ఆ వేసవిలో నాన్నకి ట్రాన్సఫర్ అయింది. అడిగి చేయించుకున్నాడని అత్తయ్య చెప్పింది. అక్కడ వాళ్ళకి నన్ను తల్లిలేని పిల్ల అని చెప్పింది. అంటే మా అమ్మ చనిపోయిందని అర్థం అన్నమాట. బాగా కోపం వచ్చింది నాకు. (దమయంతి కూతురు, సత్యవతి కథలు.)
తమ జీవితాల్లోంచి తల్లి పాత్రను పోషించడానికి నిరాకరించి, తమని వదిలిపెట్టి వెళ్ళిపోయిన అమ్మ వల్ల తీవ్రమైన లోటు ఏర్పడినా, తమ జీవితాలు అతలాకుతలమైపోయాయని తెలుస్తున్నా ‘మా అమ్మ చనిపోయింద’నే అర్థాన్ని పదేళ్ళైనా నిండిన దమయంతి కూతురు తిరస్కరిస్తుంది. తన కన్నతల్లిని మాటలతో అందరూ దూషిస్తుంటే వీలైనంతగా ప్రతిఘటిస్తుంది.
నిజానికి అతను ‘వెళ్ళిపోయిందా?’ అని అనలేదు. మా ఊళ్ళో మా చుట్టాలు పక్కాలు, ఇరుగు పొరుగులు, అంతగా చదువు రానివాళ్ళు, బ్రూట్ పరిమళాలూ మౌత్‌వాష్‌లూ ఎరుగనివాళ్ళు వాడేసి వాడేసి అరిగిపోయి కాలం చెల్లిన ఒక మాట అన్నాడు.
భర్తాపిల్లలని వదిలేసి దమయంతి వెళ్ళిపోవడం వల్ల పితృస్వామ్యపు కోటగోడలు ఎన్ని బీటలు వారాయో, స్త్రీవాదమనే మర్రిచెట్టుకి ఊడలెన్ని పడ్డాయో నాకు తెలీదు గాని, దమయంతి కూతురు మాత్రం ఆ పితృస్వామ్య సామ్రాజ్యంలో చెలామణిలో ఉన్న భాషని గట్టిగానే ధిక్కరించింది. తన తల్లి లేచిపోలేదు. తను తల్లి లేని పిల్ల కాదు, ఇంకెవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.
ఈ మధ్య మళ్ళీ చదువుతున్నప్పుడు నాకు ఈ కథ కొత్తగా కనిపించింది. ఇప్పటివరకూ నేను దీన్ని ఒక వ్యవస్థలో తన తల్లి పాత్రని కాదనుకుని వెళ్ళిపోయిన స్త్రీ వల్ల కుటుంబం, ముఖ్యంగా పిల్లలు ఎంత కోల్పోతారో అన్నదే చర్చకు పెట్టినట్టు అనిపించేది. అలాంటి ఓ విపరీతమైన (సమాజానికి అలవాటులేని, ఆమోదించలేని) నిర్ణయం లోనే ఈ కథ అస్తిత్వమంతా నిలిచి ఉంది అనుకునేదాన్ని. ఆమె అట్లా చెప్పాపెట్టకుండా పోకపోయుంటే, ఎంచక్కా ఆ పిల్లలూ సుబ్బరంగా ఉండేవారు కదా అనిపించేది. ‘తన జీవితాన్ని మలుచుకునే హక్కు ఆవిడకుంది కదా’ అన్నది ఒక పార్శ్వం మాత్రమే. సమాజానికి భయపడో, తన బాధ్యతను కాదనుకోలేకో ఆమె ఉండిపోయుంటే కూడా ఈ పిల్లలకి తల్లి లేకుండా పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇప్పుడర్థమవుతోంది. సమాజం దృష్టిలో వాళ్ళు చింతలేని కుటుంబం అని అనిపించుకున్నా లోలోపల మాత్రం ఆ బంధం బీటలు వారేది.
మనమీ సంగతి చర్చకి పెట్టం. ఎంతసేపూ ఒక బంధంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి అని చెప్తామే కానీ ‘నిన్ను నువ్వు కొద్దికొద్దిగా చంపుకుంటూ ఉన్న ఏ బంధమూ ఆరోగ్యకరం కాదు. నీకూ కాదు, తక్కినవాళ్ళకీ కాదు’ అని మనం అనం. ముఖ్యంగా తల్లుల విషయంలో ఆ ఊహ కూడా రానివ్వం.
ఊరు మారినప్పుడు, ఇరుగుపొరుగు వారినుంచి ఆ అమ్మాయిని రక్షించడానికి ఆమె అత్తయ్య అందరికీ తల్లి చనిపోయిందనే చెప్తుంది. ఎందుకు? చనిపోవడం, ఇంకే రకంగానూ లేకపోవడానికంటే ఏ రకంగా తేడా? ‘తల్లి లేని పిల్ల’ అనగానే ‘తల్లి చనిపోయింది’ అన్న అర్థం మాత్రమే ఎందుకు అందరికీ మొదటగా స్ఫురిస్తుంది? అదొక్కటేనా తల్లి లేకపోవడం అంటే. అదొక్కటేనా సమాజం ఒప్పుకొనే సమాధానం? ఈ ప్రశ్నలు వేసుకుంటూ సమానార్థాలు వెతుక్కుంటూ పోతే నానార్థాలు దొరికాయి. తల్లిలేని లోటే కాదు, తల్లి ఉన్నా లోటుండచ్చన్న కొత్త అర్థాలు కనిపించాయి. వాటినే ఇక్కడ పంచుకుంటున్నాను. ఇవి కొత్తగానే కాదు కొంత వింతగానూ, విపరీతార్థాలుగానూ కూడా తోచవచ్చు. కొంచెం భారీగానో, ఎక్కువ తికమకగానో ఉండచ్చు. అయినా పర్లేదు, మాట్లాడుకుందాం. మాట కుదరకపోతే పోట్లాడుకుందాం. కరుడుకట్టుకుపోయిన అర్థాలని కరిగించేటప్పుడు ఆ మాత్రం వేడి, వాడి అవసరం.
