బి.యస్సీ రెండవ యేడాది వరకూ కాకినాడలో తెలుగు మీడియంలో చదివాను.
ఆ తరువాత హైదరాబాద్‌లో ఇంగ్లీషు మీడియంలో చదవాల్సి వచ్చింది.
యూనివర్సిటీ మార్పు అనేది కొత్తగా, ఆ రోజుల్లో అనుభవంలోకి వచ్చింది. దాని వల్ల పడ్డ కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు.
బితుకు, బితుకుమంటూ ఆ రోజు ఫీజు కట్టి, కెమిస్ట్రీ థీరీ క్లాసులోకి అడుగుపెట్టాను. క్లాసులో కూర్చున్నానన్న మాటే గానీ లెక్చరరు చెప్పింది ఒక్క ముక్క కూడా బుర్రలోకి ఎక్కలేదు. అంతా కంగారు, కంగారుగా వుంది. క్లాసులో వన్నీ కొత్త మొహాలు.
క్లాసు అయిపోగానే ఒకబ్బాయి వచ్చి ఇంగ్లీషులో పలకరించాడు. కాస్త తడుముకుంటూ ఇంగ్లీషులో జవాబిచ్చాను. అతనికి నా బాధ అర్థమై పోయి వెంటనే తెలుగులోకి దిగిపోయాడు. ప్రాణం లేచి వచ్చింది. అలా తనని పరిచయం చేసుకుని, కావల్సిన సహాయం, అంటే క్లాసు షెడ్యూలు చెప్పడం, టెక్స్ట్ బుక్కుల పేర్లు చెప్పడం, రాసుకున్న నోట్సులు ఇవ్వడం లాంటివి చేసి, జీవితమంతా ఫ్రెండుగా వుండిపోయాడు రామకృష్ణ పరమహంస. సీఆర్పీ అని పొడి అక్షరాలతో పిలిచేవాళ్ళం వాడిని మా చిన్న ఫ్రెండ్ సర్కిల్లో. వాడితో పాటు వాడి ఫ్రెండు నరసింహారావుని కూడా పరిచయం చేశాడు. వాడిని నరసిమ్మా అని పిలిచేవాళ్ళం. నరసిమ్మ మా ఇంటికి దగ్గరే వుండేవాడు. నరసిమ్మ సీఆర్పీని హంసా అనీ, రాయంచా అనీ ముద్దుగా పిలిచేవాడు.
జీవితంలో బస్‌పాస్ తీసుకోవడం మొదటిసారి. న్యూనల్లకుంట రామాలయం దగ్గరనుంచీ, నారాయణగుడా శాంతీ థియేటర్ దగ్గరకి వెళ్ళాలి. నరసిమ్మా, నేనూ కలిసి బస్‌లో కాలేజీకి వెళ్ళి వచ్చేవాళ్ళం.
ఇంటికంతకీ అక్క సంపాదనే ఆధారం. అక్క ఓ గవర్నమెంట్ ఆఫీసులో ఎల్డీసీగా పని చేసేది. ఒక గదీ, చిన్న వంటిల్లూ వున్న వాటాకి అద్దె కట్టుకుంటూ అమ్మా, నాన్నా, అక్కా, నేనూ వుండేవాళ్ళం. ఆ రోజుల్లో నలుగురికీ ఒక్క గదీ ఇరుకుగానే వుండేది కాదు. ఈ రోజు నలుగురు మనుషులకీ నాలుగు గదులూ, లివింగు రూమూ, ఫామిలీ రూమూ కూడా ఇరుగ్గా అనిపిస్తాయి. ఇరుకుతనమంతా మనసులోనే వుంటుందనుకుంటా!
నాన్నకి వేరే సంపాదన లేదు ఆ రోజుల్లో. అక్క సంపాదన మీదే నలుగురి పొట్టలూ నిండాలీ, నా చదువూ జరగాలి. కాస్త కష్టంగానే వుండేది.
“నాలా గుమాస్తావి కాకూడదు నువ్వు. బాగా చదువుకో. ఎలాగైనా నిన్ను చదివిస్తాను” అని అక్క అంటూ వుండేది.
అందుకని ఒక నెల మాత్రం బస్‌లో వెళ్ళి, దారులూ, కాలేజీ అలవాటయ్యాక బస్ మానేసాను.
