17.
ఇంక రాసే వీలు లేక, ఇది ఇక్కడితో ఆపగలిగితే బాగుణ్ణు అనుకునే పరిస్థితి వచ్చింది నాకు. ఏవో ఆటంకాలు ఒక్కసారే వచ్చిపడ్దాయి. ఒకవైపు అలవాటైన పుస్తకాలకీ, పరిసరాలకీ, మనుషులకీ దూరంగా దేశం వదిలి వేరే దేశంలో ఉండవలసి వచ్చింది. పనులు చాల ఎక్కువ, తీరిక తక్కువ అయ్యింది. ఇంకొకవైపు ఇక్కణ్ణించి ముందుకి చెప్పుకోవలసిన విషయాలేమో చాలా ఉన్నాయి, జటిలంగా ఉన్నాయి; వాటిలో ఏ ఒక్కదాన్ని గురించయినా రాయడం చాల ప్రయాసతో కూడుకున్న పని. ఉదాహరణకు కావ్యాంగాలు ఐదు అని చెప్పుకున్నవి: మాట (Word); రూపకం (Metaphor); పద చిత్రం (Image); ఊహ (Thought); ఉద్వేగం (Emotion). ఇవి జ్ఞాపకం (Memory)తో కలసి ఆరూ సృజన నిర్మాణంలో ఎలా పాలుపంచుకుంటున్నాయి, వీటి మౌలికమైన స్వరూపం ఏమిటి, వీటికి పరస్పరం ఉన్న సంబంధాలు ఏమిటి అనేది ముందుగా చర్చించాలి. ఆ తరువాత సృజన వ్యవస్థలు ఒక్కొక్కదాన్నీ నిర్వచించి, వాటి స్వరూపాన్నీ, పరస్పర సంబంధాలనూ, పైని కావ్యాంగాలు ఈ ఒక్కో వ్యవస్థ నిర్మాణంలో ఏ పాత్ర పోషిస్తున్నాయనేదీ ఎత్తిరాయాలి. సృజన వ్యవస్థలు అన్నీ కలసి ఏక కాలంలో సృజనకు బిగువును, అంటే internal consistencyని, అందాన్నీ ఎలా ప్రసాదిస్తున్నాయనే అంశాన్నీ, ఈ నిర్వహణలో ఒక్కొక్క వ్యవస్థలోనూ ఉత్పన్నమయ్యే గుణదోషాలనూ విచారించాలి.
ఈ బిగువును గురించే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన అనుభవాలూ జ్ఞాపకాలూను అనే పుస్తకంలోన పదే పదే చెప్పుకున్నారు. ఇది ఒక్క స్థాయిలో కాకుండా సృజనలోని అనేక స్థాయిల్లోన, అంటే at different hierarchical scales, ప్రస్ఫుటమౌతుంది. ఉదాహరణకు ఒక శిల్పంలోన అనేక విగ్రహాలుంటే, ఒక్కొక్క విగ్రహపు అంగాలు – శిరస్సు, మొండెం, కాళ్ళు, చేతులూ ఇలాంటి వాటి నడుమ పొందికను సాధించుకోవాలి. అది అవయవాల స్థాయి (scale). అంతకంటె దిగువన శిరస్సులోని కన్ను, ముక్కు, పెదవులు వీటి మధ్యనా పొందిక కుదరాలి, అది ఇంకొక స్థాయి. అంతకంటె ఎగువన అన్ని విగ్రహాల మధ్యా సమన్వయం కుదరాలి, ఇది పై స్థాయి. మాట, పద బంధం, వాక్యం, పేరా, అధ్యాయం, సంకలనం, గ్రంధమాల, సారస్వత సముచ్చయం (Canon) ఇవి వచన రచనలో స్థాయికి ఉదాహరణలు. ఈ పొందిక అనేది ఒక్క కవితతోనో, కావ్యంతోనో ఆగదు. అది ఆ కవి సృజనలన్నిటి నడుమనూ పొందిక, అంటే consistency కావాలన్న ఆకాంక్షతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక కవి జీవితకాలంలోని అన్ని సృజనల నడుమ, అంతే కాక ఆయన సృజనలకూ సారస్వత మూర్తిమత్వానికీ నడుమా సమన్వయాన్ని, పొందికను ఆశిస్తాము. ఇది అక్కడితోనూ ఆగదు. సృజనకారుడు తనకు వారసత్వంగా సంక్రమించిన సారస్వత పరంపర లోన ఒక కాలానికి – అంటే యుగానికి (Age) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన సృజనకు, సారస్వత మూర్తిమత్వానికీ, అతను బతుకుతున్న యుగ ధర్మానికీ, అదివరకటి సాంస్కృతిక వారసత్వానికీ నడుమనూ పొంతన కోసం వెదుక్కుంటాము.
