పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి శ్రీనివాస్ పరుచూరి అభిప్రాయం:

    09/11/2016 6:13 pm

    సంపాదకులకు నమస్కారం, మా వ్యాసం ప్రూఫు చూడ్డంలో మా పొరపాటు వల్ల ఈ కింది వాక్యంలో ఒక మాట చేరలేదు.

    “వెల్చేరు నారాయణరావు ఏ పద్యంలోను పట్టదు.” – ఈ వాక్యం ఈ కింది విధంగా సవరించి చదువుకో ప్రార్ధన.

    “వెల్చేరు నారాయణరావు ఒక పట్లాన ఏ పద్యంలోను పట్టదు.”

    మురళీధరరావుగారి వ్యాఖ్య చదివిన తరువాత ఇది మా దృష్టికి వచ్చింది. వారికి మా కృతజ్ఞతలు.

    [ఆ వాక్యం సవరించాము. – సం.]

  2. గడి నుడి – 1 గురించి Hareesh Kumar అభిప్రాయం:

    09/10/2016 11:34 am

    the winners’ names should be published in the next edition to make this puzzle a success.

  3. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/10/2016 4:20 am

    మాన్యులైన శ్రీ తః తః గారికి
    నమస్కారములతో,

    రచయితల నైకజమైన అభిప్రాయమే గాని, ‘నైజ’మేమీ తెలియవలసి రాలేదు. 🙂 “తెలుగులోనే పనిచేస్తున్నవాళ్లు … కవులే కానీ పండితులు కారు”, “పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్ళే” అన్న నైపథ్యానుసంజనతో ఘట్టితాలైన “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృతపండితులు కారు … అందుచేతనే … ఆశుకవిత్వా(వధానా)దివిద్యల వల్ల … వాళ్ళు తెలుగుకి సంస్కృతం కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంపాదించారు” ఇత్యాదివాక్యాలను పురస్కరించికొని మాత్రమే – తిరుపతి వేంకట కవులు సంస్కృతంలో శాస్త్రపండితులు ఎందుకు కారన్న సంశయాన్ని ప్రకటించటం జరిగింది. నారాయణరావు గారి గురుస్థానీయత, శ్రీనివాస్ గారి బహుముఖప్రామాణికత, ఆ ఉభయుల ప్రభావశీలితల నైజం ఆ ప్రకటనకర్తకు సుజ్ఞాతమన్నది ప్రతిజ్ఞాతమే.

    అట్లాగే, తత్సమమైన ‘అయోమయ’ శబ్దానికి ‘ఇనుముతో నిండి(చేసి)నది’, అన్న ప్రాథమికార్థం తొలగిపోయి, ‘అస్తవ్యస్త పరిస్థితి’, ‘అర్థం కాని స్థితి’ అని తెలుగులో అర్థపరిణామం ఏర్పడిన తర్వాతి (ఇటీవలి?) కాలంలో ఎవరో తెలుగువారే, ఏ సమస్యను ఇచ్చినప్పుడో, ఏ చమత్కారవశాననో ప్రాసంగికంగా చెప్పిన శ్లోకమే గాని, “ఆంధ్రభాషామయం కావ్యం అయోమయ విభూషణం” అన్నది తెలుగు పట్ల ఈసడింపుగా చెప్పబడిన చాటూక్తి భావమై ఉండదు. ఆ మాట శ్లోకపూర్వార్ధంలో ఆ విధమైన శ్లేషార్థంతో ఉండటమే అందుకు నిదర్శనం.

    ‘గీర్వాణ’ శబ్దం సంస్కృతంలో ‘గీర్బాణ’ శబ్దం నుంచి ఏర్పడినదని “గీరేవ (నిగ్రహానుగ్రహసమర్థా) బాణః అస్త్రం యేషామ్’ అని రామాశ్రమి. ఎవరి వాక్కులు బాణతుల్యములో, వారు గీర్బాణులు. గీరేవ శాపలక్షణా వాణో బాణో వా యేషాం తే వబయో రభేదః’ అని లింగాభట్టీయం. సంప్రదాయస్థమైన ఇదే తెలుగులో ఏర్పడిన అర్థచ్ఛాయకు మూలమని ఊహ్యం. ములుకుల వంటి పలుకులు (బాణతుల్యములైన కఠినోక్తులు) కలవాడు గర్విగా భావింపబడటం సహజమైన అర్థాన్వయమే. అది ఆధునిక సాహిత్యపరిణామగతమైన అర్థాన్వయమో, కాదో ఇంకా పరిశీలింపవలసి ఉన్నది.

