ముప్ఫై ఐదు సంవత్సరాల క్రితం, తెలుగు వారి ‘సాంఘిక, సాంస్కృతిక’ అవసరాలకోసం దేశ వ్యాప్తంగా ఒక సంస్థ ఉద్భవించింది. అమెరికాలో తెలుగువాళ్ళు రెండేళ్ళ కొకసారి ఒక ఊరిలో కలుసుకొని, రెండు రోజుల పాటు సరదాగా గడిపి, మరుపురాని అనుభవాల జ్ఞాపకాలతో ఎవరి గూళ్ళకి వాళ్ళు చేరే వాళ్ళు; మళ్ళీ రెండేళ్ళ తరువాత కదా అని అనుకుంటూ!
అది అప్పుడు.
కాలక్రమేణా ఇరవై ఏళ్ళు తిరక్కండానే, ఆ ఒక్క సంస్థ రెండు ముక్కలయ్యింది. ఇప్పుడు, ఆ రెండు సంస్థలూ నాలుగు సంస్థలుగా చీలిపోయాయి. చీలికలకి అసలు కారణం ఏమయితేనేం? తెలుగువారి సంఖ్య బాగా పెరగటం; వేలకివేలు జనం ఒక ఊరిలో ఒక కప్పు కింద మునపట్లా కలవటం అసాధ్యం కావటం కావచ్చు. లేదూ, అలా అనుకుని మనని మనం మభ్యపెట్టుకోవచ్చు, లేదా సమర్ధించుకోవచ్చు; ఏతావాతా ఊరట పడవచ్చు కూడాను! కొన్ని పెద్ద పట్టణాలలో స్థానిక సంస్థలు కూడా రెండో మూడో ముక్కలుగా చీలి పోయాయి. ఇవి మరిన్నిగా చీలిపోవన్న నమ్మకం ఏమీ లేదు.
అలా అని, ఈ సంస్థల ఆదర్శాలలో మార్పు ఏమీ లేదు. అన్ని సంస్థలూ తెలుగువారి ‘సాంఘిక, సాంస్కృతిక’ అవసరాలకే అంకితమైనవి. ఇప్పటికీ ఆ అవసరాలు ‘ఇవి’ సుమా! అని నిర్థారణగా ఏ ఒక్క సంస్థా ప్రతిపాదించలేదు. అంతేకాదు. చాలా ఊళ్ళల్లో స్థానిక సంస్థలు కూడా ఈ ఆదర్శాలనే వల్లె వేస్తాయి. అందువల్ల, ఈ సంస్థలన్నీ కూడా ఇంచుమించు ఒకే ‘సాంఘిక సాంస్కృతిక’ నమూనాను (ఒక టెంప్లేట్ లాంటిది) అనుసరించడం మనం గమనించవచ్చు. సాంస్కృతికోత్సవాలలో అష్టావధానాలు, కొత్త కొత్త సినిమా పాటలకి (వాటి అర్థం దేవుడెరుగు, వాడికీ తెలుగొస్తే!) రికార్డు డ్యాన్సులు మన పిల్లలతో వేయించడం లాంటివి, ఈ నమూనాలో అంశాలే.
