భరోసా

ఉదయాన్నే సూరీడు
వాకిట్లో ఇన్ని కిరణాలు రాల్చుకున్నాడు
కట్టగట్టి, మోపుజేసి
పొయ్యిలో పెడితే
ఆకలి తీరింది

మిట్టమధ్యాహ్నం
అన్ని కిరణాలు పోగుచేసుకుని
జమ్మిచెట్టు మీద పెట్టుకున్నా
ఎవడైనా
నా జోలికొస్తే
అస్త్ర శస్త్రాలు సిద్ధం

సాయంత్రం
కొన్ని కిరణాలు
మూటకట్టి లోపలేశా
ఇక
రాత్రికి దిగులు లేదు, దుఃఖమూ లేదు


సుంకర గోపాలయ్య

రచయిత సుంకర గోపాలయ్య గురించి:

సుంకర గోపాలయ్య గత 15 సంవత్సరాలనుంచీ కవిత్వం రాస్తున్నారు. ‘మా నాయన పాట’ పేరుతో కవితాసంకలనం వెలువరించారు. ఇది రెండు ముద్రణలు పొందింది. ‘రొట్టమాకురేవు’ అవార్డు, కవి సంధ్య, పురస్కారం పెన్నా పురస్కారం, ఇలా ప్రస్తుతానికి 12 పురస్కారాలు వచ్చాయి. అన్ని పత్రికలలోనూ సాహిత్య విమర్శా వ్యాసాలు వచ్చాయి. ‘కవి సంగమం’లో కవిత్వకాంతి శీర్షికతో వ్యాసాలు రాస్తున్నారు.

 ...