    ఇవన్నీ వ్యాసప్రతిపాదితానికి భంజకాంశాలు కావని ముందే విన్నవించటం జరిగింది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  4. హృదయం ఇక్కడే వుంది! గురించి Venkat Suresh అభిప్రాయం:

    09/09/2016 4:16 pm

    కధ చదువుతున్నంత సేపు నాకు తెలిసిన ఒక జంట గుర్తొచ్చారు మామ్. మీరు వాళ్ళని బాగా అబ్సర్వ్ చేసి రాసినట్లు అనిపించింది. ముగ్గురి పాత్రల సంఘర్షణని చక్కగా రాశారు. చాలా చాలా బాగుంది.

  5. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి తః తః అభిప్రాయం:

    09/09/2016 2:18 pm

    శ్రీ మురళీధర రావు గారూ!

    “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు” అని అన్నారు గానీ, “తిరుపతి వేంకట కవులు సంస్కృత పండితులు కారు” అని రచయితలు అనలేదు. రచయితల ‘నైజం’ తెలియక మీరు రాసిన అభిప్రాయం నుంచి నే నది తెలుసుకున్నాను.

    నమస్కారాలతో
    తః తః

  6. జంతువు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    09/09/2016 11:07 am

    చాలా బావుందండి కవిత, కవితానువాదం రెండూనూ! మనిషి కంటే మాటలు రాని మూగజీవాలు ఎంత గొప్పవో చెప్పిన వైనం అద్భుతం గా వుంది.మనిషికి కనువిప్పు కలిగించేలా వుంది.
    అభినందనలు.

  7. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/08/2016 2:46 pm

    మాన్యులు శ్రీ వెల్చేరు నారాయణరావు గారికి, శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
    నమస్కారములతో,

    వ్యాసం ఇంకా పూర్తికాలేదు కాబట్టి, ఇప్పుడే వ్యాఖ్యానించటం భావ్యం కాదు కాని, మీవంటి ప్రభావశీలి ప్రామాణికుల రచనలో అక్కడక్కడ కొన్ని అనంగీకారయోగ్యములైన భావాలను మాత్రమే – అవి మీ వ్యాసతాత్పర్యానికి భంజకాలు కాకపోయినా, కొంత సంబంధించినవే కనుక ఇక్కడ ప్రస్తావింపవలసి వచ్చింది:

    “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు.”

    ఎందుకు కారు? వ్యాకరణ తర్క వేదాంతాది శాస్త్రాలను గురుసన్నిధిని శాస్త్రీయంగా అధ్యయనించి, వేలూరి శివరామశాస్త్రి, అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి గారల వంటి అసంఖ్యాతవిద్యార్థులకు సంస్కృతవ్యాకరణం నేర్పి మహావిద్వాంసులను కావించి, కావ్యనాటక ప్రకరణగ్రంథాలను బోధించి, సంస్కృతంలో ధాతురత్నాకర కాళీసహస్రాదులు గాక ఇతరానేకశతశః ప్రౌఢశ్లోకరచనలు చేసిన మహానుభావులు వారు. మామూలు తెలుగు పండితులు వ్రాయలేని ఒక పద్యం, సామాన్య సంస్కృతపండితులు అర్థతాత్పర్యాలు చెప్పలేని ఒక శ్లోకం ఇక్కడ చూపుతున్నాను. రెండూ వారివే. ఇటువంటి ఉదాహరణలను వారి రచనలలో ఒక్కొక్కదానిలోనుంచి ఎన్నింటినైనా చూపవచ్చును:

    కొందరు పచాద్యజంతం
    బందురు; మఱికొంద ఱర్శ ఆద్యంతం బే
    యందురు; మే ముభయం బని
    యందుము నీ నామధేయ మానందనృపా!

