కాల్వీనో కథల నుంచి – 6ఆ

తిరగబడ్డ తొమ్మిది

అప్పటిదాకా ఊరి పొలిమేరల్లో తచ్చాడుతున్న చీకటి మెల్లిగా ఊరి మధ్యలోకి పాకి చెట్ల ఆకుల మధ్యలో ఆకాశాన్ని నల్లగా పులిమేసి, ఠంచనుగా వెలిగిన వీధి దీపాల నియాన్ లైట్లకింద పసుపు పచ్చని పిచ్చుక గూళ్ళు కట్టింది. ఆకాశంలోకి నిటారుగా ఎగబాకిన ఆ ఆఫీసు బిల్డింగు కిటికీల అద్దాలు మెల్లమెల్లగా నల్లబడుతున్నాయి. అక్కడక్కడా కొన్ని కిటికీలలో ఆ పూటకి ఇంకా మిగిలిపోయిన వ్యవహారమేదో వెలుగుతూనే ఉన్నా ఆ రోజుకి మాత్రం ఆఫీసు పని అయిపోయింది. హెల్మెట్లు, విండ్ చీటర్లలో భుజానికడ్డంగా బ్యాగులు వేలాడేసుకుని వయసుకొచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు; షాల్ కప్పుకుని, ఉలెన్ స్కార్ఫులు తలకు చుట్టుకుని, వయసు మళ్ళిన సెక్రటరీలు; టైలు, సూట్లలో, చెవిలో సెల్ఫోన్ల లోకి ఆర్డర్లు పారేస్తున్న మేనేజర్లు; సెల్ఫోన్ల నుంచి వినయంగా వింటున్న అసిస్టంట్లు — పార్కింగ్ నుంచి చీమల్లా బైటికి వస్తున్న కార్లూ, బైకులూ, స్కూటర్లూ, హారన్ల సందడి; హాయ్, హౌజ్ యువర్ డే, వాంటూ గోఫరే డ్రింక్, విల్కాల్యూ టునైట్, సీ యూ టుమారో, బై బై అరుపులు, జాతర కోలాహలం. కానీ కాసేపట్లోనే అంతా సద్దు మణిగిపోయింది. ఆ వీధిలో కదిలే దీపాలంటూ ఇక ఏమీ లేవు.

ప్రతీరోజు లాగే చడీ చప్పుడు లేకుండా చీకట్లో నిల్చోనున్న బిల్డింగు కిటికీల్లోంచి ఖాళీగా ఉన్న ఆఫీసులు కనిపిస్తున్నాయి. పవర్ ఆఫ్ చేసిన కంప్యూటర్ మానిటర్లు, టేబుల్ కిందికి నెట్టిన కుర్చీలు, ఒద్దిగ్గా సర్దిపెట్టిన ఫైల్ ఫోల్డర్లు, ఔట్ గోయింగ్ ట్రేలో సంతకాలు పెట్టి మూసేసిన డిపార్ట్‌మెంటల్ మెయిల్ ఎన్వలప్‌లు, పగలంతా పని చేసి మౌనవ్రతం పట్టిన ఫోటోస్టాట్ మెషీన్లు, స్కానర్లు, టెలిఫోన్లు, పూర్తిగా నిండీ నిండని చెత్తబుట్టలు — కరెంటు ఆదా కోసం వరుస ఒదిలి వరుసలో వెలుగుతున్న ట్యూబ్ లైట్ల వెలుగులో కదలకుండా, మెదలకుండా నిలబడి నిద్రపోతున్న కొంగల్లా ఉన్నాయి. కార్డ్ బోర్డ్ గోడ మీద పుష్ పిన్ గుచ్చి నిలబెట్టిన ఫామిలీ ఫోటోల్లో నవ్వుల లాగానే ఆఫీసంతా అచేతనంగా అలా ఇప్పుడైతే ఉంది కానీ ఇంకెంతసేపో ఉండబోటం లేదు.

ప్రతీరోజు లాగే ఆ బిల్డింగ్ వెనకాల గుమ్మం దగ్గరికి ఆకుపచ్చ రంగు వ్యాన్ వచ్చి ఆగగానే బిలబిల్లాడుతూ చీరలు, చుడీదార్ల మీద నీలంరంగు డాక్టరు కోటు లాంటిది వేసుకున్న ఓ పదీ పన్నెండు మంది ఆడవాళ్ళు దిగిపోయారు. దిగిన కాసేపట్లోనే బ్రూములు, వెట్‌మాపులు, స్ప్రే బాటిళ్ళు, నేప్కిన్లు పట్టుకొని అంతస్తు నుంచి అంతస్తుకి, టేబుళ్ళని తుడిచేస్తూ, వైట్ బోర్డులు చెరిపేస్తూ, కార్పెట్లని దులిపేస్తూ, చెత్తబుట్టల్లో చించేసిన కాగితాల ముక్కల్లో నిజాలను, ఆరోగ్యం కోసమో అందం కోసమో ఒక్కపొద్దున్న ప్లాస్టిక్ రేపర్ల అబద్ధాలను, ఖాళీ చేస్తూ — పగలంతా నడిచిన పాదాల మరకలు మాయం చేస్తూ గచ్చు నేల మీద తడిగుడ్డతో ముగ్గులేసే మంత్రగత్తెలు, సందడి లేని సందడి చేస్తూ ఆఫీసులో నీడల్లా పాకిపోయారు.

