పది రోజులు

ఇస్లామాబాద్ ఎనిమిది భాగాలుగా నిర్మించబడ్డ నగరం. అక్కడ ఎఫ్ ప్రాంతంలో అద్దె ఇళ్ళు దొరకడం అన్నది బ్రహ్మప్రళయం అనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులూ మిలిటరీ అధికారులూ రాజకీయ పలుకుపడి ఉన్నవారూ మాత్రమే అక్కడ ఇళ్ళు కట్టుకుని నివసిస్తుంటారు. కాబట్టి అద్దె వాటాలన్నవి తక్కువ. ఉన్న కొన్నిటికీ అవి ఖాళీ కాకముందునుండే టెనంట్‌లు ఎదురు చూస్తుంటారు. ఏ గొప్ప ప్రభుత్వ అధికారికో ముందరే చెప్పివుంచి ఓ ఐదారు నెలలు కాచుకునుంటే ఇల్లు దొరకచ్చు. అలాంటి ఒక ప్రయత్నంతోనే నేను అక్కడొక ఇల్లు వెతుక్కుని అద్దెకు దిగాను.

ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఎండగా వున్నప్పుడు డాబా మీదకెక్కి చూస్తే మర్గెల్లా కొండలు కనబడుతాయి. వీధులు, రోడ్లు ఒకదానికొకటి సమకోణంలో ఉంటాయి. ఎత్తయిన మేడ మీదనుండి చూస్తే ఊరంతా చతురస్రాల్లా కనబడుతుంటుంది. మా వీధి మొత్తం నేరేడు చెట్లు వుండటంవల్ల ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. మార్కెట్టూ షాపులూ లేకపోవడంతో వాహనాల రద్దీ, కాలుష్యం, దుమ్ము ఉండవు. వీధులు శుభ్రంగా ఉంటాయి. అలా ఉండటం ఒకరకంగా మంచిదే అయినప్పటికీ ఏ వస్తువు కావాలన్నా దూరానున్న బజారుకెళ్ళాల్సివుంటుంది. ఒక మంచి ఇల్లు దొరికేప్పుడు ఒకటి ఉంటే మరొకటుండదన్నది తెలిసిందే కదా!

సాయంకాలం సరిగ్గా ఆరవ్వగానే ఒక్కొక్క ఇంటికీ ఒక్కో చౌకీదార్ వచ్చేవాళ్ళు. వారి చేతుల్లో ఒక రూళ్ళ కర్ర, రగ్గు, రాత్రి భోజన సంచీ, టార్చిలైటు ఉండేవి. ఒకరికొకరు అభివాదం తెలుపుకుని, కుశలప్రశ్నలు పూర్తయ్యాక గుంపుగా నమాజ్ చేసేవాళ్ళు. తర్వాత, గుంపులు గుంపులుగా కూర్చుని తెచ్చుకున్న భోజనం సంచులు ముందుపెట్టుకుని తినేవాళ్ళు. నిలబెట్టివుంచిన నులక మంచాలు వాల్చుకుని దమ్ము కొట్టేవాళ్ళు. ఇంటి యజమానులు నిద్రపోయిన ఐదో నిముషం నిద్రపోయేవాళ్ళు. మరుసటి రోజు తెల్లవారుఝామున ఇంటి యజమాని లేవడానికి ఐదు నిముషాలు ముందే నిద్రలేచి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయేవారు.

మా వీధిలో ఒక బడ్డీ కొట్టు ఉండేది. నాకు ఆ వీధిలో దొరికిన మొదటి స్నేహితుడు ఆ కొట్టతనే. పేరు నవాజ్. ఉదయం ఆరు గంటలకి కొట్టు తెరిస్తే రాత్రి ఎనిమిదికి కట్టేసేవాడు. వారంలో ఏడు రోజులూ వ్యాపారం జోరుగా సాగేది. ఉదయంనుంచీ వాడి దగ్గరకు పేపరు, పాలు, పాన్, సిగరెట్, బ్లేడ్- ఇలా ఏదోటి కొనేందుకు ఆ వీధివాసులు వస్తూనే ఉంటారు. నవ్వు ముఖంతో హుషారుగా వస్తువులందిస్తూ డబ్బు తీసుకుంటూ ఉంటాడు నవాజ్.

