సిలబస్: 1. రేఖాయాత్ర

ఇది ఇప్పుడు ఇక్కడ నేను చెబుతున్నది కాదు, నాది కాదు. ఎప్పుడో జన్మ జన్మలకు ముందు నా వేయి జన్మలకు ముందు విన్న మాట, ‘లఘు లిఖితేయం దృశ్యతే పూర్ణమూర్తి’. సరే, దాని కన్నా ఇంకా ముందుగా ‘రేఖం ప్రశంశంత్యాచార్య’ అని కూడా వున్నది. అనగా జగత్తుని కానీ దృశ్యాన్ని కానీ కుక్కను కానీ చెక్కను కానీ అగ్గిపుల్లను కానీ కస్తూరి తిలకమును కానీ కౌస్తుభమును కానీ నల్లని నల్లనయ్యను కానీ… ఏ ఎవరినైనా కానీ చిత్ర రూపంలో, అదీనూ రేఖాచిత్ర రూపంలో కమనీయంగా గీయబడినపుడు మాత్రమే అది ఉన్నత కృతి అంటారు. అప్పుడు మాత్రమే మాస్టర్స్ అనబడువారు లేదా ఆచార్యులు దాన్ని మహాకళ అనీ క్లాసిక్ అనిన్నీ దణ్ణం పెట్టుకుంటారు. అందులోనూ ఇంకా ఇంకా ముందుకు పోయి చూపేదే ‘అత్యల్ప రేఖ (లఘు) లిఖితేయం దృశ్యతే పూర్ణమూర్తి’ అని చిత్రసూత్ర సూత్రం.

లైన్ డ్రాయింగ్ ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? రేఖ ఎంత అద్భుతమైన భాషో తెలుసా? ఒక వస్తువును అది అర్థంచేసుకున్నంతగా మరే కళ ఈ ప్రపంచాన్ని చూడలేదు.

ఏదయినా ఒక వస్తువును ఫొటో తీయండి. దాన్ని పట్టి పట్టి చూడండి. మీకు కనపడే ఆ వస్తువు లేదా ఏ వస్తువులో కానీ గీత ఎక్కడా లేదు. అదంతా వెలుగు నీడల మాయ, సైన్స్ చెప్పే ఇంద్రజాలం! వాస్తవాన్ని చప్పున గాలికూదేసి రేఖ చేసే మహా మాయే లైన్ డ్రాయింగ్. రేఖ అనేదేదీ లేని ఈ వస్తు ప్రపంచంలో ఈ రక్తమాంసాల మనిషి లోకంలో బొమ్మ కొన్ని గీతలతో అది మనం ఉందనుకున్న మరో కొత్త లోకాన్ని సృష్టించింది.

మళ్ళీ మళ్ళీ పట్టి చూడండి. ఈ లోకాన ఎక్కడా రేఖా ప్రపంచం లేదు. ఒక చెట్టు ఎగుడుదిగుడు బెరుడు నుండి వంకరటింకర కొమ్మల వంటి పై నుంచి అంతా వర్ణికాభంగమే, వంపుసొంపులే. దాని ఆకులు లైన్ కావు; పూచే పూలు, కాచే కాయ, మీరు కూచున్న కుర్చీ, బల్ల, గోడ మీది బల్లి, మనిషి చెయ్యి, మేకున సంచి, కిటికీ పరదా, కాలి మువ్వ, కంటి నీరు, గంధపు ధూళి… ఏదీ లైన్ కాదు.

కొంతకాలంగా రేఖామార్గంలో నడుస్తున్నా కదా, ఉన్నట్టుండి నా కోసం నా మార్గం నన్ను ఆపి తనకోసం ఏమైనా రాయమన్నది. నా కోసమని కూడా రాసుకోమన్నది. దాన్ని ‘సిలబస్’ అని పిలుచుకోవచ్చనింది. ప్రతీసారి కొత్తగా బొమ్మల పాఠాలు దిద్దుకుంటున్న నాకు నేను చెప్పుకునే సిలబస్ ఇది. ఆసక్తి వుంటే చదువుకోవచ్చు. ‘అవునా!’ అని నాలుక బయటపెట్టి వెక్కిరించవచ్చు, ‘అవును కదా!’ అని ఆశ్చర్యమునూ పోవచ్చు. అదేమీ కాదని ఈ మిడి మిడి వెలుతురుని హుప్పని ఊదేసి చప్పున మరో గోడమీదికి దూకొచ్చు కూడా.

చిటారు కాంతి:

ఒక చాలా చాలా చంటి పిల్లవాడికి బొమ్మలంటే ఇష్టం వున్నవాడికి, బొమ్మ అంటే పెద్దగా ఏమీ తెలీనివాడికి, కాగితం పెన్సిల్ ఇచ్చి లేదా బొగ్గు ముక్క, ఎదురుగా గోడ ఇచ్చి, ఒక కొవ్వొత్తిని కాలపెట్టి వాడి ముందు దాన్ని పెట్టి కొవ్వొత్తి బొమ్మ గీయమంటే ఆ చిట్టి వేళ్ళు రెండు వంకర టింకర సమాంతర రేఖలు ఎదురెదురు గీసి దానిపై ఒక చిన్న రేఖావత్తి గీసి ఆ పై ఏం చేస్తాడో తెలుసా? తెలుపూ నీలం పసుపూ ఎరుపులకెక్కిన కాంతిని నాలుగు లేదా ఎనిమిది కాదా పదహారుగా చిన్న చిన్న రేఖలు ఆ కొవ్వొత్తి చుట్టూ గీస్తాడు. అన్ని రంగులని వాడు కేవలం ఆ వర్తులాకారపు చిన్ని ముక్కల రేఖలలో డిసైడ్ చేస్తాడు! ఎవరు చెప్పారు వాడికి కాంతిని అలా రేఖామాత్రంగా చూపవచ్చని? చిత్రంగా లేదూ అబ్బురం అనిపించలే! నిజంగా అది వాడు చేశాడా? లేదే! వాడికేం తెలుసు? దేవుడే డిసైడ్ చేశాడు. అలా రేఖ మళ్ళీ కొత్తగా ఒకడి ప్రపంచంలోకి దిగి వచ్చింది.

(సశేషం)

అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...