అక్క రెండో నెల బస్‌పాస్‌కి డబ్బులివ్వబోతే వద్దనేసాను. రోజూ కాలేజీకి రానూ, పోనూ ఆరు మైళ్ళూ నడిచే వెళతానని చెప్పాను. అక్క అదోలా చూసి వూరుకుంది. అమ్మా, నాన్నా అసలేమీ అనలేదు.
ఆ రోజు నరసిమ్మని బస్‌స్టాప్‌లో వదిలి, నేను వెళ్తానని చెప్పి కాలేజీకి నడవడం మొదలుపెట్టాను.
“ఏం రా? ఎందుకు నడిచి వెళ్తున్నావు?” అర్థం కాక అడిగాడు నరసిమ్మ.
అరమరికలు తెలియని స్నేహం మాది.
“మా అక్కకి భారంగా వుండటం ఇష్టం లేదురా. ఇకనించీ నేను నడిచే కాలేజీకి వెళ్తాను” చెప్పాను నవ్వుతూనే.
తన మనసులో ఏమనుకున్నాడో తెలియదు కానీ, ఆ రెండేళ్ళూ నరసిమ్మ కూడా నాతోబాటు నడిచాడు. చింతలతోపులోంచి నడిచి వెళుతూ, శ్రీశ్రీ గురించీ, విశ్వనాథ గురించీ వూరికే వాదించుకునే వాళ్ళం. చదివింది తక్కువే అయినా నేను శ్రీశ్రీ పక్షం, వాడు విశ్వనాథ పక్షం. తెలిసీ, తెలియని అమాయకత్వంతో అన్నీ తెలిసినట్టే వాదించుకుంటూ నడిస్తే కష్టం తెలిసేది కాదు.
రోజులు చక్కగా గడుస్తున్నాయనుకుంటే వచ్చి పడింది అసలు ఇబ్బంది.
మొదటి నెలంతా ఇనార్గానిక్ కెమిస్ట్రీ లేబ్ మొదలు పెట్టలేదు. రెండో నెల్లో మొదలుపెట్టారు. ఆ రోజు మా బేచ్‌కి లేబ్. నరసిమ్మా, నేనూ ఒకే బేచ్.
లేబ్లో అడుగు పెట్టగానే లేబ్ లెక్చరర్ ఆపారు.
అర్థం కానట్టు చూశాను.
“నువ్విలా లేబ్లోకి రాకూడదు” అన్నారు లేబ్ లెక్చరర్ సీరియస్‌గా.
“ఏమయ్యింది? నేనేం తప్పు చేశాను?” తెల్లబోతూ అడిగాను.
“చెప్పుల్లేకుండా కెమిస్ట్రీ లేబ్లోకి రాకూడదని తెలియదూ? నేల మీద ఆసిడ్ చింది వుండచ్చు. అప్పుడప్పుడు టెస్ట్ట్యూబ్లూ, బీకర్లూ పగిలి చిన్న, చిన్న గాజు ముక్కలు పడి వుండచ్చు. బేర్ఫుట్గా కెమిస్ట్రీ లేబ్లోకి రావడం మంచిది కాదు. వెళ్ళి చెప్పులన్నా, షూస్ అన్నా వేసుకుని రా” సీరియస్‌గా చెప్పారు లేబ్ లెక్చరర్.
నాకు గత రెండేళ్ళుగా చెప్పులు లేవు. ఏదో కిందా, మీదా పడి నన్ను చదివిస్తోంది మా అక్క. దానికి తోడు చెప్పులూ, బూట్లూ అంటే ఎక్కడ నించి తెచ్చేది?
బి.యస్సీ ఫస్టియర్ కాకినాడలో చదివినప్పుడు ఫిజిక్స్ మెయిన్ వాళ్ళకి కెమిస్ట్రీ లేబ్ క్లాసులు ఫస్టియర్‌లో జరగలేదు. వచ్చే యేడాది కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ చేసుకుందాం అని కెమిస్ట్రీ లెక్చరర్ వూరడించే వారు. ఎందుకంటే ఫస్టియర్ చివర్లో లాంగ్వేజెస్‌కి మాత్రమే పరీక్షలుండేవి. గ్రూపు రెండేళ్ళకీ కలిసి సెకండియర్ చివర్లో పరీక్షలుండేవి. ఫిజిక్స్ లేబ్ లెక్చరర్ నేనెలా లేబ్కి వచ్చానూ అన్న సంగతీ ఏనాడు పట్టించుకోలేదు.
