చాలా సంవత్సరాలైంది ఇళ్ళవీధిలోకి వెళ్ళక.
ఇళ్ళవీధిలో తిరగటం, అందులో కట్టిన రకరకాల ఇళ్ళని చూడటం ఊహ తెలిసినప్పటినుంచీ నాకెంతో ఇష్టం. ఎన్నాళ్ళకైనా ఒక మంచి ఇల్లు కట్టాలని నేననుకోవటం, అది కుదరకపోవడం, ఉద్యోగవిరమణ చేసేదాకా ఎవరెవరో కట్టిన ఇళ్ళల్లో ఉండాల్సి రావటం; ఇవన్నీ కలగలిపి ఇప్పుడు ఇళ్ళవీధిలోకి మళ్ళీ వెళ్ళాలనే కోరిక బలోపేతమైంది. ఏదో ఒక ఇంటి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, ఆ ఇల్లు చూసొద్దామనే ఆసక్తీ కలిసివచ్చింది.
ఒకప్పుడు ఆ వీధిలోకి దారి వెతుక్కుంటూ నడిచే వెళ్ళాల్సి వచ్చేది. తెలిసిన వాళ్ళు ఎవరైనా వీధి మొగదలలో ఎదురైతే ‘ఇటెక్కడకి?’ అని మొహం మీదే అడిగేవాళ్ళు. చెప్పేదాకా వదిలేవాళ్ళు కాదు. పొరపాటున చెపితే, ఆ వీధిలో నీకేం పని అని అటకాయించే వాళ్ళు. అందుకని అలాంటివాళ్ళని చూసి దూరం నుంచే తప్పుకునేవాడ్ని. ఒకప్పటి ఆటంకాలు ఇప్పుడు లేవు. అనుకున్నదే తడవుగా బయలుదేరగలిగాను. రవాణా, సమాచార సౌకర్యాలు విస్తృతంగా పెరిగాయిగా! ఆటోలో కొద్ది నిమిషాల్లోనే ఆ ప్రాంతానికి చేరుకున్నాను.
ఉన్నచోట ఉండటానికి ఎవరూ ఇష్టపడుతున్నట్లు లేదు. అయాచితంగా, ఎవరో ఉచితంగా పంచిపెడుతున్నదాన్ని అందుకోవటానికన్నట్లు, ఎవరి ఉరుకులు పరుగుల్లో-తరుగులు మెరుగుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకని నాకు ఎలాంటి ఎదురు ప్రశ్నలూ ఎదురు కాలేదు.
ఒకప్పటి పరిచయం పునాదిగా చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నానేమో నేను ఆ వీధిని. అంతకుముందు నాకు పరిచయమైన వాతావరణంతో పోల్చుకుంటే ఇపుడు కనపడుతున్నది పూర్తిగా భిన్నంగా ఉంది. ఇంతకు ముందు అరకొరగా ఉన్న ఇళ్ళు అక్కడక్కడ విసిరేసినట్లు ఉండేవి. అందువల్ల ఇళ్ళ కన్నా ఖాళీ స్థలాలు ఎక్కువగా కనపడేవి. ఇసుక వేస్తే రాలనంత జనసమ్మర్దంతో ఆ వీధిలో ఊహించనంత సందడి ఉండేది. ఇప్పుడు వీధి తప్ప ఖాళీ స్థలం అనేది కలికానికైనా కనపడటంలేదు. స్వంత ఇంటి యజమానులు ఎక్కువై, సందర్శకులు తక్కువైనట్లు ఉంది. ఇదీ మంచిదే! నాకు ఇష్టం వచ్చిన ఏ ఇంట్లోకైనా ప్రశాంతంగా వెళ్ళి నింపాదిగా ఆ ఇల్లంతా తిరిగి చూసి రావచ్చు.