1960లో అయూబ్ ఖాన్ ఇస్లామాబాద్‌ నగరాన్ని నిర్మించి పాకిస్తాన్ రాజధానిగా చేశాడు. అన్ని రకాలుగానూ ప్లాన్ చేసి అన్ని సౌకర్యాలతోనూ నిర్మించబడిన నగరం కాబట్టి పచ్చని చెట్లతోనూ, చుట్టూ కొండలతోనూ కళకళలాడుతుంటుంది. నగరం నిర్మించిన తొలి రోజుల్లో నవాజ్ తండ్రి ఆ బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు. అతనికి జబ్బు చేయడంతో నవాజ్ ఈ కొట్టు బాధ్యతని తన భుజాలకెత్తుకుని నడుపుతున్నానని నాతో చెప్పాడొక రోజు.

ఎన్నేళ్ళయిందని అడిగాను. “నా పద్దెనిమిదో ఏటనుండి ఉన్నానిక్కడ. ఇప్పుడు నాకు ముప్పై ఎనిమిది. ఇరవైయేళ్ళు! సంవత్సరంలో 365 రోజులూ పనిచేస్తున్నాను. ఇక్కడ నివసించే అందరూ, వాళ్ళ పిల్లలూ, మనవళ్ళూ అందరూ తెలుసు నాకు!” అన్నాడు.

నవాజ్ స్వగ్రామం లైలాపూర్. అది ఇస్లామాబాదునుండి 160 మైళ్ళ దూరానుంది. ముసలివాళ్ళయిన తల్లి తండ్రులను చూడటానికి వెళ్ళేవాడు కాడు నవాజ్. వాళ్ళే వచ్చి చూసి వెళ్ళేవారు. సంవత్సరమంతా విరామం లేకుండా పని చేసేవాడు ఎలా వెళ్ళగలడు? అని నన్నే అడిగేవాడు.

“నవాజ్, నువ్వెందుకు పెళ్ళి చేసుకోలేదు?” ఒక రోజు అడిగాను.

“పేదవాళ్ళు ఉన్నఫళంగా పెళ్ళి చేసుకోలేరు. అమ్మాయికి కన్యాశుల్కం ఇవ్వడానికి డబ్బులు కూడబెట్టాలి.” అన్నాడు.

అలా చెప్తున్నప్పుడు వాడి కళ్ళు కొట్టు పలకలకు అంటించివున్న ఎందరో హిందీ సినిమా నటీమణుల పోస్టర్ల మీద ఒక క్షణం వాలి తిరిగొచ్చాయి. డింపుల్ కపాడియా, నీతూ సింగ్, పర్వీన్ బాబి, పూజా భట్, శ్రీదేవి, నీలమ్ అని అప్పట్లో పాకిస్తాన్‌లో కూడా ప్రసిద్ధులైన నటీమణులందరూ అక్కడ వరుసాగ్గా వాడికోసం వేచివున్నారు.

“నిన్ను మీ అమ్మానాన్నలు బడికి పంపించలేదా?” అడిగాను.

“ఏదో పంపించారు. ఉర్దూ కొంచం రాయడానికీ చదవడానికీ వచ్చు. లెక్కల్లో కూడిక, తీసివేత మాత్రమొచ్చు. గుణించడం రాదు. మా తల్లితండ్రులకి ఆర్థిక స్థోమత లేదు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, మా ఇంట్లో కోడి మాంసం తినాలంటే నాకైనా జబ్బు చెయ్యాలి, లేదా కోడికైనా జబ్బు రావాలి…”

నేరేడు పళ్ళ అదనులో ఆ వీధంతా నేరేడు పళ్ళు నేల రాలేవి. అయితే వాటిని ఏరుకోడానికి పిల్లలు ఉండరక్కడ. అక్కడ నివసించే పిల్లలందరూ నాగరికులు. వీధిలో పడిన వాటిని ఏరుకునే స్వతంత్రంలేదు వాళ్ళకు. కొట్టు బయట నిల్చుని సరుకులమ్మే నవాజ్ నెత్తిన రోజుకు వంద పళ్ళయినా రాలేవి. దాంతో వాడి తెల్లటి సల్వార్ కమీజ్ ఊదా రంగులోకి మారిపోయేవి. అలాంటప్పుడు ఎండకి ఎర్రగా మెరిసే దేహంతో, వెనక్కి దువ్విన పొడవాటి జుట్టుతో పంజాబి నటుడిలా అందంగానే కనిపించేవాడు.