హైదరాబాద్ సిస్టమ్ అంతా వేరు అప్పుడు. రెండేళ్ళకీ కలిపి లాంగ్వేజెస్ పరీక్షలు రెండో యేడు చివరా, మూడేళ్ళ గ్రూపుకంతా మూడో యేడు చివరా పరీక్షలు. లేబ్లు మాత్రం ప్రతీ యేడాదీ వుండేవి రెగ్యులర్‌గా కాలేజీలో.
నాకేం చెప్పాలో తోచలేదు. మౌనంగా వుండిపోయాను.
కెమిస్ట్రీ లేబ్ లెక్చరర్ క్లాసు మొదలు పెట్టాలనే తొందరలో వున్నారు.
“వెళ్ళవేం? వెళ్ళి తొందరగా చెప్పులు వేసుకుని రా. క్లాసు మొదలు పెట్టాలి” అన్నారు లేబ్ లెక్చరర్.
మళ్ళీ మాట్లాడకుండా పెదవి కొరుక్కుంటూ, బుర్ర వంచుకుని నిలబడ్డాను.
ఆ కెమిస్ట్రీ లేబ్ లెక్చరర్‌కి ఇంకేం అనాలో తోచలేదు. ఒక పక్క ట్ైం అయిపోతోంది ఆయనకి.
“సరే! సరే! లోపలకి వెళ్ళు. ఈసారికి రానిస్తున్నాను. ఇంకెప్పుడన్నా చెప్పులు లేకుండా కెమిస్ట్రీ లేబ్కి వస్తే నిన్ను ఎలౌవ్ చెయ్యను” అని వార్నింగ్ ఇచ్చారు.
బతుకు జీవుడా అని లోపలకి నడిచాను. నరసిమ్మ సానుభూతిగా నా మొహంలోకి చూశాడు. ఆ సానుభూతిని భరించలేని నేను కోపంగా, సూటిగా నరసిమ్మ మొహంలోకి చూశాను. నా భావం అర్థమై మన్నింపుగా చూసి, బుర్ర తిప్పుకున్నాడు నరసిమ్మ.
నా పేదరికం నాకెప్పుడూ అవమానంగా అనిపించేది కాదు. అన్నింటికీ ధైర్యంగా ముందరకి సాగటం నేర్చుకున్నాను. చెప్పులే కావు, పుస్తకాలు కూడా వుండేవి కావు నాకు.
సీఆర్పీ ద్వారా రామన్నా, లక్ష్మణ్ణా అనే ఇద్దరు కవలల పరిచయం అయింది. వాళ్ళు కూడా బి.యస్సీ సెకండియరే, గానీ వేరే కాలేజీలో. రామన్నది ఇంగ్లీషు మీడియం, లక్ష్మణ్ణది తెలుగు మీడియం. ఇద్దరూ ఎంతో స్నేహంగా, ఎప్పుడూ జోకులేస్తూ, బాగా పాటలు పాడుతూ వుండేవాళ్ళు. వాళ్ళ పుణ్యమా అని పుస్తకాలు కొనే బాధ తప్పి, వాళ్ళ పుస్తకాలు చదువుకుంటూ వుండేవాడిని. బి.యస్సీ ఫస్టియర్ వరకూ తెలుగు మీడియం కావడం వల్ల, లక్ష్మణ్ణని పీడించి అతని పుస్తకాలు కూడా చదివేస్తూ వుండే వాడిని. కొన్నాళ్ళకి ఆ కవలల్లో ఎవరు ఎవరో గుర్తు పట్టడం కూడా నేర్చుకున్నాను. పుస్తకాలు చదువుకోవడానికి ఇస్తున్నారు కదా అని, చెప్పులు కూడా ఇమ్మని వాళ్ళనెక్కడ అడిగేది?
