సాధారణంగా సాహితీ సదస్సులంటే రెండు మూడు పదుల కుర్చీలు, అవీ ముందు వరస మాత్రమే, నిండుతాయి. దీనికి భిన్నంగా మార్చి 1, 2008 న కాలిఫోర్నియా సాహితీ సదస్సు మాత్రం ఇంతకు ముందు చెప్పిన వాక్యం తప్పని రుజువు చేసింది. దాదాపు 5 గంటల పైగా సాగిన సభకి సుమారు రెండు వందల మంది వచ్చారు. ఇది నిర్వాహుకుల్నీ వక్తల్నీ అందర్నీ ఆశ్చర్య పరిచింది. “సాహితీ సదస్సులకి వెళ్ళాలంటే ఇష్టం ఉండాలి” అని అంటే ఓ తెలుసున్న వ్యక్తి అనేవారు “ఇష్టం కాదు, ధైర్యం ఉండాలి” అని. ఇంతకు ముందు సాహితీ సదస్సుకి సుమారు పది పుంజీల జనం వస్తే చాలు అనుకునే వాళ్ళం. మా అభిప్రాయం తప్పని ఇంకో సారి నిర్ధారించబడింది.
వెల: ఉచితం
ప్రతులకు:gorthib AT yyahoo DOT com
ఇది 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు. అసలు ఈ కాలిఫోర్నియా సాహితీ సదస్సుకి నాంది పలికిన వారు కుమార్ కలగర అనే వ్యక్తి. ఇంతకు ముందు శాక్రిమెంటోలో రెండు సార్లు ఆయనే నిర్వహించారు. మూడవది సిలికాన్ వేలీలో జరుపుదామని అనుకున్నాం. కొన్ని కారణాంతరాల వల్ల అది కాస్తా వాయిదా పడుతూ వచ్చింది. చిట్ట చివరకి 2008, మార్చి 1వ తేదీన చేద్దామని నిర్ణయించడం జరిగింది.
ఈ సభకి ప్రముఖ పాత్రికేయులు, సాహితీ విమర్శకులు ఎన్.వేణు గోపాల్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఇదే సభలో 15 మంది వివిధ అంశాలపై ఉపన్యసించారు. కాలిఫోర్నియా రాష్ట్రం నలుమూలల్నుండీ, లాస్ ఏంజిలిస్, శాక్రిమెంటో, ఫ్రెస్నో నుండీ అనేక మంది వచ్చారు.
“సరస్వతీ దేవికి సంగీతం, సాహిత్యం రెండు కళ్ళు” అన్న నానుడి ననుసరించినట్లుగా ఈ సాహితీ సదస్సు శ్రీమతి సీత నిష్టల వీణా వాదన ప్రార్థనా గీతంతో ప్రారంభించబడింది.
“వెన్నెల్లో హరివిల్లు” కథా సంపుటి ఆవిష్కరణ
ఈ సాహితీ సదస్సు సందర్భంగా “వెన్నెల్లో హరివిల్లు (కాలిఫోర్నియా కథకుల గుండె చప్పుడు)” కథా సంపుటి ఒకటి ప్రచురించాము. దానిలో కాలిఫోర్నియాలో నివసిస్తున్న వివిధ తెలుగు కథకుల కథలున్నాయి. సదస్సుకి విచ్చేసిన సాహితీ ప్రియులందరికీ ఈ కథా సంపుటి ఉచిత కానుకగా ఇచ్చాము. ఈ కథా సంపుటి రఘు మల్లాది, శ్యామల మల్లాది ఆర్థిక సహాయంతో ప్రచురించడం జరిగింది. ఈ “వెన్నెల్లో హరివిల్లు” కథా సంపుటిని వీరిద్దరూ ఆవిష్కరించారు.
ఉపన్యాసాలు
ఈ సాహితీ సదస్సు మూడు విభాగాలుగా జరిగింది. మొదటి విభాగం, సంప్రదాయ సాహిత్యం, రెండోది ఆధునిక సాహిత్యం, మూడోది సమకాలీన సాహిత్యం. ఒక్కో విభాగంలోనూ వివిధ అంశాలపై కొంత మంది వక్తలు ఉపన్యసించారు.