ఉన్నట్లుండి ఒక గాలితెర బలంగా వీచింది. తనతో కలిసిన దేన్నైనా విచక్షణ లేకుండా తనతో పాటు మోసుకొచ్చే గాలి ఈసారి భరించలేనంత దుర్గంధం తీసుకొచ్చింది. అది ఒక మురుగు కాలువలోంచి వచ్చిన వాసన. ముక్కుపుటాలు ఇచ్చిన ఆధారంగా కాలువ ఎక్కడుందో కళ్ళతో పసికట్టే ప్రయత్నం చేశాను.
ఇంతా చేస్తే అదెక్కడో లేదు. నా కళ్ళ ముందు ఉన్న ఇంటిముందే నిర్లజ్జగా ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా నిలబడి ఉంది. ఆ ఇంటి ముందు ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా ముక్కు మూసుకుని, తపస్సు మరిచిపోయిన మునుల్లా నిలబడి ఉండటంతో నా అంచనా నిజమని రుజువైంది. నేను చూద్దామని వచ్చిన ఇల్లే అది.
గేటుకి అటూ ఇటూ ఉన్న సిమెంటు దిమ్మలమీద ఇంటికి పెట్టిన అందమైన పేరు, దాని కన్నా పెద్ద అక్షరాలతో ఇంటి యజమాని పేరూ డాంబికంగా కనపడుతోంది.
ఇంటిముందు ఒక పెద్ద చెత్త కుప్ప దానికి అంగరక్షకుడిలా కాపలాకాస్తోంది. ఇంటిలోకి ఎవరూ సులభంగా వెళ్ళటానికి వీల్లేకుండా అది రెండో పాత్ర కూడా పోషిస్తోంది. ఇంటి ప్రహరీగోడకి ఒక పెద్ద గేటు బిగించి ఉంది. ఇంట్లోకి వెళ్దామనుకున్నవాళ్ళు దాన్ని తెరుద్దామని తమలో ఉన్న శక్తి అంతా ఉపయోగించి విశ్వప్రయత్నిస్తున్నారు. కొందరు భుజాల్తో, మరికొందరు రెండు చేతుల్తో బలంగా నెడుతున్నారు. పడగొట్టిన పాత ఇంటిది తెచ్చి కొత్త ఇంటికి బిగించారో లేదా తిమ్మిడీల్లో తైలం పడక ఎన్నాళ్ళయిందో-ఒక పట్టాన గేటు తెరుచుకోవటంలేదు.
నేనూ వాళ్ళతో కలిశాను. ఉన్నట్లుండి గేటు కిర్రుమంటూ తెరుచుకుంది. నాతో పాటు ఉన్నవాళ్ళు నేను చేసిన సహాయానికి అన్నట్లు నా వంక కృతజ్ఞతాపూర్వకంగా చూశారు. నాకూ కొంచెం సిగ్గుగా, మరికొంచెం గొప్పగా అనిపించింది. వాళ్ళ చూపుల వల్లనా, నాలో అంత బలం ఉందని నాకే తెలియనందువల్లనా బోధపడలేదు. ఉత్తరక్షణంలో ప్రవేశద్వారం తెరుచుకుంటానికి ప్రత్యుత్తరం తెలిసింది.
మా కన్నా ముందే ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకి వస్తున్నవాళ్ళు కూడా గేటు లోపలికి లాగారు. అదే సమయంలో మేమూ దాన్ని లోపలకి నెట్టాం. రెండు విభిన్నశక్తులు ఒకే లక్ష్యంతో ఏకక్షణాన ఏకీకృతం కావడంతో జరగాల్సిన పని అనుకున్నదాని కన్నా సులభంగా జరిగింది.
మొదలే ఇంత ముదనష్టంగా ఉంది. లోపలకి వెళ్తే ఇంకెంత కష్టం ఎదురవుతుందో అని అనుమానం కలిగింది. ఈ ఇంట్లోకి వెళ్దామా? లేదా ఇంకో ఇల్లు ఎన్నుకుందామా? అని వెనకముందులాడాను.
