పని ఒత్తిడి

తనకు తెలిసిన విశ్వం దారుణంగా అంతం కాబోతోందని చెప్తున్నట్టుగా ఉబుకుతోంది అజీజ్ నుదుటిమీద నరం. అతనికి తెలిసిన విశ్వానికి అతనే కేంద్రం కాబట్టి ఆ క్షణంలో పరిస్థితులేవీ అతడికి అనుకూలంగా లేవు. తన మెడలో జీవం లేని పాములా వేలాడుతున్న వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌తో ‘అయామ్ ద బాస్! నేనే బాస్‌ని!’ అని బుస కొట్టాడు. “అంటే నువ్వు నేను చెప్పిన పని చేయాలి, ప్రశ్నలు వేయకూడదు. నీ పని మీద హక్కు నాదే. నేనే బాస్‌ని!” అన్నాడు. అజీజ్ నుంచి ఇలాంటి మాటలు వినడం కొత్తేం కాదు. ఎనిమిది నెలల క్రితం కార్నర్ ఆఫీస్ అతని సొంతమైనప్పటి నుంచి వారానికి రెండుసార్లు బుస కొట్టడం, అరవడం, ఈమెయిల్స్ చేయడం, ఒక్కోసారి, అతని నరాల గుండా మహత్వోన్మాదం ప్రవహిస్తున్నప్పుడు ‘నేనే బాస్‌ని’ అని అరవడం అలవాటు చేసుకున్నాడు.

ఊహించని ప్రమోషన్ రావడం వల్ల, అతని వార్డ్‌రోబ్‌లో పవర్ సూట్స్ సంఖ్య ఎన్ని రెట్లు పెరిగిందో అతని ప్రవర్తనని సహించే ఉద్యోగుల సంఖ్య అన్ని రెట్లుగానూ తగ్గింది. అతనికి ఆస్కాట్ టైస్, కఫ్ లింక్స్ పెరిగాయి కానీ ప్రజ్ఞావంతులైన ఆర్టిస్టులు, కాపీరైటర్లు తగ్గిపోయారు. అదొక మహా వలస, అంతకు మునుపు ఈ ఏజన్సీ ఎన్నడూ చూడలేదు. అయితే అజీజ్‌కి ఇవేం పట్టలేదు. తాను బాస్, నిజానికి అతను పట్టించుకున్నదల్లా ఇదే! క్రిందివాళ్ళు వస్తారు, పోతారు.

ఆలోచనల్లో ఉండి, చెవుల్లో ఇయర్‌ఫోన్స్‌తో ఉన్న అజీజ్ తన లాప్‌టాప్‌లో మునిగిపోయాడు. తాను సరిచేస్తున్న ప్రెజెంటేషన్‌ని అతని మేనేజర్ ‘బావుంది’ అన్నాడు. అంటే ఏ కారణం చేతైనా, ఏ రకంగానూ దాన్ని సరిజేయాల్సిన, దిద్దాల్సిన, మార్చాల్సిన అవసరం లేదన్న మాట! కానీ దానిలో తన ‘మైడస్ టచ్’ మిస్సయిందని అజీజ్ అభిప్రాయం! అందులో ఏదో ఒకటి మార్చి, దాని ఘనతని సొంతం చేసుకోవాలన్న బలీయమైన వాంఛ ప్రగాఢంగా ఉంది. రెండు వారాల పాటు శ్రమించి రూపొందించిన ఆ ప్రెజెంటేషన్‌లో పూర్తిగా లీనమయిపోయి, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రాయంలో వినిపించిన ఆ ప్రకటనని పూర్తిగా విస్మరించాడు.

‘ఢిల్లీకి వెళ్ళే ఫ్లయిట్‌లో ప్రయాణించవలసిన అజీజ్ దావర్‌కి ఇది చివరి బోర్డింగ్ కాల్. వెంటనే గేట్ నెంబర్ 3కి వెళ్ళాలి. ఐ రిపీట్… ప్రయాణీకుడు అజీజ్ దావర్‌కి ఇది చివరి బోర్డింగ్ కాల్. ధన్యవాదాలు’ అని ప్రకటన వినబడింది.