సంప్రదాయ సాహిత్యం – ఈ విభాగానికి ఉపద్రష్ట సత్యం అధ్యక్షత వహించారు. కొంత మంది వక్తల ఉపన్యాస సారాశం.
ఉపద్రష్ట సత్యం: ఆదికవి కవితా రీతి :
“ఆదికవి కవితా రీతి” అన్న అంశంపై ప్రసంగించారు. నన్నయ కవితా వైభవ ప్రత్యేకతని చెబుతూ, మహాభారతంలో కొన్ని పద్యాలు చదివి, వ్యాఖ్యానించారు.
గండవరపు పుల్లమాంబ: విశ్వనాథ వారి “రామాయణ కల్పవృక్షం” విశిష్టత
విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్ప వృక్ష విశిష్టత గురించి గండవరపు పుల్లమాంబ మాట్లాడారు. ఎంతోమంది రామాయణాన్ని రాసారు కదా, విశ్వనాధ వారు మరలా ఎందుకు రాసారో చెబుతూ, ఈ క్రింది పద్యం చదివారు.
సీ. మరల నిదేల రామాయణం బన్నచో, నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే చేయు చున్నది, తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెదనేనును, నా భక్తి రచనలు నావి గానతే.గీ. కవి ప్రతిభలోన నుండును గావ్యగత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా దృతిని మించి.
ప్రతీ రోజూ తిన్న అన్నమే అని తినడం మానేయడం లేదు. సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని మనం మానేయడం లేదు. మన పిల్లల ల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా. అలాగే ఎవరి అనుభూతులు వారివి. ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన” అని విశ్వనాధ వారి కావ్య రచనా హేతువు వివరించారు.
కె వి యస్ రామారావు: కథాకావ్యాల్లో పద్య సౌందర్యం:
రామరాజ భూషణుడు విరచిత వసు చరిత్ర లో
మహి మున్ వాగనుశాసనుండు సృజియింపన్, గుండలీంద్రుండు ద
న్మహనీయస్థితిమూలమై నిలువ; శ్రీనాథుండు ప్రోవన్, మహా
మహులై సోముడు భాస్కరుండు వెలయొంపన్, సొంపు వాటించు నీ
బహుళాంధ్రోక్తిమయప్రపంచమున దత్ప్రాగల్భ్య మూహించెదన్
అనే పద్యమూ, మహాభారతంలో విరాట పర్వం లో తిక్కన గారి పద్యం,
భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు, దుర్యోధన
గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు, శస్త్రాస్త్ర జా
లోష్మస్ఫార చతుర్విధోజ్జ్వల బలాత్యుగ్రం బుదగ్రధ్వజా
ర్చిష్మత్త్వాకలితంబు సైనయమిది యే జేరంగ శక్తుండనే?
అన్న పద్యం, పెద్దన గారి పద్యం,
అటచనికాంచెభూమిసురుడంబరచుంబిశిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలముం
గటకచర త్కరేణు కరకంపితసాలము శీతశైలమున్
విశ్వనాథ వారి
ఓహో మూడవవాని జూపుము సమస్తోర్వీభరంబున్‌ఫణా
వ్యూహంబందు నటోయిటో యొరుగగా నూనంగ నైనట్టి శే
షాహిం దక్కగ, వింశతి ప్రభుభుజాహంకారసంభార రే
ఖాహేలాధృత శైతపర్వత భుజాస్కంధున్‌ననుం దక్కగన్
పద్యం , అన్నీ రాగయుక్తం గా చదివి ఆయా పద్యాల విశిష్టత, ప్రత్యేకత వివరించారు.
మృత్యుంజయుడు టి:పోతన భాగవతం విశిష్టత:
పోతన భాగవతంలో లో వివిధ స్కంధాలలో పద్యాలు ఉదహరిస్తూ, పోతన శైలినీ పద మాధుర్యాన్ని వర్ణించారు. పోతన భాగవతం దశమ స్కందం, రుక్మిణీ కల్యాణంలో ఈ క్రింది పద్యం చెబుతూ –
ఘనసింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్
మన కీర్తుల్ గొని బాల దోడ్కొనుచు నున్మాదముతో గోపకుల్
ననుచున్నరనదె శౌర్య మెన్నటికి శస్త్రాస్త్రముల్ గాల్పనే
తను మధ్యన్ విడిపింపమేని నగరే ధాతృ జునుల్ గంతలన్
తమకన్నా తక్కువ కులము వాడంటూ యాదవకులేశుడైన కృష్ణుణ్ణి నిందించడంలో పోతన శైలిని విశ్లేషించారు.
