ముగ్గురు మహనీయులు

[అమెరికాకు చెందిన రాజకీయవేత్త, న్యాయవాది, రచయిత, మహోపన్యాసకుడు అయిన రాబర్ట్ ఇన్గర్‌సాల్ (Robert G Ingersoll, 1833-99) స్వేచ్ఛాలోచనకు స్వర్ణయుగం అని పిలవబడిన 19వ శతాబ్ది మధ్యకాలంలో మతాన్ని, మతాచారాలను ప్రశ్నిస్తూ ఎన్నో వ్యాసాలు రాశాడు, ఎన్నో ప్రసంగాలిచ్చాడు. అజ్ఞేయవాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి ‘ది గ్రేట్ అగ్నాస్టిక్’గా పేరు పొందాడు. ఈతని వ్యాసాలు, ఆలోచనలు ఇప్పటికీ పాతపడలేదు సరికదా ఇప్పటి సమాజానికి మరింతగా వర్తిస్తాయి. నౌడూరి మూర్తి తెలుగులోకి అనువదించిన కొన్ని ఇన్గర్‌సాల్ వ్యాసాలు ఈమాటలో ప్రచురిస్తున్నాం. – సం.]


నేను బిచ్చగాడుగా ఉన్నంతకాలం, తిడుతూనే ఉంటాను
ధనవంతుడుగా మారడమంత పాపం మరొకటి లేదంటాను.

ఒకానొక దేశంలో ఒకాయన ఉండేవాడు. ఆయన పేరు అ. మనం గౌరవంగా అ-గారు అని పిలుద్దాం. పరోపకారం అతని నైజం. అదే అతని వృత్తి. తన తోటి మానవుల పట్ల తనకున్న సహజమైన ప్రేమ గురించి కాని, తన ఆలోచనల శాస్త్రీయత, వాటి మానవీయత గురించి కాని అతనికేమాత్రమూ సందేహం లేదు. అందుకని, తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి జీవితాలను బాగుచెయ్యాలని నిశ్చయించుకున్నాడు.
 
ఆ ఉద్దేశ్యంతో అతని చుట్టుప్రక్కల ఉన్న సామాన్య ప్రజానీకాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. వాళ్ళల్లో చాలామంది అజ్ఞానులని, వారికి తమ జీవితాల పట్ల, తమ వృత్తి పట్ల పెద్దగా శ్రద్ధాసక్తులు లేకుండానే గడిపేస్తున్నారని; ఏ అతికొద్దిమందికో మాత్రమే జీవితం పట్ల స్పష్టత ఉన్నదని; చాలామందికి తమ స్వంత అభిప్రాయాలంటూ ఏవీ లేవని; ఎక్కువమందికి కండబలం ఉన్నప్పటికీ, బుద్ధిబలం ఏ నూటికో కోటికో మాత్రమే ఉన్నదని, గ్రహించాడు. ఇంచుమించు అందరూ ఏ ఆశయాలూ లేనివాళ్ళే. ఏ రోజుకి ఆ రోజు, తినడానికి తిండి, పడుకునేందుకు ఒక చోటు ఉండి, అడపాదడపా కాస్త సరదాలు తీర్చుకోవడంతో సంతృప్తి చెందినవారే అందరూ. అందరికీ రేపటి రోజు మీద నమ్మకం. ఆ నమ్మకంతోటే ముందుచూపుతో భవిష్యత్తు గురించి ఏ ప్రణాళికలూ వేసుకోనివాళ్ళు. ఎక్కువమంది మోసగాళ్ళు, దుబారాపరులు, వ్యసనపరులూ.

అంతే కాదు, వాళ్ళలో చాలామంది పురుషులు కుటుంబాన్ని మోయటం లేదు. కొందరు భర్తలయితే కేవలం తమ భార్యల సంపాదనమీదే బ్రతుకుతున్నారు. చాలామంది స్త్రీలకు తమ కుటుంబ బాధ్యతలపట్ల ఏమాత్రం లక్ష్యం లేదు. చక్కగా వంటచెయ్యడం కాని, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం కాని తెలియదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఆలనా పాలనా బొత్తిగా పట్టించుకోటంలేదు. మరికొందరు వాళ్ళని హింసిస్తున్నారు కూడానని కూడా అ-గారు గ్రహించాడు. చాలామంది ఏ పనితనమూ లేనివారు. లేమి వల్ల, అనారోగ్యం వల్ల అకాలంగా చనిపోయేవారే ఎక్కువ.

ఈ సమాచారమంతా సేకరించిన తర్వాత, అ-గారు వాళ్ళ పరిస్థితిని ఎలాగైనా మెరుగుపరచడానికి శాయశక్తులా కృషిచెయ్యాలనుకున్నాడు. తనకి ఐదువందలమంది ప్రజల బాధ్యత వహించడానికి అనుమతినివ్వమని, దానికి ప్రతిఫలంగా తాను ప్రభుత్వ కోశాగారానికి ఫలానా మొత్తంలో సొమ్ము ముట్టజెబుతానని, రాజుగారికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ప్రజల బాగోగులు వాళ్ళ కంటే ఇతనే బాగా చూడగలడన్న నమ్మకంతో మహారాజు అతని విన్నపానికి ఆమోదముద్ర వేశాడు.