అజీజ్ తనని తాను తిట్టుకుని, లాప్‌టాప్‌ని మూసేశాడు. నెక్‌బ్యాండ్‌ని ఆఫ్ చేసి, దాన్ని బ్రీఫ్‌కేస్‌లోకి తోశాడు, ఐస్ మీద ప్లాటిపస్‌ జారినట్టుగా వేగంగా బోర్డింగ్ గేట్‌ల వైపు వెళ్ళాడు. బోర్డింగ్ పాస్ చూపించగానే సిబ్బంది లోపలికి అనుమతించారు. కొన్ని నిమిషాల తర్వాత అజీజ్ కొద్దిగా కిక్కిరిసిన విమానంలోకి చేరాడు. తన బ్రీఫ్‌కేస్‌ని ఓవర్‌హెడ్ బిన్‌లో ఉంచాలని ప్రయత్నించి, అది అప్పటికే పూర్తిగా నిండి వుండడంతో, ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. బ్రీఫ్‌కేస్‌ని తనకి ఎదురుగా ఉన్న సీట్ కింద పెట్టి చేతిలో లాప్‌టాప్‌తో అజీజ్ తన సీట్‌లో కూలబడి సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. వెంటనే మళ్ళీ ప్రెజంటేషన్ మీద పని చేయసాగాడు. పదకొండో స్లయిడ్ నుంచి మొదటికి వచ్చాడు.

దాని మీద ‘బ్రాండ్-ఎయిడ్: హెల్పింగ్ బ్రాండ్స్ క్లెయిమ్ దెయిర్ స్పేస్‘ అని ఉంది.

అజీజ్ తన కళ్ళను తిప్పాడు. మరింత మెరుగ్గా ఉండచ్చు అనుకున్నాడు. దాన్ని డిలీట్ చేసి తన హెడింగ్‌ని టైప్ చేశాడు.

షూటింగ్ బ్రాండ్స్ ఇన్‌టూ స్పేస్.

కొన్ని క్షణాల ఆలోచన తర్వాత, ఒక సబ్‌హెడింగ్ జోడించాడు: ‘యాడింగ్ స్పార్కల్ టు ది బ్రాండింగ్ స్కైస్‘. తన మేధకి సంతృప్తి చెంది, సీట్‌లో వెనకకు వాలి చిన్నగా నవ్వుకున్నాడు. అతని నుదుటిలోని నరం ఎట్టకేలకు విశ్రాంతి పొందింది, తాత్కాలికంగా కనిపించకుండా పోయింది, అతని భృకుటిలోకి ముడుచుకుంది.

అజీజ్ అడ్వర్టయిజ్‌మెంట్ రంగంలో పనిచేస్తాడు. అతను రెండు దశాబ్దాల క్రితం తన కెరీర్ ప్రారంభించాడు, కాలేజ్ చదువయ్యాక, మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ నుంచి ఎం.బి.ఎ. చేశాడు. ఈ సంగతిని అవకాశం వచ్చినప్పుడల్లా అందరికీ చాటుకునేవాడు. (‘నేను మాంచెస్టర్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు…’ అతని ప్రతీ సంభాషణా ఈ వాక్యంతో ప్రారంభమయ్యేది.) కొల్‌కతాలోని ఓ చిన్న ఏజన్సీలో క్లయింట్ సర్వీసింగ్ అసోసియేట్‌గా కెరీర్ ప్రారంభించాడు. జారుడుమెట్ల రంగంలో ఇప్పుడున్న అధికారానికి రావడానికి కష్టపడ్డాడు. ఇప్పుడతను దేశవ్యాప్తంగా శాఖలున్న మెక్‌గీ యెల్లో బెర్రీ అనే ఏజన్సీకి ప్రిన్సిపల్ కన్సల్టెంట్.

అజీజ్ బెంగళూరు శాఖ కార్యకలాపాలకి అధిపతి. అతను బాధ్యతలు బిజినెస్ డెవలప్‌మెంట్, రెవెన్యూ గ్రోత్‌. కానీ, తరచూ క్రియేటివ్ డిపార్ట్‌మెంట్ వ్యవహారాలలో తలదూరుస్తుంటాడు అతను ఆ విభాగానికి సంబంధించకపోయినా. ఆ విభాగంలోని సిబ్బందిని విసిగించడమే కాదు, నోటికొచ్చినట్టు ఆర్డర్లు పాస్ చేస్తుంటాడు అవి ఎంత అర్థం లేనివయినా సరే.