అలాంటొక నేరేడు పళ్ళ సీజన్‌లో నేను ఆఫీసునుండి వెనక్కి వచ్చేసరికి నా ఇల్లు కనిపించలేదు. వీధి పేరు చూస్తే, నేనుంటున్న వీధే! అయితే వీధినంతా ఆక్రమించి పందిరి వేసేశారు. నేను కారునలా నిలబెట్టి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే, నా ఇంటి ఓనర్, పదవీవిరమణ చేసిన మిలిటరీ మేజర్, నగిషీ పని చేసివున్న ఖరీదైన చెప్పులు వేసుకుని, చేతికర్ర తిప్పుకుంటూ నా దగ్గరకొచ్చాడు. నాకు వణుకు మొదలైంది.

వచ్చిన కొత్తల్లో కొన్నిసార్లు మేజర్‌తో మాట్లాడాను. మనం ఏది చెప్పినా దానికి విరుద్ధంగా ఒక అభిప్రాయం చెప్పేవాడతను. అలా ఒక ఎన్నటికీ కొలిక్కిరాని వివాదమొకటి మొదలయేది. సంభాషణల్లో పొరపాటున కూడా బంగ్లాదేశ్-పాకిస్తాన్ యుద్ధం గురించిన ప్రస్తావన తీసుకురాకూడదు. తెస్తే, మనిషిలో భావావేశం కట్టలు తెంచుకుని పొంగిపొరలుతుంది. మనిషి నేలమీదనుండి ఒక అడుగు పైనే తేలిపోగలడు. మనం అతని అభిప్రాయాలన్నిటితో ఏకీభవించాక కూడా ఓ అర్ధగంట చర్చని కొనసాగించగలడు.

అతను మిలిటరీలో పని చేసినవాడన్న సంగతి చూడగానే ఎవరికైనా తెలిసిపోతుంది. దృఢమైన దేహం, తగిన ఎత్తు. ముఖం మాత్రం అప్పుడే ఎవరినో కొరికేసి వచ్చినవాడిలా ఉంటుంది. అయితే ఆ పూట మాత్రం దరహాసాన్ని తెచ్చిపెట్టుకుంటూ ‘తన కొడుకు పెళ్ళి ఏర్పాట్లకని పందిళ్ళవీ వేశామనీ, శ్రమ కలిగించుతున్నందుకు క్షమించమనీ; కారు వీధి చివర్లో పెట్టి ఇంటికి నడిచి రమ్మనీ’ ప్రాధేయపడ్డాడు. నా ఒక్కడి కారే కాదు ఆ వీధిలో అందరి కార్లూ వీధి చివరే ఉన్నాయి. కార్లను చూసుకోడానికని ప్రత్యేకించి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసుంచాడు.

మరుసటి రోజు పొద్దున నాకు మరో ఆశ్చర్యం ఎదురయింది. బడ్డీ కొట్టు కనిపించలేదు. అదున్న చోటు ఖాళీగా ఉంది. నవాజ్ ఎక్కడ అంటే జవాబివ్వడానికి నసుగుతున్నారు. ఆ వీధి వాసులకు ఆ రోజు పేపర్, పాలు, పాన్, సిగరెట్- ఏవీ దొరకలేదు. దూరానున్న బజారుకెళ్ళాల్సొచ్చింది. పందిరి వెయ్యడానికి అడ్డంగా ఉందంటూ బడ్డీని తీసేయమని చెప్పారట. నవాజ్ రెండు రోజులు వ్యవధి అడిగాడట. వాళ్ళు ఇవ్వకపోగా, బడ్డీ కొట్టుని పగలగొట్టి అతణ్ణి తరిమేశారట. పాకిస్తాన్లో మామూలుగా మాట్లాడేప్పుడు ఉర్దూలో మాట్లాడుకుంటారు. ఎవరినైనా తిట్టాలనుకుంటే మాత్రం పంజాబీ అందుకుంటారు. ఎందుకంటే పంజాబీ తిట్టడానికే సృష్టించబడిన భాష అన్నది వాళ్ళ అభిప్రాయం. ఆ రోజు మేజర్ పంజాబీలో తిట్టాడు అన్న విషయం ముఖ్య అంశంగా మాట్లాడుకున్నారు జనం.

