జలతారు అంచు కల
దిగొస్తున్నట్టు,
నిశ్చలన ఛాయా చిత్రంలా
ప్రవహిస్తున్నట్టు-
ఎత్తుపల్లాల చరిత్ర జాడ్యాన్నంతా
ముంచేసి,
ఏక కావ్య గాన ధారగా-
రాజుగారి వేషం తడిపి
బికారిగాడి దేహం తడిపి
ఒక ముద్దగా
ఒక్క తీరైన పులకరింతగా-
చిందిన చెమట చుక్క
భూమ్మీది పసరిక
కలెగల్పిన కొత్త ఆకృతి ఇంద్రధనుసు-
తడిసిన గూడైనా
పొదివి తెచ్చుకున్న వెచ్చదనపు
గువ్వల ప్రేమైక కౌగిలి-
ముఖాల రంగులు కరిగి
సుస్పష్టమైన ఆకుపచ్చని ఆకైన
మనః దర్శనం-
ఆకాశం, నేలా, జీవజాలం
వాన మోహం లోనే-కాగితప్పడవల బాల్యం
బతుకుల్లోన
…వాన!ఏం వాన!!!

రచయిత దాసరాజు రామారావు గురించి:
దాసరాజు రామారావుగారికి శ్రీశ్రీ మహాప్రస్థానం, ఉన్నవ మాలపల్లి సాహిత్య అవసరం, అక్షరం విలువ నేర్పినయి. 45 ఏళ్ల సాహిత్య ప్రయాణంలో గోరుకొయ్యలు, పట్టుకుచ్చుల పువ్వు, విరమించని వాక్యం కవిత్వ సంపుటాలు వెలువడ్డాయి. ఉమ్మిడిశెట్టి, సమైక్య సాహితి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డులు అందుకున్నారు.
... పూర్తిగా »