వొట్టిశాపల బతుకు

నువ్వెప్పుడూ గుర్తురాకూడదనుకుంట. నువ్వు పిచ్చిపిచ్చిగా గీకెల్లిన పెన్సిల్ రాతల్ని ఎరేజర్‌తో తుడిపేద్దామనుకుంట. ఆదిమానవుడు బండరాళ్ళపై చెక్కిన బొమ్మల్లెక్క నా మనసు గోడలపై ఏమేం రాశావో, ఎన్నెన్ని గీశావో అర్థంకాని అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్స్. ఎప్పటికప్పటి తవ్వకాల్లో, పురాజ్ఞాపకాల్లో ఉక్కిరిబిక్కిరిచేసి వూపిరి తీసుకోనివ్వని గడియల్లో సలుపుతూనే వుంటావ్… దీనెబ్బా జీవితం శూన్యపరీక్షనాళికా ప్రయోగమా ఇది!

ఫుట్బాల్ ఆడుకుంటనే వుంటవ్… ఎందుకు? నీ మొఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావానే? థూ… నీ కళ్ళలో నా రూపమే కనవడుతది. నీ చూపులు నన్ను వెతుకుతున్నట్టే… నీ కంటి వెనుక దాగున్న ఆకాశంలో విహరిస్తుంట.

ఎన్నెన్ని నిండుకుండల్లాంటి మేఘాలు! గుండుపిన్నుతో గుచ్చకుండానే టప్‌మని పేలిపోయే బెలూన్‌లా ఎంత వుబ్బిందో నా గుండెకాయ! ఎప్పుడు ముట్టుకుంటే పేలిపోతదోనని కాపలా కాస్తుంట. నీ వూహల ప్రపంచం గేటు కాడ నిలబడి, కూలబడి, నిండుకున్న వూటచెలిమల తడిని తడుముకుంటుంటే ఖాళీ ఆకాశంలో రంగుల గాలిపటాలు ఎగరేసిన సాయంత్రాలు యాదికొస్తుంటాయి. మాంజా తెగిన పతంగై నీ కోసం వెతుకుతుంటా.

ఎప్పుడో రాయాల్సిన ఉత్తరాల్ని తెల్లకాగితపు మూటల్ని విప్పి మాటల్తో నింపి పేరుస్తుంట. నీ కళ్ళలోకి ఎన్నిసార్లు తొంగిచూసుంటానో… నీ పాదముద్రల్ని లెక్కిస్తూ సాగిపోతున్నానిప్పుడు! అజ్ఞాత పక్షిలా ఎండిన చెరువుగట్టుపై వాలిపోవాలని తపిస్తుంట.

కొంగలు తొక్కిన మడుగులా మన జ్ఞాపకాల్ని ముద్రించుకున్న మనసుల్ని, పాము కుబుసం విడిచినట్టు వదిలేసిన తావులకి అప్పుడప్పుడు వెళ్ళి డేంజర్‌జోన్ బోర్డుపై అక్షరాలను ప్రేమగా తాకి మైమరిచిపోతుంటా.

వొట్టి దేహాలు! ప్రాణం లేకుండా ఇంకా ఎన్నేండ్లు బతికుంటాయో.