడు అనీ; ద్వితీయ అంటే చేయబడింది అనీ; తృతీయ అంటే సహాయసాధనం (ఉపకరణం) అనీ, చతుర్థి అంటే ఎవరికైనా, దేనికైనా ఏదైనా) చేయించుకొనేవాడు అనీ; విడిపోయే దానికి ఆధారమైంది పంచమి అనీ, యాజమాన్యాన్ని తెలిపేది షష్ఠి అనీ, ఉనికికి ఆస్కారమైంది సప్తమి అనీ, పిలిచేందుకు దోహదపడేది సంబోధన అనీ అవుతాయి. వాటిలో మళ్ళీ రెండు భేదాలున్నాయి. అవి ఏకవచనం, బహువచనం. అందులో ప్రథమావిభక్తి ఎలాగంటే” (రెండో పద్యంతో అనుసంధానం).

వాక్యాలలో అర్థం బోధపడేందుకై పదాల మధ్య సంబంధాన్ని తెలుపుతూ దోహదపడేవి విభక్తులు అని చెప్పుకొన్నాం కదా. ఇవి ప్రధానంగా అర్థ సంబంధమైనవి. అందువల్ల ‘విభక్తి’ అనేది కేవలం రూపం గల ప్రత్యయం మాత్రమే కాదు; ఒక మాటకు ఒక విభక్తి రూపం చేరినప్పుడు అన్ని సందర్భాలలోనూ ఒకే అర్థం వచ్చే అవకాశం లేదు. అలాగే ఒకే అర్థాన్ని సూచించే విభక్తికి సంబంధించి భిన్న రూపాలు కూడా ఉండవచ్చు. అందువల్ల ప్రాచీన భారత వైయాకరణులు కేవలం ‘విభక్తి’ అని మాత్రమే అనలేదు; దానితో కలిపి మరో పారిభాషిక పదాన్ని వాళ్ళు నిర్దేశించారు; అదే ‘కారకం’. విభక్తులు చేరినప్పుడు ఏర్పడే అర్థసంబంధాలే ‘కారకాలు’. ఒక్కొక్క విభక్తిలో తెలుగులో రెండుకు మించిన ప్రత్యయాలున్నాయి. అందువల్లనే ‘ప్రథమ’ అంటే “చేయువాడు” అని కేతన నిర్వచించాడు. ‘చేయువాడు’ అంటే ‘కర్త’. అసలు ‘విభక్తి’ అంటేనే ‘విభజింపబడ్డది’ అని నిర్వచనం ఇచ్చాడు కేతన. అలాగే ద్వితీయ అంటే ‘చేయంబడినది’ అని క్లుప్తంగా చెప్పినా దాని అర్థం మనం ‘కర్మ’ అనే పారిభాషిక పదంతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

తెలుగులో ‘బడు’ ప్రయోగం పై ఎన్నో విమర్శలున్నాయి. ఇది తెలుగుకు సహజం కాదనీ, సంస్కృతం నుండి అనువాద క్రమంలో వచ్చిందనీ, ‘బడు’ను వాడటం తెలుగుకు లక్షణం కాదనీ- ఇలా కొంతకాలం కొంతమంది విద్వాంసులు తప్పు పట్టగా, కొన్ని పత్రికలు ‘బడు’ ప్రయోగాన్ని నిషేధించాయి; కానీ తెలుగులో ‘బడు’ ప్రయోగాలు శాసన కాలం నుంచీ ఉన్నాయి; కావ్యాలలో కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో దీని ప్రయోగం కనిపిస్తుంది. తిక్కనలోనూ ముఖ్యంగా పోతనలో చాలా ప్రయోగాలు కనిపించాయి. ఇక్కడ కేతన వాడిన ‘చేయంబడినది’ అన్న ప్రయోగాన్ని ఇంకే విధంగానూ చెప్పి ఇలాంటి ‘అల్పార్థ ప్రయోగంతో అనల్పార్థాన్ని’ సాధించలేం. ‘బడు’ అవసరం, ప్రాధాన్యాలపై చేకూరి రామారావు గారి (1981) అవగాహనలూ, వాదనలూ లోతైనవి. ఇంకా ఎక్కువ విషయసేకరణ ద్వారా ఈ విషయం గురించి మరింత విస్తృతంగా ఆలోచించవచ్చు.

తృతీయ అంటే ‘ఉపకరణం’ అంటే సాధనం. చతుర్థి అంటే ‘చేయించుకొనువాడు’. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ‘చేయించుకోవడం’ అంటే ఏమిటి? ‘చేయంబడినది” అంటే ఏమిటి? వాటి మధ్య భేదం ఏమిటి అన్న విషయాలు. ‘చేయంబడుట’ అంటే ఫలితాన్ని అనుభవించడం; అంటే ‘కర్మ’ అయితే, ‘చేయించుకోవడం’ అంటే ‘లబ్ధి పొందడం’. అందువల్లనే తెలుగు పాఠశాలల్లో కర్మ గురించి పిల్లలకు సులువుగా అర్థం కావాలని మూడు ప్రశ్నలు నేర్పుతారు; అవి (1) ఎవరిని, (2) దేనిని, (3) వేనిని అని వేసుకోవాలని. అన్నిటి అర్థం ఒకటే. ‘ఎవరిని’ మనుషులకు, ‘దేనిని’ మనుష్యేతరాలకు, ‘వేనిని’ మనుష్యేతర బహువచనానికి వేసే ప్రశ్నలు. ‘చేయించుకోవడం’లో ‘లబ్ధి ఉండటం’వల్ల లాభమే కానీ, ‘కర్మఫలితం’ లేదు; ఈ ‘లాభం’ వల్ల చతుర్థికి ‘రెండు’ కర్మలు వస్తాయి; ఒకటి లబ్ధి గ్రహీత ఐన ప్రధాన కర్మ; రెండోది లబ్ధి కారకమైన అప్రధానకర్మ; అట్లాగే ‘పాయుటకు’ అంటే ఒకచోట నుండి విడిపోవడానికి ఆస్కారమైన దానికి ‘పంచమీ’ విభక్తి వాడుతారు; అలాగే స్వామిత్వ లేదా యాజమాన్య సంబంధం కలిగించే విభక్తి షష్ఠి; ఏది ఆధారమో తెలిపేది సప్తమి; అట్లాగే పిలవడానికి ఉపయోగించే విభక్తి సంబోధన. వీటన్నింటికీ సంబంధించిన వివరాలు కింది పద్యాలలో విశదంగా తెలుస్తుంది.

అందువల్ల ప్రథమ నుండి సప్తమి వరకూ కేవలం ప్రత్యయాలు. అంటే “డు, ము, వు, లు ప్రథమా విభక్తి” అని చెప్తే చాలదు; చిన్నయసూరి దీనినే మరింత విపులంగా చెప్పాడు; అందువల్లనే ‘కారకం’ అనే దానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడే కేవలం రూపాలతో పదసంబంధాలను నిష్పన్నం చేస్తున్నప్పటికీ అవి ఏయే రకాల అర్థాలను, అర్థభేదాలను ఇస్తున్నాయో తెలియకపోతే కేవలం రూపాలు తెలుసుకోవడంవల్ల భాషను గురించి ఏమీ తెలియకుండా పోతుంది. ఈ విషయంలో ‘సంధి’ కి సంబంధించిన అంశాల వలెనే ప్రాచీన భారతీయులు చేసిన కృషిని పాశ్చాత్యులంతా గుర్తించడమే కాకుండా, తమ తమ నూతన సిద్ధాంతాలలో ఈ అంశాలను చేర్చుకున్నారు. అంతే కాదు, ‘సంధి’ మొదలైన కొన్ని పారిభాషిక పదాలను అనువాదం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి అలాగే వాడారు కూడా.

నోమ్ చామ్స్కీ భాషాశాస్త్రంలో విప్లవాత్మకంగా గుర్తించే తన పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రోజుల్లో ( ఒక అంతర్ నిర్మాణం నుండి వివిధ సూత్రాల ద్వారా అనేక బాహ్య నిర్మాణ వాక్యాలను నిష్పన్నం చేయవచ్చునన్నది దానిలో ముఖ్యమైన ప్రతిపాదన) ‘అర్థం’ ప్రాధాన్యం గురించి విశేషమైన చర్చ జరిగింది. దానిలో భాగంగానే వేర్వేరు పండితులు వేర్వేరుగా తమ ప్రతిపాదనలను, వాదనలను వినిపించేవారు. వీరందరినీ కలిపి ‘పరివర్తన అర్థవిజ్ఞానశాస్త్రవేత్తలు’ (generative semanticists) అని పేరు పెట్టారు. వీరిలో ఫిల్మోర్ (Fillmore) అన్నాయన విభక్తి – కారక సంబంధాల గురించి తన ఆలోచనలు ప్రతిపాదిస్తూ, దానిలో భారతీయుల కారకంలోని అంశాలను కూడా చేర్చుకున్నాడు. ఇంగ్లీషులో మనం వాడే prepositions విభక్తులకు సమానార్థకాలు కావు. అయినప్పటికీ విభక్తులు (Cases), విభక్తి సంబంధాలు (Case Relations) అన్న విభజన మొదటగా చేసింది. ఫిల్ మోరే. Case, Case marker అన్నమాటలే అప్పటివరకూ వాడుతూండగా, Case Relations అన్నమాటను ఇంచుమించు కారకానికి సమానార్థకంగా ఉండే పారిభాషిక పదంగా వాడింది ఫిల్ మోర్ (1968). అందువల్ల ఒక కర్త కేవలం కర్త కాదు – కర్తను Agent (చేసేవాడు), Experiencer (అనుభూతి చెందేవాడు) అంటూ వర్గీకరించాడు. Fillmore ప్రకారం Agent, Object, Patient, Experiencer, Instrumental, Associative, Source, Goal, Location మొదలైన ‘కారక సంబంధాలను’ “Subject, Object” అనే వ్యాకరణసంబంధాలకు భిన్నంగా ప్రతిపాదించాడు. “కారకం” పారిభాషిక పదానికి సమానమైనదేదీ ఇంగ్లీషు లాటిన్ భాషల్లో లేనందువల్ల ‘Case Relations’ అనే పారిభాషిక పదాన్ని తన సిద్ధాంతం (Case theory) లో ప్రవేశపెట్టాడు. (ఈ రెండింటిని పోల్చి చూస్తూ భాషా శాస్త్రంలో కొన్ని అధ్యయనాలు, పరిశోధనలు కూడా భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ వచ్చాయి).

కేతన చిన్న చిన్న మాటలతోనే విస్తృతమైన విభక్తి – కారక సంబంధాలను ఒకే వాక్యంలో తెలియజేయడం వ్యాకరణం పట్ల ఆసక్తి గలవారిని ఎంతో సంతోషపెడుతుంది. తర్వాత కాలంలో చిన్నయసూరి దీన్ని ఎంతో వివరంగా ఏయే అర్థాలనిచ్చే కారకాలకు ఏ ప్రత్యేక విభక్తి ప్రత్యయం వస్తుందో సూత్రీకరించాడు. (చూ. చిన్నయసూరి. కారక పరిచ్ఛేదం – ఉదా: అపాయ, భయ, జుగుప్సా… దానికి ‘వలన’ వర్ణకంబగు మొ॥) పద నిర్మాణ శాస్త్రంలో నామ పద నిర్మాణం, క్రియా పద నిర్మాణం ముఖ్యమైనవి. నామ పద నిర్మాణంలో ఏక బహువచన రూప నిర్మాణాలతో బాటు, విభక్తుల చేర్పుతో ఏర్పడే పదాలు కూడా చేరుతాయి. వీటిని కేతన వర్ణించిన విధం కింది పద్యాలలో తెలుసుకుందాం.

క.
పలుకనుట యేకవచనము
పలుకుపయి న్లులను నిలుప బహువచనంబుల్
నెల నెల లనఁ దల తల లనఁ
జిలుక చిలుక లనఁగ జగతిఁ జెల్లుటవలనన్. (68)

పలుకు అనుట = పలుకు (మాట) అనే పదం; ఏకవచనము = ఒకే ఒక వస్తువును తెలిపే ‘ఏకవచనం’; పలుకుపయిన్ = పలుకు అనే మాట మీద; లులను = ‘లు’ లేదా ‘ల’ అనే వాటిని; నిలుప = చేర్చగా, ఉంచగా; బహువచనంబుల్ =బహువచనాలు అంటే ఒకటి కంటే ఎక్కువ సంఖ్యను తెలిపేవి; నెల నెలలు అనన్ = నెల అనే ఏకవచనానికి నెలలు బహువచనం అనే విధంగానూ; తల తలలు అనన్ = తల తలలు అనే విధంగాను; చిలుక చిలుకలు అనగన్ = చిలుక – చిలుకలు అనే విధంగానూ; జగతిన్ = భూమిపై; చెల్లుటవలనన్ = ఉపయోగించటం జరుగుతోంది కాబట్టి. “ ‘పలుకు’ అనేమాట ఏకవచనం, ఈ పలుకు పైన ‘లు’ కానీ, ‘ల’ కానీ చేర్చితే బహువచన రూపాలు ఏర్పడుతాయి. ఎలాగంటే నెల-నెలలు. తల -తలలు; చిలుక-చిలుకలు అనే విధంగా చెల్లుతోంది కనుక!”

ప్రథమావిభక్తికి చెందిన ఏకవచన రూపాలైన ‘డు’ ‘ము’ ‘వు’ లగురించీ, సంస్కృతంలోని దీర్ఘాంతాలైన స్త్రీలింగ పదాలు తెలుగులో ఉపయోగించే తీరు గురించి పూర్వ అధ్యాయంలోనే (సంస్కృతాన్ని తత్సమంగా మార్చే విధం) చెప్పి ఉన్నందువల్ల ఆ ఏకవచనాలపై ‘లు’ లేదా ‘ల’ (ఇది ఇతర విభక్తులు చేరినప్పుడు వాడే బహువచన రూపం) అనేవి బహువచనంలో చేరుతాయి. ఉదాహరణగా చాలా చిన్న చిన్న మాటలు నెల-నెలలు, తల- తలలు, చిలుక- చిలుకలు ఇచ్చాడు. తర్వాత కూడా ఎంతో మంది వ్యాకర్తలు, చిన్నయసూరితో సహా, ఈయన ఇచ్చిన ఉదాహరణలే వాడుకున్నారు. తెలుగు బహువచన ‘పదాంశం’ (morpheme) క్లిష్టమైనది. కేవలం ‘లు’ మాత్రమే కాక, ఇతరమైన వర్ణవిధేయ, పదాంశవిధేయ సూత్రాల ద్వారా, ఇంగ్లీషులోని బహువచనం వలె అనేక సపదాంశాల (allomorphs) కలయికతో తెలుగు బహువచనరూపం రూపొందుతుంది. అందువల్లనే కేతన ఈ ఒక్క పద్యంతో ఆగిపోలేదని కింది పద్యాలద్వారా తెలుసుకుంటాం. అయినా కేతన ఇచ్చినవి కూడా తెలుగు బహువచనాలనన్నింటినీ వర్ణించగలవని భావించలేం. ఆధునిక కాలంలో తెలుగు బహువచనంపై వివరంగా చర్చ చేసిన వారు భాషాశాస్త్రవేత్త చేకూరి రామారావు ఒక్కరే (1970/1981). మిగిలినవన్నీ ఆయన పరిశోధనలను ఆధారం చేసుకున్నవే తప్ప ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం ఆయా రూపభేదాలను ఎలా నిష్పన్నం చేయాలో మౌలికంగా, విపులంగా చర్చించింది చేకూరి రామారావు మాత్రమే (చేరా). (కృష్ణమూర్తి, గ్విన్ (1985) కూడా దీనిపై కొత్త విషయాలేమీ చెప్పలేదు). అయినా దీనిపై ఇంకా పరిశోధన జరగాల్సే ఉంది.

ప్రపంచంలో మానవభాషలు సంక్లిష్టమైనవి. వీటి నిర్మాణాలూ, వ్యవస్థలూ, పరిణామాలూ అన్నీ కూడా ఆలోచించే కొద్దీ ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. విశ్వరూపాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో మానవ భాషని అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం అనిపిస్తూంటుంది.

క.
డుల నెల్లయెడల ద్రోచును
దెలుఁగు విభక్తుల క్రమంబుఁ దెలిపెద ననఘుల్
బలవంతులు ధనవంతులు
కులజులు నయవిదులు భావుకులు ననఁ జనుటన్. (69)

డులను = ‘డు’ అనే ప్రత్యయాలనన్నింటిని; ఎల్లయెడలన్ = అన్నిచోట్లా; త్రోచును= తోసేస్తాయి (తొలగిస్తాయి); తెలుగు విభక్తుల = తెలుగు భాషలోని విభక్తి ప్రత్యయాల; క్రమంబు = అనువర్తించే విధం; ఎలా చేరతాయో వరుసగా; తెలిపెదన్ = తెలియజేస్తాను; అనఘుల్ = (< అనఘ+డు = అనఘుడు+లు = 'డు' లోపం = అనఘులు = అనఘుల్) అనఘులు అనే విధంగాను (=పాపరహితులు); బలవంతులు = (< బలవాన్ = బలవంతుడు+లు = బలవంతులు) (=ఎక్కువ బలంగలవారు); ధనవంతులు = (ధనవంతుడు+లు = ధనవంతులు = ధనం గలవారు); కులజులు = (కులజుడు+లు=కులీనులు) మంచి కులానికి చెందిన వారు; నయవిదులు = (< నయవిదుడు + లు = మంచీ చెడూ తెలిసిన వారు, న్యాయకోవిదులు); భావుకులు = (భావుకుడు+లు) కాల్పనిక(ఊహాత్మక) భావాలు గలవారు; అనన్ = అనే విధంగా, చనుటన్ = వాడటంవల్ల. “తెలుగు విభక్తులు ఏకవచనంలోని 'డు' ప్రత్యయాలనన్నింటినీ తొలగించిన పిమ్మట చేరుతాయి. ఎలాగంటే 'అనఘులు, బలవంతులు, ధనవంతులు, కులజులు, నయవిదులు, భావుకులు' అనే విధంగా”. మొదటి అధ్యాయంలో తత్సమపదాలలో పురుష వాచకాలకు 'డు' ప్రత్యయం చేరుతుందని చెప్పాడు కేతన. (చూ.పద్యం). ఇప్పుడు బహువచనం చేరే ముందు ఆ ప్రత్యయం పోతుందని సూత్రీకరించాడు. ఆధునిక భాషా శాస్త్రంలో చెప్పే 'సూత్రాలక్రమ' పద్ధతి చాలా తేలికైన పద్ధతిలో కేతన వివరించాడు. సూత్రం దాని వెంటనే ఉదాహరణ - అదీ చాలా సులభంగానూ, అందరికీ అర్థం అయ్యేలా మంచి విషయాలను బోధించే విధంగానూ ఉండే ఉదాహరణలతో.

