బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు

[2008 ఆగస్టులో రావి కొండలరావు గారు తన బృందంతో ఆయన రాసిన ‘వైకుంఠపాళీ’ అనే నాటికను ప్రదర్శించడానికి ముంబైకి వచ్చినప్పుడు నేను ఆయనను చాలా ఏళ్ళ తరవాత కలుసుకోగలిగాను. ఈ వ్యాసం అప్పుడు ఆయనతో జరిపిన సంభాషణలు, హైదరాబాదులో బాబ్జీలు గారు ఆయనతో జరిపిన సంభాషణల సారాంశం. బాబ్జీలు గారికి నా ధన్యవాదాలు. – రచయిత]

రావి కొండలరావు నటుడు, దర్శకుడు, రచయిత. నాటకం, సినీమా, టీవీ, పత్రికలు, ఇలా అన్ని రంగాలలోనూ విశేష అనుభవం ఉన్నవాడు. మిమిక్రీ కళాకారుడు. ప్రతి రంగంలోనూ నైపుణ్యం, పేరు ప్రఖ్యాతులూ గడించిన వాడు. ఎటువంటి భేషజాలూ లేకుండా 75 ఏళ్ళు దాటిన వయసులో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో క్రియాశీలంగా ఉంటూ జీవిస్తున్న వ్యక్తి. నిరాడంబరంగా, కలుపుగోలుగా ప్రవర్తించే సజ్జనుడు. ఆయన రచనలూ, నటనా అన్నీ చదువుకోవడానికీ, తిలకించ డానికీ హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. మనసును కలవరపెట్టే రచనా, ఒళ్ళు గగుర్పొడిపించే నటనా ఆయన ధోరణికి సరిపడవు. ఆయన రాసిన నాటికలూ, నాలుగైదు వందల సినిమాలకు రాసిన సంభాషణలు (స్క్రీన్‌ప్లే) ఆయన సుదీర్ఘ కృషిని సూచిస్తాయి. 1958లో ‘శోభ’ చిత్రంతో మొదలైన ఆయన సినీ నటనకు ఈమధ్యనే 50 ఏళ్ళు నిండిన సందర్భంగా ముంబయి, విజయవాడ తదితర నగరాల్లో ఆయనకు ఘనసన్మానాలు జరిగాయి.


రావి కొండలరావు

కొండలరావుగారు పుట్టినది సామర్లకోటలో. వారి తండ్రిది పోస్టుమాస్టరు ఉద్యోగం కనక తరుచుగా బదిలీలు అవుతూ ఉండేవి. ఆ కారణంగా ఆయన పాఠశాల చదువు కాకినాడలో మొదలై, అనేక ఊళ్ళలో కొనసాగింది. ఆయనకు అన్నయ్యలైన ఆర్.కె.రావు, రావి చలం (ఈయన జంషెడ్‌పూర్ నాటకరంగంలో ప్రసిద్ధుడు) ల ప్రభావం ఆయన మీద ఉండేది. కొండలరావు పదేళ్ళ లోపు వయసులో స్కూలు నాటకాల్లో వేసినపుడు ఆయన తండ్రి ఏమీ అనలేదుగాని బైటి సమాజాల్లో ఆడినప్పుడు మాత్రం సహించేవారు కారట. ఆయన చిన్నప్పుడు ఒకసారి తండ్రికి తెలియకుండా ఒక అన్నయ్య ఒక నాటికలో కొండలరావు చేత ఆడపాత్ర వేయించారట. ఆ ప్రదర్శనకు తండ్రి హాజరవుతాడని వాళ్ళకి తెలియదు. కొడుకును గుర్తుపట్టని తండ్రి స్టేజికేసి చూస్తూ పక్కనున్న వ్యక్తితో “వీడెవడో బాగానే చేస్తున్నాడే?” అన్నాడట. అప్పుడా పక్కనున్నాయన “అదేమిటండీ వాడు మీవాడేగా?” అన్నాట్ట. అంతే! పెద్దాయన ఉగ్రుడైపోయి స్టేజి మీదికి వెళ్ళి కొడుకు విగ్గు పట్టుకుని పీకేసి, కొట్టి, వీధులవెంట తరిమాడట. ప్రేక్షకులు ఇదేదో ‘కొత్త పాత్ర ప్రవేశం’ అని కూడా అనుకున్నారట. అప్పటికి ఆయన వయసు పదేళ్ళే.

తండ్రిగారి చివరి పోస్టింగు శ్రీకాకుళం కావడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. అన్నయ్య ఏకపాత్రాభినయంలో చిన్న చిన్న సహాయపాత్రలు వెయ్యడం, కన్యాశుల్కంలో వెంకటేశంగా నటించడం, చిన్నచిన్న కథలు రాయడం వగైరాలన్నీ కొండలరావు పిన్నవయసు ముచ్చట్లు. తండ్రిగారు చనిపోయాక నాటకాల్లో వెయ్యడానికి అడ్డు తొలగినట్టయింది.

