హోమగుండం: కథ నచ్చిన కారణం

కథ: హోమగుండం
రచన: జరుక్ శాస్త్రి
కథాకాలం: 1945


శరత్ పూర్ణిమ, 1981.

జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పేరు చెప్పగానే కొందరికి మహాప్రస్థానానికి చెలం రాసిన యోగ్యతాపత్రం గుర్తుకి రావచ్చు. యెందుకటే చెలాన్ని, “ఇదేమిటి, ఈ మూల స్త్రీలకోసం ఇట్లా మూలుగుతున్నారు? శ్రీశ్రీ పద్యాలవేగంతో ప్రపంచపు పాతదుమారమంతా వూడ్చుకు పోతూ వుంటే!” అని ఆప్యాయంగా హెచ్చరించిన వాడు ఆయనే! లేదూ, విశ్వనాథ సత్యనారాయణగారిని ‘పాషాణపాకప్రభూ!’ అని సంబోధించిన వాడిగా మరికొందరికి స్ఫురించవచ్చు. ఇవేవీ గుర్తు రాకపోయినా తెలుగులో రమ్యమైన పేరడీలు రాసిన వాడిగా అందరికీ గుర్తుంటాడు. పేరడీ శాస్త్రిగా, జరుక్‌ శాస్త్రిగా, రుక్కాయిగా, ఎందరో మహాకవులకి, రచయితలకీ మంచి స్నేహితుడు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. ‘సిందూరం రక్తచందనం …కావాలోయ్ నవకవనానికి’ గీతానికి,

“మాగాయీ కందిపచ్చడీ ఆవకాయీ పెసరప్పడమూ
తెగిపోయిన పాత చెప్పులూ పిచ్చాడి ప్రభావం, కోపం
వైజాగ్ లో కారాకిళ్ళీ సామానోయ్ సరదాపాటకు”

అని పేరడీ రాసి, ఆ తరువాత శ్రీశ్రీ రాసిన రుక్కుటేశ్వర శతకం అంకితం పుచ్చుకున్న వాడు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి.

అయితే, ఆయన చక్కని కథలు చాలా రాశారని చాలా మందికి తెలియక పోవచ్చు. రకరకాల మారుపేర్లతో ఆయన రాయబట్టి అన్ని కథలూ సంపాదించడం సులువైన పని కాదు. రమణారెడ్డి ఆధ్వర్యంలో, 1934 నుంచి 1963 వరకూ ఆయన రాసిన కథల్లో దొరికిన 20కథలు పోగుచేసి శరత్ పూర్ణిమ అనే సంకలనం 1981లో నవోదయవాళ్ళు అచ్చువేశారు. ఈ ఇరవై చక్కని కథలే! అందులో నాకు నచ్చిన ఒక కథ గురించి ఇక్కడ ముచ్చటిస్తాను.

హోమగుండం 1945 లో అచ్చయిన కథ.

“స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకం మకుటంగా ఈ కథ ప్రారంభమవుతుంది. కథా వస్తువు ముందుగానే తెలిసిపోతుంది. కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి.

టూకీగా కథ ఇది:

హనుమంతరావు భార్యని దహనం చేసి నెల తిరక్కండా శరణాలయం పంచన పడివున్న నరసమ్మను పెళ్ళి చేసుకుంటాడు. నరసమ్మకి పుట్టిన బిడ్డ పోయిన పంతొమ్మిది రోజులకే తనని ఎవరో ఒకరు పెళ్ళి చేసుకుంటారని కలలో కూడా అనుకోలేదు. అలాంటిది, హనుమంతరావు రావటం, తను తనగురించి అన్ని విషయాలూ చెప్పటం, అతను తనని పెళ్ళి చేసుకోటానికి ఒప్పుకోవటం – హనుమంతరావులో ఆమెకు ‘దైవాంశ’ కొట్టవచ్చినట్టు కనపడిందంటే ఆశ్చర్యం లేదు.

ఆర్యసమాజం వివాహవేదిక మీద తలవంచుకొని కూర్చుంటే, తన మొదటి పెళ్ళి తతంగం అంతా గుర్తుకొచ్చింది: “తోలినకొద్దీ మూగి, దోమలు సంగీతం పాడి కుట్టినట్లు.”

మొదటి భర్త జబ్బు చేసి హటాత్తుగా చనిపోవటం, తలచెడి ఓ మూల చాపచుట్టలా పడి ఏడుస్తున్న దాన్ని మరిది మాయమాటలతో దగ్గిరకి తీయడం, గర్భిణీ కావడం, సంధికొట్టి బిడ్డ పోవడం, హనుమంతరావు తన జీవితంలోకి రావడం, సినిమాలా జరిగిపోయింది.