ఏకవచనం బహువచనం
అనఘుడు అనఘులు
బలవంతుడు బలవంతులు
ధనవంతుడు ధనవంతులు
కులజుడు కులజులు
భావుకుడు భావుకులు

ఇందులోని రెండు సూత్రాల క్రమం:
1. ‘డు’ లోపం.
2. ‘లు’ ప్రత్యయం చేరడం.

క.
లులమీఁద లులకు రుఱ్ఱగు
నిలఁ బెక్కిట బాలు రన మహీపాలు రనన్
లలిత దయాళు రనంగా
నలవడ వర్తిల్లుఁగాన నభినవదండీ. (70)

లుల మీద = ‘లు’ ‘ల’ అంతంలో ఉండే పదాలమీద; లులకు = ‘లు’ ‘ల’ అనే బహువచన ప్రత్యయరూపాలకు బదులుగా; రుఱ్ఱు +అగున్ = ‘రు’ కారం వస్తుంది. ఇలన్ = ఈ భూమిపై; పెక్కిట = చాలాచోట్ల; బాలురు + అన = బాలు+లు = బాలురు అనే విధంగా; మహీపాలుడు + లు = మహీపాలురు (= రాజులు); లలిత దయాళురు = లలిత దయాళుడు + లు = లలిత దయాళురు (మృదువైన, కరుణా హృదయం గలవారు); అనంగాన్ అనే విధంగా; అలవడ = అలవాటుగా; వర్తిల్లున్ = ప్రవర్తిస్తున్నాయి; కాన= కాబట్టి; అభినవదండీ = ఓ అభినవదండీ అనే బిరుదుగల కేతనా!

“లు కారాంతాలైన పదాలపై బహువచన ‘లు’ కారం రుకారంగా మారుతుంది. ఎలాగంటే బాలురు, మహీపాలురు; లలిత దయాళురు అనే విధంగా”.

“లుకారాంత పదాలపై బహువచన ప్రత్యయమైన ‘లు’ చేరినప్పుడు ప్రాతిపదికలోని ‘లు’ కాకుండా బహువచన ప్రత్యయమైన ‘లు’ కారమే మార్పుకు లోనవుతుంది అని ఈ సూత్రం ద్వారా తెలుస్తోంది. ఆ విధంగా లు , రు గా ‘లు’ కార పదాంతాలకు చేరుతుంది. ఈ సూత్రానికి ఉదాహరణగా బాలుడు, మహీపాలుడు, లలిత దయాళుడు వంటి పదాలను చూపాడు. పై సూత్రం ప్రకారం మూడు మార్పులు జరుగుతున్నాయని గుర్తించాలి.

1.
బాలుడు + లు
మహీపాలుడు + లు
లలిత దయాళుడు + లు
మొదటి సూత్రం : ‘డు’ లోపం

~2. బాలు + లు
మహీపాలు + లు
లలితదయాళు + లు
రెండవ సూత్రం : ‘లు’ బహువచనం చేరడం
బాలు + రు (*బాలులు తప్పు)
మహీపాలు + రు (*మహీపాలులు తప్పు)
లలితదయాళు + రు (*లలితదయాళులు తప్పు)

మూడవ సూత్రం :బహువచన ప్రత్యయం’లు’ చేరినప్పుడు లు కారాంతపదాల తర్వాత ‘రు’ కారంగా మారుతుంది. ల ర ల మధ్య పరస్పర ప్రభావాలూ, మార్పులూ వ్యత్యయాలూ జరగడం ప్రక్రియగా ఎందరో వర్ణశాస్త్రవేత్తలు గుర్తించారు. తెలుగులో ఇది ప్రత్యేకం ఏమీ కాదు.

దేవినేని సూరయ్య కూడా ‘లు కారాంతశబ్ద బహువచన లుకారమునకు రు కార మాదేశమగును’, అని వివరణ ఇస్తూ “తత్సమ పదములలో మహద్వాచకములకే దీర్ఘము మీది లకార ళకారములకు మాత్రము ఈ సూత్రము తగి యున్నది. ద్విత్వ యుక్త లాంతంబైన యొక శబ్దమునకు మాత్రము రేఫంబువైకల్పికముగా గానంబడియెడి. మల్లురు – మల్లులు” అని ఒక అపవాదాన్ని చూపారు.

హరి శివకుమార్ నన్నయ నుండి నృపాలురు, అల్లురు అనే ఉదాహరణలు చూపి చిన్నయ సూరి ” ఈ రువర్ణక విషయమున తత్సమంబులకు వేరుగా ( తత్సమ-39), ఆచ్చికంబులకు వేరుగా(aachchika- 5)బహువచనం విధించాడు. కేతన ప్రక్రియ ఇంతకంటే సులువైనది, మరియు విశాలమైనది”” అన్నాడు( పుట. 131).

క.
పోఁడిగ బహువచనంబులు
వీఁ డనుచో, వీండ్రు వీరు వీరలు నయ్యెన్
కాఁ డనఁగాం డ్రనఁగా రన
వాఁడునకున్ వాండ్రు వారు వారలు నయ్యెన్. (71)

పోఁడిగ = చక్కగా; బహువచనంబులు = అనేకార్థక బహువచనాలు; వీఁడు అనుచో= ‘వీడు’ అన్న మాటకు (ప్రథమ పురుష ఏకవచనం) వీండ్రు, వీరు, వీరలు – ఈ మూడు రకాల రూపాలు; అయ్యెన్ = అయ్యాయి; కాడు అనన్ = కాడు అనే ప్రత్యయం; కాండ్రు, అనన్ = కాండ్రు అనీ; కారు అనన్ = కారు (గారు) అనీ; వాడునకున్ = వాడు అనే ప్రథమ సర్వనామానికి; వాండ్రు, వారు, వారలున్ ఈ మూడు రకాల రూపాలు; అయ్యెన్ అయ్యాయి.

“సర్వనామాలలో ప్రథమ పురుషను తెలియచేసే వాడు, వీడులతోపాటు ప్రత్యయంగా చేరే ‘కాడు’ వాటికి రూపాంతరాలు కూడా వాడుకలో ఉన్నాయి. ‘వీడు’ (ఈ మనిషి = ఇతడు) అనే మాటకు వీండ్రు, వీరు, వీరలు అనే మూడు రూపాలూ; -కాడు అనే ప్రత్యయానికి కాండ్రు, కారు, అని రెండు రూపాలూ; ‘వాడు’ అనే సర్వనామానికి వాండ్రు, వారు, వారలు అనే మూడు రూపాలూ బహువచనాలలో కనిపిస్తాయి”. తెలుగులో సర్వనామాల్లో ప్రథమ పురుష చాలా ఆసక్తికరమైంది. ప్రపంచ భాషల్లో కొన్నింటిలో కేవలం ఒకే ఒక మాట ద్వారానే ప్రథమ పురుషలోని అన్ని స్త్రీ పురుష నపుంసక లింగాలూ వ్యక్తమయ్యే విధం ఉంది. ఉదాహరణకు హిందీ, బెంగాలీ, ఒరియా వంటి భాషల్లో స్త్రీ పురుష భేదాన్ని తెలిపే భిన్న సర్వనామాలు లేవు. ఇంగ్లీషులాంటి భాషల్లో మూడు లింగాలకూ మూడు భిన్నమైన సర్వనామపదాలు He, She, It అని ఉన్నాయి. కానీ తెలుగు వంటి భాషల్లో ఒక్కొక్క లింగానికి ఒక్కమాట అని కాక ఒకే లింగానికి భిన్నమైన పదాలున్నాయి. వీటిని గురించి ఎంత లోతుగా ఆలోచిస్తే, అన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఆధునిక భాషాశాస్త్రంలో వీటి పై జరిగిన ఆలోచనలు కొత్త కోణాలలో వీటిని వివరించాయి. తెలుగులో ప్రథమ పురుషలోని ఏక, బహువచనాల్లో మూడు లింగాలకు చెందిన మాటలు ఆధునిక భాషలో ఈ కింది విధంగా ఉన్నాయి.

పై వాటిని పరిశీలించి తెలుగు ప్రథమ పురుషను కింది పటంలో మాదిరిగా చూపారు; ఇది క్రియ ఆధారంగా చేసిన విభజన:

అయితే కావ్య భాషలో వీటికి రూపాంతరాలున్నాయి. వాటికి రెండు కారణాలు. ఒకటి చారిత్రక పరిణామం, రెండు ఛందో అవసరం.

(i) వీండ్రు < వీండు + రు < వీండు + లు (ii) వీండ్రు , వీరు > వీరు+లు = వీరలు (రెండు మార్లు బహువచనం)

అలాగే
వాండు + లు = వాండ్రు , వారు > వారలు.
కానీ, పదాంత ప్రత్యయంగా వచ్చే ‘కాడు’కు మాత్రం రెండే రూపాలు;
కాడు+లు = కాండ్రు = కారు (ఆధునిక ‘గారు’)

అయితే ఇక్కడ కేతన చెప్పని చిన్నయసూరి చెప్పిన విశేషం ఒకటి ఉంది. అది – కాండ్రు అనే బహువచనం వచ్చినచోట – కారు రాదన్న విషయం. ఉదా: చెలికాండ్రు, సొగసుకాండ్రు అని ఉంటుంది. అంతేకానీ చెలికారు, సొగసుకారు అని తెలుగులో ప్రయోగాలు లేవు.

వాండ్రు/వారు వారలు
గలం/హగణం. భగణం

తెలుగు బహువచనంలో ప్రాచీన కాలంలో [-ండ్రు] ప్రయోగం ఎక్కువ. ఆధునిక కాలంలో చాలా అరుదు.

ఆ.
కొఱను నెఱను నాఁగఁ గొలను నా మ్రాననఁ
గలను గవను కెలను వలను నాఁగఁ
బరఁగు శబ్దములకు బహువచనంబుల
నులకుఁ గులు విధించే నూత్నదండి. (72)

కొఱను = ఆవులను మేపేస్థలం; నెఱను = రహస్యం; నాగ = వలె, అనే విధంగా; కొలను = సరస్సు; నా = అన్నట్లుగా; మ్రాను అనన్ = చెట్టు అనే విధంగా; కలను = స్థలం (పొలం); గవను = కోటగుమ్మం; కెలను = వైపు, ప్రక్కన; వలను = వైపు, పక్కన; నాగన్ = అనే విధంగా; పరగు శబ్దములకు = వ్యవహరించే పదాలకు; బహువచనంబుల = అనేకార్థాన్నిచ్చే బహువచనంలో; ను లకు = ‘నులు’కు బదులుగా; కులు = కులు వర్ణకాన్ని; విధించె = సూత్రీకరించాడు, నియంత్రించాడు; నూత్నదండి= అభినవదండి అనే బిరుదుగల కేతన.

“నుకారాంత పదాలైన కొరను, నెరను, కొలను, మ్రాను, కలను, గవను, కెలను, వలను వంటి మాటల బహువచనాలకు ‘నులు’కు బదులుగా ‘కులు’ వస్తుందని కేతన సూత్రీకరించాడు”.

ఇది పూర్తిగా వర్ణవిధేయ బహువచనం కాదు ఎందుకంటే అన్ని నుకారాంత పదాలకు ‘కులు’ బహువచనంగా రాదు. అందువల్లనే కేతన పదాలపట్టిక చెప్పి వీటికి ‘ను’ తర్వాత ‘లు’ కు బదులు అనకుండా ‘నులు’ కలిపి చెప్తూ ‘నులు’ కు బదులుగా “-కులు” బహువచనంగా వస్తుందన్నాడు. అందువల్ల ఇది పదాంశ విధేయ సూత్రంగా గ్రహించాలి.

దీని నిష్పన్న విధానం ఇలా ఉంటుంది.

1) కొరను + లు > * కొరనులు
బహువచనం – లు
కానీ,
ii) -నులు > -కులు
కొరనులు = కొరకులు
మ్రానులు = మ్రాకులు
కెలనులు = కెలకులు (చూ: కెలకుల నున్న తంగేటి జున్ను. మనుచరిత్ర – పెద్దన)
కొలనులు = కొలకులు

ఈ పట్టికను తర్వాతి పద్యంలో కేతనే స్వయంగా ఇచ్చాడు. చూడండి.

క.
కొఱఁకులు నెఱఁకు లనంగా
మఱియుం గొలఁకులును రేఁగుమ్రాఁకులనంగా
మెఱయున్ గలఁకులు గవఁకులు
నెఱకెలఁకులు వలఁకు లనఁగ నెగడెడికతనన్. (73)

కొఱకులు, నెఱకులు అనంగా = కొఱకులు, నెఱకులు అనే (పైన చెప్పుకున్న) విధంగా; మఱియుం = ఇంకా; కొలకులును, రేఁగుమ్రాకులును; అనంగా = కొలకులు, రేగు మ్రాకులు అనే విధంగా; మెఱయున్ = ప్రకాశించేట్లు; కలకులు = పొలాలు; గవకులు = కోటగుమ్మాలు; నెఱకెలకులు = రహస్యమార్గాలు; వలకులు = మార్గాలు, పక్కదారులు; అనఁగన్ = అనే విధంగా; నెగడెడి = ఉపయోగించే; కతనన్ = కారణంగా.

“నులు కు బదులుగా కులు ఉపయోగిస్తుండడం వల్ల కొఱకులు, నెఱకులు, కొలకులు, (రేగు) మ్రాకులు; కలకులు, కవకులు, (నెఱ) కెలకులు, వలకులు అనే విధంగానే బహువచనంలో ఉపయోగిస్తారు.”

పై పద్యంలోనే వివరించినట్లు పై పదాలలో ‘కులు’ తో బహువచన ప్రయోగాలు కావ్యాలలో కనిపిస్తాయి. నన్నయ నుండి కొన్ని ఉదాహరించారు హరి శివకుమార్. పై పదాలన్నీ ఈనాడు దాదాపు అరుదుగా తప్ప ప్రయోగాలు కనిపించవు.

ఆ.
ఇల్లు కల్లు ముల్లు పల్లు విల్లన నివి
బహువచనము లగుచుఁ బరఁగు నెడల
నిండ్లు కండ్లు ముండ్లు పండ్లు విండ్లనఁ జను
నుతగుణాభిరామ నూత్న దండి. (74)

ఇల్లు = నివాసస్థలం; కల్లు = రాయి; ముల్లు = మొక్కలలో ఉండే, కుచ్చుకునే భాగం; పల్లు = దంతం, పన్ను; విల్లు = ధనుస్సు; అనన్ = అనేటటువంటి; ఇవి = ఇలాంటివి; బహువచనంబులు; అగుచున్ = బహువచన రూపాలు అవుతూ; పరఁగున్ = ఉపయోగపడే; ఎడలన్ = అప్పుడు, ఆ సందర్భంలో; ఇండ్లు, కండ్లు, ముండ్లు, పండ్లు; అనన్ = అనే విధంగా; చనున్ = చెల్లుతుంది. నుతగుణాభిరామనూత్నదండి = ఓ కేతనా!

“ఇల్లు, కల్లు, ముల్లు, పల్లు, విల్లు వంటి మాటలకు వరుసగా ఇండ్లు, కండ్లు, ముండ్లు, పండ్లు, విండ్లు అనేవి బహువచన రూపాలుగా వస్తాయి”.

ఇవి కూడా ఒకే సమూహానికి చెంది, ఒకే విధమైన బహువచనాన్ని స్వీకరించే పదాంశ సముదాయం. ‘-ల్లు’ చివరలో ఉండే ఈ పదాంశాలు ‘-ండ్లు’ అనే రూపాన్ని బహువచనంగా పొందుతాయి. అంటే ఇల్లు + లు; కల్లు + లు; ముల్లు+లు; పల్లు+లు; విల్లు +లు అన్నప్పుడు వరుసగా ఇల్లులు, కల్లులు, ముల్లులు, పల్లులు, విల్లులు అనే రూపాలు కాకుండా పైన చెప్పినట్లు ఇండ్లు, కండ్లు, ముండ్లు, పండ్లు, విండ్లుగా మారుతాయి. ఇలాంటి వాటిని వర్ణ విధేయ సూత్రాల ద్వారా వివరించడం సాధ్యం కాదు. ఇంగ్లీషులో tooth, foot వంటి పదాలకు teeth, feet వంటి బహువచనాలు వస్తాయి. ఇలాంటి వాటిని ఆయా పదాంశాలతోనే వివరించి, ‘పదాంశ విధేయాలు (morphologically conditioned) అని సూత్రీకరించారు, వర్ణనాత్మక భాషాశాస్త్రవేత్తలు. చేరా ఇలాంటి వాటిని అక్షరనిర్మితి (syllable structure) సూత్రాలద్వారా వివరించే ప్రయత్నం చేసాడు. అయినప్పటికీ ‘-ల్లు’ అంతంలో వచ్చేవన్నీ “-ండ్లు” తీసుకుంటాయని కూడా సూత్రీకరించలేం. ఆధునికంగా ఈ బహువచనరూపాల వాడుకపోయి, ఇళ్ళు/ఇళ్ళు; ముళ్ళు/ముళ్ళు మొదలైన రూపాలు మాత్రమే వాడుతున్నాం. వీటిని వర్ణ విధేయ సూత్రం ద్వారా వివరించవచ్చు, ఉదా:

ఇల్లు ఆ ఇల్ – ఇన్ + లు
ఇన్‌డ్‌ఉలు > ఇండ్లు – ఇళ్ళు – ఇళ్ళు

‘డ’ మూర్ధన్యధ్వనిరూపం; దీనికి ‘లు’ బహువచనం పరమైనప్పుడు (వచ్చి చేరినప్పుడు) మూర్ధన్య లక్షణం ‘ల’ వర్ణానికి చేరి ‘ళ’గా మారడం వర్ణసూత్రాల్లో సహజలక్షణం.