ఒకసారి బిడ్డలని కన్నాక, ఆ కనడం వెనుక ఉన్నది కోరికే అయినా, పొరపాటే అయినా, తల్లిదండ్రులనేవి శాశ్వతమైన పాత్రలు. పోషించక తప్పనివి. పోయేంతవరకూ తప్పనివి. వాటిని కాదనుకోవడం, వెనక్కి తగ్గడం, మరో ఆలోచన పెట్టుకోవడం లాంటివేవీ కుదరవు, పెళ్ళాం పిల్లలను వాళ్ళ ఖర్మకు వాళ్ళను ఒదిలి వెళ్ళిపోయే కొందరు మొగమహారాజులకు తప్ప (ఇక్కడ ఆడమహారాణులుండరు). ఆ పాత్ర ముగిసింది అంటే అది వాళ్ళ జీవితంలోనే ఆఖరి రోజని అర్థం. అంటే, మనిషిగా నీ ఉనికికి, తల్లి/తండ్రిగా నువ్వు పోషించే పాత్రకి విరామం లేదన్నట్టు. ఈ నాటకంలో బోలెడు మజా, బతుకులో ఉన్నట్టే. కానీ పాత్రని ఆస్వాదిస్తూ నిర్వహించాలంటే అన్నీ అనుకూలంగా ఉండాలి, తక్కిన పాత్రలు సహకరించాలి. వ్యక్తిగత నైపుణ్యం, సమర్థతే కాక ఇంకెన్నో సమకూరాలి, కలిసిరావాలి.
నువ్వు వేదిక ఎక్కేసరికి నీ శారీరక, మానసిక స్థితి ఎలా అయినా ఉండనీ, నీ ఆర్థిక పరిస్థితులు, ఆశయాలూ ఆవేశాలూ ఏవైనా కానీ పాత్రలోనే ఉండాల్సిందే అని సమాజం నిర్బంధించినప్పుడు ఎన్నో సమస్యలు తలెత్తుతాయి, ముఖ్యంగా ఆడవారికి. కాస్త ఆటవిడుపు, కాస్త విరామం దొరక్కపోతే అలుపు, విసుగు కమ్మేస్తాయి. ‘ఇహ నేను ఈ ఆట ఆడలేను. ఈ పాత్రకి న్యాయం చేయలేను. ఉండీ లేకుండడం కంటే అసలు లేకపోవడమే నయం కదా?’ అని వెళ్ళిపోయేవాళ్ళకు ఒక నిజాయితీ, తమ జీవితం పట్ల నిబద్ధత కూడా ఉండి ఉండచ్చు. పర్యవసానాలు ఎలా ఉన్నా, లోకం ఎన్నో మాటలతో తూట్లు పొడుస్తుందని తెల్సినా, బతకడం దుర్భరం అయిపోగలదని తేటతెల్లం అవుతున్నా కఠిన నిర్ణయాలు తీసుకునే తెగువ ఉండచ్చు.
వదిలి వెళ్ళడమంటే ఒక వ్యవస్థ నిర్దేశించిన పాత్రలో కాక అదే వ్యవస్థలో వేరే పాత్రగా బతకడం. అంటే ఒక పాత్ర షోషించడం అర్ధాంతరంగా మానుకోవడమే కాక అదే డ్రామా కంపెనీలో మరో పాత్ర వెతుక్కోవడం. కంపెనీసమాజం ఊరుకుంటుందా? వదిలిపెట్టిన వాళ్ళని, వదిలివేయబడ్డ వాళ్ళని ఏదో రకంగా హింసిస్తూనే ఉంటుంది. ఇట్లా మానేశాక బతకడం తేలికైపోతే అందరూ ఇలా చేయడం మొదలెట్టరూ? అని సమాజానికి కంగారు. అందుకని ‘వ్యక్తిగా నీక్కావాల్సినట్టు బతికే హక్కు నీకుంది’ అని పైపైకి అంటూనే శిక్షలు గాని శిక్షలు ఏవో వేస్తూనే ఉంటుంది.
సర్వసాధారణంగా తండ్రి భార్యాబిడ్డలను వెళ్ళిపోతే ఉండే రియాక్షన్ మ్యూటెడ్గా ఉంటుంది. (బహుశా భార్య గయ్యాళితనానికి మనసు విరిగిపోయుంటుంది పాపం.) కాని, తల్లి భర్తాబిడ్డలను వదిలి వెళ్ళిపోతే అది ఒక సెన్సేషన్ అవుతుంది. వాస్తవంలోనే కాదు, కథల్లోను, సినిమాల్లోనూ సెన్సేషనే! ఈ కథల రచయితలూ ఈ సమాజంలో భాగమే కాబట్టి ఇలా వెళ్ళిపోవడం వారికీ ప్రమాదమే కాబట్టీ. (ఎలాగోలా చివరికి అమ్మతనాన్ని గుర్తించిన పశ్చాత్తాపంతో పాత్రలను ముగించడం వీరి కథలలో మనకు తరచూ కనిపించే విషయం.) నన్నడిగితే ఇది ‘ఆల్ ఇండియా రాంక్ ఒకటి రెండు మూడు’ అనే ప్రకటనల హోరు లాంటిదే. ‘వ్యవస్థని ధిక్కరించడం’లో ఇలా వదిలి వెళ్ళిపోయిన అమ్మలు టాపర్లు కాబట్టి వీళ్ళపైకే ధ్యాస పోతుంది. వీళ్ళ గురించే చర్చలు. మరి, ఈ పరీక్షలో తక్కువ మార్కులొచ్చినవాళ్ళు, ఫెయిల్ అయినవాళ్ళు, లేక అసలు పరీక్షకే కూర్చోనివాళ్ళ సంగతేంటి?
సమాజం సమాజం అంటాం. అదొక రూపంలేని జంతువు. అందుకని దాన్ని అటాక్ చేయడం అటుంచి అది మనల్ని అటాక్ చేస్తుందని చెప్పి నమ్మించడమే మహా కష్టం. ఎందుకంటే, అది కొడితే మనకి దెబ్బ గట్టిగానే తగులుతుంది కానీ అదే కొట్టిందని నిరూపించలేం. పైగా, ‘అంటే అన్నారు పట్టించుకోకు. నీ పని నువ్వు చూసుకో’ అన్నది ఒక ఉపయోగం లేని సలహా. తలొంచుకొని దెబ్బలు తిను. కాని, వాటిని పట్టించుకోకు–అని చెప్పడంలాంటిది. దెబ్బలు అసలు పెద్ద తగలకపోయినా, పోనీ దెబ్బ గట్టిగానే పడినా తట్టుకోగలిగిన వారెవ్వరైనా ‘ఏదో కూస్తుంది లోకం, అంతకన్నా ఏం చేస్తుంది? మన పని మనం చేసుకోవాలి’ అంటారు.
కానీ ఆ దెబ్బలకి తట్టుకోలేనివాళ్ళ సంగతేంటి? ఆ గాయాల నొప్పులకు ఓర్చుకోలేనివాళ్ళ సంగతేంటి? ఆ దెబ్బలు తినీ తినీ బండబారిపోయినవాళ్ళు లేదూ చితికిపోయి జీవఛ్ఛవాలైనవారి సంగతేంటి? తరాలుగా వస్తున్న నియమాలకు కండిషన్డ్ అయిపోయి లోకం ఏమనుకుంటుందో అనే బెరుకుతో తమ గొంతు తాము నొక్కుకునేవారి సంగతేంటి? మనం మాట్లాడుకోవలసింది వీళ్ళ గురించి. ‘ఏం చేస్కుంటారో చేస్కోండి. ఇది నా జీవితం నా ఇష్టం’ అని వెళ్ళిపోయే ధైర్యమతుల గురించి కాదు.
