నవంబర్ 2020

తెలుగులో కథలూ కవితలూ వచ్చినంత ఇబ్బడిముబ్బడిగా వ్యాసాలు రావు. వస్తువు రాజకీయమైనా, సామాజికమైనా, ఉగ్రవాదమైనా, స్త్రీలపై అత్యాచారాలైనా మరింకేదైనా సరే, తెలుగు వారి భావప్రకటనకు కవితలే తొట్టతొలిదారి. లేదూ సినిమాఫక్కీలో ఎంతపెద్ద సమస్యకయినా చిటికెలో పరిష్కారం చూపించే కథలు. అంతే కాని, ఆ సంఘటనలను తార్కికంగా విశ్లేషించి నిగ్గుతేల్చే వ్యాసం మాత్రం తలపోయరు. వస్తువు పట్ల నిబద్ధత లేకపోవడం, ఆలోచనకు తావివ్వని సోమరితనం, కథాకవితాది ప్రక్రియలకు స్వీయ శైలి ముసుగులో ఎలాగైనా రాసే వీలుండటం బాహ్యకారణాలుగా కనపడుతోన్నా, వ్యాసం ఎలా రాయాలో తెలియకపోవడం కూడా ఇందుకు ఒక ముఖ్యకారణం. ఇందువల్లనే ఇప్పటి వ్యాసాలు ఏం చెప్తున్నాయో కూడా అర్థం కాని స్థితిలో ఉంటున్నాయి. సాహిత్యవిమర్శావ్యాసాలు, సాహిత్యదర్శనం కొంతయినా చేయించవలసిన పుస్తక సమీక్షలు, ముందుమాటలు అర్థం లేని నిర్వచనాల కుప్పగా, ఆత్మీయ అభయవచనాలుగా, మొహమాటపు పొగడ్తలుగా మిగిలేయి. వీటిలో ఏ ఒక్కటీ కథను, కవితను ఎలా చదవాలో లేదా చదవకూడదో పాఠకులకు వివరించదు. విమర్శ ఎలా చేయాలో నేర్పదు. పనిముట్లు ఏమీ అందివ్వదు. వారి వివేచనను పెంచదు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు ప్రధానాంశంగా పెద్ద చదువులు చదువుతున్న విద్యార్థులకు కూడా వ్యాసం యొక్క రూపం, భాష ఎలా ఉండాలన్న కనీస అవగాహన లేదని వారి రచనల ద్వారా తేటతెల్లమవుతూనే ఉంది.

ఏ రచనైనా ఒక సంభాషణ. భావప్రకటనకు ఒక మాధ్యమం. ఒక అంశాన్ని కూలంకషంగా తార్కికంగా క్రమబద్ధంగా చర్చించడాన్ని రచనా ప్రక్రియగా వ్యాసం అని పిలుస్తున్నాం తప్ప అంశం సాహిత్యేతరమయినా, ఆ వ్యాసం సాహిత్యమే అవుతుంది. కథా కవితాదిప్రక్రియలను చిత్రిక పట్టడానికి ఏ రకమైన పరిశ్రమ అవసరమో వ్యాసం రాయడానికీ అదే కృషి అవసరం. ఈ కృషి కరువైనప్పుడు ఆలోచనలో స్పష్టత లేకపోవడం, భావాలను వాక్యాలుగా మార్చడంలో తడబాటు లేదా తొందరపాటు, అధ్యయనం కొరవడడం వంటి లోపాలు ఏ రచనలోనైనా కొట్టొచ్చినట్టు కనపడతాయి. కథాకవితలకంటే వ్యాసరచన భిన్నమైనది అనుకోవడం అపోహ. కథ, కవిత మనసును కదిలిస్తాయని, వ్యాసం పొడిగా సాగుతుందనీ అనడం కూడా అసంబద్ధమే. తార్కిక విశ్లేషణలకు సృజనకారుల భావనామయ ప్రపంచం తలొంచదంటూ తమ అర్థవిహీనతను అమూర్త్యభావనలుగా ప్రకటించి తప్పించుకోజూస్తారు కవులు, కథకులు. తేడా అల్లా వ్యాసం ఆ వెసులుబాటు ఇవ్వదు. అంతే కాదు, సాహిత్యవిమర్శకు ఏకైక రూపం వ్యాసం. అందుకే సరైన వాక్యం, వ్యాసం రాయలేనితనం తెలుగులో సద్విమర్శను క్రమేణా మాయం చేస్తోంది. వస్తువును బట్టి సృజన, సృజన రూపాన్ని బట్టి వాక్యం సమకూరుతాయి. వాక్యం కేవలం దానిలోని బలం వల్ల పాఠకులకు గుర్తుంటుంది. వివిధ ప్రక్రియల ఉద్దేశాలను, వాటిలోని వాక్యాల ధోరణులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో క్రమేణా తెలుగు వాక్యం బలాన్ని కోల్పోతోంది. స్నేహాలనూ సాహిత్యాన్నీ గుంపుకట్టి విమర్శను ఎడంగా నెట్టేశాక, రచనను చూడటానికి అభిమానమూ అవసరమే రెండు కళ్ళయ్యాయి. తార్కిక వివేచన పూర్తిగా పక్కకు తప్పుకున్నాక, వాక్యాల్లోని రసహీనతను పట్టిచ్చే సాధనమేదీ మిగల్లేదు. కథలూ కవితల ద్వారా ఆగ్రహావేశాలు ప్రకటించే తెలుగు సాహిత్యకారులు వ్యాసం ద్వారా తమ వివేచనను కూడా ప్రకటించడం నేర్చుకోనంతకాలం తెలుగు భాష బోలు శబ్దాల రణగొణధ్వనిగానే మిగులుతుంది తప్ప ఆలోచనను పెంపొందించే భాష కాలేదు.