ఆ నేల, ఆ నీరు, ఆ గాలి

రామరావణ యుద్ధం ముగిసింది. రావణుడు, రాక్షసులందరూ హతమార్చ బడ్డారు. సీతమ్మ వారి అగ్ని పరీక్ష కూడా పూర్తి అయ్యింది.

“అయోధ్యకి తరలి వెళ్ళాలి. ఏది మార్గం?” అని శ్రీరాముడు దీర్ఘాలోచనలో పడ్డాడు. “పోనీ వాలి కొడుకు అంగదుడిని సలహా అడిగితే? సలహా ఎందుకు? అంగదుడే అందరినీ భుజాలపై ఎక్కించుకొని అయోధ్యకి తీసుకొని పోగలడు గదా! కానీ, అతడేమో ఇప్పుడు రాజాయె! అతన్ని అడగడం బాగుండదేమో?” శ్రీరాముడికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.

“పోనీ జాంబవంతుడిని ఈ ఒక్క సారికీ, మాముగ్గురినీ నీ భుజాలపై ఎత్తుకొని పొమ్మని అడిగితే? కాదనడు; కానీ జాంబవంతుడు బహువృద్ధుడాయె! అయోధ్య దాకా ఎగర గలడా, అన్నది అసలు ప్రశ్న. కన్యాకుమారి నుంచి లంకకే ఎగరలేనన్న వాడు, లంక నుంచి అయోధ్యదాకా ఎగర గలడా? ఏమో మరి. అనుమానంగానే ఉన్నది. హనుమంతుడిని అడగచ్చు. అయితే, ఒక్కటే ప్రమాదం. వాడు, అయోధ్యకి బదులు సూర్యలోకానికే పట్టుకో పోగలడు. అది చిక్కే!

పోనీ సముద్రుడిని అడిగి చూసి పడవల్లో వెళ్ళితే? ప్రయాణం చాలా రోజులు పడుతుంది. అదొక హైరానా కదా?” తొందరగా, వీలయితే ఒక్క రోజులోపల ఇక్కడనుంచి అయోధ్య చేరే ఉపాయం చిక్కటల్లేదు.

“తప్పదేమో! నడిచే వెళ్ళాల్సి వస్తుందేమో మరి!. కాలి నడకన అయోధ్యకి వెళ్ళే మార్గం చాలా కష్టభూయిష్టమైనది గదా,” అని పైకి వినపడేలా అనంగానే, ఆ మాటలు సీతమ్మకి వినిపించింది. “నడిచి వెనక్కి వెళ్ళడమా? ఇంతకుముందు అడవుల్లో వచ్చేటప్పుడు జరిగిన భాగవతం ఏమీ గుర్తులేదా, స్వామీ?” అని ప్రశ్నించింది, సీతమ్మ. శ్రీరాముడు కళ్ళు మూసుకొని ఎడమ పిడికిలి గడ్డంక్రింద పెట్టుకొని మళ్ళీ దీర్ఘాలోచనలో పడ్డాడు!

***

నారదుడు బ్రహ్మాది దేవతలందరికీ జరిగిన రామాయణ కథ చెప్పుతున్నాడు:

సీతా రామ లక్ష్మణులు అయోధ్య నుంచి వన వాసానికి బయలుదేరారు. వింధ్య పర్వతాలు దాటి, అగస్త్యాశ్రమాకి వచ్చారు. సేద దీర్చుకున్నారు. అక్కడనుంచి పంచవటికి వెళ్ళాలి. దూరప్రయాణం.

కొద్దిరోజుల్లో మహానది దగ్గరకు వచ్చారు. లక్ష్మణుడు, వేట, కందమూలాలు, కట్టెపుల్లలూ తేవడం, సీతా దేవి వండిపెట్టడం, అందరూ సంతోషంగా దక్షిన దేశానికి ప్రయాణం చెయ్యడం, ఏతా వాతా శ్రీరాముడు ఋషులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాక్షసులని హతమార్చడం. ఇది వారి దినచర్య. ప్రత్యేకించి చెప్పుకోదగ్గ కొత్తదనం గాని, వింత గానీ ఏమీలేదు.

