బుచ్చిగాడి మళ్ళీ పెళ్ళి

పాత్రలు

బామ్మ

బుచ్చిగాడు (బామ్మ కి మనవడు )

మావయ్య ( బుచ్చిగాడికి )

మహా (కాళి) ( మనవడి ప్రేయసి )

కోయ దొర

కోయదొరసాని ( మాటలు లేవు )

మల్లు

పోలీసు

డాక్టర్‌

వంటవాడు

పురోహితుడు

పరిచయం

( అనగనగా ఓ బామ్మగారు ఆ బామ్మ గారికొక మనవడు. ఆ మనవడ్ని

ముద్దుగా “బుచ్చీ” అని బామ్మగారు పిల్చుకుంటుంది. చిన్నప్పుడే తల్లీ తండ్రి పొతే బామ్మగారే

మనవడ్ని సాకింది. అందుకే బామ్మ అంటే బుచ్చికి వల్లమాలిన ప్రేమ. బామ్మకీ మనవడంటే అంతే

ప్రేమ. కాని బామ్మ గారు తన చేదస్తాలతో అందర్నీ విసిగిస్తుంది. ఆవిడ నోరు బంగాళాఖాతం

అంత చిన్నది. బామ్మగారు కాస్త కండులు తిరిగిన గడుసు మనిషి. బామ్మ గారంటే

ఏమనుకున్నారు ఈ బామ్మ గారు టీవీ చూసి కరాటే నేర్చిన మేధావి. )

మొదటి అంకం

( బామ్మ గారిల్లు. హాలులో బుచ్చిగాడు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంతలో

బుచ్చిగాడి మావయ్య ప్రవేశం )

మావయ్య బామ్మ గారూ ! బామ్మగారూ ! ఒరేయ్‌ బుచ్చిగా ( అటు ఇటూ

చూస్తాడు ) ఏరా, బామ్మగారు లేరా? ఏక్కడా చడీ చప్పుడు లేదూ ?

బుచ్చి రా మావయ్యా ! ఇదేనా రావడం ?

మావయ్య ఏరా బామ్మగారు లేరా? ఏక్కడా చడీ చప్పుడు లేదూ ?

బుచ్చి ఆఆ ! ఆవిడ ఉంటే నీకు తెలీనిదేముందీ? వినాయక చవితి పందిరి లో

లౌడ్‌ స్పేకెర్‌ లా , సందు చివరి దాక గోల వినిపిస్తూనే ఉంటుంది.

అవును అత్తయ్య రాలేదా ?

మావయ్య లేదురా నే నొక్కడ్నే వచ్చా ! వెధవ ట్రైన్‌ గంట ఆలస్యంగా వచ్చింది !

ఈ దేశంలో ఎవ్వరికి టైం సెన్స్‌ లేదు ! ఆ మర్చిపోయా !

నా దగ్గర చిల్లర లేదు బయట ఆటోవాడికి డబ్బులిచ్చి పంపు !

( బుచ్చి గాడు లోపలికెళ్ళి, వస్తాడు )

మావయ్య (నెత్తి మీద చెమట తుడుచుకుంటూ ) హమ్మయ్య బామ్మ గారు

లేకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంది !

( ” బుచ్చీ ” అంటూ గట్టిగా ఏడుస్తూ బామ్మ ప్రవేశం

బుచ్చి గాడు, మావయ్య ఒక్కసారి అదిరిపడి కంగారుగా బామ్మ దగ్గరకి

వస్తారు ! )

బామ్మ ( ఏడుస్తూ ) ఒరేయ్‌ బుచ్చీ అంతా అయిపోయిందిరా !

బుచ్చి ఏమయ్యిందే బామ్మా ! హడలి చచ్చేలా ఈ ఏడుపులేమిటి ?

గుడికెళ్ళే వరకూ బాగానే ఉన్నావు కదా !

బామ్మ ఒరేయ్‌ ! గుడినుండి ఇంటికి వస్తూంటే, ఆ పరంధామయ్య లేడూ !

అంతా అయిపోయిందిరా ! ( అంటూ మరింత గట్టిగా ఏడుస్తుంది ! )

బుచ్చి ముందా ఏడుపాపి, అసలు జరిగింది చెప్పు !

బామ్మ పోయిందిరా ! అంతా పోయింది ఆ పరంధామయ్య ! ( అంటూ మరలా

ఏడు సుంది )

బుచ్చి ఏమయ్యింది ఆ పరంధామయ్య గుటుక్కు మన్నాడా ? అసలే

మనకి పది వేలు బాకీ కూడా ఉన్నాడు !

బామ్మ అదేంలేదు రా గుడి నుండి వస్తూంటే దారిలో ఆ పరంధామయ్య

కనిపిస్తే పలకరించా ! మాట మధ్యలో ( అంటూ మరలా ఏడుస్తుంది )

బుచ్చి తెలుగుసీరియల్‌ సస్పెన్సులా ఈ ఏడేపేమిటే ? అసలు విషయం చెప్పు

( కసురు కుంటాడు )

బామ్మ ఏం చెప్పను ? ఇన్నాళ్ళు ఎంతో గర్వంగా తిరేగే నన్ను అందరి

ముందు … ( మరలా ఏడుస్తూ ) నా పరువు మంట కలిసిపోయిందిరా !

బుచ్చి ఏం ! ఆ పరంధామయ్య నిన్ను అందరి ముందు తిట్టేడా ?

ఏవన్నాడో చెప్పు ఇప్పుడే వెల్లి ఓ పట్టు పడతా !

బామ్మ ( ఏడుస్తూ ! ) నన్నేం అనలేదురా ! అన్నదంతా నిన్నే !

మావయ్య వాడ్నంటే మేరెందుకు ఏడుస్తారండి ?

బుచ్చి ఏమిటి ! నన్నంటాడా ? ఆ పరంధామయ్యకి ఆయుష్షు మూడింది !

ఏమన్నాడో చెప్పు బామ్మా ! ఇప్పుడే వెళ్ళి వాడి తోలు తీసేస్తా.

బామ్మ నా నోటితో నేను చెప్పలేనురా ! ఇన్నాళ్ళనుండి ఉన్న మన పరువు

కాస్తా గంగ పాలయ్యిందిరా ! ( అంటూ ఏడుస్తూ కుర్చీలో

కూలబడుతుంది )

మావయ్య మీరలా ఏడుస్తూ అసలు విషయం చెప్పకుండా ఈ సస్పెన్స్‌ ఏమిటి

బామ్మగారు పోనీ వాడికి చెప్పడం ఇబ్బందిగా ఉంటే, గబ గబా నా

చెవిలో పడేయన్డి.

( అంటూ బామ్మ దగ్గరకి వెళతాడు. బామ్మ ఏడుస్తూనే చెవిలో చెబుతుంది

అది వింటూనే మావయ్య బిగ్గరగా నవ్వుతాడు. బామ్మ ఏడుపు, మావయ్య

నవ్వు, అర్థం కాదు బుచ్చిగాడికి ! )

బుచ్చి ( కోపంగా ) ఏమిటా వెకిలి నవ్వు ? ఆవిడేమో ఏడుస్తుంది, నువ్వేమో

పిచ్చెక్కినవాడిలా నవ్వుతావు ?

అసలు విషయం చెప్పండి లేకపోతే …. నాకు పిచ్చెక్కుతుంది !

మావయ్య ( గట్టిగా నవ్వుతూ ! ) చెప్తా చెప్తా

( అంటూ లోపలికి వెళ్ళి ఓ బెండకాయ పట్టుకొస్తాడు )

( బుచ్చిగాడికి చూపిస్తూ ! )

మావయ్య ( నవ్వుతూ ) ఇదేమిటి ?

బుచ్చి అదా ? మరి, అదీ, అదీ….. లేడీస్‌ ఫిన్గర్‌ మావయ్యా !

