ఏ విలువలకీ శప్తభూమి?

శపించబడిన భూమి అన్న అర్థం ఉన్న శప్తభూమి నవల 2017లో వచ్చింది. పాఠకులనూ విమర్శకులనూ బాగా ఆకర్షించింది. అభిమానమూ ప్రశంసలూ పొందింది. సమీక్షావ్యాసాలు వచ్చాయి. చర్చలు సాగుతున్నాయి. నిస్సందేహంగా ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన చెప్పుకోదగ్గ నవల.

2019కి గానూ ఈ నవల కేంద్ర సాహిత్య ఎకాడమీ అవార్డు అందుకొంది.

ఈ నవల కథాకాలం పద్దెనిమిదో శతాబ్దపు నాలుగో పాదం. కురువ కులానికి చెందిన బిల్లే ఎల్లప్ప తన ఊరి చెరువును పొరుగు సంస్థానపు దుండగుల దాడినుంచి అసమాన్య సాహసంతో రక్షించడంతో మొదలయిన నవల అనేకానేక పాత్రలను, చారిత్రక ఘటనలను, సామాజిక పరిణామాలను, నీతినియమాలను, సంప్రదాయాలను పరామర్శిస్తూ వెళ్ళి వెళ్ళి ఆ ఎల్లప్పజెట్టి ఊరి చెరువు నిండటంకోసం దైవభక్తిలోంచి వచ్చిన రాజభక్తితో శ్రీశైలాధీశుని సాక్షిగా వీరమంటపం ఎక్కడంతో ముగుస్తుంది.

ఇమ్మడమ్మ ఎల్లప్పకు మరదలు వరస. అదే వరసకు చెందిన కోడెనీలడు ఎల్లప్పకు అనేకానేక విషయాల్లో–ముఖ్యంగా ఇమ్మడమ్మ విషయంలో–పక్కలో బల్లెం. తన ఊరి చెరువు వీరకృత్యం వల్ల బిల్లే ఎల్లప్ప అనంతపురం పాలకుడు సిద్ధరామప్పనాయుడి దృష్టిని ఆకర్షించి, అతని సంస్థానంలో చేరి, గుర్రమెక్కి, కత్తిపట్టి, పది గ్రామాలకు అమరనాయకుడు అవుతాడు.

సిద్ధరామప్పనాయుడి ఇష్టమహిషి పద్మసాని. మధుర నాయకరాజులనాటి పూర్వ సువాసన సంతరించుకొన్న నిండైన మనిషి ఆమె. కరవుకాలంలో ఇమ్మడమ్మ తలిదండ్రులు తమ రెండో కూతురును పసిపిల్లగా ఉండగానే అమ్ముకోగా, ఆమెను చేరదీసి, నాగసాని అని పేరుపెట్టి, విలక్షణ వ్యక్తిగా పెంచిన మనిషి పద్మసాని. పద్మసాని, సిద్ధరామప్పల కొడుకు మన్నారుదాసు. తండ్రి అంగీకారం పొందే అవకాశం లేని కొడుకు అతను. చివరికి ఆంగ్లం చదువుకొని కిరస్తానీ అవుతాడతను.