    యః పశ్యతి జగత్సర్వం యో న పశ్యతి సర్వతః
    తా వుభౌ పరమాత్మానం పశ్యాపశ్యౌ న పశ్యతః.

    “ఎవరో ఒకరు వ్యాకరణం రాయబట్టి, ఆ వ్యాకర్త వాగనుశాసనుడు కాబట్టి, ఆ తరవాత దక్షవాటిలో వుండే కవిరాక్షసుడు అనే ఆయన ఎవరో మనకి తెలియకుండా ఒక శాసనం చేశాడు కాబట్టి, కవులందరూ ఆ శాసనాన్ని పాటించారని వ్యాకరణ పండితుల వాదన … ఆదిని శబ్దశాసన మహాకవి (పద్యం మొత్తం ఇక్కడ ఉదాహరింపలేదు) … ఈ వాదనకి ప్రధానమైన బలం — ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయి అనే నమ్మకం.”

    అప్పకవి వ్రాసిన ఆ పద్యమే – భారతంలో నన్నయ గారిచే చేయబడిన వ్యవస్థ తప్పించి, వ్యాకరణం పేరుతో సూత్రసంపాదనం అంటూ ఎవరూ చేయలేదు కనుక – అందులో ఉన్న తీరున మాత్రమే – అంటే, ఆ భారత ప్రయోగాలను అనుసరించి మాత్రమే – రచన చేయాలని ఆ కవిరాక్షసుని ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నది. అంటే, ఆ కవిరాక్షసునికి నన్నయగారి పేరిట వెలసిన ఆంధ్రశబ్దచింతామణి సంగతే తెలియదన్నమాట. ఆయన వ్యాకరణానికంటె నన్నయగారి ప్రయోగాన్నే శరణ్యమని భావించాడన్నమాట. (‘కవిరాక్షసుడు’ అన్న పేరే ఆయన సంస్కృత పాండిత్యాన్ని సూచిస్తున్నది; అంతటివాడు వ్యాకరణం కంటె కవిప్రయోగం శిరోధార్యం అన్నాడన్నమాట.)

    “ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయి అనే నమ్మకం” మనవారికి ఎన్నడూ లేదు. ‘ప్రయోగశరణం వ్యాకరణం’ అని ఉండనే ఉన్నది కదా. అతిప్రాచీనాచార్యులు, మునిత్రయం వారు ప్రయోగవిజ్ఞానమే వ్యాకరణానికి మూలకందమని (“అపదం న ప్రయుఞ్జీత” వద్ద వృత్తిని చూడండి) పదేపదే చెప్పారు. పాణిని మహర్షి అష్టాధ్యాయికి మునుపే జాంబవతీ పరిణయం చెప్పిన సంగతీ, అందులో పాణినీయానికే లొంగని ప్రయోగాలున్న సంగతీ సుప్రసిద్ధమే. కావ్యాలు ముందు పుట్టి, వాటిని అనుసరించి వ్యాకరణం వస్తుందనే మనవారి నమ్మకం.

    “సంస్కృత వ్యాకరణం ఉన్నంత విస్తృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు.”

    ఆంధ్రశబ్దచింతామణి 16-వ శతాబ్ది చివరి కాలం నాటిది. అంతకు మునుపటి కవులకు దాని ఉనికి విషయం తెలిసివుండే అవకాశమే లేదు. ఆ తర్వాతి కవులు మాత్రం దానికి “బలమైన ప్రాధాన్యాన్ని” ఇచ్చారని చెప్పేందుకు ఆధారాలు ఏమున్నాయి?

    “పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు.”

    ఏనాటి కవుల సంగతి? ప్రాచీనకవులు పాణినిని కంఠస్థం చేసేవారో, లేరో; ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరింపగలిగి ఉండేవారో, లేరో మనకు తెలిసే అవకాశం లేదు. వారి ప్రయోగాలే అందుకు సాక్ష్యాలు. సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంలోనే “శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు” అన్న కవి, “వక్షోముఖాఙ్గేషు” అని సమాసాంతవ్యవస్థ తెలియక అపాణినీయప్రయోగం చేశాడనుకోవాలా? పాణినీయాన్ని పుడిసిట పట్టిన మహాపండితు డనుకోవాలా? తిక్కన శ్రీనాథ పోతనాదుల మాటేమిటి? “యమునాద్గంగము, కృష్ణభూమదిలము” ఇత్యాదులున్న భాస్కర రామాయణం మాటేమిటి? ఆ రోజుల్లో సంస్కృతవ్యాకరణం కంఠగతం కాకుండా కవిత్వం చెప్పిన తెలుగు కవులు అరుదనే చెప్పాలి.