మావయ్య కాదు ఇంకో పేరు !

మావయ్య అబ్బా, లేడీస్‌ అనగానే ఎంత సిగ్గో వీడికి …. నీ సిగ్గు

తరగా…. అందుకే వీడికింకా పెళ్ళి కాలేదు…

తెలిసి చస్తే ఇంకో పేరు చెప్పు.

బుచ్చి అమెరికాలో అయితే ఓక్రా అంటారు !

మావయ్య అమెరికాలో ఎలా పిలిచి ఛస్తే మనకెందుకుకాని తెలుగులో చెప్పి ఏడు !

బుచ్చి బెండకాయ

మావయ్య ( బెండకాయని బుచ్చి ని చూపిస్తూ ! ) నువ్వు ఇది ( అంటూ

గట్టిగా నవ్వుతాడు )

బుచ్చి ఆ ! అంటే ఆ పరంధామయ్య నన్న బెండకాయా అన్నాడా ?

మావయ్య మామూలు బెండకాయా కాదు పనికిరాని పరమ ముదూరు

బెండకాయ అన్నాడు !

బుచ్చి ఏమే బామ్మా ! ఇది నిజమేనా ! ఆ పరంధామయ్య నన్ను ముదురు బెండ

కాయ అన్నాడా ?

బామ్మ ( కుర్చీలోంచి లేస్తూ ! ) అవునురా ! వాడి నోరు పడిపోను

వాడికి సార్స్‌ అంటా ? వాడికి ఎయిడ్స్‌ రానూ ! బంగారంలాంటి

నా మనవడ్ని పట్టుకొని “ముదురు బెండకాయ “, ” ముదురు బెండకాయ”

అని అంటాడా ! వాడే ముదురు బెండకాయ వాళ్ళ నాన్న ముదురు

బెండకాయ వాళ్ళ తాత ” ముదురు బెండకాయ ” ….

అందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది ! లేదంటేనా ఓ నాలుగు

కరాటే కిక్కులిచ్చుండే దాన్ని !

బుచ్చి అబ్బా ! ఆపవే బామ్మా, నువ్వు టీవి లొ కరాటె చూడ్డం కాదు

కాని, అందరినీ తెగ చంపేస్తున్నావు ” ఊ హా ” అంటూ….

మావయ్య ఒరే బుచ్చిగా ! పెద్దావిడ అని కించిత్‌ గౌరవం కూడా లేకుండా పెళ్ళీ

పెటాకులు చేయరా మీ ముదురు బెండకాయకి అదే .. మీ బుచ్చిగాడికి …

బుచ్చి ( మధ్యలో ఆపుతూ ! ) అబ్బా ఆపు మావయ్యా ! వినడానికే ఇబ్బందిగా వుంది !

ఆ పరంధామయ్య ఒకసారే అన్నాడు ! మీరు మాత్రం ఒంద సార్లు “ముదూరు

బెండకాయ ” “ముదురు బెండకాయ ” అంటూ నా బుర్ర తింటున్నారు !

బామ్మ అంటాడురా ! ఆ ముసలి నక్క ! వాడెక్కెన ఆటూ కింద బడా !

ఏమండీ బామ్మ గారు మీ బుచ్చిగాడు ముదురు బెండకాయలా

అయిపోతున్నాడు పెళ్ళీ పెటాకులు లేవా అని అంటాడా ?

చూపిస్తాను ఈ బామ్మ తఢాకా ఏమిటో!

మా బుచ్చిగాడికి నెళ్ళాల్ల లోగా ఓ మంచి సమ్బధం తీసుకొచ్చి

పెళ్ళి చేయకపోతే కరాటేలో ” బ్లాక్‌ బెల్ట్‌ ” హోల్డర్‌ ఈ బామ్మ

బామ్మే కాదు ఇదే నా చాణక్య ఛీ ఛీ మంగమ్మ శపధం !

ఏవోయ్‌ గుర్నాధం ….

మావయ్య … గుర్నాధం కాదండి, పరాన్కుశమ్‌..

బామ్మ … అదే ఏదో ఒక కుశమ్‌.., నా శార్ధపు కుశమ్‌.. ఇట్రా…

ఇవ్వాళే వెళ్ళి న్యూస్‌ పేపెర్లో బన్గారం లాంటి ముదురు బెండకాయ..

అదే బన్గారంలాంటి నా మనవడికి వధువు కావలెను అని ప్రక టన

… ఇప్పించు. ఎంత ఖర్చైనా ఫరవా లేదు ! ముందు మా బుచ్చిగాడికి

పెళ్ళి చేసి తీరాలి.

బుచ్చి వెధవది నా పెళ్ళి కోసం ఇన్ని శపధాలెందుకే బామ్మా ! అందుకే

మీ అందరికి శ్రమ తగ్గించి నేనే ఒక అమ్మాయిని ప్రేమించేసా ?

మావయ్య అలా చెప్పు మరి ! మన వాడు అమాయకుడులా కనిపిస్తాడు కాని

ముదురే ! చూసారా బామ్మ గారు మన బడుద్ధాయి ప్రేమలో

పడ్డాడుట ?

బామ్మ ఇదెక్కడి ఘోరం రా ! నువ్వు ప్రేమలో పడ్డావా ?

బుచ్చి అదేదో మురికిగుంటలో పడ్డట్టు అలా ఇదై పోతారేమిటే ?

అవును నేను మా కంపినీలో పని చేసే ఒక అమ్మాయిని ప్రేమించా !

బామ్మ నాకు తెలీయకుండానే ఈ వెధవ వేషాలు ఎప్పుడు మొదలెట్టేవురా ?

అసలా అమ్మాయి ఎవరు ? వాళ్ళ కుటుమ్బమేమిటి ? వాళ్ళ ఆస్తి పాస్తులేమిటి ?

ఈ విషయాలేమీ తెలుసుకో కుండా, ఈ ప్రేమా దోమా ఏమిట్రా ?

నువ్వు ప్రేమించినా, నాకు పిల్ల నచ్చే వరకు ఈ పెళ్ళి జరగదు !

ఈ వెధవ సినిమాలు చూసి తగులబడి పోయావు

ఎదో బుద్ధిగా ఆఫీసుకెళ్ళి వస్తున్నావనుకుంటే ఈ

ప్రేమ గోల ఏమిట్రా ? ఆఫీసులో ” పనీ పనీ అంటూ ” ఆదివారాలు కూడా

ఉడాయించేవాడివి. ఇదా నువ్వు సాగించే నిర్వాకం ?….

బుచ్చి … బామ్మా బామ్మ …., ప్లేజ్‌ ఈ పెళ్ళికి ఒప్పేసుకోవే,

నన్నిన్కెవ్వరూ ముదురు బెన్డకాయ అనరే, నీ పరువు పొదే….

మావయ్య నాకు తెలీక అడుగుతాను వాడేదో ముచ్చటగా ప్రేమిస్తే

మీరేమిటండి రైలిమ్జనూలా అలా రెచ్చి పోతారు !

ఒరేయ్‌ బుచ్చీ ఆ అమ్మాయి ఎవర్రా ?

బుచ్చి ఆ అమ్మాయి పేరు ” మహా ” ! నాతోపాటే పనిచేస్తుంది ! రెండేళ్ళు

నా ప్రేమని చెప్పలేక చఛ్చీ చేడి ధైర్యంగా నెల్లాళ్ళ క్రితమే

చెపితే సరేనంది. బామ్మా ! ప్లీజే ఈ పెళ్ళి కొప్పుకోవే !

బామ్మ నువ్వే ప్రేమించేసి పెళ్ళి చేసేసుకుంటే ఈ దిక్కుమాలిన బామ్మ

పర్మిషన్‌ ఎందుకురా ? బుద్ధిమంతుడు సినిమా చూసేక పుట్టావుకదా,

అలాగే ఉన్నావనుకున్నాను ! మరీ ఇంతగా బరితెగిస్తావనుకోలేదు !