ఆ రోజు ఇంటికి వచ్చాక ఆ విషయం అక్కకి గానీ, అమ్మకి గానీ చెప్పలేదు. అక్కకి చెప్తే ఎలాగో అలాగ చెప్పులు కొనిస్తుందని నా భయం. ఎంత వీలయితే అంత భారం అక్కకి తగ్గించాలని ఒకటే తాపత్రయంగా వుండేది. అక్క ఆఫీసు నించి తీసుకొచ్చిన వన్‌సైడ్ కాగితాల మీద నోట్సు రాసుకునే వాడిని. లైబ్రరీ, రామన్నా, లక్ష్మణ్ణా, సీఆర్పీ, నరసిమ్మల పుణ్యమా అని పుస్తకాల కష్టం తీరేది. నెలలో కాలేజీ ఫీజు తప్ప ఒక పది పైసలు కూడా ఖర్చు చేయకుండా బతికేవాడిని. రావాల్సిన స్కాలర్షిప్ గవర్నమెంటూ, కాకినాడ కాలేజీ వాళ్ళా పుణ్యమా అని రెండేళ్ళు లేట్ అయింది. ఆ తర్వాత కూడా ఎమర్జన్సీ “మహత్యం” వల్ల మూడేళ్ళ స్కాలర్‌షిప్పులూ మూడో యేడు వచ్చాయి.
గిర్రున వారం తిరిగి మళ్ళీ కెమిస్ట్రీ లేబ్ రోజు వచ్చేసింది.
ఆ రోజు కాలేజీలో సీఆర్పీ అన్నాడు వీలయినంత సున్నితంగా.
“నువ్వేమీ అనుకోనంటే ఒక విషయం చెబుదామనుకుంటున్నాను”
“నువ్వేం చెబుదామనుకుంటున్నావో నాకు తెలుసు. నరసిమ్మ నీకు కెమిస్ట్రీ లేబ్ సంగతీ, నా చెప్పుల సంగతీ చెప్పివుంటాడు. అదేనా?” అడిగాను డైరెక్టుగానే.
మా స్నేహితుల మధ్యలో వంకర టింకర మాటలు ఎప్పుడూ లేవు.
“అవును. అదే. ఏం? ఆ విషయం మాట్లాడకూడదా? మేం నీ స్నేహితులం కామా?” అడిగాడు సీరియస్‌గానే సీఆర్పీ.
నరసిమ్మ వైపు చూశాను. వాడు కూడా తలాడిస్తూ సీఆర్పీకి సపోర్టుగా వాడి పక్కనే నిలబడ్డాడు.
“సరే! చెప్పు. ఏం చెబుదామనుకుంటున్నావో” అన్నాను.
“నేను నీ బేచ్ కాదు కదా కెమిస్ట్రీ లేబ్లో. నువ్వు నా చెప్పులేసుకెళ్ళు లేబ్కి ఈ రోజు. నేను నీ లేబ్ అయ్యే వరకూ క్లాస్‌రూమ్‌లో కూర్చుని చదువుకుంటూ వుంటాను ఇంటికెళ్ళకుండా. లేబ్ లెక్చరర్ చేత మాటలనిపించుకోనక్కరలేదు” చెప్పాడు సానునయంగా సీఆర్పీ.
నాకు నిజంగా ఎంతో సంతోషం వేసింది వాళ్ళ స్నేహానికి.
ఏం చేసి వాళ్ళ స్నేహం రుణం తీర్చుకోగలను నేను, స్నేహితుడిలా జీవితాంతం వుండిపోవడం తప్పా!
“అది కాదురా! ఎన్ని వారాలని నువ్వు నాకోసం ఇలా కష్టపడతావు? యేడాదంతా కష్టపడతావా? పోనీ నువ్వు నిజంగా పడతానన్నా, యేడాది చివరన్నా నేను చెప్పులు కొనుక్కోగలననుకుంటున్నావా”? అడిగాను నవ్వుతూనే.
నా నవ్వు చూసి వాళ్ళకీ ధైర్యం వచ్చింది నేను కోపం తెచ్చుకోనని.
“మరేం చేద్దామనుకుంటున్నావురా? ఎలాగా?” నరసిమ్మ అడిగాడు స్నేహంగా.
“చూద్దాం. ఈ సమస్యని నేనే ఎలాగన్నా పరిష్కరించుకోవాలి. అదీ చూద్దాం. ఈ లేబ్ లెక్చరర్ లేని చెప్పులని నాతో ఎలా తొడిగించగలరో!” ధైర్యంగా అన్నాను.
లోపల బితుగ్గానే వుంది ఏం చెయ్యాలా అని. బయటకి మటుక్కి బోలెడంత ధైర్యం.
“మరి లేబ్లోకి రానివ్వకపోతే ఏం చేస్తావు?” ఆదుర్దాగా అడిగాడు సీఆర్పీ.
“ఏమోరా! ప్రస్తుతం ఏమీ ఆలోచించుకోలేదు” నిజాయితీగా చెప్పాను.
