అహోరాత్రం

ఒకటే వృత్తం చుట్టూ పరిగెడతారు వాళ్ళందరూ
నిరంతరంగా, నిర్నిరీక్షణగా
లెక్కలేనన్ని ఆశలు దారిలో వెదజెల్లుతూ
ఒక్కరోజులో వృత్తం చుట్టబెడతాడొకడు
అమూర్తుడతడు

మరొకడు జారిపడ్డవాటిని జేబులో పట్టినంతవరకూ
ఏరుకుంటూ
అందులో కొన్నిటిని విత్తులుగా వెదజెల్లి
నెలకొక ఆవృత్తం పూర్తిచేస్తాడు,
ఉబ్బసరోగం వాడికి

మరో నలుగురు కాస్త నెమ్మదిగానే పరిగెడతారు
పడ్డ విత్తులని భూమిలో నాటతాడొకడు
వాటికి నీరుపోస్తాడొకడు
వెలుగునిస్తాడొకడు
దడికడతాడింకొకడు
సావకాశంగా ఏడాదికొకసారి
వృత్తం చుట్టూ తిరుగుతారు వాళ్ళు
మొక్కలన్నా జీవితమన్నా ఇష్టం వాళ్ళకి

బవిరిగెడ్డం తాత కూడా అక్కడే తచ్చాడుతూ ఉంటాడు
ఆ చేపకళ్ళలో మార్దవం, చూపులు మాత్రం బాణాల కొనలు
వేర్లు పరికిస్తాడు, పూలని పళ్ళగా ఎలా మార్చుకోవాలో
మొక్కలకి పాఠాలు చెప్తాడు, వినే ఓపికుంటే!
చేతికర్ర తాటిస్తూ అడుగులో అడుగేసి నడిచే జ్ఞాని కాబోలు

గొప్పులు తవ్వడానికి,
కలుపు తియ్యడానికి
కాల్వలు కట్టడానికి
పంట కొయ్యడానికి
ప్రయాసపడుతుంటాడు ఒక్కడే, ఒంటరిగా
వాడంటే మాత్రం ఎవరికీ పడదు
ఎవరికీ అర్థంకాని నల్లటి విషాదం వాడిది
మరి ముప్పై ఏళ్ళు పడుతుందిగా వాడికి
ఆ వృత్తం చుట్టూ తిరగడానికీ?

పగటిపూట నీడలో ఒకడు
రాత్రి నీడలు పరుస్తూ మరొకడు
చెట్లనుంచి వేలాడుతూనో
పుట్టల్లో చుట్టుకునో
మాసిపోయిన మధుపర్కాలతో
వర్షం రప్పిస్తారు,
కావాలంటే కలలు విరిచేస్తారు
వాళ్ళిద్దరి తోకలే ఆ వృత్తానికి పరిధి
అశోకవరాళి అది

పరాశరుడంటే జీవితాన్ని వడగట్టిన
ఒక కవి కలంపేరు!


నాగరాజు పప్పు

రచయిత నాగరాజు పప్పు గురించి:

బహుముఖ ప్రజ్ఞాశాలి నాగరాజు పప్పు ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్, పాలిమత్ (polymath), పరిశోధకుడు, తెలుగు రచయిత కూడా. టెక్నాలజీతోపాటు భారతీయ చరిత్ర, సాహిత్యం, తత్వశాస్త్రంపై ఆయనకు మంచి పట్టు ఉంది. పలు పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు రాశారు. ఆయన రాసిన “భారతీయ పుస్తక చరిత్ర” వంటి రచనలు తెలుగు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఆయన కవితా రచనలు కూడా కవిశాల (Kavishala) లో ప్రచురితమయ్యాయి. టెక్నాలజీ రంగంలో ఆయన ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా, సిస్టమ్స్ థింకర్‌గా, ప్రెసెంట్ CTOలకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. టెక్నాలజీ, డిజైన్ థియరీ మరియు క్రియేటివిటీ అంశాలపై ఆయన పరిశోధనలు చేశారు. ఆయన వివిధ విద్యా సంస్థలలో, పరిశోధనల్లో కూడా పాలుపంచుకున్నారు.

 ...