అపర్ణ మునుకుట్ల గునుపూడి: కర్నాటక సంగీతం – త్యాగరాజ కీర్తనలు:
సంగీతానికీ, సాహిత్యానికీ ఉన్న అనుబంధాన్ని వివరించిన ప్రసంగంలో కొంత పాఠ్యం ఇది.
“త్యాగరాజ కీర్తనలు రామభక్తి, వేదాంతసారం, తత్వ పరంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకని భక్తేతరంగా, సామాజిక, వ్యావహారిక వస్తు విశేషాలపై రాసిన కీర్తనలు ఉన్నాయా అని పరిశీలిస్తే సంగీత ప్రాముఖ్యం, సంగీత ప్రశంస ప్రధానంగా ఉన్నవి కొన్ని కనిపిస్తాయి. అందులో గరుడధ్వని రాగంలోని కీర్తనలో “ఆనంద సాగరమీదని దేహం భూమికి భారమురా” అంటాడు. అంతేగాకుండా అనుపల్లవిలో “అఖిల నిగమాన్విత సంగీత జ్ఞానమను బ్రహ్మానంద సాగరమీదని” అంటాడు. ఇలాగే కల్యాణవసంతంలో “నాదలోలుడై”, ఆరభిలో “నాదసుధారసం” వంటి గొప్ప కీర్తనల్లో సంగీతాన్ని ప్రశంసిస్తూ రచించేరు. సంగీతం యొక్క ప్రాముఖ్యం మనందరికీ తెలినదే అయినా అదే విషయాన్ని త్యాగరాజుగారు ప్రకటించిన విధానంలో ఉంది అసలు అందం. ఇంత మంచి కీర్తనలు మనకి అందించిన త్యాగరాజుగారి రచనలు సంగీతపరంగానే కాకుండా సాహిత్యపరంగా కూడా ఉన్నాయన్నది నిర్వివాదాంశం అని తెలియ చేస్తుంది”
ఆధునిక సాహిత్యం
– ఈ విభాగానికి కె వి యస్ రామారావు అధ్యక్షత వహించారు. కొంతమంది వక్తల ప్రసంగ సారాంశం
ఎన్.వేణు గోపాల్: తెలుగు సాహిత్యంలో విమర్శ
“జీవితం లోంచే కథ పుడుతుంది. ఆ కథ లొంచే విమర్శ పుడుతుంది. విమర్శ మరలా జీవితంలోకే ప్రయాణిస్తుందనీ” అన్నారు. పాశ్చాత్య సాహిత్యం లో అభివృద్ధి చెందినంతగా తెలుగు సాహిత్యంలో విమర్శ ఎదగలేదనీ, ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో విమర్శకీ, సమీక్షకీ తేడా లేకుండా పోతోందనీ ఎంతో ఆవేదనతో అనారు. అంతే కాదు పాశ్చాత్తులు అనుసరించే సైద్ధాంతిక పరమైన విమర్శనా పరికరాలనుపయోగిస్తే తెలుగు సాహిత్యంలో విమర్శ మరింతగా పెరుగుతుందనీ, దానికి సరైన అర్హత కలిగిన వారు ప్రవాసాంధ్రులేనని అన్నారు. విమర్శకుడు కావాలంటే కథా వస్తువు పై ఎంతో అవగాహన ఉండాలనీ, రచయితకీ, రచన కీ ఉన్న మధ్య సన్నని తేడాని గుర్తించ గలగాలనీ చెబుతూ – విమర్శ అనే నిప్పులో కాలినప్పుడే కథ పసిడి కాంతులు వెదజల్లుతుందనీ అన్నారు. విమర్శకీ,కువిమర్శకీ తేడా రచయితలకీ, విమర్శకులకీ స్పష్టంగా తెలియాలనీ అన్నారు.