ఇమ్మడమ్మ కోరుకునేది కోడెనీలడినే అయినా, తనకున్న శక్తీ అధికారాల సాయంతో, కోడెనీలడి మీది ప్రతీకార వాంఛతో, ఇమ్మడమ్మ అంటే ఉండే ఆకర్షణాబలంతో ఎల్లప్పజెట్టి ఆమెను పెళ్ళి చేసుకోగలుగుతాడు. తప్పక పెళ్ళి చేసుకున్న ఇమ్మడమ్మ దాంపత్యానికి నిరాకరిస్తుంది. ఆ పెళ్ళిని వ్యతిరేకించిన కోడెనీలడిని ఎల్లప్పజెట్టి మోసంతో బంధిస్తాడు. వేలంపాటలో ఎల్లప్పజెట్టి ఇలాకాలోని చెరువులపల్లె అనే గ్రామాన్ని దక్కించుకొన్న నాగన్న ప్రెగడ అన్న అగ్రహారపు పెద్దకు వర్షాభావం వల్ల పన్ను కట్టలేని పరిస్థితి ఎదురవుతుంది. పంచాయితీ పెద్దల సలహా ప్రకారం వర్షం కోసం గాలిదేవర జాతర జరిపించడానికి ఒప్పుకుంటాడు. కురవ ఎల్లప్పజెట్టి ఎదుగుదల కంటగింపుగా ఉన్న వీరనారాయణరెడ్డి అనే పొరుగు అమరనాయకుడు ఆ ఎల్లప్పజెట్టి ఇలాకాలోని గాలిదేవర ఫలాన్ని ఎత్తుకురావడానికి కోడెనీలడిని ఎగదోస్తాడు. ఆ ప్రక్రియలో కోడెనీలడు ఎల్లప్పజెట్టి బల్లెపు దెబ్బకు ప్రాణాలు కోల్పోతాడు. కోడెనీలడిని చంపినా కోపం పూర్తిగా చల్లారని ఎల్లప్పజెట్టి కోడెనీలడి ‘వస్తువు’ అయిన ఇమ్మడమ్మను బలవంతంగా అనుభవిస్తాడు. క్షోభించిన ఇమ్మడమ్మ పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు కోరుతుంది.

పుష్కర కాలం గడుస్తుంది.

ఇరుగుపొరుగు సంస్థానాలయిన అనంతపురం, తాడిమర్రిల మధ్య వైషమ్యాలూ, దోపిడీ ప్రయత్నాలూ, దొమ్మీలూ, యుద్ధాలూ పరాకాష్టకు చేరుకోగా వాటిలో తాడిమర్రివాళ్ళది పైచెయ్యి అవుతుంది. వారు పట్టుకొన్న బందీలను విడిపించుకురావడానికీ, అపరాధపు రుసుము చెల్లించడానికీ అనంతపురానికి వల్లమాలిన ఖర్చు అవుతుంది.

దాంతో సిద్ధరామప్పనాయుడు మైసూరు నవాబుకు రెండు సంవత్సరాల ఖండిణీ రూకలు బకాయిపడతాడు. ఆ బాకీ వసూలు కోసం వచ్చిన గుత్తి సుబేదారు సిద్ధరామప్ప మెడమీది కత్తి అవుతాడు. ‘ఈ సంవత్సరం వానలు పడితే, చెరువులు నిండితే మీ బకాయి తీర్చుకుంటాం. అంతా వానదేవుని దయ!’ అని సిద్ధరామప్ప ప్రతినిధి అంటే, ‘పంటలు పండినా ఎండినా మా ఖండిణీ రూకలు మా చేతిలో పడాలి. లేదా కోట బీగాలు మీరు మా నవాబుకు అప్పగించవలసి వుంటుంది.’ అని గుత్తి సుబేదారు ఖరాఖండీగా చెపుతాడు.

తన ప్రభువుకు జరుగుతోన్న అవమానానికి ఉడికిపోతాడు ఎల్లప్పజెట్టి. ‘వానలు రావాలి. చెరువులు నిండాలి. పంటలు పండాలి. పన్నులు వసూలు కావాలి. కోట బీగముద్రలు దొరవారికే శాశ్వతం కావాలి.’ అన్న కృతనిశ్చయంతో వానదేవుడ్ని ప్రసన్నం చేసుకోవడం కోసం వీరమంటపం ఎక్కడానికి నిశ్చయించుకొంటాడు ఎల్లప్పజెట్టి. ఎవరు వారించినా వినకుండా దైవభక్తీ ప్రభుభక్తీ ఇచ్చే స్ఫూర్తితో మేళతాళాలతో భక్త్యావేశాలతో వీరమంటపం ఎక్కి ఒక్కొక్క అంగాన్నీ గండకత్తెరతో ఉత్తరించుకొని, వాటిల్ని అష్టదిక్కులకు సమర్పించుకొని…

‘ఆ వీరుడి మరణం’ తర్వాత అనంతపురం ఆకాశంలో ఫెళఫెళా ఉరుములూ, ధగధగా మెరుపులూ… కానీ ఎన్ని ఉరుములు ఉరిమినా, ఎన్ని మెరుపులు మెరిసినా ఒక్క చుక్క వాన పడకపోగా, సిద్ధరామప్పనాయుడు మైసూరు నవాబుకు ఖండిణీ రూకలు చెల్లించలేకపోగా, గుత్తి సుబేదారు కోట బీగముద్రలు స్వాధీనం చేసుకొని నాయుడిని ఖైదు చేస్తాడు. జరుగుబాటు కూడా కష్టమయిపోయిన సిద్ధరామప్ప కృంగి కృశించి 1778లో కాలం చేస్తాడు.