ఆమోదం లభించడమే ఆలస్యం, కొంతమంది సైనికుల సహకారంతో అ-గారు ఐదువందలమందిని తమ గుడిసెలనుండి, పాకలనుండీ లేవదీసుకుని తన స్వంత భూములకు తీసుకుపోయాడు. వాళ్ళని కొన్ని వర్గాలుగా విభజించి, ఒక్కొక్క వర్గానికీ అజమాయిషీ చెయ్యడానికి ఒక అధికారిని నియమించాడు. వాళ్ళకి ఒక ప్రవర్తనా నియమావళిని కూడా తయారుచేశాడు. రోజుకి పది పన్నెండు గంటలు మాత్రమే పనిచెయ్యాలి. తక్కిన సమయం విశ్రాంతికి, వినోదానికీ. ప్రతివ్యక్తికీ తగినంత పౌష్టికాహారం లభిస్తుంది. అందరికీ సౌకర్యవంతమైన ఇళ్ళు, కొలతలకు తగిన బట్టలూ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు, ఏ నెలకి ఆ నెల, వాళ్ళు ఏయే పనులు చెయ్యాలో ముందుగా ప్రణాళిక రాసి ఇచ్చాడు. దానివల్ల వాళ్ళకి ప్రతిరోజూ ప్రతి గంటా ఏ పని చెయ్యాలో ముందుగానే తెలిసింది. ఈ నిబంధనలన్నీ వాళ్ళ మంచి కోసం, ఒకరి పనిలో మరొకరు తలదూర్చకుండా ఉండడం కోసం, తమ పని తాము చేసుకుంటూ అవకాశం ఉన్నంతమేరా ఆనందంగా గడపడం కోసం, అని ఏర్పాటు చేశాడు. వాళ్ళు కాలం వృథా చెయ్యడం గాని, ఉత్ప్రేరకాలు వాడడంగాని, మాటల్లో అసభ్యపదజాలం ఉపయోగించడం గాని చెయ్యకూడదు. తమ అధికారుల్ని, ముఖ్యంగా అ-గారిని, గౌరవించాలని, వారికి అణకువగా ఉండాలని, అన్నిటికంటే ముఖ్యంగా, భగవంతుడు వాళ్ళని కల్పించిన ఈ మెరుగైన స్థితికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ ఫిర్యాదులూ లేకుండా ఎవరిపని వాళ్ళు చేసుకుపోవాలనీ బోధించాడు.    

తన అజమాయిషీ క్రిందకి రావడానికి ముందటి సంవత్సరం, ఈ ఐదువందలమంది ఎవరెవరు ఎంత సంపాదించారో, ప్రపంచ ఆదాయంలో అదెన్నో వంతో, అ-గారు సవివరంగా గణాంకాలు సేకరించాడు. వాళ్ళకుటుంబాలలో చనిపోయినవారెందరో, రోగాలబారిన పడ్డవారెందరో, నిరాశ్రయులెందరో, ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారో, నేరాలకీ, చెడువర్తనకీ శిక్షకు గురైనవారెందరో, ఎవరెన్ని రోజులు పనిలేక ఖాళీగా కూర్చున్నారో, తాగుడికి, తిరుగుళ్ళకూ ఎంత ఖర్చుచేశారో ఆ వివరాలు కూడా అందులో ఉన్నాయి.  
 
వీళ్ళని తనక్రింద పనివారిగా చేర్చుకున్న మొదటి సంవత్సరం కూడా అ-గారు అవే విషయాల మీద గణాంకాలు నమోదు చేశాడు. వాళ్ళు ముందటి సంవత్సరం కంటే చాలా ఎక్కువ సంపాదించారు. నేరాలు లేవు. పేదరికం లేదు. తాగుడు లేదు. ఇతర వ్యసనాలు లేవు. జీవితం ఒక క్రమ పద్ధతిలో సాగుతుండడంతో అనారోగ్యం బారినపడటం తగ్గింది. శిక్ష అనుభవించడం తప్పనిసరి అని తెలియడంతో, ప్రవర్తన బాగులేదనిపించుకున్న వారు కూడా బహుకొద్దిమంది. వాళ్ళమీద నిత్యం అధికారుల పర్యవేక్షణ ఉండటంతో, ఎక్కువశాతం శ్రమపడుతూ, సన్మార్గంలోనే ప్రయాణించేరు.
   
అ-గారు ఆ వివరాలు చదివి చాలా ఆనందించడమే గాక, వాటిని ఎంతో గర్వంగా తన మిత్రులకు చూపించాడు. మునుపటికంటే, ఈ ఐదువందలమంది మెరుగైన జీవితం గడుపుతున్నారన్నది గణాంకాలతో ఋజువు చెయ్యడమే గాక, తన ఆదాయం కూడా ఎన్నో రెట్లు పెరిగిందని చూపించాడు. వాళ్ళ సంక్షేమానికి తను సహకరించ గలిగినందుకే గాక, తన సంపద అభివృద్ధి చేసుకునేందుకు మంచి పునాది వేసుకోగలిగినందుకు కూడా తనని తాను మనసులోనే అభినందించుకున్నాడు. ఈ అంకెలూ, వాస్తవాలద్వారా తననొక మానవప్రేమిగానే కాకుండా ఒక తాత్త్వికుడిగా కూడా అభివర్ణించుకున్నాడు. అతని అడుగుజాడలలో నడవాలనుకున్న వాళ్ళందరూ దానికి ఆమోదం తెలిపారు.    
 