నేనంటున్న ఈ సమాజం, కోడై కూసే ఈ లోకం ఏదో కోట్లాది ప్రజానీకం ఉన్న లోకం కాదు. ఇందులో తిప్పితిప్పి కొడితే ఒక నాలుగైదు వేలమంది కూడా ఉండరు. పల్లెటూళ్ళో అందరికి అందరూ తెలుసు, పట్నంలో ఒక ఏరియాలో, నగరంలో ఒక కాలనీలో. అందులో తొంభై శాతం వాళ్ళేమైనా అన్నా కూడా మరోసారి మాట్లాడకుండా ఉండడం, తప్పించుకోవడం, వాళ్ళని దూరంగా ఉంచడం సులభం. తిరకాసంతా మిగిలినవాళ్ళతోనే, ఈ దగ్గరవాళ్ళతోనే. వీళ్ళు ఎవరో కాదు, మన స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు, మనతో రోజూ మాట్లాడే మన ఇరుగుపొరుగులు. వీళ్ళు సూటిగా ఏమీ అనకుండా సమాజమని వంక పెడతారు. వాళ్ళూ వీళ్ళూ ఆడిపోసుకుంటున్నారంటారు. ఏది చేసినా ఏది చేయకున్నా నిరంతరం ఎత్తిపొడుస్తూనే ఉంటారు. మద్దతుగా నిలిచేవారు, వెన్నుదట్టి ప్రోత్సహించేవారు ఉండరని కాదు. కాని, వారు అన్నిచోట్లా ఉండరు. అందరి సన్నిహిత సమాజాలలోనూ ఉండరు. అలా ఉన్నవారి కథ కొంత మెరుగు లేనివారికంటే, అంతే.
మాతృత్వంలోని మాధుర్యం, తల్లిప్రేమ గొప్పతనం, అమ్మ అనిపించుకోవడం స్త్రీమూర్తికి గౌరవం అంటూ గొంతెత్తి అరుస్తున్న సమాజం నిజంగా తల్లుల పట్ల ఎలా ప్రవర్తిస్తోంది? ఒక స్త్రీ తల్లిగా మాత్రమే మిగిలిపోక ఒక మనిషిగా కూడా తన జీవితంలో మరికొన్ని పార్శ్వాలనూ అన్వేషించుకోవాలనుకుంటే? అసలు పిల్లలే వద్దనుకుంటే? అందరు మగవారు తండ్రి పాత్రలకు ఎలా సరిపోరో, ఆడవారు కూడానూ అందరూ తల్లి పాత్రలకు సరిపోరు అన్న వివేచన ఉందా, అసలు వస్తుందా? అందరినీ ఒకే రాటనగట్టి ఒకే బతుకు బతకమనడం ఎలా సాధ్యమవుతుంది? భార్యను, పిల్లలను హింసించే తండ్రుల కథలు కోకొల్లలు. భర్తను, పిల్లలను హింసించే భార్యల కథలు ఎక్కడ? వారి మనస్తత్వాల గురించి, వారి నేపథ్యాలు, అసహాయతలు, క్రూరత్వాల గురించిన చర్చ ఎక్కడ? ఎందుకిలా అందరు ఆడవాళ్ళకు తల్లి, స్త్రీమూర్తి అంటూ ఇలా ట్యాగ్స్ అంటగట్టి వారందరినీ క్లోన్స్ లాగా చూస్తున్నాం? తండ్రిని తీసుకోని మనం నిజజీవితం లోను, సాహిత్యం లోను కూడా తల్లిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా ఎందుకు తీసుకుంటున్నాం?
ఇది స్త్రీలను సింహాసనం ఎక్కించి మరీ వేసే కొరత. అందలం ఎక్కించి మరీ మెడకు వేసే గుదిబండ.
కరుడుగట్టిన నిశ్శబ్దం ఇలాంటి అంశాల చుట్టూ ఉంటే, వీటిని గుర్తించేదెప్పుడు, స్పందించేదెప్పుడు?
దమయంతి కూతురు కథలో అమ్మ ఎప్పటికీ లేకుండా పోతుంది. పిల్లలకి, అమ్మకీ మధ్య అదో శాశ్వత దూరం. వాళ్ళు ‘తల్లి లేని పిల్లలు’. తల్లిలేని పిల్లలు అనగానే మొదట స్ఫురించే అర్థం: అమ్మ చనిపోయింది. అయ్యో పాపం! అన్నది ఠక్కున వచ్చే స్పందన ఈ సందర్భంలో. అయితే మళ్ళీ ఇందులో తేడాలుంటాయి.
అనారోగ్యంతోనో, ఏ ఆక్సిడెంటులోనో చనిపోతే అయ్యో అనడానికి ఎలాంటి సంకోచమూ ఉండదు. హత్యలాంటివైతే కాస్త తటపటాయించాల్సి రావచ్చు. ఎందుకు చేశారో? ఏం జరిగిందో అన్న కుతూహలం తినేస్తుంటుంది లోలోపల. అదే ఆత్మహత్య అయితే నిర్ణయం వ్యక్తి చేతిలో ఉంటుందని, పరిణామం చావే అయినా పరామర్శలో తేడాలొస్తాయి. పిల్లలు అన్యాయమైపోతారన్న జాలి కూడా లేకుండా ఎంత దారుణానికి ఒడిగట్టింది? ఎలా బతుకుతారనుకుంది? అన్నది వినిపిస్తుంది. ఒకవేళ పిల్లలకీ అదే విషం పెట్టుంటే, ఎంత దుర్మార్గం? బిడ్డల్ని కనే హక్కు ఉంటుంది కానీ చంపుకునే హక్కు ఎవరిచ్చారు? అని విస్తుపోవడం.
కాని, ఆ మనిషి బతికే ఉన్నా ఆ తల్లి పాత్రను పోషించనంటూ వెళ్ళిపోతే?
అమ్మ చనిపోయినా, వెళ్ళిపోయినా రెంటిలోనూ పిల్లలకి భయంకరమైన వేదన, లోటే మిగులుతాయి. చనిపోయినవారిపట్ల సమాజం కాస్త సున్నితంగా వ్యవహరిస్తుంది. పిల్లల సంఘర్షణ అంతర్గతంగా మాత్రమే ఉంటుంది. కాని, వెళ్ళిపోయినవాళ్ళ విషయంలో సమాజం ఎక్కడో ఉన్న తల్లిని ఏమీ అనలేక ఆ తప్పును పిల్లలమీద రుద్దుతుంది. వాళ్ళను సూటిపోటి మాటలంటుంది. వాళ్ళ మీద ఒక ముద్ర వేస్తుంది. వాళ్ళను అదుపులో పెట్టడానికి అది ఒక ఆయుధం అవుతుంది.
