ఒకానొక ఊట కోసం

కొన్ని సార్లు ఎక్కడికీ కదలలేను.
చుట్టూ చీకటి
నదులుగా, సముద్రాలుగా కదులుతుంది.
కదిలే చీకట్లో
రేపటి వెలుగును వెతుకుతుంటాను.
ఏదో కరగుతున్నట్లు
మరేదో వినపడీ వినబడనట్లు
కొన్ని పగళ్ళు కొన్ని రాత్రులు
కాలాన్ని అనంతంగా మోస్తూ ఉంటాయి.

క్షణాలుగా విస్ఫోటనమైన దేహం
ఎప్పుడూ గాయాలుగానే ప్రవహిస్తుంటుంది.
ఏ గాయం ఎందుకైందో తెలుసుకోవడానికి
గాయాలన్నీ గేయాలు కావడానికి
ఒక ఊపిరి కావాలి.

ఊపిరొక అపనమ్మకం!
ఏ సమయంలోనైనా
మట్టిలో తల దాచుకుంటుంది.
అంతటితో సమయం ఆగిపోతుంది.
ఇక జరిగేదంతా
ఎండమావుల్లో నీరు వెతకడమే.

బావిలో నీడలు కదలడం జరగదు
నీరింకిపోయిన బావి
రక్తం విరిగిన నా శరీరం
రెండు పర్యాయపదాలే.

ఆఖరి పలుకు ఇదే కావచ్చు
చెవులను రిక్కించి విను…
ఇదిగో ఈ పచ్చని పద్యం నాటు
ఊటలు ఊటలుగా మాటలు
మాటలపై పారే నువ్వు
పారే నీలో నేను…