అలలు ఉప్పెనవుతాయని తెలుసు కాని
అడుగులూ పెనుఉప్పెనవుతాయని తెలీదు
నడకలు దూరాల్ని చెరుగుతాయని తెలుసు కాని
కడుపులో పేళ్ళు మొలుచుకొచ్చి
ఆగమాగమైన ఊపిరులిలా తొవ్వల్ని
తొలుచుకుంటూ పోతాయని తెలీదు.
కోతకోసుకుపోయిన ఆకాశాలు
కొండచరియలై వేటాడుతుంటే
రెక్కల్లో గుచ్చుకున్న ముళ్ళనేరుకుంటూ
కాసేపు ఆరబెట్టుకున్న దుఃఖాలన్నిటినీ
తిరిగి దేహానికి తొడుక్కుని
చుట్టబెట్టుకొచ్చిన దారుల్ని అడుగులిలా
ఎదురువిప్పుకుంటూ పోతాయని తెలీదు
మోకులు తెగిపోయిన
ఆకళ్ళకు మళ్ళీ పొడిగింపులై
చిత్రజాలాల మీద ప్రాణం పట్టు జారకుండా
జరజరా దొర్లిపోయే పాదాలు
కణకణలాడే తారుగుండాల మీదింతగా
దూలాలాడుతాయనీ తెలీదు.
మత్తడి పోసినట్టు పొంగిపోటెత్తుతున్న పాదాలు
కడుపు కాళ్ళలోకి జారిపోయి పిగిలిపోతున్న పాదాలు
ఉన్నపళంగా పడ్డ గండిలో
నెత్తికెత్తుకున్న కాలాలు కొట్టుకుపోయాక
చీకటిలోయల్నెలా తెగేసుకోవాలో తెలియక
కుండుడుకని బతుకుల్ని సద్ది కట్టుకుని
ఎర్రటెండమావుల్నీదుకుంటూపోతున్న పాదాలు
నడితుఫానుల్ని చీల్చుకుంటూ పోవడానికి
రోడ్లను ముంచెత్తిన తెరచాపలు.
మన పొద్దుల్ని నిండుపొదుగుల్ని చేసి
మనిళ్ళనిండా వెన్నెల్ని పిండిముగ్గులెట్టి
మన గెలుపు ప్రకటనలకు హామీలై
సగం మనషులుగా మిగిలిపోయినోళ్ళ ఆ పాదాలు
వేర్లు తెంపుకొచ్చినా
అమ్మనేల కోసం… పాకుతున్న ఊడల దొంతరలు
రోడ్లు నెత్తికెత్తి మోస్తున్న కలశాలు.
చెడనరికేసిన చెఱకుతోటల్లాంటి పల్లెల్లో
మడుగులు కట్టిన గుడిసెల నిండా
తడిసితడిసి తడికలైన పేగుల్లోంచి
వీస్తున్న పచ్చిమట్టి వాసనలేవో
ఎంతగా పట్టిపట్టి లాగుతున్నాయో కాని
తొరతొరగా తరిగిపొమ్మని
అడుగడుక్కి దారికి దణ్ణం పెడుతున్న పాదాలకు
ఎటు నడిచెళ్ళినా ఎటు నడిచొచ్చినా
ఒరుసొరుసుకుని కురిసే ప్రశ్నల్లోంచి
ఒక్క నవ్వునొడిసి పట్టుకోవడం కోసం
ఆగకుండా ప్రవహించడం కొత్తేమీ కాదు.
ఆక్రమిత భూభాగాల్లా
బతుకు సుతారాలేవీ పరిచయం లేని అడుగులకు
యుద్ధం చేయడానికి ముందుకు మున్ముందుకు
దూకక తప్పని పాదాలకు-
కత్తుల కొనలకెదురేగి నిలువు నెత్తుటితో
వీరతిలకం దిద్దడం ఈనాటి ఇతిహాసమేం కాదు
అంతం కాని పట్టాల మీద
దుప్పట్లింకా పరచుకోక తప్పని ప్రాణాలకు-
మబ్బుకొసల్లో బందీలైన మెరుపులై
దారుల్నిండా స్వరాల్ని చల్లుకుంటూ పోయి
వెలిపడిపోవడం ఇవ్వాల్టి విన్యాసమేం కాదు.