1.చెఱువు దగ్గర గృహిణి
నీలాంబరపు ఛాయలలో
నీ కన్నుల వెలుగులలో
నిండు నీళ్ళకుండలున్నవి
అవి తొణకకూడనివి
తామర రేకుల వంపులలో
నీ మాటల చోటులలో
నలనల్లని నీడలున్నవి
అవి చెప్పకూడనివి
చేప పిల్లల మిసమిసలో
నీ చేతుల అంచులలో
రక్తకాంతి గుసగుసలున్నవి
అవి విప్పకూడనివి
నల్లని నీడలను
కలిచే నీ చేతులు
అమ్మాయీ,
ఉదయాస్తమానమూ
నిండు నీళ్ళకుండను
నడుముకు ఎత్తుతున్నవి
నిండు నీళ్ళకుండలు
చిప్పిల్లకూడనివి.
2. దుప్పటీ
ఉక్కపోస్తే
గబుక్కున
తాబేలులా
తల బయటకు
తీసేందుకు
చలివేస్తే
డిప్పలో
తాబేల్లాగానే
ముడుక్కుందుకు
కావద్దూ, దుప్పటీ?
మంచు పూల
చలికాలంలోను
మల్లెపూల
వేసంగిలోను
కొసలు పాదాల కిందకి
అంచులు ఒంటి కిందకి
చుట్టేసుకు పోకుండా
ఊరికే పరుచుకునే
దుప్పటీ
చలికాలం,
మంచు సరస్సు కింది
చేపలా మారేందుకు
గుహలో ఎలుగులా
మూడంకె వేసేందుకు
చీకటి నదిలో
సుషుప్తిలోకి జారేందుకు
ఎండాకాలం,
డేరాలో ఒంటెలా
దూరేందుకు
చిరు చల్లగాలిని
అడ్డేందుకు
నక్షత్రాల కింద
మాటు వేసేందుకు
ఏ కాలంలోనూ
పల్చనిదో
మందపాటిదో
కావద్దూ, ఓ దుప్పటీ?
3. పెరటి తోట
విరజాజి పువ్వుకి
సనసన్నని నవ్వుకి
ఒక మూరెడు
సొగసుంటే
పొట్ల పాదు
పందిరికి
గజి జిగిబిగి
పువ్వులకి
తెగ బారెడు
పొగరుంటే
కిల కిల కాకర
గరుగ్గరుగు
తాకి చూడు
ఒక పువ్వెడు
చేదుంటే
కొంత కొంత
కులుకుంటే
చిరు చిరు
చిరు దోసలు
అరిటాకుల
ఊసులూ
తూగుతూ
ఊగుతూ
గుసగుస
గుసగుస
లాడుతూ
ఏ పాటో
పాడుతూ
సూర్యకాంతి
తాగుతూ
చూడు, చూడు
వేసవి ఘన
వల్లె వేస్తోంటే
కాస్తోంటే
పూస్తోంటే
తీపి గాలి రైలు
కూకూమని
వస్తోంటే
నీ వెంటే