హెప్సి సుంకరి: ప్రపంచీకరణ నేపధ్యంలో తెలుగు అనువాదాల ఆవశ్యకత
అనువాదాల చరిత్రనీ చెబుతూ, ప్రపంచీకరణలో అనువాదాల పాత్ర, ఆవశ్యకతనీ వివరించారు
“అనువాదమంటే ఒక భాషలోని ఆలోచనల్ని, భావాల్ని, సంస్కృతిని మరోభాషలో ప్రకటించడం. అనువాదమనే మాటని ఆధునిక ప్రపంచంలో తరచుగా వింటుంటాం. కాని అనువాదాల చరిత్ర చాలా ప్రాచీనమైంది. క్రీ. పూ. 2100 సం||లో హమ్మురాబీ కాలంనుండే అనువాదాలు అమలులో ఉన్నాయి. తెలుగు లిఖిత సాహిత్యం ఆదికవి నన్నయ భారతానువాదంతో నే ఆరంభమైంది. స్వర్ణయుగంగా పిలవబడ్డ కృష్ణదేవరాయల కాలం వరకు తెలుగులో వివిధ సాహిత్యానువాదాలు అలరారాయి. ఆధునిక కాలంలో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలనువాదం, సి. పి. బ్రౌను వేమన పద్యాలనువాదం, ఇంకా కొన్ని అడపాదడపా వస్తూనే ఉన్నాయి. కానీ పాశ్చాత్యదేశాల్లో జరుగుతున్న కృషితో పోల్చుకుంటే తెలుగు అనువాదాల కృషి మృగ్యమే అనిపిస్తుంది.
ప్రపంచీకరణలో భాషానువాదాలు ప్రధాన పాత్ర పోషిస్తాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే సర్వభాషా సంస్కృతుల్ని, విజ్ఞానశాస్త్ర విషయాల్ని, మత, రాజకీయ విషయాల్ని, క్రీడా వినోదాల్ని మానవుని ఉమ్మడి సొత్తు చేయగల శక్తి అనువాదాలకు మాత్రమే ఉంది. సాహిత్య, శాస్త్ర సంబంధితానువాదాల ద్వారా తెలుగు భాషను అభివృద్ధి పరచుకోడానికి, ప్రపంచీకరణ నేపధ్యంలో, తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావడానికి తెలుగులో అనువాదాల ఆవశ్యకత ఎంతైనా ఉంది.“
వంశీ ప్రఖ్య: ఆధునిక సాహిత్యంలో హితం ఎంత?
సాహిత్యం సర్వకాలీన సర్వజనీయం గా ఉండాలంటూ, ప్రస్తుత తెలుగు సాహిత్యంలో వస్తున్న మార్పులూ, ఉద్యమాల గురించి ప్రస్తావించారు. ప్రాతీయ వాదాలూ, వేర్పాటు వాదాలూ తెలుగు సాహిత్యం పై చేసే హానీ,ఆధిపత్యం గురించి వివరిస్తూ, రచయితలు రాజకీయ పోషకులుగా మారకూడదని హెచ్చరించారు.
శివచరణ్ గుండా: అమెరికాలో తెలుగు భాషాబోధన
ఈ మధ్యకాలంలో తెలుగు వారి సంఖ్య అమెరికాలో గణనీయంగా పెరిగందని చెబుతూ ఇలా అన్నారు.