ఎందుకైనా మంచిదని, నాతో పాటు లోపలకి రావటానికి ప్రయత్నించిన వాళ్ళ మొహాల వంక చూశాను. అన్నిట్లోనూ ఒక ఆసక్తి వ్యక్తమవుతోంది. ఉరకలు వేసే ఉత్సాహం ద్యోతకమవుతోంది. బయటికి వస్తున్న వాళ్ళ వంక కూడా చూశాను. వాళ్ళ మాటల్లో ఒక కనీవినీ ఎరుగని అపూర్వ అనుభూతి చవిచూసిన ఆనందం ప్రతిఫలిస్తోంది. జనాభిప్రాయసేకరణ జయప్రదంగా ముగిసింది.
జనవాక్యంతు కర్తవ్యం అని కదా నానుడి.
ఇంతకీ ఆ ఇళ్ళవీధిలో ఏముంటుందో నేను చెప్పనే లేదు కదూ! రకరకాల ఇళ్ళను కట్టే స్తోమత ఉన్న కొందరు, ఆ స్థాయి లేకపోయినా అదే వృత్తిగా స్వీకరించిన మరి కొందరు– అరువు సొమ్ముతోనో, అనాయాసంగానో; వాళ్ళకి దొరికిన డబ్బుతో తమకి తోచిన పద్ధతిలో ఇళ్ళు కడతారు. జనానికి ఏం కావాలో వాళ్ళకి పట్టదు.
కట్టిన వాటిని తమ అభిరుచికి తగిన రీతిలోనో లేదా తమ స్థాయికి అనుగుణంగానో అలంకరించి ప్రదర్శనకి ఉంచుతారు. వాటికి సరైన రూపం ఉండదు. వాటికి వాళ్ళనుకునేంత విలువా ఉండదు.
నిర్మించిన వాళ్ళ దృష్టిలో అవి అద్భుతనిర్మాణాలు. అందుకని, పనిగట్టుకుని తమ ఇళ్ళకు విస్తృత ప్రచారం కల్పిస్తారు. ఆ ఆకర్షణ కొద్దిరోజులే పనిచేస్తుంది. కనేదానికీ, వినేదానికీ పొంతన లేకపోవటంతో ఒకసారి బోల్తా పడ్డవాళ్ళు రెండోసారి వాళ్ళు కట్టిన ఇండ్లవైపు వెళ్ళరు. దాంతో ఆ వీధిని క్రమం తప్పక సందర్శించే కొందరు, కొందరు కట్టిన ఇళ్ళ ఛాయలకు అసలు పోరు.
వీటితో పాటు, గుర్తింపు గురించి ఆలోచన లేనివాళ్ళ ఇళ్ళు కూడా అక్కడక్కడ మనకు కనపడతాయి. వింతగా వాటి స్వంతదారులు కొత్త నిర్మాణాలకు ప్రణాళికలు గీస్తూ ఎక్కడో ఉంటారు. తాము కనపడకుండా ఎంతమంది ప్రేక్షకులు వచ్చి తమ ఇళ్ళని చూస్తే వాళ్ళకి అంత ఆనందం, అంత సంతృప్తి. ఎవరన్నా దీక్షగా పరీక్షగా ఆ ఇళ్ళని చూసి వాటి విలువను ఖచ్చితంగా చెప్పగలిగితే ఏదో పెన్నిధి దొరికినట్లు సంతోషపడతారు.
నిర్యాణం దాకా, నాణ్యత ఉన్న నిర్మాణం మీదనే వాళ్ళ దృష్టి.