ఇంతలో లెక్చరర్ క్లాసులోకి రావడం, మేము మాటలాపేయడం జరిగాయి.
ఆ మధ్యాహ్నం మళ్ళీ కెమిస్ట్రీ లేబ్ దగ్గర మొదలయ్యింది నా అగ్ని పరీక్ష.
“కిందటి వారం చెప్పాను. మళ్ళీ చెప్పుల్లేకుండా వచ్చావు. చెప్తున్నది నీకెందుకు అర్థం కావట్లేదు?” కోపంగా అడిగారు లేబ్ లెక్చరర్.
నేనేమీ మాట్లాడలేదు. ఎప్పుడు లోపలకి వెళ్ళమంటారా అని ఎదురు చూస్తూ బుర్ర వంచుకుని నించున్నాను.
“నీకెమన్నా ఆక్సిడెంట్ అయితే నాకొస్తుంది చెడ్డ పేరు. నువ్వు లేబ్లోకెళ్ళడానికి వీల్లేదు” సీరియస్‌గా చెప్పారాయన.
నా సహనం చచ్చిపోయింది.
“ఏమిటి సార్ మీ వుద్దేశ్యం? నేను చెప్పులుండే వేసుకోకుండా పొగరుమోతు తనంగా లేబ్ కొస్తున్నాననుకుంటున్నారా? అలా వచ్చి మీ చేత తిట్లు తినడం నాకేమన్నా సరదా అనుకుంటున్నారా?” తలయెత్తి సీరియస్‌గా ఆయన మొహంలోకి చూస్తూ అడిగాను.
ఆయన తెల్లబోయారు. అటువంటి ప్రశ్న ఆయన ఎప్పుడూ వూహించలేదు. ఆయన మంచివారే. చక్కగా లేబ్ వర్క్ నేర్పిస్తారు. స్టూడెంట్స్‌తో సరదాగా వుంటారు. నేను చెప్పులేసుకోలేదన్న విషయం తప్ప ఏమీ ఆలోచించలేదు ఆయన.
నిండా మునిగిన నాకు ఇంక చలి అనిపించలేదు.
“నిజంగా చెబుతున్నాను. నాకు చెప్పులు లేవండీ. ఈ వారమే కాదు వచ్చే వారం కూడా వుండవు. ఈ యేడాదంతా వుండక పోవచ్చు. నాకేం కష్టం కలిగినా నేనే ఓర్చుకుంటాను. మీరు లేబ్లోకి రానివ్వకపోతే ప్రిన్సిపల్గారి దగ్గరకి వెళ్ళి ఈ విషయం చెప్తాను. ఏం చెయ్యమంటారో మీరే చెప్పండి” భయం లేకుండా అనేశాను.
లేబ్ లెక్చరర్ మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి.
“ఐయామ్ సారీ” అని గొణిగి నన్ను లోపలకెళ్ళమని చెయ్యూపారు.
మళ్ళీ బతుకుజీవుడా అని లోపలకి వెళ్ళిపోయాను ధైర్యంగా బుర్ర ఎత్తుకుని అందర్నీ చూస్తూ.
నరసిమ్మ దగ్గరకి వచ్చి సపోర్టుగా భుజం తట్టాడు.
ఆ తరువాత నించీ లేబ్ లెక్చరర్ కష్టం అయితే పోయింది గానీ లేబ్ ఫ్లోర్ కష్టం మాత్రం పోలేదు. అప్పుడప్పుడు ఆసిడ్ చుక్కలు తొక్కడమూ, గట్రా కష్టంగానే వుండేది. అదీగాక రోడ్ల మీద కూడా చెప్పులు లేకుండా నడవడం ఎంత అలవాటయిపోయినా కష్టంగానే వుండేది. ఎలాగన్నా చెప్పులు సంపాదించుకోవాలన్న కోరిక మొదలయ్యింది.
అప్పుడే ఇంకో కోరిక కూడా మొదలయ్యింది.
ఫిజిక్స్ క్లాస్‌లో మాకు ప్రిస్క్రైబ్డ్ బుక్ “హాలిడే & రెస్నిక్” రాసిన ఫిజిక్స్ పుస్తకం. ఆ పుస్తకం అంటే ఎంతో ప్రాణంగా వుండేది. లైబ్రరీలో బుక్కూ, రామన్న దగ్గర బుక్కూ వాడుకుంటూ వుండేవాడిని. ఎలాగన్నా ఆ పుస్తకం నా సొంతానికి కొనుక్కోవాలని విపరీతమైన ఆశగా వుండేది. ఆ పుస్తకం చూస్తేనే ఒక రకమైన సంతోషం కలిగేది.
