శ్రుతిలయల నందనవనం

ఈ రోజుల్లో తమ పిల్లలకు సంగీతం నేర్పించాలని చాలా మంది తల్లిదండ్రులకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరివద్ద నేర్చుకోవాలనేది ఒక సమస్య అయితే ఎటువంటి సంగీతం అనేది రెండో సమస్య. నేర్చుకున్నది ఏదైనా తరవాత పాడబోయేది శాస్త్రీయ సంగీతమా, సినిమా పాటలా, లలితసంగీతమా అనేది తేల్చుకోవడం కూడా కొంతమందికి కష్టమే. ఇటువంటి సందేహాలకు తావివ్వకుండా పిల్లలకు చక్కని సంగీతం నేర్పే మంచి స్కూళ్ళుంటే ఎంత బావుంటుంది? సరిగ్గా అలాంటిదే కోల్‌కతాలోని “శ్రుతి నందన్‌” అనే సంస్థ. దీని వ్యవస్థాపకుడు పండిత్‌ అజయ్‌ చక్రవర్తి అనే హిందూస్తానీ గాయకుడు. పేదకుటుంబంలో పుట్టిన అజయ్‌చక్రవర్తి తన తండ్రి అజిత్‌కుమార్‌ వద్ద సంగీతం నేర్చుకోవడం మొదలెట్టి తరవాత ఉస్తాద్‌ బడేగులాంఅలీఖాన్‌ కుమారుడైన మునవ్వర్‌అలీ వద్ద శిష్యరికం చేశాడు. ప్రకాశ్‌ఘోష్‌ అనే ఆయనవద్ద లలిత సంగీతం, హార్మోనియం వగైరాలు కూడా అభ్యసించి రవీంద్ర భారతి యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ పుచ్చుకున్నాడు. ప్రఖ్యాత తబలా, హార్మోనియం విద్వాంసుడు జ్ఞానప్రకాశ్‌ ఘోష్‌ కూడా ఆయనకు గురుతుల్యుడే.

దేశ విదేశాల్లోఎన్నో కచేరీలు చేసి ప్రశంసలనూ, ప్రేక్షకుల అభిమానాన్నీ పొందిన అజయ్‌ చక్రవర్తికి 1993లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వపు “కుమార్‌ గంధర్వ” తొలి అవార్డు లభించింది. సంగీత రిసెర్చ్‌ అకాడమీ ఫెలోగా స్వర్ణపతకం కూడా పొందారు. కొన్నేళ్ళ క్రితం రేడియో (వివిధ్‌భారతి) లో క్లాసికల్‌ రాగాలను పరిచయం చేసే “సంగీత్‌ సరితా” కార్యక్రమాన్ని కూడా ఆయన కొన్నాళ్ళు నిర్వహించాడు. అందులో రాగేశ్రీవంటి రాగాలను శాస్త్రీయ, లలిత సంగీతాల్లో ట్రీట్‌ చేసే రెండు రకాల పద్ధతులను ఆయన ఆసక్తికరంగా వివరించాడు.