ఎందుకంటే ‘మూర్ధన్య’ లక్షణం (Retroflex feature) మిగిలిన ఇతరమైన చాలా ధ్వని లక్షణాలకంటే బలమైనది (strong). అందువల్ల అది కలిసి వున్న వర్ణం సంధికి లోనయినా, లోపించినా, తన బలాన్ని కోల్పోకుండా పక్కవర్ణం మీద తన ప్రభావాన్ని వదిలివెళ్తుంది.

ఇదే ‘బలాబలాల’ (Strong vs Weak) సిద్ధాంతం లోని ప్రధానాంశం (చూ. Foley, 1970). ఆ విధంగా ధ్వనులన్నింటినీ కొన్ని సామాన్య సూత్రాలద్వారా కొన్ని బలమైనవనీ, మరికొన్ని బలహీనమైనవనీ ‘ఫాలే’ ప్రతిపాదించాడు. ఒక్కొక్క భాషలో ఈ బలాబలాలు భిన్నభిన్నంగా వ్యవహరిస్తాయి.

ఇండ్లు , ఇళ్ళుగా మారటం ఈ కింది విధంగా జరుగుతుంది.
i) ఔపవిభక్తిక ప్రత్యయం.
ఇల్లు -> ఇంట్
ii) బహువచన ప్రత్యయం
ఇంట్ + లు = ఇండ్లు
+ శ్వాసం నాదంగా మారటం
iii) మూర్ధన్య ప్రభావం
ఇండ్ + లు = ఇండ్ + ళు
iv) డ్ ళ్ గా మారటం + నకారలోపం. ఇన్^డ్ > ఇళ్ +ళు = ఇళ్ళు

అన్ని రూపాలకూ కూడా ఈ సూత్రాలే వర్తిస్తాయి. దీనిని ప్రాచీన వ్యాకర్తల సూత్రం ‘రడలయో రభేదః’ అనే దానితో కూడా వర్తింపచేసి అర్థం చేసుకోవచ్చు.

దేవినేని సూరయ్య ఈ పద్యంలోని ఏకవచన బహువచనాలను వివరణ కింద పక్క పక్కగా ఇచ్చారే తప్ప వాటి గురించి వ్యాఖ్యానం చేయలేదు (చూ.పు. 73). తెలుగు బహువచనంలో వచ్చే మూర్ధన్య ‘ళ’ కారం ఎట్లా వస్తుందో వివరించడం అంత తేలికైన విషయం కాదని చేరా (1972) గుర్తించాడు. శివకుమార్ వీటికీ నన్నయ ఉదాహరణలు చూపించాడు.

తే.
పేను చేను మీ నను నివి పెక్కులైన
బేలు చేలు మీలు ననఁగఁ బోలు జగతి
యిలకుఁ దులువొందు నొకకొన్ని యిలనడంచి
లులబహుత్వమునం దుది మెలఁగుచుండు. (75)

పేను = తలలో చేరి కొరికే ప్రాణి; చేను = పొలం; మీను = చేప; అనున్ = అనే; ఇవి = ఇలాంటి మాటలు; పెక్కులు అయినన్ = బహువచనంగా మారినప్పుడు; పేలు, చేలు, మీలున్; అనఁగన్+పోలు = పేలు, చేలు మీలుగా మారుతాయి; జగతి = ఈ భూమి మీద; ‘యి’ లకున్ = ‘యి’ కారాంతాలకు ‘తులు + పొందున్ = ‘తులు’ అనేది చేరుతుంది; ఒకకొన్ని = కొన్నింటిలో; యి లను = ‘ యి ‘ వర్ణాలను; అడంచి = తోసివేసి; ‘లుల’ బహుత్వమునన్ = ‘లు, ల’ అనే బహువచన ప్రత్యయాలలో; తుది = చివర; మెలగుచుండు = ప్రవర్తిస్తుంటాయి.

“పేను, చేను, మీను వంటి పదాల బహువచన రూపాలు పేలు, చేలు, మీలుగా మారుతాయి. అలాగే ‘యి’ కారంతమైన మరి కొన్ని పదాలకు ‘తులు’ అని బహువచనంలో వచ్చి చేరుతుంది. కాని కొన్ని యికారాంత పదాల్లోని ‘యి’ ని తోసివేసి బహువచన ప్రత్యయాలైన ‘లు’ ‘ల’ లు వచ్చి చేరుతాయి”.

తెలుగు బహువచన ప్రత్యయం ‘లు’ అయినప్పటికీ అది చేరినప్పుడు ప్రాతిపదిక రూపాలు వాటి ఏకవచన రూపాలవలె ఉండటం లేదు. అవి వివిధ రకాల మార్పుకు లోనవుతున్నాయి. అందువల్ల ఈ పద్యంలో ఇచ్చిన పేను, చేను, మీను వంటి పదాలకు బహువచనం చేరినప్పుడు ‘ను’ లోపించి పేలు, చేలు, మీలుగా మారుతాయి. అంటే -లు బహువచన ప్రత్యయాన్ని తొలగిస్తే పే- ((పేను), చే-(చేను), మీ- (<మీను) అని పదాంశంలో సగభాగమే మిగులుతుంది. అయితే ఇలా అన్ని 'న' (ను) కారాంతపదాలకూ వర్తించదు. అదే నిజానికి ప్రధాన సమస్య. అలాగే 'యి' తో అంతమయ్యే ఏకవచనరూపాలు బహువచనంగా మారినప్పుడు కొన్నింటికి 'తులు' వచ్చి చేరుతుందనీ, కొన్నిటికి 'యి' తొలగిపోయి కేవలం బహువచనరూపం చేరుతుందనీ ఈ పద్యంలో వివరించాడు. అంటే -యి తో అంతమయ్యే పదాలన్నీ ఒకే విధంగా బహువచనంలో ఉండవని తెలుస్తోంది. దేవినేని సూరయ్య తన వివరణలో "పేను చేను మీను అను పదములు బహువచనమున పేలు, చేలు, మీలు అని యగును. 'యి' అంతమందు గల పదములు కొన్నిటికి ఆ 'యి' వర్ణముల స్థానముల 'తి' వర్ణములును, కొన్నిటికి లు వర్ణములును వచ్చును” (పు. 73) అన్నారు. కానీ నిజానికి 'తి' వర్ణం ఒక్కటే రాదు. అందుకే కేతన 'తులు' అని వర్ణనాత్మక సూత్రం చెప్పాడు. తర్వాతి వ్యాకర్తలు 'ఇ' 'టి' 'తి' అనేవి బహువచనాల్లో (ఇంకా ఇతరమైన విభక్తులు చేరేచోట్ల) ఔపవిభక్తికాలుగా వచ్చి చేరుతాయని చెప్పారు. ఆ ప్రకారం ఉదాహరణలు దీనికింది పద్యంలో కనిపిస్తాయి.

తే.
చేయి వాయి నేయి యనుచుఁ జెప్పుచోటఁ
బ్రీతిఁ జేతులు వాతులు నేతు లయ్యె
రాయి రేయి వేయి యనుచో రాలు రేలు
వేలు నా నొప్పు బహువచో ళయందు. (76)

చేయి = హస్తం, శరీరాంగం; వాయి = నోరు; నేయి = వెన్నకాచగా ఏర్పడేది; అనుచు = అనే విధంగా; చెప్పుచోటన్ = చెప్పేమాటలలో; ప్రీతిన్ = ఆనందంగా, చేతులు; వాతులు; నేతులు; అయ్యెన్ = చేతులు, వాతులు, నేతులుగా మారాయి; రాయి= బండ; రేయి = రాత్రి; వేయి వందపదులు; అనుచో= అనేవాటికి; రాలు, రేలు, వేలు, నాన్ = రాలు, రేలు, వేలు అని; ఒప్పు = సరిపోతాయి; బహువచోవేళయందు = బహువచనాల్లో.

“చేయి, వాయి, నేయి అనే ‘యి’ కారాంత పదాలకు ‘తులు’ చేరడం వల్ల వాటి బహువచనాలు చేతులు, వాతులు, నేతులు గా మారుతాయి; కానీ ఇతరమైన మరికొన్ని యికారాంత పదాలైన రాయి, రేయి, వేయి లలో ‘యి’ లోపించి (తోసివేసి లేదా తొలగిపోయి) రాలు, రేలు, వేలు అని బహువచన రూపాలు ఏర్పడుతాయి”

ఇక్కడ కూడా ‘యి’ కారాంత పదాలు రెండు రకాలుగా బహువచన రూపాలను ఎలా పొందుతాయో కేతన చూపించాడు. అవి:

i) చేయిచేతులు, వాయి -వాతులు, నేయి – నేతులు
ii) రాయి – రాలు, రేయి – రేలు, వేయి – వేలు.
i) లో చేయిలో యి లోపించి ‘లు’ చేరిస్తే చేలు అనే తప్పు రూపం వస్తుంది. ఇది

చేనుకు బహువచన రూపం. అందువల్ల కేవలం ‘యి’ లోపించిన కొన్ని పదాలకు ‘లు’ చేర్చితే సరిపోతుంది కానీ, మరికొన్ని పదాలకు సరిపోదు. అందువల్ల వాటికి ఇతర విభక్తి ప్రత్యయాలు చేర్చే ముందు వచ్చే ఔపవిభక్తిక రూపాల్లో ఒకటైన ‘తి’ చేర్చాలి. అందువల్ల నిజానికి కేతన అన్నట్లుగా ఇది ‘తులు’ ప్రత్యయం కాదు; అయినా వర్ణనాత్మక వ్యాకర్తలకు ఇలాగే వర్ణించడం పరిపాటి. ప్రాచీనుడైనా కేతన ఉపయోగించిన పద్ధతి కూడా అలాంటిదే. ఈ ‘తి’ చేరే పదాల బహువచన రూప నిష్పన్నం ఈ కింది విధంగా ఉంటుంది. ఉదా:
చేయి +లు (బహువచనం) (i)
 -> చే+లు ‘యి’ లోపం (ii)
 -> చేతి + లు ఔప విభక్తిక ‘తి’ ఆగమం (iii)
 -> చేతు+లు స్వరసమీకరణం (iv)

వాతులు, నేతులు మొదలైనవి కూడా ఇలాగే.

ఇతర విభక్తులు చేరినప్పుడు :

చేయి + ని > చేతిని
చేయి + తో — చేతితో > చేత్తో
చేయి + కి > చేతికి

అందువల్ల కేతన చెప్పిందీ అసంపూర్ణమే; సూరయ్య చెప్పిందీ అసంపూర్ణమే. కానీ కేతన ఎంచుకున్న పద్ధతికి ఆయన చెప్పిన విధానం సరియైందనే అనుకోవాలి.

క.
రులుడుడి లంత్యము లైనన్
లుల నడఁచి తదంత్యములకు ళుఱ్ఱగు బహుతం
బలు గోళ్ళని కొనవేళ్ళని
కలగూళ్ళున్ లేళ్ళు నాఁగఁ గ్రమమై యునికిన్. (77)

రు, లు, డు, డి లు = రుకార, లుకార, డుకార, డికారాలు; అంత్యములు + అయినన్ = చివరలో ఉన్నట్లయితే; లులను = లుకార లకారాలను; అడఁచి = అణచివేసి, తొక్కిపెట్టి; తత్ + అంత్యములకు = వాటి చివరలకు; ళుఱ్ + అగు = ళుకారం వస్తుంది; బహుతం= బహువచనంలో; పలుగోళ్ళు+అని = గోరు (చేతి, కాలివేళ్ళ చివరలో పెరిగేది) కు బహువచనం అనే విధంగా; కొనవేళ్ళు = అని వేలికి బహువచనం; కలగూళ్ళున్ = గూడుకు బహువచనం; లేళ్ళు = లేడి (జింక వంటిది) కి బహువచనం; నాగన్ = అనే విధంగా; క్రమమై = వరుసగా; ఉనికిన్ = ఉండటం వల్ల.

“రు, లు, డు, డి అనే వర్ణాలు పదాల చివర ఉన్నట్లయితే వాటిని తొలగించి వాటి స్థానంలో ‘ళు’ కారం వస్తుంది. పలుగోళ్ళు (రు) అంతానికి); కలగూళ్ళు (‘డు’ అంతానికి) కొనవేళ్ళు (‘లు’అంతానికి); లేళ్ళు (డి అంతానికి) వరుసగా ఉదాహరణలు”.

సాధారణంగా అనేక భాషల్లో ర, ల, డలకు సారూప్యం చూపడం అనేది కనిపిస్తుంది.

భారతీయ భాషల్లో ఇది చాలా ఎక్కువ. పదమధ్య, పదాంతాలలో ర, డ లు ఒకదానికి బదులుగా మరొకటి పలకటం; రాయటం ఉంది. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలోని అనేకభాషల్లో ఈ ఉచ్చారణా భేదాలు కనిపిస్తాయి. చండీఘర్ /ఘడ్; అలీఘడ్/ ఘర్ ఇలా. కేతన ఇక్కడ రు కారాంత, లుకారాంత, డు కారాంత, డి కారాంతాలకు అదే వరుసలో ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చాడు.

ఉదా: గోరు + లు = గోళ్ళు
వేలు + లు = వేళ్ళు
గూడు + లు = గూళ్ళు
లేడి + లు = లేళ్ళు
వాటన్నింటిలోనూ ఏక సూత్రంగా వర్తించే వర్ణసూత్రాలు:
i) ‘ఉ’ కార లోపం
వేల్-; గూడ్-; లేడ్-
ii) పూర్ణ మిశ్రమం.
{ ర, ల, డ, డి} > ‘ళు’/ లు
iii) లు > ‘ళు’
2. గోళ్ళు, వేళ్ళు, గూళ్ళు, లేళ్ళు.

క.
పదము తుది యిత్వ ముత్వము
పదిలంబుగ బహువచనము పై నొందినచో
నది దెలియుఁడు మణులు ఘృణులు
సుదతులు సన్మతులు సఖులు సుకవు లనంగన్. (78)

పదము తుది = మాట (శబ్దం) చివర (ఉన్న) యిత్వము = ఇ కారం, ఉత్వము = ఉకారంగా; పదిలంబుగ = జాగ్రత్తగా; బహువచనముపైన్ = అనేకార్థంలో; ఒందినచోన్ = పొందినట్లైతే; అది తెలియుడు = ఆ విషయం గ్రహించండి (తెలుసుకోండి); మణులు = మణి + లు = ఒక విధమైన రత్నాలు; ఘృణులు = ఘృణి +లు = కాంతులు, కిరణాలు; సుదతులు = సుదతి + లు – స్త్రీలు; సన్మతులు = (సత్) మతి +లు = మంచి మనస్సు కలవారు; సఖులు = సఖి + లు = మిత్రులు /చెలికత్తెలు; సుకవులు = సుకవి + లు = మంచి కవులు; అనంగన్ = అనే విధంగా. “పదాల చివర ‘ఇ’కారం ఉన్నట్లయితే అది బహువచనం ముందు ‘ఉ’ కారంగా మారుతుంది; మణి- మణులు, ఘృణి – ఘృణులు, సుదతి – సుదతులు, సన్మతి సన్మతులు, సఖి – సఖులు, సుకవి – సుకవులు అనే విధంగా అని తెలుసుకోండి”.

సుకవి +లు ఇది తెలుగులోనే కాక టర్కిష్ వంటి ఇతర అనేక భాషల్లో వర్తించే సూత్రం. ఇంగ్లీషులో దీనిని Vowel Harmony అంటారు. చేకూరి రామారావు దీన్ని ‘స్వర సమీకరణం’ అని తెలుగులో వాడారు. ఒక అచ్చు తనకు ఎడమ పక్కన కానీ, కుడి పక్కనకానీ ఉన్న హల్లును దాటుకుని దానికి పక్కన ఉన్న అచ్చును ‘తన’ వలెనే మార్చుకోవడం ఈ వర్ణ సూత్రంలో విశేషం. దీనిని ఈ కింది విధంగా సూత్రీకరించవచ్చు. -ఇ ) >-ఉ- /-లు (బహువచనం)

పై సూత్రం ప్రకారం ఏర్పడే బహువచన రూపాలు:

మణి + లు = మణులు; ఘృణి + లు = ఘృణులు
సుదతి + లు = సుదతులు
సన్మతి + లు = సన్మతులు
సఖి + లు = సఖులు
సుకవి+లు = సుకవులు

(వీటిపై ఇంకా సమాచారం కోసం చూ. చే. రామారావు, 1982)

తే.
పరఁగుఁ బెక్కిట నొకటె తెమ్మెరలు నీళ్ళు
వఱలు కొలుచుల పేర్లెల్ల బహువచనము
గోదుమలు వడ్లు జొన్నలు కొట్టి లాళ్ళు
చోళ్ళు ననుములు పెస లనఁ జెల్లుఁ గాన. (79)

పరగున్ = ఉపయోగింపబడతాయి; పెక్కిటన్ చాలావాటికి (అంటే బహువచనంలో); ఒకటే (ఒకటి + ఎ) = ఒక్కటే (మాట); తెమ్మెరలు = పిల్లగాలులు; నీళ్ళు = నీళ్ళు; వఱలు = ఉంటాయి; కొలుచుల పేర్లు కొలతల పేర్లు; ఎల్ల = అన్నీ; బహువచనము = బహువచనంలోనే; గోదుమలు = గోధుమలు; వడ్లు = వడ్లు/ వరిధాన్యం; జొన్నలు = జొన్నలు అనే ధాన్యం; కొట్టలు =కొట్టలు అనే ధాన్యం; ఆళ్ళు = ఆళ్ళు అనే ధాన్యం; చోళ్ళు = చోళ్ళు అనే ధాన్యం; అనుములు = ‘అనుములు’ అనే ధాన్యం, పెసలు = పెసర్లు అనే పప్పుదినుసు; అనన్ అనే విధంగా; చెల్లున్ వ్యవహరింపబడుతాయి కాబట్టి.