మేము అతికష్టం మీద ప్రాంగణంలోకి ప్రవేశించిన ఇంటి ముందు చిన్న వరండాలాంటిది ఉంది. వచ్చిన అతిథులు నేరుగా లోపలకి వెళ్ళే అవకాశం లేకుండా చెయ్యటానికా అన్నట్లు కొన్ని పాతకాలం పేము కుర్చీలు అక్కడ అడ్డదిడ్డంగా వేసి ఉన్నాయి. కొన్నిటికి చేతులు లేవు. మరి కొన్నిటికి ఒకటీ అరా కాళ్ళు లేవు. గాలి వానకి వొరిగిన చిరువృక్షాల్లా అవి అతికష్టం మీద నిలబడి ఉన్నాయి. ప్రాణం ఉన్న వ్యక్తుల కోసం ఉద్దేశించబడిన ఆ ఆసనాలని; విచక్షణాజ్ఞానం కోల్పోయిన దుమ్మూ, ధూళీ ఆక్రమించుకున్నాయి. దానికి తోడు బిగువైన అల్లిక కొరవైన వైనం. అది కూడా సడలిపోవటంతో, ఆ కుర్చీలు ఎవరికీ ఆశ్రయమివ్వగలిగేలా లేవు.
లోపల ఎవరో ఉన్నట్లు గుమ్మం ప్రక్కన విడిచి ఉన్న అరిగిపోయిన చెప్పుల జతలు చెప్పకనే చెప్పుతున్నాయి. సరిపోయినంత పని కల్పించకపోవడంతో సోమరిపోతుగా తయారైన చీపురుకట్ట ఒకటి, వాటికి తోడుగా మూలన తన మునివేళ్ళ మీద నిలబడి నిద్రపోతోంది.
నెమ్మదిగా ఇంటి గుమ్మం దగ్గరకు చేరిన నాకు మూసిన తలుపులు ఎదురయ్యాయి. తాళం వేసి లేదనే మాటే కాని, ఒక పట్టాన అవి తెరుచుకోలేదు. కాసేపటి క్రితమే కదా అందులోంచి నాకు ఎదురైనవాళ్ళు బయటికి వచ్చింది. ఇంతలోనే అవి అంత గట్టిగా ఎలా మూతపడ్డాయో నాకు అర్థం కాలేదు. బహుశా అలా బిగుసుకుపోవటం వాటి సహజలక్షణమేమో! నాకూ నాతో పాటు ఉన్నవాళ్ళకు మరొక బలపరీక్ష ఎదురైంది. ఈ సారి, వ్యతిరేకదిశనుంచి సహాయం చేసిన అనుకూలశక్తుల ప్రమేయం లేకుండానే తలుపులు తెరుచుకున్నాయి. అలవాటు ప్రకారం వెంటనే మూసుకున్నాయి.
ఎలాగైతేనేం ఇంటి ముందుగదిలోకి అడుగు పెట్టాం. బయట వెలుగు సన్నగిల్లటంతో లోపల కన్నుపొడుచుకున్నా ఏమీ కానరాని చీకటి. చేతిలో మొబైల్ ఆన్ చేసి, స్విచ్ బోర్డు ఎక్కడ ఉందా అని చూశాను. అది కనపడింది కాని, దానిమీద మీటలన్నీ తీసేసి ఉన్నాయి. దాంతో అది, కళ్ళు-ముక్కు-పెదాలు ఉండాల్సిన చోట ఖాళీ గుంటలు ఉన్న కపాలాన్ని తలపిస్తోంది. పొంతన లేని తీగలు ప్రేతాత్మల్లా వేలాడుతున్నాయి.
నాతో పాటు వచ్చినవాళ్ళలో ఒకతనికి ఇలాంటి ఇళ్ళు ఈ మధ్యన చూసిన అనుభవం ఉంది కాబోలు, నన్ను మొబైల్ ఆఫ్ చేయమన్నాడు. దానికి ముందే తన జేబులోంచి ఒక కొవ్వొత్తినీ అగ్గి పెట్టెనీ బయటికి లాగాడు. వ్రేళ్ళస్పర్శ ఆధారంగా కొవ్వొత్తిని నాకు ఇచ్చి, అగ్గిపుల్ల గీసి దాన్ని వెలిగించాడు. ఇక అది ఇప్పుడు మా కరదీపిక.