దమయంతి కూతురు కథలో అన్న చెల్లికి వచ్చిన ఒక పెళ్ళి సంబంధం గురించి ఇలా అంటాడు: ‘ఎప్పుడైనా నీ చదువూ నీ తెలివీ నీ ఉద్యోగం గుర్తొచ్చి నువ్వు ఎగిరిపడితే ఆ తల్లి మచ్చ ఒక పేపర్ వెయిట్‌లా పనిచేస్తుంది.’
అమ్మ వెళ్ళిపోవడం ద్వారా లేకపోవడం అనే సంఘర్షణ లోపల వాళ్ళకి వాళ్ళతోనూ ఉంటుందీ, బయట ప్రపంచంతోనూ ఉంటుంది. దమయంతి కూతురు కథలో ఈ రెండు వేర్వేరు యుద్ధాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి.
ఇట్లాంటి కథలు చదివినప్పుడు (లేదా తెల్సుకున్నప్పుడు) ‘ఆమె అట్లా వెళ్ళిపోకుండా ఉండుంటే ఈ పిల్లలకి ఇంత కష్టం కలిగేది కాదుగా?’ అన్న దిశగానే చర్చలు నడుస్తాయి. స్త్రీకి ఉన్న హక్కులు వర్సెస్ బాధ్యతల వివాదంగా మారిపోతాయి. ఎవరికి అనుకూలమైన వైపుకి వారు చేరి వాదించుకుంటారు. జడ్జిమెంట్లు పాస్ చేస్తారు.
పిల్లలు అసలే నలిగిపోయున్నారు. తీరని బాధని అనుభవిస్తున్నారు. తల్లి చేసినదానికి వీళ్ళని అనడం, లేదా తల్లినే ఆడిపోసుకోవడం వల్ల మనం వాళ్ళకెలా సాయం చేస్తున్నాం? అన్న ఆలోచన బహు అరుదు. పిల్లలకి ఆ తల్లినే తిరిగివ్వలేని పరిస్థితుల్లో, శాపమో పాపమో ఆ పీడ వారికి తప్పనప్పుడు కనీసం బయటవారితో చేసే యుద్ధాలు తగ్గినా కూడా కొంత ఊరటే కదా?
అయితే తల్లికి, పిల్లలకి మధ్య ఏర్పడే దూరం పైన మాట్లాడుకున్నంత తీవ్రంగా, శాశ్వతంగా ఉండదు ఎక్కువశాతం జీవితాల్లో. ఉండేది రకరకాల స్థాయిలలో ఉండే అమ్మతనం. సమాజం పైకి వల్లించే నిర్వచనాలకు ఎంత దూరం, ఎంత దగ్గర అనేదే. ఎంత పాశమున్నా ఎల్లప్పుడూ ఒకరికే అంటిపెట్టుకుని ఉండడం మనిషికి సాధ్యం కాదు. కానీ అమ్మలపై అనేక కారణాల చేత ఎల్లప్పుడూ ‘అందుబాటు’లో ఉండాలనే ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా న్యూక్లియర్ కుటుంబాలలో తల్లిదే అధిక పాత్ర. తండ్రులు ఓ చేయి వేస్తూ ఉండచ్చు, లీవ్‌లు పెట్టి బేబీ సిటింగ్‌లు చేయచ్చు కానీ ‘తల్లి ఉండాలి’ అన్నది ఎవరూ చెప్పకుండానే అందరూ పాటించాల్సిన శాసనం లాంటిది. దాని వల్ల కలిగే విపరీతమైన మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న అమ్మలకే తెల్సు. అంతా సవ్యంగా జరిగినంతసేపూ ఏ ప్రమాదమూ లేదు. ఏదయినా జరిగిందా, అంతే!
అయినా కూడా, ‘చనిపోవడం’ లేదా ‘కాదనుకుని వెళ్ళిపోవడం’ పక్కన వీటిని చేర్చేంత ప్రాముఖ్యం వీటికి లేదని, చిన్నచిన్న సమస్యలని భూతద్దంలో చూడనవసరం లేదనీ అనిపించచ్చు. కానీ దమయంతి వెళ్ళిపోవడం ఒక మనిషిని ఒక్కసారే కత్తితో పొడిచి చంపడం లాంటిదనుకుంటే, అది విస్మరించలేనిదైతే, ఎటూ కదలడానికి లేకుండా కట్టేసి ఒక మనిషిని పొద్దస్తమానమూ ఎన్నో ఏళ్ళ పాటు సూదులతో పొడుస్తూ ఉండడమనేది కూడా విస్మరించకూడనిదే!
కారణాలు ఏవైనా, తమ విధులు నిర్వహించకుండా పోయిన అమ్మల గురించి లబోదిబోమనే హక్కు ఉన్నప్పుడు, సర్వశక్తులూ ఒడ్డుతూ ఆ పాత్ర పోషిస్తున్నవారికి ఆసరాగా కాకపోయినా కనీసం మాటసాయంగా ఉండే బాధ్యత కూడా ఉండాలి. కనీసం ఆ అవగాహనైనా ఉండాలి.
‘తన జీవితాన్ని మలుచుకునే హక్కు తనుకుంది కదా అమ్మడూ. మనకోసం ఆమెకి అలవిమాలిన త్యాగాలు అంటగట్టకూడదు కదా!’ అని దమయంతి కొడుకు అన్నప్పుడు, ‘అవును, హక్కులు, త్యాగాలూ లాంటి మాటలెందుకు, మనిషి మనిషిగానే లేనప్పుడు మీకు అమ్మెలా అవగలుగుతుంది? విడిచిపెట్టింది, వెళ్ళిపోయిందని గింజుకుంటున్నామే గానీ ఉండి ఎవరికీ కాకుండాపోయుంటే ఏం చేసేవాళ్ళం?’ అని చెప్పలేకపోవడం ఆరోగ్యకరమైన బంధాలకి పునాదిని గుర్తించలేకపోవడమే కదా?!
నార్వే దేశపు రచయిత గన్హిల్డ్ ఓయెహౌగ్ (Gunnhild Øyehaug) రాసిన చిన్నముడి (Small Knot) అనే కథలో బిడ్డ పుట్టాక బొడ్డుతాడుని కోయలేకపోతారు డాక్టర్లు. విశ్వప్రయత్నం చేసినా కుదరకపోయేసరికి అలానే వదిలేస్తారు. అందుకని ఆ తల్లి, పిల్లాడు మధ్య ఆ తాడున్నంత దూరం మాత్రమే జరగగలరు. ఒకళ్ళు బాత్రూమ్కి వెళ్తే ఇంకొకళ్ళు తలుపు దగ్గరుండాలి. ఆఖరికి ఆమె చనిపోయాక కూడా ఆ తాడుని కోయలేకపోతే కొడుకు తల్లి సమాధికి కొంతదూరంలో ఒక గుడారం వేసుకుని బతుకుతాడు శ్మశానంలో. వీళ్ళిద్దరి మధ్య భౌతిక దూరాన్ని ఆ బొడ్డుతాడు నిర్ణయిస్తుంది.