అయితే కొందరు ఇతని ప్రణాళిక అంతా అన్యాయమని, అనైతికమైనదనీ నిరసించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించనంతవరకూ ఆ ఐదువందలమందికి తమ జీవితాన్ని తమకిష్టమైన రీతిలో గడిపే మౌలికమైన హక్కు ఉందని; కనీసావసరాలు కూడా తీర్చుకోలేని పేదరికంలో వాళ్ళు అలాగే బ్రతకదలుచుకుంటే అది వారి ఇష్టమనీ అన్నారు. ఈ అభ్యంతరాలన్నిటినీ కొట్టిపారెయ్యడం అ-గారికి పెద్ద కష్టం కాలేదు. వాళ్ళ సంక్షేమమొక్కటే ‘మంచి’ అని, ప్రతి మనిషికీ తన సంక్షేమం తాను చూసుకోవడమే గాక తన శక్తి మేరకు ఇతరుల సంక్షేమం చూడవలసిన కనీస నైతిక బాధ్యత ఉందని; ఈ ఐదువందలమంది తమ సంక్షేమం తాము చూసుకోలేనప్పుడు, వాళ్ళ కంటే ఎక్కువ తెలివితేటలు, ఆర్థిక వనరులూ ఉన్న మరొక వ్యక్తికి వీళ్ళ బాధ్యత తీసుకోవడం నైతిక కర్తవ్యమని; ఈ ఐదువందలమందిది బాధ్యత తీసుకుని, వాళ్ళకు ఉన్నంతలో మంచి తిండి, బట్టలూ ఇచ్చి వాళ్ళు ఏ నేరాలకూ పాల్పడకుండా చూడగలిగినవాడే వాళ్ళ నిజమైన హితైషి అనీ వాదించాడు.

‘వీళ్ళందరినీ పరీక్షించడం జరిగింది. ఎవరి యోగక్షేమం వాళ్ళు చూసుకోలేని అసమర్థులని తేలింది. తగినన్ని తెలివితేటలు గాని, శ్రమపడే తత్త్వం గాని, నిజాయితీ గాని, పైకెదగాలన్న కోరిక గానీ లేవు. అందువల్ల ఈ జీవనపోరాటంలో వాళ్ళు వెనకబడిపోయారు. మురికికూపాల్లో బతుకున్నారు, చనిపోతున్నారు. వీళ్ళల్లో చాలామంది జీవితాలు అలా చీకటి కొంపల్లోనో, ఉరికంబాలమీదనో ముగిసిపోవలసినవే. అంతేకాదు, వీళ్ళు సంపన్నసమాజానికి పీడగా, సమాజశాంతికి భంగంగా పరిణమిస్తారు. వాళ్ళవల్ల పన్నులభారం పెరుగుతుంది. నేరస్థుల జాబితా పెరుగుతుంది. దానివల్ల మరిన్ని జైళ్ళు నిర్మించవలసి వస్తుంది. న్యాయ-రక్షక వ్యవస్థపై మరింత ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. వాళ్ళని నా అజమాయిషీలో ఉంచుకోవడం ద్వారా ఇలాంటి స్థితి నుండి వాళ్ళని రక్షించి, వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచి, సమాజ శ్రేయస్సుకి నావంతు సహకరించడంతో పాటు, నా సంపదను కూడా పెంచుకోగలిగాను,’ అని అన్నాడు.

తనకి వాళ్ళకంటే ఎక్కువ తెలివితేటలు, వాళ్ళని శాసించగల నేర్పు, ఇతరులకు ఉపకరించగల స్వభావాన్నీ ప్రసాదించి, ఈ శక్తిసామర్థ్యాలన్నిటినీ ప్రజాసంక్షేమానికి వినియోగించడం తన విద్యుక్తధర్మమని, అది దైవాజ్ఞ అనీ అతని నమ్మకం. అ-గారు తరచూ తనని తాను భగవంతుని సేవకునిగా ప్రకటించుకునేవాడు. తనకు వివేకం, విచక్షణ, నైతికశీలతలను భగవంతుడు ప్రసాదించినందుకు పదే పదే కృతజ్ఞతలు ప్రకటిస్తూ, కంటికెదురుగా ఉన్న వాస్తవాలే అందుకు ఉదాహరణ అని అనేవాడు.      

కొందరు బానిసలు, అ-గారికి అతని జీవితం అతను నమ్మినట్లు జీవించడం పట్ల ఉన్న హక్కే తమ జీవితాల పట్ల తమకూ ఉందని నోరు విప్పారు. కాని, ఒక చిన్నపాటి క్రమశిక్షణచర్యతో అ-గారు వారు తప్పని నిరూపించాడు. కొందరు తాము చాలా ఆనందంగా ఉన్నామని, ఏ బాధ్యతలూ లేకపోవడం ఎంతో హాయిగా ఉందనీ అన్నారు. అ-గారు మాత్రం, భగవంతుడు మనుషులందరికీ సమానమైన స్థాయిలో శక్తియుక్తులు అనుగ్రహించడని, బలహీనుల సంరక్షణ బలవంతుల కర్తవ్యమని, అదే భగవంతుని సృష్టి నియమమని, ఆ నియమాన్ని పాటించడానికి తనవంతు కృషిచేస్తాననీ చెప్పాడు.  

అ-గారు తన పరోపకారంలో చాలా సఫలుడైనాడు. కొద్దికాలంలోనే కొన్ని వేలమంది పురుషులు, స్త్రీలు, పిల్లలూ అతని క్రింద పనిచెయ్యడం మొదలుపెట్టారు. అతను అంతులేని సంపద కూడబెట్టుకున్నాడు. భగవంతుడు ఆ సంపద అంతటికీ తనను ధర్మకర్తగా నియమించాడని భావించాడు. అందుకని ఆ సంపదతో ఎన్నో చర్చిలను నిర్మించాడు. అప్పుడప్పుడు నాగరికత నలుదిక్కులా వర్ధిల్లడానికి కొన్ని సంఘాలకి విరాళాలిచ్చేవాడు. అతని చేతిక్రింద పనిచేసినవాళ్ళు తప్ప, ఎందరో అతని మరణానికి బాధపడేలా హాయిగా జీవించి తనువు చాలించాడు. అతని శవయాత్ర ఎంత ఘనంగా జరిగిందంటే స్వయంగా ఆ దేశపు మహరాజు శవపేటికని తన భుజాలమీద మోశాడు. అతని సమాధిమీద ఇలా రాయబడింది:

ఇతను పేదలపాలిటి దైవం.


ధనవంతుడినయాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను
లోకంలో యాచనను మించిన పాపం మరొకటి లేదు.

ఇ-గారికి బానిసత్వంలో నమ్మకం లేదు. అసలామాట అంటేనే అసహ్యంతో అతని రక్తం ఉడుకెత్తిపోతుంది. సర్వమానవ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అతని ఆదర్శాలు. అ-గారి ఆలోచనలన్నిటినీ అతను ఏవగించుకుంటాడు. అతని పరోపకారవ్యాపారంలో ఉన్న అమానవీయత, అన్యాయాలను నిరసిస్తూ ఎన్నో సాయంత్రాలు గడిపాడు. అ-గారికింద బానిసలుగా బ్రతికిన వారికి అతనికంటే ఎక్కువ తెలివితేటలున్నాయని, ఒకవేళ వాళ్ళకి అంతటి తెలివితేటలున్నా లేకపోయినా, వాళ్ళకి స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉందనీ ప్రతిపాదించాడు. అ-గారి సిద్ధాంతమంతా ఉత్తి బూటకం. అతను ఎవరినీ వాళ్ళ స్థితిగతులు మెరుగుపరిచే ఉద్దేశ్యంతో కొనలేదు. తన స్వార్థం కోసం చేసిన వ్యాపారమే ఇదంతానని, బానిసలు స్వేచ్ఛగా ఉన్నప్పటికంటే తక్కువనేరాలు చేశారన్న వాదన, సాటి మనుషులపై అ-గారు తాను చేస్తున్న నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికేననీ గట్టిగానే వాదించాడు.  

ఇ-గారు ఒక పారిశ్రామికవేత్త. అతను ఐదారువేలమంది కార్మికులని పనికి నియోగించుకున్నాడు. వీరికి తన క్రింద పనిచెయ్యవలసిన నిర్బంధమేమీ లేదని, తన షరతులను తిరస్కరించడానికి గాని, అంగీకరించి పనిచెయ్యడానికి గాని, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉందనీ అనేవాడు. తాను దొంగతనాలు, దోపిడీలూ చెయ్యడానికైనా సిద్ధపడతాడు గాని, సాటిమనిషిని తనకోసం పనిచెయ్యడానికి బలవంతం చెయ్యనని చెప్పేవాడు. ‘నా క్రింద పనిచేసే ప్రతి కార్మికుడికీ నాకున్నంత స్వేచ్ఛ ఉంది’ అని తరచు అనేవాడు.

ఇ-గారికి స్వేచ్ఛావాణిజ్యం పట్ల నమ్మకం ఎక్కువ. అతని అభిప్రాయంలో వ్యాపారవ్యవస్థ దానినదే నియంత్రించుకుంటుంది. దానిపైన ఎటువంటి నిబంధనలైనా విధించడం పెద్ద నేరం. తక్కువధరకి వస్తువు ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కోవడం వినిమయదారుడి హక్కు. అలాగే, ఎక్కువధర ఎక్కడ పలికితే అక్కడ అమ్ముకోవడం వ్యాపారస్థుడి హక్కు. శ్రామికుడు తన శ్రమని ఎక్కువ పారితోషికానికి అమ్ముకోవడం, శ్రమని కొనుగోలుచేసే వ్యక్తి ఎక్కడ శ్రమ చౌకగా దొరుకుతుందో అక్కడ కొనుక్కోవడం, వారి వారి హక్కులు. అతను వ్యక్తుల్ని బానిసలుగా చెయ్యటంలేదు, వాళ్ళ శ్రమని మాత్రమే కొనుగోలుచేస్తున్నాడు. పనివారి నిస్సహాయస్థితిని తనకు లాభసాటిగా మలుచుకుంటున్నాడని అతని మీద కొందరు ఆరోపణలు చేశారు. అయితే అతను, వాళ్ళ నిస్సహాయత తాను సృష్టించినది కాదని, కనుక తన బాధ్యత లేదని అన్నాడు. వాళ్ళు తనవల్ల బీదవాళ్ళు కాలేదని, వాళ్ళ పేదరికాన్ని గుర్తించి వాళ్ళకి పని కల్పించడంతోపాటు ఆ పని చెయ్యడానికి ఇతరులకిచ్చే జీతాన్నే వాళ్ళకీ ఇస్తున్నాననీ అతను ఎదురు వాదించాడు. అందరికీ సమానన్యాయం చేస్తున్నానని అతని నిశ్చితాభిప్రాయం. ఒకే పనికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పారితోషికం ఇవ్వనని, రాజకీయ, మతవిశ్వాసాల ఆధారంగా వ్యక్తులకు పని నిరాకరించనని, సమాన ప్రతిభానైపుణ్యాలు గలిగిన కార్మికులందరికీ సమాన వేతనం ఇస్తున్నానని నొక్కిచెప్పేవాడు.

