తెలుగు సినిమా పాటకిప్పుడు దాదాపుగా డెభ్భయ్యేళ్ళు.
తొలితరం, అంటే 40ల్లో వచ్చిన పాటల్లో ఎక్కువశాతం సాహిత్యపరంగా నేలబారువి. గుర్తుంచుకోదగ్గవి అతితక్కువ. ఏదో అవసరార్థం వచ్చిపోయేవే గాని శ్రోతలు వాటి గురించి లోతుగా ఆలోచించాలని, వాటిలో ఏవో సాహిత్యపు విలువలుండాలనీ ఎవరూ ఆశించినట్టు కనిపించవు. పైగా సందేశాలు, ఉపదేశాలు ఎక్కువ కావటంతో సాహిత్యానికి చోటు తక్కువ కూడ.
ఉపదేశాలు వెనక్కి తగ్గి వినోదానికి ప్రాధాన్యత పెరగటం మొదలయ్యాక సినిమా పాట దారి మారింది. కథకి కేంద్రం ప్రేమ కావటంతో పాటల్లో ప్రేమగీతాలు పెత్తనం లాక్కున్నాయి. అంతకు ముందు మాటల రచయితలే పాటల మీద కూడ చెయ్యిచేసుకుంటే ఇప్పుడు ప్రత్యేకించి పాటల పాండిత్యం వున్న వాళ్ళు పగ్గాలు పుచ్చుకున్నారు. భావ కవిత్వంలో భారీభేరీ మోగించిన కృష్ణశాస్త్రి, అభ్యుదయ కవిత్వానికి అ ఆ లు రాసిన శ్రీశ్రీ, రుబాయీలు గజళ్ళ దారితెన్నుల సారమెరిగిన దాశరథి, సూటైన మాటల నాటకానుభవంతో పాటల పనిపట్టటానికి నడుంకట్టిన ఆత్రేయ – లాంటి అతిరథులూ మహారథులూ సినిమా పాటల వేటకి బయల్దేరారు. పాటకి కొత్త భాషని తయారుచేశారు. నానా భాషల్లోని భావాల్ని కొల్లగొట్టారు. సినిమా పాటకి కూడ అక్కడక్కడ సాహిత్యపు వాసనలు పూశారు. ఇంతలో హిందీ పాటలు, గజళ్ళని తెలుగు మాటల్లో మూటలు కడుతూ సినారె కూడ రెడీ అయ్యాడు. పాట కేవలం కథకి ఆలంబన ఇచ్చేదిగా కాకుండా తనంతట తను స్వతంత్రంగా నిలబడటం మొదలయ్యింది. ‘ఫలానా రకం పాటకి ఫలానా రచయిత ఘటికుడు’ అని ముద్రలు పడటం ప్రారంభమైంది ఈ తరంలోనే.
అంటే, సినిమా పాటకి వయసొచ్చిందన్నమాట.
అలా ఉద్ధృతంగా మొదలైన ఈ రెండోతరం రచయితల పాటల ప్రవాహాలు ఇంకో ఇరవై ఏళ్ళు గడిచేసరికి పడికట్టు భావాల పిల్లకాలవల్లోకి, ముసలిమాటల మురిగ్గుంటల్లోకి పారుతున్న సమయానికి రంగప్రవేశం చేసినవాడు వేటూరి. రావటమే జలపాతంగా దూకాడు. బీడు పడిపోతున్న పాటలపొలాన్ని చడామడా దున్నాడు. కొత్తమాటల విత్తనాల్ని మూలమూలలా చల్లాడు. సినిమా పాటల రాజ్యాన్ని పాతికేళ్ళ పాటు ఏలాడు.
ఇంత విశాలమైన వేటూరి పాటలతోటలో రకరకాల పూలమొక్కలున్నాయి, ముళ్ళపొదలూ ఉన్నాయి.
వీటన్నిటికీ సాధారణ సూత్రం ఏదైనా వుందా? లేకపోతే దేనికదే విలక్షణమైందా?
స్థూలంగా చూస్తే వేటూరి అన్ని రకాల పాటల్నీ అన్ని రసాల మాటల్నీ సమానచాతుర్యంతో ఆడించాడనే అనిపిస్తుంది. “శివశివ శంకర” అని ముగ్ధభక్తితో గాని, “శంకరా నాదశరీరా పరా” అని ప్రౌఢభక్తితో గాని కీర్తించినా, “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అని రక్తితో ఊరించినా, “వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి” అని ఆర్ద్రంగా ఆర్తించినా, “ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో” అంటూ క్రోధంతో గాండ్రించినా దేనికదే చెప్పుకోదగ్గది, దాని పరిధిలో అది మెచ్చుకోదగ్గది. ఈ కారణం వల్లనే వేటూరి ఏ పాటల్ని ఏ గాట్లో కట్టెయ్యాలో, వేటి బరువుని ఏ త్రాసులో తుయ్యాలో తెలీక సినీగీతరసికులు తికమక పడ్డారు, పడుతున్నారు. రెండు స్థూలమైన మార్గాల్ని సూచించారు కొందరు – ఒకటి ఉన్నతమైన భావాలు, భాషా వున్న సభ్య సవ్య మార్గమని, రెండోది సభ్య పదాల ముసుగేసుకున్న అపసవ్య అశ్లీల మార్గమని. ఇది లోతులేని ప్రతిపాదన. వేటూరి రెండు ముఖాల డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ కాడు.