“తెలుగు ఇప్పుడు అమెరికాలో విశ్వవిద్యాలయాలనుండి సాంస్కృతిక సంస్థలవరకూ పలుచోట్ల బోధింపబడుతుంది. బోధనలో పలు శాస్త్రీయ పద్ధతులని అవలంబించ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగు విశ్వవిద్యాలం వారు భాషేతరులు, ఉద్యోగరీత్యా ఆంధ్రదేశంలో పనిచేస్తున్న వారు, తెలుగు నేర్చుకోవడానికి పలు పుస్తకాలని ప్రచురించి ఉన్నారు. శాస్త్రీయ పరిశోధన అనంతరం ప్రచురించిన ఆ పుస్తకాలు అమెరికాలో తెలుగు నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగాఉంటాయి. అమెరికాలో తెలుగు నేర్చుకోవాలనుకులే విద్యార్ధులు దానికొరకు వెచ్చించే సమయం చాలా తక్కువగా ఉంటోంది. అందుకనే తల్లితండ్రులు ఇంట్లో తలుగులోనే మాట్లాడి ప్రోత్సహిస్తే విద్యార్ధులలో మరింత ఆసక్తి పెరుగుతుంది. విద్యార్ధుల బుద్ధిశీలత, తల్లితండ్రులకి తెలుగుపై ఉన్న ఆసక్తి, తెలుగు భాషలోని మాధుర్యాన్ని తరవాతి తరానికి అందజేయాలన్న ఆత్రుతా, ఇలా పలు అంశాలు అమెరికాలో తెలుగు భాషా బోధనని ప్రభావితం చేస్తున్నాయి”
మాచిరాజు సావిత్రి: తెలుగు కథల్లో పాత్రల చిత్రీకరణ
“ కథకు కావల్సింది సంఘటన, వ్యక్తులు. ఉత్తమరకమైన కథలో సంఘటనలూ, పాత్రలూ మధ్య విడదీయలేని సంబంధముంటుంది, పాత్ర వ్యక్తిత్వం మూలాన ఒక రకమైన సంఘటనలు ఒక రకమైన క్రమంలో జరుగుతాయి. ఒకే సంఘటనకు అన్ని పాత్రలూ ఒకేలా స్పందించవు. అన్ని పాత్రలకూ ఒకే రకమైన స్పందనకి కారణం వేరు వేరు సంఘటనలవవచ్చు. వేరు వేరు సంఘటనలు వేరు వేరు పాత్రలలో ఒకే రకమైన స్పందనను కలిగించవచ్చు. చలంగారు అన్నట్టు, రాముడి బదులు కృష్ణుడు చాకలి మాటలను వినుంటే సీతను వదిలివేసేవాడా? అప్పుడా కథంతా వేరుగా నడిచేది.
తెలుగు సాహిత్యంలో తలెత్తిన కొన్ని ఉద్యమాల ప్రభావం వల్ల ప్రభావం వల్ల కథల్లో పాత్రల చిత్రీకరణ దెబ్బతింటోంది. ఒక మనిషిని కేవలం తన గ్రూప్ ఐడెంటిటీ ద్వారానే పూర్తిగా నిర్వచించవచ్చనే అభిప్రాయంతో, ఆ మనిషి ఇండివిడ్యువల్ ఐడెంటిటీ ని పూర్తిగా విస్మరించారు నేటి కథకులు. ఒక దళిత స్త్రీ క్రైస్తవ మతం పుచ్చుకుని అమెరికాకి వస్తే ఆమె కథని ఏ వాదం దృష్ట్యా పరిశీలించాలి? ఏ కోణం లోంచి చిత్రీకరించాలి? ఈ కొత్త దేశంలో ఆమెకు పరిచయమైన విదేశీయులని ఏ చట్రంలో బిగించాలి? నా ఉద్దేశంలో, వెనకొక సారి వేలూరి వెంకటేశ్వర రావుగారు చెప్పినట్టు, ఇండియా బయటనున్న మనలాంటి రచయితలకు ఏ వాదాలనీ అనుసరించక్కరలేని స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛని సద్వినియోగపరుచుకుని, మన చుట్టూ ఉన్న మనుషులనూ, సమాజాన్నీ, ఏ పొరలూ లేని చూపుతో గమనించి, వాస్తవికంగా చిత్రీకరించగలిగితే, మన రచనలకు అర్ధం, పరమార్ధం, రెండూ ఏర్పడుతాయి. “ అంటూ కథల గురించి ఆసక్తి కరమైన విషయాలు చర్చించారు.
ఈ విభాగంలోనే మనకు తెలీయని శ్రీ శ్రీ సాహిత్యం” అన్న అంశంపై శ్రీ శ్రీ రాసిన కొన్ని పాత రచనల గురించి గోపాల్ నేమన ప్రసంగించారు. ఇదే విభాగంలో తన చతురోక్తులతో అమెరికాలో ప్రాచుర్యమైన “స్టాండిగ్ కామిడీ” తరహాలో “తెలుగులో నిలబడిన హాస్యం” అంటూ సురేంద్ర దారా హాస్య ప్రసంగం చేసారు.