ఆ తర్వాత (1799లో) మైసూరు నవాబు ఇంగ్లీషువారితో పోరాడి ఓడిపోగా, పంపకాలలో (రాయల) సీమ నిజాం నవాబు వాటాకు రాగా, దాన్ని నిజాం నవాబు వదిలించుకొని ఇంగ్లీషువారికి ‘సీడెడ్’గా చేయగా చివరకు… రాయలసీమ పాలకులు పట్టించుకోని అనాథభూమిగా మిగిలింది అంటాడు కథకుడు.

‘కరవుకాటకాలూ, పాలేదార్ల కొనసాగింపేగదా ఇప్పటికీ ఈ శప్తభూమి గాథ!’ అంటూ నవల ముగుస్తుంది.


ఇప్పటిదాకా చెప్పుకొన్న ఇమ్మడమ్మ, కోడెనీలడు, ఎల్లప్పజెట్టి లాంటి ముఖ్యమైన పాత్రలే కాకుండా ఈ నవలలో అసంఖ్యాకమైన ఇతర పాత్రలున్నాయి. ఎన్నెన్నో సంఘటనలూ, ఉపకథలూ ఉన్నాయి.

అనంతపురపు వణిక్‌ప్రముఖుడు అనంతయ్య శ్రేష్టి కుమార్తెను ఇదివరలో అనంతపురం సంస్థానాన్ని పాలించిన మూడో సిద్ధప్ప చెరబట్టడం, తద్వారా ఆ కూతురుకు మతి చలించగా అనంతయ్య శ్రేష్టి ఆమెను అడవిలో గుట్టుగా దిగవిడచి రావడం, అక్కడ ఆమె అచ్చమైన అడవి జంతువులా మారి చివరికి దుర్మరణం చెందడం… ఇది ఒక కథ.

మాలకులపు కంబళి శరభుడు అప్పటిదాకా ఏ మనిషికీ, ఏ వీరునికీ సాధ్యంగాని గండశిలను ఒడిసిపట్టి లేపడం, తద్వారా దాన్ని ‘మైలపరచడం’, శిక్షగా అరగుండూ అరమీసంతో ఊరిబయట గుట్టల్లో వదిలివేయబడటం, అయినా ఆశతో తన భార్య దగ్గరకి వెళితే ఆమెను అప్పటికే తనకు శిక్ష వేసిన ఊరిపెద్ద చిన్నకొడుకు ఎర్రనాగిరెడ్డి మాలిమి చేసుకొని కనబడటం, కలతతో శరభుడు ఊరి గుట్టలు వదిలివెళ్ళి థగ్గుల్లో కలవడం, తన దోపిడీల పరంపరలో ఎర్రనాగిరెడ్డి భార్యతో సహా చిక్కగా, నాగిరెడ్డి మీద ప్రతీకారంగా అతని భార్య మీద శరభుని అత్యాచారం, శత్రువు ‘వస్తువును’ కొల్లగొట్టిన విజయగర్వం, ‘సీతమ్మవారిలాగా’ నాగిరెడ్డి భార్య భర్తను అనుసరించే ప్రయత్నం చెయ్యడం, నాగిరెడ్డి తిరస్కరణ, చావడానికి తెగించలేని ఆమె కంబళి శరభుడు వెళ్ళిన దారివేపే అడుగులు వెయ్యడం… ఇది మరో కథ!