పెళ్ళి ఇంటి ఏర్పాట్లు బహు ఘనంగా, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రకరకాల షామియానాలూ, జరీ తెర అలంకారాలూ, రంగురంగుల లైట్లూ కళ్ళకు కొడుతున్నాయి. లాహోర్ నుండి తెప్పించిన ఎరుపు, తెలుపు, పచ్చ రంగు గులాబీలు కుప్పలుకుప్పలుగా పోసివున్నాయి. ఈ వేడుకలన్నీ నాలుగు రోజులు జరిగుతాయని ప్రకటించారు. నా పోర్షన్ మీటర్ బాక్స్ నుండి కరెంటు తీసుకుని స్తంబాలకూ చెట్లకూ లౌడ్ స్పీకర్‌లు కట్టి సినిమా పాటలు మ్రోగించారు. పాటల మోతకి ఇళ్ళలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా వినిపించేది కాదు. ఆ మోత ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా సాగింది. అప్పుడే విడుదలయిన మాధురీదీక్షిత్, సంజయ్‌దత్ నటించిన ఖల్‌నాయక్ సినిమా ఇస్లామాబాద్‌లోని థియేటర్లలో విజయవంతంగా ఆడుతూ ఉంది. అందులోని చోళీకే పీచే క్యా హై అన్న ప్రసిద్ధమైన పాటని కనీసం రెండు వందల సార్లయినా మోగించారు. ఎవరైనా వచ్చి చోళీ విప్పి చూపితేగానీ ఆపరేమో అనిపించింది. నా మీటర్ బాక్స్‌నుండి అరువుకు తీసుకున్న కరెంట్‌‌తోనే ఈ పాటలు మోగిస్తున్నారు. దీన్ని ఎప్పుడైనా ఆపించే శక్తి నాకుంది అనుకోగానే నాకు నవ్వొచ్చింది.

ఇన్ని ఇబ్బందుల మధ్యన కూడా ఒక ఊరట ఏంటంటే, సాయంత్రమయ్యేసరికి పెద్దపెద్ద ఇత్తడి పళ్ళాల్లో రకరకాల ఆహార పదార్థాలు వడ్డించి, వాటిమీద అందమైన వెండిరేకు కప్పి ఆ వీధిలో ఉన్న అందరి ఇళ్ళకీ సరపరా చేయబడ్డాయి. పెళ్ళికని వీధిని ఆక్రమించుకున్న ఆ నాలుగు రోజులూ రుచికరమైన ఆహార పదార్థాలు ఎన్నో రకాలు, మేజర్ గారి ఇంటినుండి అందరి ఇళ్ళకీ వచ్చాయి. వీధివాసులెవరూ వారివారి ఇళ్ళల్లో వంటలు చెయ్యలేదు. చౌకీధార్లు వారి భోజనాల సంచులు తెచ్చుకోలేదు. నందికోట్ నుండి రప్పించబడిన వంటవాళ్ళు వండిన ఆహార పదార్థాల రుచి జీవితాంతం మరిచిపోలేమన్న విషయంలో ఆ వీధిలో ఎవరికీ భిన్నాభిప్రాయంలేదు.

పెళ్ళికూతురిని ఇంటికి తీసుకొచ్చిన మరుసటి రోజు రాత్రి, ప్రసిద్ధ ఘజల్ గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ తన పరివారంతో వచ్చాడు. తను పాడటానికి రాలేదు. మేజర్‌కి బాగా దగ్గరివాడు అని చెప్పుకున్నారు. అయితే ఈ వార్త నిప్పులా నలుమూలలా పాకింది. చుట్టుపక్కల జనాలంతా మా వీధికొచ్చేశారు. మేజర్, అతణ్ణి ఒకే ఒక్క పాట పాడమని వేడుకున్నాడు. నుస్రత్ ఇలాంటి పెళ్ళి వేడుకల్లోనో మరోచోటో పాడడు అన్నది అందరికీ తెలుసు. అయితే తన స్నేహితుడి కోరిక మేరకు తన నియమాన్ని పక్కనబెట్టి ఒకే ఒక ఘజల్ పాడాడు. అతని కంఠంనుండి వెలువడిన పాట అక్కడి జనాలని మంత్రం వేసినట్టు కట్టిపడేసింది. పాట పూర్తవ్వగానే జనాలు కొట్టిన చప్పట్లు ఆగడానికి చాలా సమయం పట్టింది. వీధిలోనే కాదు వీధికవతలవరకు నిల్చుని విన్నారు ఆ పాటని. ‘మరొక పాట!’ అని అరిచారు. నాకు మాత్రం తిల్లానా మోహనాంబాళ్ సినిమాలో సింగపూర్ జమీందార్ బంగ్లా ముందు శివాజీగణేశన్ నాదస్వరం వాయించిన దృశ్యం గుర్తొచ్చింది.