స్కూల్లో ఉన్నప్పుడే కొండలరావుకు ఆరెస్సెస్ (R.S.S.) అభిమానం ఉండేది. గాంధీజీ హత్యానంతరం హిందూమహాసభ తదితర సంఘాల మీద విధించిన ఆంక్షలకు నిరసన తెలుపుతున్న ఇతర కుర్రాళ్ళతో బాటుగా అతన్నికూడా పోలీసులు అదుపులోకి తీసుకుని మూణ్ణెల్లు రాజమండ్రి జైలులో ఉంచారు. అదొక అద్భుతమైన పరిణామానికి అనుకోకుండా దారితీసిందని కొండలరావు అంటారు. చదువుకోవలసి రావడం వగైరాలేవీ లేకపోవడంతో టీనేజిలో ఉన్న కొండలరావుకు జైలు లైబ్రరీలో తెలుగు సాహిత్యం చదివేందుకు మంచి అవకాశం దొరికింది. ఆధునిక కథకుల్లో ప్రసిద్ధులందరి రచనలూ అతనక్కడ చదివి, అర్థం చేసుకుని ఆనందించాడు. ఆ విధంగా అతనికి స్వయంగా రచనలు చేసేందుకు తగిన స్ఫూర్తి లభించింది. కొడవటిగంటి కుటుంబరావు తదితరుల కథలు ఆదర్శంగా భావించి చేసిన ప్రయత్నాల ఫలితంగా చక్రపాణి నడిపిన యువ పత్రికలో 1949లో అతని కథ ఒకటి అచ్చయింది. దానితో ఉత్సాహం పెరిగింది.

ఆ ఊపుతో అతని చిన్న కథలూ, నాటికలూ అచ్చులో రాసాగాయి. కాలేజి లెక్చరర్ల ప్రోత్సాహంతో వారి అవసరార్థం అతను రాసిన ‘స్వయంవరం’ అనే స్త్రీ పాత్ర లేని నాటికను అందరూ మెచ్చుకున్నారు. వారిలో దాడి గోవిందరాజులు నాయుడు వంటి పెద్దలుకూడా ఉన్నారు. ఆయన జిల్లా జడ్జి, నటుడు కూడా. ఆ తరవాత కొండలరావు ‘కుక్కపిల్ల దొరికింది’ నాటిక రాశారు.

ఇంతలో, మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ ఉద్యోగానికి అభ్యర్థులను విశాఖపట్నంలో ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలిసి కొండలరావు కూడా వెళ్ళారు. శ్రీశ్రీ,, ఆరుద్ర మొదలైనవారు లోగడ పనిచేసిన పత్రిక అది. సబ్ఎడిటర్ ఉద్యోగానికి కొండలరావు ఎంపికయ్యారు. 1956లో మద్రాసులో ఆరు నెలలపాటు ఆనందవాణి ఆఫీసులో కూర్చుని వచ్చిన కథలని చదివి, వాటిలో మంచివాటిని ఏరిపెట్టడమే ఆయన పని. ఆఫీసులోనే ఉద్యోగం, నివాసం కూడా. కానీ, పత్రిక ఎక్కువకాలం నడవలేదు. అంతకుముందు 1948లో మద్రాసు వెళ్ళినప్పుడు ‘బాల’ పత్రికలో బొమ్మలు వేస్తున్న బాపూతోనూ, ముళ్ళపూడి వెంకటరమణతోనూ పరిచయం ఏర్పడింది. అప్పటికి అందరూ నిక్కర్లు వేసుకునే వయసువాళ్ళే.

ఆనందవాణి ఆఫీసుకి ఆంధ్రపత్రిక ఆఫీసు దగ్గరలోనే ఉండేది. కొండలరావుకి అందులో పనిచేస్తున్న కొడవటిగంటి కుటుంబరావు, నండూరి రామమోహనరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి మొదలైనవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే పిలకా గణపతిశాస్త్రి, తిరుమల రామచంద్ర తదితరులను కలుసుకున్నారు. ఆంధ్రపత్రికలో కొండలరావు కథలు కొన్ని అచ్చువేశారు. ఇవికాక తెన్నేటి సూరి నిర్వహిస్తున్న భారతి పత్రికలో ‘స్వయంవరం’, ‘కుక్కపిల్ల దొరికింది’ నాటికలు రెండూ అచ్చవడంతో కొండలరావుకు కొత్తవారిని కలుసుకున్నప్పుడల్లా స్వపరిచయం సులువయింది. ఒక సందర్భంలో ఆరుద్రకు ఎవరో పరిచయం చేసినప్పుడు తాను ఫలానా అని చెప్పగానే ఆరుద్ర వెంటనే “‘కుక్కపిల్ల దొరికింది’ రాసినది మీరేకదా” అంటూ పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళారట.