కాల్పనిక సృజనలోనే కాదు, మిగతా కళారూపాల్లోనూ, శాస్త్ర విజ్ఞానంలోనూ, నిర్వహణలోనూ, ఆత్మీయమైన సంబంధాలవంటి జీవితపు అనుభవాల్లోనూ, ఇలాంటి పొందికను ఆశిస్తాము. దీన్ని గురించి వివరించి చెప్పవలసింది ఉంది. సృజన శరీరానికీ, ఇదివరకు ఉద్వేగ ప్రధానమైనదని చెప్పుకున్న కావ్యాత్మకూ ఉన్న సంబంధ బాంధవ్యాలను వివరించి, అవి ఇదివరకు చెప్పిన దృశ్యాభాసను కవి పరంగానూ, పాఠకుని పరంగానూ – అంటే సృజన అనుక్రమపు రెండు కొసల్లోనూ ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదీ, ఈ వ్యవస్థలకూ పాతకాలంవాళ్ళు వర్ణిస్తూ వచ్చిన రసం, ధ్వని, వక్రోక్తి వంటి ప్రతిపాదనలకూ ఉన్న సారూప్యాలను పరిశీలించాలి. పాతకాలం వాళ్ళు – పింగళి లక్ష్మీకాంతంగారు, నారాయణాచార్యులుగారు, స. వెం. రాఘవయ్యగారు, శ్రీరామ చంద్రుడుగారు, శ్రీపాద వంటివాళ్ళు ఇలాంటి అంశాలను చాల ఆసక్తితో చర్చించేరు. అప్పట్లో వాళ్ళకు లేని వెసులుబాటు, ఇప్పుడు ఉన్నదీ ఏమంటే ఇంగ్లిష్ సారస్వతంలోను, అంతకంటె విశేషంగా మనస్తత్వం, Cognitive Science వంటి వైజ్ఞానిక రంగాలలోనూ అలాంటివే ప్రశ్నలని గురించి చర్చ చాల కొత్త గాను, బహుముఖం గాను, విజ్ఞాన శాస్త్రాలకు సహజమైన నిర్దిష్టత, ప్రామాణికత తోనూ వెలువడుతున్నాది. ఇవి అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ, ఇదివరకు చెప్పినట్లు ఒకే విషయం చుట్టూ మళ్ళీ మళ్ళీ చక్కర్లు కొడుతూ చేసే వివేచనకు ఇప్పుడు మొదటిసారిగా అవకాశం ఉంది.
ఆసక్తి ఉన్నవాళ్ళకు, ఈ వ్యాసంగంతో సంబంధం తప్పనిసరి అయిన వాళ్ళకూ అలాంటి వివేచన సహాయకరంగా ఉంటుంది. సృజన అనుక్రమం (pipeline) అని అనుకున్నది ఒక్క కవీ – పాఠకుల జోడీకే పరిమితమై ఆగిపోయేది కాదు. అది గరిష్టంగా ఒక భాషకు చెందిన మొత్తం సారస్వత సమాజానికీ, ఆ పైన మొత్తం మానవ సమాజానికీ వర్తిస్తుంది. ఇది అర్ధం చేసుకోడానికి ఇది వరకు జలస్రవంతి అని చెప్పుకున్న సాదృశం ఉపయోగిస్తుంది. యుంగ్ (Carl Jung), ఆయన అనుయాయులూ Man and His Symbols, ఇంకా Art and the Creative Unconscious వంటి పుస్తకాల్లోన ఈ విషయాన్ని వివరిస్తున్నారు. జాతి సుప్తచేతనను వాళ్ళు Collective Unconscious అని వ్యవహరిస్తారు. కవి ఒక్కడు కాడు; పాఠకుడూ ఒక్కడే కాడు. వాళ్ళు జాతి సాంస్కృతిక సంపదను, సారస్వత సంపదనూ వారసత్వంగా అందిపుచ్చుకున్నవాళ్ళు. సృజనశీలి తను పుట్టిన సమాజం, భాష, సంస్కృతి, చదువు నుండి ఇక్కడ కావ్యాంగాలు అని వ్యవహరిస్తున్న వాటిని తన యధాశక్తి గ్రహించి, సృజన కోసం వాడుకుని, ‘కెరయ నీరను కెరెగె చల్లి’ గీతంలో అన్నట్టు ఆ చెరువు లోంచి దోయిలించిన నీళ్ళనే మళ్ళీ అదే చెరువు లోనికి జార విడుస్తున్నాడు. పాఠకుల సమాజం ఆ సృజనను తమ యధాశక్తి గ్రహించి, తమ అంతశ్చేతన లోనికి జీర్ణం చేసుకొని మళ్ళీ జాతి సుప్త చేతన లోనికే తమ అభిప్రాయాలు, దృక్పధాలు, భాష, ఆచార వ్యవహారాలుగా తిరిగి సమర్పిస్తున్నాది. జాతీయమైన సృజన అనుక్రమాన్ని ఈ నేపధ్యంలో వివేచించి చూస్తే ఇక్కడ లేవనెత్తిన రెండవ ప్రశ్నకు సహాయంగా ఉంటుంది. అందుకు యుంగ్, ఆయన అనుయాయులు సృజన ప్రక్రియను గురించి ప్రతిపాదించిన విషయాలు వివరంగా ఎత్తి రాసుకోవాలి.
