పాఠకుల అభిప్రాయాలు

హనుమంతరావు results: 290

  1. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి విప్లవ్ అభిప్రాయం:

    09/10/2006 7:29 pm

    వేలూరి చెప్పిన అయిదు విషయాలు మక్కీకి మక్కీ:

    1. “మన కవులు అక్షరాస్యులేనా అని గుడిపాటి అడిగిన ప్రశ్నని, కొందరు అది కొన్ని రకాల కవిత్వాన్ని అణగదొక్కటానికి వేసిన ప్రశ్నగా తప్పు అర్థం చేసుకున్నారు.”

    2. “రాసేవాళ్ళు సమర్థులైతే మంచి కవిత్వం రాస్తున్నారు . సమర్థులు కాని వాళ్ళు ఏ భాషలో రాసినా మంచి కవిత్వం రాయలేకపోతున్నారు.”

    3. “కవిత్వపు మంచిచెడ్డలు భాషలో లేవు, అది వాడేవాళ్ళ సమర్థతలో వుండే తేడాల్లో వున్నాయి. ఈ తేడాలని గురించి ఆయా కవులే మాట్లాడాలనీ, తమరంగంలో కవులకి ఎలాటి శిక్షణ కావాలో కవులే చెప్పాలనీ నారాయణ రావు కోరాడు.”

    4. “ఎవరి కవిత్వపు మంచి చెడ్డలు వివరించడానికి, విశ్లేషించడానికి అవసరమైన విమర్శ భావాల్ని, పరిభాషనీ వాళ్ళు తయారుచేసుకోవచ్చు. తయారు చేసుకుంటున్నారు కూడా. ”

    5. “తెలుగు కవిత్వానికీ, విమర్శకీ ప్రమాణాలు కవిత్వం రాసేవాళ్ళూ , విమర్శ రాసేవాళ్ళూ తమలో తాము చర్చల ద్వారా నిర్ణయించాలి. ఏప్రమాణాలూ లేకుండా ఏది రాసినా కవిత్వమే, ఎవరు రాసినా విమర్శే అనే పరిస్థితి ఎవరికీ మంచిది కాదు.”

    వేలూరి గారు చేసిన పై అయిదు ముఖ్యమైన ప్రతిపాదనల్లో (observations అనుకోండి, “ప్రతిపాదన” అనే పదం నచ్చకపోతే) దేనితో కొడవళ్ళ హనుమంతరావు గారు ఏకీభవించడంలేదో నాకు తెలియలేదు. ఆయన రాసినట్లు: “ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.” భిన్నమైన అభిప్రాయాలు శీర్షికలో ప్రశ్న గురించా లేక పైన ప్రస్తావించిన విశయాల గురించా?

    కొడవళ్ళగారికీ, వేలూరికీ ఉన్న భిన్నమైన అభిప్రాయం నాకర్ధమైన వరకూ వ్యాసానికి గుడిపాటి పెట్టిన శీర్షికలో ప్రశ్న “మౌలికమైనదా కాదా” అన్న దాని గురించి మాత్రమే అని నేనర్ధం చేసుకున్నాను, మిగాతావి ఏమైనా ఉన్నయా? (శీర్షిక గురించి వేలూరి గారు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు పైగా, ఆయన మౌలికమైందని మాత్రమే అన్నారు). నేను పైపైన చదవలేదు, ఒకటికి రెండు సార్లు ఈ అభిప్రాయాలన్నీ చదివినా నాకర్ధమవకే ఇంతవరకూ రాస్తున్నాను.

    విప్లవ్

  2. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/10/2006 1:35 pm

    వెల్చేరుతో విభేదం

    అక్షరజ్ఞానులేనా? అన్నది అవమానకరమని చెప్పటానికీ, గుడిపాటి వ్యాసంలో నాకు కనిపించిన కొన్ని లోపాల్ని చూపటానికీ, రాశాను. వెల్చేరు వ్యాసానికి సంబంధించి మొదటి విషయాన్ని దాటి పోలేదు. భేదాభిప్రాయాన్ని మర్యాదగా వ్యక్తపరిస్తే చాలు; అంతకుమించి ఏదో “సాధించాలని” కాదు.

    బహుశా నేను చేస్తున్న పొరబాటు నెలక్రితం వచ్చిన గుడిపాటి వ్యాసం మీద కేంద్రీకరించడం, నాకు తోచిన విషయాలు మాత్రమే తీసుకోవడం, వేలూరి చెప్పినట్లుగా చర్చని సాగించకపోవడం. కాని ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.

    అవమానకరంగా ఉందన్నానుగాని అ, ఆ ల గురించిన ప్రశ్న అనలేదు. ఈ తెలుగు వాడకాన్ని అర్థం చేసుకోడానికి ఇంగ్లీషుని ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. “మన కవులు అక్షరాస్యులేనా?” అన్నది “Are our poets literate?” గా అనువదించుకోవచ్చు. (అదీ సభ్యతగా అనిపించదు.) కాని దాంట్లో మూలానికున్న బలం లేదు. “Do our poets know the ABC of poetry?” అన్నది దగ్గరగా ఉంది. “Do our engineers know the ABC of Computer Science?” అని అడిగితే కించపరిచినట్లే. ”Do our engineers have the right tools and the right training?” అంటే మర్యాదగానే ఉంది, కాని అదీ ఇదీ ