పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. Cathedral – కథ నచ్చిన కారణం గురించి jayaprabha అభిప్రాయం:

    03/05/2013 2:56 pm

    వేలూరీ ! ఈమాటలో మరీ అతిగా నాకు కనిపిస్తున్న ఒక ధోరణి ఏమంటే తెలుగు దేశం లోని పాఠక సమూహాన్నీ రచయితల కవుల సమూహాన్నీ కూడా సాధారణీకరించి చేసే వ్యాఖ్యానాలు. మీరు చెప్పదలుచుకున్నవి మీరు చెప్పొచ్చు. విమర్శ చేయదలుచుకున్నప్పుడు స్పష్టంగా మాట్లాడటం హుందాగా ఉంటుంది. అంతే గాని కొందరు రచయితలు… అనడం వలన ఏ వివరమూ ఎవరికీ అర్ధం కాదు. మీ తపన డయాస్పోరా తెలుగు కధలు మిగిలిన తెలుగు సమాజం లోని పాఠకులకీ రచయితలకీ సరిగా అర్ధం కావడంలేదనీనీ.. తెలుగు వారు ‘కధ’లో అరిగిపోయిన విధానాలలోనే రచన చేస్తున్నారనీ నాకు మీరు ఈ కెథెడ్రెల్ కధ నచ్చిన కారణాన్ని గురించి మీ మాటలలో చేసిన వ్యాఖ్యానం ద్వారా తెలుస్తోంది. ఇలా మాట్లాడటమూ ఒక లాంటి ముతక పధ్ధతే!

    Dirty realism నించి magic realism దాకా ఆధునిక కధ ప్రపంచంలో ప్రయాణం చేసింది. విమర్శ పెట్టె ముందు నాలుగు రకాల కధల్నీ నాలుగు భిన్నమైన రచయితల్నీ ముందు పెట్టుకుని ఉదాహరిస్తూ చేయాల్సి ఉంటుంది. ఊరికే పొడి పొడి మాటల్లోంచి మీ మీ అసహనాలని వెళ్లగక్కినందువలన ఏమవుతుందీ? నాకు విమర్శలో గుంభనం అంటే పడదు సరి కదా అది పాత తరం వాళ్ల దెప్పుడు మాటల్లాగా వినిపిస్తుంది. డయస్పోరా ఈ గుణం నించి బయటపడే మార్గం ఉంటే చూడండి.

    చివరగా రేమండ్ కార్వర్ కధ మొత్తం చదివేను. కళ్ళున్నవాడు కళ్ళు లేని వాడిని గురించి అనుకున్న భావాలన్నీ ఎదురు తిరగటం కళ్ళు లేని వాడు కళ్ళున్న వాడికి ఊహని పరిచయం చేయడం. అమెరికన్ తరహా సెన్సాఫ్ హ్యూమర్ ఉంది కధకుడి మాటలో. ముగింపు మీద అనేక రకాలు గానూ అనుకోవచ్చు. ఇద్దరి మగవారి అహంకారాల పరీక్ష కూడాను. చూడగల్గిన వాడు చూడలేకపోవడమే కధ లోని ట్విస్ట్ అని అనుకుంటే అది ఇవాళ మరీ అంత అనూహ్యమైన మలుపేమీ కాదు 🙂

    కధని చదువుతాం. ఒక అభిప్రాయం తప్పక కలగాలని రూలేం ఉండదు. నా వరకు నాకు అమెరికన్ రచయితలకన్నా లాటిన్ అమెరికన్ రచయితలే కధనంలో ముందుంటారు అనిపిస్తుంది. దీనివలన తేలే దేమంటె మీరింకా ఆ ఎనభై దశకంలోనే నిలబడిపోయినట్టున్నారు. కొత్తకధల్లోని వరవడి మీ కార్వర్ ని దాటిందేమో తెలుసా మీకు? కధలోనే కాదు కవిత్వం లోనూ టోన్ డౌన్ చేసి మాట్లాడటం ఇంగ్లీషు వారి పధ్ధతి. అయినప్పటికీ అది అన్నివేళలా నిజం కాదు. బ్లాక్ పోయిట్రీ మళ్ళీ అంతే లౌడ్ గా ఉంటుంది. ఇవన్నీ వివరంగా మాట్లాడాలీ అంటే అందుకు ఒక కాలాన్ని ఎంచుకుని ఆయా సమాంతర రచనల సమాంతర సమాజపు జీవిత విధానాల మీద పరిశీలన చేసి చెప్పాలి ఒక స్పష్టత కోసం. అది చాలా అవసరం. ఆ పని మాత్రం జరగడం లెదు చాలినంతగా ! పొరుగింటి పుల్ల కూర రుచి అనడం మనకి కొత్తేం కాదు. తనకి నచ్చిన రచయితని గురించి మాట్లాడటం వేరు . ఆ సందర్భాన్ని వట్టి అసందర్భపు విమర్శకి ఉపయోగించుకోవడం వేరూను. తెలుగులో దేశం లో ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్న వారు చాలా మందే ఉంటారనీ మీరు మాట్లాడే పేరు లేని నీతి బోధలు చాలా మందికి నవ్వూ తెప్పిస్తాయనీ బహుశా మీకు తెలియదు. ఎప్పుడైనా మనకి నచ్చింది చెప్పడం… వచ్చింది చెప్పడం మేలు కదా, ఇతరులకి ఏవీ అర్ధం కాదని వాపోయే కన్నా అని నా బాధ. ఆలోచించుకోండి మరి మీరు కూడా. మీరు అపార్ధం చేసుకోరన్నది నా నమ్మకం.

    జయప్రభ.

  2. అర్జున గురించి మోహన అభిప్రాయం:

    03/05/2013 12:41 pm

    నిజంగానే సౌపర్ణిక అని ఒక నది కర్ణాటకరాష్ట్రములో నున్నది. ప్రసిద్ధి చెందిన మూకాంబికాలయము ఈ నదీతీరములోనే ఉన్నది. ఈ నదీతీరములో గరుత్మంతుడు (సుపర్ణుడు) తపస్సు చేసాడట, అందువల్ల ఈ నదికి సౌపర్ణిక అని పేరు. సౌపర్ణికానది ఒడ్డున కొన్ని దృశ్యాలను ఇక్కడ చూడవీలగును. అక్కడి ఏ చెట్టు జయప్రభగారి అర్జున అయి ఉంటుందో ఆమెకు తప్పక తెలిసి ఉంటుంది. విధేయుడు – మోహన

  3. కొత్త మలుపు గురించి ఉష అభిప్రాయం:

    03/05/2013 11:22 am

    సంవత్సరం పైగా ప్రేమించినవాడికి ఇంట్లో ముందుగా చెప్పాలన్న సంస్కారం ఉండదు. తండ్రి, నాయనమ్మ విలన్లుగా ఉండటం ఇటువంటివారికి చాలా ఆనుకూల్యాన్ని తెచ్చి పెట్టే ఏర్పాటు. చాలా కథల్లో చదివిన, సినిమాలల్లో చూసిన వస్తువే. కొత్తదనం ఏమీ లేదు. ఎంత సేపటికీ తిరుగుబాటే సమాధానం అని అంగీకరిస్తే అన్ని ఇళ్ళూ ఈ విధంగా కూలిపోవటమే సమాధానం. కనీసం ఊహకైనా మంచి నిర్మాణాత్మకమైన ముగింపులనిస్తే బాగుంటుంది.

  4. నిష్కృతి గురించి ఉష అభిప్రాయం:

    03/05/2013 11:16 am

    కథా విషయం చాలా రొటీన్ గా ఉంది. తొందరపాటు వల్ల జరిగే అనర్థాలు మన సాహిత్యంలో ఎన్నో రకాలుగా చదువుతూనే ఉన్నాము. సాధారణంగా పనిమనుషులను ఇరికించటం ఉంటుంది. ఇక్కడ ఎదిరింటివారు. అంతే తేడా.
    కానీ కేవలం సంభాషణలతో కథను నడిపిన తీరు బాగుంది. అభినందనలు.

  5. బ్రహ్మ సృష్టి గురించి ఉష అభిప్రాయం:

    03/05/2013 11:12 am

    మన దేవుళ్ళ గురించి, దేవర్షుల గురించి మనం కాబట్టి ఇంత చౌకగా వ్రాసుకుని ఆనందిస్తున్నామేమో.

    ఈ కథలో కనిపించినంత చేత కాని వాడు సృష్టికర్త అని మనం నమ్ముతున్నామా?

    ఇంతకూ అనవసరమైన విషయాలన్నీ వదిలేస్తే, కలిపురుషుడు సర్వ బలవంతుడని నిర్ణయించారు. అతను కాలు కూడా పెట్టలేని స్థలాలు భూమి మీద ఎన్నో ఉన్నాయని రచయిత మర్చిపోయారు. గురుస్మరణ జరిగే చోట, దైవపూజ, సత్కర్మలు, సద్-గ్రంథ పఠనం జరిగేచోట అతని గాలి కూడా సోకలేదని మన పెద్దలు చెప్పారు. కనక కథ చదివి ఇదంతా నిజమని బెదిరిన వారికి ఇది శుభవార్త.

  6. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి ఉష అభిప్రాయం:

    03/05/2013 11:04 am

    కథనం బాగుంది. కానీ కథ కాదు.