( ఏడుస్తుంది )

మావయ్య కరక్షన్‌ బామ్మ గారు ! బుద్ధిమంతుడు సినిమా రిలీజు రోజునే

ప్రేమించు పెళ్ళాడు సినిమా కూడా రిలీజయ్యింది అందుకే మనవాడు కూడా

ఆ సినిమాలోలాగా మనకి చెప్పా పెట్టకుండా లేచి …

( అంటూండగానే బుచ్చి కోపంగా ! )

బుచ్చి ఆపుతారా ఈ నస ! నేనేవరితోనూ లేచి ( మళ్ళి నాలిక కరుచుకొని )

పోలేదు ! ప్రేమించానంతే అయినా బామ్మ నీకు చెప్పకుండా పెళ్ళి ఎలా

చేసుకుంటావనుకున్నావే ! ఈ బుచ్చిగాడు ఎప్పుడైనా నీకు కష్టమ్‌

కలిగించే పని చేసాడా ! అందుకే నే ప్రేమించిన అమ్మాయికి ముందుగానే

చెప్పా ! మా బామ్మ కి కూడా ” ఓకే ” అనాలని !

మావయ్య అది సరేరా ! ఆ అమ్మాయి వాళ్ళ వివరారు తెలుసుకోవాలి కదా ?

ఇవన్నీ చూడకుండా ప్రేమించాను ప్రేమించానంటే ఆ పెద్దావిడ

ఎలా ఒప్పుకుంటుంది ?

బుచ్చి సరే ! ఆ అమ్మాయిని పిలిపిస్తా ! కాని మీరు పిచ్చి పిచ్చి ప్రశ్నలేసి

విసిగించనంటే ఇప్పుడే ఫోన్‌ చేసి పిలిపిస్తా !

మావయ్య ఏదో అనుకున్నాను మనవాడు ఘటికుడే ! అంతా పకడ్బందీగా

ప్లాన్‌ చేసేకునే ఉన్నాడు

( బుచ్చి సెల్‌ ఫోన్‌ తీసి ఫోన్‌ చేస్తాడు సిగ్నల్‌ సరిగ్గా రావటం లేదంటూ లోపలికి

వెళతాడు. )

బామ్మ ప్రేమట ప్రేమ ! అదేం కుదరదు. నాకు నచ్చకుండా ఈ పెళ్ళి జరగదు !

మావయ్య నాకు తెలియక అడుగుతాను పెళ్ళి చేసుకొని కాపురం చేసేది వాడా ?

మీరా ?

( బామ్మ గుర్రుగా చూస్తుంది. మావయ్య భయంగా పక్కకు తిరిగి నాలిక కరుచుకుంటాడు.

ఈ లోగా లోపలినుండి బుచ్చిగాడు నవ్వుతూ వస్తాడు. )

బుచ్చి బామ్మా ! ఇప్పుడే ఫోన్‌ చేసా ? ” మహా ” బయల్దేరి వస్తానంది !

చూసావా బామ్మా ! ఏ క్షణంలోనైనా మహా వస్తుంది. నీకు కావలిసినంత

సేపు చూడచ్చు ! నీకు ఖచ్చితంగా నచ్చుతుందే బామ్మా !

నీకు కావల్సిన వివరాలన్నీ అడుగు ! కాని పిచ్చి పిచ్చి ప్రశ్నలు

“నీకు వంట వచ్చా ? పళ్ళు తోముకోవడం వచ్చా ? ”

కొబ్బరి పీచు బూడిద లో మున్చి ఇత్తడి గిన్నెలు తోమడం వచ్చా,

అంటూ షంటకు ! నీ తర్పున నేనడుగుతా ?

మావయ్య అన్నీ నువ్వు అడిగితే మేమెందుకు నాయనా ? ఓకే అని గంగిరెద్దులా

తలూపడానికా ?

( ఈ లోగా కాలింగ్‌ బెల్‌ మోగుతుంది. )

బుచ్చి అదిగో మాటల్లోనే వచ్చేసింది మహా !

మావయ్య మహా అంటే ఎవర్రా ? మహాలక్ష్మా ?

బుచ్చి మహాలక్ష్మి కాదు ! ఆమె పేరు ” మహా “. నీ కర్ధం అయ్యి చావదులే !

( అంటూ లోపలికి వెళతాడు )

మావయ్య ఇవెక్కడి పేర్లో ! ” మహా ఆహా ఓహో ” అంటూ ఈ దిక్కుమాలిన

పేర్లు తప్ప ఈ తరానికి పేర్లే దొరకడంలేదా ?

( మహా బుచ్చిగాడు వస్తారు . ఆ అమ్మాయి పేంటు షర్ట్‌ వేసుకొని చేతిలో సెల్‌

ఫోన్‌ వానిటీ బాగ్‌ స్టైల్‌ గా దిగుతుంది. )

( బుచ్చి పరిచయం చేస్తాడు బామ్మని మావయ్యని )

బుచ్చి మహా దిసీజ్‌ మై బిలవుడ్‌ బామ్మ ! దిసీజ్‌ మై అంకుల్‌ బామ్మా !

ఈ అమ్మాయే మహా !

( మహా, బామ్మ కాళ్ళకి నమస్కరిస్తుంది బామ్మ ” పిల్ల బాగుందన్నట్లుగా

మావయ్య వైపు తల తిప్పుతుంది. )

బామ్మ దీర్ఘసుమంగలీభవ ! లే అమ్మా ! నీ పేరేమిటి ?

మహా దిస్‌ ఈజ్‌ ఉవర్‌ బామ్మ ! షీ ఈజ్‌ సో నైస్‌ !

హూ ఈజ్‌ దిస్‌ అంకుల్‌ బుచ్చీ ?

బుచ్చి నే చెప్పలే అమలాపురం లో మాకో మావయ్య ఉన్నాఅడని ఈయనే

అందరూ ఈయన్ని ” పి ఆర్‌ మావయ్య ” అని పిలుస్తామని !

మహా ఈయనేనా ! పి . ఆర్‌ మావయ్య అంటే పనికిరాని మావయ్య అని చెప్పావ్‌ ?

( మహా వచ్చీ రాని తెలుగులో స్టైల్‌ గా మాట్లాడుతుంది )

మావయ్య ఆ ! అలా అన్నావుట్రా బుచ్చి. నువ్వేం పట్టిన్చుకోకమ్మా. వాడొట్టి

చిలిపి వెధవ, గోచీలు పెట్టుకున్నపట్నుంచి ఇన్తే..

పరన్కుశ రావు అమ్మా నా పేరు.

బామ్మ అమ్మాయ్‌ ! మీ ఊరేమిటి ? మీ నాన్నగారు ఏం చేస్తారు ? మీ రెంతమంది

పిల్లలు ? ….

బుచ్చి అబ్బ బామ్మా ! ఇప్పుడే మొదలు పెట్టేవా ? ఇప్పుడే వచ్చింది కదా

కాస్త కాఫీ ఇచ్చాక అన్నీ తీరిగ్గా అడగచ్చు కదా ?

మహా నో బుచ్చీ పెద్దవాళ్ళు అడగనీ మా డాడీ పేరు హెచ్‌ ఎమ్‌ దొర

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ! మాది చాలా పెద్ద ఫామిలీ ! మా బంధువులందరం

ఈ ఊరి చివరన ఫారెస్ట్‌ లో కలిసి ఉంటాం ! మాకు ఈ ఊరి

చివరన ఫారెస్ట్‌ దగ్గర పెద్ద పెద్ద ఫాం హౌసులున్నాయి !

బామ్మ ఫాం హౌస్‌ అంటే ఏమిటిరా ?

మావయ్య ఫాం హౌస్‌ లంటే ఊరిచివర్న ఉండే కోళ్ళ ఫారంలా ?