నవల మధ్యలో కనిపించే హరియక్క మరో గుర్తుండిపోయే పాత్ర. బోయకులానికి చెందిన చిత్రలింగనాయకుని కూతురు హరియక్క. తన పూర్వీకులు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో వీర ప్రదర్శన చేసి సర్వమాన్యంగా పొందిన రాయలచెరువు గ్రామపు అధిపతి చిత్రలింగనాయకుడు. తల్లి చిన్నప్పుడే మరణిస్తే తండ్రి పెంపకంలో మగదుస్తుల్లో పెరిగి పెద్ద అయిన మనిషి హరియక్క. చిన్నపాటి తగాదా చిలికిచిలికి గాలివానగా మారి చిత్రలింగనాయకుడు హత్యకు గురవుతాడు. తన తండ్రిని హత్య చేసిన పొరుగు పాళెగాడు పెమ్మసాని తిమ్మప్పనాయుడుని ద్వంద్వయుద్ధానికి రెచ్చగొట్టి, గెలిచి శత్రువును రణంకుడుపు పట్టిన మనిషి హరియక్క. అప్పటికే దేవరపోతుగా మారిన కోడెనీలడిని కులాచారాలను అధిగమించి పెళ్ళిచేసుకొని, ఆ పెళ్ళి జరగడం కోసం మొక్కుకొని, ఆ మొక్కు తీర్చడం కోసం వీపులో కొక్కెం దూర్చుకొని రక్తాలు కారుతూ సిడిమాను ఎక్కి ఊగిన మనిషి హరియక్క.

వీళ్ళేగాకుండా మనకీ నవలలో ప్రజల క్షేమం కోసం చెరువును తవ్వించిన పద్మసాని, కులసంప్రదాయాలను చిన్నతనంలోనే ధిక్కరించి ఊరునుంచి పారిపోయి నిడుమానుస్వామిగా తిరిగివచ్చిన మాదిగ గురవడు, అతని బ్రాహ్మణ భార్య, ఆమె ఆత్మహత్య, మన్నారుదాసు నగరపు స్నేహితులు ఫిలిప్ బ్రౌన్, మాడల కందప్ప, పద్మసాని దయవల్ల కరవుబారినుంచి తప్పించుకొన్న ఎందరో మంగలి గంగన్నలు, ఆమె అంటే భక్తితో దోపిడీకి వచ్చిన దొంగలతో తలపడి గంగన్న వీరమరణం పొందడం, ఆ గంగన్న భార్య సతీసహగమనం, పద్మసాని పెంపుడు కూతురు నాగసాని తన అసలు తల్లిదండ్రుల్ని చూసిరావడం, మహిమలతో వ్యాధులు నయంచేసే తిక్కస్వామి, విప్రవినోదుల గారడీ ప్రక్రియ, వాళ్ళను ‘కట్టి’పడేసిన నిడుమానస్వామి తంత్ర విద్య–ఇలా ఈ నవలలో ఎన్నో ఎన్నెన్నో వ్యక్తులు, సంఘటనలు, అనుభవాలు, వివరాలు… లెక్కకు మించిన పఠనానుభూతులు.

ఊహాతీతమైన పరిశోధనా ఫలితం ఈ శప్తభూమి.


నవల ముగిశాక దానికి అనుబంధంగా ‘ఈ నవలను రాయించిన క్రమం ఒకటుంది,’ అంటూ ఆ క్రమాన్ని వివరిస్తారు రచయిత.

‘రాయలసీమ తన అస్తిత్వాన్ని సంతరించుకుంటున్న సందర్భంలో’, ‘రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వం ప్రశ్నార్థకమైన’ సమయంలో ఏదో చేయాలని, ఏదో రాయాలని రచయితకు అనిపించగా; ‘వర్షం కోసం ప్రాణాలర్పించిన గాలిదేవర మనిషి సంఘటనను రాయలసీమ కరవుల చరిత్ర కథగా రాస్తే ఎట్లుంటుంది…’ అని ఆలోచించి, ‘కరవునూ వర్షాన్నీ ఇతిహాస స్థాయికి చేర్చిన ఆర్కే నారాయణ్‌గారి గైడ్ తనలో సన్నసన్నగా మెదలుతూ ఉండగా’ పద్దెనిమిదవ శతాబ్దపు రాయలసీమ చరిత్రను అధ్యయనం చేసినపుడు అనేకానేక విషయాలు రచయితకు కొత్తకొత్తగా తెలిసివచ్చాయట. వాటన్నిటినీ ఈ నవలలో పాత్రలుగా, సంఘటనలుగా, వర్ణనలుగా చిత్రించారట. ఆ పాత్రలను సమీక్షించుకొన్నపుడు రచయితకు ఆ పాత్రల్లో ఎక్కువమంది దళిత బహుజన కులాలవారే ఉండటం కనిపించిందట. ఆ విషయం గుర్తించిన తర్వాత తాను అనుకొన్న రాయలసీమ చారిత్రక నవల కాస్తా రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా రూపుదిద్దుకొంటోంది అనిపించిందట.