ఎలాగన్నా చెప్పులూ, పుస్తకమూ సంపాదించాలని మహా కోరికగా వుండేది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియని వయసు. చెప్పడానికి ఎవరూ కూడా లేరు.
ఒక రోజు క్లాసుకి సీఆర్పీ మోచేతి దగ్గర బాండేజ్ పెట్టుకుని వచ్చాడు.
“ఏమయిందిరా చేతికి?” మామూలుగా అడిగాను.
“ఇప్పుడే బ్లడ్ బాంక్‌కి వెళ్ళి వస్తున్నాను. బ్లడ్ డొనేట్ చేశాను. ప్రతీ మూడు నెలల కొకసారి బ్లడ్ డొనేట్ చేస్తూ వుంటాను” చెప్పాడు సీఆర్పీ సీరియస్‌గా.
ఆశ్చర్యపోయాను. రక్తదానం గురించి విన్నాను గానీ ఏమీ తెలియదు సరిగా. రక్తదానం చేస్తే డబ్బులిస్తారని కూడా విన్నాను.
“డబ్బు లిచ్చారా? ఎంతిచ్చారు?” ఆత్రుతగా అడిగాను.
“డబ్బులేమీ ఇవ్వలేదు. నేను వాలంటరీగా డొనేట్ చేస్తూ వుంటాను. వాలంటరీ బ్లడ్ డోనార్నన్న మాట” చెప్పాడు.
కొంచెం నిరాశనిపించింది.
“ఎవ్వరికీ డబ్బులివ్వరా అయితే?” అడిగాను.
“కొంతమందికి ఇస్తారు. వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళు రక్తాన్నమ్ముకుంటారు డబ్బు కోసం. వాలంటరీ డోనార్స్‌కి ఇవ్వరు.”
“ఎవరన్నా ఇవ్వచ్చా బ్లడ్ డబ్బు కోసం?” అడిగాను కాస్త ఆశగా.
“ఆరోగ్యంగా వున్న వాళ్ళు మాత్రమే ఇవ్వచ్చు. బ్లడ్ బాంక్‌లో హెల్త్ చెక్ చేస్తారు కూడా. కనీసం పద్దెనిమిదేళ్ళుండాలి బ్లడ్ ఇచ్చేవాళ్ళకి” చెప్పాడు.
మళ్ళీ వుసూరుమంది ప్రాణం. నాకు పదిహేడేళ్ళే. చిన్నప్పుడు ఒక క్లాసు ముందుకు తోసేశారు బళ్ళో.
మళ్ళీ అసలు విషయం గుర్తొచ్చి సంతోషం వేసింది. మా వాళ్ళు నన్ను ఒక క్లాసు ముందుకు తొయ్యడానికి నా డేటాఫ్ బర్త్ ఒక యేడాది ముందుకు తోశారు. కాబట్టీ, రికార్డుల ప్రకారం నాకు పద్దెనిమిదేళ్ళు. మా పెద్దవాళ్ళు తెలివి తక్కువగా చేసిన పని ఇన్నాళ్ళకి ఈ విధంగా వుపయోగ పడినందుకు వాళ్ళ మీద చాలా ప్రేమ కలిగింది. రికార్డులలో నా బర్త్ మంత్ తప్ప, డేటూ తప్పే, సంవత్సరమూ తప్పే. అసలు నేను పుట్టిన డేట్ ఎవ్వరికీ తెలియదు. ఏదో నోటికొచ్చిన డేట్ వేసేసారు.
మొత్తానికి ఎలాగన్నా రక్తాన్నమ్ముకుని, ఆ డబ్బుతో చెప్పులూ, పుస్తకమూ కొనుక్కోవాలని నిశ్చయించుకున్నాను. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా వుంచాలని కూడా అనుకున్నాను.
ఏదో యధాలాపంగా అడిగినట్టు సీఆర్పీని అడిగి, ఆ బ్లడ్ బేంక్ ఎక్కడుందో కనుక్కున్నాను. బ్లడ్ బాంక్ నారాయణగుడాలో కాలేజ్ నించి ఇంటికి వెళ్ళేదారిలో కొంచెం పక్కగా వుంది.