“చిన్నోడా, కిటికీ షట్టర్లేయడం అయిందా?”

ఒక్కో కిటికీ ముందు అద్దంలో వాణ్ణి వాడు చూసుకుంటూ, కిటికీ బ్లైండ్స్ పై అంచు దాకా లాగి, ధనామని ఒకేసారి వదిలిపెడుతూ కెమెరా షట్టర్‌లాగా, ఒక్కో కిటికీని మూసి దాని వెనకాల మాయమైపోతూ, వాడిలోకంలో వాడున్న రాజుగాడు ఉలిక్కిపడి, ఆ గదిలో మిగిలిపోయిన కాసిని కిటికీలకు చకచకా బ్లైండ్స్ వేసేసి కారిడార్లోకి వచ్చి పడ్డాడు. బ్లైండ్స్ ముందు వేసేస్తే తర్వాత వాటిని టకటకా తుడుచుకుంటూ పోవచ్చు. ఫోటో ఫ్రేములూ, ఫ్లవర్ వేజుల దుమ్ము దులుపుతున్న సునంద వాణ్ణి చూసి పలకరింపుగా నవ్వి, “మీ అమ్మ ఆ గదిలో ఉంది, పో!” అని తలూపుతూ చెప్పింది. సునంద యమున కంటే పదేళ్ళు చిన్నది. అయినా వాళ్ళిద్దరికీ మంచి దోస్తీ. ఇంతలో యమునే అక్కడికొచ్చింది.

“అమ్మా, కిటికీలేశా. చెత్త బుట్టలు తీసేదా?”

“నా బంగారు నాన్నే. జాగ్రత్తమ్మా, నేల మీద పడున్నవి తీయకు, సరేనా?”

యమునకి రాజుగాడి కళ్ళ మీద నిద్రమత్తు కనిపించకుండా పోలేదు. వాడికి రేపు స్కూలు కూడా ఉంది. యమున గమనించినా ఏం చేస్తుంది, అవసరం అలాంటిది. అప్పుడప్పుడూ తప్పనిసరై వాణ్ణి వెంట తెచ్చుకుంటుంది సహాయం కోసం. అమ్మను ఎక్కువగా తిరగనీయకుండా వాడే అటూ ఇటూ పరుగెత్తుతూ పని సాయం చేస్తుంటాడు.

నిద్రమత్తులోంచి మెలకువలోకి, మెలకువలోంచి ఇంకో నిద్రమత్తులోకి అటూ ఇటూ ఊగుతూనే ఒక పెద్ద గార్బేజి బ్యాగులోకి చెత్తబుట్టల్ని ఒక్కోటీ ఒంపుకుంటూ, వీలైనంత నిదానంగా ఆ ఆఫీసు గది ఖాళీ చేసి, వాడికంటే రెండు రెట్లున్న ఆ బ్యాగు వాడి వెనకాలనే ఈడ్చుకుంటూ రాజుగాడు కారిడార్లోకి తెచ్చి పడేశాడు. అలా బైటికి తెచ్చి పడేసిన బ్యాగులన్నీ మోటార్ ట్రాలీ మీద కెక్కించి తర్వాత బైటికి తీస్కెల్తారు ఇంకెవరో.