నిజమే. ఈ నవలలో ప్రభువులు లేరు. సామాన్యులే ఉన్నారు. ఆ సామాన్యులు మళ్ళా ప్రభువులైపోయి ఆ లక్షణాలు సంతరించుకోవడం–అది వేరే సంగతి. అలాగే నవలకు ధీరోదాత్తనాయకులు అంటూ ఎవరూ లేరు. ముఖ్యపాత్రలయిన ఎల్లప్పజెట్టి, కోడెనీలడు రక్తమాంసాలూ రాగద్వేషాలూ ఉన్న మనుషుల్లా కనిపిస్తారు. నలుపూ తెలుపూ పాత్రలకు ఆస్కారమే లేని రచన ఇది. ఇది చెప్పుకోదగ్గ విషయం.

అలాగే రచయితకు విషయం మీద ఉన్న ఆసక్తి, పిపాస, ఆవేదనలతో పాటు తాను చేసిన విస్తృత అధ్యయనం కూడిరాగా పాత్రలూ సంఘటనలూ అరుదైన పరిణామాలూ వాస్తవికతతో గాఢతతో చక్కని వ్యక్తీకరణ, కథనాలతో మనముందు నిలుస్తాయి, అబ్బురపరుస్తాయి.

కానీ…

మన ఆచారాలూ సంప్రదాయాలూ పద్ధతులూ నియమాలూ గురించి చెప్పేటపుడు మూడు రకాల ధోరణులు కనిపించే అవకాశం ఉంది: వాటి గురించి నిరసన, నిర్లిప్తత, ప్రశంస-ఆరాధన. ఆ ధోరణులకు మళ్ళా రెండు విషయాలు కారణమౌతాయి: మనం చెపుతోన్న ఆచార సంప్రదాయాల మౌలిక లక్షణం, వాటి గురించి ఆ చెప్పే మనిషికి ఉండే తనదైన దృక్కోణం.

సతీసహగమనం, సిడిమాను, రణంకుడుపు, న్యాయవ్యవస్థ, ద్వంద్వయుద్ధం, గాలిదేవర, దేవరపోతు–ఇలాంటి అనేకానేక అలనాటి విషయాల అతి సూక్ష్మమైన వివరణలు ఈ నవల నిండా పరచుకొని ఉన్నాయి. ఇప్పటి పాఠకులకు ఏమాత్రమూ అవగాహన లేని విషయాలు వివరించబడ్డాయి. కానీ ఆ వివరణలో కనిపించే ధోరణీ దృక్కోణాలూ ఏమిటి?!

సతీసహగమనమే చూద్దాం.

ఈ విషయపు (ఆచారం అనడం కూడా అన్యాయమే) ప్రస్తావన నవలలో మూడునాలుగు చోట్ల వస్తుంది.

