1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 6

ఆంధ్రుల చరిత్రలో వెలుగుచూడని కొన్ని ఘట్టాలు 6: తన అధికారాన్ని నిలబెట్టుకోడానికి సలాబత్‌జంగ్ ఆడిన నాటకాలు

ఇక్కడనిట్లు ముజఫర్‌జంగుగారు దుర్మరణము పొందగా అతనికి కొంతవెనుకనుండి వచ్చుచున్న ఫ్రెంచి దళమువారు అతడింకను విజయుడై వెనుకకు మరలివచ్చునని నిరీక్షించుచుండిరి. అతని మరణవార్త వారికి సంభ్రమాశ్చర్యములు కలిగించెను. వారు దుఃఖముతో వెనుతిరిగి శిబిరమునకు వచ్చిరి. అక్కడనంతయు నల్లకల్లోలముగ నుండెను. అప్పటికే సేనలలోని సైనికులకు జీతబత్తెములు బాకీయుండెను. అందువలన వారు పితూరీచేసి సుబేదారుగారి ఖజానాపైబడి దోచుకొనెదరని సేనాధిపతులకు భయముకలిగెను. సేనాధిపతులందు కూడా ఒకరిని చూచిన యింకొకరికనుమానము కలుగసాగెను.

ఈ దుర్ఘటనమువలన తక్కినవారందరి మాట అట్టుండగా ఫ్రెంచివారు పెట్టుకొనిన యాశలన్నియు అడుగంటినట్లు కనబడెను. నాజరుజంగు హత్యవలన వారికి లభించిన రాజ్యాధికారములు సౌకర్యములు చేయిజారిపోవుచున్నట్లు కనబడెను. ఈ సుబేదారీ వ్యవహారములందు జోక్యము కలిగించుకొనుటకు బుస్సీగారికింకేమి హక్కున్నది? ఏ నెపమున నెవరినడ్డుపెట్టుకొని అతడు మాటలాడగలడు? అంతట నీ సంగతులన్నియు నీ బుద్ధిశాలి మనస్సులో మెరపుపెరసినట్లయ్యెను. అయితే అతడు తత్తరపాటు చెందక, ధైర్యము విడనాడక కర్తవ్యమునాలోచించెను. ఏదోవిధముగా మరల ఫ్రెంచివారి మాటవినునతనిని సింహాసనమెక్కించినగాని ఫ్రెంచివారిక్కడ నిలుచుటకే యాస్కారముండదు. అప్పుడు ముజఫరుజంగుగారి కుమారుడు పసివాడు. అతనిని సింహాసనమెక్కించినచో అతడు ఫ్రెంచివారికే యుపకారమును చేయలేడు. ఆ శిబిరమునందు నాజరుజంగుగారి సోదరులు ముగ్గురు ఖైదుచేయబడనివారుండిరి. నాజరుజంగుగారు దక్షిణదేశమునకు వచ్చుచున్నప్పుడు వారిని తనవెంటనే బందీలుగా తెచ్చియుండెను. నాజరుజంగు మరణించిన పిమ్మట ముజఫరుజంగు కూడా వారిని ఖైదులోనేయుంచి శిబిరమునందు వెంటబెట్టుకొని వచ్చుచుండెను. ఇప్పుడా సేనయందలి వివిధ సేనానాయకులు వివిధాభిప్రాయము కలవారుగ ఉండిరి. కొందరు పసిబాలుని పక్షముననుండిరి. కొందరు నాజరుజంగు సోదరులలోనొకరిని తఖ్తునెక్కించవలెనను అభిప్రాయము కలిగియుండిరి.