హనుమంతరావు మొదట్లో బాగానే ఉన్నాడనిపించింది. అతనిలో మార్పు అతి త్వరలోనే కనిపించింది. హనుమంతరావు కొడుకు, చిన్న పిల్లడు, కిష్టుణ్ణి, మేనమామ గుమ్మంలో దింపి పోయాడు. నరసమ్మ వాడిని బుజ్జగించి, లాలించి అతి గారాబంగా చూసుకోవటం వరకూ కథ చాలా సజావుగా నడిచిందనిస్తుంది. అయితే, హనుమంతరావులో నరసమ్మ పరంగా ఎందుకు అసహ్యం కలిగిందో చెప్పటం కష్టం. అతనికి చిరాకు పెరగటం, చివరకి నరసమ్మని కొట్టడం కూడా జరుగుతూంది; అనుమానంతో!

“ఏదో ఇంట్లో పడి వుండటం” కోసం నరసమ్మని పెండ్లానని అనడంతో నరసమ్మకి వెగటు మొదలైనా, భర్త అధికారానికి అడ్డుచెప్పగల ధైర్యం ఎక్కడినుంచి వస్తుంది? అయినా నరసమ్మ హిందూ స్త్రీ. భర్తని సుఖపెట్టడమే తప్ప తనకి వేరే ఏ విధమైన సరదాలూ ఉండటం నిషిద్ధం.

హనుమంతరావులో మార్పు, నరసమ్మ ఓర్పు కథకుడు రమ్యంగా చిత్రించడం ఈ కథకి ఆయువు పట్టు. అదే శిల్పం అని అంటే నాకు తగవు లేదు. మరొక విషయం. కథలో ఏ ఒక్క వాక్యం తీసెయ్యలేము. నరసమ్మ కిష్టుణ్ణి తన స్వంతకొడుక్కన్న మిన్నగా చూసుకుంటుంది. ఆ చిన్న వాడికి కథలు చెప్పుతుంది. హనుమంతరావుకి అదీ నచ్చదు. నరసమ్మ అలంకరించుకోవటం, బీచిలో తనకి అంటిపెట్టుకొని నడవడం, ఇవన్నీ అతనికి ఎందుకో ఇష్టం లేదు.

తేలిగ్గా ఆమెపై చెయ్యి చేసుకుంటాడు. అతని అనుమానానికి కారణాలు వెతకటం కష్టం. అయితే, తనే ఆవిడని అనవసరంగా నానా హింసలూ పెడుతున్నానని “నేను రాక్షసుణ్ణి” అని బాధపడతాడు. ఆర్యసమాజపు సంస్కర్తలని విమర్శిస్తున్నాడో, సమాజంలో గొప్ప కోసం వేసుకున్న అభ్యుదయపు ముసుగులో ఇమడలేక నలిగిపోయే అసమర్థులను ఎత్తిచూపుతున్నాడో – రచయిత ఉద్దేశ్యం మనకు అర్థం కాదు.

నరసమ్మ కడుపుతో ఉంది. వేవిళ్ళు. ఫలానాది కావాలని చెప్పుకోలేదు. సహనం హద్దు మీరుతుంది; ఎవరికైనా సరే!

కథ ఎలా ముగుస్తుందో చెప్పడం సబబు కాదు.

ఇద్దరి పాత్రల్లో వైవిధ్యం – మంచితనం, చెడ్డతనం రెండూ అందరిలోనూ ఎలా పెనవేసుకొని పోతాయో -కథకుడు సంభాషణల ద్వారా పాఠకుడికి బోధపరుస్తాడు. వ్యక్తులు, -స్త్రీలు కానీయండి, పురుషులు కానీయండి – కొన్ని సందర్భాలలో ఎంత అర్థం పర్థం లేకండా ప్రవర్తిస్తారో కళ్ళకు కట్టినట్టు రాస్తాడు శాస్త్రి గారు. కథ తర్కానికి అందదు. జీవితం తార్కికంగా జరగదు. కథ మాత్రం తార్కికంగా ఎందుకు నడవాలి? అందుకని ఈ కథ నాకు నచ్చింది; చదువుతున్నంతసేపూ, కళ్ళల్లో నీళ్ళు నిండినా కూడా!

కథ పూర్తయిన తరువాత మనలో అణిగి ఉన్న ‘విమర్శకుడు’ తార్కికంగా కథని బేరీజు వేయడానికి ప్రయత్నిస్తాడు; అది ఎంత శుష్కప్రయత్నమైనా సరే! తమాషాగా లేదూ!