“తెమ్మెరలు, నీళ్ళు అనేటటువంటి మాటలు నిత్యబహువచనాలు; అలాగే కొలత సంబంధమైన (ధాన్యం, పప్పు మొ॥) గోదుమలు, వడ్లు, జొన్నలు, కొట్టెలు, ఆళ్ళు, చోళ్ళు, అనుములు, పెసలు – అన్నీ కూడా నిత్యబహువచనాలుగానే చెల్లుతాయి.”

ఇది అపవాద సూత్రం. పదాలన్నింటికీ సాధారణంగా ఏక-బహు వచన భేదాలుంటాయనీ, బహువచన ప్రత్యయం చేరి ఆ రూపాలు ఏర్పడుతాయనీ ఇప్పటిదాకా తెలుసుకున్నాం.

కానీ చాలా భాషల్లో కొన్ని మాటలు నిత్యఏకవచనాలుగానో, నిత్యబహు వచనాలుగానో ఉంటాయి. కేతన ఉదాహరించిన పై పద్యంలోని మాటలకు ఏకవచన రూపాలు తెలుగులో లేవు. తెమ్మెరలు, నీళ్ళు; గోదుమలు, వడ్లు, జొన్నలు అంటామే కానీ గోదుమ, జొన్న అనం అని దీని అర్థం. అయితే పదబంధాలలో మాత్రం ఏకవచన రూపం కనిపిస్తుంది.

గోదుమపంట, జొన్నచేను, వరిపిండి, పెసరపప్పు ఇలాగ. అందువల్ల తెమ్మెరలు వీచాయి; నీళ్ళు కాగాయి అని వాటికి బహువచన క్రియారూపాలతోనే అమరిక, ఒప్పందం ఉంటాయి. అంతేకానీ పెస-, అనుము -, కొఱు-లాంటి ఏక వచన రూపాలు వాటికి భాషలో లేవు.

క.
చెలియ లన నా లన మఱం
దలు కోడలు నాఁగ జను పదంబులతుదలన్
లులకుండ్ర లగుం బెక్కిటఁ
జెలియండ్రన నాండ్రనంగఁ జెల్లుటవలనన్. (80)

చెలియలు అనన్ = చెల్లెలు అనే; ఆలు అనన్ = ఆలు అనే; మఱందలు = మరదలు; కోడలు = కోడలు; నాగన్+చను = అనేటటువంటి; పదంబుల తుదలన్ = పదాల చివర; లులకున్ = లుల వర్ణాలకు; ‘-ండ్ర’లు అగు = ‘-ండ్ర’ వర్ణకం అవుతుంది; పెక్కిటన్ = చాలా వాటిలో; చెలియండ్రు అనన్, ఆండ్రు అనంగన్ = చెలియండ్రు, ఆండ్రు అనే విధంగా; చెల్లుటవలనన్ = ఉపయోగించడం వల్ల.

“చెలియలు, ఆలు, మరదలు, కోడలు వంటి పదాల చివరన చేరే బహువచనం లులవర్ణాలకు బదులుగా ‘-ండ్రు’ అని చేరి చెలియండ్రు, ఆండ్రు అని అవుతుంది”.

పదాంశ నిర్మాణ శాస్త్రం ప్రకారం ఒక్కొక్కసారి ఇలాంటి పదాల చివరన ఉండే ‘లు’ కారాన్ని కూడా బహువచన ప్రత్యయంగా పొరబడే అవకాశం ఉంది. గోదుమలు, జొన్నలు వంటి వాటిలోని ‘లు’ బహువచనం కాగా చెలియలు, ఆలు, మరదలు, కోడలు వంటి మాటలలోని ‘లు’ ఆ పదంలోని భాగమేకానీ బహువచన ప్రత్యయంచేరగా ఏర్పడిన రూపం కాదు. కాబట్టి అవి రెండు భిన్న పదాంశాల సమాహారం కాదు ఏకపదాంశాలే. అందువల్ల వీటికి బహువచనంగా కావ్యభాషలో ‘–ండ్రు’ వచ్చి చేరుతుంది.

చెలియలు + లు = చెలియండ్రు
ఆలు + లు = ఆండ్రు
మరదలు + లు = మరదండ్రు
కోడలు + లు = కోడండ్రు

అయితే తరవాత భాషా పరిణామంలో చెలియలు ‘చెల్లి’ (సోదరి) అనే అర్థంలోకాక “స్నేహితురాలు’ అనే అర్థంలో వాడటం జరుగుతోంది. దాంతో చారిత్రక భాషాశాస్త్రం వివరించే ‘తప్పు విభజన (wrong splitting) వల్ల చెలియలు నుండి ‘చెలియ’ ఏకవచనం అయింది; మల్లియ వంటి పదాల్లో వలె ‘య’ కారం కూడా పోయి చెలియ ‘చెలి’ అని కూడా మారింది. ఆధునికంగా ‘చెలి’ ‘చెలియ’ వేరు; ‘చెల్లి, చెల్లె, చెల్లెలు’ వేరు. అయితే పై పదాలకు సాహిత్యంలో ‘-ండ్రు’ చేరటం ఉన్నప్పటికీ తర్వాత కాలంలో ‘ళ్ళు’ కూడా చేరుతూ వచ్చి (పూర్తి ధ్వని సంయోజన ద్వారా) ఆధునికభాషలో కోడళ్ళు, మరదళ్ళు, చెల్లెళ్ళు అనే ప్రయోగాలు గానే ఉన్నాయి. ‘ఆలు’ అనే మాట వాడుకలో ఉన్నా ‘ఆండ్రు’ కానీ ‘ఆళ్ళు’ కానీ ఇప్పుడు ప్రయోగంలో లేవు.

కేతన చెప్పిన పాలు, కాలు వంటి మాటల్లో ఒకపాలు నిత్యబహువచనం (అమ్మ పాలు, ఆవు పాలు), రెండోపాలు (భాగం) పాళ్ళు అవుతుంది. అలాగే కాలు – కాళ్ళు అవుతుంది.

ఇప్పటివరకు చూపిన తెలుగు బహువచనాల్లో ‘లు’ను ప్రాథమిక పదాంశంగా తీసుకుంటే దానికి ఇతర పదాంశ విధేయ సపదాంశాలు కూడా ఉన్నాయని గుర్తించవచ్చు. అవి:
లు > [ ళ్ళు ]
లు > [ రు ]
లు > [-ండ్రు]

అయినప్పటికీ కేతన వివరించిన ఈ బహువచన రూపనిష్పత్తి సమగ్రం కాదనే చెప్పాలి. ఎంతో లోతుగా ఈ అంశాన్ని చర్చించిన చేరా (1972/1982) వివరణ కూడా అన్ని సమస్యలకు పరిష్కారం చూపించ లేకపోయిందని గ్రహిస్తాం. ఈ విషయమై ఇంకా అధ్యయనం జరగాల్సే ఉంది. అయినా ఆశ్చర్యకరంగా స్వభాషేతరులు “క్లిష్టం” అనుకునే ఇలాంటి వాటిని ఆయా భాషల్లో పుట్టిన పిల్లలు మాతృభాషగా (లేదా మొదటి భాషగా) నేర్చుకునేటప్పుడు కొన్ని దశల వారీగా (చూ. ఉషాదేవి, చంద్రశేఖర రెడ్డి 1986) నేర్చేసుకుంటారు.

దీనికి దేవినేని సూరయ్య వివరణ ఇలా ఉంది. “తెలుగులలో బహువచన రూపములందు లువర్ణకములకు వ్యంజనములకు బూర్ణబిందు పూర్వక డ్రకారము వచ్చును. చెలియలు- చెలియండ్రు, ఆలు – ఆండ్రు) మొ” (పు. 76)

క.
జంగమపదములుఁ దక్క ధ
రం గల పదములద్వితీయ ప్రథమయు నగు రా
జంగదము లూడ్చెఁ బతినూ
త్నాంగదములఁదా ల్చెననఁగ ననువై యునికిన్. (81)

జంగమ పదములు = కదిలే (ప్రాణి) పదాలు; తక్కన్ = తప్ప; ధరన్ = భూమిలో; కల = ఉన్న; పదముల = మాటల; ద్వితీయ = ద్వితీయావిభక్తి; ప్రథమయున్ అగు = ప్రథమ కూడా అవుతుంది. రాజు అంగదములు = రాజు ఆభరణాలు (ఆభరణాలను అని కాకుండా); ఊడ్చెన్ = తీసి వేసాడు; పతి = భర్త/రాజు; నూత్న = కొత్త; అంగదములన్ = ఆభరణాలను, తాల్చెన్ = ధరించాడు; అనగన్ = అన్నట్లుగా; అనువై = వీలుగా; ఉనికిన్ = ఉండేవిధంగా.

“కదిలే ప్రాణి పదాలు తప్ప మిగిలిన పదాలన్నింటికీ ద్వితీయావిభక్తి కూడా ప్రథమావిభక్తి వలెనే ఒక్కొక్కసారి ఉండవచ్చు. ఉదా: రాజు అంగదములు తీసి వేసాడు అని ప్రథమలో కానీ, లేదా రాజు నూత్న అంగదములను ధరించాడు అని ద్వితీయా విభక్తి ప్రత్యయంలో కానీ వీలుకొద్దీ వాడవచ్చు”.

భాషలోని మాటలను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. వాటిలో ఒకటి స్థావర జంగమ భేదం. జంగమాలలో ముఖ్యంగా మనుష్యులు, ఇతర కదిలే ప్రాణులు చేరుతాయి. జీవం ఉన్నా కూడా చెట్లు స్థావరాలే (కదలవు కాబట్టి). అందువల్ల ‘జంగమం’ కాని పదాలన్నీ ద్వితీయా విభక్తిలో కొన్నిసార్లు ప్రత్యయంతోనూ, అప్పుడప్పుడూ ప్రత్యయం లేకుండా ప్రథమావిభక్తి రూపంలో వలెనే వాడవచ్చు. ఈ సూత్రం ఈ నాటికీ వర్తిస్తుంది.

పై సూత్రానికి ఉదాహరణగా ఒకే అంశాన్ని రెండుమార్లు ఒకసారి ద్వితీయా విభక్తి ప్రత్యయం లేకుండా, ప్రథమావిభక్తిలోనూ, రెండోసారి ద్వితీయా విభక్తి ప్రత్యయంతో కలిపీ ఉదాహరణలుగా ఇచ్చాడు కేతన.

1) రాజు అంగదములు ఊడ్చెను. (ప్రథమ)
2) రాజు (పతి) నూత్న అంగదములను తాల్చెను (ద్వితీయా విభక్తి – ను)

దీనిని “ఐచ్ఛిక సూత్రం” అని భాషాశాస్త్రంలో అంటాం. అంటే “రావచ్చు, రాకపోనూ వచ్చు” అని అర్థం. రెండూ సమ్మతమే. ఇవాళ కూడా మనం ఇదే విధంగా వాడుతున్నాం.
ఉదా:
1. నేను మూడు పుస్తకాలు కొన్నాను (ప్రథమ)
2. నేను మూడు పుస్తకాలను కొన్నాను (ద్వితీయ)

“ఉదా: రాజు నూత్నాంగదములను దాల్చెను. ఈ వాక్యమున అంగదములను శబ్దము జడపదార్థమగుట ద్వితీయా విభక్తి యందుండియు, రాజంగదములూడ్చెను అనునప్పుడు ప్రథమలో జేరినది. అట్లవుట జడంబు ద్వితీయకు మాఱు ప్రథమ యగునని తెలిసికొననగు” (ఉ.77). అని దేవినేని సూరయ్య వివరించారు. దీనిలోని సూత్రం ‘జడంబు ద్వితీయకు ప్రథమయగు’ అన్నది చిన్నయసూరిది.

తే.
వలసినప్పుడుచేతకై వలన యొక్క
యందు ననునివి యగుఁ దృతీయాదులందు
స్త్రీ పురుషశబ్దములయందు జేత వలన
నందు ననునివి యగుఁ దృతీయాదులందు. (82)

వలసినప్పుడు = అవసరమైనప్పుడు (కావలసినప్పుడు); చేత, కై, వలన, యొక్క, అందున్ = విభక్తి ప్రత్యయాలలో తృతీయ మొదలుకొని వాడే ప్రత్యయరూపాలైన చేత, కై, వలన, యొక్క అందున్, అనున్ = అనే; ఇవి = ఈ మాటలు; అగున్ = వస్తాయి, అవుతాయి; తృతీయ+ఆదులు+ అందు = తృతీయ మొదలైన వాటిలో; స్త్రీ పురుష శబ్దములయందు = స్త్రీ వాచక, పురుష వాచక పదాలలో; చేత, వలనన్, అందున్ = చేత, వలన, అందున్, అనున్ + ఇవి = అనే ఈ ప్రత్యయరూపాలు; అగున్ = వస్తాయి (అవుతాయి) తృతీయ+ఆదులు+అందు = తృతీయ మొదలైన వాటిలో.

“అవసరమైనప్పుడు తృతీయ మొదలుకొని ఉన్న విభక్తులకు చేత, కై, వలన, యొక్క, అందున్ అనే ఈ ప్రత్యయాలు వస్తాయి. మహతీ మహద్వాచకాల తృతీయ మొదలుకొని వచ్చే విభక్తులలో చేత, వలన, అందున్ అనే ప్రత్యయాలు వస్తాయి”.

ఈ పద్యంలో వేటికవిగా వేర్వేరుగా కాకుండా కేతన తృతీయ మొదలుకొని సప్తమీ విభక్తి వరకు ఎక్కడ అవసరమైతే అక్కడ చేత, కై, వలన, యొక్క అందున్, అనే ప్రత్యయాలు వస్తాయనీ, స్త్రీ పురుష వాచకాలలో మాత్రం తృతీయ మొదలైన వాటిలో “చేత, వలన, అందున్” వస్తాయని వివరించాడు. అంటే ‘కై, యొక్క” అనే విభక్తి ప్రత్యయాలు పురుష వాచక పదాలలో రావని ఉద్దేశించినట్లు అర్థం చేసుకోవాలి. అయితే ఈ పేర్కొన్న విభక్తులకైనా కేతన ఉదాహరణలు ఇవ్వలేదు. “అవసరమైనప్పుడు” అనడంవల్ల ఈ మాటను వ్యాకరణ రీత్యా వివరించలేం. ఎవరికి అవసరమైనప్పుడు? అని ప్రశ్నించుకుంటే బహుశా ‘కవులకు’ అని చెప్పుకోవాలి, ఎందుకంటే కేతన అనేక సందర్భాలలో వారినే నిర్దేశించాడు కాబట్టి. అయితే మొదట తానే చెప్పిన వాటిని “కారక సంబంధాలతో” ఎందుకని సమన్వయం చేయలేదో అర్థం కాదు; బహుశా కేతన నాటికి “ఈ ప్రత్యయం ఈ అర్థంలోనే వాడాలి” అనే స్పష్టమైన విధానం పరిణమించినట్లు లేదని భావించాల్సి ఉంటుంది. ఈ ఇచ్చిన ప్రత్యయపట్టిక అయినా ఆనాటికి శాసనాల్లోనూ, నన్నయ భారతంలోనూ కనిపించే ప్రత్యయాలన్నింటినీ చేర్చుకున్నది కాదు. ఈ విషయాన్ని గురించి హరిశివకుమార్ తన సిద్ధాంతవ్యాసంలో (1973) చెప్పారు. ఆయన శాసనాలలో నుండి, నన్నయ నుండి విభక్తులను చూపించి “కేతన కూడా తన వ్యాకరణముననిట్టి ప్రణాళికనే యొక దానిని పేర్కొనినాడు (ఆం. భా. భూ. 87-99).

కానీ అది సమగ్రమైనదని చెప్పుటకు వీలులేదు. శాసనములందును, నన్నయ భారత భాగమునను గన్పట్టు కొన్ని ప్రత్యయములను కేతన గ్రహింపనేలేదు” అనీ “కేతన పేర్కొనిన విభక్తి ప్రత్యయములలో శాసనములలో గన్పట్టుచున్న కై, ఉణ్ణి, అన్” వంటి ప్రత్యయములును, నన్నయ భాషలో కన్పట్టుచున్న ‘గుడిచి, మెయి, పొంటె, తదర్ధము, కోలెన్, కంటె, న’ వంటి ప్రత్యయములును వదిలిపెట్టబడినవి.