ఇంకేం చెప్పక్కర్లేదు… క్రియేటివ్ టాలెంట్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ తుపాకీలోని బుల్లెట్ల కంటే వేగంగా బెంగళూరు యెల్లో బెర్రీని వదిలిపెట్టారు. అంతేకాదు, సంస్థలోని ఓ మాజీ కాపీరైటర్–తమకి అలవాటైన రీతిలో హేళనగా ఓ టాగ్‌లైన్ కూడా రూపొందించాడు: ‘అజీజ్, ది ఫన్ వాక్యూమ్–ఇట్ సక్స్ ది ఫన్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్!’ అంటూ.

అయితే ఇలాంటి టాలెంట్ కంపెనీని విడిచిపెట్టినందుకు అజీజ్ ఎంతో సంతోషించాడు. తను ఒక్కడే ఉన్నప్పుడు, అర్ధరాత్రిళ్ళు జిన్ తాగుతూ ‘దండగ మనుషులు’ అని అనుకునేవాడు వాళ్ళ గురించి. అతనికి సంబంధించినంతవరకూ ఏజన్సీ బెస్ట్ కాపీరైటర్, ఆపరేషన్స్ మాన్, ఆర్ట్ డైరక్టర్ అన్నీ తనే! ఫిల్టర్ కనుక అతనికి ఇష్టమయి ఉంటే, బహుశా ఓ ఉత్తమమైన కాఫీ బోయ్ అయ్యుండేవాడు.

“తాగడానికేమయినా కావాలా సార్? కాఫీ, టీ, జ్యూస్?”

“వద్దు, థాంక్స్” అన్నాడు అజీజ్ హోస్టెస్ కేసి చూడకుండానే.

“ఆమె నన్ను అడుగుతున్నట్లుంది…” అన్నాడు పక్క సీట్లో కూర్చున్నతను.

విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత మొదటిసారిగా, అజీజ్ తన తోటి ప్రయాణీకుడికేసి చూశాడు.

అతను కూర్చుని ఉన్నా చాలా పొడుగ్గా ఉన్నాడు. నున్నగా గడ్డం చేసుకుని ఉన్నాడు, అతని దవడ ఎముక కోసుగా గాజును సైతం కోసేట్టుగా ఉంది. అతని నల్లటిజుట్టులో అక్కడక్కడా ఉన్న తెల్లటిపాయలు అతన్ని విభిన్నంగా కనపడేలా చేస్తున్నాయి. ప్లెయిన్ షర్ట్, బ్రాండ్ పేరు కానీ బొమ్మ కానీ ఎక్కడా కనపడనిది, ఇన్‌షర్ట్ చేసుకున్నాడు. భుజాలు చదరంగా ఉన్నాయి, పొట్ట సీట్ బెల్ట్‌ని దాటిపోయి రావడం లేదు. అతను చాలా ఫిట్‌గా ఉన్నాడని అజీజ్ గ్రహించాడు. అయిష్టంగానే, తన జిమ్ మెంబర్‌షిప్ రెన్యూ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

అతను హోస్టెస్ కేసి చిరునవ్వుతో చూసి, తనకి కాఫీ కావాలని చెప్పి, అజీజ్ కేసి తిరిగాడు.

“ఆమె నన్ను అడుగుతోంది,” అన్నాడు ప్రశాంతంగా. “ఇప్పుడు మీకేం కావాలో మీరు ఆమెకి చెప్పొచ్చు.”

అజీజ్ అసౌకర్యంగా కదిలాడు. “నేను గమనించలేదు. నాకేం అవసరం లేదు. ధన్యవాదాలు” అన్నాడు హోస్టెస్‌తో. వృత్తిధర్మంగా ఆమె నవ్వి వెళ్ళిపోయింది.

“నేను కాస్త పనిలో ఉన్నాను” అన్నాడు అజీజ్ అతనితో కొద్దిగా అపరాధభావంతో.

“నేను గమనించాను” అన్నాడతను లాప్‌టాప్ కేసి చూస్తూ. “మీది బిజినెస్ ట్రిప్పా లేక ప్లెజర్ ట్రిప్పా అని అడుగుదామనుకున్నాను. కానీ ఆ ప్రశ్న అనవసరం అని అర్థమయింది. ఈ గ్రాఫ్‌లు, ఛార్ట్‌లు, గ్రాఫిక్స్… ఇవి చూస్తే తెలిసిపోతోంది, ప్లెజర్ ట్రిప్ అని!” అన్నాడు.

అజీజ్ నవ్వేడు. “మధ్యాహ్నం పనులన్నీ సక్రమంగా జరగడంపైన ఆధారపడి ఉంటుంది…” అని చెప్పి, “నా పేరు అజీజ్” అన్నాడు.