అదో అధివాస్తవిక కథ. మరి మన జీవితాల్లో ఈ భౌతికమైన దూరం ఏయే రకాలుగా సాధ్యం? సమాజం ఈ దూరాలకి ఎలా స్పందిస్తుంది?
జంతుప్రపంచంలో మానవ శిశువులకి అత్యంత ఎక్కువగా కేర్-గివింగ్ అవసరం. పుట్టిన కొన్ని రోజులకే వాటంతటవి నడిచి, తెచ్చిపెట్టినవి తినే ఇతర జంతువుల పిల్లల్లా కాదు. అంతకన్నా ఎన్నో రెట్లు సంరక్షణ, ఆలనాపాలనా కావాలి. అందుకని పిల్లల్ని పెంచడంలో మనుషులకి ప్రత్యేక సవాళ్ళున్నాయి. ఆ సవాళ్ళూ, వాటి పరిష్కారాలూ యుగయుగాలుగా మారుతూ మారుతూ ప్రస్తుతానికైతే బాధ్యత మొత్తం ఒక వ్యక్తి మీదకి–తల్లి మీదకి–వచ్చి పడింది. అలా పడడం వల్ల తల్లీబిడ్డల మధ్య తాత్కాలిక దూరం ఏర్పడ్డప్పుడు ఆ తల్లులు ఎంతటి మానసిక భారం మోయాల్సి వస్తుందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు.
పొద్దున్నే డబ్బాలో తినడానికి అన్ని సర్దిపెట్టేస్తుంది, తనే ప్లే-స్కూల్లో వదిలిపెడుతుంది, ఆఫీసులో వీలు చిక్కినప్పుడలా ప్లేస్కూల్ వాళ్ళిచ్చిన సిసిటివి కెమారా వీడియోల్లో ఏడుస్తుందా, ఆడుకుంటుందా అని చూసుకుంటుంటుంది, ఆఫీసునుంచి ఇంటికెళ్ళే దారిలో పాపను పిక్ చేసుకుంటుంది, పాప పనులన్నీ అయ్యాకనే, అది నిద్రపోయాకనే మిగతా పనులో, మళ్ళీ ఆఫీసుపనో ముందేసుకుంటుంది. ప్లే-స్కూల్ నుంచి కాల్ వచ్చిందంటే హుటాహుటిన బయలుదేరిపోతుంది, ఏ పూటైనా పాపకి బాలేకపోతే ఆఫీసు మానేస్తుంది మొత్తంగా, తర్వాత కొన్ని రోజులు ప్లేకి పంపకుండా వర్క్-ఫ్రమ్-హోమ్ చేస్తుంది.
పాప చుట్టూనే లోకం ఇక్కడ కూడా! పాపే ప్రయారిటీ. ఉద్యోగాన్ని కూడా దాని చుట్టూ మల్చుకుంటుంది. అయినా వినాల్సొచ్చే మాటలు: ‘ఆర్నెల్ల పిల్లని ఎట్లా వదిలేస్తారమ్మ ప్లే స్కూళ్ళల్లో. ఎంత రాతిగుండె మనుషులు కాకపోతే? ఎంత డబ్బు కట్టినా తల్లి తల్లే కదా’; ‘ఏం ఆ మాత్రం ఉద్యోగాలు మాని పిల్లల్ని చూసుకోలేరా? ఆ మాత్రం చూసుకోలేనప్పుడు పిల్లల్ని కనడం మాత్రం దేనికి?’
ఉద్యోగం మానమనేది తండ్రిని కాదు తల్లినే.
‘తూ బోల్ మై క్యా కరూఁ’ (నువ్వు చెప్పు నేనేం చేయాలో) అని ఒక కొలీగ్ అడిగేది రోజూ ఆఫీసుకి రాగానే. చుట్టాలతో, ఇరుగుపొరుగుతో, అత్తగారితో, స్వయాన అమ్మతో నానా మాటలు అనిపించుకునొచ్చి నన్నడిగేది ఏం చేయాలో చెప్పమని. ‘వదిలేయ్ ఈ పాడు ఉద్యోగం, పోయి పిల్లని చూసుకో’ అని నేను కూడా ఎక్కడ అనేస్తానో అన్న భయం ఆమెని పీకుతూ ఉండేది. అనడానికి నా దగ్గరేం ఉండేది కాదు. కారణాలేవైనా ఆమెకి ఆ ఉద్యోగం, ఆ జీతం అవసరం. అత్తగారినో, అమ్మనో రమ్మనే అవకాశం లేదు, పాపని వాళ్ళ దగ్గర వదిలేసే సమస్యే లేదు. అది నాకు తెల్సు. ఆమెకింకా బాగా తెల్సు.
‘నేనెంత దుర్మార్గురాలిని కాకపోతే వదిలేసి వస్తా పిల్లని’ అని నవ్వు లేని నవ్వు నవ్వేది ఆ అమ్మాయి అప్పుడప్పుడూ. దాని అంతరార్థం ఇది: అన్నీ వదిలేసుకుని ఉన్నపళాన నా పిల్ల దగ్గరికి పోవచ్చు నేను, అలా పొమ్మని లోకమూ నస పెడుతుంది, నా మనసూ పోరుపెడుతుంది. అయినా అలా నేను చేయలేను.
తల్లికి, బిడ్డకి మధ్య భౌతికమైన దూరం ఎంత తక్కువగా ఉంటే అంత భరోసా – బిడ్డ కన్నా ఎక్కువగా, లోకానికి. అందుకే, ఐఎఎస్ ఆఫీసర్ నుంచి కానిస్టేబుల్ వరకూ ఏ హోదాలో ఉన్న స్త్రీ అయినా తన వర్క్ ప్లేస్‌కి పసికందుని తీసుకొచ్చిన ఫోటోస్ వైరల్ అవుతాయి. అంతటి బాధ్యతలోనూ తల్లి పాత్ర పోషిస్తున్నందుకు, అది కూడా బిడ్డని కనుసైగల్లో ఉంచుకుని పనిచేస్తున్నందుకు (ఆ వాతావరణం బిడ్డకి ఎంత అనారోగ్యకరమైనా) సమాజం చూపించే మురిపెం.