కావున కేతన ఇచ్చిన ప్రణాళిక అసంపూర్ణమైనదేనని విశదమగుచున్నది” (పు. 180) అని సరిగ్గా చెప్పారు. ఇందులో పేర్కొన్న వాటిలో ‘కోలెన్’ గురించి చేరా రాసిన ‘కోలెన్ శబ్ద విచారము’ అనే వ్యాసం (1982) మరిన్ని వివరాలు తెలియజేస్తుంది. దేవినేని సూరయ్య వీటి వివరణలలోనికి వెళ్ళకుండా తనదైన పద్ధతిలో ఇలా వ్యాఖ్యానించారు.

“అవసరమైనప్పుడు చేత,కై, వలన, యొక్క అందు అను నీ ప్రత్యయములు తృతీయాద్యర్థమందు వచ్చును. ఉదా: ధనము చేత సౌఖ్యము గలుగును. ధనము వలన సౌఖ్యము గలుగును; శిరమున గురుపాదుకలు దాల్చితి; శిరము చేత గురుపాదుకలు దాల్చితి. చిచ్చురికెను. చిచ్చునందురికెను. రావణుని గోలం గూల్చెను. రావణుని గోలతో గూల్చెను. నీ కొఱకిచ్చె; నీకిచ్చె, వారు సుఖమున్నారు. వారు సుఖముతో నున్నారు మున్నగునవి యెఱుంగునది” (1953 పు. 77).

ముందే చెప్పుకున్నట్లు ఒక కారక సంబంధానికి ఒకటే ప్రత్యయం లేదా రెండు ప్రత్యయాలు అని నిర్దేశంగా లేని ద్రవీభూత స్థితిలో అప్పటి విభక్తి ప్రత్యయాల వాడుక ఉండేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక తెలుగులో విభక్తి వాడకం ప్రాచీన కాలం కన్నా మెరుగ్గా చాలా మటుకు స్థిరపడిందని చెప్పవచ్చు.

తే.
డులకు నిను నేకవచనము తెలుఁగులందు
నిలుచుఁ దత్సమపదముల నిలుచుఁబోవు
లలు ద్వితీయాదు లగువిభక్తులకు నెల్ల
బహువచనములై చను నెల్ల పదములందు. (83)

డులకున్ = ‘డు’ వర్ణక పదాలకు; నినున్ = ని, నున్ అనే ప్రత్యయాలు; ఏకవచనము = ఏకవచనంలో; తెలుగు లందు = తెలుగుమాటలలో; నిలుచు = ఉంటాయి; తత్సమ పదముల = తత్సమ పదాలలో; నిలుచున్ పోవు కొన్నిసార్లు ఉంటాయి, కొన్నిసార్లు పోతాయి; లలు = ‘ల’ వర్ణకాలు; ద్వితీయ ఆదులు + అగు = ద్వితీయ మొదలుకొని ఇతరమైన అన్ని; విభక్తులకున్ = విభక్తి ప్రత్యయాలకు; ఎల్లన్ = అన్నింటికి; బహువచనములై చనున్ = బహువచనాల్లో వస్తాయి; ఎల్ల పదములందు = అన్ని మాటలలోను.

“డు కారాంతాలయిన తెలుగు మాటలలో ని, నున్ అనే విభక్తి ప్రత్యయాలు తప్పనిసరిగా నిలిచి ఉంటాయి; (కాని) తత్సమ పదాలలో అవి కొన్నిసార్లు ఉంటాయి; కొన్నిసార్లు ఉండవు (పోతాయి). ‘ల’ అనే ఔప విభక్తికరూపం ద్వితీయ మొదలుకొని అన్ని విభక్తులకు ముందు బహువచనంలో అన్ని పదాలలోనూ వస్తుంది”.

ద్వితీయావిభక్తి ప్రత్యయంగా ఏకవచనంలో ని, నున్ ప్రత్యయాలు తెలుగుమాటలకు తప్పనిసరిగా అంటే నిత్యంగా వచ్చి చేరుతాయి. కానీ తత్సమపదాలకు మాత్రం అవి ఐచ్ఛికంగా అంటే వైకల్పికంగా అంటే చేరడమో, చేరకపోవడమో జరుగుతుంది. అలాగే ద్వితీయ మొదలుకొని చేరే అన్ని విభక్తి ప్రత్యయాలకూ ముందుగా బహువచనంలో ‘ల’ చేరుతుంది. ‘ల’, ‘లు’కి ఔపవిభక్తికరూపం.

దేవినేని సూరయ్య పదాల అర్థాలలోనే కుండలీకరణాల్లో ‘(డుమంతములకు ఇదంతములకు ‘ని’ వర్ణము వచ్చును. భిన్నములకు ‘ను’ వర్ణము వచ్చును). అనీ, నిలుచున్ అన్నప్పుడు “నిత్యముగా నగుననుట” అనీ, నిలుచున్ పోవున్ అన్నచోట “వికల్పముగా నుండుననుట” అనీ అలాగే “బహుతాయాంద్వితీయాది విభక్తీనాం లడాగమః” అను సూత్రము చొప్పున ద్వితీయ మొదలగు విభక్తులకు మొదట ‘ల’ కారము బహువచనమున నిల్చును” అనీ వివరించారు. హరిశివకుమార్ దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

క.
కమియంగ నికి నకులు త
త్సమములఁ బోఁద్రోచి నిలుచు షష్ఠ చతుర్థిన్
గ్రమమునఁ గుఱ్ఱగు నఱ్ఱం
తమునకు నుఱ్ఱంతమునకుఁ దగు నఱ్ఱు లలిన్. (84)

కమియంగన్ విస్తరిస్తూ (అంటే అంతటా వర్తిస్తూ) నికి = ‘నికి’ అనే రూపం; ‘నకు’లు = ‘నకు’ అనే రూపం; తత్సమములన్ = తత్సమపదాలలో; పోద్రోచి = తొలగించి, (తోసివేసి); నిలుచు = నిలుస్తాయి; షష్ఠి చతుర్థిన్ = షష్ఠీ విభక్తిలోనూ, చతుర్థి విభక్తిలోనూ; క్రమమున్ = వరుసగా; కుఱ్ఱు+అగు = ‘కు’ వర్ణకం వస్తుంది; అఱ్ఱు అంతమునకున్ = అకారాంత పదాలకు; ఉఱ్ఱు అంతమునకు = ఉకారాంత పదాలకు; తగున్ = సరిపోతుంది; అఱ్ఱు = ‘అ’ కారం; లలిన్ = వరుసగా, క్రమంగా.

“తత్సమపదాలకు వాటి చివరన ఉండే ప్రత్యయాలు పోయి, షష్ఠీవిభక్తి, చతుర్థి విభక్తి ప్రత్యయాలు నికి, నకులు చేరుతాయి. అప్పుడు అకారాంత పదాలకు ‘కు’ కారం, ఉకారాంత పదాలకు ‘న’ కారం వరుసగా వస్తాయి”.

ఈ పద్యంలో మూడు సూత్రాలున్నాయి. మొదటిది తత్సమ పదాంత ప్రత్యయలోపం; రెండోది చతుర్థి, షష్ఠీ విభక్తులకు ‘నికి’ లేదా ‘నకు’ వచ్చి చేరటం; మూడోది అట్లా చేరినప్పుడు అకారాంత పదాలకు ‘కు’ కారం, ఉకారాంత పదాలకు ‘న’ కారం అవడం. ఇవి కూడా క్రమసూత్రాలే. ఆధునిక భాషా శాస్త్రంలో Rule Ordering అని చెప్పే సిద్ధాంతం కూడా ఒక సూత్రం తర్వాత మరొకటి వర్తిస్తుందని వివరిస్తుంది.

దీనిని గురించి దేవినేని సూరయ్య ఇలా చెప్పారు. “కొన్నిటికి నికి గాని నకు గాని ఏదియైనను ఒక్కటి వచ్చును. అనగా నొకసారి నికియు, మరొకసారి నకును వచ్చుననుట. అదంతములకు ‘కు’ వచ్చును. అనగా బూర్వమున ‘న’ కారముగాని ‘ని’ కారముగాని లేకయే వచ్చుననుట. ఉకారాంతములకు ‘నకు’ వచ్చును”. నిజానికి ‘నికి’, ‘నకు’ అనేవి ‘స్వేచ్ఛా వైవిధ్యాలు’ (Free Variation) గా చూపిస్తున్నాడు కేతన. కానీ ఇవి ఆధునికభాషలో ‘సపదాంశాలు’గా రూపొంది, ఇకారాంతాలకు ‘నికి’ ఇతరాలకు ‘నకు’ (అంటే కి/కు భేదం) వస్తాయని గ్రహించాలి.

క.
గురునికి గురునకు ననఁగాఁ
బరఁగఁగ బాలునికి ననఁగ బాలున కనఁగా
గరగకు గొరవకు ననఁగాఁ
దరమున కురమునకు నా నుదాహరణంబుల్. (85)

గురునికి = అధ్యాపకునికి (నికితో); గురునకున్ = గురు (వు) నకు; అనఁగా = అనే విధంగా; పరఁగఁగ = స్పష్టంగా; బాలునికి అనఁగా = పిల్లవాడికి అనే విధంగా; బాలునకు అనఁగా = బాలునకు (అనికూడా) అనే విధంగా; గరగకు= చిన్నకుండకు అనే విధంగా, గొరవకు అనఁగాన్ = గొరవకు అనే విధంగా; తరమునకు = తరము + నకు; (తరము అనే మాటకు ఎన్నో అర్థాలున్నాయి చూ.శ.ర.) ఉరమునకునాన్ = ఉరము (రొమ్ము) + నకు అనే విధంగా; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“గురునికి అనే విధంగా ‘నికి’తోనూ, గురునకు అన్నప్పుడు ‘నకు’ తోనూ అలాగే బాలునికి, బాలునకు అని రెండు రకాలుగానూ “నికి/నకు” ప్రత్యయాలు వచ్చి చేరుతాయి. అకారాంత పదాలైన గరగ, గొరవలకు ‘కు’ వర్ణకం; ఉకారాంతమైన తరము, ఉరము వంటి పదాలకు ‘నకు’ వచ్చి చేరుతుంది. ఇవీ ఉదాహరణలు”.

గురువు, బాలుడు ఇవి సంస్కృతం నుండి వచ్చిన సూత్రం ప్రకారం చివరి ప్రత్యయాలు పోయి ‘గురు’ ‘బాలు’ అని మిగులుతుంది. ఈ ‘గురు’ ‘బాలు’ శబ్దాలకు ‘నికి, నకు’ ప్రత్యయాలలో దేనినైనా చేర్చి రెండు రకాల రూపాలనూ సాధించి వాడవచ్చు.

కానీ అకారాంత పదాలైన గరగ, గొరవ వంటి వాటికి కేవలం ‘కు’ చేరగా, ఉకారాంత పదాలైన తరము, ఉరము వంటి పదాలకు ‘నకు’ చేరుతుందని ఈ పద్యంలో వివరిస్తూ ఉదాహరణలిచ్చాడు కేతన. సూరయ్య కూడా ‘నికి’ ‘నకు’ రెండు వచ్చుటకు గురునికి = గురునకు; ని వర్ణము గాని ను వర్ణము గానీ, పూర్వమందు లేక కేవలము కు వర్ణము వచ్చుటకు, ఉ ॥ గరగకు – గొరవకు, నకు మాత్రమే వచ్చుటకు, తరమునకు, ఉరమునకు ఇత్యాదులు” (పు. 79) అని వివరించారు. పైన చెప్పిన రెండు రూపభేదాలలో ఏదైనా రావచ్చునన్నదానిని పైన చెప్పినట్లు “స్వేచ్ఛావైవిధ్యం” (Free Variation) అని భాషా శాస్త్రంలో వివరిస్తారు. ఎందుకంటే వీటిని వర్ణవిధేయ, లేదా పదాంశ విధేయ సూత్రాలు వివరించలేవు

క.
ఇ ను డు రు లు ఱ్ఱంతములకు
కినులగు వారధికి చేనికిని నాడికి నో
రికి యూరికి వ్రేలికి నన
కును లగు బహువచనములకు కొడుకులకుననన్. (86)

ఇ, ను, డు, రు, లు+ఉఱ్ఱు+అంతములకు = పదాల చివరల్లో ఇ కానీ, ను కానీ, డు కానీ, రు కానీ, ఉ కానీ ఉన్నప్పుడు కినులు అగు = కినులు అవుతుంది; వారధికి = ఇకారాంతమైన వారధి పదానికి – కి చేరింది; చేనికి = <చేను నుండి ఔపవిభక్తికమైన చేని పదానికి కిని చేరింది; నాడికి = నాడు కి ఔప విభక్తికం నాడి (ఈ రోజు 'నాటి' అంటున్నాం) పదానికి 'కి' చేరుతోంది; నోరు+కి = నోరికి (= నోటికి); ఊరికి = ఊరు > ఊరికి (= పల్లె); వ్రేలికి = వ్రేలు > వ్రేలి + కి; అనన్ = అనే విధంగా; కులు = అనే
ప్రత్యయం; బహు వచనములకున్ = బహు వచనములు > ల + కున్ (రెండర్థాలు బహువచనములు+కు అనే పదానికి, అనే బహు వచన అర్థానికి); కొడుకులకు = కొడుకులు >కొడుకుల + కు అనన్ = అనే విధంగా.

“పదాల చివర ‘ఇ’, ‘ను’, ‘డు’, ‘రు’, ‘ఉ’ ఉన్నప్పుడు వాటికి ‘కి’ ‘ని’ ప్రత్యయాలు వచ్చి చేరుతాయి. ఉదాహరణలు: వారధికి, చేనికి, నాడికి, నోరికి, ఊరికి, వ్రేలికి. అయితే బహువచనాల్లో ‘కొడుకులకును’ అనే విధంగా ‘కును’ వస్తుంది”.

ఇంతకు పూర్వం చెప్పిన స్వరసమీకరణ సూత్రానికే చెందిందైనా దీనిలో ఏయే పదాంతాలకు ‘కిని’ చేరుతుందో ఈ పద్యంలో స్పష్టంగా వివరించాడు కేతన. వీటిని గురించి ఆధునిక పద్ధతులకు ఇంచుమించు సరి సమానమైన ఆలోచన, వివేచనలతో 13వ శతాబ్దంలోనే గుర్తించి సూత్రీకరించిన మొట్టమొదటి వ్యాకర్త కేతన. వీటిలో వారధిలాంటి పదాలు సహజంగా ‘ఇ’ కారాంతాలు కాగా, ను, డు, రు, లు చివర్లో ఉండే పదాలకు కూడా కిని వస్తుందని చెప్పడం ఇక్కడ విశేషం. అంటే ను, డు, రు, లు ఉకారాంత ప్రథమైక వచనాలుకాగా విభక్తి ప్రత్యయాలు చేరినప్పుడు అవి ఔపవిభక్తిక రూపాలుగా మారుతాయి. అంటే ని, డి,రి, లి అని. అయితే ఇక్కడ ఆధునిక భాషా శాస్త్రం ప్రకారం రెండు భిన్న వాదనలు చేయవచ్చు. వాటిలో అంతర్నిర్మాణంలో ప్రతిపాదించే రూపంలో తేడాలవల్ల సూత్రీకరణలో కూడా తేడా వస్తుంది. ఎలాగంటే.

పద్ధతి I:
చేను+కి = చేనికి
పద్ధతి II:
చేను >చేని+కు = చేనికి

మొదటి పద్ధతిలో/ కి/ ప్రధాన రూపం అయి ‘కి’ చేరినప్పుడు ఆరోపపదంలోని ఉత్వం ఇత్వంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది.

రెండవ పద్ధతితో చేను చేని అనే ఔపవిభక్తిక రూపంగా మారి, దానికి చేర్చిన /కు/ ప్రధానరూపం ‘కి’గా మారిందని చెప్పాల్సి ఉంటుంది.

మొదటి పద్ధతిలో /కి/ పదాంశం. అయితే (కి), (కు)లు సపడాంశాలు కాగా రెండవ దానిలో /కు/ పదాంశం అయి, (కు), (కి) లు సపదాంశాలవుతాయి. అప్పుడు స్వరసమీకరణ సూత్రం వర్తించే దిశలు పరస్పర విరుద్ధం అంటే మొదటిదానిలో కుడినుండి ఎడమకు; రెండవ దానిలో ఎడమనుండి కుడికి మారుతాయి. నన్నయ, కేతనల కాలానికి ‘నోరు’ వంటి ‘రు’ కారాంతాలకు ‘టి’ ఔపవిభక్తికం చేరలేదు. గమనించాలి.

సూరయ్య వివరణ: “ఇనుడురులు అనునవి యంతమందుగల శబ్దములకు నేక వచనమున కి వర్ణకమును బహువచనమున కు వర్ణకమును వచ్చును.”

వారధికి వారధులకు
చేనికి చేనులకు మొదలగునవి.

ఇట్లే బహువచనములనన్నింటికి. కొడుకులకు అనునప్పుడు కు వర్ణకము వచ్చును.

వ. తత్సమపదాంతంబు లగు సప్తవిభక్తులందు నేక వచన బహువచనము లెట్టివనిన. (87 )

తత్సమ పద = తత్సమ శబ్దాల; అంతంబులు = చివరలో; అగు = వచ్చే; సప్తవిభక్తుల + అందు = ఏడు విభక్తులలోను; ఏక వచన బహువచనములు = ఏకవచనాలు, బహువచనాలు; ఎట్టి వనిన = ఎట్లా అంటే,

“తత్సమ పదాలకు చేరే ఏడు విభక్తులు ఏ విధంగా ఉంటాయంటే”….

పిల్లలకైనా, పెద్దలకైనా, స్వభాషగా నేర్చుకునే వారికీ, పరభాషగా నేర్చుకునే వారికీ కూడా తెలుగులో ప్రధానమైన కష్టమంతా ‘తత్సమా’ల విషయంగానే ఏర్పడుతుంది.