ఆ కాస్త వెలుతురులోనే ముందుగదిని దీక్షగా పరీక్షించాను. గచ్చంతా దుమ్ము పేరుకుని ఉంది. గోడల మూలల్లో సాలె గూళ్ళు. బయటినుంచి చూస్తే కొత్తగా కట్టిన ఇల్లులా ఉంది కానీ లోపలంతా పాత వాసన. కిటికీ తలుపులు తెరవటానికి ప్రయత్నం చేశాము. ఎన్నాళ్ళనుంచి మూసి ఉంచారో, అవీ మొరాయించాయి. ఎవరూ ఉండనటువంటి నివాసంలోంచి వచ్చే వాసన లాంటి వాసన ఇంకా మమ్మల్ని వదిలిపెట్టటంలేదు. దాంతో లోపలనుంచి ఉధృతంగా వికారం తన్నుకురావటం మొదలైంది. ఇపుడో మరో క్షణమో ఒక వమనం తప్పదనిపించే తీవ్రగమనమేదో గర్భకుహరంలో వయ్యారాలు పోతోంది.
కొవ్వొత్తి మాత్రం తన పని తాను దివ్యంగా చేసుకుపోతోంది. అది అందిస్తున్న కాంతి సాయంతో కొంచెం తలెత్తి అటూ ఇటూ చూశాను. గోడలకి అక్కడక్కడ కొట్టిన మేకులకి కొన్ని పటాలు వేలాడుతున్నాయి. వాటిలో ఉన్నది మనుషుల ఛాయాచిత్రాలే. కొన్ని మగవాళ్ళవీ, కొన్ని ఆడవాళ్ళవీ. మిగిలినవి చిన్న పిల్లలవీ.
ఇంతమంది ఈ ఇంట్లో ఒకప్పుడు ఉండేవారా? అందరూ ఒకేసారి నివసించటానికి సరిపోయినంత వసతి ఉందా ఈ ఇంట్లో? నమ్మశక్యంగా లేదు. బహుశా ఇరుకిరుగ్గా సర్దుకుని గడిపేవారేమో?
ప్రతి ఛాయాచిత్రానికీ క్రింద ఎడమవైపు ఒక తేదీ వేసి ఉంది. కుడి వైపు ఉండాల్సిన తేదీ దేనికీ కనపడటం లేదు. వేసారా, లేదా వేసారి వేసింది చెరిగిపోయిందా; అసలు వేయాల్సిన అవసరం ఉందా లేదా స్పష్టంగా తెలీటం లేదు. ఆ పటాలకి వేసిన దండల్లో పూలన్నీ వాడిపోయి, రాలిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి. వాటి తాడు ఇప్పుడో మరో క్షణమో తెగేలా ఉంది.
ఉన్నట్లుండి కొన్ని మాటలు వినపడుతున్నాయి. ఎవరో ఎవరితోనే సంభాషిస్తున్నారు. మాటలన్నీ కలగాపులగంగా ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని వినే ప్రయత్నం చేశాను. అవి నాతో వచ్చిన మనుషుల గొంతులు కావు. ఆ స్వరాలు చిరపరిచితాలు కావు. అపరిచితాలు. మరి అవి ఎక్కడివి? నాలో ఒక సందిగ్ధత.
ధ్వనిని బట్టి మూలం దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేశాను.