ఈ సందర్భములో బుస్సీగారు బాగా ఆలోచించెను. ముజఫరుజంగు కుమారుని సంరక్షణము చేయుట యొక ముఖ్యకార్యమనియు, అయితే అతనిని సింహాసనమెక్కించినచో అతని ప్రాణములను కాపాడుట దుస్తరమైన కార్యమగుననియు, అతనిని రక్షించు నెపమునగూడ తగవులు బయలుదేరుననియు, ఎవరు బలవంతులైన వారు అధికారమును, రాజ్యమును చేజిక్కించుకొందురనియు ఈ సంగతులన్నియు చెప్పి నాజరుజంగుగారి సోదరులలో పెద్దవాడైన సలాబత్‍జంగును సుబేదారుగా చేసిన మంచిదనిచెప్పి బుస్సీగారు వివిధ సేనాధిపతులను యొప్పించిరి. పసిబాలుని సింహాసనమునందు నిలిపినచో ఫ్రెంచివారి కతడేలాభమును కలిగించలేడని ఆయన మనస్సులో యున్నమాటను సహజముగా బయల్పరుపక రాజ్యక్షేమలాభమును గూర్చియు, శాంతిభద్రతలను గూర్చియు మాత్రమే చెప్పెను. ఆ శిబిరములోని వారొకరు చెప్పిన మాట ఇంకొకరు వినరు. విజాతీయుడైనను స్నేహపాత్రులైన ఫ్రెంచి గవర్నరు జనరలుగారి ప్రతినిధియైన బుస్సీగారు మధ్యవర్తిగా చెప్పినమాటలు వారికి రుచించెను. ఆ సందర్భమున నతడక్కడివారందరి కెవరికెట్లు చెప్పవలెనో అట్లు చెప్పి యొప్పించెను. ఈ సంగతులు డూప్లేగారికి వ్రాయగా అతడు చాలా సంతోషించెను.

సామదానభేదదండోపాయములను ప్రయోగించుటలో, కార్యసాధనలో, దూరదృష్టిలో బుస్సీగారు డూప్లేగారికి తగిన శిష్యుడనిపించుకొనెను. అంతట అక్కడివారందరును సలాబతుజంగుగారిని సుబేదారుగా నంగీకరించిరి. ఈ పదవి తనకు బుస్సీగారి కృషివలన లభించినదని సలాబతుజంగుగారు సంతోషించి ఫ్రెంచివారిపట్ల కృతజ్ఞుడై ముజఫరుజంగుగారికన్నకూడా హెచ్చుగా వారిని బహూకరించి గౌరవించుటకు నిశ్చయించెను.

సలాబతుజంగుగారు సుబేదారుడగుటతో మరల ఫ్రెంచివారి యాధిపత్యము స్థిరపడెను.

1751 ఫిబ్రవరి నెలవరకును సలాబతుజంగుగారును, బుస్సీగారును తమ సైన్యంతోను పరివారముతోను కడప నవాబుగారి రాజ్యములోనే విడిసియుండి శాంతిభద్రతలను స్థాపించుటకు కృషిచేసిరి. తరువాత మార్చి 15వ తేదీన కర్నూలు నవాబు పట్టణమునకు వచ్చి ఆ నవాబు పాతసుబేదారుగారిపట్ల జరిగించిన ద్రోహమునకు తగినవిధముగా దండించుటకు పూనుకొనిరి. ఈ పట్టణమునకు పఠానులు సరియైన బందోబస్తులు చేయనందున కోటగోడలు, బురుజులు శికస్తుపడియుండెను. ఆ గోడ కొంత నదీప్రవాహమునకు కొట్టుకొనిపోయి పడిపోయెను. కర్నూలులో 4000 మంది పఠానులుండిరి. వారాకోట ద్వారం దగ్గరనుండి నగరమును రక్షించుటకై ప్రయత్నించిరి. కాని ఫ్రెంచివారి ఫిరంగి గుండ్లను, తుపాకీబారులను నెదుర్కొనుటకు వారలవాటుపడినవారుకారు. అందువలన వీరి గుండ్లవర్షమునకు వారు దిగ్భ్రమచెంది త్వరలోనే కోటలోనికి పోయి తలదాచుకొనిరి. డూప్లేగారి దగ్గరనుబంధుడయిన ఒక సేనాధిపతి కొంత సైన్యముతో కోటలో చొరబడి తుపాకులు కాల్చసాగెను. ఇంతలో సలాబతుజంగుగారి సేన అక్కడికివచ్చి అతనికి తోడ్పడి కోట సంరక్షణము చేయువారిని వధించి కోట వశము చేసుకొనిరి. కర్నూలు నవాబుగారి భార్యా, ఇద్దరు కుమాళ్ళు ఖైదుచేయబడిరి. పట్టణవాసులు కొందరాయుద్ధమునందు వధింపబడిరి. ఈవిధముగా కొంత బీభత్సముచేసి ముందుగా ప్రజలలో భయోత్పాతము కలిగించినచో అందరును భయభక్తులు కలిగియుందురని వీరు తలంచి యట్లు చేసిరి. అయితే ఫ్రెంచివారందరికి న్యాయము చేయుదురను పేరును సంపాదించుట ముఖ్యమను సంగతి బుస్సీగారెరుగుదురు. అందువలన నతడు అతిత్వరితముగా ఆ వధలను మాన్పించి శాంతిభద్రతలను స్థాపించెను. సుబేదారుగారికి లోబడిన ప్రజలెవ్వరికిని ఏ అపాయము కలుగకుండా ఫ్రెంచివారు రక్షింతురని నగరములో దండోరావేయించెను. కొందరు చెప్పుకొనిన ఫిర్యాదులు దయగా వినెను. అంతట ఆహా! యీ ఫ్రెంచివారెంత మంచివారని అందరు మెచ్చుకొనిరి. ఈ యుద్దేశముతోనే తమ ప్రాత స్నేహితుడైన ముజఫరుజంగుగారి పసిబాలుని క్షేమలాభముల విషయమై బుస్సీగారు తక్షణమే శ్రద్ధవహించెను. అతని తండ్రిగారి రాజ్యమైన ఆదోని కతని పట్టాభిషిక్తుని చేయించి ఆ రాజ్యములో కర్నూలు నవాబుగారి రాజ్యమును చేర్చి, పెద్దదిగచేసి ఆ బాలునికి మొత్తముపైన సాలుకు పదిలక్షల రూపాయల ఆదాయము వచ్చునట్లు చేసెను. ఇది చాలా న్యాయముగా నున్నదని శిబిరము లోనివారును ఈ సంగతి విన్నవారును మెచ్చుకొనిరి. ఇందువలన కూడా ఫ్రెంచివారు ధర్మబుద్ధికలవారని ప్రజలలో విశ్వాసము కలిగెను.