తత్సమ సంబంధమైన ‘ధ్వనులు, వర్ణాలు, వ్యాకరణం’ అన్నీ కూడా తెలుగు భాషా వ్యవస్థకు అన్వయించుకున్న తీరువల్ల ఎంతో కొంత సంస్కృత భాషా వ్యాకరణాల పరిచయం లేకుండా ఇవి సరిగ్గా నేర్చుకోవడం కష్టం. తెలుగు వ్యాకరణ వ్యవస్థలో కలిసిపోయినట్లుగా కనిపించే ఈ అదనపు వ్యాకరణ భారం వల్ల, దేశీయ వ్యాకరణాన్ని బాల్యంలో అలవోకగా, అసంకల్పితంగా నేర్చుకునే పిల్లలు పాఠశాల, కళాశాల విద్యలస్థాయిలో తెలుగు వ్యాకరణం చదవటంచాలా కష్టమనుకోవడానికి ఇది మొదటి కారణం కాగా, వ్యాకరణ సూత్ర రచనా విధానం ఇప్పటికీ కూడా తెలుగులో అర్థం కాని రీతిలో ఉండడం మరో కారణం అని చెప్పవచ్చు.

ఈ వచనం తర్వాత కేతన ప్రథమ మొదలు కొని సప్తమివరకూ విభక్తి ప్రత్యయాల ప్రయోగం ఏక, బహువచనాలలో ఎలా ఉంటుందో ఉదాహరణలు ఇచ్చాడు. అందుకోసం పుంలింగ శబ్దమైన ‘సుతుడు’ పదాన్నీ, నపుంసకలింగశబ్ద మైన వృక్ష పదాన్ని తీసుకున్నాడు.

క.
సుతుఁడు సుతు సుతుని గనియెన్
సుతుచేతన్ సుతునిచేత సుతునకు నిచ్చెన్
సుతునికిని సుతునివలనన్
సుతువలనన్ సుతునిధనము సుతుధన మెలమిన్.(88)

సుతుడు = కొడుకు (-డు ప్రత్యయాంత ప్రథమావిభక్తి); సుతు సుతునిన్ కనియెన్ = సుతు అని ప్రత్యయం లేకుండానూ, సుతునిన్ అని ప్రత్యయంతోనూ కనియెన్ = చూసాడు (అర్థం బోధపడేందుకు కేతన తన ‘కావ్య’ శైలీ పద్ధతిలో ఎంచుకున్న పూరక క్రియా రూపం); సుతు చేతన్ = సుతునిచేత = కొడుకుచేత (రెండు రూపాలు ఏదైనా వాడవచ్చు); సుతునకున్ + ఇచ్చెన్ = (న)కు ప్రత్యయాంత ప్రయోగానికి, సుతునికిని= – నికి ప్రత్యయానికి ఉదాహరణ; సుతుని వలనన్ – సుతువలనన్ వలన ప్రత్యయానికి ఉదాహరణగా రెండు రూపాంతరాలు (ని-ఐచ్ఛికం); సుతునిధనము – సుతుధనము = యొక్క అనేమాట ఇవ్వకుండా యొక్క సంబంధం అర్థం వచ్చే రెండు రూపాలూ; ఎలమిన్ = = స్పష్టంగా.

“(i) సుతుడు (ii) సుత్తు సుతుని (చూసాడు); (iii) సుతు/సుతునిచేతన్; (iv) సుతునకు/ సుతునికిని (ఇచ్చెన్); (v) సుతుని వలన/ సుతువలనన్; (vi) సుతునిధనము/ సుతుధనము”
(ఇవి ఉదాహరణలు.)

ఈ పద్యంలో కేతన ప్రథమనుండి షష్ఠి వరకు మాత్రమే ‘సుతు’ శబ్దాన్ని తీసుకుని ఏకవచన రూపాలకు ఉదాహరణలు, రూపభేదాలు ఇచ్చాడు. సప్తమీ ఏకవచనం తర్వాతి పద్యంలో వస్తుంది. అయితే ఒకొక్క విభక్తికి తెలుగులో ఒక్కొక్క ప్రత్యయం అని నిర్దేశితమై లేదు. ఒక్కొక్క కారకానికి కనీసం 3, 4 రూపాలున్నాయి. కానీ అవన్నీ పరస్పరం ఒకదానికి బదులుగా మరొకటి వాడేందుకు ఉద్దేశించినవి కావు. దేని ప్రయోజనం దానిదే. వాటిలో తత్సమ పదాలకు వర్తించే ప్రథమావిభక్తి ప్రత్యయాలైన ‘డు, ము, వు’లపై చూపిన శ్రద్ధ మిగిలిన వాటిపై చాలా మంది వ్యాకర్తలు చూపలేదు. అయితే ఏయే ప్రత్యయానికి ఏయే సందర్భ ప్రయోగాలున్నాయో కొంచెం వివరంగా చెప్పింది బాలవ్యాకర్త చిన్నయ సూరే.

అయితే ఆయన సూత్రవిధానం ఆధునిక అవసరాలకు అనుగుణంగా అర్థబోధకంగా లేకపోవడం విద్యార్థులకు ఒక సమస్య అయితే, అది గ్రాంథిక లేదా కావ్య భాషా వ్యాకరణ సంబంధమైనది కావడం మరొక సమస్య అయింది. ఆ వ్యాకరణం మాత్రమే దశాబ్దాలుగా వ్యాకరణ పాఠ్య గ్రంథం అవడం వల్ల తెలుగుభాష అధ్యయనంచేసేవిద్యార్థులకు తెలుగు అంటేనే విముఖత ఏర్పడే పరిస్థితులకు దారితీసినట్లుగానూ, విద్యారంగంలో తెలుగు చదవడం పట్ల ఏర్పడుతూ వచ్చిన నిరాదరణకు గల అనేక కారణాల్లో ఇది ఒక ముఖ్య కారణం గానూ గుర్తించాలేమో పరిశీలించాలి.

క.

సుతునందు సుతునియందున్
సుతులు సుతుల సుతులచేత సుతులకు నిచ్చెన్
సుతులవలన సుతులధనము
సుతులం దన నేక బహువచోనియతి యగున్ (89)

సుతున్ + అందు = సుతుని + అందున్ = సప్తమీ ప్రత్యయం అందుతో రెండు రూపాలు; సుతులు = ప్రథమావిభక్తి బహువచనం; సుతుల = • ద్వితీయకు ప్రత్యయంలేని రూపం; సుతులచేత = తృతీయా ప్రత్యయం ‘చేత’కు ఉదాహరణ; సుతులకు =చతుర్థి ‘కు’ ఉదాహరణకు; ఇచ్చెన్ = ఇచ్చాడు (పూరక క్రియ); సుతులవలన = పంచమీ రూపం; సుతుల ధనము = షష్ఠీ విభక్తి రూపం; సుతుల + అందు = సప్తమీ బహువచన రూపం; అనన్ = అనే విధంగా; ఏక బహువచోనియతి = ఏక బహువచన రూపాలలో; అగున్ = (విభక్తులు) వస్తాయి.

“(iii) సుతునందు | సుతునియందున్ అ: (i) సుతులు; (ii) సుతుల; (iii) సుతులచేత (iv) సుతులకు; (v) సుతుల వలన; (vi) సుతుల ధనము (vii) సుతులందు అని బహువచన రూపాలు అవుతాయి”.

ఏకవచనంలో పై పద్యంలో చెప్పక మిగిలిన సప్తమీ రూపాలయిన ‘సుతునందు లేదా సుతుని యందు’ అనే రెండు రూపాలను ఇచ్చి, తర్వాత బహువచనంలో ప్రథమ నుండి సప్తమివరకు ఒక్కొక్క ఉదాహరణను చూపించాడు కేతన. ఎందుకంటే బహువచనంలో ఏకవచనంలో చెప్పినట్లు రెండేసి రూపాలు లేవు. వీటన్నింటికీ దేవినేని సూరయ్య అర్థవివరణ, వ్యాఖ్య లేవీ లేవు. ‘సుగమము’ అంటే “సులభంగా అర్థం అవుతుంది” అని మాత్రమే రాసాడు. (చూ.పు. 80-81).

వ.
ముఱ్ఱంతములకు (90)

ముఱ్ఱు = ముకారం; అంతములకు = అంతమందుండే పదాలకు;

‘డు’ కారాంతాలయిన (పురుష ప్రత్యయం) ప్రథమావిభక్తి తో కూడిన ఏడు విభక్తులను సప్తమి వరకు సూత్ర, ఉదాహరణలు ఇచ్చిన పిమ్మట ఇప్పుడు ‘ము’ వర్ణకం చివర వచ్చే మాటలకు ఏడు విభక్తి రూపాలను ఇచ్చాడు.

క.
వక్షము మొలచెను నటికెను
వృక్షము వృక్షమున బ్రతికె వృక్షమునకు నీ
వృక్షమునఁ బండు వడియెను
వృక్షముతుది వృక్షమున దవిలె నా చూడ్కుల్. (91)

వృక్షము మొలచెను = ‘ము’ ప్రథమావిభక్తికి; (మొలచెను = మొలకెత్తింది పూరకక్రియ); వృక్షము నటికెను = ద్వితీయకు ప్రత్యయలోపంతో = వృక్షాన్ని కొట్టేసాడు (చెట్టును నరికాడు); వృక్షము వృక్షమున బ్రతికె = ఒక చెట్టు మరో చెట్టుతో బతికింది;; (చేత కాకుండా ‘న’ వర్ణకంతో తృతీయా విభక్తి); వృక్షమునకు = (న)కు చతుర్థితో; ఈ వృక్షమునన్ = వృక్షం నుండి (చెట్టునుండి); పండు వడియె < పడియెను = పండు పడింది; వృక్షము తుది = చెట్టు (యొక్క) చివర; వృక్షమునన్ = వృక్షమున = చెట్టులో (=అందు); తవిలె = తగిలాయి; నా చూడ్కుల్ = నా చూపులు. “(i) వృక్షము, (ప్రథమ), (ii) వృక్షము (ద్వితీయ); (iii) వృక్షమున (చేత) (తృతీయ); (iv) వృక్షమునకు (చతుర్థి); (v) వృక్షమున (నుండి) (పంచమి); (vi) వృక్షము (యొక్క) తుది (షష్ఠి); (vii) వక్షమున (మీద, పై, లో - అందు) సప్తమీ - (ఇవి ఉదాహరణలు)”. ము కారాంత శబ్దాల విభక్తి ప్రత్యయాలను వివరించడానికి ఒక చిన్న పద్యంలోనే చెట్టుతో మనిషికి ఉన్న అనుబంధాన్ని కూడా చిన్న చిన్న వాక్యాలతో కథ అల్లినట్లు చెప్పాడు. కవి కావడం వల్ల, తెలుగు భాషపై ఆయనకు ఏర్పడ్డ అధికారం వల్లా వ్యాకరణాన్ని కూడా ఆసక్తికరంగా చెప్పడం, అదీ వీలయినన్ని తక్కువ మాటలు వాడుతూ చెప్పడం ఆయన ప్రత్యేకత. చూడండి: చెట్టు మొలుస్తుంది. మనం నరికేస్తాం; ఒక చెట్టుతో మరోచెట్టు లేదా మనిషి బతకటం జరుగుతోంది. చెట్టు నుండి పండు రాలుతుంది; చెట్టుపైన (మీద, లో, అందు) (నా) తన (మన) దృష్టి నిలుస్తుంది. నిజానికి ఇవన్నీ కారక సంబంధాలే; వీటిలో వాడిన ప్రత్యయం గమనిస్తే ఎక్కువగా 'న' కారం ఉండటం కనిపిస్తుంది. సరిగ్గా మళ్ళీ ఇదే విషయాన్ని ఇంచుమించుగా పై పద్యానికి లోబడి ఉండే విధంగా బహు వచన రూపాలకు కూడా వర్తింప చేస్తూ కింది పద్యం ఉంటుంది.

క.
వృక్షంబులు వృక్షంబుల
వృక్షంబులచేత బ్రతికె వృక్షంబులకున్
వృక్షములవలనఁ బండును
వృక్షంబులతుదలఁ గలవు వృక్షములందున్. (92)

వృక్షంబులు = చెట్లు (ప్రథమ); వృక్షంబుల = చెట్లు (ద్వితీయ); వృక్షంబుల చేత = చెట్ల చేత; బ్రతికె = జీవించె; వృక్షంబులకున్ = చెట్లకు; వృక్షములవలన = చెట్ల వల్ల (నుండి) పండును = పండ్లు పండుతాయి (కాస్తాయి); వృక్షంబుల తుదలన్ = చెట్ల (యొక్క) చివరన; కలవు = ఉన్నాయి (పండ్లు); వృక్షములందున్ = చెట్లలో. “బహువచన రూపాలకు ఉదాహరణలు: “(i) వృక్షంబులు/ వృక్షములు (ప్రథమ); (ii) వృక్షంబుల (ద్వితీయ); (iii) వృక్షంబుల చేత (తృతీయ); (iv) వృక్షంబులకున్ (చతుర్థి); (V) వృక్షముల వలన (పంచమి); (vi) వృక్షంబుల (చివర) (షష్ఠి); (vii) వృక్షములందున్ (సప్తమి).”

పైన ఏకవచనంలో వలెనే అన్నింటికీ ఒక్కొక్క ప్రత్యయ రూపాన్నే ఇచ్చాడు. అయితే ఏక- బహు వచనాల ప్రత్యయాలలో విభక్తి ప్రత్యయాల భేదాలను ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాలి. రెండూ ఒకే విధంగా లేవు. దానికి కారణం భాషలోనూ, కవుల ప్రయోగాలలోనూ భేదం ఉండటమే. దీనిని మొట్ట మొదట గమనించింది కేతనే అని చెప్పవచ్చు. ఈ విషయాలను తర్వాతి కాలంలో ఆధునిక భాషాశాస్త్ర పద్ధతులలో వింగడించిన భాషావేత్త చేకూరి రామారావు (1975).

వ.
లాంతములకు. (93)

‘ల’ + అంతములకు = ల కారాంత పదాలకు.

ము కారంత పదాలకు విభక్తులను పైన వివరించిన తర్వాత ‘ల’ కారాంతాలకు ఏడు విభక్తి ప్రత్యయాలు ఎలా వర్తిస్తాయో కింది పద్యాలలో వివరిస్తున్నాడు కేతన.

క.
తలయొప్పెన్ దల దిగిచెన్
దల దాల్చెన్ దలకుఁ జీర తలవిరి దొలఁగెన్
తలవెండ్రుక తలసొమ్ములు
తలలం దన నిట్లు బహువిధంబులఁ జెల్లున్. (94)

తల = తల (ప్రథమ) ఒప్పెన్ = పూరక క్రియ = ఒప్పుగా ఉంది (చక్కగా ఉంది. ); తల = తలను (ద్వితీయ); దిగిచెన్ = దించాడు (పూరక క్రియ); తలన్+తాల్చెన్ తృతీయావిభక్తి + పూరక క్రియ; శిరసావహించు = తలపై పెట్టుకొను; తలకున్ = చతుర్థి ‘కు’; చీర = పూరక పదం; తలకు చుట్టుకోవడం = తలపాగా; తల విరి తొలగెన్ = తలనుండి పూలు రాలాయి; తల వెండ్రుక = తల (యొక్క) వెండ్రుక (షష్ఠి); తల సొమ్ములు = తలమీద, పైన ధరించే నగలు (సప్తమీ); తలలు + అందు = తలలలో (సప్తమీ) అనన్ అనే; ఇట్లు = ఈ రకమైన; బహు విధంబులన్ = చాలా విధాలుగా; చెల్లున్ = వర్తిస్తాయి; వాడబడతాయి.

“(1) తల (ప్రథమ); (ii) తల (ను) (ద్వితీయ) (దించు); (iii) తల (చేత, తోడ) (తాల్చు); (iv) తలకుచీర (చతుర్థి); (v) తల (నుండి) పూలు (రాలాయి) (పంచమి); తలవెండ్రుక, తల సొమ్ములు, తలలందు (సప్తమి) అని పలు రకాలుగా ఏడు విభక్తులు ఉపయోగింపబడతాయి”.

‘తల’ అనేది ఆరోపం. ఏయే భక్తి ప్రత్యయాలు ఎలా వస్తాయో చెప్పాలంటే నిజానికి నామానికి క్రియకు మధ్య సంబంధాన్ని, అర్థాన్ని నెలకొల్పే విధంగా వాటిని మనం అర్థం చేసుకోవల్సి ఉంటుంది. అట్లా చెప్పడం వల్ల కారక సంబంధాలు బాగా అర్థమవుతాయి. అలాగే ఇది ఒక కథనం వలె చెప్పడం కూడా పైన చెప్పుకున్నట్లే ఆసక్తికరంగా ఉంది. తల సంబంధమైన కథ ఇది; తల (ముఖం) బాగుంది; తలను దించుకున్నాడు; తల పైన ధరించాడు; తలకు చీర (పాగా) ధరించాడు; తల నుండి పూలు కింద పడ్డాయి; తల మీద (పైన) వెండ్రుకలుంటాయి; తలమీద తలలందు సొమ్ములు, నగలు ధరించాడు. ఇలా ‘శిరస్సు’ సంబంధమైన పదంతో జోడించి వివిధ విభక్తులను ఏకవచనంలో వివరించాడు.