    ఇన్ని మాటలు చెప్పిన రచయిత కన్నబాబులో ఏ కోణంలో హీరోను చూసాడో నాకర్థం కాలేదు. అతని ప్రేమలో ఉన్న సంస్కారమేమిటో తెలియటం లేదు. చాటుమాటుగా వ్యవహారం నడిపిన సంగతి ఊళ్ళలో ఎవ్వరికీ తెలియకుండా ఎట్ల, ఎన్నాళ్ళు ఉంటుంది? ఇప్పుడు వ్యవహారం బయట పడ్డాక, కన్నబాబు గురించి చంద్రమతి గురించి ఊరంతా ఏమనుకుంటారు? అది రచయిత స్పృశించనేలేదు. కేవలం ఒక మనిషి తినటానికి బ్రతకటానికి ఏర్పాటు చేస్తే అది ప్రేమా? అదేదో ఆ అక్కను బ్రతికి ఉండంగానే చంద్రమతిని నలుగురిలో తనదానిగా చేసుకుంటే సరిపోయేదేమో. అనైతికత వేదాంతం, హీరోయిజం అవుతుందా? ఇప్పుడతను సాధించింది ఏమిటి?

  7. ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    03/05/2013 10:23 am

    వ్యాసం చాలా బావుంది.

    చిత్ర కళ మీద తెలుగులో విశ్లేషణాత్మక వ్యాసాలు చాలా తక్కువ. చాలామందికి illustrative artist కీ, realistic or abstract artist కీ తేడాలు తెలియవు. చిత్రకళనీ, చిత్ర్రాలనీ ఎలా చూడాలీ అన్నవాటిపై తెలుగులో వ్యాసాలు చాలా చాలా అరుదు. రాసినా ఎవరికీ పట్టదు. చిత్రకళ తెలుగు సాహిత్యమ్లో భాగమేనా? మనకి కథలకీ, కవిత్వాలకీ బొమ్మలు వేయడానికీ, పుస్తకాల అట్టలకీ, అప్పుడప్పుడు పత్రికల అట్టలకీ మాత్రమే చిత్ర కళ అన్న ధోరణి ఎక్కువ.

    చిత్ర కళ పరంగా స్త్రీ చిత్రీకరణలో చిత్రకారుడి దృక్కోణం చూపించడం బావుంది. అన్నీ వెస్ట్రన్ చిత్రకారులవే ( ఒక్క రామారావు గారివి తప్ప ) విశ్లేషించారు. హుస్సేన్ గురించి ఒక్క మాట చెప్పుంటే బావుండేది అనిపించింది.
    ఈ MF Hussain చిత్రం (హుస్సేన్ చిత్రం) నాకు చాలా ఇష్టమైనది. ఇందులో కూడా స్త్రీ యొక్క వివిధ మానసిక స్థితులనీ, దేహపరంగా చూపించాడనిపించింది.

    పరిశీలంగా చూస్తే మగమృగం కూడా ఉంది. అది శరీరం క్రిందభాగంలో అంటే కాళ్ళ మధ్యన చిత్రీకరించడంలో స్త్రీ యొక్క మానసిక స్థితితో పురుషుడికున్న చులకన అభిప్రాయంకూడా కనిపిస్తుంది. చివరగా స్త్రీ ముఖం చూపించకపోవడం ఈ చిత్రంలో ప్రత్యేకత.

    -సాయి బ్రహ్మానందం

  8. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి D.Venkateswara Rao అభిప్రాయం:

    03/05/2013 9:45 am

    జాన్ హైడ్ కనుమూరి గారికి ధన్యవాదాలు. ఒక మంచి విషయం మీద కవిత వ్రాశారు. మీ కవిత చదివిన తరువాత నా అభిప్రాయం ఇలా వ్రాయాలనిపించింది.

    నిజాన్ని అబద్దంగానూ అబద్దాన్ని నిజంగాను మార్చె శక్తి మానవులకే వుంది. అబద్ధాల రాజ్యములో ధర్మరాజు నిజాన్ని చెప్పితే ఎంత చెప్పక పొతే ఎంత? రామాయణం రంకు భారతం బొంకు అనే నానుడి కూడా ఉంది కదా. ‘యేసు’గురించి నలుగురు శిష్యులు ఒకేలాంటి నిజాలు వ్రాయలేకపొయారు. అప్పటి శిష్యులే ఆయన తిరిగి లేచాడంటే నమ్మలేదు.

    నిజం వేరు నమ్మకం వేరు కాదుకదా ఎన్నోమహిమలు(అబద్దాలు) నిజమని నమ్ముతాము. నమ్మిస్తాము నమ్మడానికి ప్రయత్నిస్తాము. నిజాన్ని ఒప్పుకుంటూనే కాళ్ళకు తడి అంటకుండా ఎదుటి వారి తలలమీద నడిచే వారికి నిజానికి అబద్ధానికి తేడా ఎలా తెలుస్తుంది?

