చుక్కచుక్కనా కనిపించేది నీ మోమే అయినా
ఎప్పుడయినా నీ గుండె నింపగలిగానా?
నువ్వున్నా ఎడారిలో ఇసకమీద
కప్పేసిన దుప్పటి కప్పుకున్న చిల్లుల్లోంచి
నన్ను నేనే చూసుకు మురిశానేమో మెరిశానేమో
వడగాడ్పులన్నీ దాటుకుని వచ్చి
బొత్తాలెన్నిసార్లుత్తరించినా
ఎండిన రహస్సంద్రమేగానీ నీకు
ఎర్రని ఏగానీంత దుఃఖానందమేనా ఉందా!
బీటలూ మీటలూ తప్ప
దుమ్ముదులిపి తోమి తుడిచి మెరుగుపెట్టి
దప్పిగొన్నప్పటి ఫోటో వేళ్ళాడేస్కుని
దీనంగా ఆవులించినా
కంటి చివర్ల నుంచి చూస్తూ
పట్టాలని బెదిరించడం తప్ప
రైలేనాడేనా ఎక్కించుకుందా
నిన్ను దక్కించుకుందా!
ఒకటి నీ ఖాళీతనాన్ని చూసి నేను చెమర్చటం
ఇంకోటి నా బావిలో పడి ఈదుతూ
విశ్వాన్ని వెదుకుతూ పోగొట్టుకుంటూ
మోకాళ్ళు దోక్కుపోయినా ప్రేమనివ్వలేకపోటం.
కారు ముందు సీట్లో కబాబ్‌లా కౌగిలింతలా
కాష్టంలా కాల్తూనూ
పూడిన ప్రేమ నరం మరీ పోటు కదా…