సంక్రాంతి

సీ.
మిసిమితో నెసలారు పసిఁడివన్నియతోడ
గన్నేరుపూచీర కాంతులీన
ఆకాశరుచితోడ నందంబు జిందెడు
వంగపూఱైక హొరంగు సూప
మందారములకాంతిఁ గ్రిందుసేయుచునున్న
కుందకుట్మలహారమందగింప
చలికాలమనియెడు సాలీఁడు నేసిన
పొగమంచు వలిపంపు ముసుఁగు గ్రాల
తే.
ప్రాంగణంబులయందున ప్రమదలెల్ల
రంగురంగుల వ్రాసిన రథములందు
యానమొనరించి యేతెంచె నదిగొ కనుఁడు
మకరసంక్రాంతిలక్ష్మి సమ్మదముతోడ
మ.
ఇది ముఖ్యంబగు మంగళాహ మనఁగా నింతేని సందేహము
న్మదులం బూనఁగ నేల, కాంచుఁడదిగో మర్త్యాళికెల్లం శుభా
స్పదమౌ నుత్తరమార్గపుం దలుపు విస్తారంబుగాఁ దీసి పు
ణ్యదకార్యోత్తమయానతృష్ణ నెదలో నర్కుండు నూల్కొల్పెడిన్
తే.
ఒకరికంటెను వేఱొక్క రుత్సుకమున
పౌరు లాకసమందునఁ బఱచినట్టి
గాలిపటములు నాకలోకంబునందు
పఱచినట్టి తివాచీలభంగి నలరె
చం.
చెలువగు వర్ణచూర్ణములు చేకొని చిత్రముగా సుమోత్కరం
బుల లతలం బ్రకీర్ణమగు ముగ్గులపందిరులన్ రచించి సొం
పలర నమర్చి గొబ్బిళుల నందున, వాని నలంకృతంబుగా
సలిపిరి స్త్రీలు పుష్పములఁ జందనకుంకుమకర్దమంబులన్
ఉ.
అంచితరీతి నాంధ్ర జలజాక్షులు చెక్కలు మెట్లుమెట్లుగా
సంచితముం బొనర్చి నవశాటుల వాటిని గప్పి నీటుగా,
ఉంచి రనేకవర్ణముల నొప్పెడు బొమ్మల వానిపైనిఁ, గా
వించిరి బొమ్మపెండిళులు వేడుక మీరఁగఁ జేరి పాడుచున్
సీ.
వైదేహి యొక్కచో వైవాహికం బాడె
రఘువంశరత్నమున్ రమణ మీర
వైదర్భి యొక్కచోఁ బాణిగ్రహం బాడె
యదుకులదీపకు న్ముదము గదుర
పాంచాలి యొక్కచోఁ బరిణయం బాడెను
పాండవమధ్యమున్ ప్రమద మొనర
పార్వతి యొక్కచో పాణౌకృతిం గూడె
ప్రమథాధినాథునిం బ్రణయ మలర
తే.
వధువుపక్షమువారొక వైపు గూడి
వరుని పక్షమువారితో వైభవముగ
పూర్తిసేయఁగఁ బెండ్లి ముహూర్తములను
ఎల్లయిండ్లను పెండ్లి పందిళ్ళె వెలసె
సీ.
శివధనుర్భంగంబు, సీతాస్వయంవరం
బులు దెల్పు పొల్పారు పుత్తళికలు1,
కలశాబ్ధిమథనంబు, గజరాజమోక్షణం
బులు కన్నులకు గట్టు పుత్తళికలు,
కాళియదమనంబు, కంసవిదారణం
బులు కన్నులను నిల్పు పుత్తళికలు,
కైలాసశైలంబు, కామారితాండవం
బులు కన్నులను దన్పు పుత్తళికలు,
తే.
అష్టదిగ్గజపరివేష్టితాంధ్రభోజ
భువనవిజయసభాలయపుత్తళికలు
తెలుఁగుపడఁతులు బొమ్మలకొలువులందు
ఇంపుగాఁ బేర్చి రుత్సాహ మిగురులొత్త
సీ.
కాషాయవర్ణంపు కఱకుపుట్టముతోడ
గట్టిన తలపాగఁ గట్టి తలకు
మల్లెపూరంగుతోఁ దెల్లనై మెఱసెడు
ముతకదోవతిఁ దనులతను బొదివి
కాఱుచీకటిఁ బోలు తారాడు చొక్కాను
చక్కగా నురమందు సవదరించి
ఎఱ్ఱగన్నెరుకాంతి నెసలారు కండువా
భుజమందుఁ బొందించి పొంకముగను
తే.
చేత సన్నాయి అవలగ్నసీమ డోలు
గ్రాల, పెట్టు దండము లయ్యగారి కనుచు
అమ్మగార్కిఁ జేయుము సలామనుచు నొకఁడు
ఎద్దు నాడించె ముంగిట ముద్దుగాను
ఉ.
తెల్లని నామ మందునను దీరిచి గుంకుమరేఖ మోములన్,
ఘల్లురు ఘల్లుఘల్లురను గజ్జెలపట్టెడ లంఘ్రులందు శో
భిల్ల, గళంబులం దులసిపేరులు గ్రాలఁగ, చిందుద్రొక్కుచున్
హల్లహలో ముకుందహరి యంచు నటించిరి జియ్యరయ్యలున్
ఉ.
ఫాలమునిండ మెండుగను భస్మపురేఖలు దీర్చి, నాభిపై
వ్రాలుచు వ్రేలు మేలిరుదురాకలమాలలు దాల్చి, జంగముల్
ఫాలవిలోచనా శివశివా హరశంకర యంచుఁ బాడుచున్
కాళులఁ జిందులేయుచును గన్పడి రత్తరి బిచ్చమెత్తుచున్
కం.
కన్నవి యీదృశ్యంబులు
చిన్నగ నేనున్నయపుడు చిత్తం బలరన్
అన్నియు మఱుఁగగుచుండెను
కన్నులముందే యిదేమి కాలం బకటా!
చం.
క్రమముగఁ బల్లెలందు మును గల్గిన సంస్కృతి మాయమయ్యె, పూ
ర్వమువలె తెన్గులోఁ బలుకువారలు మూర్ఖు లటన్నభావము
ల్దమమువలెం బ్రసారితములై చనె, ఆంధ్రత గాక యంధతే
సమకొనె నింక నెవ్వరికి సంక్రమణోత్సవముల్ రుచించెడిన్?

(1. పుత్తళికా అను సంస్కృతపదమునకు మట్టితోఁగాని, కట్టెతోఁ గాని, బట్టతోఁ గాని చేసిన బొమ్మ అని అర్థము.)