బుచ్చి ( పళ్ళు కొరుకుతూ ! ) కాదు అక్కడ వాళ్ళకి ఎరవై ఎకరాఅల తోటలో

ఓ పేద్ద బంగళా ఉందట.

మహా బామ్మ గారూ ! మీరు నాకు నచ్చారు ! పెళ్ళికి ఏర్పాట్లు చేయండి.

నేను మా డాడీకి ఫోన్‌ చేసి చెప్తా కాకపోతే ….

బామ్మ నే నచ్చడం ఏమిట్రా ? కొంపతీసి నన్ను పెళ్ళి చేసుకుంటుందా ఏం ?…

బుచ్చి అబ్బా ! నువ్వు ఆమెకు నచ్చావని అంతే పెళ్ళి మాత్రం చేసుకొనేది

నన్నే కంగారేం పడకు…

బామ్మ చూడమ్మా ! పెళ్ళి అంటే మాటలా ? ముందుగా మీ వాళ్ళని కలవాలి

కదా ? అన్ని విషయాలు మాట్లాడుకోవాలి కదా ?

బుచ్చి మహా నే చెప్పాను కదా ! మా బామ్మ పాతకాలం మనిషని !

మహా ఓ ! మీరు వచ్చి మా పేరెంట్సిని కలవవచ్చు ! బుచ్చీ మీ బామ్మ గార్ని

తీసుకొని రేపు మా ఇంటికి రా ! మా డాడీతో అంతా మాట్లాడు కుంటారు !

సరేనా, బామ్మ గారు ? మా డాడీకి ఇప్పుడే ఫోన్‌ చేసి చెబుతా అన్ని

ఎరేమ్మ్జెంట్స్‌ చేయమని. ! రేపే రండి బామ్మగారు

ఆ మర్చిపోయాను నాకు పని వుంది వస్తా !

బుచ్చీ ఈ రియల్లీ లైక్‌ యువర్‌ బామ్మ గారు !

వస్తానండీ !

( అంటూ వెళిపోతుంది బామ్మ బుచ్చి ఆమె వెనుకనే వెళతారు )

మావయ్య ఇన్నాళ్ళు మా బుచ్చి గాడు అమాయకుడు అనుకునేవాడ్ని !

కొడితే కుమ్భస్థలం కొట్టాలన్నట్లు బాగా డబ్బున్న వాళ్ళ

అమ్మాయిని తెలివిగానే బుట్టలో వేసాడు ! వీడు సామాన్యుడు కాదు !

మహా ముదురు ( అంటూ జేబులోంచి బెండకాయ తీసి చూస్తూడు.

( తెర పడును )

రెండవ అంకం

( ఊరి చివర అడవిలో కోయ గూడెం బామ్మ బుచ్చిగాడు ప్రవేశం )

బామ్మ ఒరేయ్‌ బుచ్చీ ఊరిచివర్న ఫాం హౌస్‌ అన్నావు ఇదేదో అడవిలాగ

ఉందేమిట్రా ? ఈ గుడిసెలూ అవీ చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా !

బుచ్చి నీ కన్నీ అనుమానాలేనే బామ్మా ! ఫారెస్ట్‌ ఆఫీసరిని మహా చెప్పింది కదా ?

ఫారెస్ట్‌ ఆఫీసరంటే ఫారెస్ట్‌ లోనే ఉండాలి మరి ?

బామ్మ అలాగా ?

( ఈ లోగా కోయవాళ్ళు బలె బలె బలె అంటూ వచ్చి చుట్టుముడతారు ! ఇంతలో

కోయ దొర ప్రవేశం )

కోయదొర అమ్బ పలికె ! జగదమ్బ పలికె మహంకాళి మాతల్లి కొండదేవర పలికే !

స్వాగతం దొరా స్వాగతం ! మా కొండగూడేనికి స్వాగతం ! మా కూన

మీ రాక అంతా చెప్పింది దొరా ! ఒరేయ్‌ మల్లు ఒరేయ్‌ భిల్లూ ! ఈ

సామేరా ! మన కూన జత కట్టిన దేవర ! ఆనందంగా స్వాగతమ్‌

చెప్పండిరా ! మన బంధువులకి విందులు చేయండిరా !

బామ్మ ఏయె కోయాడా ! ఈ గోల ఆపి ఫారెస్ట్‌ ఆఫీసరు హెచ్‌ . ఎం దొర గారి

ఇల్లు ఎక్కడొ చెప్పు !

కోయమల్లు ఈ గూడెంలో ఇంకో దొర లేడు స్వామీ మా హనుమ మల్లు దొర తప్ప

ఇంకో దొరే లేడు సామీ మా అందరికీ ఈ దొరొక్కడే రాజు !

బుచ్చి అదిసరే ఇక్కడ దొర అని ఒకాయన ఫారెస్ట్‌ ఆఫీసరు ఉన్నాడు.

ఆయనకో అమ్మాయి ఉంది మహా అని ….

దొర ఈ అడవికి నేనే దొరని సామీ ! మాహా మా కూన ! నిన్ననే మీరు వస్తారని

చెబితే ఈ సమ్బరం చేసాము దొరా ! మ కూన ఇంటిదగ్గర నీకోసం

ఎదురు చూస్తోంది దొరా !

బామ్మ ఒరేయ్‌ బుచ్చీ ఆ అమ్మయి మరి వాళ్ళ నాన్న ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ! వాళ్ళకి

ఊరు చివర్న అదేమిటి దిక్కుమాలిన ఫాం హౌస్‌ ఉందని చెప్పింది కదరా !

బుచ్చి నాకూ అదే అర్థం కావడంలేదే బామ్మా ? అడిగి చూస్తా !

ఏయ్‌ కోయ దొరా ! మేం ఫారెస్ట్‌ ఆఫీసర్ని కలవాలి ! వాళ్ళ అమ్మాయి మహా అని

హైదరాబాదులో మైక్రోసాఫ్ట్‌ బ్రాంచ్‌ లో ఉద్యోగం చేస్తుంది ఆ అమ్మాయి.

మీ కూన కాదు !

దొర ఆ కూన ఎవరో కాదు సామీ మా కూనే పట్టణంలో చదువుకొని

అక్కడే ఉంటుంది సామీ ఈ గూడెంలో ఏ ఫారెస్ట్‌ ఆఫీసరు లేరు సామీ !

బామ్మ ఒరేయ్‌ బుచ్చీ ! ఆ మహా అంటే ఈ కోయ వాళ్ళ పిల్లరా ! అంతా మోసం !

ఎవరూ దొరకనట్లు ఈ కోయ వాళ్ళ అమ్మయిని ప్రేమించేవేమిటి రా ?

ఏమిట్రా ఈ ప్రారబ్ధం ?

బుచ్చి ఇదంతా నాకయోమయంగా ఉందే బామ్మా ? ఆగు మహాకి ఫోన్‌ చేస్తా

( అంటూ ఫోన్‌ తీస్తుండగానే మహా ప్రవేశిస్తుంది )

మహ ఏయ్‌ బుచ్చీ ! వెల్కం ! రండి బామ్మ గారు ! రండి ( దొర వైపు తిరిగి

కోయ యాస తో )

అయ్యా ఇతనే నే మనువాడబోయే పుమ్జు ఈ అవ్వ అతని బామ్మ !

దొరా కూనా ! నేనెంత చెప్పినా నమ్మలేదు ఈ దొర ! ఆ మహా అంటే మా

మహంకాళే అని ఎంత ఎరుక చేసినా నమ్మ బోలేదమ్మా !

బామ్మ మహంకాళా ? ఒరెయ్‌ బుచ్చి అంతా మోసం రా ఈ అమ్మాయి పేరు

మహంకాళట !

బుచ్చి ఏమిటి మహా, ఇదంతా ?

మహా అవును బుచ్చీ ఇతను మా అయ్య మాది కోయ గూడెం ! నా పేరు మహంకాళే !