వర్కింగ్ మామ్స్ అన్నది ఇప్పుడు సాధారణం అయిపోయిందని అనిపిస్తుంది గానీ దాంట్లో చాలా తిరకాసులున్నాయి. ‘మీరు పిల్లలతో ఏం పనిచేయగలరులే?!’ అని ముఖ్యమైన ప్రాజెక్టులు ఇవ్వరు. కంపెనీలో ఎన్ని రూల్స్ ఉన్నా మెటర్నిటీ లీవ్ తీసుకుంటే ఏదో మతలబు చేసి ఓ రెండేళ్ళు హైక్ ఇవ్వరు, ఇచ్చినా చాలా తక్కువ ఇస్తారు. వీటిన్నింటినీ అధిగమించి కెరీర్లో ముందుకెళ్ళాలంటే, పనితనం నిరూపించుకోడానికి ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ‘పిల్లల్ని పట్టించుకోకుండా పనంటుందెప్పుడూ’ అనే దెప్పుడు అన్ని వైపులనుంచీ వినిపిస్తుంది.
రెండు బాధ్యతలని బాలెన్స్ చేసుకుంటూ వస్తుందని గమనించకుండా ఒకదానికిచ్చే (ఉద్యోగం) సమయం వల్ల మరోదానికి (పిల్లలకి) అన్యాయం జరుగుతుందనే కథనం బలపడుతుంది. ఇంట్లో ఉంటున్నవాళ్ళు, బంధువులు, ఇరుగుపొరుగు అందరూ ఇదే పాట పాడేసరికి ఒకరకమైన అపరాధభావం నెలకొంటుంది. ఆఫీసునుంచి ఒక గంట ఆలస్యంగా చేరుకుంటే సంజాయిషీలు, ఎప్పుడన్నా రోజంతా బయటకి ఉండాల్సి వస్తే ఎన్నో బేరసారాలు. ఆ కొద్దిసేపట్లో పిల్లలు ఏ దెబ్బో తగిలించుకుంటే, చిన్నదే అయినా, మహాపాపం చేసిన ఫీలింగ్ వెంటాడుతుంది!
ఇందుకు విరుద్ధంగా అన్నింటిలోనూ తోడుగా నిలిచే భర్తలు, అత్తమామలు, అమ్మానాన్నలు లేరని కాదు. కాని, ఎంతమందికున్నారు? పోన్లే, నేనే ఉద్యోగం మానేసి ఇంటిపట్టునుంటా అనే భర్తలెందరు? అన్నా, దాన్ని సమర్థించే కుటుంబసభ్యులు ఎందరికున్నారు?
పిల్లల కోసం అన్నీ మానేసుకుని ఇంట్లోనే ఉండే అమ్మలకీ ఈ సమస్యలు తప్పవు. ఇంట్లో ఉంటున్నారన్న ఒక్క కారణం చేత మొత్తం బాధ్యత వాళ్ళమీద పడిపోయేసరికి ఒక్కోసారి బిడ్డనుంచి ఒకట్రెండు నిముషాల దూరం కూడా ప్రాణంతకం కావచ్చు.
ఇది వాస్తవ సంఘటన. భర్త ఆఫీసుకు పొద్దున్న పదింటికి బయలుదేరగానే బాల్కనీ గేటుకి, మెయిన్ డోర్‌కి తాళాలు, సెక్యూరిటి లాక్‌లు వేసుకుని ఆమె రెండేళ్ళ పాపతో లోపలకొచ్చింది. బాత్రూమ్ డోర్ జారగా వేసి ఇప్పుడే వస్తానుండని చిటికెన వేలు చూపించి వెళ్ళింది. అక్కడే ఉన్న పాప బాత్రూమ్ డోర్నాబ్తో ఆడుకుంటుంటే బయటనుంచి లాక్ పడిపోయింది. లోపలనుంచి ఆమె ఎంత లాగినా, పీకినా, కొట్టినా రాలేదు. ఆ శబ్దాలకి, ఆమె అరుపులకీ పాప ఏడుపు అందుకుంది. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే చేతిలో ఫోన్ లేదు. బిల్డింగ్ మొత్తానికి ఆ బాత్రూమ్ మనుషులు తిరగని మూలకుంది కాబట్టి ఆమె ఎంత అరచినా ఎవరికీ వినిపించలేదు. అలా గంటా, రెండు గంటలైనా ఆమె లోపలే ఉండిపోయింది. అప్పటివరకూ ఏడుస్తున్న పాప ఏడుపు వినపడలేదు. ఎన్నిసార్లు పిల్చినా పలకలేదు. పిల్ల ఏమైపోయిందోనని ఆమెకింక దడా వణుకూ వచ్చి వెంటిలేటర్కున్న అద్దాన్ని బాత్రూమ్లో (ఏం దొరికిందో మరి) వేసి పగలగొట్టింది. ఆ చప్పుడుకీ ఎవరూ రాలేదు. ఎప్పటికో మూడింటికి వాచ్‌మన్ అటువైపు వచ్చి పగిలిన అద్దపు ముక్కలు చూసి, వెంటిలేటర్ నుంచి వేలాడుతున్న పైజామా చూసి ఏదో జరిగిందని ఊహించి, భర్తకు కాల్ చేసి, భర్త వచ్చాక కూడా తాళాలూ అవీ పగలగొట్టడానికి లోపలికి వెళ్ళడానికి ఇంకో రెండో గంటలు పట్టింది. పాప ఏడ్చి ఏడ్చి స్పృహతప్పిపోయి ఉంది. లోపల ఆ తల్లి పడ్డ యాతన మానవ భాషలో చెప్పడం అసాధ్యం.
కలిగిన పరిణామాల తీవ్రత ఈ ఘటనలో ఎక్కువగా ఉంది గానీ చూసుకోడానికి ఇంట్లో ఇంకెవరూ లేక రెండుమూడేళ్ళ వయసు పిల్లల్ని బాత్రూమ్లలోకి తీసుకెళ్ళి పనికానిచ్చే అమ్మలు ఎంతమందో! పిల్లల్ని పెంచే క్రమంలో, ముఖ్యంగా మొదటి మూడేళ్ళల్లో, అమ్మలు అన్నీ వదులుకోవాలి. ఉద్యోగాలు, స్నేహాలు, సినిమాలు, షికార్లు. బిడ్డకి ఎక్కువ అవసరం ఆ సమయంలోనే కాబట్టి, పెరిగేకొద్దీ ఆ అవసరం తగ్గుతూ వస్తుంది కాబట్టి, ఆ ఆలనాపాలనా తల్లులకీ ప్రత్యేకానుభవమే. అయితే, చుట్టూ ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోతే అదో మధురానుభూతిగా మాత్రమే మిగలడం అసంభవం.