ఐదారు రోజుల తర్వాత ఆ పందిరి విప్పినప్పుడు ఉన్నట్టుండి ఇది మనవీధి కాదేమో అన్నట్టు బోసిపోయింది. నాలుగు రోజుల వేడుకలనంతరం మేమెవరం మామూలు స్థితికి రాలేకపోయాం. నా ఇంటి మీటర్ బాక్స్ నుండి కరెంట్ తీసుకుని మోగించిన మోత ఆగిపోయింది. ఆ మోతకి అలవాటుపడిన చెవులకి ఈ నిశబ్దం అలవరుచుకోడానికి సమయం పట్టింది. ఇత్తడి పళ్ళాల్లో వచ్చే రుచికరమైన భోజనాలు ఆగిపోయాయి. తెల్లవారంగానే ఒక్కొక్క ఇంటివారూ బడ్డీ కొట్టు నవాజ్ వచ్చేశాడా అని వచ్చి చూసేవారు. పది రోజులుగా వాడు లేడు. సరిగ్గా పదకొండవ రోజు ఉదయం కొత్తగా ఒక బడ్డీ కొట్టు వెలిసింది. నవాజ్ ఏమీ జరగనట్టే ఊదా రంగులోకి మారిపోయిన తన తెల్ల సల్వార్ కమీజ్ వేసుకుని, దువ్విన తన పొడవు జుట్టుతో, పందుంపుల్లని నోట్లో పెట్టుకుని పళ్ళు తోముతూ కనిపించాడు. ఆ రోజు వాడి దగ్గరకి వెళ్ళిన మొదటి కస్టమర్ నేనే. పేపరూ పాలూ కొన్నాను. వాడు ఇన్ని రోజులూ ఎక్కడికెళ్ళాడూ ఎందుకెళ్ళాడూ అన్నదానిగురించి నోరే తెరవలేదు. అయితే వాడడిగిన మొదటి ప్రశ్న, “సార్, ఫతే అలీ ఖాన్ ఘజల్ పాడాడట కదా, నిజంగానా?!”

“అద్భుతమైన సంగీతం. అర్ధగంట ఆపకుండా పాడాడు‌!” అన్నాను. వాడి కళ్ళల్లో వర్ణించలేనంత నిరాశ. “అవునా? అతను మా ఊరి వాడే. అతను తాగిన నీళ్ళనే నేనూ తాగాను. అతను పీల్చిన గాలే నేనూ పీల్చాను. అతను నడచిన మట్టిలోనే నేనూ నడిచాను. అయితే అతని పాటను ఒక్కసారికూడా ప్రత్యక్షంగా కచేరీలో వినలేదు…” అని అంటుండగానే అతని గొంతుని దుఃఖం కమ్మేసింది; ముఖాన్ని నిరాశ అలముకుంది.

నవాజ్ నా ముఖం చూసి మాట్లాడలేదు. అడిగిన ప్రశ్నను కూడా చేతిలో ఉన్న పందుంపుల్లని చూస్తూనే అడిగాడు. కొత్తగా పెళ్ళయిన మేజర్ కొడుకుని తన భుజాల మీద ఎత్తుకున్నట్టు నవాజ్ అదివరకే ఒకసారి చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి మేజర్ కొడుకు నిద్ర కళ్ళతో ఊగుతూ వచ్చాడు. నవాజ్ హుషారుగా సర్దుకున్నాడు. వచ్చిన యువకుడు ‘సిగరెట్’ అన్న ఒక్క మాట మాత్రమే పలికాడు. ఒంటె బొమ్మ ఉన్న సిగరెట్ పెట్టె తీసి ఒంటెలా ఒళ్ళు వంచుకుని నవాజ్ చేయి చాచి పెట్టె అందించాడు. యువకుడు సిగరెట్ ప్యాకెట్ మీదున్న మైకా పేపర్‌ని ఒక్కసారికే చించిపడేసి ఒక సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. లైటర్‌తో నవాజ్ దాన్ని వెలిగించాడు. యువకుడు ఏదో గొణిగాడు. నాకప్పుడు అమెరికాని నిర్మించిన వాళ్ళలో ఒకడైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నమాట గుర్తొచ్చింది: ‘ఆత్మాభిమానం వదులుకోవడంవల్ల పేదలెప్పుడూ నడుం వంచుకున్నట్టే కనబడతారు. ఖాళీ గోనెసంచి నిటారుగా నిల్చోగలదా?’