నేనే మహా గా మార్చుకున్నా !

కోయదొర ఒరేయ్‌ మల్లు రాక రాక వచ్చి న అథిధులకి మర్యాదలివేరా !

మల్లు దొరా ! చూసావా ! మన అమ్మోరిముందు కోడి గుడ్డు పెట్టింది దొరా !

మన కొండదేవర కరుణించి, నేడే మంచి ముగూర్తం చూపింది దొరా !

కోయదొర అవునురా మల్లూ ! మనతల్లి మంచి శకునం చూపిందిరా ! రండి రండి

మన అమ్మోరి ఆజ్ఞ పకారం సమ్బరాలు జరపండి.

( వాళ్ళందరూ బుచ్చిని చేయిపట్టి లాక్కెళ్ళి రంగులు పులువుతారు ! నెత్తి మీద కోదిగుడ్డు

పగలగొట్టి నానా రభస చేస్తారు. బుచ్చి చేత మహా నుదుటిమీద తిలకం

దిద్దిస్తారు ! )

దొర అమ్మా తల్లీ మన గూడెం పెట్ట మన అమ్మోరి ముందు గుడ్డుపెట్టిన ఈ రోజుతో

నీ మనువు అయినట్లే ! ఈ రోజు నుండి మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఉండడి !

బామ్మ మనువంటాడేమిట్రా ! ఈ రభసంతా ఏమిటి ? గుడ్లప్పగించి అలా

చూస్తావు ? ( పళ్ళు కొరుకుతూ ) అడిగి చావు ?

బుచ్చి నాకేం తెలియడంలేదే బామ్మా ! ( మహా వైపు తిరిగి ) మహా ! ఏమిటిదంతా ?

మనువంటున్నారేమిటి ?

మహా అవును బుచ్చీ మా ఆచారం ప్రకారం మా గూడెం కోడిపెట్ట మా అమ్మోరు

ముందు గుడ్డు పెడితే ఆరోజే మాకు మంచి రోజు అదే మాకు మంచి ముహూర్తం !

అందుకే మా ఆచారం ప్రకారం మన పెళ్ళి అయిపోయింది.

బుచ్చి , బామ్మ ఆ ! పెళ్ళి అయిపోయిందా ?

మహా యస్‌ ! మన పెళ్ళి అయిపోయింది.

బామ్మ ఒరేయ్‌ బుచ్చీ ఇదంతా మోసం ! మాట్లాడడానికి రమ్మనమని

నేనెక్కడ గొడవ పెడతానో అని తెలివిగా ఈ నాటకం ఆడేవురా ?

ఈ బామ్మనే మోసం చేస్తావురా ? ఒరేయ్‌ కోయాడా ఈ పెళ్ళి

చెల్లదు ! వీళ్ళకి నా దీవెనలు లేవు ! అయినా ఇది పెళ్ళి కాదు

దొర అంత మాటనకమ్మా ! అమ్మోరి సాక్షిగా ఈ మనువు అయిపోయింది.

ఈ జంటని ఆశీర్వదించమ్మా !

బామ్మ మోసం చేసి మా వాడ్ని బుట్టలో వేసుకున్నారు మీరంతా

దొంగలు అయినా మా బుచ్చిగాడ్ని అనాలి ! ఏరా బుచ్చీ ఎందుకిలా

చేసావురా ? చిన్నతనంలోనే తల్లీతండ్రీ పొతే కంటికి రెప్పలా

పెంచానే ? నన్నే మోసం చేస్తావా ?

బుచ్చి బామ్మా నాకేం తెలియదే ! కావాలంటే నీ మీద ఒట్టు !

బామ్మ అవున్రా ఒట్టు పెట్టేస్తే నే గుటుక్కుమంటావనుకున్నావురా ?

ఎంతకైనా బరితెగించావు ! ఈ బామ్మనే మోసం చేస్తావురా ?

ఈ పెళ్ళి పెళ్ళి కాదు. మోసగాడా నీ ముఖం నాకు చూపించకు !

( అంటూ ఏడుస్తూ వెళిపోతుంది. బామ్మా బామ్మా అంటూ బుచ్చి వెళితే కోయవాళ్ళు వెనక్కి

లాగుతారు. )

( తెర పడును )

మూడవ అంకం

( బామ్మ గారిల్లు. సోఫాలో బామ్మ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది మావయ్య ప్రవేశం ! )

మావయ్య బామ్మ గారు ! నే విన్నది నిజమేనా ?

బామ్మ నిజమే నాయనా ! ఈ బుచ్చిగాడు నా పరువు కాస్తా తేసేసాడు !

మావయ్య మరి పెళ్ళి అయ్యాక వాడు ఇలా రాలేదా ?

బామ్మ వాడికింక ఈ బామ్మ అవసరం ఏం ఉంది ? ఆ పిల్ల వాడ్ని కొంగుకి ముడేసేసుకుంది

కదా ! నా ఖర్మ నాది ! వాడెందుకొస్తాడిక్కడకి.

మావయ్య అలా అనకండి బామ్మ గారు ! బుచ్చిగాడికి మీరంటే ప్రాణం !

వాడు మిమ్మల్ని వదిలి ఓ క్షణం కూడా ఉండలేడు ! తప్పకుండా వస్తాడు !

బామ్మ ఆ వెధవ ఇక్కడికొస్తే కాళ్ళు విరగ్గొడతాను ! ఆ అమ్మాయిని

మెడపెట్టి బయటకు నేట్టుతా ! నన్నే మోసం చేసి పెళ్ళి చేసుకుంటారా ?

మావయ్య ఇదంతా చూస్తుంటే ఇందులో మన బుచ్చి గాడి తప్పేం లేదని

అనిపిస్తోంది అయినా బామ్మగారు మీరు అవున్నా కాదన్నా పెళ్ళి అయినట్లే

కాదా ? వాళ్ళొస్తే అనవసరంగా రభస చేయకుండా దీవించండి.

బామ్మ పెళ్ళట పెళ్ళి అయినా మన సాంప్రదాయ ప్రకారం జరిగితే కాని

పెళ్ళి జరగనట్లే ! వాళ్ళు వస్తే తన్ని తగలేస్తా !

మావయ్య బామ్మగారూ ! కాస్త ఆలోచించండి. మీరు అవునన్న కాదన్నా

ఇప్పుడు మన బుచ్చిగాడు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నట్లే ! అందరికీ

తెలిస్తే ఉన్న పరువు కాస్తా పోతుంది. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండ

గొడవ పడకుండా సరేననండి. వాళ్ళు వస్తే తన్ని తగలేయకుండా

సరేననండి.

బామ్మ నా కంఠంలో ప్రాణం ఉండగా నేనొప్పుకోను !

మావయ్య అలా అనకండి. దేనికయినా పట్టు విడుపూ ఉండాలి. మీకు

మీరనుకునేట్లా పెళ్ళి జరిపించే బాధ్యత నాది. ఊ అనండి చాలు !

బామ్మ మళ్ళి పెళ్ళేమిటి నాయనా ఈ పాటికి ఆ కోయవాళ్ళ పద్దతుల్లో

శోభనం కూడా అయిపోయుంటుంది !

మావయ్య మీరలా ఊహించుకోకండి. మన బుచ్చిగాడు మీరలా

కోపగించుకొచ్చేస్తే వాడక్కడ ఆనందంగా ఉంటాడనుకున్నారా ?

వాడు ఏ క్షణాన్నయినా రావచ్చు ! వాడొస్తే గొడవ చేయకండి.

మన పద్ధతిలో పెళ్ళి జరింపించే పూచీ నాది.

బామ్మ పెళ్ళి ఎలా జరిపిస్తావయ్యా ? ఇంకో నెల్లాళ్ళ వరకూ ముహుర్తాలే లేవు

కదా ?