చిత్రంగా మగగొంతుతో వినపడుతున్న కొన్ని మాటలు ఆడవాళ్ళ, దానికి పూర్తి వ్యతిరేకంగా ఆడగొంతుతో వస్తున్న మాటలు మగవాళ్ళ ఛాయాచిత్రాల్లోంచి వస్తున్నాయి. వాటిల్లో అవసరమైనదానికన్నా మించి ఆంగ్లపదాలు కూడా నీళ్ళలో గులకరాళ్ళలా దొర్లుతున్నాయి. ఆ సంభాషణలు కృతకత్వానికి ప్రస్తుత చిరునామాలా ఉన్నాయి. మధ్యమధ్యలో కొంత విజ్ఞత, మరి కొంత అనుభవజ్ఞత కలగలిసిన మాటలు నా చెవులకి చేరుతున్నాయి. ఆశ్చర్యకరంగా అవి చిన్నపిల్లల గొంతులు పలుకుతున్నాయి. వినపడుతున్న మాటలు, ఛాయాచిత్రాల వయోలింగవైఖరికి ఎందుకు సరిపోవడంలేదు?
అంతా అయోమయంగా ఉంది. నా మానసిక సమతుల్యత మీద నాకొక క్షణంపాటు అనుమానం కలిగింది. నాతోపాటు లోపలికి వచ్చిన ముగ్గురి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని వెనక్కి తిరిగి చూశాను. నాకు ఎదురైన అనుభవమే వాళ్ళకీ కలిగినట్లుంది. కాని దాని ప్రభావఫలితం భిన్నంగా ఉంది.
కొవ్వొత్తి, అగ్గిపెట్టె తెచ్చినతను నోటికి చెయ్యడ్డం పెట్టుకుని ముందుకు కదిలే ధైర్యం తనకు లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు. మిగిలిన ఇద్దరూ పలాయనమంత్రం పఠించటానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా, వాళ్ళు; వాళ్ళ రాకడతోనే వాళ్ళ వెనకే యాంత్రికంగా మూసుకుపోయిన గుమ్మం తలుపుల్తో యుద్ధం చేస్తున్నారు.
అంతకుముందు అనుభవం నన్నింకా తరుముతోంది. దాంతో, రెండో గది లోపలకి తీసుకువెళ్ళే గుమ్మానికి ఉన్న తలుపుల్ని బలవంతాన నెట్టాను. చిత్రం! అవి అతి సులభంగా తెరుచుకున్నాయి.
అదృష్టవశాత్తా? దురదృష్టవశాత్తా? అన్నది ఇప్పటికిప్పుడే తెలియదు.
ఆసరా అనుకున్న అదనపు బలం అనవసరమైంది. శరీరాన్ని తమాయించుకోలేక ఒక్కసారిగా ముందుకు తూలాను. ఉన్నశక్తినంతా కూడతీసుకుని అప్రయత్నంగా నిలదొక్కుకున్నాను.
ఇప్పటివరకూ పొందిన అనుభూతిని అంచనా వేయటానికి ప్రయత్నించమని హృదయం ఒక్కసారి రెచ్చగొట్టింది. ఆ తర్వాత పురోగమించు అని చిచ్చు పెట్టింది. అనుభవం అపరిపక్వం అయినపుడు అనుభూతి అసమగ్రం. అది తెలిసిన మనసు ‘ఛీ’ కొట్టటం బాగోదని ఆ ఆలోచనకి చిచ్చి కొట్టింది.
మొదటి గదితో పోలిస్తే రెండో గది కొంచెం చిన్నగా ఉంది. కాని దానికన్నా ఇందులో వెలుగు రవంత ఎక్కువగా ఉంది. కారణం? దానికి వెనక గుమ్మానికి ఉండవలసిన తలుపులు ఓరగా తెరిచి ఉన్నాయి. అందువలన కాబోలు, ఆ గది ఉండవలసిన దానికన్నా తక్కువ చీకటిలో ఉంది.