“ప్రకాశ్”

ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.

“మీది బెంగళూరు కాదనుకుంటా,” అన్నాడు ప్రకాశ్. అది ప్రశ్న కాదు.

“అంత స్పష్టంగా తెలుస్తోందా?” అడిగాడు అజీజ్.

ప్రకాశ్ భుజాలెగరేశాడు. “అంతగా తెలియదు. కానీ ఓవర్‌హెడ్‌ బిన్‌లో మీ బ్యాగ్ పట్టనప్పుడు మీరు వాడిన తిట్లని బట్టి మీరు ఢిల్లీవాళ్ళని అనుకున్నాను.”

అజీజ్ కొంచెం కూడా సిగ్గు పడినట్టు అనిపించలేదు. “ఒక్కోసారి తప్పవు” అన్నాడు.

“సరే, ఈ గ్రాఫ్‌లు, ఛార్ట్‌లు దేనికోసం?” కాఫీ గుటకలు వేస్తూ అడిగాడు ప్రకాశ్.

“మధ్యాహ్నం ఒక ప్రెజంటేషన్ ఉంది,” అజీజ్ చెప్పాడు. “బ్రాండ్ ఓనర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఇంకా అలాంటివారితో సమావేశం! వాళ్ళ పూర్తి సామర్థ్యం మేరకు ఎలా ఎదగవచ్చో లాంటి విషయాలు మాట్లాడాలి. మీకు అర్థమైందా?”

“అర్థం కాలేదనుకుంటా…” అన్నాడు ప్రకాశ్. “అసలు మీరేం చేస్తారు?”

“నేను యాడ్ మాన్‌ని. అంటే అడ్వర్టైజింగ్ ఏజన్సీ! నేను యల్లో బెర్రీ అనే యాడ్ ఏజన్సీలో పనిచేస్తాను,”

“ఓహ్, ఇంటరెస్టింగ్!”

“అవును, కొన్నిసార్లు!”

“మరి అయితే, ఎప్పుడు ఆసక్తిగా ఉండదు?”

“మనల్ని చీల్చి, ముక్కలుగా చేసే వైఖరి దీనిది,”

“అబ్బా! ఆఁ!”

“ఓహ్, మీకు తెలియదు. అది ఓ నరకం!”

ప్రకాశ్ వదనంలో చిన్న వినోదపు ఛాయ కనిపించింది. “ఇంకా చెప్పండి” అన్నాడు.

“ఉంటారు కొంతమంది క్లయింట్లు…” అన్నాడు అజీజ్. ఆఖరి పదం అంటున్నప్పుడు అదేదో అశుద్ధంలా పలికాడు. “సులువుగా చెప్పాలంటే, వాళ్ళని భరించలేం”

“మెప్పించడం కష్టమా?”

“వాళ్ళకి ఏదీ సరైనది కాదు,” అన్నాడు అజీజ్. “ప్రతీ ప్రకటనలోనూ వాళ్ళకి ఏదో ఒక తప్పు కనిపిస్తుంది. లోగో సరైన స్థలంలో లేదనో కాదంటే హెడ్‌లైన్ బాలేదనో! కాకపోతే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ బాలేదంటారు. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ గురించి కాకపోతే, ఫాంట్ బాలేదంటారు,”

“అయ్యో, అంటే మీ సిబ్బందికి కూడా ఇబ్బందే,”

“మా సిబ్బంది బుర్రలున్న మనుషులయితే కదా!”

“మీరు మరీను! మరీ అంత దద్దమ్మలయి ఉండరు,”

“వాళ్ళ పని కూడా నేనే చేయాలి, తెలుసా?” అన్నాడు అజీజ్ తల అడ్డంగా తిప్పుతూ.

“మీరు చెయ్యాలా?” ప్రకాశ్ అన్నాడు నవ్వుతూ, ఖాళీ కప్పు కింద పెట్టేసి.

అజీజ్ నిట్టూర్చాడు. అతనికి నిట్టూర్చడం ఇష్టం. అతనికి ఇష్టమైన చర్యలో అది ఒకటి.