కవి సృజనను కల్పిస్తున్నప్పుడూ, పాఠకుడు దాన్ని పునర్నిర్మించుకుంటున్నప్పుడూ తీసుకొంటున్నవి వందలాదిగా సృజనాత్మకమైన నిర్ణయాలు సృజన వ్యవస్థలకు చెందినవి. ఈ aesthetic decision making ప్రక్రియను కవీ, పాఠకుడూ కలసి నెరపే తీరును, దాన్లోని సాధక బాధకాలనూ కధలు, కవితలు, నవలలు, నాటకాల నుండి ఎన్నో ఉదాహరణలతో వివరించి చెప్పాలి. కాల్పనిక సృజన పదార్ధ శిల్పం కాదు, కుర్చీలు, గోడల వంటి భౌతిక శిల్పం కాదు, కొట్టకొసాకి మాటలతో కట్టినట్టు రూపించినంత మాత్రాన అది భాషా శిల్పం కాదు, అంతిమంగా అది కేవలం తార్కికమైన వివేచనతో కాక, కళాత్మకమైన వివేకంతో కావ్యాంగాలను ఒక్కొక్కటీ ఏరి తెచ్చుకొని, పేర్చి, చెక్కుకునే మనోదృశ్య శిల్పం. దీనికి ఒక నమూనా దృశ్యాభాస అని ఇదివరకు చెప్పినది. ఇంకొకటి కల, మూడవది ప్రయాణం. వీటిలో కల అనేదాని సూచన ఏమంటే పాఠకుడు సృజన అనే కలలోనికి ప్రవేశించేక ఇంక ఎక్కడ ఏ సృజన వ్యవస్థకు ఏ పాటి భంగమయినా కల చెదిరిపోతుంది, పాఠకుడికి ‘మెలకువ’ వొచ్చేస్తుంది, అంటే సృజన అతని యెడల విఫలమయ్యింది. సృజన చదవటం లోనికి ప్రవేశించక ముందు పాఠకుడు లోకవ్యవహారం లోన నిమగ్నమై ఉన్నాడు. శక్తివంతము, అసలీ అయిన సృజన అతని లౌక్యాన్ని అటకాయించి, ఆపి, ధ్యాసను పూర్తిగా తనలో, అంటే తను కల్పించే దృశ్యాభాసలో నిమగ్నం చేసుకుంటుంది. సగటు పాఠకుడికే కాదు, గొప్ప మేధావికి, శాస్త్ర పండితుడికి కూడా సృజన మౌలికమైన స్ఫురణానుభవం ఇలాగే ఉంది. ఇది ఉద్వేగ ప్రధానమైన పరిక్రియ.