క.
తల లొప్పెఁ దలలు దునిమెను
తలలన్ ధరియించెఁ జీరతలలకునాడెన్
దలఁ జుట్టె పెడతలవడెన్
దలలకు మణిభూషణములు తలలం దనఁగన్. (95)

తలలు ఒప్పెన్ = తలలు (ప్రథమ) (పూరకక్రియ ఒప్పెన్); తలలు తునిమెన్ = తలలు (ద్వితీయ) తుంచాడు (నరికాడు); తలల ధరియించె = తలల చే/తోడ ధరించాడు (తృతీయ); చీర = తల గుడ్డ; తలలకు = (చతుర్థి ) ఆడెన్ = తాకింది; తలన్ చుట్టెన్ తలకు చుట్టాడు (చతుర్థి); పెడతల = తల (వెనుక) వైపు; పడెన్ = పడ్డాడు; తలలకు = తలలమీద (షష్ఠి); మణిభూషణములు = నగలు; తలల + అందు = తలలలో; అనగన్ = అన్నట్లుగా.

“(i) తలలు (ప్రథమ); (ii) తలలు (ద్వితీయ) విభక్తి ప్రత్యయలోపం; (iii) తలల (తృతీయ); (iv) తలలకు (చతుర్థి); (v) పెడతల (పడెను) (పంచమి); (vi) తలలకు-షష్ఠి; (vii) తలలందు (సప్తమి అని ఉదాహరణలు)”.

ఇక్కడ కూడా ఏక బహువచనాల్లో తేడా గుర్తించాలి. విభక్తి ప్రత్యయలోపంతో ఏర్పడేవి సమాసాలుగా కూడా పరిగణించి, విగ్రహ వాక్యాలతో చేస్తాం. మరీ ముఖ్యంగా షష్ఠీ విభక్తికి ఔపవిభక్తిక రూపం తప్ప యొక్క ప్రత్యయం కానీ మరే ఇతర రూపం కానీ వాడం. ‘కు’ చతుర్థిలోనూ, షష్ఠిలోనూ కూడా వాడటం కనిపిస్తుంది. క్రియతో ఇవ్వడం వల్ల అర్థాన్ని అంటే కారకసంబంధాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఏయే విభక్తి ప్రత్యయాలు ఎప్పుడు వాడుతారో, ఎప్పుడు మానేయవచ్చో స్పష్టమైన సూత్రీకరణలు ఇప్పటికీ కనిపించవు. చతుర్థి ‘కు’ లోపం మాత్రం భాషలో ఎక్కడా ఎప్పుడూ జరిగినట్లు కనిపించదు. చిన్నయసూరి చెప్పిన “జడంబు ద్వితీయకు లోపంబు బహుళంబుగా నగు” అన్న సూత్రం మాత్రం కావ్యభాషలోనూ, ఆధునిక భాషలోనూ కనిపిస్తుంది. అయితే ‘ము’ కారాంతాలు తత్సమాలు కాగా, ‘ల’ కారాంతాలు ‘దేశ్యాలు’ అన్న విషయం గమనించాలి.

వ.
ర్యంతములకు. (96)

రి-అంతములకు =రి-కారాంతపదాలకు.

‘ము’ కార ‘ల’ కారాంతాల తర్వాత – రి-కారాంత పదాల విభక్తి ప్రత్యయరూపాలను వివరిస్తున్నాడు, వ్యాకర్త.

క.
కరివచ్చెన్ గరినెక్కెను
గరిచేతం జచ్చెఁ గరికిఁ గవణమువెట్టెన్
గరివలననుఁ గరికుంభము
కరియందు మదాంబుధార కడుబెడఁ గయ్యెన్. (97)

కరివచ్చెన్ – = కరి = ఏనుగు వచ్చింది (ప్రథమ); కరిన్ + ఎక్కెను = కరిని (= ఏనుగును) ఎక్కాడు (ద్వితీయ); కరిచేతం చచ్చె = కరిచేతన్ (= ఏనుగుచేత); చచ్చెన్ = చచ్చాడు (తృతీయ); కరికి = ఏనుగుకు; కవణమున్ = తిండి; పెట్టెన్ = పెట్టాడు (చతుర్థి); కరివలనను = ఏనుగువల్ల (పంచమి); కరి కుంభము = ఏనుగు (యొక్క) కుంభస్థలం; కరియందు = ఏనుగులో; మద+అంబుధార = సువాసనతో నిండి కారే (స్రవించే) మదజలం; కడు = మిక్కిలి; బెడగు = సొగసుగా, అందంగా; అయ్యెన్=అయింది.

“(i) కరి (వచ్చింది) (ప్రథమ); (ii) కరిని ఎక్కాడు (ద్వితీయ); (iii) కరి చేత చచ్చెను (తృతీయ); (iv) కరికి కవణం పెట్టెను (చతుర్థి); (v) కరి వలన (పంచమి); (vi) కరి కుంభము (షష్ఠి); (vii) కరి యందు (సప్తమి);” (ఇవి ఉదాహరణలు) “కరి, కరిని, కరిచేత, కరికి, కరివలన, కరి (యొక్క), కరియందు” అని ఉదాహరణలు.

ఈ పద్యంలో ‘కరి’ అనే రి- కారాంత తత్సమపదాన్ని తీసుకొని దానికి ఏడు విభక్తులను కలిపి చూపుతూ, అవసరమైన చోట్ల అవసరమైన క్రియలు కూడా వాడి పద్యపూరణతో పాటుగా విషయం, సులభంగా అర్థమయ్యేలా చేసాడు కేతన. విభక్తి ప్రత్యయం ఎంపిక చాలాసార్లు క్రియ మీదనే ఆధారపడి ఉంటుందన్న విషయం కేతన సూచనగా చెప్పినా, ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ‘చూడు’ (see) అనే క్రియ ‘ఒక కర్మ’ను మాత్రమే పొందితే, ‘ఇచ్చు’ (give) అనే క్రియ రెండు కర్మల్ని ఒకటి ముఖ్య కర్మ (Direct Object = చతుర్థిలో) రెండవది అముఖ్య కర్మ (Indirect Object ద్వితీయా విభక్తిలో) వస్తాయి. ఇది కేతన ఉదాహరణలో కూడా చూడవచ్చు. తెలుగు వాక్యాలలో కర్త ఒక్కొక్కసారి ఐచ్ఛికం అంటే ఉండవచ్చు లేకపోవచ్చు. అందువల్ల ఆధునికంగా –

ఆమెకు పుస్తకం ఇచ్చాను/డు/రు (అంటే ఆమెకు చతుర్థి విభక్తి, పుస్తకం ద్వితీయావిభక్తి) అన్నట్లుగా, కేతన
కరికి కవణము పెట్టెన్
ముఖ్యకర్మ అముఖ్యకర్మ
చతుర్థి ద్వితీయ
అని ఉదాహరణ ఇచ్చారు; దీనిలో ‘కరికి’ చతుర్జీ విభక్తిలో ఉండగా, ‘కవణము’ ద్వితీయలో ఉంది.

తే.
టడల రేఫలకారముల్ దొడరెనేని
యొక్కెడన రెండుమాత్రల లెక్క కెక్కు
బంట్లు బంటులు నా బండ్లు బండు లనఁగ
గుంట గుంటర నా గుండ్ర గుండ రనఁగ. (98)

ట, డ, ల = ట, డ అనే వర్ణకాలపై; రేఫ లకారముల్ = ‘ర’ కార, ‘ల’ కారాలు; తొడరెన్ + ఏని = వచ్చినట్లయితే; ఒక్క ఎడన = ఒక్కొక్కచోట; రెండు మాత్రల = రెండు లఘువులుగా; లెక్కకు ఎక్కు = గణించవచ్చు/ లెక్కించవచ్చు. బంట్లు బంటులు నా = బంట్లు అనేమాట బంటులు అని (టు, లు, రెండు మాత్రలుగా విడదీసి); బండ్లు బండులు అనఁగ = బండ్లు అనే బహువచన రూపాన్ని బండులు అని కండ్లు’ అనే ఒకే మాత్రను డులు అని రెండు మాత్రలుగా; గుంట గుంటర నా = గుంట అనే మాటను గుంటర అని (‘ట్ర’ను టర అని రెండు మాత్రలుగా); గుండ్ర గుండర = గుండ్ర అనే మాటను గుండరగానూ; అనఁగ = అనే విధంగా. చూపడం ద్వారా.

“ట, డ అనే వర్ణాలపై రకార లకారాలు వచ్చినట్లయితే వాటిని ఒక్కొక్కసారి రెండు మాత్రలుగా లెక్కించే అవకాశం ఉంది. ఎలాగంటే బంటు – బంట్లు అనీ అనవచ్చు; బంటులు అని కూడా టులు (రెండు మాత్రలు) అనవచ్చు. అలాగే బండ్లు – బండులు గానూ, గుంట – గుంటర – గానూ, గుండ్ర – గుండరగానూ (ఒక్కమాత్రగాకానీ రెండు మాత్రలుగా విడదీసిగాని) పరిగణించవచ్చు”.

ఈ పద్యంలో కేతన మొదటిసారిగా ఛందోగణ ప్రస్తావన చేసాడు. ఊరికే ‘సంశ్లేష’ను విడదీయటం జరుగుతుందని చెప్పకుండా టకార డకారాంత పదాలకు లకారం కాని రేఫం అంటే రకారం కానీ (రేఫం అనేమాట కూడా మొదటిసారి వాడాడు) వచ్చినట్లయితే కొన్నిసార్లు ఆ కలిసిన మాటలను రెండుగా విడదీసి రెండు మాత్రలుగా కూడా లెక్కించవచ్చు అని చెప్పటం ద్వారా, కవులు తమ ఛందోగణ అవసరాల నిమిత్తం పదాలను కొన్నిసార్లు పదమధ్యాచ్చును లోపింపజేసి కలపటం లేదా రెండు హల్లుల సంశ్లేషను విడదీసి వేరువేరుగా రెండు మాత్రలుగా పరిగణించే అవకాశాన్ని పొందడం ఇక్కడ వ్యాకరించిన విషయం అయితే ఇది అన్నిచోట్లా జరిగేది కాదు; ట, డలపై వచ్చే ‘రేఫ లకారాల’కే ఇలా జరుగుతోంది. అప్పుడు బంట్లు బండ్లు గుంట గుండ్ర అనే గురులఘుమాత్రలతో కూడిన ‘హ’ గణం (=గలం) మారిపోయి బంటులు, బండులు, గుంటర, గుండర అని ఒక గురువు రెండు లఘువులతో భగణంగా మారుతాయి.

సూరయ్య “టకార డకారములకు రేఫలకారములు జడ్జ లైన యెడల ఒక్క మాత్రగను అవి విడిపోవు నెడల రెండు మాత్రలుగను లెక్కకు వచ్చును. ఉదా॥ బంట్లు = బంటులు, బండ్లు = బండులు, గుంట్ర = గుంటర మొ॥ బహువచనము పరమగునపుడు డల, టరల ఉత్వమునకు లోపంబు బహుళంబను సూత్రంబునకిది పట్టయినది” అని వివరణ ఇచ్చారు. (పు. 82) కానీ ‘మాత్ర’ అనే ముఖ్యమైన ఛందోపదాన్ని ఆయన గుర్తించినట్లు లేదు. మాత్రల ద్వారానే ఛందస్సులో గణ విభజన జరగటం వల్ల ఈ సూత్రం కేతనకు పూర్వమే నెలకొని ఉన్న వ్యాకరణ వ్యవస్థనూ, ఛందో వ్యవస్థనూ, సాంకేతిక పదాలనూ మనకు చెప్పకనే చెబుతున్నాయి. రేఫమనీ, లకారమనీ, మాత్ర అనీ లెక్కకు ఎక్కడం అనీ కేతన స్వయంగా హఠాత్తుగా సృష్టించి వాడిన పారిభాషిక పదాలుగా వీటిని భావించలేం. అవి అప్పటికే పరిచితమైనవి కాకపోతే వాటిని వాడటం సాధ్యమయ్యే పనికాదు. ఈ పదాలు కొంత సంస్కృత వ్యాకరణ సంప్రదాయం నుండి తీసుకొన్నవే అయి వుండవచ్చు.

కానీ కేతన తెలుగు వ్యాకరణ స్పృహతోనే వీటిని గురించి రాసినట్లుగా భావించాలి, అందువల్ల ఈ పారిభాషిక పదాలు అప్పటికే స్థిరీకృతమై ఉండి ఉండాలి.

క.
కూఁతురుపదము రుకారము
బ్రాఁతిగఁ దాఁ జెడు విభక్తి పైఁ బెట్టినచోఁ
గూఁతురు కూఁతుం గనియెను
గూఁతులచేఁ గూఁతువలనఁ గూఁతులధనముల్.(99)

కూఁతురు పదము రుకారము = కూతురు అనే పదం (యొక్క) ‘రు’ కారం; ప్రాతిగన్ = సరిగ్గా; తాన్ = తానే; చెడు = చెడిపోతుంది (=తొలగిపోతుంది); విభక్తి = విభక్తి ప్రత్యయాన్ని; పై పెట్టినచో = (ఆ మాట) పైన పెట్టినప్పుడు; కూఁతురు కూఁతుం- కనియెను; కుమార్తె అమ్మాయిని కన్నది; కూతురు = ప్రథమ, కూతుం (ద్వితీయ); కూఁతులచే = కూతుళ్ళచేత; కూఁతువలన = కూతురివల్ల; కూఁతులధనముల్ = కుమార్తెల సొమ్ము.

“కూతురు అనే మాటలోని ‘రు’కారం విభక్తి ప్రత్యయం చేరినప్పుడు పోతుంది. కూతురు (ప్రథమ); కూతున్ = ‘రు’ కారం పోయిన ద్వితీయ; కూతులచే -చే తృతీయా విభక్తి ప్రత్యయంతో, కూతువలన = పంచమీ విభక్తి ‘వలన’; కూతుల ధనముల్ = షష్ఠీ విభక్తి కూతుళ్ళ (యొక్క) సొమ్ము”.
ఈ పద్యంలో కేతన లాఘవాన్ని కూడా చూపించాడు. అలాగే రి అంతాలకు విభక్తి ప్రత్యయాలను చెప్పాడు కాబట్టి ‘రు’ కారాంతమైన ‘కూతురు’ పదం అపవాదంగా చూపుతూ, కొన్ని ఏకవచన రూపాలతోనూ, కొన్ని బహువచన రూపాలతోనూ విభక్తి ప్రత్యయాలు చేరినప్పుడు ‘రు’కారం ఎలా లోపిస్తుందో వివరించాడు.

సూరయ్య వివరణ “కూతురు అనునది ప్రథమైక వచన రూపము. విభక్తి యెద్దియైన పరంబగుచో ఆ రు కారము లోపించును. అనగా కూతును, కూతుచేత, కూతువలన ఇత్యాది రూపము లుండునుగానీ, కూతురిని, కూతురు చేత, కూతురువలన మున్నగు రూపములుండవని యర్థము” (పు. 83).

అయితే ఇది కావ్య భాషకే పరిమితం. ఆధునిక వ్యవహారంలో కూతురిని, కూతురువల్ల కూతుళ్ళకు అనే రూపాలే ఉన్నాయి. తప్ప ‘రు’ కారలోపంతో లేవు.

వ.
అనంతరంబ సంబోధనంబు లెఱింగించెద. (100)

అనంతరంబ = తర్వాత, సంబోధనంబులు = సంబోధనలు (పిలవటానికి సంబంధించిన) విభక్తి ప్రత్యయాలు; ఎఱింగించెద = తెలియజేస్తాను.

“తర్వాత సంబోధన విభక్తులు తెలియజేస్తాను”.

ప్రథమ నుండి సప్తమి వరకే కాక ‘సంబోధన’ లేదా సంబోధన ప్రథమా విభక్తి అని ఎనిమిదవ విభక్తి కూడా ఉంది. సంస్కృతంలో “హే” అని సాధారణంగా ఉండే ఈ ప్రత్యయం శబ్దానికి ముందు వస్తుంది, కానీ తెలుగులో పదానికి చివర వస్తుంది. ఇవి ఎలా ఉంటాయో కింది పద్యాలలో తెలుస్తుంది.

క.
ఏకవచనపుఁదుదలందు నెలసి నిలుచు
నుత్వ మత్వ మౌ నిత్వంబు నీత్వ మొందు
నార బహువచనంబు పైఁ జేరి నిలుచు
హ్రస్వములు నిడుపు లగుఁ గవ్యనుమతమున. (101)

ఏకవచనపున్ = ఏకవచనం; తుదలు+అందు= చివరలో; నెలసి నిలుచు = వచ్చి నిలిచే; ఉత్వము అత్వము ఔను = ‘ఉ’కారం అకారం అవుతుంది; ఇత్వంబు = ఇకారం; ఈత్వం ఒందున్ = ‘ఈ’ కార అవుతోంది; ఆర = ‘ఆర’ అనే ప్రత్యయం; బహువచనంబు పైన్ = బహువచనాలపైన; చేరి నిలుచు = వచ్చి నిలుస్తుంది; హ్రస్వములు= హ్రస్వాక్షరాలు (పొట్టివి, దీర్ఘం కానివి); నిడుపులు అగున్ = దీర్ఘాలు, పొడుగు అవుతాయి; కవి + అనుమతమున = కవి అంగీకారంతో.

“ఏక వచనంలో పదాల చివర ఉండే ఉకారం (సంబోధనలో) అకారం అవుతోంది; ఇకారం ఈ కారం అవుతుంది. బహువచనాలపై ‘ఆర’ అనే ప్రత్యయం వచ్చిచేరుతుంది; అప్పుడు పదాల చివర ఉన్న హ్రస్వాలు దీర్ఘాలుగా మారతాయి”.