తరువాత సలాబతుజంగుగారి సైన్యము కృష్ణానదిని దాటి రాజధానికి పయనమయ్యెను. ఆ సమయమున ఢిల్లీలో సేనాధిపతిగానున్న నాజరుజంగు, సలాబతుజంగుగార్ల అన్నగారైన ఘాజీయుద్దీన్ ఫిరుజుజంగుగారి ప్రోత్సాహముతో 25 వేలమంది మహారాష్ట్ర సైనికులు వచ్చి వీరి సేననెదిరించుటకు సిద్ధముగానుండిరి. దానికధిపతి బాలాజీరావుగారు. బాలాజీరావుగారితో ఘాజీయుద్దీను తియ్యని మాటలు చెప్పి వీరిపైకిపంపినదేగాని వారికంతవరకు ప్రతిఫలము క్రింద రొక్కమునేమాత్రము యివ్వలేదు. అందువలన నితనికి అసంతృప్తిగా నుండెను. ఆ యవకాశము చూచుకొని బుస్సీగారు నేదోయొక యుపాయమును ప్రయోగింపదలచి సలాబతుజంగుగారే నతనికి కొంత సొమ్మిచ్చి మంచి చేసుకొనవలసినదని సలహానిచ్చెను. అతడు ఆ సొమ్ముపుచ్చుకొని వెనుకకు మరలిపోవుటయేగాక సతారాలోని తమ ప్రభువైన షాహురాజుగారికి సలాబతుగారి స్నేహము కుదిరెనని చెప్పెను.

అంతట సలాబతుజంగుగారి సైన్యము ఎట్టి ఆటంకము లేకుండా హైదరాబాదు నగరము చేరెను. 1751 ఏప్రిల్ 2వ తేదీన ఆ పట్టణములో క్రొత్త సుబేదారుగారు మహావైభవముతో ప్రవేశించిరి. అంతట సలాబతుజంగుగారెట్టి చిక్కులను లేకుండా అందరివలనను సుబేదారుగా నంగీకరింపబడిరి. అతడు బహిరంగముగానొక గొప్ప దర్బారును చేసి సన్నద్ లేక సింహాసనమునందాసీనుడై తన క్రింది యుద్యోగుల వలనను, తన ప్రభువుల వలననేగాక చుట్టుపట్ల రాజ్యముల పరిపాలకులవలన గూడ నజరులు, సలాములు స్వీకరించెను.