వంటగదిగా ఉపయోగపడాల్సిన అది ఈ మధ్యన తనకి సహజమైన అనుభవాలని చవిచూసినట్లు లేదు. పూర్తిగా తినలేకపోవడంతో కొంత ఆహారం మిగిలిన పొట్లాలు, భోజనం బల్ల మీద అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. వాటి లక్షణం చూస్తే ఇంట్లో వండినవిలా లేవు. మన వాతావరణానికీ, శరీరతత్వానికీ సరిపడని పదార్థాలు బయటినుంచి తెచ్చుకుని తినలేక మిగిల్చినట్లుంది. తిన్నతర్వాత కడగకుండా వాటి కర్మానికి వాటిని వదిలేసిన పళ్ళేలు, జనరల్ వార్డులో రోగుల్లా, సింకులో పడి ఉన్నాయి.
బహుశా ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఉన్నట్లుండి వెళ్ళిపోవాల్సి వచ్చినట్లుంది. అందుకనే ఇంటి పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నట్లుంది. ఇల్లు స్వంతమనుకుని ఉంటే, ఇలా చేసేవాళ్ళా? వాళ్ళే ఉండతల్చుకుంటే ఇంటిని ఇలా ఉంచేవాళ్ళా? ఇంకొకరికి ఇంటిని అద్దెకు ఇవ్వదలుచుకున్నా ఇంత బాధ్యతారాహిత్యమా!
ఇంకా నయం! గుడ్డిలో మెల్లగా బయటికి పోవటానికి వెనక తలుపులు తీసి పెట్టారు. వచ్చిన దారినే బయటికి వెళ్ళాలంటే ఎంత అవస్థ ఎదురయ్యేదో?
నా ఆలోచనలో ఏదో తప్పు ఉందని అప్రమత్తంగా ఉన్న మెదడు చెప్పింది. వెనకనుంచి దారి ఉంటే ఇందాక నేను ఇంట్లోకి రావటానికి ప్రయత్నిస్తున్నపుడు ఎదురైన వాళ్ళు, అంత కష్టపడి ముందు నుంచి ఎందుకు బయటికి పోవటానికి శ్రమపడినట్లు?
అసలు విషయం మర్చిపోయాను! ఇంత దరిద్రంగా ఉన్న ఇంటి గురించి వాళ్ళు ఎందుకు పొగిడినట్లు? వాళ్ళకీ స్వంత ఇళ్ళు ఉన్నాయా? అవీ ఇలానే ఉంటాయా? నీ ఇల్లు ఎలా ఉన్నా బాగుందని నేను అంటాను! నా ఇంటి విషయంలో కూడా నువ్వు అలానే అను! అనే రాజీ ధోరణి గూడుపుఠాణీలో భాగమా ఇది?
అనాలోచితంగానే రెండో గదిలోనుంచి వెనక్కి బదులు ముందుకి నడిచాను.
నాలుగు అడుగులు వేశానో లేదో, నేను వెళ్ళాలనుకున్న చోటులోనుంచి ఎవరో నిట్టూరుస్తున్నట్లు చప్పుడు. ఉన్నట్లుండి గుసగుసలు. ఒకటి మగస్వరం. రెండవది ఆడ గొంతుక.
“ఇటు వైపే వస్తారేమో-ఒక్క క్షణం ఓపిక పట్టు,” అంటోంది ఒక స్త్రీ.
“వస్తే ఏమవుతుంది? మనని చూసి వెనక్కి తగ్గుతారు,” అంటున్నాడు పురుషుడు.
“అందరికీ తెలియటం మంచిది కాదేమో?”
“తెలిస్తే ఏమవుతుంది?”
“నీ భార్య నోరు నువ్వు మూయించగలవేమో! కాని, నా భర్త సంగతి?”
“అది తప్పు చేసేముందు ఆలోచించాలి. తప్పు చేస్తున్నపుడు ఆలోచించకూడదు.”
“ఇక వదిలెయ్యి. అప్రస్తుత ప్రసంగంలో నువ్వు అందె వేసిన చెయ్యి.”
“మాట మార్చు. ఇపుడు చేయాల్సింది పట్టుకోవడం. వదిలెయ్యడం కాదు.”
