కథ: తృప్తి
రచయిత: సత్యం శంకరమంచి
కథాకాలం: 1975-77?
జీవితాన్ని మార్చివేసిన సంఘటన అని మనం తరచూ వింటూ వుంటాం. కొన్ని సంఘటనలూ, కొన్ని సంభాషణలూ, కొందరు వ్యక్తుల పరిచయం, కొన్ని నిమిషాలదే అయినా, మనకు జీవితాంతం గుర్తుండిపోతాయి. జీవితాన్ని మార్చివేయడం అంటే ఆర్ధికంగానో, సామాజికంగానో కాదు. భూకంపాలూ, ప్రభుత్వాలు కూలిపోడాలు సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. వాదాలు, వాగ్వివాదాలు మన సామాజిక దృక్పథాన్ని మార్చవచ్చునేమో కానీ, అస్థిమూలగతమైన మన వ్యక్తిత్వాన్ని, మన మనస్తత్వాన్ని మార్చవు. మన వ్యక్తిత్వంపై చెరగని ముద్ర వేసేవి, మనలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించేవి, లేదూ, ఉన్న ఊహకే పదును పెట్టేవి. ఇలా మన మనసుపై ప్రభావం చూపించే సంఘటనలు చాలా చిన్న చిన్నవి, అసలు వాటిని సంఘటన అనేంత పెద్ద పదంతో పిలవవచ్చునో లేదో కూడా అని నా మటుకు నాకు అనిపిస్తుంది. ఒక చిన్న మందలింపు, మెచ్చుకోలు, ఇవే కాదు, ఎప్పుడో ఎక్కడో అనుకోకుండా మనమేదో చూస్తాం, వింటాం, చదువుతాం, గమనిస్తాం. అది చాలు, మనల్ని కదిలించడానికి. (మనకంటే ఎత్తయిన వాళ్ళ భుజం మీద చెయ్యి వెయ్యాలంటే మనం కనీసం అంత ఎత్తయినా ఉండాలి, అని ఒక కథలో కన్నెగంటి చంద్ర చెప్పిన ఒక చిన్న మాట — ఇదే పదాలలో కాదేమో బహుశా — ఇలాంటి ఒక సంఘటన.)
ముప్ఫై యేళ్ళ క్రితం మాట. నన్ను పదమూడు, పదేహేడేళ్ళ మధ్యలో బాగా ఆకట్టుకున్న పత్రిక ఆంధ్రజ్యోతి వారపత్రిక. మొదటి కొన్ని పేజీల్లోనే ఒక పెద్ద కవిత ఉండేది. పేజీల్లో అక్కడక్కడా చిన్న చిన్న డబ్బాల్లో కవితలు, సాహిత్యపు చెణుకులు, లేదూ ఇంకేదో ఉంటుండేవి. ‘మో’ నాకు మొదటిసారి కనిపించింది ఇలా ఆ పత్రికలో ఒక చిన్న డబ్బాలోనే. మొట్టమొదటి సారి మో రాసిన ఆ చిన్న కవిత అర్థం కాకపోయినా కవి అంటున్న మాటల్లో ఏదో గొప్పతనం ఉంది, అది అర్థం చేసుకోవడానికి నేనే ప్రయాసపడాలి అన్న ఊహ అప్పుడే వచ్చింది. కొన్నేళ్ళ క్రితం ఈమాటలోనే రాసినట్టు పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ అన్న ఆ ఊహకు మొదటి విత్తనం అప్పుడే పడింది. పత్రిక మధ్య పేజీలో సాహిత్యం గురించిన సంగతులు ఉండేవి. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మలు మొదటిసారిగా ఆ పత్రికలోనే చూసి అబ్బురపడిపోయి, ఫ్రెండ్సందరికీ పని గట్టుకొని మరీ చూపించింది ఆ రోజుల్లోనే. బావగాడిని మొదటిసారి కలిసింది ఆ పేజీల్లోనే.
అమరావతి కథలు (1978)
సత్యం శంకరమంచి
నవోదయ పబ్లిషర్స్, రూ. 150/-
పేజీలు తిరగేస్తున్న నాకు అనుకోకుండా ఒక పేజీలోనో, అరపేజీలోనో చూసిన చిన్న కథ అని మాత్రం గుర్తుంది. కథ వివరంగా గుర్తు లేకపోయినా బావగాడు గుర్తుండిపోయాడు. కొన్నేళ్ళ పాటు ఆ కథ రాసింది ఎవరో, ఆ కథ పేరేమిటో ఏమీ గుర్తు లేదు. బావగాడు మాత్రం నన్నొదిలి పెట్టిపోలేదు. మనిషంటే బావగాడిలా ఉండాలి, అని మొదటిసారి అనుకున్నానని మాత్రం గుర్తుండేది. వాడి గురించి వెతుకుతుండేవాణ్ణి, ఎప్పటికైనా మళ్ళీ కనిపించకపోతాడా అని. ఎనభైల చివరలో అనుకుంటా, అమరావతి కథలు చదువుతుంటే ఉన్నట్టుండి ఆ కథ వాటిల్లో కనిపించింది, పేరు తృప్తి, రాసింది సత్యం శంకరమంచి అని తెలిసింది. అమ్మయ్య అనుకున్నాను. అప్పుడు ఆ కథ మళ్ళీ చదివినప్పుడు నా అభిప్రాయం ఏమీ మారినట్టు గుర్తు లేదు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళకి, మీకు పరిచయం చేయడానికి ఈ కథను టైపు చేస్తుంటే నేను చదివిన కథ ఇలానే ఉండేదా అనిపించింది కూడా. అయితే అది కేవలం అప్పటి వాక్యాలను నేను మర్చిపోవడం వల్లనే. అంతే కానీ ఇప్పుడూ, ఆ కథతో నా అనుబంధం, బావగాడంటే గౌరవం ఏమీ మారలేదు. చాలా చిన్న కథ, మీరే చదువుతారని ఏమీ చెప్పడం లేదు.
ఈ కథ మొదటిసారి చదివినప్పటికి, నేను పెరిగి పెద్దయితే ఇలా ఉండాలి అని నాకంటూ ఎవరూ ఆదర్శం లేరు. నేనెప్పుడూ ఇంకెవరినో కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ వయసులో ఏది మంచి ఏది చెడు అని నాకు పూర్తిగా తెలియదు. లోకం చెప్పే మంచీ, చెడూ నాకు అలానే కనిపించేవి కావు. బావగాడు నాకు మంచితనం అనే ఊహనిచ్చిన మొదటి వ్యక్తి. అంటే వాడి స్వభావం నాకు బాగా నచ్చింది. వాడు నాకంటే చాలా గొప్పవాడని అందుకేనేమో అనిపించింది. వాడంత వాణ్ణి కావాలని అనుకుని వాణ్ణి నేనెప్పుడూ అనుకరించక లేదు. వాడంత వాణ్ణి నేను కాను, కాలేను అని నాకు తెలుసు. కానీ ఎప్పటికీ అందుకోలేని వాటినే ఆదర్శంగా తీసుకోవడంలో ఒక సులువుంది కదూ! ఈ కథ నిజంగా గొప్ప కథేనా? ఏమో, నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ వనసంతర్పణం జరుగుతున్న ఆ తోటకెళ్ళి భోజనం చేస్తున్న బావగాణ్ణి ఒక్కసారి చూసుకోవాలనుంటుంది కళ్ళనిండా, ఈ రోజుకీ.