సలాబతుజంగుగారు తనకు ఫ్రెంచి సైనికదళంవారు చేసిన అమూల్యమైన సేవకు ప్రతిఫలముగా ముఖ్యసేనాధిపతియైన బుస్సీగారికొక లక్షనవరసులనిచ్చెను. అట్లే తక్కిన సేనానాయకులకునిచ్చెను. వారిలో ఎన్‌సైన్ అను చిన్న సైనికోద్యోగికిచ్చిన బహుమతిమొత్తం యేబదివేలరూపాయలుండెను. ఫ్రెంచి కెప్తానులందరికి వారి దుస్తులను సలాబతుజంగుగారే భరించి ఒక్కొక్కరికి నెలకు వెయ్యిరూపాయల చొప్పున జీతమునిచ్చుట కంగీకరించిరి. ఇట్లే లెఫ్టినెంటులకు నెలకు రూ.500లును ఎన్‌సైనులకు ఒక్కొక్కరికి నెలకు తొంబదిరూపాయలును సామాన్యసైనికుల కొక్కరికి అరువది రూపాయలును జీతములేర్పరచి సొమ్మునెల్ల తానే భరించుటకంగీకరించెను. మచిలీపట్టణము స్వాధీనము చేసికొనుటలో డూప్లేగారి దూరదృష్టి ఇప్పుడు స్పష్టపడినది. గోలుకొండ హైదరాబాదు సైన్యమునకు కావలసిన కొత్త సైనికులు సరుకులు వగైరా సరంజాము (స్టోరు) ఆయుధసామాగ్రి మొదలయినవానిని సులభముగా పంపుటకు ఆ రేవు చాలా అనువుగానుండెను.

ఈలోపు ఘాజీయుద్దీనుగారు ఢిల్లీ దర్బారు చక్రవర్తిగారి వజీరు మొదలయినవారి వలన దక్కనుసుబేదారీకి తానొక అధికారపత్రమును సంపాదించి తరలివచ్చుచున్నారని వార్తయొకటి వ్యాపించెను. అంతట సలాబతుజంగుగారు గోలకొండనుండి తక్షణమే బయలుదేరి ఔరంగాబాదు నగరమునకు పోయి అక్కడనుండుటకు నిశ్చయించిరి.

సలాబత్‌జంగుగారు మే నెలలో గోలకొండ నుండి తరునాత ఔరంగాబాదుకు తరలి వెళ్ళిరి. అక్కడ గొప్ప ప్రభువులు ఆయనకు సుముఖులుగా లేరు. నాజరుజంగు దగ్గిర ప్రధానమంత్రిగా పనిచేసిన షానవాజ్‌ఖాన్‌గారిని ముజఫరుజంగుగారు ఆహ్వానించి అతనికి మరల వజీరుపని నిచ్చియుండిరి. ముజఫర్‌జంగు చనిపోగా షానవాజ‌ఖాన్ శిబిరములో నుండి తప్పించుకొనిపోయి ఔరంగాబాదుకు వెళ్ళి సలాబతుజంగు అసమర్ధుడనియు కొలదిమంది కాఫర్లకు లోబడి మొగలాయి ప్రభుత్వముయొక్క గౌరవమును, మర్యాదను పోగొట్టినాడనియు అతనిని నిందించి అతని పట్ల ద్వేషము కలిగించెను. పైగా ఫ్రెంచివారాతని రాజ్యములో సగభాగము అపహరించుటకు కుట్ర చేసియున్నారని కూడా అపవాదు వేసెను. అందువలన ఔరంగాబాదు సమీపముననే సలాబతుజంగు తన గౌరవమును, అధికారమును ఢిల్లీ చక్రవర్తిగారు స్థిరపరచినట్లొక నాటకమునాడుటకు నిశ్చయించెను. నిజాముల్ ముల్కుగారి క్రిందనున్న రాజ్యములన్నిటికి తనను సుబేదారునిగ చేయుచు పర్మానా చక్రవర్తిగారొక రాజదూతను పంపినారని సలాబతుజంగు చెప్పుచు ఢిల్లీ నుండి వచ్చిన రాయబారిగా నొకనికి వేషము వేసి ఔరంగాబాదుకు కొంతదూరములోనికి రప్పించి ప్రెంచి సైనికదళముతో సహా తానొక మైలుదూరము వానికెదురేగి స్వాగతమిచ్చి అతడు చక్రవర్తిగారి దగ్గరనుండి తెచ్చిన లేఖనందుకొని చక్రవర్తిగారినుద్దేశించి వంగి సలాములు చేసి తానా ఫర్మానానందుకొన్నందులకు సూచనగా తన సైన్యమున గల ఫిరంగులను, తుపాకులను అన్నింటినొక్కమారుగా ప్రేల్పించెను. తరువాత నతడొక గొప్ప దర్బారును తీర్చెను. ఆ దర్బారులో మొట్టమొదట బుస్సీగారే యాయనకు వంగి సలాముచేసి నజరు సమర్పించిరి. తరువాత సలాబతుజంగు గారి సైన్యము ముందుకు సాగి ఔరంగాబాదు నగరమున మహావైభవముతో ప్రవేశించిరి.

