అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం

కథ: అద్దంలో జిన్నా
రచన: దేవరకొండ బాలగంగాధర తిలక్‌
కథ రచనా కాలం: 1961

దేవరకొండ బాలగంగాధర తిలక్‌ (1921 – 1966) ప్రతిభావంతుడైన కవిగా, అమృతంకురిసిన రాత్రి తెలుగువారికి పంచి ఇచ్చిన మధుర కవిగా, ఆధునిక తెలుగు కవిత్వంతో పరిచయం ఉన్న వారందరికీ తెలుసు. ఇరవై ఏళ్ళు నిండకముందే తిలక్ తన కవిత్వాన్ని స్పష్టపరిచాడు:

“నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు,” అంటూ.

1941లో తెలుగు కవితాలోకానికి హఠాత్తుగా, తోకచుక్క వెలుగులా ప్రత్యక్షమై సమ కాలీన కవులందరినీ ఆకట్టుకున్న కవి, తిలక్. ‘రొమాంటిసిజం‌’ తిరిగి రాస్తున్నాడు అని అబ్బురపోయిన వాళ్ళూ ఉన్నారు; తరవాత ‘ఓస్‌ ఇంతేనా’ అని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. ఆ కవే, 1963లో తన “అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు” అన్న శపథం నిలబెట్టుకుంటున్నాడా అన్నట్టు, పరమ శక్తివంతమైన ‘ప్రార్థన’ రాస్తాడని ఎవరూ ఊహించి ఉండరు.

అలాగే తిలక్ అద్భుతమైన కథలు కూడా రాసేడు. 20 కథలతో ఒక సంకలనం మొట్టమొదటి సారి 1967లో ప్రచురితమయ్యింది. 1983లో రెండవ కూర్పు వచ్చింది. 29 కథలున్న ఈ సంకలనంలో చాలా చక్కని కథలున్నాయి. ఉదా: దేవుణ్ణి చూసిన వాడు, నల్లజర్ల రోడ్డు, సుందరీ – సుబ్బారావు, ఊరి చివర ఇల్లు, ఇలాంటివెన్నో. అయినా తిలక్ ప్రస్తావన వచ్చినప్పుడు, తిలక్ మంచి కథకుడు కూడా అన్న సంగతి మరిచిపోతాం. శ్రీశ్రీ విషయంలో కూడా అంతే. ఒక మహాప్రస్థానం మనకిచ్చిన మహాకవిగానే గుర్తుంచుకుంటాము కాని, చరమరాత్రి వంటి మంచి కథలు రాసిన కథకుడు అన్న సంగతి గుర్తుంచుకోము. కథకులుగా వీరిద్దరికీ రావలసిన పేరు రాలేదని నా అభిప్రాయం.

తిలక్ కథల్లో సూటిగా రాజకీయ ప్రస్తావన ఉన్న కథలు రెండు: తీవ్రవాదనాయకుడు, అద్దంలో జిన్నా.

నాకు నచ్చిన కథ అద్దంలో జిన్నా.

మొదటి కారణం: ప్యూర్లీ పర్సనల్‌. ఈ కథని, నేను, తంగిరాల సుబ్బారావూ కట్టుగా విన్నాం, తిలక్ చదువుతూండగా! కొన్ని కథలు, రచయితే చదువుతూ ఉంటే వచ్చే అనుభూతి ఒక రకం. అప్పటి అనుభూతి ఒక గుర్తు మాత్రమే. ఎప్పటికీ మరిచిపోలేని గుర్తు.

కొన్ని ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ కథ చదివాను. నా అంతట నేనే, ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా, ప్రతివాక్యం చదివితే వచ్చిన అనుభూతి వేరు. ఇది కథా? కవితా? అన్నప్రశ్నకి ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. అసలు ఇటువంటి ప్రశ్నకి సమాధానం ఉంటుందా? అని అనిపించింది.

మత రాజకీయాలని, విద్వేషాలనీ అవతలకి నెట్టి ఈ కథ చదవవలసిన అవసరం ఉన్నది. ఈ కథని చదవవలసిన నేపథ్యం కూడా వేరే! మహాత్మా గాంధీ అంటే సాధారణ భారతీయులకి ఎంత ఆదర్శమూర్తో, మహమ్మదాలీ జిన్నా పాకిస్థానీయులకి అంత ఆత్మీయుడు. గాంధీ భారత దేశాన్ని అఖండ భారతంగా ఉంచాలని విపరీతమయిన పట్టు పట్టాడు. నెహ్రూని పక్కకి తప్పించి జిన్నాని మొదటి ప్రధానిగా చెయ్యటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. అయితే, జిన్నా గురించి హిందువులకి ఉన్న అభిప్రాయాలు వేరు. ఈ కథ చదివిన తరువాత జిన్నాని ఒకరకమైన సానుభూతితో చూడాలన్న అభిలాష కలగక మానదు. బహుశా కథకుడుకి ఆ దృష్టి ఉన్నట్టు కనిపిస్తుంది.

తిలక్ రాస్తాడు: “తాను (జిన్నా) వారిలో (ముస్లిములలో) అవ్యక్తంగా ఉన్న ఒక ఆశ. తన వ్యక్తతలో వాళ్ళందరూ మడతలు పడిపోయిన ఒక పెద్ద అవ్యక్తత.” In his distinctness, they are all folded into one huge indistinctness.

భారతదేశం మూడు పెద్ద ముక్కలుగా విరుగ్గొట్టటానికి ముందు సమయం, ఈ కథ నేపథ్యం. అయినప్పటికీ కొద్ది మార్పులు చేసి చదివితే ఈ కథ ప్రస్తుత ప్రపంచ వాతావరణానికి కూడా సజావుగా సరిపోతుంది.

తనవెంట మహమ్మదీయులంతా వస్తారు. ఎందుకు వస్తారో వారికి తెలియదు. అజ్ఞానం. అజ్ఞానం క్రియకీ కర్మకీ కారణం. జ్ఞానం సమాధికీ నిదానానికీ కారణం. ఈ అజ్ఞానాన్ని తాను భద్రంగా కాపాడుతాడు.”

ఈ పైవాక్యాలు చదవంగానే, జిన్నా తన స్వప్రయోజనం కోసం, దేశాన్ని ముక్కలు ముక్కలుగా చెయ్యడానికి దోహదం చేశాడనిపిస్తుంది. పాఠకుడికి ఆ భావన స్ఫురిస్తుంది. నిజమే! కాని,

తన మనస్సు తన భావాన్ని నిజానికి నమ్మలేదు. తనలో ఉండే అధికార వాంచ ఆ భావాన్ని తయారు చేసి యితరులని నమ్మమంది. తాను నమ్మినట్టుగా నమ్మించింది.

జిన్నా ఇంగ్లండ్‌లో చదువుకున్నాడు. సెక్యులరిస్ట్ భావాలున్న న్యాయవాది. షేర్వానీ, సల్వార్ కమీజులు కాకుండా వెస్టర్న్ సూట్స్ వేసుకునేవాడు. సిగరెట్, మందు అలవాటున్నవాడు. నిజానికి జిన్నా ఖురాన్ చదివుంటాడా అని సందేహం వచ్చినా రావచ్చు. భారత స్వాతంత్ర్య సమర చరిత్ర సమగ్రంగా చదివినవాళ్ళకి తప్పకుండా గుర్తుండే విషయం: బాలగంగాధర తిలక్ (లోకమాన్య) పై బ్రిటీషు ప్రభుత్వం దేశద్రోహం మోపినప్పుడు, జిన్నా లోకమాన్య తిలక్‌ తరఫున వాదించిన న్యాయవాది. ముస్లిం లీగ్‌కి, అప్పటి కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ సమన్వయం సాధిండానికి కృషిచేసిన వాడు జిన్నా. ఈ విషయాలు రచయిత తిలక్‌కి క్షుణ్ణంగా తెలుసు.

అందుకే కాబోలు, అద్దంలో జిన్నా కథలో జిన్నాలో వచ్చిన విపరీతమైన మానసిక ఆందోళన, రోడ్ల మీద రక్తం, వేలకొద్దీ అమాయకుల రక్తం, హిందువుల రక్తం, ముస్లిముల రక్తం చూసిన తరువాత అద్భుతంగా చిత్రించబడింది. ‘తన భావం కోసం ఇంత ఘోరం జరిగింది,’ అన్న మానసిక ఆవేదన కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. అది కథకుని శిల్ప ప్రజ్ఞ.

అద్దంలో జిన్నా గుండెమీద రక్తపు మరక కనిపిస్తుంది. ఇది ఒక చిత్రమైన ప్రతీక. తనకు తప్ప ఇంకెవరికీ కనిపించదు ఆ రక్తపు మరక. ఆ రక్తపుమరక తనతో అంటుంది: ” నీ భావం అబద్ధం. నీ భావం అనవసరం,” అని. అంతే కాదు, ‘తనే నిజం’ అని ఘోషిస్తుంది, రక్తపు మరక.