తమ సాంస్కృతిక సమావేశాలకు ఈ సంస్థలన్నీ వారివారి ఆర్థిక స్థోమత కొద్దీ తెలుగునాడు నించి, అతిథులని ఆహ్వానించడం ఆచారంగా మారింది. ఈ అతిథులలో ముఖ్యులు వెండితెర నటీనటులు, గాయకులు, రాజకీయ నాయకులూనూ! అడపాతడపా ఒకరిద్దరు కవులో రచయితలో కూడా ఉండవచ్చు. తెలుగు సంస్థల సంఖ్య పెరగటం వెండితెర పని మందగించిన నటీనటులకి, రకరకాల రాజకీయవాదులకీ క్రొత్త ‘పని’ కల్పించింది. పాత రోజుల్లో రాజకీయ నాయకులు ఈ సమావేశాల నెపంతో రెండేళ్ళ కొక్కసారి అమెరికా రావడం జరిగేది. ఇప్పుడు ఏడాదిలో రెండు సార్లు అమెరికా నుంచి ఆహ్వానం రావొచ్చు. సంస్థల సంఖ్యతో పాటు రాజకీయ ‘అతిథుల’ సంఖ్య కూడా ముమ్మరంగా పెరిగింది. వీరితోపాటు హిందూమత ప్రచారకులు, అంటే స్వామీజీల, బాబాల జోరు కూడా బాగా పెరిగింది. అప్పుడు వాళ్ళ పరపతి పెంచుకోడానికి మనం వారికి అవసరమైనామని, ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారయి ఇదంతా కూడా ఈ సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో తమ ప్రాబల్యం పెంచుకోడం కోసం చేస్తున్నారన్న ఆరోపణ ఒకటున్నది.
పాత రోజుల్లో అతిథులుగా వచ్చిన రాజకీయ నాయకులందరూ ఒకే రకమైన పాట పాడేవారు. “మీ పిల్లలకి తెలుగు నేర్పండి, వాళ్ళు మన భాషకి దూరమయిపోతున్నారు,” అని. ఇప్పుడు ఆ పాట పాడటం మానేశారు. కారణం: ప్రతి ఊళ్ళోను, తెలుగు భాష నేర్పడానికి కావలసిన సామగ్రి, సరంజామా ఏర్పాటు చెయ్యడం, అందుకు ప్రయత్నించడం తేలిక పని కాదని గ్రహించి ఉండటం కాదు. అంతేకాదు; ఏ హంగులూ లేకపోయినా ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలు తెలుగులో మాట్లాడటానికి ఉబలాటపడటం, ఆదివారం బడులకి వెళ్ళటం, కాస్తో కూస్తో తెలుగు నేర్చుకోడానికి శ్రద్ధ చూపించటం కొన్ని పట్టణాలలోనైనా గమనించి, ‘తెలుగు మీద శ్రద్ధ అక్కడికన్నా ఇక్కడే నయం,’ అని అనిపించి ఉండటమూ కాదు. ఆ పాట పాతబడిపోవటం అందుకు కారణం.
పాత రోజుల్లో ఒకరో ఇద్దరో స్వామీజీలు ముఖ్యంగా వేదాంత భాషణ చేయడానికని వచ్చేవారు. ఇప్పుడు, ఆచారకర్మకాండలు కూడా చేస్తున్నారు. కలశపూజలు, ఊరేగింపులు, సామూహిక వ్రతాలు, ఒకటేమిటి, అన్ని రకాల ‘రిచువల్స్’ చేస్తున్నారు. ఒక సమావేశంలోనయితే, ఒక మినీ గుడి కూడా కట్టేశారు. వచ్చేపోయే జనం దణ్ణాలు పెట్టుకుంటూ పోవడం వింతగానే కనిపించింది. ఒకప్పుడు, యెన్. టి. రామారావుగారు సినిమాలో దేవుడు వేషంలో ఉన్న అట్ట బొమ్మ సినిమాహాళ్ళ ముందు పెడితే జనం దణ్ణాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి దక్షిణ వేసి ‘ప్రసాదం’ తీసుకొవెళ్ళినట్టు! అదొక వేలం వెర్రి!