అంతా సవ్యంగానే నడుస్తున్నది, ఇంతవరకూ!

సీతారామలక్ష్మణులు గోదావరి ఉత్తర తీరానికి వచ్చారు. అంతవరకూ లక్ష్మణుడి వెనుక సీత, సీత వెనుక శ్రీరాముడు ప్రయాణం చేస్తున్నారు. శ్రీరాముడు, గోదావరి నీటితో సంధ్య వార్చి, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు. లక్ష్మణుడు “మమ” అనుకున్నాడు. సీత, లక్ష్మణుడు ఉత్తర గోదావరి నీరు త్రాగి,దప్పిక తీర్చుకున్నారు. ఏమయిందో కాని, ఇక్కడనుంచి లక్ష్మణుడు సీత వెనుక నడవడం మొదలెట్టాడు! విడ్డూరం!!

సీతకి గోదావరి ఒడ్డున కాలిలో తంగేటి ముళ్ళు గుచ్చుకున్నాయి. కుంటుకుంటూ నడుస్తూ ఏదో తనలో తాను గొణుగు కోవడం మొదలెట్టింది, వెనక నడుస్తున్న లక్ష్మణుడికి వినపడేట్టు! లక్ష్మణుడు ఎందుకో చాలా కోపంగా, రుస రుసలాడటం మొదలెట్టాడు.

” వదినా! ఏమిటి మీలో మీరు గొణుక్కుంటున్నారు?” అని లక్ష్మణుడు సీతమ్మని అడిగాడు.

“ కాలి లో ముల్లు కూడా తియ్యడు మీ అన్న గారు! నడవలేక నానా యాతనా పడుతున్నా. ఎన్నడూ, నాచిన్నతనంలో కూడ, చెప్పులు లేకండా నడిచేదాన్నే కాదు. ఇప్పుడు మీ అన్న గారి ధర్మవా అని, ముళ్ళు గుచ్చుకోని అరికాళ్ళు పుండ్లు పడుతున్నాయి. దానికి తోడు మీ ఇద్దరికీ రోజూ వండిపెట్టలేక చస్తున్నా!” అని అంది, సీతమ్మ.

” నా మాట ఏమంటావు వదినా! హాయిగా అయోధ్యలో ఉంటే ఊర్మిళ తో కలిసి రోజూ విందు భోజనం చేసే వాడిని.నేను మెళుకువగా ఉండటం కోసం ఊర్మిళ నాబదులుకూడా నిద్రపోతూ ఉన్నది. ఈయన గారి ధర్మవా అని, బైరాగిలా నేను మీవెనకాల పడ్డాను.” అని తన అక్కసు వెళ్ళబోసుకున్నాడు, లక్ష్మణుడు.

” రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకుందిట,” అని సీతమ్మ కాస్త బిగ్గరగా అంది, శ్రీరాముడికి వినపడేట్టు.

శ్రీరాముడు వెంటనే, ” నేను ముందే చెప్పానుగా. వనవాసం అంటే, పూలతోటలో విహారం కాదు, కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకింద విందు భోజనం కాదు అని. నే చెప్పిన మాట వినకండా, తగుదు నమ్మా అని వెంట పడ్డారు. ఇప్పుడు విచారించి ఏం లాభం, ‘ఇదే గత జల సేతుబంధనం,’ అంటే,” అని అన్నాడు.

“సుమంత్రుడు రథాలు, గుర్రాలు, సైన్యం, సిబ్బందీ వెంట పంపిస్తానంటే, వద్దనడం ఎందుకు? అప్పుడు ఈ హైరానా ఉండేది కాదుగదా! వన వాసమైనా, హాయిగా సరదాగా గడపకూడదని ఏ శాస్త్రంలో ఉంది, చెప్పండి? నువ్వు చెప్పులు తీసి భరతుడికిచ్చేస్తే, మేము కూడా చెప్పులు లేకండా నడవవలసి వస్తోంది. చూడు! పాపం, వదినకి ముళ్ళు గుచ్చుకోని నడవలేకండా ఉన్నది? ” అని చీదర పడ్డాడు లక్ష్మణుడు.

” కైకేయి పిన్ని నార బట్టలు ఇచ్చినప్పుడే, ‘మేము రాము,’ అని అనలేకపోయారా, మీరిద్దరూ! తనకి ముతక నారబట్టలు కట్టుకోడం చేతకాక పోతే, నాకేసి దిగులుగా చూస్తే, నేను కదా ఈ నార బట్టలు కట్టాను? నేను నా చెప్పులు భరతుడికిచ్చేస్తే, మీరు ఎందుకు ఇవ్వాలి?,” అని కాస్త గట్టిగా గసిరాడు శ్రీరాముడు.

” నేను యుద్ధం చేసి అయోధ్యకి రాజుగా నీకు పట్టం కట్టిస్తానంటే నా మాట విన్నావా అన్నయ్యా? నా మాట ఒప్పుకున్నావా? నాన్న గారికి ఒక్కసారి, ఒక్కసారంటే ఒక్కసారి, ఎదురుతిరిగితే కొంపేమన్నా ముణుగుతుందా? నువ్వేగనక ఒప్పుకోనుంటే, అందరికీ హాయిగా ఉండేదిగదా! మీ అమ్మ మా అమ్మ అందరూ సుఖంగా ఉండే వారేకదా, మనతోకలిసి? నిన్ను నమ్ముకోని నీతో వచ్చి నేను రెంటికీ చెడ్డ రేవడినయ్యాను,” అని అన్నగారికి ఎదురు సమాధానం చెప్పాడు లక్ష్మణుడు.

ఈ కసురు బుసుర్లతో, ఒకరిమీద ఒకరు నేరాలారోపిస్తూ, నీది తప్పంటే నీది తప్పని విసుక్కుంటూ ఒకరిమీద ఒకరు విసుర్లు వేస్తూ, కృష్ణా నది ఉత్తర తీరంకి వచ్చారు. కృష్ణలో స్నానంచేసి, శ్రీరాముడు యధావిధి గా అర్ఘ్యం వదిలి, సంధ్య వార్చు కున్నాడు. లక్ష్మణుడు మళ్ళీ “ మ మ,” అన్నాడు. అందరూ కొండెక్కి కనకదుర్గ గుడికెళ్ళారు. సీతమ్మవారు, కుంటుకుంటూ, కుంటుకుంటూ, ఉసూరంటూ కొండ పైకి ఎక్కింది. కొండ దిగుతూ ఉండంగా ఆవిడ కాలు బెణికింది, ‘కోతిపుండు బ్రహ్మ రాక్షసి,’ అన్నట్టు.

శ్రీరాముడి మీద మళ్ళీ కస్సు బుస్సుమంటూ ఉండగా,లక్ష్మణుడు, ” ఇప్పటి కైనా మించిపోయిందేమీ లేదు. హాయిగా నేను వెనక్కి పోయి, ఇంచక్కా భరతుడితో జట్టు కట్టుకుంటాను,” అని బెదిరించాడు.

వెంటనే సీతమ్మ అందుకొని, ” నన్ను కూడా నీవెంట తీసికో పో! పోనీ, నువ్వెళ్ళి, అయోధ్యనుంచి నాకు ఒక రథం పంపించు. నేను ఇక ఈ యమ యాతన పడలేను, ఈ మనిషితో! ” అంది.

” పోతే పోండి! మీతో నాకు పొంతన లేదు. మీకన్నా అడవుల్లో కోతులు నయం,” అని శ్రీరాముడు చర చరా నడుస్తూ పోయాడు.

పోతాం పోతాం అని బెదిరించారే కానీ, సీత లక్ష్మణుడూ రాముడి వెనకాలే కృష్ణ దాటి దక్షిణంగా ప్రయాణం కట్టారు. రాత్రింపగళ్ళు నడుస్తూ, రాముణ్ణి కసురుకుంటూ, ఆయన మీద విసుక్కుంటూ, వాళ్ళ వెర్రితనానికి వాళ్ళనే నిందించు కుంటూ తోకల్లా రాముడి వెంట ఉన్నారు.