పన్నెండేళ్ళ బాలికకు ఆ బాలిక చిన్నాన్న నాగప్ప ప్రెగడ సతి నిర్వహించిన వివరం ఏడెనిమిది పేజీలపాటు నవలలో కనిపిస్తుంది. ఆ నిర్వహణలో నాగప్ప ప్రెగడ ఆడిన చాణక్యము, ఆ అమాయక బాలిక పడిన నరకయాతన చదివి పాఠకులకు ఎంతో కొంత ఆవేదన కలుగుతుంది. ఆపైన, తాడిమర్రివారితో యుద్ధంలో కొడుకు నల్లనాగిరెడ్డి మరణించినపుడు తండ్రి వీరనారాయణరెడ్డి గుట్టుగా ప్రాయంలో ఉన్న కోడలు చిన్నరెడ్డెమ్మకు సహగమనం ఏర్పాటు చేస్తాడు. చావుభయంతో వణికిపోతున్న కోడలికి అత్త ‘కళ్ళు ఒత్తుకుంటూ’ ఉమ్మెత్తరసం పోస్తుంది. ‘కోడలే ఇందుకు సిద్ధపడుతోంది’ అన్న మాటను వీరనారాయణరెడ్డి నేర్పుగా వ్యాప్తిలోకి తెస్తాడు. కోడలును మండుతోన్న చితిలోకి త్రోసే సమయంలో ఒక పఠాను రాజోద్యోగి అడ్డుకొంటాడు. అడ్డుకొని నిఖా చేసుకొంటానంటాడు. పాఠకులు హమ్మయ్య అనుకొంటారు.

కానీ నవలలో కనిపించే మూడో సహగమనం తీరే వేరు. అది మనలో కలిగించే స్పందనలే పూర్తిగా వేరు.

మంగలి గంగన్న పద్మసాని మీది భక్తిగౌరవాలతో దొంగలతో తలపడి వీరమరణం పొందాక అతని భార్య గైరమ్మ సహగమనానికి ముందుకొస్తుంది. ఆ వివరాలు నవలలో ఐదారు పేజీలపాటు ఉన్నాయి. మొదట్లోనే చదివేవారికి గైరమ్మతోపాటు ‘భక్త్యానందం’ పొందే ప్రమాదం తటస్థపడుతుంది. ‘సహగమనం ఆత్మహత్య కాదు. పతివ్రతాధర్మం’ అన్న గైరమ్మ మాటలు వినపడతాయి. ఆమెకు స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగి, బొట్టు పెట్టి, పువ్వులు తురిమి, భజంత్రీలు మ్రోగించి, నెత్తిన నూనెకుండను పెట్టి చితిలోకి దూకించినపుడు, చదివేవారికి–కనీసం నాకు–ఆమధ్య వచ్చిన సంజయ్‌లీలా భన్సాలీ సినిమా పద్మావత్‌లో చిత్తోడ్ రాణి కొన్ని వందలమందితో ఉత్సవసౌరభంతో శత్రువుల నుండి ‘గౌరవం’ కాపాడుకోవడం కోసం మంటల్లోకి నడచివెళ్ళిన సుదీర్ఘ దృశ్యమే గుర్తొస్తుంది. బన్సాలీకంటే బాక్సాఫీసు దుష్కారణమంటూ ఉందిగానీ శప్తభూమి రచయిత సహగమనానికి అంత గౌరవం ఇస్తూ చిత్రించడం ఎందుకూ?!

నవల దళిత బహుజన చరిత్ర అని చెప్పబడింది గానీ శప్తభూమిలో అడుగడుగునా అగ్రవర్ణ విలువలు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తాయి.

కోడెనీలడి నుంచి విడదీయబడి బలవంతపు పెళ్ళికి గురి అయిన ఇమ్మడమ్మకు ఆ కోడెనీలడికి హరియక్కతో పెళ్ళి కాగానే కోడెనీలడి మీద కోపం, హరియక్క మీద అసూయ కలుగుతాయి. అక్కడితో ఆగక అదంతా తాళికట్టిన ఎల్లప్పజెట్టి మీద సానుభూతిగా మారుతుంది. భర్త మంచితనం గుర్తొస్తుంది. అతని మీద జాలి కలుగుతుంది. అక్కడితో ఆగక ఇమ్మడమ్మ భర్త పట్ల తన ‘సతీధర్మాన్ని’ నెరవేర్చాలి అనుకొంటుంది! కొంచం ఆలస్యంగా అయినా ఇల్లాలి పదవిని స్వీకరిస్తుంది. ‘తన భర్త దూరంగా ఉండటం ఏ ఇంటి ఇల్లాలికి అవమానకరంగా అనిపించదూ?’ అంటాడు కథకుడు!