ఒకప్పుడు అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండేదేమో. ఇట్ టేక్స్ ఎ విలేజ్… అని అంటుంటారు. అట్లాంటిదేదో ఉండేదేమో, ఇప్పుడైతే లేదు. తండ్రికేం పాత్రలేదని కాదు, కానీ మరీ ఇలా ఇరవైనాలుగుగంటలూ ప్రతిక్షణమూ, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అంతటి దారుణ పరిస్థితులైతే లేవు తండ్రులకి. ముఖ్యంగా, ఆరోగ్యంగా ఉండి పనులన్నీ చూసుకుంటున్న తల్లి ఉండగా!
పిల్లలు పడ్డ కష్టాల కోణంలోంచి చూస్తే దమయంతి అలా వెళ్ళిపోవడాన్ని సమర్థించడమో, ఒప్పుకోవడమో కష్టం. అట్లా ఎప్పటికీ లేకుండా పోనవసరమే లేదు. వాళ్ళతోనే ఒకే ఇంట్లో ఉన్నా, తల్లి పిల్లలకి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వకపోతే, దూరంగా ఉంటే వాళ్ళ ఆలనాపాలనలో ఏమైనా సమస్యలు తలెత్తుతాయేమోనన్న భయం, అభద్రత లోంచే అమ్మలని మాటలు అంటూ ఉంటారేమో మరి. దమయంతిని అన్నంత అసహ్యంగా కాకున్నా తక్కిన తల్లులూ ఈ రోప్ వాక్‌లో ఏ కాస్త అటూ ఇటూ తడబడినా మాటలు పడాల్సివస్తుంది.
పిల్లల్ని వదిలేసి పోయింది-నుంచి, ఇంకొకడిని పెళ్ళి చేసుకుని ఊరేగింది-నుంచి, ఉద్యోగాలంటూ ఊర్లు పట్టుకుని తిరిగింది-నుంచి షోకులూ షికారులంటూ పిల్లలకి ఇంత ఉడకేసి పెట్టిన పాపాన పోలేదు-నుంచి, పిల్లకి ఒంట్లో బాగాలేకుంటే ఎలా వెళ్ళిందో ఊరొదిలి అలా, ఎంత తెలిసినవారి పెళ్ళయితే మాత్రం… ఈ మాటలన్నీ కంటికి కనిపించే, విస్మరించలేని దూరం చుట్టూనే ఉంటాయి. మళ్ళీ నింద, బాధ్యత రెండూ తల్లివే.
అయితే ఇంత స్పష్టంగా కనిపించే, అనిపించే విధంగా ‘లేకపోవడాలు’ కూడా సాధ్యమే! అవి చాపకింద నీరులాంటివి. చాప మీద అడుగేసిన వాళ్ళు చెప్తే తప్పించి దూరం నుంచి చూసేవాళ్ళకి తెలీవు. కానీ వాళ్ళు చెప్పరు. వినేవాళ్ళు ఉన్నారో లేరో తెలీక. ఉన్నా-విన్నా ఇంకేం మాటలు పడాల్సి వస్తుందోనన్న భయం.
– ఒక బిడ్డను పోగొట్టుకున్న కడుపుకోతలో మిగితా బిడ్డలకి ఉన్నాలేనట్టు అయిపోతున్నానే అని గుండెలవిసేలా ఏడ్చే తల్లి ఎవరికి చెప్పుకుంటుంది?
– తన రక్తమాంసాలు పంచుకున్న బిడ్డని చూడగానే ఒక అర్థంలేని, వివరించలేని ద్వేషం, అసహ్యం కలుగుతుంటే ఆ తల్లి ఎవరికి చెప్పుకుంటుంది?
– కళ్ళముందే బిడ్డ నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్నా వాడికేదో అయిపోతుందని అనుక్షణం ఆందోళనతో సతమవుతున్న తల్లి ఎవరికి చెప్పుకుంటుంది?
– ఆ బంధంలో ఇమడలేక, అలా అని విడాకులంటే పిల్లలెంత నలిగిపోతారోనన్న ఆలోచనతో రోజూ మగ్గిపోయే తల్లి ఎవరికి చెప్పుకుంటుంది?
– బిడ్డని కంటే తనకున్న జన్యుపరమైన సమస్యలో, మానసిక సమస్యలో, విషపూరితమైన కుటుంబాన్నో తప్ప ఇంకేం వారసత్వంగా ఇవ్వలేనన్న భయంతో ఎంత కావాలనిపిస్తున్నా మాతృత్వానికి దూరంగా ఉండే తల్లి ఎవరికి చెప్పుకుంటుంది?
వీటిల్లో చాలా వరకూ మానలేని రోగాలేమీ కావు. వైద్యనిపుణులు పూనుకోవాల్సినవాటిల్లోనూ మాటసాయం బోలెడంత తేలికపరుస్తుంది. పంచుకుంటే దిగిపోయే/ తగ్గే భారాలే ఇవ్వన్నీ. కానీ వీటి చుట్టూ నిశ్శబ్దమెందుకంటే వీటిని గురించీ మాట్లాడచ్చని తెలీకపోవడం వల్ల.
‘మా అమ్మంటే నాకిష్టం’ అని ఎవరన్నా అన్నా, ఒక రచన వచ్చినా మనం మురిసిపోతాం. తల్లిప్రేమకి సాటైనది లోకంలో లేదని లేదని ఊదరగొడతాం. లేదూ పిల్లల్ని వదిలేసిన దమయంతిని చూపిస్తాం. కానీ ఈ రెంటి మధ్యా బోలెడు వాస్తవాలున్నాయి.
“మా అమ్మంటే నాకు అసహ్యం.”
“మా అమ్మకి నేనిష్టం లేదు, నల్లగా ఉంటానని.”
“మా అమ్మ మా అన్నయ్యలకే అమ్మ. నాకు కాదు.”
“మా అమ్మమ్మ ఆత్మహత్య చేసుకుంది. అది మా అమ్మను నాక్కాకుండా చేసింది.”
“మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నన్ను గుర్తుపట్టలేదంతే!”
“మా అమ్మ అనే మాటలకి చచ్చిపోవాలనిపిస్తుంది.”
వీటిన్నింటిలోనూ తల్లీబిడ్డల మధ్య ఒక అంతులేని అగాధం ఉంది. అది కళ్ళకి కనిపించదంతే. ‘బంగారు కుటుంబాల’లోనూ బీటలువారిన బంధాలుంటాయి.
అత్తాకోడళ్ళంటే తగాదాలుంటాయి ఖచ్చితంగా, తల్లీకూతుళ్ళంటే పొంగిపొర్లే ప్రేమలే ఉంటాయి లాంటి మూసకథలు కాదు.