రాజుగాడికి అన్నిటికంటే ఇష్టమైన పని చెత్త బుట్టలు ఖాళీ చేయడం. అందుకే నిదానంగా చేస్తాడు, నిద్రొస్తున్నా రాకపోయినా. పెద్ద పెద్ద గదులు; వాటి మధ్యలో అడ్డంగా నిలువుగా వరసల్లో చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాంటి క్యూబు గదులు. ప్రతీ క్యూబులో ఒక టేబులు, ఒక కుర్చీ, టేబుల్ మీద ఒక కంప్యూటరు, పక్కనే ఫోను. టేబుల్ పక్కగా దానికానుకొని ఒక ఫైల్ కేబినెట్, టేబుల్ కింద ఒక పక్కగా చిన్న చెత్తబుట్ట. అన్ని క్యూబుల్లో ఒకే రకం ఫర్నిచరు. గదిలో గోడవారగా కొంచెం పెద్ద గదులు, అవీ అగ్గిపెట్టెల్లాగే. కాకుంటే మసక అద్దాల తలుపులతో. వాటికి తాళాలుండవు, చక్రాల మీద పక్కకు జరుగుతాయి. ఆ గదుల్లో కూడా ఇలానే టేబులు, కుర్చీ, కంప్యూటరు, ఫైలు కేబినెట్ అన్నీ ఉంటాయి కానీ కొంచెం పెద్దవి. అంతే తేడా. ఆ గదుల్లో ఫోన్ల మీద బటన్లు కూడా ఎక్కువుంటాయి. ఆ కంప్యూటర్లని చూసుకుంటూ, వాటి సన్నటి రొద వింటూ, ఫోన్ల మీద వెలిగీ ఆరిపోతున్న ఎర్రలైట్లు చూస్తూ, అక్కడక్కడా ఇంకా టేబుల్ మీదే ఒదిలేసిన కాల్‌క్యులేటరో, మర్చిపోయిన సెల్ఫోనో చేత్తో పట్టుకొని మరీ చూస్తూ మళ్ళీ అక్కడే పెట్టేస్తూ, వాడి లోకంలో వాడు ఒంటరిగా ఆ పెద్ద పెద్ద గదుల్లో అలా తప్పిపోవడం రాజుగాడికి చాలా ఇష్టం. అంతేకాదు, సునంద జోరీగలా ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటుంది. ఆ రొద తప్పించుకొని పోడానిక్కూడా.

సునంద డిగ్రీ సగంలో ఆపేసింది. ఎవరైనా అడిగితే సీఐఎఫ్‌ఎమ్‌టీలో జానిటోరియల్ స్టాఫ్‌గా పనిచేస్తాను అని గర్వంగా చెప్తుంది. అంటే ‘కన్సార్టియం ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ మానిటరీ ట్రాన్సాక్షన్స్! ప్రపంచంలో కంపెనీలు, గవర్నమెంట్లు, ఇచ్చుకునే అప్పులూ, పెట్టుకునే ఖర్చులూ అన్నీ లెక్క చూసేది మన కంపెనీనే. పైసా అటూ ఇటూ పోకుండా లెక్క చూస్తారు తెలుసా? మనం గానీ లేకపోతే అంతే, అంతా ఉష్‌కాకీ’ అని రాజుగాడికి నేర్పించింది కూడా తనే. ఆషామాషీ కంపెనీకి పని చేయటం లేదని సునందకి తెలుసు. యమునకి ఇవేమీ పట్టవు. సీఐఎఫ్‌ఎమ్‌టీ అయినా కూరగాయల కొట్టయినా ఆమెకొకటే. సునందకి ఆ బిల్డింగులో ఆఫీసుల పేర్లన్నీ తెలుసు, జానిటర్ల రూల్సు కూడా తెలుసు.

“… యమునక్కా, ముందుపోయి అకౌంట్స్ కానిచ్చి ఆ పైన, లిటిగేషన్స్ లోకి పోదాం. ఈరోజు పొద్దునంతా అక్కడేదో మీటింగ్ జరిగిందంట. అదేదో దేశం అబ్బా, మీ అప్పు నేను కట్టను, ఏం పీక్కుంటారో పీక్కోండి అందట. ఎవరో తెల్లాయన, నల్లాయన చివరికి కొట్టుకునే దాకా వచ్చారట. అక్కడే మనకు ఎక్కువ పని పడేది ఈ రోజు.”

“… యమునక్కా, నీకెన్నిసార్లు చెప్పానే? టేబుల్ ఖాళీగా పెట్టకపోతే నువ్వు తుడవక్కర్లేదని. నీ తప్పు కాదు కదే. ఉత్తగా గుడ్డతో ఫోన్ ఒకసారి దులుపు, చాలు. ఇంటికెళ్ళే ముందు టేబుల్ ఖాళీ చెయ్యాలని గూడా తెలీదా ఏందీ, ఈ మిడిమాలపోళ్ళకు!”

“… యమునక్కా, ఇందాక సుదర్శనం సారు రూముకి పోతే కాయితాలు ఎక్కడ పడితే అక్కడే పడేసున్నై. బోర్డు మీద డు నాట్ వైప్ అని రాసిపెట్టి మరీ పోయాడే. ఆయన బ్యాగు కూడా మర్చిపోయాడు. ఏందబ్బా ఎప్పుడూ శుభ్రంగా ఉంటాడే, ఏమైందో అనుకున్నా. ఈ రోజు ఏదో తిరకాసైనట్టే వుంది.”