సిద్ధప్పనాయుడి ముందటితరంలో అప్పటి ప్రభువు మీద రామాజిప్రెగడ అన్న వకీలు ఒక బోయ తిమ్మప్ప సహకారంతో కుట్రచేసి పట్టుబడినపుడు బ్రాహ్మణుడు రామాజికి కారాగారం, బోయ తిమ్మప్పకు శిరచ్ఛేదం విధించడం కథలో చాలా యథాలాపంగా చెప్పబడుతుంది. కారాగారంలో ఉన్న రామాజి ‘నాలుకను బుడానికి పెరుక్కొని’ చనిపోతే, ‘రామాజి బ్రాహ్మణ్యం ఎంత గొప్పదో కానీ’ ఆ ప్రభువుకు ‘అగ్రహారం దానమిచ్చినా బ్రహ్మహత్యాపాతకం వదలలేదని’, చివరికి ‘తన గొంతు తానే పిసుక్కొని చనిపోయాడని’ ఈ కథ చెపుతుంది.

తిక్కస్వామి అన్న అద్వైత తాత్విక వేదాంతి ఒక ధనిక కుష్టురోగి వేళ్ళను ఒకదాని తర్వాత ఒకటి నోటిలో పెట్టుకొని చీకిచీకి నెల తిరిగేలోగా వ్యాధిని నయంచెయ్యడం నవలలో కనిపిస్తుంది. ‘చైతన్యం ఇంద్రియ పరిధిని దాటినపుడు, మనసు శక్తి ఉత్పాదనతో కూడిన సంకల్పశక్తిని సృష్టిస్తుంది. ఆ శక్తితోనే అవధూతలు రోగాలు నయం చేస్తారు.’ అన్నది కథకుని టిప్పణి. మరి ఇహ స్వస్థతా కూటాల గురించి, అఘోరీల అనంగీకార కార్యాల గురించీ మనకు అభ్యంతరాలుండక్కర్లేదేమో!

ప్రభుభక్తి, రాజభక్తి, రాజ్యభక్తి, దైవభక్తి, వంశగౌరవం, సంస్థాన ప్రతిష్ట లాంటి అనేక ఆనాటి దినుసులు సగౌరవంగా నవలలో పదేపదే దర్శనమివ్వడం యాదృచ్ఛికమేనా? నిరసన సరే, నిర్లిప్తత కూడా లేకుండా ఒకలాంటి చారిత్రక తన్మయత్వంతో వాటిల్ని పాఠకుల ముందు నిలబెట్టడం సమంజసమేనా?!

దళిత బహుజన నవల లక్ష్యం ఏమయివుండాలి? చారిత్రక నవల పాఠకులకు ఏంచెప్పాలి? కనీసం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోమని చెప్పాలి. దళితుల, బహుజనుల (దుర్భర?) జీవితాలనూ, సామాజిక అణచివేతనూ చిత్రించడంతో పాటు తద్వారా ఒక స్పృహను, చైతన్యాన్ని, పోరాట పటిమనూ వారిలో రేకెత్తించగలగాలి కదా!

అందుకు విరుద్ధంగా బహుజనుడు ఎల్లప్పజెట్టి, దళితుడు కంబళి శరభుడు, వ్యవస్థలో భాగమైపోయి, దోపిడీలో భాగమైపోయి, శత్రువు మీద పగను తీర్చుకోడానికి అతని భార్యమీద అత్యాచారమే మార్గంగా ఎన్నుకొని, అగ్రవర్ణ సంప్రదాయాలకు అనుగుణంగా వీరమంటపాలు ఎక్కి… ఏమిటీ ఈ పాత్రలు ఈ బహుజన దళిత చారిత్రక నవలలో నిర్వహిస్తోన్న భూమిక?! అసలు పాత్రలు దళిత బహుజన వర్గానికి చెందినంత మాత్రాన ఆ కథా నవలా దళిత బహుజన రచనలయిపోతాయా? దళిత జీవితాలనూ బహుజనుల బ్రతుకులనూ చిత్రించినంత మాత్రాన అది దళిత బహుజన రచన అవుతుందా? వర్గస్పృహనూ చైతన్యాన్నీ కలిగించి వారిలో పోరాటస్ఫూర్తిని ప్రవేశపెట్టే ప్రయత్నం ఈ నవలలో కనబడదేమి?! పైగా కంబళి శరభుడి గురించి చెపుతూ ‘దెబ్బ కాచుకోవడమే గానీ దెబ్బతీయడం అతని మాలపుట్టుకలో లేదు. మాలమనిషి మొత్తం వ్యవస్థకే బానిస. ఆ బానిసత్వం నుంచే అతనికి పెద్దకులాల మనుషుల పట్ల భక్తి ఏర్పడింది. భక్తిభావన దాస్యభావనకు మరీ దూరమేమీ కాదు.’ అన్న ‘అతిసమంజస’ నిర్ధారణలు చెయ్యడంద్వారా ఈ దళిత బహుజన నవల ఏం సాధించాలనుకొంటోందీ?!