“నిజంగా! నేనే చేస్తాను. హెడ్ లైన్‌ రీ-రైట్ చేస్తాను, ఆర్టిస్టులతో కూర్చుని, స్కెచెస్ వేయిస్తాను. రోజూవారీ కార్యకలాపాలు నియంత్రిస్తాను. ఇదంతా చెత్తాచెదారం. మా కాపీ రైటర్ కోసం రాసిన స్క్రిప్ట్‌లకి డబ్బులిచ్చేట్టయితే నాకు…”

ఆలోచిస్తున్నట్టుగా తల ఊపాడు ప్రకాశ్. “బహుశా మీరు క్రియేటివ్ టీమ్‌ని నడుపుతున్నారేమో? మీరు క్రియేటివ్ మేనేజరా?” అడిగాడు.

“నిజానికి నేను బెంగళూరు బ్రాంచ్ హెడ్‌ని,” జవాబిచ్చాడు అజీజ్. అయితే తన స్వరంలో ఎక్కడా సంతోషం దొర్లకుండా జాగ్రత్త వహించాడు. ఇందుకు చాలా కష్టపడవలసి వచ్చింది. వినయం అతడికి అలవాటు లేదు. “మాకో క్రియేటివ్ డైరక్టర్ ఉన్నాడు, కాని పేరుకే. కథంతా నడిపేది నేనే,”

“అలాగా, అంటే ఇదీ మేనేజింగ్ డైరక్టర్ బాధ్యతలూ ఒకటేనా?” ప్రకాశ్ అడిగాడు.

“దాదాపుగా…”

“అంటే మీరు క్రియేటివ్ వర్క్‌ కూడా చూసుకోవాలన్న మాట?” అడిగాడు ప్రకాశ్, భృకుటి చిన్నగా ముడిపడుతుండగా. “ఒక మనిషికి చాలా ఎక్కువ పనులు. అర్థమవుతోంది… ఏమైనా అనుకోవడం కూడా వృథా”

“నాకు తప్పదు,” అన్నాడు అజీజ్ తీవ్రంగా. “వాళ్ళంతా అసమర్థులు. అందరూ!”

“అందరూనా?”

“అందరూ”

ప్రకాశ్ ‘హుఁ’ అని కాసేపు మౌనంగా ఉండిపోయాడు. మళ్ళీ హోస్టెస్ వచ్చింది, అతను ముందే ఆర్డర్ చేసిన శాండ్‌విచ్ అందించింది. కొంత తిని మళ్ళీ అజీజ్ కేసి తిరిగాడు.

“అయితే మీదంతా ‘వన్-మ్యాన్ షో’ అన్నమాట!” అన్నాడు.

“సరిగ్గా చెప్పారు ప్రకాశ్,” అన్నాడు అజీజ్ ఉత్సాహంగా, ముందున్న ఫుడ్ ట్రే మీద చేత్తో తాటిస్తూ. “నాకు పనంటే ఇష్టం. తప్పుగా అనుకోకండి. కానీ నాతో సమానంగా జనాలు కూడా పనిచేయగలిగితే, ఇంకా బావుంటుంది కద!.”

“అవునవును” అన్నాడు ప్రకాశ్, శాండ్‌విచ్ నములుతూ. “బాగా ఒత్తిడి ఉండేలా ఉంది.”

“అవును. నేనెప్పుడూ పని ఒత్తిడిలోనే ఉంటాను. ఈ జాబ్‌లో బాగా స్ట్రెస్. చాలామంది దీనిని భరించలేరు.”

“పాపం” నిట్టూర్చాడు ప్రకాశ్.

అజీజ్ లాప్‌టాప్‌ని కాసేపు టకటకాలాడించి తర్వాత దాన్ని ఆపేశాడు. లాప్‌టాప్‌ని పక్కకి పెడుతూ, “ఇదంతా టైమర్ పెట్టిన బాంబ్‌లా ఉంటుంది, తెలుసా?” అన్నాడు అజీజ్. “ప్రతీదీ అస్తవ్యస్తమే. ఉన్నట్టుండి ఆర్టిస్ట్‌కి మూడ్ పోతుంది, రైటర్‌కేమో అక్షరాలే గుర్తురావు. నేనెంతో డామేజ్ కంట్రోల్ చేయాలి. అవుట్‌పుట్ ఇచ్చేవరకు క్లయింట్ ఫోన్ చేస్తూనే ఉంటాడు. నాకివ్వడానికి టైమర్‌లో కొన్ని సెకండ్లు కూడా ఉండవు. గ్రహించేసరికే ఢాం!” చెప్పాడు అజీజ్.

“ఢాం,” తిరిగి అన్నాడు ప్రకాశ్, తలాడిస్తూ. “తెలుస్తోంది, కొంత వెర్రిలా ఉంది. అడ్వర్టయిజ్‌మెంట్ ఫీల్డ్ ఇలా ఉంటుందనుకోలేదు.”