‘కుక్కపిల్ల దొరికింది’ నాటిక అచ్చవగానే చాలా ప్రజాదరణ పొందింది. నేను మద్రాసులో స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే (1957 ప్రాంతాలలో) ఆ నాటిక మా స్కూల్లో ప్రదర్శించారు. సులువుగా చెప్పగలిగిన డైలాగులతో, సున్నితమైన హాస్యంతో అది అందరికీ నచ్చిన హాస్యనాటిక. 1961లో మద్రాసు చిల్డ్రన్స్ థియేటర్లో ఈ నాటికను కొండలరావుగారే స్వయంగా వేశారు. అందులో నౌకరు కుర్రాడుగా నటించిన చాకులాంటి అబ్బాయి అందర్నీ ఆకర్షించాడు. అతనే రాజబాబు. త్వరలోనే అతను సినిమాల్లో బిజీ కమెడియన్‌గా స్థిరపడడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

ఆంధ్రపత్రికలో కొండలరావుకు ఉద్యోగం మటుకు రాలేదు. ఎందుకంటే ఒక్క ముళ్ళపూడి వెంకటరమణగారిని తప్ప డిగ్రీ లేనివారినెవరినీ వారు తీసుకునేవారు కాదు. అందుకని కొండలరావుకు అక్కడ అవకాశం లభించలేదు. ఆయన కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. అంతకు ముందు ఒకసారి 1954లో హైదరాబాదులో కొండలరావు ప్రఖ్య శ్రీరామమూర్తి రాసిన ‘కాళరాత్రి’ నాటకంలో నటించినప్పుడు సినీరచయిత డి.వి.నరసరాజుగారు జడ్జిగా వచ్చారు. ఆంధ్రనాటకపరిషత్తు నిర్వహించిన ఆ ప్రదర్శనలో జె.వి.సోమయాజులు, రమణమూర్తి తదితరులు కూడా నటించారు. కొండలరావు ఆ పరిచయాన్ని పురస్కరించుకుని నరసరాజుగారిని మళ్ళీ 1956లో మద్రాసులో కలుసుకున్నారు. ఆయన సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది.

అంతకుముందే కొండలరావు కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాసివచ్చారు. అయితే తెలుగు సినిమాల్లో పనిచెయ్యడం అదే మొదటిసారి. స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో పని తక్కువగా ఉండడంతో దర్శకత్వం వహిస్తున్న కమలాకర కామేశ్వరరావు కొండలరావును తనకు అసిస్టెంటుగా కూడా పని చెయ్యమని పిలిచారు. ఎన్.టి.రామారావు, అంజలీదేవి, రమణారెడ్డి తదితరులు నటిస్తున్న ఒక సన్నివేశంలో ఒక డాక్టరు పాత్ర అయోమయంగా నటించాలి. మామూలుగా డాక్టరు పాత్రలు వేసే ఒకతను అలా చెయ్యలేక తడబాటుపడి, కొండలరావునే వేసెయ్యమని ప్రాధేయపడ్డాడు. ఆ విధంగా కామేశ్వరరావు సలహాతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు.

ముద్దుకృష్ణ సహకారంతో కొన్ని సినిమాల్లో సహకార దర్శకుడిగా అవకాశాలొచ్చాయి. ఆ తరవాత ‘పూజాఫలం’ వంటి సినిమాల్లో బి.ఎన్.రెడ్డిగారితో పనిచేసే అవకాశాలొచ్చినప్పటికీ ఆయన పెట్టే ఆంక్షలు కొండలరావుకు ఇబ్బందికరంగా ఉండేవి. అప్పటికి ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. జరుగుబాటు కోసం ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. పని ఉన్నా లేకపోయినా డబ్బింగ్ వగైరాలకు తమ ఆఫీసు నుంచి ఎక్కడికీ వెళ్ళరాదని రెడ్డిగారు కోప్పడేవారు. అందుచేత ఆయనతో కష్టమనిపించేది. కొండలరావు బి.ఎన్. గారి ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు పైన హాలులో తన బృందంతో నాలుగిళ్ళ చావిడి నాటకం రిహార్సల్సు వేసుకునేవారట; బి.ఎన్. దానికి అనుమతించడమేకాక కొత్తగా హీరో వేషానికని వచ్చిన చంద్రమోహన్‌ను నాటకం రిహార్సల్సు చూసి నటనలో మెళుకువలు నేర్చుకోమనికూడా చెప్పేవారట.

‘నర్తనశాల’ తీస్తున్నప్పుడు కమలాకర కామేశ్వరరావు మళ్ళీ కొండలరావును పిలిచారు. రంగారావు, రామారావు, సావిత్రి తదితరులకు సెట్టు మీద సన్నివేశాన్ని వివరించడం, డైలాగులు చెప్పించడం కొండలరావు పని. మహాభారతం పద్యాలకు వాళ్ళు అర్థాలు అడుగుతారని ఆయన ముందురోజునే రచయిత సముద్రాల సీనియర్‌తో కూర్చుని పద్యాల అర్థాల వివరాలు తెలుసుకునేవారు. నాలుగు పేజీల డైలాగ్‌ని రంగారావు అవలీలగా అర్థం చేసుకుని, గుర్తుంచుకుని చెప్పేవారని కొండలరావు అన్నారు. అటువంటి మహానటులతో పనిచెయ్యడం మరుపురానిదని ఆయన ఇప్పటికీ అంటారు.