కాలేజీ అయిపోయేక నాకు వేరే పనుందని నరసిమ్మని ఇంటికి పంపించేశాను. ఒక్కణ్ణీ బయలుదేరి బ్లడ్ బాంక్‌కి వెళ్ళాను.
ముందరగా గేట్ దగ్గరున్న వాచ్‌మేన్ ఆపాడు.
“అందర్ కైకూ?” అనడిగాడు.
బ్లడ్ ఇవ్వడానికి వెళుతున్నానని చెప్పగానే చేతిలో పుస్తకాల వైపూ, నా మొహం వైపూ నమ్మకం గానూ, నా చెప్పులు లేని కాళ్ళ వైపు అపనమ్మకం గానూ చూశాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, లోపలకి వెళ్ళనిచ్చాడు.
లోపలకి వెళ్ళి డాక్టర్ని కలిసి బ్లడ్ ఇవ్వడానికి వచ్చానని చెప్పాను.
“ఏం చదువుతున్నావయ్యా?” డాక్టర్ రామయ్య అడిగారు ఆప్యాయంగా.
“బి.యస్సీ సెకండియర్ చదువుతున్నానండీ” వినయంగానే చెప్పాను.
అవసరం నాది కదా మరి.
“మరీ చిన్న పిల్లాడివోయి! బలంగా కూడా లేవు. వెళ్ళిపోయి ఇంకో రెండేళ్ళాగి రా. ఏం కంగారు అప్పుడే!” అన్నారాయన సానునయంగా.
“చిన్న పిల్లాడిని కానండీ. పద్దెనిమిదేళ్ళున్నాయి. కావాలంటే ఐడి కార్డు చూపిస్తాను. బలంగా లేకపోయినా మంచి ఆరోగ్యంగా వున్నాను. కావలిస్తే చెక్ చేసుకోండీ” చెప్పాను గట్టిగా.
ఆయన అభిమానంగా భుజం తట్టారు.
“అది కాదోయ్! ఎందుకంత హడావుడి?” నవ్వుతూనే అడిగారు.
“హడావుడి కాదండీ. పొద్దున్న మా క్లాస్మేట్ రామకృష్ణ పరమ హంస కూడా బ్లడ్ ఇచ్చాడు. నేను కూడా ఇవ్వగలను” మొండిగా చెప్పాను.
ఆయన గట్టిగా నవ్వి బి.పీ, పల్సూ చెక్ చేసి నర్స్‌ని పిలిచి అరేంజ్మెంట్స్ చేయమన్నారు.
ధైర్యంగా రావడమైతే వచ్చేశాను గానీ లోపల భయంగానే వుంది. అంత రక్తం నా వంట్లోంచి తీసుకుంటే ఏమవుతుందోనని భయం. మళ్ళీ ఏమీ కాదన్న మొండి ధైర్యం. కళ్ళు తిరిగి పడిపోతానేమోనని భయం. సీఆర్పీ ఏమీ అలా పడలేదుగా! నాకూ ఏమీ కాదన్న నమ్మకం.
మొత్తానికి సూది నరంలోకి దింపినప్పుడు తప్పితే నొప్పేమీ తెలియలేదు. మామూలుగానే అనిపించింది.
ఇంక దృష్టంతా వీళ్ళెంత డబ్బిస్తారా, దాంతో చెప్పులూ, పుస్తకం రెండూ కొనుక్కోవచ్చా, ఒక్కటే కొనుక్కోవడానికి వీలైతే ఏది కొనుక్కోవాలీ, ఏది త్యాగం చెయ్యాలీ, ఏదన్నా కొనుక్కున్నాక ఇంట్లో అమ్మకీ, అక్కకీ ఏమని చెప్పాలీ, అని ఆలోచించుకుంటూ వుండగానే బ్లడ్ బాంక్వాళ్ళు కావల్సినంత రక్తం తీసేసుకున్నారు.
బాండేజ్ వేశాక లేచి కూర్చోబోతూ వుంటే వారించి కాసేపు పడుకోబెట్టారు. ఆ తర్వాత కుర్చీలో కూర్చోమన్నారు.
వాళ్ళొచ్చి డబ్బివ్వాలా, వాలంటీరు డొనేషనా అని అడుగుతారూ, డబ్బే కావాలీ అని చెప్దామని చూస్తూ వుంటే ఒక నర్సు వచ్చి బిస్కెట్లూ, కూల్డ్రింకూ ఇచ్చింది.