తను ఉత్పత్తి చేస్తున్న వస్తువు విలువే వాళ్ళ వేతనాన్ని నిర్ణయిస్తుంది. ఆ వస్తువు ధర నిర్ణయించడంలో తన పాత్ర ఉండదు. పర్యవసానంగా, కార్మికుల వేతనాలకి తన బాధ్యత లేదు.–ఇదీ అతని వాదన. పైగా, వారు చేసిన వస్తువుని అమ్మవలసిన బాధ్యత తన నెత్తిన వేసుకుని, అంగీకరించిన వేతనాన్ని క్రమం తప్పకుండా చెప్పిన సమయానికే చెల్లిస్తున్నానని, ఎవరికైనా తనిచ్చే వేతనం సంతృప్తికరంగా లేదనిపించినపుడు, ఆ పనిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వాళ్ళకి పూర్తి స్వాతంత్య్రం ఉందనీ ఇ-గారు అనేవాడు. ‘పేదవాళ్ళు ఈ నేలపై ఎప్పుడూ ఉంటారు’ అన్న బైబుల్ వాక్యాన్ని అతనూ తరచూ తోటివారికి చెప్పేవాడు. కొందరు పేదలుగా పుట్టడం మరి కొందరిని దయామయులుగా చేయడానికే. ప్రపంచంలో బాధను, పేదరికాన్ని రూపుమాపి చూడండి, కరుణ, దాతృత్వం మచ్చుకైనా లేకుండా మాయమౌతాయి, అని వాదించేవాడు.

ఇ-గారు చాలా సంపద కూడబెట్టాడు. చాలామంది కార్మికులు తమకిచ్చే వేతనాలతో కనీసావసరాలు కూడా తీరటం లేదని ఆరోపించారు. ఎక్కువ సంతానం ఉన్నవారికి అతనిచ్చే వేతనంతో ఇంటిల్లిపాదికీ తినడానికి సరిపడినంత దొరికేది కాదు. కొందరు ఇరుకు ఇరుకు గదుల్లో నివసించేవారు. చాలామంది పిల్లలు రోగాలతో చనిపోయేవారు. ఇ-గారు మాత్రం, వాళ్ళని తను బలవంతంగా ఉంచడం లేదు కాబట్టి వీళ్ళందరికీ తమ పని విడిచి వెళ్ళే హక్కు ఉందని, పిల్లల ఆరోగ్యం బాగులేకపోతే ఆ బాధ్యత తనది కాదని, భగవంతుని ఇచ్ఛానుసారం పిల్లలో, తల్లిదండ్రులో చనిపోవడం ప్రకృతి సహజమని, ఆ విషయంలో తను నిమిత్తమాత్రుడనీ వక్కాణించేవాడు.

కార్మికులలో చాలామంది దుబారా మనుషులు, వాళ్ళకి అవసరంలేని వస్తువులను కొంటుంటారు. అంత్యక్రియలకు దాచుకోవలసిన సొమ్ముని దురలవాట్లపై దుబారా చేస్తారు. చావు గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడూ క్షణికానందం కోసమే వెంపర్లాడతారు. తినడానికి తిండి లేనప్పుడు కూడా పిల్లలకి బొమ్మలు కొంటారు – ఇవీ ఇతని ఆరోపణలు. వాళ్ళ దుబారాతనమే తప్ప, తనిచ్చే జీతంతో వాళ్ళ కనీస అవసరాలు తీరకపోవడానికి తాను జవాబుదారీ కాదని, మిగతా పారిశ్రామికవేత్తలిచ్చే జీతాలనే, మిగతా పనివారు నోరెత్తకుండా తీసుకుంటున్న జీతాన్నే వీరికీ ఇస్తున్నాననేవాడు.  

అన్ని వాదనలకీ ముగింపుగా, అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదన్నట్టు చివరకి ఇలా చెప్పేవాడు: ‘ఈ సరఫరా-గిరాకీ అన్న నియమం భగవంతుడు ఏర్పాటు చేసినది. మనం ఊహించగలిగిన అన్ని సందర్భాల్లోనూ ఈ నియమం పని చేస్తుంది. ఈ నియమమే శ్రమకి తగిన ధరని కూడా నిర్ణయిస్తుంది. దీనికి తిరుగులేదు. ఈ ఆచరణావిధానం నచ్చనివాళ్ళు తమ స్వంత ప్రపంచాలను నిర్మించుకోవచ్చు.’

ఈ సరఫరా-గిరాకీ నియమం గురించే అంతకుముందు తను ఏమన్నాడో మరిచిపోయి, ఆ నియమం పట్ల తన నమ్మకం సడలిపోతోందని ఇ-గారు తరచూ అనేవాడని స్నేహితులు చెప్పారు. ముఖ్యంగా, తన వస్తూత్పత్తి అధికమై, ఆ నియమం తనకి అనుకూలంగా లేనప్పుడు.

ఇ-గారు అ-గారికంటే ఎన్నోరెట్లు ఎక్కువ సంపద కూడబెట్టాడు. ఎందుకంటే, అతని కార్మికులు ముసలివాళ్ళయిన తర్వాత వాళ్ళ సంగతి చూడవలసిన అవసరం అతనికి తప్పింది; వాళ్ళు అనారోగ్యం పాలైనపుడు వైద్యం ఖర్చు భరించవలసిన అవసరం గాని, వాళ్ళ పిల్లలు మృతి చెందినపుడు శవపేటికలు కొనవలసిన అవసరం గాని రాలేదు. ఈ విధంగా, అ-గారు ఈ విషయాలమీద చేసిన ఖర్చునుండి చాలవరకు ఇ-గారు తప్పించుకున్నాడు. కార్మికులు మరీ ముసలివాళ్ళయిపోయినపుడు వాళ్ళని అనాథాశ్రమాలకు తరలించేవాడు. వాళ్ళు అనారోగ్యం పాలైనపుడు వాళ్ళకి ధార్మిక సంస్థలు సహాయం చేసేవి; మరణించినపుడు దయతో అంత్యక్రియలు కూడా జరిపేవి.  