నిశితంగా పరిశీలిస్తే, నిమ్మళంగా వెదికితే, వేటూరి పాటల పోకడలకి ఒకటే దారీతెన్నూ కనిపిస్తుంది. వేటూరి పాటవిద్య తేలని బ్రహ్మవిద్య కాదనీ తేలుతుంది. ఈ వ్యాసం చేసే ప్రతిపాదన, వేటూరి పాట కొన్ని ప్రాధమిక సూత్రాల నుంచి నిర్మితమైందని, ఆ సూత్రాలను వేటూరి నియమంగా, పనితనంతో పాటించాడని. వాటిని ముందు టూకీగా చెప్పుకుని తర్వాత వివరంగా చూద్దాం.
ఒకటో సూత్రం – సినిమా పాటకుండాల్సిన ముఖ్యగుణం చెవికింపుగా వుండటం.
రెండో సూత్రం – అర్థం కన్నా శబ్దం ముఖ్యం; అర్థం వున్నప్పుడు కూడ సూచాయగా వుంటే చాలు; సందర్భశుద్ధి కోసం శబ్దాన్ని బలిచెయ్యక్కర్లేదు.
మూడో సూత్రం – పాటకి ‘దండాన్వయం’ అక్కర్లేదు; చరణానికీ చరణానికీ మధ్యే కాదు, పాదానికీ పాదానికీ, చివరికి పదానికీ పదానికీ మధ్య కూడ సమన్వయం ఉండక్కర్లేదు
ఈ సూత్రాల ఆధారంగా చూస్తే తేలే ఒక విషయం ఏమంటే – వేటూరి సంప్రదాయ భావాలకి సరికొత్త పదాల అలంకారాలు చేశాడనేది. ఇంకా సూటిగా చెప్పాలంటే, పాట ఎలాటిదైనా భావపరంగా వేటూరి తెచ్చిన కొత్తదనం చెప్పుకోదగ్గది కాదు; కాని భాషలో అతను తెచ్చిన మార్పు విప్లవాత్మకం.
ఈ విషయాల్ని ఇంకొంత విపులంగా గ్రహించటానికి ఒక వర్గీకరణ ఉపయోగిస్తుంది: అర్థం, శబ్దం, లయ అనేవి సాహిత్యపరంగా సినిమా పాటకుండే మూడు పార్శ్వాలుగా మనం భావిస్తే, తొలితరం పాటకి అర్థం అత్యంత ప్రధానం, ఆ తర్వాత శబ్దానికి కొంత స్థానం, ఏవో జానపదుల గీతాల్లో తప్ప లయ అప్రధానం అని చెప్పొచ్చు. రెండో తరంలో అర్థ ప్రాధాన్యం ఉన్నా శబ్దానికీ గణనీయమైన పాత్ర, లయకి కొంత ప్రాధాన్యత కలిగాయి (నాగేశ్వరరావు నృత్యాలు మొదలెట్టింది ఈ కాలంలోనే). ఇక మూడో తరంలో శబ్దం ప్రధానమై అర్థం తగ్గుముఖం పట్టింది; లయకి కూడ చెప్పుకోదగ్గ స్థానమే దొరికింది. ఇప్పటి తరంలో శబ్దార్థాలు రెండూ వెనక్కు తగ్గి లయకు ఇదివరకెన్నడూ లేనంత ప్రాధాన్యత వచ్చిందని అనిపిస్తోంది. ఇంకొంత కాలం గడిస్తే తప్ప ఈ విషయం స్పష్టంగా తేల్చలేం.
ఈవిధంగా చూస్తే, వేటూరి వచ్చే సమయానికి ఉన్న పరిస్థితులు, పరిణామక్రమంలో తెలుగు సినిమా పాట ఉన్న దశ, అతని ఆలోచనకి సరిగ్గా అతికాయని, అతని విజయానికి ఇదీ ఒక ముఖ్య కారణమని ఋజువౌతుంది.
ఇప్పుడు వేటూరి మీద ఏయే మౌలిక ప్రభావాలు ఉన్నాయో ముందు చూసి, తర్వాత పైన చెప్పిన సూత్రాలు అతని పాటలకు ఎలా ప్రాణమయ్యాయో చూద్దాం.
– వేటూరి సాహితీకుటుంబం నుంచి వచ్చినవాడు; చిన్నప్పట్నుంచి సంప్రదాయ సాహిత్యంలో పుట్టిపెరిగినవాడు. సంస్కృతాంధ్రాల్లో ఒకమాదిరి పాండిత్యం ఉన్నవాడు.
– ప్రబంధాల్తో మంచి పరిచయం; ముఖ్యంగా శ్లేషలకి ప్రాధాన్యం ఇచ్చిన మలితరం ప్రబంధాల మీద గట్టిపట్టు.
– భావ కవిత్వం, ముఖ్యంగా విశ్వనాథ, రాయప్రోలుల రచనల మీద మమకారం.
– అభ్యుదయ కవితా తత్వం, అందునా శ్రీశ్రీ రచనల్తో బాగానే పరిచయం.
– త్యాగరాజు, అన్నమయ్యల గీతాల మీద శ్రద్ధ.