సమకాలీన సాహిత్యం
ఈ విభాగానికి కిరణ్ ప్రభ అధ్యక్షత వహించారు. కొంతమంది వక్తల ప్రసంగ సారాంశం.
చిమట శ్రీనివాస రావు: సినిమా పాటల్లో సాహిత్యం
సినిమా పాట ఎలా మొదలయ్యిందీ, ఎలా పరిణాం చెందిందీ, అందులో సాహితీ విలువలు ఎలా మారాయి ఇవన్నీ సౌదాహరణంగా వివరించారు. ప్రస్తుతం వస్తున్న పరభాషా గాయకులు తెలుగుని ఎలా ఖూనీ చేస్తున్నారో అంటూ ఆవేదన చెందుతూ తెలుగు సినిమా పాటల్లో ప్రతీ శతాబ్దంలోనూ మెలడీ ఎలా పరిణాం చెందిందో చెప్పారు.
కోటేశ్వర రావు: తెలుగు కథా పరిణామం
కథా ఎలా మొదలయ్యిందీ, ఎక్కడ మొదలవుతుందీ చెప్పి, ప్రాంతీయ జీవన శైలిలో తెలుగులో వచ్చిన కథల గురించి వివరించారు. రాయలసీమ యాసలో మిట్టూరోడి కథలూ, తెలంగాణా యాసలో “దర్గామిట్టీ కథలూ”, కోస్తా జిల్లాల యాసలో “అమరావతి కథలూ”, “పసలపూడి కథలూ” ఎలా పాఠకుల్ని రంజింపచేసాయో చెబుతూ కథకులకి విశాల దృక్పథం ఉన్నప్పుడే కథలు పది కాలాలపాటూ ఉంటాయని అన్నారు.
తల్లాప్రగడ రావు:గజల్ సాహిత్యం
గజల్ అనేది పరభాషా ప్రక్రియ అయినా తెలుగు సాహిత్యంలో ఎలా వచ్చిందో చెప్పారు. తెలుగులో గజల్స్ రాసే వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారనీ చెబుతూ, తెలుగులో మరిన్ని మంచి గజల్స్ రావాలనీ, దానికి కవులందరూ కృషి చేయాలనీ అభ్యర్ధించారు.
కిరణ్ ప్రభ: సాయంకాలం అయ్యింది” గొల్లపూడి నవలా విశ్లేషణ
గొల్లపూడి మారుతీ రావు సాయంకాలం అయ్యింది” నవల పై విశ్లేషణ చేస్తూ మారుతున్న కాలంలో విలువలు ఎలా పడిపోతున్నాయో ఈ నవల్లో ఎంత హృద్యంగా చిత్రీకరించబడిందో వివరించారు.
కవితా పఠనం, కథా పఠనం
ఇదే విభాగంలో స్వీయ కవితా పఠనం, కథా పఠనం కూడా జరిగాయి.
కుమార్ కలగర, స్వాతి శ్రీపాద, గోపాల్ నేమన కవితా పఠనం చేసారు. పిట్టా నారాయణ స్వీయ పద్యాలు చదివారు. టెక్సస్ నుండి ఈ సభకి ప్రత్యేకంగా వచ్చిన వంగూరి చిట్టెన్ రాజు “అమెరికామిడీ” అంటూ చిన్న హాస్య కథని వినిపించారు. ఈ సాహితీ సదస్సుకి రవి కోనేరు (లాస్ ఏంజిలిస్) మురళీ చందూరి (లాస్ ఏంజిలిస్), రఘు మల్లాది (ఫ్రీమాంట్) ఆర్థిక సహాయం చేసారు.
[ఈ సాహితీ సదస్సులో విడుదల చేయబడిన “వెన్నెల్లో హరివిల్లు” కథా సంపుటి కావల్సిన వారు రచయితకి (gorthib AT yaahoo DOT com) ఈమెయిలు పంపగలరు. అయిదు డాలర్లు పంపిన వారికి ( $5 పోస్టేజి ఖర్చులకి మాత్రమే ) ఈ పుస్తకం ఉచితంగా పంపబడుతుంది. — రచయిత]