కొద్ది సంవత్సరాలలోనే ఇ-గారు కోట్లకి పడగలెత్తాడు. తనని దేవుని సేవకులలో ఒకడిగా చెప్పుకునేవాడు. పెద్ద పెద్ద ప్రణాళికలను ఆచరణలో పెట్టగలిగేట్టు తన అభిరుచులకు తగిన తెలివితేటలను భగవంతుడు తనకు ప్రసాదించేడని, వేలమందికి జీవనోపాధి కల్పించడానికే తనని సృష్టించాడనీ అనేవాడు. తన లాభాలను తగ్గించుకోలేని నిస్సహాయతతో కార్మికులకు ఏమీ చెయ్యలేకపోతున్నందుకు చాలాసార్లు విచారించేవాడు. ఇంకోరకంగా చెప్పాలంటే, అతని మరణానంతరం మానవాళి శ్రేయస్సుకై తను కూడబెడుతున్న నిధికి తన విరాళం తగ్గకుండా, వాళ్ళకి ప్రస్తుతం ఏమీ చెయ్యలేకపోతున్నందుకు విచారించేవాడు. ముందుతరాల శ్రేయస్సుకోసం పరితపిస్తూ, తనతోటి తరంతోటి దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించాడు. తను ఆదా చెయ్యగలిగిన ప్రతి పైసా పొదుపుచెయ్యక తప్పదని, అలా చెయ్యకపోతే ముందుతరాల మానవాళికి తనవంతు సాయం చెయ్యలేననీ అతని భయం. అలా చేస్తేగాని తన కీర్తి శాశ్వతంగా నిలిచిపోదని అతని భావన. ప్రత్యేకించి తాను చనిపోయాక, తన పేరు మీద అనాథాశ్రమాలు, గ్రంథాలయాలు, కళాశాలలూ నెలకొల్పబడాలి. బీదదేశాలలోని ప్రజలను నాగరీకులను చేసి, దైవానుగ్రహం కలిగిన ఏ కొద్దిమంది చేతులలోనో తమ కష్టాన్ని ధారపోసేందుకు వారిని ఉత్తేజితులను చేయాలి. తనలాగే, పెద్ద పెద్ద ప్రణాళికలను ఆచరణలో పెట్టగలిగేందుకు, వేలమందికి జీవనోపాధి కల్పించడానికి, తగిన తెలివితేటలను భగవంతుడు ప్రసాదించిన ఆ కొద్దిమందీ తనలాగా సంపదను ప్రపంచమంతా పంచడానికి, ఈ రకమైన శిక్షణ అవసరం.

ఇతర దేశాలనుండి తన వ్యాపారానికి ఏ పోటీ లేకుండా రక్షణకి తగిన చట్టాలు తీసుకురావడానికి ఇ-గారు కొన్ని కోట్లు ఖర్చుపెట్టాడు. ఇతర దేశాలలోని ఉత్పత్తిదారులు రంగంలోకి దిగినపుడు సరఫరా-గిరాకీ సూత్రం పనిచెయ్యదని అతని నమ్మకం.  

అ-గారి లాగానే ఇ-గారు కూడా మంచి విచక్షణాదక్షుడు. ప్రశాంతంగా ఆలోచించగలడు. ఆశించిన లక్ష్యం నుండి అతని దృష్టి అంత త్వరగా పక్కకి మరలేది కాదు. సమకాలీన భావనా సరళికి అనుగుణంగానే తన ఆలోచనలున్నాయని అతని నమ్మకం. అతని గురించి పేర్కొన్న మాటలనుబట్టి పేదరికంలో పుట్టి, సంపన్నుడిగా ఎదిగాడు; పూరిగుడిసెలో పుట్టి భవంతిలో మరణించాడు. అతను గొప్ప కళాపోషకుడు; తన గది గోడలని మేటి కళాకారుల వర్ణచిత్రాలతో నింపాడు. అందరూ అతన్ని అనుకరించగలరని, అనుకరించాలనీ శాసించాడు. అలా చెయ్యని వారిపట్ల, చెయ్యడానికి నిరాకరించిన వారిపట్ల అతనికి సానుభూతి ఉండేది కాదు. వాళ్ళ దారిద్య్రాన్నీ దౌర్భాగ్యాన్నీ సంక్షిప్తంగా ఇలా నిర్వచించాడు: ‘ఎవరి కర్మకు వారే బాధ్యులు.’ ఎన్నడూ ఒక్క పైసా కూడా నష్టపోకుండా జీవించేడు. అతని అంతిమయాత్ర కూడా అద్భుతంగా సాగింది. చర్చ్ ఫాదర్లందరూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తడానికి ఒకరితో ఒకరు పోటీపడ్డారు. అతని సమాధిమీద వెలసిన పాలరాతి స్మృతిచిహ్నంపై ఇలా రాయబడి ఉంది:

ఇతను పరులకోసమే జీవించాడు.


ప్రజలని నిలువునా దోచుకునే పెద్దమనుషులున్నారు.
విరాళాలతో దానాలతో తమ నేరం కప్పిపుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటారు.

