ముక్కోణాలు

కళ్ళెదురుగా విరగబూసిన మల్లె గుబురుని
ఒంగి ముద్దాడి అభినందించలేని అతణ్ణి
“నీకోసం మళ్ళీ పుడతాను, గుర్తు పడతావా?” అనడుగుతుంది ఆమె.
“మంచివాడెవరిక్కడ?” అని ఎవరో పిలిస్తే
అతను హడావిడిగా లేచి వెళ్ళిపోతాడు, ఆమెకు సమాధానం చెప్పకుండా


తెల్లవారితే అతను చెప్పే మాటకోసం
ఆమె కొన్ని రాత్రులుగా మేలుకొనే ఉంటోంది.
మిట్టమధ్యాహ్నం అయ్యింది…
అతనెందుకో ఈ మధ్య ఇచ్చిన మాటలు మర్చిపోతున్నాడు.
ఆగలేక ఎదురెళ్ళింది
“చూడు, గందరగోళంలో ఉన్నాను” అని
కాయితపు ముక్కలు చూపించాడు.
ఆమె మరోసారి పగుళ్ళొచ్చిన గుండెని
జాలి చూపుల వెనక దాచుకొని తిరిగొచ్చింది.


ఆమె తలొంచుకొని పనిచేసుకుంటోంది
అలికిడైతే కిటికీలో పిచ్చుకలు జడుసుకుంటాయని.
కదలికల్ని సంభాళించుకుంటోంది
పవిటచెంగుకి అంటుకున్న గరికపూవులు రాలిపోతాయని.
అతను వాకిట్లో బావి దగ్గర నుంచి అరుస్తున్నాడు
“చేతులకు నీళ్ళు చేది పొయ్యి,
గూళ్ళు పీకి పారేసి, నేల చదును చేసిపారేశా
రా, చేతులకు నీళ్ళు చేది పొయ్యి” అని.