పాలూ, పేపరూ పట్టుకుని నేరేడు పళ్ళమీద నడుచుకుంటూ ఇంటివైపుకు వెళ్ళాను. ఆ రాత్రి పడుకునే ముందు టీవీలో డిస్కవరీ చానెల్ చూస్తూ ఉన్నాను. చలికాలం మొదలయ్యే ముందు కారిబూ జింకలు ఉత్తర ధృవం నుండి దక్షిణంగా వలసబోవడాన్ని చూపించారు. నేల కనిపించనంతగా అవి గుంపులు గుంపులుగా నడుస్తున్నాయి. దూరంగా రాతిబండ మీద ఒక తోడేలు ఏం తోచనట్టూ కూర్చుని ఉంది. వెంటనే ఆ ముప్పై లక్షల జింకలూ కట్టలు తెంపుకున్న నీళ్ళలా వేరే దిక్కుకు పరుగులుతీశాయి. విలేకరి, ‘ఎందుకివి ఇలా భయపడి పరిగెడుతున్నాయి?’ అని అడిగాడు. దానికి సైంటిస్టు, ‘వాటి జీన్స్‌లో ‘భయపడు’ అన్న విషయం రాయబడి ఉంది‌’ అని అన్నాడు. మనుషుల్లోనూ కొందరిలో ఇలాంటి ఆజ్ఞలు వాళ్ళ జీన్స్‌లో రాయబడి ఉన్నాయేమో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.

ఏడాదిలో 365 రోజులూ పనిచేసే నవాజ్, ఆ సంవత్సరం 355 రోజులు మాత్రమే పనిచేశాడు. నేరేడు పళ్ళ సీజన్ వెళ్ళిపోయి చలికాలం మొదలయినపుడు, నవాజ్ కొట్టుకు వచ్చే జనం స్వెట్టర్లేసుకుని వచ్చేవారు. సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేవారు. అప్పుడప్పుడూ ఆ కొత్త దంపతులూ కనిపించేవారు. పెళ్ళిరోజు ఆ అమ్మాయిని నేను సరిగ్గా చూడలేదు. ఆమె ఆకర్షణీయంగా అందంగా ఉంది. కరాచీ నుండి తెచ్చుకున్న నాజూకైన కోడలు మరి! ఛాతీ విరుచుకొని ఆమె ముందు నడుస్తోంటే, అతను ఆమె వెనక నడిచాడు.

చాలా రోజుల తర్వాత ఒక రోజు పొద్దున ఆశ్చర్యకరంగా మేజర్ వీధిలో కనిపించాడు. వదులైన కమీజ్‌ని పంటితో పట్టుకుని సల్వార్ బొందుని బిగించుకుంటూ నవాజ్ కొట్టువైపుకి నడుస్తున్నాడు. ప్రసవించిన స్త్రీ పొట్టమీది చారల్లా ఒక నల్లటి చార ఇతని తెల్లటి దేహం మీద కనబడింది. అతని దేహానికి వయసయినప్పటికీ పొట్ట మాత్రం ముప్పై ఏళ్ళు దాటలేదేమో అనిపించేలా వుంది. బంగ్లాదేశ్ యుద్ధంలో అతను గొప్ప సాహసాలు చేశాడని విని ఉన్నాను. అయితే, అతను సాధించిన గొప్ప ప్రతాపం ఏమీ లేదు; యుద్ధంలో చెరపట్టబడిన 91000 మంది పాకిస్తానీల జాబితాలో ఇతని పేరు లేకపోవడమే ఆ గొప్ప!

పదడుగుల దూరంలో మేజర్‌ని చూసిన నవాజ్ ఎముకల్లేని జంతువులా మారిపోయాడు. పాకుతున్నట్టు అతని వైపుకి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. బట్టలు కుట్టేవాడు సూది నోట్లో పెట్టుకుని మాట్లాడినట్టు మేజర్ ఏదో చెప్పగా, నవాజ్ పొట్టని చేత్తో బట్టుకుని ఇంకాస్త వంగి గట్టిగా నవ్వాడు. 1582వ సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రపంచ క్యాలెండర్‌నుండి పది రోజులను పోప్ గ్రిగోరి చించేసినట్టుగా, ఇక్కడ కూడా ఎవరో ఆ ఏడాదిలోని పది రోజుల్ని నవాజ్ క్యాలెండర్‌ నుండి చించిపడేశారనిపించింది.

[మూలం: అమెరిక్కక్కారి (2009) కథా సంపుటంలోని ‘పత్తు నాట్కళ్’ కథ.]


రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్ గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్ గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలు, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.