ఉ-గారు అన్న మూడోవ్యక్తి ఉన్నాడు. అతనూ సమష్టిజీవన సిద్ధాంతంలో నిపుణుడు. అతనికి మూలధనం, శ్రమల విలువ క్షుణ్ణంగా తెలుసు. పనిని ఎంత మేరకు యంత్రాల సహాయంతో చెయ్యగలమో అదీ తెలుసు. వనరులని పొదుపుగా వాడుకోవడం తెలుసు. ప్రతి పనినీ సులభంగా, తక్కువ సమయంలో చెయ్యగల విధానమూ తెలుసు. అతనూ పారిశ్రామికవేత్తే, అతని క్రిందా కొన్ని వేలమంది పురుషులు, స్త్రీలు, పిల్లలూ పనిచేస్తున్నారు. దూరదర్శి, దయాళువు అన్నమాటలకి ఉదాహరణ అతడు. అతను పట్టుదలకి పోడు, నిర్ణయాలు తీసుకోవడంలో కఠినుడు, మొండివాడూ కాదు. అహంకారం బొత్తిగా లేదు. భగవంతుడో లేదా ఏ అలౌకిక శక్తో సంపదని అందరికీ సమానంగా పంచడానికి తనను ఎంపిక చేసిందన్న ఆలోచన అతనికి ఎప్పుడూ కలగలేదు. శ్రమకి సరిసమానమైన విలువ ఇవ్వకుండా, ఇతరుల శ్రమని తీసుకునే హక్కు తనకు లేదని అతనికి అనిపిస్తుంది. సాటి మనుషులకంటే తనకి ఎక్కువ తెలివితేటలుంటే, వాటిని తన శ్రేయస్సుకేగాక, ఇతరుల శ్రేయస్సుకి కూడా వినియోగించాలన్నది అతని అభిప్రాయం. తనకంటే తక్కువ తెలివున్నవారిని తన లాభానికి వినియోగించుకోకూడదన్నది అతని నీతి. బలవంతుడికి బలహీనుణ్ణి దోచుకోడానికి ఎలా హక్కు లేదో, అలాగే మేధావులకి కూడా తమకంటే తెలివితక్కువవాళ్ళని దోచుకునే హక్కులేదని అనేవాడు.

అంతేకాదు, ఒకరు మరొకరి బలహీన పరిస్థితులని తమకు అనుకూలంగా మలుచుకోకూడదని కూడా చెబుతుంటాడు. నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఆదుకున్నందుకు అతనినుంచి డబ్బు పిండుకోకూడదు. అతనిస్థానంలో తనుంటే ఎలా ఆలోచించేవాడో అలా ఆలోచించాలని చెప్పేవాడు. నిజానికి ఇతరుల కష్టాలగురించి ఏ మాత్రం కనికరం ఉన్నా ఒక వస్తువు ధర తగ్గించాలి తప్ప పెంచకూడదన్నది అతని నీతి. నిజాయితీపరులెప్పుడూ సాటి వ్యక్తులని తమకనుకూలంగా వాడుకోరాదని అతని అభిప్రాయం. జీవితావసరాల విషయంలో సరఫరా-గిరాకీ నియమం అనువర్తింపజెయ్యలేకపోవడం అతని బలహీనత. అతను ఈ సరఫరా-గిరాకీ విషయంలో వేరే నీతి సూత్రాన్ని అనుసరించేవాడు. కార్మికుడికి తగిన ఆహారం అందించాలని, అది ప్రకృతి నిర్దేశమని, తలదాచుకునేందుకు గూడు, కట్టుకునేందుకు బట్టలు అవసరమని అతనికి తెలుసు.

ఉ-గారు సరఫరా-గిరాకీ నియమం విషయంలో ఇలా ఒక నిర్ణయానికొచ్చాడు: మనుషులకి కనీస అవసరాలు అందని పక్షంలో వాళ్ళు ఎంత తక్కువ వేతనానికైనా పనిచెయ్యడానికి సిద్ధపడతారు. కొన్ని సందర్భాల్లో, సాధారణ పరిస్థితుల్లో ఇచ్చే వేతనానికి సగానికైనా పనిచేస్తారు, ఎందుకంటే భార్యాబిడ్డలని బ్రతికించుకునేందుకు ఏదో ఒకటి చెయ్యాలి గనుక. అందువల్ల, గత్యంతరంలేని ఇతరుల పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకునే హక్కు లేదు. ముందుగా ఆ ‘పని విలువ’ కంటే, కార్మికునికి ఆ పని విలువ ఎంతో నిజాయితీతో నిర్ణయించి అతనికి అంత జీతమియ్యాలి.

తక్కిన పారిశ్రామికవేత్తలందరూ ఉ-గారికి మతి భ్రమించిందని తలపోస్తే, కార్మికులలో ఎక్కువ శాతం అతనికి వ్యాపారంలో ఏ ప్రత్యేక మెళకువలు లేకున్నా, మంచితనం నిండుగా ఉన్న వ్యక్తిగా భావించేవారు. కానీ ఉ-గారు మాత్రం తన గౌరవం తను నిలబెట్టుకోగలిగినంత కాలం తన గురించి ఇతరులేమనుకుంటున్నారన్నదానికి విలువ ఇచ్చేవాడు కాదు.
     