ఔరంగాబాదు చాల గొప్ప నగరము. అందులో పదిన్నర లక్షల జనసంఖ్య యుండెనని ఆకాలమునందు అంచనా వేయబడినది. ఫ్రెంచి సైనికులను ప్రత్యేకముగ నొకచోట నుండుటకు విడిది యేర్పాటుచేసిరి. ఢిల్లీ చక్రవర్తి సలాబతుజంగు అన్నగారైన ఘాజీయుద్దీన్ గారిని దక్కను సుబేదారుగా నంగీకరించెనని చాలమందికి తెలియును. అందువల్ల నిప్పుడీ సలాబతుజంగు తానే దక్కను సుబేదారుడనని ప్రకటించినట్లు విన్నప్పుడు వారు ఆయన అధికారమునకు తాము లోబడి ప్రవర్తింపదలపలేదు. అయినప్పటికిని ఇంతగొప్ప వైభవముతో వచ్చి తమ నగరములో ప్రవేశించి దానిని తన రాజధానిగా చేసికొనెదనని ఇతడు ప్రకటించి రాజలాంఛనములన్నియు వహించియుండగా ఆ క్రొత్త సుబేదారుని దర్శించుటకు వారికి కుతూలహము కలుగుటలో నాశ్చర్యములేదు. పైగా తమనగరమును రాజధానిగా చేసుకొని ప్రభుత్వము చేయుచున్నప్పుడు వారు సంతోషముతో నుప్పొంగుటలోను ఆశ్చర్యములేదు. అందువలన ఈ క్రొత్త సుబేదారుగారు అధికారము వహించిన సందర్భములో నగరమునందు జరుగుచున్న ఉత్సవములందును కోలాహలమునందును ప్రజలు నిమగ్నులై ఘాజీయుద్దీను మాటనే తలపెట్టలేదు. క్రమక్రమముగా అందరును ఘాజీయుద్దీన్ మాటను మరచిపోయి సలాబతుజంగునే దక్కను సుబేదారుగా నంగీకరించి యతని అధికారమునకు లోబడి అతనికి పరిపాలనలో తోడ్పడసాగిరి.

ఆ సంవత్సరాంతము వరకును సలాబతుజంగుగారు ఔరంగాబాదులోనే యుండి యెట్టి యుద్దపు బెడదలును లేకుండా తన ప్రభుత్వ వ్యవహారములను చక్కబెట్టుకొనసాగిరి. సలాబతుజంగు భోగ ప్రియుడు. అందువలన తన రాజభవనమునందు గొప్ప విందులు, మేజువాణీలు జరిపిచుచూ వినోదములందు, భోగములందును ప్రొద్దుపుచ్చుచు సుఖముగా కాలము గడపసాగెను. తరువాత కూడా సలాబతుజంగు హైదరాబాదు కన్న ఔరంగాబాదులోనే హెచ్చుగా నివసించుచుండెను.

(సమాప్తం. ఆంధ్రప్రభ సెప్టెంబరు 1968-ఫిబ్రవరి 1969)