అజయ్‌ చక్రవర్తికి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇటీవల ముంబాయిలోని నెహ్రూ సెంటర్లో సన్మానం జరిగింది. సభలో ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు నౌషాద్‌, ఇళయరాజా, ఉత్తమ్‌సింగ్‌, ప్రసిద్ధ గాయకుడు దినకర్‌ కైకిణీ తదితరులు ప్రసంగించి అజయ్‌ చక్రవర్తి కృషిని మెచ్చుకున్నారు. ఆనాడు పటియాలా,జైపూర్‌ వంటి “ఘరానా”లు సంగీతానికి పేరు పొందితే ఇప్పుడంతా ఎమ్‌టీవీ ఘరానాయే వినబడుతోందని నౌషాద్‌ చమత్కరించారు. పాశ్చాత్యులకు ఆనాటి మొజార్ట్‌ను ఆరాధించడమే తెలుసనీ ఈనాడు అజయ్‌ చక్రవర్తి రెండు వందలమంది మొజార్ట్‌లను తయారు చేస్తున్నారనీ ఇళయరాజా మెచ్చుకున్నారు. ఆ సభలో అజయ్‌ కుమార్తె కౌశికి గానాన్ని అందరూ ప్రశంసించారు. అనంతరం “శ్రుతినందన్‌” సంస్థ గురించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. అది అయిదంతస్తుల “సెల్ఫ్‌ కంటెయిన్‌డ్‌” భవనం. దాని బేస్‌మెంట్‌లో స్టూడియో,ఇతర అంతస్తుల్లో సంగీత పాఠాలు నేర్పే గదులూ, కాంటీన్‌, అతిథులుగా వచ్చే సంగీతజ్ఞులకు వసతులూ, విద్యార్థులు సంగీతాన్ని ఆస్వాదించడమే కాక సంగీతంలో మైక్‌ల ఉపయోగాలూ, రికార్డింగ్‌ విశేషాలూ, హాల్‌ అకూస్టిక్స్‌ వివరాలూ ఇలా ఎన్నో నేర్చుకునే సదుపాయాలున్నాయి. శ్రుతినందన్‌లో ఎనిమిదివందలమందిదాకా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. వీరిలో అధికసంఖ్యాకులు స్థానికులూ, పొరుగు ప్రాంతాలవారే అయినా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చేవారు లేకపోలేదు. అజయ్‌, ఆయన భార్య చందన వీడియో మానిటర్ల ద్వారా ఒకేసారిగా ప్రతి క్లాసులోనూ ఏం నేర్పుతున్నారనేది పర్యవేక్షిస్తూ ఉంటారు. డాక్యుమెంటరీలో విద్యార్థుల సోలో, బృందగానాలు రెంటిలోనూ గొప్ప ప్రతిభ కనిపించింది. అందులో హిందూస్తానీ శాస్త్రీయగానం, వాద్య సంగీతం, లలిత సంగీతం, జానపదసంగీతం ఇలా అనేక రకాలు నేర్చుకోవడం చూపించారు. అన్నిటికన్నా ఆశ్చర్యపరిచినది ఆ బెంగాలీ పిల్లలు డా.బాలమురళీకృష్ణ స్వరపరిచిన కల్యాణి రాగ ఠాయమాలిక తిల్లానా పాడడం. (ఆ సంస్థకు విచ్చేసిన ప్రముఖులలో బాలమురళి కూడా ఉన్నారు) మంచి సంగీతం ఎక్కడిదైనా అనుకరించి నేర్చుకోదగినదే అనే అభిప్రాయం సంస్థ సంచాలకులకు ఉన్నట్టూ దీన్ని బట్టి తెలియవస్తోంది. ముంబాయి సభలో నౌషాద్‌గారు అన్నట్టు శాస్త్రీయసంగీతం మన దేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అతి ముఖ్యమైన అంశం. అజయ్‌ చక్రవర్తి వంటివారు దాన్ని పరిరక్షించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తే ఎంతో బావుంటుంది.

తెలుగు విద్వాంసులలో పారుపల్లి రామకృష్ణయ్య, ద్వారం వెంకటస్వామినాయుడు, శ్రీపాద పినాకపాణిగార్లు మూడు ముఖ్యమైన బాణీలకు ప్రతినిధులు. నేటి సంగీత విద్వాంసులూ,శిక్షకులలో వీరి శిష్యులు కానివారు అరుదు. వీరిలో కొందరైనా శ్రద్ధగా సంగీతం నేర్పుతున్నారు. ఇదికాక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సంగీత శిక్షణాలాయాలున్నాయి. విజయనగరం,విజయవాడ, హైదరాబాద్‌ సంగీత కళాశాలలు ప్రసిద్ధమైనవి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, వెంకటేశ్వర, కాకతీయ మొదలైన విశ్వవిద్యాలయాలన్నీ సంగీతానికి ప్రోత్సాహాన్నిస్తున్నాయి. తక్కిన పెద్ద నగరాలలాగే హైదరాబాద్‌లో భక్త రామదాసు కళాశాల, త్యాగరాయ సంగీత కళాశాల, సంస్కార భారతి,సంగీతాంజలి, సుర్‌మండల్‌, సింఫనీ అకాడమీ ఆఫ్‌ మ్యూజిక్‌, నాట్యసదన్‌, నాట్యవేద, నృత్యాంజలి వగైరా ఎన్నో సంగీత పాఠశాలలున్నాయి.వీటిలో చాలామటుకు నాట్యం, సంగీతం నేర్పిస్తాయి. తక్కినప్రాంతాల్లో విజయవాడలోని మానస్‌ ఇన్‌స్టిట్యూట్‌, వెంపటి సత్యం ఆర్ట్‌ అకాడమీ, కాకినాడలోని అభ్యుదయ ఆర్స్ట్‌, గుంటూరులోని నాగార్జున కళాకేంద్రం, ఏలూరులోని నృత్యభారతి, త్యాగరాజ గానసభ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంగీత సభల ఫెడరేషన్‌, తణుకులోని సిద్ధేంద్ర నృత్య సంగీత అకాడమీ, విశాఖపట్నంలోని విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ అకాడమీ, స్వరరంజని, కూచిపూడి కళాక్షేత్రం, విజయనగరంలోని విజయ కళాభారతి, వగైరాలు కాక సూర్యాపేటలోని గ్రామ వెలుగు నాట్యమండలి, ప్రొద్దటూరులోని చలన చిత్ర సంగీత నృత్య అనుకరణ కళకారుల సంఘం కూడా ఉన్నాయని ఇంటర్నెట్‌ వల్ల తెలుస్తోంది.