వాళ్ళ మాటలని బట్టి వాళ్ళే స్థితిలో ఉన్నారో ఊహించటం కష్టం కాదు. వాళ్ళ అమూల్యమైన ఏకాంతానికి భంగం కలిగించటం నా మూల్యానికి తగని పని. అయినా ఇలాంటి ఇళ్ళలో ఏహ్యం అనూహ్యం కాదు. అది ఈ మధ్యన కొంతమంది అదే పనిగా ప్రతి వారం కడుతున్న అనేక గృహాల్లో పెట్రేగిపోతున్న వ్యామోహం కూడా.
కాబట్టి వాళ్ళనుకున్నట్లు, వాళ్ళను చూసి నేను వెనక్కి తగ్గలేదు. చూడకుండానే వెనక్కు తగ్గాను.
చూసిన ఇళ్ళు కలిగించిన ఆలోచనలని పరస్పరం పంచుకోవడం మా మిత్రబృందానికి అలవాటు. ముందుగా అచ్యుతరామయ్యకి నా అనుభవం వివరించాను. ఆయన తనదైన శైలిలో నవ్వి “ఈ మధ్యన ఆ వీధిలోకి వెళ్ళినపుడు ఆ ఇంటి లోపలకి వెళ్ళి చూద్దామని నేనూ అనుకున్నాను. కాని, ఆ ఇంటి బయట వాతావరణం చూసి ఆ ఆలోచన విరమించుకున్నాను,” అన్నారు.
“మరి ఇంకో ఇల్లు చూశారా?” అడిగాను.
“అవును!”
“అది ఎలా ఉంది?”
“అన్నీ ఒక తానులో ముక్కలే అనిపించేలా ఉంది.”
“అయితే కష్టపడి లోపలిదాకా వెళ్ళి చూసి మేమిద్దరమూ పొరపాటు చేశామా?” అన్నాను రమణమూర్తితో.
“ఏ ఇంటి విషయంలోనూ పైపైన చూసి మనం ఒక అభిప్రాయానికి ఎపుడూ రాకూడదు. ఏమీ లేదనే అభిప్రాయానికి ముందే వచ్చి అసలు చూడటమే మానేస్తే నిజంగా లోపల ఎంతో కొంత మంచి ఉన్న ఇళ్ళు చూసే అవకాశాలు మనం పోగొట్టుకోవచ్చు. అందుకని మంచి కొంతైనా దొరకాలనుకుంటే; కనపడిన ప్రతి ఇల్లూ మొత్తం చూడాల్సిందే!” అన్నారు ఆయన.
సత్యప్రసాద్‌తో ఈ అనుభవం ఇంకా పంచుకోలేదు. ఆయన ఉద్యోగపరమయిన పని ఒత్తిడిలో తలమునకలుగా ఉన్నారు. తీరిగ్గా ఉన్నారేమో సుధాకర్గారితో ఈ విషయం విపులంగా ఈ రాత్రికి మాట్లాడాలి.
A story is not like a road to follow … it’s more like a house. You go inside and stay there for a while, wandering back and forth and settling where you like and discovering how the room and corridors relate to each other, how the world outside is altered by being viewed from these windows. And you, the visitor, the reader, are altered as well by being in this enclosed space, whether it is ample and easy or full of crooked turns, or sparsely or opulently furnished. You can go back again and again, and the house, the story, always contains more than you saw the last time. It also has a sturdy sense of itself of being built out of its own necessity, not just to shelter or beguile you.
(కథ గురించి నోబెల్ బహుమతి గ్రహీత అలైస్ మన్రో (Alice Munro) అభిప్రాయం. ఈ కథ రాసింది, ఈ అభిప్రాయం ఒకటి ఉందని తెలియటానికి ముందు. ఈ కథ చదివి అలైస్ మన్రోగారి అభిప్రాయం నాకు తెలిపింది, దాన్ని నాకు పంపింది సాహితీమిత్రులు యాళ్ళ అచ్యుతరామయ్యగారు.)