రచయిత్రి చీమామందా అడీచీ ‘ది డేంజర్ ఆఫ్ ఎ సింగిల్ స్టోరీ’ అని, మూసకథనాల వల్ల కలిగే ప్రమాదం గురించి ఒక ఉపన్యాసంలో చెప్తుంది. అందులో ఆఫ్రికన్ దేశాలకి, మనుషులకి సంబంధించిన ఏకముఖ కథనాలు (అక్కడ కటిక పేదరికం, రోగాలు ఎక్కువ, సక్రమమైన ప్రభుత్వాలు లేకపోవడం వగైరా) మాత్రమే ఎప్పుడూ అమెరికాలోనూ, తక్కిన ప్రపంచంలోనూ వినిపించడం వల్ల అదో చీకటి ఖండమనే భావన మాత్రమే కలిగి, అన్ని కష్టనష్టాలలోనూ అక్కడి ప్రజలు నిలదొక్కుకుని హుందాగా జీవిస్తున్నారన్న సంగతి ఎవరూ గుర్తించరని చెప్తారావిడ. అలాగే సౌత్ అమెరికాలో డ్రగ్ లార్డ్స్, హత్యలు, కిడ్నాపులు వంటివి మాత్రమే మాట్లాడుకోవడం, ఇండియా అనగానే స్లమ్స్ మాత్రమే చూపడం ఇలాంటి ఏకముఖ కథనాలే.
మన అమ్మల విషయంలో జరుగుతున్నది దాదాపుగా అదే. తల్లి త్యాగమయి, తల్లిది కల్తీ లేని ప్రేమ, బిడ్డల సంతోషానికి మించి తల్లికింకేం అక్కర్లేదు–ఇవే మనకి జీవితంలోను, సాహిత్యంలోను, సినిమాలలోనూ మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటాయి. ఇవి నిజాలు కావని కాదు. కానీ ఇవి మాత్రమే నిజాలు కావు. అమ్మలూ తడబడవచ్చు, పొరపాట్లు చేయవచ్చు. వాళ్ళకీ అర్థంలేని కోపతాపాలు రావచ్చు, లేదా స్వార్థం ఉండచ్చు. వాళ్ళల్లోనూ మొరటుతనం, ద్వేషం, క్రూరత్వం, రాక్షసత్వం – మనుషుల్లో ఎన్ని రకాలుండచ్చో అమ్మల్లోనూ అన్ని రకాలూ ఉంటారు. మనమే ఒక తెల్లని దుప్పటి కప్పేసి, అందరు తల్లులూ మహాత్ములే అన్న కథనాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం.
పరిస్థితిలో మార్పు రావాలంటే అత్తాకోడళ్ళ గొడవలు సర్వసాధారణమైనట్టు తల్లీబిడ్డల గొడవల గురించి మాట్లాడుకునే వీలు కలగాలి. కన్నతల్లి వల్ల ఏ కష్టం కలిగినా గబుక్కున ఎవరితో చెప్పుకోలేక, అది కష్టానికి మించి ఆవేదనగా మారినప్పుడు కూడా నోరు నొక్కేసుకునే పరిస్థితి పోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి. మిగతా అన్నీ బాగున్నా, సమాజం లెక్కల్లో వాళ్ళది బంగారు కుటుంబమే అయినా, తల్లితో ఇట్లా ఆరోగ్యకరమైన సంబంధం లేనివాళ్ళు అమ్మలయ్యాక ఆ వేదన, పీడ ఏదో రకంగా పిల్లలకీ అందజేస్తారు. క్షోభ (trauma) అనేది ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఏదో రకంగా దగ్గరవాళ్ళకి అంటుకుంటుంది. ఇలా తరతరాలుగా ట్రామాని ఒకరిరొకరు అందించుకోడమే వారసత్వపు క్షోభ (inter generational trauma) అంటే!
ఆడవాళ్ళంతా అమ్మలు కారు, కాలేరు. అమ్మలంతా బిడ్డలని లాలించి, పాలిచ్చి పెంచి, ప్రేమానురాగాలు పంచే మాతృమూర్తులు కారు. ‘మా అమ్మంటే నాకిష్టం’ అనే కథను మురిపెంగా చదువక్కర్లేదు. ‘మా అమ్మంటే నాకసహ్యం’ అనే కథను గగ్గోలుపెట్టి అమ్మలిలా ఎప్పటికీ ఉండరంటూ తగలబెట్టక్కర్లేదు. అందుకని మనం దమయంతి వెళ్ళిపోవడం వల్లే… అంటూ ఆవేశాలు పక్కకు పెట్టి, ఉన్న చోటే ఉండి, ఉండి కూడా లేకుండా, ఎవరికీ కాకుండాపోయిన అమ్మల గురించి ఆలోచనలూ మొదలెట్టాలి. మన చుట్టూ అలా ఎంతమంది ఉన్నారో? లేదూ మనమే అలా ఉండిపోయామో? కన్నేసి ఉంచుదాం. నిఘాలా కాదు. ఒక అక్కరతో, ఒక జాగ్రత్తతో!
అదిట్లా వ్యాసాలు రాసి, కథలు రాసి తెచ్చేసే మార్పు కాదు. జీవితాంతం థెరపీలు తీసుకున్నా ఒక కొలిక్కి రాకపోనూవచ్చు. కానీ మనం ఈ సంగతుల గురించి మాట్లాడితే, పోనీ మాట్లాడే ఆస్కారం ఉందని అయినా ఆశ పుట్టించగలిగితే మనలో చాలామంది మీదున్న భారం కొద్దిగానైనా తగ్గుతుంది. పోనీ, కొత్త భారాలు వచ్చి చేరవు. లోకమంటే ఎవరో కాదు, మనమే. లేదూ పాడులోకంలో కొద్దిగానైనా ఆశ మిగల్చాల్సింది మనమే.
దమయంతి వెళ్ళిపోయాక ‘ఆమె వెళ్ళిపోకుండా ఉండాల్సింది’ అన్నది అర్థరహితమైన మాట. ఆమె ఉండుంటే అంతా మంచే జరిగేదని మనమేం గారంటీ ఇవ్వలేం. మనకున్న పరిమితుల్లో చేయగలిగిందింతే: దమయంతులు వెళ్ళిపోయినా వాళ్ళ పిల్లల్లో ఆత్మనిబ్బరం కలిగేలా మాట్లాడడం. వెళ్ళలేక ఉండిపోయిన దమయంతులని, ఉండిపోయి ఎవరికీ కాకుండాపోయినవాళ్ళనీ అమ్మలే అని, వాళ్ళ కథలూ మనకి ముఖ్యమే అని గుర్తించడం. వాటిని ఎలాంటి జడ్జ్మెంట్స్ లేకుండా విని అర్థం చేసుకోవడం.
వ్యథను చెప్పుకుంటే కథవుతుంది. మన కథ వేరేవారికి ఆసరా అవ్వచ్చు, వేరేవారి కథ మన బరువుని తగ్గించచ్చు. అందుకే కథలు చెప్పుకోవాలి. మాటలకిచ్చే అర్థాలు విస్తరిస్తే గానీ మన ఆలోచనలు, మనసులు విస్తరించవు.