మావయ్య మీరలా ఉండండి . నే చక్రం తిప్పుతా గా ! మన బుచ్చిగాడు ఎలాగూ వస్తాడు.

మీరు కాస్త బెట్టు చేసి ఒప్పుకోండి కాని ఒక్క షరతు మీద . మన పద్దతి ప్రకారం

పెళ్ళి జరిగే వరకూ ఆ పిల్లతో కాపురం చేయకూడదని కండిషన్‌ పెట్టండి.

బామ్మ ఏడిసినట్లే ఉంది ! మన వాడు ఒప్పుకున్నా ఆ అమ్మాయి ఒప్పుకోదు

కదా ? మనల్ని పక్కౌపెట్టే పెళ్ళి చేసుకుంది. ఇక కాపురం చెయ్య డానికి మన

పర్మిషన్‌ అడుగుతుందనుకున్నావా ? నీ వెర్రి కాని …

మావయ్య అక్కడే మరి మిగతా వాళ్ళకి, ఈ పరాంకుశరావుకీ తేడా !

బుచ్చి గాడితో పెళ్ళి అయ్యేవరకూ ఆ అమ్మాయితో కాపురం

చేయకూడదని చెప్తా అలా చేస్తే జాతకం ప్రకారం మీ బామ్మ

గారికే ముప్పు అని సెంటిమెంటుపై దెబ్బ కొడతా ! మన బుచ్చిగాడు

మీకు హాని కలిగించేవేమీ చెయ్యడు. అసలే మీరు కోపంలో ఉండి

క్షమా భిక్ష పెట్టేరుకనుక, ఈ సారి మరో తప్పు చేసి మిమ్మల్ని

ఒదులుకోడు. ఒకవేళ ఆ అమ్మాయి కాదన్న ఈ విషయం చెప్పి ఒప్పిస్తాడు.

ఎలావుంది మన అవిడియా !

బామ్మ పరాం కుశం ! ఇన్నాళ్ళు ఏమిటో అనుకున్నాను ! నువ్వు గట్టి ిపండానివే !

మావయ్య అసలేమనుకున్నారు నా టాలెంటు గురించి ! అవకాశం రాలేదుకాని

ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన వాడ్ని ఖర్మ కొద్ది మా ఆవిడకి ిపండి

రుబ్బుతున్నాను ! ప్చ్‌ !

( ఈ లోగా ఎవరో వస్తున్నట్లు చప్పుడవుతుంది. )

మావయ్య ( కంగారుగా !) అదిగో బుచ్చిగాడు వస్తున్నట్లుంది. నే చెప్పింది

గుర్తుంది కదా !

( బుచ్చి, మహా ప్రవేశం , వస్తూనే బామ్మ కాళ్ళమీద పడతారు. )

బుచ్చి బామ్మా ! క్షమించవే నిజంగా నాకేం తెలియదే కావాలంటే

మహా నడుగు !

మహా అవును బామ్మగారు ! బుచ్చికేం తెలియదు . మా డాడి వాళ్ళు

సర్ప్రైజ్‌ గా అలా చేసారు ! మమ్మల్ని క్షమించండి బామ్మగారు.

బామ్మ ఇంకెందుకురా ! నే ఉన్నానో చచ్చానో అని చూడడానికొచ్చావా ?

బుచ్చి అవేం మాటలే బామ్మా ! క్షమించమని నీ కాళ్ళు పట్టుకున్నామ్‌

కదా ! ఇక పైన నువ్వు చెప్పినట్లే మేం నడుచుకుంటాం !

నువ్వేనా చెప్పు మావయ్యా !

బామ్మ ఇన్నాళ్ళు అలాగే అనుకునే దాన్ని ! ఇప్పుడే నీ నిజ రూపం తెలిసింది.

మావయ్య పాపం చిన్నవాళ్ళు ! క్షమించమని అడుగుతున్నారు కదా !

క్షమించేయండి. ఒరేయ్‌ బుచ్చీ ! ఆవిడకి నచ్చినట్లుగా మన

సాంప్రదాయం ప్రకారం పెళ్ళి జరగాలి రా ! నువ్వు సరే నంటే

ఆవిడ కాస్త శాంతిస్తుంది.

బుచ్చి బామ్మ ! సరేనే ! నువ్వు చెప్పినట్లుగానే మన పద్ధతిలో

మళ్ళా పెళ్ళి చేసుకుంటాం !

బామ్మ నిజంగా నే చెప్పినట్లు వింటావా ?

బుచ్చి నిజంగానే బామ్మా !

మావయ్య కానీ ఓ పెద్ద చిక్కు ఒచ్చిపడింది. ఇప్పుడే ముహుర్తాలు లేవు మరి!

ఓ నెల్లాళ్ళు ఆగాలి ! అంతవరకూ ఆ అమ్మాయి కాపురానికి రాకూడదు.

మహా పనికిరాని మావయ్య గారు ! కాపురానికి రాకుండా మరి నేనెక్కడ

కెళ్ళేది ?

మావయ్య అదా మీ పుట్టింటికి ! నెల్లాళ్ళకో ముహుర్తం ఉంది. ఈ లోగా మీరు

కాపురం చేస్తే ఆ ఇంట్లో మూలనూన్న ముసలమ్మా గుటుక్కుమంటుందని

జాతకాల్లో రాసారు. కాబట్టి ….

బుచ్చి మూలనూన్న ముసలమ్మా గుటుక్కుమంటుందని రాసారా ! నిజమేనా !

అంటే మా బామ్మ ఒద్దు ఒద్దు

( మహా వైపు తిరిగి ) ప్లీజ్‌ మహా నాగురించి ఒక్క నెల్లాళ్ళు

ఓపిక పట్టు. నీ గురించి మీ వాళ్ళ జాతరమతా నేభరించలేదూ !

మహా అదెలా బుచ్చీ ! హనీమూన్‌ కని ఊటికి టిక్కట్లు బూక్‌ చేసా ! అన్ని

ఏర్పాట్లు చేసాను ! ఇప్పుడు కామ్సిల్‌ చేస్తే మొత్తం మనీ పోతుంది.

బుచ్చి కావాలంటే ఆ డబ్బు నేనిచ్చుకుంటా ! ప్లీజ్‌ ! నాకోసం !

మహా సరే కాని పెళ్ళికి మా మమ్మీ, డాడి అందరూ వస్తారు

వాళ్ళందరూ వస్తేనే ఈ పెళ్ళి జరిగేది.

బుచ్చి ప్లీజ్‌ బామ్మా సరేనే అని ఒప్పుకోవే బామ్మా !

బామ్మ ఏదో ఒకటి తగలడమను !

మావయ్య ఒరే బుచ్చీ గుర్తు పెట్టుకో ! నెల్లాళ వరకూ నువ్వు ఆ

అమ్మయిని కలవ కూడదు !

బుచ్చి ( కోపంగా ) చూడగా చూడగా నువ్వే ఏదో ఫిటింగ్‌ పెట్టావని నా అనుమానం !

మావయ్య చూసారా బామ్మగారు ! ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు

ఈ బుచ్చిగాడు నా మీద పడ్డాడు.

( ఈ లోగా పోలీస్‌ విజిల్‌ వినిపిస్తుంది. ఒక పోలీసు ఒక చేతిలో లాఠీ, రెండవ

చేతిలో స్టెతస్కోపు తో ప్రవేసం )

పోలీసు ఎక్కడ ఎక్కడ ( అంటూ అన్నీ వెతుకుతూ ఉంటాడు )

( సోఫా కింద, టేబిల్‌ కిందా వెతుకుతూ ఉంటాడు. అందరూ అయోమయంగా

చూస్తారు. )

మావయ్య ఎవరు కావాలండీ మీకు ? పిచ్చి కుక్కలా అలా అంతా వెతుకుతున్నారు ?