కళ్ళు మూసుకుంటాడు జిన్నా. తన మనస్సుకి అతని మనస్సు కనిపిస్తుంది. జిన్నా మనస్సులో ఉన్న భయంకర పరమాణువు చూస్తాడు. చూసి, ఇలా అంటాడు: “నీ భావం నాకు వద్దు. నీ భావం అనేకమందిని చంపింది. నీ భావం అబద్ధం. కృత్రిమం. నిజమైనా కూడా నాకు వద్దు. నేను అందరితోనూ నిజం చెప్పేస్తాను. నాకు శాంతి కావాలి. నాకు మైత్రి కావాలి,” అని.

చేతులు కాలినాయి. ఇప్పుడు ఏం ప్రయోజనం? ‘అహం’ ఎర్రగా ఎదురు తిరిగింది. జిన్నా హడిలి పోయి తలవంచుతాడు, తన అహానికి. తను పురికొల్పిన మూర్ఖతకి తానూ తల ఒగ్గుతాడు. తప్పదు. బయట విలేఖరులకి ఇచ్చే సందేశం రాజకీయనాయకుడిగా ఇచ్చే సందేశం. ఈ సందేశం తాను నిజంగా నమ్మిన సత్యం కాదు. అది జిన్నాకి తెలుసు. చివరలో, తన గుండెమీద కనపడ్డ రక్తపు మరక అబద్ధం కాదు. ప్రతిబింబం అసలే కాదు. చెరిపినా చెరగదని గుర్తిస్తాడు.

ఒక అబద్ధాన్ని, నిజం అని చెప్పి నమ్మించవచ్చును. తర్వాత ఆ అబద్ధం అబద్ధమేనని చెప్పినా ఎవరూ నమ్మరు. నాయకుడెప్పుడూ నాయకుడి లాగానే ఉండాలి. అలా ఉండకపోతే నాయకుడినే చంపేస్తారు. సాంఘిక మతపరమైన ఒక మూర్ఖతని తాను పురికొల్పాడు. ఆ మూర్ఖతకి తానూ తల ఒగ్గాలి, చివరకి. నాయకుడు అజ్ఞానాన్ని అభివృద్ధి చెయ్యాలి. అజ్ఞానం బలమైనది. జ్ఞానం చురుకైనది. ఈ మాటలు రచయిత మనకి చెపుతున్నాడు; అయినా ఇది జిన్నా మనసులో పుట్టిన నిజమే!

మనిషిలో మంచి, చెడుల మధ్య పోరాటం – ఈ juxatapositionని – అతి చాకచక్యంగా తిలక్‌ చిత్రించాడు. ఇంత నిశితంగా వ్యక్తి మనస్తత్వాన్ని పరిశీలించి రాసిన పాత కథకులు పద్మరాజు, బుచ్చిబాబు, త్రిపురలు. అద్దంలో జిన్నా కథ చదివిన తరువాత, తిలక్‌ కూడా ఈ కోవకి చెందిన కథకుడే అనిపించక మానదు. కథలో ప్రతి పేరా ఒకటికి రెండు సార్లు చదివిస్తాడు రచయిత. కథాంతంలో, జిన్నా మీద కోపం, ద్వేషానికి బదులు అతనిపై కరుణ, దయ – compassion, pity – వస్తాయి.

మొదట్లో నేను ఇది కథా? కవితా? అన్న సందేహం వ్యక్తపరిచాను. కథలని కొన్ని లక్షణాల చట్రాలతో బిగించి కట్టుదిట్టంగా చూసే అలవాటున్న వారికి, ఇది ఒక స్కెచ్‌. సైకలాజికల్‌ స్కెచ్‌గా కనిపించవచ్చు. అది భవ్యమే కావచ్చు కూడాను. నా మటుకు నాకు ఇలా అనిపిస్తుంది: లబ్ధప్రతిష్టులైన కవులు కథ రాసినా, కవిత్వం రాసినా కవిత్వం లాగానే కనపడుతుంది. చదివితే కవిత్వంలా వినిపిస్తుంది. అయితే, ఈ వివరణని సాధాకరణీకరించను. ఇది అన్ని కథలకీ వర్తించకపోవచ్చును, కాబట్టి. (తిలక్‌ రాసిందే మరొక చిన్న కథ; కవుల రైలు అని. అదీ, నా ఉద్దేశంలో కవితే.)

ఈ కథ నచ్చటానికి మరో కారణం, ఇది నాకు కవితగా అర్థమయ్యింది కాబట్టి.

మీకు తెలిసే ఉండాలి; దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ‘మా ఊరు పోయింది’ అనే కథ రాసారు. అది నిజంగా కథ కాదు; కవిత. తిలక్ రాసిన అద్దంలో జిన్నా అదే కోవకి చెందుతుందని నా అభిప్రాయం.

[పుస్తకం వివరాలు: తిలక్ కథలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, మూడవ ముద్రణ 1993, రూ. 35.00, అన్ని విశాలాంధ్ర బుక్ హౌస్‌లలో లభ్యం.]