పెన్న ఒడ్డుకి వచ్చారు. యధావిధిగా శ్రీరాముడు,స్నాన పానాదులు చేసి, సంధ్య వార్చుకొని, అర్ఘ్యం వదిలి, కాస్త సేద దీరాడు. మళ్ళీ మామూలుగా లక్ష్మణుడు “మ మ” అనుకున్నాడు. ఆ తరువాత ఒకచిన్న తెప్పకట్టుకొని, పెన్నా నదిని దాటారు.

అంతే! లక్ష్మణుడు, వెంటనే శ్రీరాముడి కాళ్ళ మీద పడ్డాడు, క్షమించమంటూ! ఇన్ని దుర్భాషలాడినందుకు తనకి, నరకమే గతి అని విలపించాడు. సీతమ్మ, కళ్ళనీళ్ళు పెట్టుకొని, తప్పంతా నాదే, నాథా శ్రీరామా! అని వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది.

శ్రీరాముడు, చిరునవ్వు నవ్వుతూ, “ మీరిద్దరూ బాధ పడవలసిన అవసరం ఏమీ లేదు. ఇందులో మీ తప్పు ఇసుమంత కూడా లేదు,” అని తమ్ముణ్ణి లేవదీసి, సీతమ్మని వడిలోకి తీసుకొని ఓదార్చాడు.

యధావిధిగా ముందుగా లక్ష్మణుడు, తరువాత సీత, సీత వెనుక ధనుర్ధారి అయి, వెయ్యికళ్ళతో వారిద్దరినీ కాపాడుతూ, శ్రీరాముడు ముందుకు దారి తీశారు!

ముక్కోటి దేవతలందరూ సీ తా లక్ష్మణుల వింత ప్రవర్తన విని ఆశ్చర్య పడి, నారదుడిని అడిగారు:

“స్వామీ! ఏమిటి ఈ విచిత్రం! మహానది దాటిన దగ్గిరనుంచి, పెన్న దాటేవరకూ, సీతారామలక్ష్మణులు కాట్లాడుకుంటూనే ఉన్నారు. పెన్న దాటంగానే, మళ్ళీ సీతా లక్ష్మణులు శ్రీరామ విధేయులయ్యారు? కారణం చెప్పండి?”

నారదుడు చిరునవ్వునవ్వి, “ అది వాళ్ళ తప్పుకాదు. వాళ్ళు నడిచిన నేల మహత్మ్యం. గోదావరి, కృష్ణల నీళ్ళు తాగి ఆ నేలపై నడిచిన వారంతా, కీచులాడుకోవడం, పోట్లాడుకోవడం, జ్ఞాతి వైరాలతో సతమత మవడం, మామూలే!” అన్నాడు.

“ మరైతే, స్వామీ! సీతా రామ లక్ష్మణులు లంకనుంచి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఈ భాగవతం తప్పదా?” అని అడిగారు, బ్రహ్మాది దేవతలందరూ, ఏక కంఠంతో!

నారదుడు చిరునవ్వు నవ్వుతూ: “ ఆ భయం ఏమీ లేదు. వాళ్ళు లంకనుంచి తిరిగి అయోధ్యకి, వాయువేగాన ఒక్క రోజులో వెళ్తారు. చూడండి!” అని, చెప్పాడు.

***

శ్రీరాముడు నిద్రనుంచి ఉలిక్కిపడి మేల్కొన్నట్టు దబుక్కున కళ్ళు తెరిచాడు. ఆనందంతో ఆయన ముఖం నీలి కలువలా వికసించింది. అరిటాకులా విప్పారింది. వెంటనే విభీషణుడిని పిలిపించాడు. కుబేరుడి పుష్పకవిమానం సిద్ధం చేయించమన్నాడు. అంతే!

సపరివారంగా సీతా రామలక్ష్మణులు పుష్పకవిమానం ఎక్కి వాయువేగంతో అయోధ్యకి చేరుకున్నారు!

ఆ నేల, ఆ నీరు, ఆ గాలీ సోకకుండా!

ఇతి.

(కథకి సవరణలు సూచించిన సావిత్రి మాచిరాజుకి, కె.వి.యస్. రామారావుకి, మొట్టమొదటిగా వినంగానే మకుటం సూచించిన శంఖవరం పాణినికి కృతజ్ఞతలతో!)