మొదటి సంవత్సరాంతానికి మంచి లాభాలు ఆర్జించినట్టు లెక్కలు తేలి, ఆ లాభాన్ని దాన్ని ఆర్జించడానికి కారకులైన వారందరితో పంచుకున్నాడు. కొందరు స్నేహితులు అతని ఊరిలో ఏదైనా కళాశాలవంటి సామాజిక సంస్థ ఏదైనా నెలకొల్పితే బాగుంటుందన్న సలహా ఇచ్చారు. కానీ, అతని ఆలోచన దాతృత్వంకంటే, స్వాతిశయం కంటే, తన కీర్తి శాశ్వతం చేసుకోవడం కంటే ముందు, సామాజిక న్యాయం ఆచరణలో పెట్టాలని. అతని దృష్టిలో, ప్రపంచమంతటిలోనూ సంపదకి హక్కుదారులెవరైనా ఉంటే, వాళ్ళు తమ కష్టంద్వారా రాత్రింబవళ్ళు పనిచేసి సంపదని సృష్టించినవారేనని. ఆ సంపద వాళ్ళు సృష్టించారని, అది వారి స్వంతం కనుక అది వాళ్ళు తీసుకుని, తమకు ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేసే హక్కు కలిగి ఉన్నారని పదే పదే చెప్పేవాడు. చాలామంది ఉ-గారిని హెచ్చరించారు అతని చర్యలు తక్కిన కర్మాగారాలలో కార్మికులను అసంతృప్తికి గురిచేస్తాయని. అందువల్ల తక్కిన పారిశ్రామికవేత్తలందరూ అతనికి శత్రువులుగా మారుతారు. అతనికంటే ముందు విజ్ఞానం, నాగరికతల వ్యాప్తికి ఎంతో కృషిచేసిన మహామహులనందరినీ అతని చర్యలు అపకీర్తిపాలు చేస్తాయని చెప్పారు. అనుకున్నట్టుగానే, వ్యాపారనిర్వహణలో పేరుగడించిన మేధావి వర్గంలో అతనికి చాలా చెడ్డపేరు వచ్చింది. అయినా, పనిచేసినవారే వాళ్ళు సృష్టించిన లాభాలకి భాగస్వామ్యులనే తన మార్గాన్ని విడిచిపెట్టలేదు. అతని దృష్టిలో, మనుషులకంటే ధనం అమూల్యమైనది కాదు. సరఫరా-గిరాకీ నియమం మనకు అర్థమైన రీతిలో, మనుషుల శ్రమకి వర్తించదన్నది అతని విశ్వాసం.

‘నాకోసం పనిచేసేవారు మోసగించబడితే నేను సుఖంగా ఉండలేను. వాళ్ళకి న్యాయంగా చెందవలసినది నేను లాక్కుంటున్నానన్న భావన కలిగినపుడు నాకు మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి న్యాయం చెయ్యగలిగానన్న భావన నా జీవితావసరాల్లో ఒకటి. నాకు కళాశాలలు నెలకొల్పాలన్న కోరిక లేదు. ఏ ప్రజాహిత సంస్థలు నెలకొల్పాలన్న ఆశయమూ లేదు. నాకున్న కోరికల్లా, నాకోసం పనిచేసేవారంతా, ఎవరికి వారు వాళ్ళకో గూడు ఏర్పాటు చేసుకోగలగాలి. వాళ్ళు చదవాలనుకుంటున్న పుస్తకాలు కొనుక్కోగలగాలి. నాకు ఆసుపత్రి నెలకొల్పాలన్న తలపు లేదు. నా పనివారికి వాళ్ళకి నమ్మకమున్న వైద్యులనుండి సేవలు అందుకోగల అవకాశం కల్పించాలి,” అని ఉ-గారు అనేవాడు.

‘వాళ్ళకి చెందవలసిన డబ్బు తీసుకుని వేరెవరికో వినియోగించడం, లేదా నా పేరు ప్రఖ్యాతులకి వాడుకోవడం నాకిష్టంలేదు. వాళ్ళు సంపాదించినది వాళ్ళకి అందించడమే నా కర్తవ్యం. వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చిన తర్వాత అది వాళ్ళు ఎలా ఖర్చు పెడితే బాగుంటుందో నేను సలహా ఇస్తాను. కానీ, దాన్ని వాళ్ళు ఎలా ఖర్చుపెడతారన్నది పూర్తిగా వాళ్ళ ఇష్టం. అణచివేత ద్వారా మీరు గొప్ప వ్యక్తుల్ని సృష్టించలేరు. బానిసత్వంలోంచి మేధావులు పుట్టుకురారు. ప్రతి మనిషీ తను స్వయంగా తప్పులు చేసి, వాటి నుండి నేర్చుకుని తనదైన అనుభవం సంపాదించాలి. దానివల్ల ప్రపంచం బాగుపడితే, అది ఇచ్ఛాపూర్వకంగా జరగాలి తప్ప బలవంతం చెయ్యడం వల్ల కాకూడదు. ఎవరైతే ఆచరణలో న్యాయం చేస్తారో, వ్యవహారదక్షతలో ఉదాహరణగా నిలుస్తారో, వాళ్ళు విశ్వవ్యాప్తమైన నాగరికతని, నిజాయితీని, సమాజంలో తొందరగా తీసుకురాగలరు,” అనేవాడు.

ఉ-గారు తన సిద్ధాంతాన్ని నిజాయితీతో, విశ్వాసంతో, అవిశ్రాంతంగా జీవితంలో అమలుచేశాడు. అతను మరణించినపుడు అతని పక్కన అతని కార్మికులు, వారి భార్యాబిడ్డలూ ఉన్నారు. వారి కన్నీళ్ళు అతని సమాధి మీద కురిశాయి. అతని స్మృతిచిహ్నంగా కొన్ని పూలచెట్లు నాటి వాళ్ళు తమ ప్రేమని ప్రకటించుకున్నారు. అతని అవశేషాలపై నెలకొల్పిన నిరాడంబరమైన స్మృతిచిహ్నం మీద ఇలా రాసి ఉంది:    

ఇతను ఎవరి బ్రతుకు వారిని హాయిగా బ్రతకనిచ్చాడు.

(The three philanthropists – North American Review, March, 1888.)