పూర్వం దేవాలయాల్లోనూ రాజాస్థానాల్లోనూ ఆశ్రయం పొందిన శాస్త్రీయ సంగీతం ఇప్పుడు వినడానికీ, నేర్చుకోవడానికీ అందరికీ అందుబాటులో ఉంది. భారతీయ సంగీతం నేర్పే సంస్థలు ఈనాడు చాలా దేశాల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని “ఆన్‌లైన్‌” శిక్షణ ఇస్తామని కూడా ఇంటర్నెట్‌లో ప్రకటిస్తాయి. మహారాష్ట్రలోని మీరజ్‌లో గ్వాలియర్‌ ఘరానా దిగ్గజాల్లో ముఖ్యుడైన విష్ణు దిగంబర్‌ పలూస్కర్‌ స్థాపించిన గాంధర్వ మహావిద్యాలయం గత ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో హిందూస్తానీ సంగీతవ్యాప్తికి చాలా తోడ్పడింది. బైజూ బావ్‌రా సినిమా ద్వారానూ , తన మధురగానంతోనూ అందర్నీ అలరించిన డి.వి.పలూస్కర్‌ ఈ సంగీతవేత్త కుమారుడే. అలాగే అలహాబాద్‌, బెనారస్‌లలో పేరుపడ్డ సంస్థలున్నాయి. మరొక సంగీతజ్ఞుడి పేర నడుస్తున్న లక్నోలోని భాత్‌ఖండే మ్యూజిక్‌ యూనివర్సిటీ కూడా ముఖ్యమైనదే. ఇవన్నీ సంగీతంలో కోర్సులు నిర్వహించి పరీక్షలు పాసైనవారికి డిగ్రీలు ఇస్తాయి. కోల్‌కతాలో ఇండియన్‌ టొబాకో నడుపుతున్న సంగీత రిసెర్చ్‌ అకాడమీ సంగీతపు అరుదైన రికార్డింగులను భద్రపరచడమే కాక తగినవారికి స్కాలర్‌షిప్‌లిచ్చి ఉన్నత సంగీత శిక్షణ నందించే ప్రయత్నాలు చేస్తోంది. నేటి మేటి యువ గాయకుడు రషీద్‌ఖాన్‌ అలా నేర్చుకున్నవాడే.

ఇవికాక కొన్ని సంస్థలు కొందరు ప్రసిద్ధ సంగీతజ్ఞులు స్థాపించినవి కాగా మరికొన్నిటికి ప్రసిద్ధుల సహకారం అందుతోంది. పుణే యూనివర్సిటీ లోని లలిత్‌ కళాకేంద్ర ఈ రెండో రకానికి చెందినది. అందులో గురుకుల పద్ధతిలో శాస్త్రీయసంగీతం, నాట్యం, నాటకకళలలో శిక్షణ ఇస్తున్నారు. ఆ రంగాల్లో నిష్ణాతులు అక్కడికి “అతిథి” అధ్యాపకులుగా వస్తూ ఉంటారు. ప్రసిద్ధగాయని ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి, శ్రుతి ఫౌండేషన్‌ “సముద్రి” అనే సంగీత సంస్థను నిర్వహిస్తున్నారు. అందులో సంగీతశిక్షణకన్నా కార్యక్రమాల ఏర్పాటును గురించి ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్టు కనిపిస్తుంది. అమెరికాలో సాన్‌ఫ్రాన్సిస్కో సమీపంలో సరోద్‌ విద్వాంసుడు అలీ అక్బర్‌ఖాన్‌ నడుపుతున్న సంస్థ చాలా ప్రసిద్ధమైనది. సితార్‌ విద్వాంసుడు రవిశంకర్‌ “రిమ్‌పా” అనే కేంద్రం స్థాపించారు. అందులో ముఖ్యంగా సితార్‌, వేణువు, తబలావంటి వాద్యాలను నేర్పుతారు. ప్రసిద్ధగాయకుడు జస్‌రాజ్‌ అట్లాంటాలో తన మ్యూజిక్‌ ఫౌండేషన్‌ ఒకటి నిర్వహిస్తున్నారు. ఈ విధంగా అనేకమంది వ్యక్తిగతంగానూ, సంస్థాగతంగానూ సంగీతానికి ప్రాచుర్యం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యాసంలో వీటన్నిటి గురించీ పూర్తిగా ప్రస్తావించడం అసాధ్యం కనక కొన్నిటిని మాత్రమే ఉదహరించడం జరిగింది.

తెలుగువారికి శాస్త్రీయ సంగీతం అంటే అంత ఆసక్తి ఉండదని అనిపిస్తుందిగాని అది పూర్తిగా నిజంకాదు. మనవాళ్ళకి “శాస్త్రకట్టు” కంటే “మెలొడీ” అంటే ఎక్కువ ఇష్టమేమో. లైట్‌ మ్యూజిక్‌ వినడానికి ఎంత బావున్నా లోతైనవేళ్ళు కలిగిన శాస్త్రీయ సంగీతంతో అది పోటీ పడలేదు. అందులో అభిరుచి ఏర్పడ్డాక ఈ తేడా మరింత బాగా అర్థం అవుతుంది.

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...