‘సంబోధన’లను కవులు ఎలా వాడారో ఈ పద్యం వల్ల తెలుస్తుంది (= కవి అనుమతితో అన్నాడు కేతన) ఏకవచనాల్లో రెండు సూత్రాలున్నాయి: (1) పదాల చివర ఉండే ఉకారం అకారం అవుతుంది; (2) కానీ ఇకారాంతమైన పదాలు ‘ఈ’ కారాంతాలవుతాయి. (2) బహువచనంలో మాత్రం ‘ఆర’ అనే ప్రత్యయం వచ్చి చేరుతోంది; (3) పదాల చివరలోని హ్రస్వాలన్నీ దీర్ఘాలుగా మారతాయి. అని ఈ పద్యంలో మూడు సూత్రాలు చెప్పాడు.

క.
సుతుఁడ సుతుండా యనఁగ సు
దతి సుదతీ యనఁగ విమలతరమతులారా
హితకారులార యనఁగా
నతిశయముగ వరుసతో నుదాహరణంబుల్. (102)

వరుసతోన్ =చక్కగా; సుతుడ – సుతుండా అనంగ = సుతుడ లేదా సుతుండా అని (పిలవవచ్చు); సుదతి – సుదతీ యనగ = సుదతి అని కానీ సుదతీ అని కానీ (పిలవవచ్చు); విమల తరమతులు + ఆర = విమలతరమతులారా అని – ఆర చేర్చి దీర్ఘ మిచ్చి బహువచనంలో పిలువవచ్చు; హితకారులు+ఆర = దీర్ఘం లేకుండా ఆర ప్రత్యయం చేర్చి (హ్రస్వంగానే వ్యవహరించవచ్చు); అనగ = అనే విధంగా; అతిశయముగ = క్రమంగా; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“సుతుడ-సుతుండా అనీ; సుదతి – సుదతీ అనే విధంగా; విమలతరమతులారా- హితకారులార అనే విధంగానూ ఏకబహువచనాలకు వరుసగా ఉదాహరణలు”.
మూడు సూత్రాలకు సంబంధించిన ఉదాహరణలను హ్రస్వ దీర్ఘ భేదాలతో చూపారు: ఏకవచనంలో సుతుడులోని ఉకారం మారి సుతుడ లేదా సుతుండా అనీ; ఇకారాంత పదమైన సుదతి-సుదతీ అనీ అలాగే బహువచనంలో ‘ఆర’ చేరినప్పుడు దీర్ఘాంతంగా విమలతరమతులారా అనీ లేదా హ్రస్వంతో హితకారులార అనీ సూత్రాలవరుసలోనే ఉదాహరణలు కూడా ఇచ్చారు.
i) సుతుడు (ప్రథమ)
+ సుతుడ (హ్రస్వం) – సుతుండా (దీర్ఘం)
ii) సుదతి (ఇకారాంత, హ్రస్వ సంబోధన కూడా)
సుదతీ- దీర్ఘం తో.
iii) విమలతరమతుడు (ఏక) – విమలతరమతులు (బహువచనం)
హితకారుడు (ఏక) – హితకారులు (బహు)
– ఆర ప్రత్యయం
దీర్ఘంతో – విమల తరమతులారా
హ్రస్వంతో – హితకారులార

సూరయ్య : “సంబోధనమున ఉకారము అకారముగమాఱును” అని మాత్రమే చెప్పారు.

ఆ.
అమర డు సంబోధన త
త్సమములఁ బొడచూపు నొక్కతటి నోపురుషో
త్తమ యోపురుషోత్తముఁడా!
విమలయశా విమలయశుఁడఁ వినుమని చనుటన్.(103)

అమరన్ = చక్కగా; ‘డు’ సంబోధన = ‘డు’ కారంతో సంబోధన; తత్సమములన్ = తత్సమపదాలలో; పొడసూపున్ = కనిపిస్తుంది; ఒక్కతటిన్ = ఒక్కొక్కసారి/ అప్పుడప్పుడు;

ఓ పురుషోత్తమ – ఓ పురుషోత్తముఁడా = ఈ రెండు రూపాలలోనూ; విమలయశా – విమలయశుఁడ = ఇలా కూడా ‘డ’ కారం లేకుండా, డకారంతో; వినుము = (పూరకక్రియ – ఓ పురుషోత్తమ, పురుషోత్తముడా వినుము అని వాక్యం); అని = అనే విధంగా చనుటన్ = వాడటం వల్ల. “తత్సమ పదాలలో చేరే ‘డు’ కారంతో కూడా అప్పుడప్పుడు సంబోధన ఉంటుంది. ఓ పురుషోత్తమ అని కానీ ఓ పురుషోత్తముడా అని కానీ; విమలయశ అని కానీ విమల యశుడ అని కానీ ఉదాహరణలు”.

సంబోధన ప్రయోగాల్లో తత్సమ పదాలలో కొన్ని సార్లు ‘డు’ ప్రత్యయంతోనే హ్రస్వ, దీర్ఘాల భేదాలతో ఉంటుంది అని చెప్తూ కేతనపై ఉదాహరణలిచ్చారు. సూరయ్య కూడా వివరణలో ఈ ఉదాహరణలే మళ్ళీ ఇచ్చాడు.

వ.
యుష్మదస్మత్పదంబు లెఱింగించెద.

యుష్మత్, అస్మత్ = నీవు, నేను; పదంబులు = (అనే) పదాలను; ఎఱింగించెద =తెలుపుతాను.

సంబోధన తర్వాత నామ పద విభక్తులన్నీ అయిపోయాయి. కాబట్టి కేతన ఈకింది పద్యాలలో సర్వనామాలైన నీవు, నేను అంటే మధ్యమ, ఉత్తమ పురుష వాచకాలకు విభక్తులను చెప్తానంటున్నాడు.

క.
ఎలమి నీవు మీరు నే నేము ప్రథమలు
నిన్ను మిమ్మనంగ నన్ను మమ్ము
నన ద్వితీయ లయ్యెనని యుష్మదస్మత్ప
దములు దెలియ నూత్నదండి సెప్పె. (105)

ఎలమిన్ చక్కగా, నీవు = మధ్యమ పురుష (ఎవరితో మాట్లాడుతుంటామో ఆ వినే వారు శ్రోత); ఏను – ఏము = ఉత్తమ పురుష (ఎవరు మాట్లాడుతున్నారో వారు = వక్త) ప్రథమలు = ప్రథమావిభక్తి రూపాలు. నిన్ను, మిమ్ము అనంగ = నిన్ను, మిమ్ము అనేవి; నన్ను మమ్మున్ అన = నన్ను – మమ్ము అనేవి ద్వితీయలు = ద్వితీయా విభక్తి రూపాలు; అయ్యెన్ = అయినాయి అని = అంటూ; యుష్మత్ అస్మత్ = పదములు = నీవు, నేను అనే సర్వనామ పదాలను; తెలియచెప్పె = తెలియజేసాడు; నూత్న దండి = అభినవ/ నూత్న దండి అనే బిరుదుగల కేతన.
“ఏక బహువచనాల్లో మధ్యమపురుష యుష్మత్ కు నీవు (ఏకవచనం) మీరు (బహు) అని ఉంటాయి; ఉత్తమ పురుషలో అస్మత్ కు ఏను, ఏము అని ఉంటాయి. ద్వితీయావిభక్తిలో నిన్ను, మిమ్ము (న్) అనీ, నన్ను మమ్ము అనీ ఉంటాయి”.

ఈ పద్యంలో రెండు విభక్తి రూపాలు మాత్రమే ఇచ్చాడు కేతన. మధ్యమపురుషలో నీవు – మీరు అనీ, ఉత్తమ పురుషలో ఏను – ఏము అనీ ఏక బహు వచన ప్రథమా విభక్తి రూపాలు; కాగా, ద్వితీయా విభక్తిలో నిన్ను – మిమ్ము(న్) అనీ; నన్ను – మమ్ము అనీ అవుతాయి అని చెప్పాడు.

కావ్యభాషలో నేను, మేము అనే ఉత్తమ పురుషలో మనం వాడే రూపాలు ఏను, ఏము అని ఉంటాయి. కేతన కాలానికి వాటి వాడుకే కావ్యాలలో ఎక్కువ. కానీ ద్వితీయా విభక్తి ఏకవచనంలో నిన్ను, నన్ను అని కావ్య భాషలోనూ, ఆధునికంగానూ ఒకే రకం ప్రయోగాలున్నాయి. కానీ బహువచన రూపాలలో మార్పు వచ్చింది. మిమ్ము, మమ్ము అనే వాటికి బదులుగా మిమ్మల్ని (< మిమ్ములను), మమ్మల్ని (< మమ్ములను) అని లిని/లను చేర్చి వాడుతున్నాం.

క.
నీమీలకు నామాలకు
ధీమహితా వరుసతోఁ దృతీయాదులయం
దేమఱక చేతనాది
స్తోమం బిడ నేకబహువచోనియతి యగున్. (106)

నీమీలకు, నామాలకు = నీ, మీ, నా, మా అనే వాటికి (ఔపవిభక్తిక రూపాలకు); ధీమహితా = బుద్ధిమంతుడా!; వరుసతో = క్రమంగా; తృతీయాదుల+అందు = తృతీయా విభక్తి మొదలుకొని సప్తమీ విభక్తి వరకు, ఏమఱక = తప్పకుండా; చేతన్+ఆది = చేత మొదలైన; స్తోమంబు = సముదాయం; ఇడన్ = చేర్చగా; ఏక, బహువచన నియతి =ఏక బహువచనాలు; అగున్ = అవుతాయి.

“చేతన్ మొదలైన తృతీయమొదలుకొని ఉన్న, విభక్తి సముదాయంలోని ప్రత్యయాలన్నీ నీ, మీ, నా, మా అనే వీటిపై ఏక, బహువచనాల్లో వచ్చి చేరుతాయి”

చేతన వంటి తృతీయా విభక్తి ప్రత్యయాలు మొదలుకొని మిగిలిన అన్ని విభక్తుల ప్రత్యయాలు కూడా (ఔపవిభక్తిక రూపాలైన) నీ, మీ, నా, మా అనే రూపాలపై ఏక వచనంలోనూ, బహువచనంలోనూ క్రమంగా వచ్చి చేరుతాయి. వీటికి ఉదాహరణలను కింది పద్యాలలో వరుసగా ఇచ్చాడు.

క.
దేవా నీచే నీకున్
నీవలనన్ నీధనంబు నీయం దనఁగా
దేవా మీచే మీకున్
మీవలనన్ మీధనంబు మీయం దనఁగన్. (107)

దేవా = ఓ దేవుడా! నీచే, నీకున్, నీవలనన్, నీ ధనంబు, నీయందు, అనగా =అనే విధంగానూ దేవా! మీచే, మీకును, మీవలనన్, మీధనంబు; మీయందు; అనగన్ =అనే విధంగా.

“దేవా! నీచే, నీకున్, నీవలనన్, నీ ధనంబు, నీయందు అనే విధంగా (ఏకవచనంలోనూ), మీచే, మీకున్, మీవలనన్, మధనంబు మీయందు అని బహువచనంలోనూ మధ్యమ పురుషలో నీ, మీలపై విభక్తి ప్రత్యయాలు చేరుతాయి”.

ఇక్కడ కూడా ఒక్కొక్క రూపాన్ని తీసుకున్నాడు కేతన. ‘నీచే’, ‘మీచే’ అని తృతీయకు ఇచ్చాడు కానీ నీతో, మీతో అనే రూపాలను అసలు చెప్పలేదు, అలాగే మిగిలిన అన్ని విభక్తి ప్రత్యయాలలోనూ ఒక్కొక్క రూపాన్నే ఇవ్వడం వల్ల మొత్తం ఒక్కొక్క విభక్తికి ఏయే ప్రత్యయాలు కవులు వాడారో కూడా మనకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఈ లోపాన్ని హరి శివకుమార్ తన సిద్ధాంత వ్యాసంలో (1973) స్పష్టంగా చెప్పాడు.

కానీ దేవినేని సూరయ్య తన వివరణలో ‘నీ’, మీల తర్వాత తృ- చేతన్, చేన్, తోడన్, తోన్ అనీ, చ – కొఱకున్, అనీ, పం- వలనన్, కంటెన్ అనీ, ష-కున్, యొక్క అనీ, స- అందు అనీ చెప్పి ‘ఇట్లే ఇతరంబు లెఱుంగునది’ అని చెప్పాడు. వీటిలో తృ అంటే తృతీయ, చ – చతుర్థి, పం – పంచమి, ష – షష్ఠి, స – సప్తమి అని గ్రహించాలి.

చాలా కాలం పాఠశాల విద్యలో ఇవి ఇలాగే నేర్పడం జరిగేది. కానీ న కారపొల్లు ప్రయోగం ఆధునికంగా పోయింది. యొక్క సాధారణ ప్రయోగాల్లో లేకున్నా, ప్రసంగాలలో, ఉపన్యాసాలలో అప్పుడప్పుడు వాడటం ఉంది. విగ్రహవాక్య వివరణల్లోనూ వాడుతారు. అంతేతప్ప ‘యొక్క’కు కావ్యాలలోనూ, వ్యవహారంలోనూ, ప్రయోగాలు దొరకవు. ఈ ‘యొక్క’ ఏమై ఉంటుందీ అనీ, ‘ఒక్క’ (< ఒకటి) కావచ్చుననీ భద్రిరాజు కృష్ణమూర్తి (2001) ఒక పరిశోధనా వ్యాసంలో చర్చించాడు కానీ ఇదమిత్థంగా తేల్చలేదు.

క.
దేవా నాచే నాకున్
నావలనన్ నాధనంబు నాయం దనఁగా
దేవా మాచే మాకున్
మావలనన్ మాధనంబు మాయం దనఁగన్. (108)

దేవా ! = ఓ దేవుడా! నాచే, నాకున్, నావలనన్, నాధనంబు, నాయందు; గా అనే విధంగా, దేవా! మాచే, మాకున్, మా వలనన్, మాధనంబు, మాయందు; అనఁగన్ =అనే విధంగా.

“నా, మా అనే అస్మత్ శబ్దానికి తృతీయ మొదలుకొని విభక్తి ప్రత్యయాలు చేరగా నాచే, నాకున్, నావలనన్, నాధనంబు, నాయందు అని ఏకవచనంలోనూ; మాచే, మాకున్, మావలనన్, మా ధనంబు, మా యందు అనే విధంగా బహు వచనంలోనూ ఉదాహరణలు”.

ఇవి సంస్కృతంలో ‘అస్మత్’ శబ్దంగా చెప్పే నా, మా అనే ఉత్తమ పురుష ఏక,బహు వచనాల్లో నీ మీ అనే యుష్మత్ మధ్యమ పురుష రూపాలవలెనే తృతీయ మొదలుకొని సప్తమి వరకు ఇచ్చిన రూపాలు. అయితే కేతన దీనిలో ప్రథమ పురుషను ఎందుకు చేర్చలేదో కారణం తెలియదు. తెలుగులో ప్రథమ పురుష క్లిష్టమయింది. కావ్య భాషలోనైనా, ఆధునిక భాషలోనైనా ప్రథమ పురుషలో ఒక్క రూపం లేదు. దూరాన్ని, దగ్గరనీ తెలిపే ‘ఆ’, ‘ఈ’ (ఏ తో కలిపి త్రికం అంటారు) అర్థాలతోనూ, సన్నిహిత, చిన్న, నిమ్న సూచకాలతోనూ ఆధునిక తెలుగులో ఇది పుం, స్త్రీ, నపుంసక భేదాలతో కనిపిస్తుంది.

అయితే కావ్య భాషలో పురుష, పురుషేతర భేదాలే ప్రధానంగా కనిపించినా – (అంటే “వాడు, వీడు, ఇది, అది” అని) మహతీవాచకాలుగా ప్రత్యేకంగా ఆవిడ, ఈవిడ వంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఇన్ని రకాల సామాజిక, భౌగోళిక సమాచారంతో ఉన్న ప్రథమ పురుషను 1, 2 పద్యాలలో చెప్పడం కష్టమని వదిలి వేయడం జరిగిందో, మరే కారణమో కానీ సర్వనామ వివరణ మాత్రం అసంపూర్ణం అనే చెప్పాలి. ఈ ప్రథమ
పురుష ఆధునిక రూపాలు:
పురుష : దూరం : వాడు, అతడు, అతను, ఆయన, వారు
దగ్గర : వీడు, ఇతడు, ఇతను, ఈయన, వీరు
దూరం : అది, ఆమె, ఆవిడ, వారు
దగ్గర : ఇది, ఈమె, ఈవిడ, వీరు
నపుంస : దూరం అది – అవి
దగ్గర : ఇది – ఇవి

ఇవికాక ఇంకా ఆబిడ ఈబిడ, ఆప- ఈపె; ఆకె – ఈకె అనే ప్రయోగాలు కూడా కొందరు కవుల్లో కనిపిస్తుంది. అన్నమయ్య ఈ రూపాలను ఎక్కువగా వాడాడు. 71 వ పద్యంలో వీడు వాడు గురించి వాటి బహువచనాల గురించి చెప్పాడు కేతన. ఆ సందర్భంగా ఈ ప్రథమ పురుష రించి వివరించడం జరిగింది. బహుశా అందుకే ఇక్కడ మళ్ళీ చెప్పక పోవచ్చు.

అయినవోలు ఉషాదేవి

రచయిత అయినవోలు ఉషాదేవి గురించి: అయినవోలు ఉషాదేవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు. Acquisition of Telugu syntax (1990, New Delhi), ధ్వన్యనుకరణ పదకోశం (2001, తెలుగు విశ్వవిద్యాలయం), Issues on Lexicography 2006, Andhra Bhasha bhushanamu: Original Text with Transliteration, meaning, Translation మొదలైనవి ఆవిడ రాసిన గ్రంథాలలో ప్రసిద్ధమైనవి. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్‌గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి \"ఉత్తమ ఉపాధ్యాయ\" పురస్కారాన్నిచ్చింది. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు. ...