    కాగా, అభినవగుప్తుని పరిచయం 20-వ శతాబ్దికి పూర్వం తెలుగు కవులకు లేకపోవటంలో ఆశ్చర్యం ఉండకూడదు. వ్రాతప్రతులు ఏనాటినుంచో దురుద్ధరంగా ఉండటమూ, తెలుగు కవిత్వం ప్రారంభమయే నాటికి సంస్కృతలాక్షణికులకే ఆ కృతి దుర్లభమైపోవటమూ, తెలుగు కవులెవరూ ఆయనను స్తుతించి ఉండకపోవటమూ అందుకు సాక్ష్యాలు. నాట్యశాస్త్ర ధ్వన్యాలోకాదులను చూసిన తిక్కన శ్రీనాథాదులు సైతం అభినవగుప్తుని వ్యాఖ్యలను చూసినట్లుగా నిరూపించటం కష్టం. “ఎక్కువమంది” కారు; అసలెవరూ ఉండి ఉండరు. ఆధునికకాలంలో మాత్రమే అది అచ్చైనాక ప్రచారంలోకి వచ్చింది. “మామిడి కొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిలస్వామికి మ్రొక్కి … ఈ యభినవధ్వనిధారణ కుద్యమించితిన్” అని రాయప్రోలు.

    జగన్నాథ పండితరాయల వారు క్రీస్తుశకం 1674లో పరమపదించారు. 1700కు తర్వాతనే తప్పించి, తెలుగు కవుల్లో అంతకు మునుపు ఎంతమందికి ఆయన పరిచయం సాధ్యం? అనంతరీయాధునికాలంకారికులలో సైతం ఆయనతో చాలా మందికి తీవ్రవిభేదాలున్నాయి. సంస్కృతంలో ప్రసిద్ధవ్యాఖ్యలు లేకపోవటమే దేశమంతటా దాని వ్యాప్తిలోపాన్ని సూచిస్తున్నది. ఆధునికకాలంలో తాతా సుబ్బరాయశాస్త్రి గారు, గాజులపల్లి హనుమచ్ఛాస్త్రి గారు, వారి తర్వాత పంతుల లక్ష్మీనారాయణశాస్త్రి గారు, వేదాల తిరువేంగళాచార్యుల వారు, జమ్ములమడక మాధవరామశర్మ గారు కళాశాలలలో పఠనపాఠనాలలోకి తేక మునుపు తెలుగుదేశంలోనూ దానిలో కృషిచేసిన ప్రసిద్ధులు లేరు. తెలుగు కవులు ఎప్పుడు పడితే అప్పుడు దానిని ఎట్లా ఉదాహరింపగలరు?

    “ఆంధ్రశబ్దచింతామణి నన్నయే రాశాడని, ఆయనని వాగనుశాసనుడిగా గౌరవించి చిన్నయ సూరి మర్యాదగా తన బాలవ్యాకరణంలో ఒప్పుకున్నాడు.“

    చిన్నయ సూరి గారు ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది?

    “ఉదాహరణకి పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు అనే మాటలు ఉన్నవి ఉన్నట్టుగా ఏ తెలుగు పద్యం లోను పట్టవు … పరుచూరి శ్రీనివాసుడు అని చేసుకుంటే కంద పద్యంలో ఇమిడించొచ్చు. వెల్చేరు నారాయణరావు ఏ పద్యంలోను పట్టదు.”

    ఎందుకు పట్టవు?

    “పేరుఁగన్నట్టి వెల్చేరు నారాయణరావు సీసమ్ము నేర్పంగఁ బూని
    పరుచూరి శ్రీనివాస్ పదము డుమంతంబు గామియు, స్వస్థితిన్ గారవించె”

    అని?