నాకనుమానం వచ్చేసింది ఇంక.
రక్తాన్ని అమ్ముకునే వాళ్ళకి ఇలాంటివి ఇవ్వరన్న ఇంగిత జ్ణ్గానముంది. అవి ముట్టుకోకుండా డాక్టరొస్తే నాకు అవి వద్దూ, డబ్బే కావాలీ అని ధైర్యంగా చెప్పేద్దామని ఏమీ తినకుండా చూస్తూ కూర్చున్నాను.
ఇంతలో డాక్టర్ రామయ్యగారు ఇంకో ఆడ డాక్టరుతో అక్కడకి వచ్చారు.
వాళ్ళని చూడగానే నేను లేచి నించున్నాను.
“ఇతను కాలేజీలో బి.యస్సీ రెండవ సంవత్సరం చదువుతున్నాడండీ. మనకున్న కొద్ది వాలంటరీ డోనార్సులో ఇతనొకడు. ఇలాంటి వాళ్ళు వుండబట్టే ఇంకా దేశం మంచిగా వుంది” అంటూ నన్ను ఆ డాక్టర్ రాజ్యలక్ష్మి గారికి పరిచయం చేశారు.
ఆవిడ నవ్వుతూ భుజం తట్టి షేక్హేండ్ ఇచ్చారు.
ఆ పైన డబ్బులడిగే ధైర్యం నాలో చచ్చిపోయింది.
సిగ్గుగా బుర్ర వంచుకుని, రాబోయే కన్నీళ్ళని కళ్ళలోనే దాచేసుకుని బిస్కట్టు కొరికాను.
కూల్‌డ్రింక్ కూడా తాగేసి, వాళ్ళందరికీ వెళ్తున్నానని చెప్పి, మళ్ళీ వాళ్ళందరి పనికిరాని అభినందనలనీ తీసుకుని ఇంటికి ఈసురో మంటూ మూడు మైళ్ళూ నడిచాను.
దారిలోనే బాండేజ్ పీకి పారేశాను. అది చూస్తే ఇంట్లో వాళ్ళు అనుమానం వచ్చి అడుగుతారేమోనని భయం.
ఆ రోజు రాత్రి మా అక్క కొంత డబ్బిచ్చింది.
“రోజూ చెప్పుల్లేకుండా వెళుతున్నావు కాలేజీకి. చెప్పులు కొనుక్కో” అంది అక్క.
వెంటనే కొత్త కోరిక గుర్తొచ్చింది.
“చెప్పులే కొనుక్కోవాలా? అది కాకుండా పుస్తకం కొనుక్కోవచ్చా? నాకిష్టం అయిన “హాలిడే & రెస్నిక్” ఫిజిక్స్ పుస్తకం కొనుక్కోవాలనుంది. కొనుక్కోవచ్చా?” అడిగాను ఆశగా.
అప్పుడు అక్క నా వైపు జాలిగా చూసిన చూపు ఈ జన్మకి మర్చిపోలేను.
ఏమీ మాట్లాడకుండా తలూపింది అక్క.
ఆ మర్నాడు నా జీవితంలో పెద్ద పండగ. కాలేజీ అవగానే నరసిమ్మని తీసుకుని కోఠీ వెళ్ళి ఆ పుస్తకం కొనుక్కున్నాను. కొత్త పుస్తకం వాసనా, స్పర్శా ఈ జన్మకి మర్చిపోలేననిపించింది. ఎంతో సంతోషంతో ఇంటికి వచ్చాను. రోజుకొక్కసారన్నా ఆ పుస్తకం చదువుతూ వుండేవాడిని.
మళ్ళీనెల ఒకటో తారీఖున జీతం రాగానే అక్క నన్ను చెప్పుల షాపుకి తీసికెళ్ళి చెప్పులు కొని పెట్టింది.
నాకు చెప్పులూ, పుస్తకమూ కొనడానికి అక్కా, అమ్మా ఏ ఖర్చులు త్యాగం చెయ్యాల్సి వచ్చిందో తెలియదు గానీ, ఏదో అర్థం అయినట్టుగా అనిపించి మనసంతా కృతజ్ణ్జతతో నిండిపోయింది. పెద్దయ్యాక ఎన్నెన్నో చేసి వాళ్ళని సంతోషపెట్టేయాలని ఎన్నో ప్రమాణాలు మనసులోనే చేసేసుకున్నాను.