పోలీసు నేనా ! కనపడ్డం లేదా ? ఎవరో ఒకతను పెళ్ళి చేసుకొని పారిపోయాడని

స్టేషన్లో కంప్లైంట్‌ ఇస్తేఏ వచ్చా ? ఎక్కడ వాడు ? ఎక్కడ ?

( అంటూ మరలా వెతకడం మొదలు పెడతాడు )

మావయ్య బామ్మ గారు ! కొంపతీసి మీరుకాని మన బుచ్చిగాడి మీద పోలీసు సేషన్‌ లో

కంప్లైంట్‌ ఇచ్చారా ?

బుచ్చి ఏమే బామ్మా ! నామీద కేసు బనాయించావా ?

బామ్మ ( భయంగా ) అడవినుండి వస్తూ పోలీసు స్టేషన్లో చెప్పానంతే !

కేసు పెట్ట లేదురా ….

పోలీసు కేసు పెట్టిన పెట్టకపోయిన ఒక సారి మా స్టేషన్‌ లో కాలు పెడితే

చాలు మేమే బంకజలగల్లా పట్టుకుంటాం !

సామాన్య ప్రజలను పీక్కు తినడమే మా ధ్యేయం !

అయినా మీకు సినిమా వాళ్ళల్లా పాపులారిటీ ఉందా ?

రాజకీయ నాయకుల పలుకుబడి ఉందా ? చెప్పండి.

సినిమావాళ్ళయితే హత్యలు చేసి ఆధారాలు, రక్తాలు తుడిచేసినా

మేమేం పట్టిచుకోం ! ఆసుపత్రికి పంపి రెస్ట్‌ ఇప్పిస్తాం ! అలాకాదు రాజకీయ

పలుకుబడి ఉందంటారా మిమ్మల్ని బొక్కలో తోసినట్లు

పేపర్లో ప్రకటన ఇచ్చి మీకు ఫైవ్‌ స్టార్‌ సేవలు మా స్టేషన్‌ లోనే చేస్తాం !

చెప్పండి మీరు సినిమా స్టార్లా ? రాజకీయ నాయకులా ?

బుచ్చి మేమవరమూ కాదు కానీ ఇక్కడ ఎవరూ ఎవర్నీ లేపుకుపోలేదు..

ఇక మీరు వెళ్ళచ్చు.

పోలీసు అలాగా ! మరి ఈ అమ్మాయి ఎవరు ? నీ భార్యా ? లేక నువ్వు లేవదీసుకొ..

బుచ్చి ఏయ్‌ ! ఆగు ! బామ్మా నువ్వేనా చెప్పవే ఇక్కడ ఎవరూ ఎవర్నీ లేవదీసుకెళ్ళి

పోలేదని…

బామ్మ పోలీసు గారు .. వీళ్ళు నా మనవలు…

( అంటూడగా ఎక్కడ ఎక్కడ అంటూ తెర వెనుకనుండి కేకలు వినిపిస్తాయి

పోలీసు కంగారు పడుతూ ….)

పోలీసు అమ్మో ! నిజంగా పోలీసు వస్తున్నాడనుకుంటా ( అంటూ కంగారుగా

అటూ ఇటూ పరిగెడుతూ చేతిలో ఉన్న స్టెతస్కోపు బుచ్చిగాడి చేతిలో

పెట్టి పారిపోతాడు. )

( ఈలోగా ఒక డాక్టర్‌ ప్రవేశం )

డాక్టర్‌ ఎక్కడ ఎక్కడ ! ఆ దొంగవెధవెక్కడ ! నా స్టెతస్కోపెక్కడ !

మావయ్య ఎవరండీ మీరు దొంగల్ని పోలీసులు వెతకడం చూసాం కాని

పోలీసుల్నే వెతకడం ఇక్క్కడే చూస్తున్నాం !

డాక్టర్‌ ఇటువైపుగా స్టెతస్కోపుచ్చుకొని ఎవరైనా వచ్చారా !

( అంటూ బుచ్చి గాడి చేతిలో స్టెతస్కోపు చూసి గబా గబా వెళ్ళి బుచ్చిగాడి చెయ్యి

పట్టుకొని )

డాక్టర్‌ దొరికాడు దొంగ ! ఏరా ? ఆప్రేషన్‌ బల్లమీద పడుకో, అయిదు నిముషాల్లో చేస్తానంటే

నా స్టెతస్కోపుచ్చుకొని పారిపోతావురా ! నడు నీకు ఒక సారి కాదు వంద సార్లు కుట్లు

వేస్తా !

బుచ్చి ఆపరేషన్‌ ఏమిటండి ! ముందు నా చెయ్యి వదలండి !

డాక్టర్‌ వదలను వదలను కాక వదలను ! రోజుకి పది కేసులైనా చేయక పోతే నా బాసు నా

ఉద్యోగం పీకేస్తాడు. ఎలాగో చచ్చి తొమ్మిది అవగొట్టా ! నీకొక్కడి ఆపరేషన్‌ చేసేస్తే పదో

కేసు కూడా అయిపోతుంది.

బామ్మ ఆపరేషన్‌ ఏవిటండి ?

డాక్టర్‌ అదా ! కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ ! మీ అబ్బాయి బల్లమీద పడుక్కోబెట్ట గానే

నా స్టెతస్కోపు లాక్కొని మరీ పారిపోయాడు. ఊరంతా వాడి వెనక్కల పరిగెత్తలేక

చచ్చా !

మావయ్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ ఏమిట్రా బుచ్చీ ? నీకింకా మళ్ళీ పెళ్ళే కాలేదు, అప్పుడే

ఆపరేషన్‌ ఏవిట్రా ? ఏమిటి బామ్మ గారు ? మీ వమ్శం ఈ బుచ్చిగాడితో సరా ?

కుటుంబ నియంత్రణ….

బుచ్చి ( మధ్యలో అడ్డు తగుల్తూ ) ఆపండెహా మీ గోల ? ఏయ్‌ డాక్టర్‌ ! నా కింకా పెళ్ళే

కాలేదు. నువ్వు ఎవర్నో చూసి అనుకొని పొరబడుతున్నావు ?

డాక్టర్‌ ఎంత డొనేషన్‌ కట్టి ఎం బి బి ఎస్‌ చదివినా నేనేం అంత అమాయకుడ్ని అనుకోకు. నువ్వు

కాకపోతే నీ చేతిలో నా స్టెతస్కోపు ఎలా వచ్చిందమ్మా ?

బుచ్చి అదా ! ఇప్పుడే ఓ పోలీసొచ్చి నానా రభస చేసి, నువ్వు వస్తున్నావని చూసి, నా చేతిలో

పెట్టి పారిపోయాడు. బహుసా వాడే మీ ఆపరేషన్‌ కాండిడేట్‌ అనుకుంటా !

డాక్టర్‌ అలాగా ! అయితే నువ్వు బల్లమీద నుండి పారిపోయిన కుటుంబ నియంత్రణ కాండిడేట్‌

కాదన్న మాట. ఆ దొంగవెధవ పారిపోయాడు. పట్టుకోవాలి నే వస్తా !

( అంటూ స్టెతస్కోపుచ్చుకొని పరిగెడతాడు. )

మావయ్య డాక్టర్‌ గారు ! వాడు దొంగకాదు పోలీసు !

మావయ్య చూసారా బామ్మ గారు ! మనం ఎంత త్వరగా ముహుర్తుం పెట్టిస్తే అంత మంచిది.

వెంఠనే వెళ్ళి, పెళ్ళి శుభలేఖలు వేయించకపోతే కొంపలంటుకొనేట్లా ఉంది ( అంటూ

పరిగెడతాదు )

( తెర పడును )

నాల్గవ అంకం

( బామ్మ గారిల్లు. పెళ్ళి మంటపంలో మహా, పురోహితుడు కూర్చొని ఉంటారు.