    ముందే వ్రాసినట్లుగా, ఇవి మీ వ్యాసప్రతిపాదితానికి భంజకాలు కాకపోయినా, కొంత సంబంధించినవే కాబట్టి ప్రస్తావింపవలసి వచ్చింది. ఏవంవిధ విషయవిమర్శను మీ సహృదయత మన్నిస్తుంది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  8. నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి శివకుమార శర్మ అభిప్రాయం:

    09/08/2016 1:07 pm

    పద్యా న్నర్థం చేసుకోవడ మెలాగో తెలిపిన కామేశ్వరరావుగారికీ, దానిపైన మంచి వ్యాఖ్యానా న్నందించిన మురళీధరరావుగారికీ ధన్యవాదాలు. మందార మకరందాల పేరిట మా మేష్టారు వంద పోతన పద్యాలనీ, భర్తృహరి శ్లోకాలనీ, వాటికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు పద్యాలనీ, పరిచయం చేసినప్పటికీ (సిలబస్ లో లేనివి), వాటిలో చాలా గుర్తున్నప్పటికీ, హైస్కూల్ తో ఆపేసిన తెలుగు అవడం వల్ల వ్యాకరణానికి దగ్గరవడం కుదర్లేదు. సమాపక, అసమాపక క్రియల గూర్చి విన్నట్టు గుర్తుంది గానీ, ఈ తుమ్మున్నర్థకమే లాటిన్ లాగా కనబడుతోంది. కామేశ్వరరావుగారూ, మీ పద్యపరిచయాలని అప్పుడప్పుడూ చదువుతూంటాను. తరచుగా చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి అవకాశా న్నిస్తున్నందుకు మీకూ, ఈమాట సంపాదక వర్గానికీ ధన్యవాదాలు.

  9. దైవం గురించి Suryaprakash Kavalipati అభిప్రాయం:

    09/08/2016 10:55 am

    Hello Indrani,
    If you remember me this is Prakash from Wayne state. The poem you wrote is really good.

  10. వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం గురించి శివకుమార శర్మ అభిప్రాయం:

    09/08/2016 7:55 am

    “అలా ఒక వర్గపోరాట దృక్పథంతో మాత్రమే ఎన్నుకున్న కథలు మాత్రమే తెలుగులో ఈ నూరేళ్ళలో వచ్చిన గొప్ప కథలు అని నమ్మించబోవడం నాకు నచ్చలేదు. ఎలానూ తెలుగులో తెలంగాణ కథలు, కళింగ కథలు, రాయలసీమ కథలు ఇలా ఎన్నో సంకలనాలు వస్తున్నాయి. ఈ సంకలనానికి తెలుగులో వర్గపోరాట కథలు 1910-2000 అని పేరు పెడితే నిజాయితీగా ఉండేది అని అనుకున్నాను. మానసిక ప్రపంచం సమాజ కేంద్రకంగా ఎందుకు సరిపోదో, పనికిరాదో నాకు అర్థం కాలేదు.”

    కథల్లో సామాజిక సమస్యలనీ, వర్గపోరాటాన్నీ స్పృశించవచ్చు గానీ, ఆ రెంటినీ ప్రతిబింబించేవి మాత్రమే కథలు అన్న అభిప్రాయం ఈనాడు చాలా ఎక్కువగా కనిపిస్తూంటుంది. వాటికి భిన్నంగా ఏమైనా కనిపిస్తే, అవి, చాలా అధిక సంఖ్యలో, సమస్య, పరిష్కారం, సందేశం చుట్టు తిరిగేవి.

    “టెన్నిస్ టూర్నమెంట్” నిన్న మళ్లీ చదివాను. వారి మిగిలిన కథల్లాగే టెన్నిస్ తో బాగా అనుబంధ మున్నవాళ్లే రాయగలిగిన కథ అది. ఇంటర్వ్యూకి ధన్యవాదాలు! గాల్ఫ్ నేపథ్యంతో రావుగారు ఒక కథని త్వరలో ప్రచురిస్తారేమో చూడాలి.