నవల అంతటిలోనూ అతి అభ్యంతరకరంగా వర్ణించిన సంఘటన కంబళి శరభుడు ఎర్రనాగిరెడ్డి భార్యమీద అత్యాచారం చెయ్యడం. ఒక్క మాటలో, ఒక్క వాక్యంలో చెప్పి వదిలేయవలసిన ఆ దుర్భర సంఘటనకు రెండున్నర పేజీలపాటు అంత సూక్ష్మ, సవివర వర్ణన ఎందుకో! తక్కువస్థాయి సినిమా దర్శకులు తూచా తప్పకుండా అనుసరించదగ్గ రేప్‌సీన్ అది. సెన్సారు కత్తెరకు బలి అయ్యే ప్రమాదమూ ఉన్న దృశ్యమది.

కథకుని చారిత్రక పారవశ్యం ఎల్లప్పజెట్టి వీరమండపం ఎక్కి గండకత్తెరతో అంగాంగాలనూ ఉత్తరించుకొన్న దృశ్యంలో బాగా కనబడుతుంది. ‘ఎంత దారుణం!’ అన్న స్పందన కలిగించవలసిన ఆ సంఘటన పాఠకులలో ‘ఎంత త్యాగం! ఎంత గొప్ప వీరమరణం!’ అన్న ఆరాధనాభావనకు దారి తీస్తే దానికి బాధ్యత ఎవరిది?!

ఊహాతీతమైన పరిశోధనల ఫలితం ఈ నవల అని చెప్పుకొన్నాం. ఆ పరిశోధనా ఫలితాలు నవల పరిధి దాటుకొని వెళ్ళి అనేకానేక విడివిడి సంఘటనలుగా, పాత్రలుగా నవల పొడవునా కనిపించి నవలా స్వరూపానికి, శిల్పానికి భంగం కలిగించడం కనిపిస్తుంది. తండ్రికోసం ద్వంద్వయుద్ధానికీ, భర్తను పొందడం కోసం సిడిమాను ఎక్కడానికీ తెగించిన హరియక్క మరి ఆ భర్తను ఎల్లప్పజెట్టి అంతంచేస్తే ఎలా స్పందించిందో ఆ వివరం నవలలో స్పష్టంగా లేదు. ఇలా ఎన్నెన్నో ముడివేయని విడివిడి దారాలు నవలలో కనిపిస్తాయి. ఏకసూత్రతకు భంగం కలిగిస్తాయి.

తన బలిపీఠం నవల మలిప్రచురణకు ముందుమాట రాస్తూ, ఆ నవలలోని అనంగీకార భావాలనూ భాగాలనూ ఉతికి, ఆరవేస్తూ రంగనాయకమ్మ ‘ఇపుడు ఈ నవలకు ప్రభుత్వం ఎందుకు అకాడమీ అవార్డు ఇచ్చిందో నాకు స్పష్టంగా, శాస్త్రీయంగా తెలుసు’ అంటారు. శప్తభూమి నవలను మరోసారి మరోసారి చదివితే ఆ మాట నాకు పదేపదే గుర్తొస్తోంది.

కానీ ఒక్క మాట చెప్పాలి: కొరుకుడుపడని విషయాల సంగతి ఎలా ఉన్నా, అప్పటి బలిపీఠం, ఇప్పటి శప్తభూమి తమతమ ఇతరేతర బలాల వల్ల తెలుగు నవలా సాహిత్య మార్గంలో ఖచ్చితంగా మైలురాళ్ళుగా నిలబడి ఉంటాయి.