  9. అర్జున గురించి jayaprabha అభిప్రాయం:

    03/05/2013 2:20 am

    భూమి తిరుగుతూ ఉంటుంది కదా రవిశంకర్ , భూమి మీద ఉన్న కొండ మరి తిరుగుతున్న దానిలో భాగమా కాదా 🙂 చరాచరం యూనివెర్స్, తిరుగుతూనే ఉంటుంది అచరాలన్నీ అందులోనివే మరి. అది ఒక నానుడి గానే తీసుకోండి.

    ఇంక అడివిదున్న లో ఫిమేల్ ని ఏమని అంటారూ ? నాకు తెలీదు మీకు తెలిస్తే చెప్పండి. పదమే కదా మారుద్దాం! 🙂

    ఇప్పటికీ చాలా మంది అనివార్యంగా ఎందుకనో మరి మనిషినే కేంద్రంగా చేసుకుని ఆలొచన చేస్తున్నారు. కేంద్ర స్థానం నించి గనక మనిషిని తీసేస్తే మనకి ఈ విశ్వం బహుశా మరొక కోణం నించి అర్ధం అవడం సాధ్యం అవుతుందేమో? కానీ ఆపని చేసేదెవరని?

    పాతుకుపోయిన అనేకానేక భావాలని మార్చడం అంత తేలికేం కాదు. చెట్లతో మాట్లాడండి అన్నామనుకోండి. చెట్టుతో ఎలా మాట్లాడతాం? అంటారు నవ్వి, ఆ సరికి మనిషితో మాట్లాడటం ఏదో మహా సులువైనట్టూ 🙂 పక్షులతో మాట్లాడటం సాధ్యం అయిన వాళ్ళకి మిగిలినవీ అర్ధం కావాలి కదా? కానీ అన్నిసార్లూ కాదు.

    చెట్టుకీ ఒక భాష ఉండే ఉంటుంది. తప్పక ఉంటుంది. కాకపోతే అదేదో మనకి తెలియాలి అంతే! మనకి తెలియనివన్నీ ఈ ఉనికి లోనే లేవనుకునే ఒక మనిషి మనస్తత్వాన్నించి బయటపడాలి కదా ముందు మనుష్యులు. అది సాధ్యమా అని బెంగ కలుగుతూ ఉంటుంది నాకు. లోకరీతుల్ని గమనించినప్పుడు. నా ఈ బెంగ బహుశా మీకు అర్ధం అవొచ్చునని ఆశ. థాంక్యూ.

    జయప్రభ.

  10. అర్జున గురించి రవిశంకర్ అభిప్రాయం:

    03/04/2013 9:32 pm

    చెట్టు ఆత్మకథ చెప్పటం, అదీ కవితాత్మకంగా చెప్పటం, చాలా నచ్చింది. దీనిని చదివినప్పుడు నాకు కూడా “ఒక పువ్వు పూసింది” కథే గుర్తుకు వచ్చింది. చెట్టుకి, నదికి మధ్య చెలిమి కూడా బాగుంది. ప్రకృతిలో హింస సహజమే అయినా, బాధ కలిగిస్తుంది. The Earth సినిమాలో, అమాయకమైన గున్న ఏనుగుని చుట్టుముట్టి చంపే సింహాల గుంపుని చూసినప్పుడు, అప్పుడే పుట్టి సముద్రం వైపుకి నడుస్తున్న చిట్టిచిట్టి సముద్రపు తాబేళ్ళని నోట కరుచుకుపోయే పక్షుల్ని చూసినప్పుడు విపరీతమైన కోపం, బాధ కలుగుతాయి. ఇది తప్పదు. చెట్టు మనిషి స్వరంతో మాట్లాడుతోంది కాబట్టి, దానికి కూడా మానవ స్పందనల్ని ఆపాదించటం సమర్థనీయమే.

    ఇందులో వాడిన రెండు పదాల గురించి చిన్న సందేహం. అడవి దున్న అనే పదం జండర్‌తో సంబంధం లేకుండా వాడతారా? పెంపుడు జంతువుల్లో అయితే, దున్న అని “మగ పశువు”ని మాత్రమే అంటారు కదా? అలాగే, “… చరాచరాల్నీ అడిగాము. వాటికి కూడా భ్రమణం తప్ప మరింక ఏ గతీ తెలియవని అన్నాయి.” అన్నారు – భ్రమణం చరాలకు మాత్రమే ఉంటుంది, అచరాలకు కాదు. – రవిశంకర్