ఈ మధ్య కాలంలో వస్తున్న రాజకీయ అతిథులు క్రొత్తమాటలు వల్లె వెయ్యటం మొదలుపెట్టారు. “మన సంస్కృతి చాలా గొప్పది. చాలా పురాతనమైనది. దానిని మనం పరిరక్షించుకోవాలి,” అని. వేరే మాట దొరకక ఈ రాజకీయ నాయకులని అతిథులు అని సంబోధించాను. వీరందరినీ సంస్థలు ఆహ్వానించి ఉండకపోవచ్చు. వీరిలో కొందరు వారంతట వారే అమెరికా యాత్రకి వచ్చి ఉండవచ్చు అప్పట్లో లాగా. అయితే, వచ్చిన వాళ్ళనందరినీ వేదిక నెక్కించే దౌర్భాగ్యం ఇంకా మనని వదిలిపెట్టలేదు. పోని, మొహమాటం కొద్దీ వేదికపైకి ఆహ్వానించారనుకోండి; వాళ్ళందరూ ఉపన్యాసాలు ఇవ్వనక్కరలేదు. పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరీ అన్నట్టు, వీళ్ళందరూ మన ‘సంస్కృతి’ గురించి ఏకరువు పెట్టనక్కరలేదు. శాసనసభలో మాట్లాడినట్టు గొంతు చించుకొని అరవవలసిన అవసరం అంతకన్నా లేదు.
అర్థం పర్థం లేకండా, ఎక్కడ పడితే అక్కడ ప్రతి రాజకీయ నాయకుడూ మన సంస్కృతి, మన సంస్కృతి అంటూ ఎడతెరిపి లేకండా ఉపన్యాసాలు ఇవ్వడం చూస్తే, ప్రతాపరుద్రీయం నాటకంలో పేరిగాడు, స్వారస్యపు తాడు గుర్తుకు రాకమానదు. సంస్కృతి! సంస్కృతి! అని ఊదరగొట్టే జర్మనులను ఉద్దేశిస్తూ గోరింగ్ అన్నాడట: ” When I hear the word culture, I reach for my revolver,” అని.
నిజం చెప్పాలంటే మన రాజకీయ నాయకులకి మన సంస్కృతి, మన భాష – ఈ రెండూ అవసరం లేదు. చప్పట్ల కోసం చెప్పటం తప్ప, ఈ రెండింటి పైనా ఏ విధమైన గౌరవమూ లేదు. వాళ్ళ లాగానే మన సంస్థలు కూడా ఈ పడికట్టు మాటలు వల్లెవేయడం, నమూనా సమావేశాలు నిర్వహించడం నేర్చుకున్నాయి. అంతే! ఈ దేశంలో మన భాషని, మన భాషాసాహిత్యాన్ని, దానితో పాటు మనదైన ప్రత్యేకతనీ నిలబెట్టుకోవడానికి చెయ్యవలసిన ప్రయత్నం ఏ సంస్థా చెయ్యటల్లేదనే నిరాఘాటంగా చెప్పవచ్చు.
ఈ మధ్య కాలంలో జరిగిన ఒక్క వార్తావిశేషం చెప్పి ముగిస్తాను. ఒక స్థానిక సంస్థ ముప్ఫైవ వార్షిక సమావేశం సందర్భంగా తెలుగుబోధనావశ్యకత గురించి మాట్లాడటానికి ఒక పెద్దమనిషిని రమ్మనమన్నారు. ఆయన విద్యాధికుడు, పండితుడు. వేదిక మీద యధాతథంగా, ఒక నటుడు, బోలెడుమంది రాజకీయ నాయకులూ ఆసీనులయ్యారు. జ్యోతి ప్రజ్వాలనలూ వగైరా తరువాత, అందరూ తెగ మాట్లాడారు మన ప్రాచీనత గురించి, మన సంస్కృతి గురించి. మామూలే! ఆఖరిగా, ఆ పెద్దమషిని వేదిక పైకి రమ్మని ఆహ్వానించారు. ఈ లోగా మాట్లాడేసిన నటుడుఁగారు, ఆయన అవసరం తీరిపోవడంతో వేదిక దిగి పోవడం, జనం ఆయన చుట్టూ మూగేసి ఫొటోలు తీయించుకోవడం, మధ్యాన్నం భోజనాలవేళ వరకూ అక్కడే ముమ్మరంగా సాగింది. ఆ నటుడు నిష్క్రమించగానే జనం కూడా భోజనాలకి వెళ్ళిపోయారు. ఆ పెద్దమనిషి, యెం.సీ. మాత్రమే ఆ హాలులో మిగిలారు!
ఇది, ఇప్పుడు.