ఫ్రాన్స్‌లో డెగా (Edgar Degas) అని ఒక ఆర్టిస్ట్, ఫ్రెంచి కవి మలార్మేకు (Stephane Mallarmé) చిరకాలంగా స్నేహితుడు. డెగాకి కవిత్వం రాయాలని ఉబలాటంగా ఉండేది. ఆయన మలార్మే దగ్గరకెళ్ళి “నేను సంవత్సరాల తరబడి కవిత్వం రాస్తున్నాను. కాని అవి చదివితే నాకే వెగటుగా ఉంటుంది. ఇదేంటి? నా కవిత్వంలో మంచి పదునైనవి, కొత్తవీ ఎన్నో ఆలోచనలుంటాయే?! ఎందుకిలాగ …?” అని వాపోయేడు. మలార్మే “అయ్యో! కానీ …కవిత్వం ఆలోచనలతో కట్టరు; మాటలతో కడతారు. మాటల్ని జాగర్తగా వినాలి.” అన్నాడు. (“Oh, but poetry is not made with ideas; it’s made with words, you have to listen to the words.”) శ్రీపాద ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తారు. త్రిపుర నాకు ఏం చెప్పేరంటే కవి అంతిమంగా సారస్వతానికి ఇచ్చిపోయేది ఆలోచనలని కాదు, మాటలని. (“A poet’s contribution to literature is, ultimately, words, not ideas.”) ఇవి ఎలియట్ (T. S. Eliot) అన్న మాటలు. “Genuine poetry can communicate before it is understood.” అని ఎలియట్ చెప్పినది కూడా సృజనలో ఆలోచనకు, తార్కికమైన అవగాహనకు ఉన్న పాత్ర బలహీనమైనదని విశదం చేస్తున్నాది. సృజన అర్ధం చేసుకునే ప్రయత్నం కంటే ముందుగా అనుభవం అవుతుంది. ఇదివరకు చెప్పిన షావుకారు గారి వంటి పాఠకుడు – అంటే creative reader – ముందుగా సృజనను ఇలా పట్టి చూసి, ముందుకి చదవగలడో లేడో నిర్ణయించుకుంటున్నాడు. ఇలాంటి దార్శనికోక్తుల్ని తరచి చూసి, అవి ఏం ప్రతిపాదిస్తున్నాయో జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది.
సృజన నమూనాలను, అవి పనిచేసే పద్ధతుల్నీ అర్ధం చేసుకున్న తరువాత, సారస్వత సమాజం, లౌకిక సంఘం సృజనను గురించీ, సృజనకారుణ్ణి గురించీ ఒక అంచనాకు రావడాన్ని ప్రభావితం చేసే సామాజికాంశాలు – ప్రచురణ, సాహితీ స్నేహం, సంపాదకత్వం, ముద్రణ, పరపతి, ప్రచారం, ప్రవాస జీవితం, వనరులు, రాజకీయ వ్యవస్థ, అంతస్థు, సాంఘిక పరిస్థితులు, టెక్నాలజీ – ఇలాంటివాటి ప్రభావాన్ని తప్పనిసరి కాబట్టి కొంతైనా చెప్పుకోవాలి. ఎందుకంటే సృజన బహిరంగ వ్యవస్థను ఇవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు సృజనను వెలువరించే సందర్భంలో కవికీ, సంపాదకునికీ నడుమ జరిగే సామనాన్ని, సంఘర్షణను గురించి, సంపాదకుడు నిర్వహించే పాత్రను గురించిన వివేచన తెలుగులో ఏమంత అందుబాటులో లేదు. ఇంగ్లిష్‌లోనూ కొంచెమే ఉంది. శ్రీపాద సుబ్రహమణ్య శాస్త్రిగారికీ, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారికీ ఒక నవల ప్రచురణ సందర్భంలో కేవలం ఒక్క మాటను గురించి నెలల తరబడి నడచిన సంఘర్షణను, దాన్ని నివృత్తి చేసుకోడానికి మధ్యవర్తిని ఆశ్రయించిన వైనాన్నీ ఆయన వివరిస్తారు. సాలింజర్ (J. D. Salinger) ఇలాగే తన సృజనల్లోన కామాలు, చుక్కల్ని గురించి సైతం పరమ చాదస్తంగాను, కఠోరంగానూ ఉండేవాడట. (He strove for absolute perfection in his writing and sought complete power over its presentation. When a copy editor at the New Yorker dared to remove a single comma from one of his stories, Salinger snapped. “There was hell to pay,” recalled William Maxwell, and the comma was quickly reinstated.) సృజన ఆవిష్కరణలో కవి, మొదటి పాఠకుడు, సంపాదకుడు, ముద్రాపకుడు వీళ్ళ నడుమ జరిగే సామనం ఒక్కటి విచారించడానికే చాల అన్వేషణ ఉంది, వ్యవధి కావాలి. ఈ పనులన్నింటిలోనా ప్రతి అడుగూ ఇదివరకటి ఆలోచనల్ని, పుస్తకాల్ని, పరిశోధన పత్రాల్ని వెదుక్కొని, తరచి చూసుకొని, వివేచించి ఎత్తిరాసుకోవడానికి సమయం కావాలి, అదిన్నీ ఒంటరిగా కూర్చొని పనిచెయ్యగల అవకాశం. ప్రయాస ఏమీ లేదు ఎందుకంటే ఇది నాకు ఇష్టమైన పని, సహాయకరమైన పని కాబట్టి. వెతకడం, చదవడం ఎలాగూ నేను తప్పనిసరిగా చేసే పనులు. కాని, రాయడం దగ్గరకి వచ్చేసరికి అది ఎంతో ప్రయాస, సమయం తీసుకొనే పని.