పక్కనే పెళ్ళి వాయిద్యాలు వినిపిస్తాయి. ఇంతలో …. )

మావయ్యా ( పెళ్ళిలో అందర్నీ హడావిడి చేస్తూ ) ఏరా ! పెళ్ళికొచ్చిన అందర్నీ అన్నీ

అందాయని అడుగుతున్నారా ? ఏవమ్మా ? అన్నీ సదుపాయాలు బావున్నాయా ?

పేరుకి మగ పెళ్ళి వారాం కాని ఈ కోయ జాతికి సేవలు చేయలేక చస్తున్నాం !

పురోహితుడు అయ్యా ! ముహుర్తానికి టైమయ్యింది. పెళ్ళికొడుకెక్కడ ?

మావయ్యా కంగారు పడకండి. మా బామ్మగారికి కబురంపా ! వస్తున్నారు.

పురోహితుడు ఏమిటో ఈ పెళ్ళి నా జీవితంలో ఎన్నో పెళ్ళిళ్ళు చేసా! కాని పెళ్ళి కొడుకుని

తీసుకురావడం ఇక్కడే చూస్తున్నా ! ఏమిటో ఈ పెళ్ళి పెళ్ళి లా లేదు…

మావయ్యా అంత కంగారు పడితే ఎలా ? మా బామ్మ గారు వాడ్ని ప్రత్యేక ప ద్ధతిలో

తీసుకొస్తుంటే !

( బామ్మ మనవడి చేతికి తాడు కట్టి తీసుకొస్తుంది. )

బుచ్చి బామ్మా ఈ కట్లు ఏమిటే ? బర్రెను లాక్కెళుతున్నట్లు ఇదేమిటే ? నే పెళ్ళి

చేసుకోడానికి వెళుతున్నానా లేక పశువుల పాకకి వెళుతున్నానా ? కనీసం పెళ్ళిపీటల

మీదైనా ఈ కట్లు తీయవే !

బామ్మ నువ్వూరుకో ! ఇది మనకి అచ్చొచ్చిన సాంప్రదాయమ్‌ నా పెళ్ళికి మీ తాతని ఇలాగే

తీసుకొచ్చారు. మీ నాన్న పెళ్ళిలో ఈ పద్ధతి పాటించనందుకు పెళ్ళైన రెండేళ్ళకే మీ

అమ్మా నాన్నా పైకెళ్ళి పోయారు. ఇక నువ్వేం మాట్లాడకుండా బుద్ధిగా పెళ్ళి చేసుకో !

మావయ్యా బామ్మా గారంటే మాటలా ! వాళ్ళ ఆయన్నే చెట్టుకి కట్టేసింది. ఇహ ఈ మనవడొక

లెఖ్ఖా !!

( బామ్మ మనవడ్ని పీటల మీద కూర్చోబెడుతుంది. ఈ లోగా వంటవాడు ప్రవేశం )

వంటవాడు బామ్మా గారు ! బామ్మా గారు ! పాయ్సంలో ఏం పోపు వేయమంటారండీ ?

మావయ్యా నీ వంట తగలెయ్యా !! పాయసంలో పోపు ఏమిట్రా ? అసలు నీకు వంటొచ్చా ?

వంటవాడు భలేవారే ! గత ఆర్నెల్లుగా ఇదే చేస్తున్నా ! ఇంతకు ముందు మా వూర్లో ఇరవై మర్డర్లు

చేసి జైలుకెళ్ళాను. జైలు కూడు తిని తిని విసుగొచ్చి అక్కడే ” వంట చేయడం ఎలా ? ”

అని ఓ పుస్తకం రాసి పడేసా ! జైలు నుండి విడుదల కాగానే ఏదో టైం పాసుకి ఇది

మొదలేట్టా ?

మావయ్యా నీ వాలకం చూస్తే ఇలా కొంపలు తగలేసేవాడివని ముందే ఊహించాను. ఈ

పెళ్ళి వార్ని ఆ కొండతల్లే రక్షించాలి. నీ చేతి వంట వైకుంఠ బాట !

వంటవాడు అసలే వంటకి ఆలస్యం అయిపోతోంది. బామ్మగారూ పోపు సంగతి చెబుతారా !

( ఈ లోగా కోయదొర వంటవాడి దగ్గరకొచ్చి ….)

కోయదొర ఓ వంటాడా పెళ్ళి విందుగా మాకు లేడి మాం సం కావాలి !

మావయ్యా లేడి మామ్సం కాదు ! ఈ బామ్మగారికి కోపం వస్తే

మీ ఏ కీలు కాకీలు ఊడదీసి నర మాసం పెడుతుంది.

వంటవాడు అంత అవసరం లేదు నా వంట తింటే అన్నీ సర్దుకుంటాయి.

కోయ దొర కనీసం కల్లు అయినా పోస్తారా ! అసలు మా అచారం ప్రకారం

పెళ్ళాయ్యాక పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు కల్లు తాగి నాట్యమాడాలి !

వంటవాడు డోంట్‌ వర్రీ వెరైటీగా ఉంటుందని కాస్త బ్రాందీ పాయసంలో కలిపా !

కోయ దొర లేడి మాం సం లేదు తాటి కల్లు లేదు మరి ఏం వండావయా ఈ పెళ్ళికి ?

వంటవాడు ఓ పెళ్ళి మెనూనా ! ఈ పెళ్ళికి ప్రత్యేకంగా నా స్పెషాలిటీగా బెండకాయ కూర,

బెండకాయ పప్పు, బెండకాయ పులుసు, బెండకాయ పచ్చడి…

మావయ్యా బెండకాయ బెండకాయ అంటూ గట్టిగా అరవకు ఆ బుచ్చిగాడు విన్నాడంటే నీ ఫిక

నొక్కుతాడు.

కోయ దొర ఏం పెళ్ళయ్యా ఇది పెళ్ళి విందయ్యాక కల్లు పోయించరా !

మావయ్య కల్లు పేరు చెపితే ఈ బామ్మ గారు కాళ్ళు విరగ్గొడుతుంది.

అసలే ఆవిడ కరాటే లో బ్లాక్‌ బెల్ట్‌ !

కోయ దొర కరాటే అంటే ? అదో రకం విందా ?

మావయ్య కరాటే అంటే మల్లయుద్ధం అన్నమాట ! ఈ బామ్మగారు హిడిమ్బి చెల్లెలు !

( ఈ లోగా బామ్మ, బుచ్చి, మహా పెళ్ళి మండపం నుండి వస్తారు )

మావయ్య బామ్మగారు మీకు కరాటే బెల్ట్‌ లేదని అదంతా నకిలీ బెల్టని

ఈ కోయ వాళ్ళు తెగ వాగుతున్నారు !

బామ్మ అలాగా ! చూపిస్తాను నా తడాఖా !

( అంటూ బామ్మ గారు అందర్ని భుజం మీద కరాటె దెబ్బతో ఒక్క దెబ్బలో పడేస్తుంది. )

( ఈ లోగా బుచ్చి, మహా వెళిపోతూ )

బుచ్చి బామ్మా ! మీరందరూ తన్నుకు చావండి. మాకనవసరం ! మేం ఇప్పుడే హనీ మూన్‌కి

వెళిపోతున్నాం !

బామ్మ పారిఫ్తున్నారు పట్టుకోండి పట్టుకోండి !!

వంటవాడు ఆ నే చేసిన బెండకాయ వంటకాలు తినకుండానే పారిపోతున్నారా !!

పట్టుకోండి పట్టుకోండి !!

( అందరూ ఒకేసారి పట్టుకోండి పట్టుకోండి అంటూ నిష్క్రమిస్తారు )

వంటవాడు అయితే నే వండిన బెండకాయ కూర, బెండకాయ పులుసు ఎవరూ తినరా ?

( ప్రేక్షకుల వైపు తిరిగి ) మీరు కూడా తినారా …?

( అంటూండగా తెర పడును )

( సమాప్తం )