“ఊహించలేనంత స్ట్రెస్! నమ్మండి” చెప్పాడు అజీజ్ అతిశయోక్తిగా.

కాసేపు వాళ్ళమధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. విమానం ప్రయాణం కొనసాగించింది. కొద్దిగా కిందకి, ఆపై మరింతగా క్రిందకి దిగి న్యూ ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. సంకేతం రాగానే అందరూ లేచి నిలబడి లగేజ్ అందుకోడానికి సన్నద్ధమవసాగారు.

లగేజ్ కంపార్ట్‌మెంట్ నుంచి తన బ్యాగ్ తీసుకుని, “మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీలో ఎక్కడా?” అని అడిగాడు.

“నేను మా ఏజన్సీ ఢిల్లీ ఆఫీస్‌కి వెళ్ళాలి… ఝండేవాలా దగ్గర.”

“నేనూ అటువైపే వెళ్ళాలి. క్యాబ్ షేర్ చేసుకుందామా?” అడిగాడు ప్రకాశ్.

“సూపర్! నన్ను కాస్త…” అంటు సీట్ కింద నుంచి తన బ్రీఫ్‌కేస్ తీశాడు. “పదండి”

క్యాబ్ కోసం ఎదురు చూస్తూండగా, న్యూ ఢిల్లీ ఎండ ఉక్కపోతని కలిగించసాగింది. తన టై తో నుదురు తుడుచుకోవాలనుకున్నాడు అజీజ్, కానీ అది చాలా ఖరీదైనదని గుర్తొచ్చి ఆగిపోయాడు. అయితే, అజీజ్ తనలో తాను కూడా ఓ విషయం అంగీకరించలేదు- మండు వేసవిలో సూట్ ధరించడం మూర్ఖత్వమేనని! వాళ్ళెక్కిన సెడాన్ కదిలి, చల్లటి ఎసి గాలి కారంతా వ్యాపించగానే భారీ యాడ్ మాన్ కుదుటపడ్డాడు.

కారు ట్రాఫిక్‌లో నడుస్తుండగా వాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. అజీజ్ మాట్లాడుతున్నాడు, ప్రకాశ్ తలాడిస్తున్నాడు. అడ్వర్టయిజింగ్ లోని లోటుపాట్లన్నీ వివరిస్తూ, ఒత్తిడి తట్టుకోలేక మానేద్దామనుకున్నానని, కానీ ఈ రంగం అంటే ఉన్న ఇష్టంకొద్దీ మానుకోలేకపోతున్నానని, ఇప్పుడొదిలేస్తే సిగ్గుచేటని అన్నాడు అజీజ్. పైగా అలా చేస్తే ఇన్నాళ్ళు క్రియేటివ్ టీమ్‌తో చేసిన పోరాటాలేమయిపోతాయి? అన్నాడు. చూడచక్కగా అనిపిస్తున్న ఓ హోటల్ ముందు ఆపమని ప్రకాశ్ చెప్పేవరకూ అలా మాట్లాడుతూనే ఉన్నాడు అజీజ్.

ప్రకాశ్ అజీజ్ వైపు తిరిగి, “నేను ఇక్కడే దిగాలి” చెప్పాడు చిరునవ్వుతో. “మిమ్మల్ని కలవడం బావుంది, అజీజ్. మీ ప్రెజంటేషన్‌కి బెస్టాఫ్ లక్. అడ్వర్టయిజింగ్ రంగంలో లేనందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. అమ్మో అదెలా ఉందంటే…” అంటూ ఆపాడు.

“నరాలు చిట్లిపోతాయి కదూ!” అంటూ నవ్వాడు అజీజ్. ప్రకాశ్ దిగుతుండగా, “ఆఁ, అన్నట్టు నేను అడగలేదు, సారీ. మీరేం చేస్తుంటారు?” అని ప్రశ్నించాడు.

పొడుగ్గా, నున్నటి గడ్డంతో, ఫిట్‌గా ఉన్న ప్రకాశ్ చిన్నగా నవ్వాడు.

“నేను బాంబ్ డిస్పోజల్ టెక్నీషియన్‌గా పని చేశాను.”

(ఆంగ్లమూలం: Under Pressure)

కొల్లూరి సోమ శంకర్

రచయిత కొల్లూరి సోమ శంకర్ గురించి: కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు. ...