సునందకి తెలీనిది లేదు. అప్పుడప్పుడూ టేబుల్ మీద ట్రేలో ఉన్న ఉత్తరాలు, కవర్లు తీసి చూస్తుంటుంది. సున్నాలు లెక్కపెడుతూ ‘అమ్మో ఇన్ని కోట్లే ఒక చెక్కు మీద!’ అని ఆశ్చర్యపోతుంటుంది. ఇందులో పది సున్నాలు తీసేసినా పర్లేదు, ఇట్లాంటి చెక్కు ఒక్కటి మనకిస్తేనా అని యమునతో చెప్తూ ఊహల్లో తేలిపోతుంటుంది.

“అబ్బ పోనీవే నందూ, మనకెందుకే ఇవన్నీ… పోనీలేవే, కాగితాలొక పక్కకి నెట్టి టేబులు ఊరికే అట్లా ఒకసారి తుడిస్తే ఏం కాదు లేవే… తిరకాసెందుకయిందే? మనకేం కాదుగా, రాజుగాడి చదువైపోతే చాలు. అప్పటిదాకా ఈ ఉద్యోగం పోకుంటే చాలు దేవుడా.” యమున లోకం యమునది.

వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకరు ఎలా భరిస్తారో రాజుగాడికర్థం కాదు. సునంద పొడుగ్గా సన్నగా ఉంటుంది, మగరాయుడిలా నడుస్తుంది; గొంతు కూడా పెద్దది, ఎవరన్నా లెక్క లేదు. అమ్మేమో సన్నగా చిన్నగా ఉంటుంది, అతి భయం, జాగ్రత్త; కొత్తవారిముందు గొంతు పెగలదు. సునంద టేబుళ్ళ మీద కంప్యూటర్లూ అవీ దులిపేటప్పుడు, దర్జాగా వెనకాలున్న కుర్చీలో కూర్చుంటుంది. అలా మేనేజర్లు, డైరక్టర్ల కుర్చీల్లో కూర్చుని చేతిలో డస్టరును నిర్లక్ష్యంగా ఆడిస్తూ వాళ్ళంత దర్జా వొలకపోస్తుంది. అమ్మ మాత్రం పక్కా పల్లెటూరిదానిలా పని చేస్తుంది. టేబుల్ మీద అవీ ఇవీ అటూ ఇటూ జరిపి తుడుస్తుంటే, పేడతో ఇల్లు అలుకుతున్నట్టు వుంటుంది. ఇద్దరూ కలిసే పనిచేస్తారు. ఏదో ఒకటి ముచ్చట్లు సాగుతూనే వుంటాయి. వాళ్ళిద్దరినీ తప్పించుకొని దూరంగా ఆఫీసుల్లోపల్లోపలికి వెళ్ళిపోతుంటాడు రాజుగాడు. అది వాడి లోకం. ఆ పల్చటి నిద్రమత్తులో, కంప్యూటర్ల సన్నని రొదలో, అనంతమైన ఆ ప్రపంచంలో వాణ్ణి వాడు ఎవరికీ కనిపించని ఒక చీమలాగా ఊహించుకుంటాడు. ఒక గది ఎకరమంత ఉంటుంది, టేబులు కాలు తాడి చెట్టంత పొడుగుంటుంది. ఆ ఊహలో పూర్తిగా ముణిగిపోయిన తర్వాత వాడికే అనుకోకుండా భయం పుడుతుంది. ఉన్నట్టుండి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తుంటాడు, ఎక్కడైనా మనిషి అలికిడి వినిపిస్తుందని చూస్తుంటాడు. ఈ లోకంలో వాడికి తెలిసిన ఆనవాళ్ళు వెతుక్కుంటాడు.

టేబుల్ మీద వేసిన అద్దం కింద కనిపించే ఫోటోలలో ఆమెవరో, అతనెవరో. చిన్న మోకాళ్ళ పీట మీద సెక్రటరీ పెట్టుకున్న పూల కుండీ. ఒక చెత్తబుట్టలో ఫిల్మ్ ఫేర్ పత్రిక. ఇంకోదాంట్లో ఒకే ముఖం బొమ్మ ఒక్కోదాని మీద ఒక్కో రకంగా గీసి నలిపి ఉండలుగా చేసి పారేసిన పోస్ట్ఇట్ నోట్లు. సిగరెట్లు తాగకపోయినా టేబుల్ మీద ఇంకా పెట్టుకున్న ఒక ఆష్‌ట్రేలో లిక్కర్ చాకొలెట్ల తగరపు కాయితాలు. మార్కర్ పెన్నుతో టేబుల్ మీద రాసిన రెండు పొడి అక్షరాలు, వాటి మధ్య గుండె బొమ్మ. ఒక కుర్చీ నుంచి సన్నగా లావెండర్ వాసన, ఎవరిదో… ఇది వాడి లోకమే. ఏ లోకాన్నైతే చూసి భయపడ్డాడో, ఇప్పుడిక అది వాణ్ణి భయపెట్టదు. ఇది వాడి సొంత లోకం, వాడు దానికి రాజు.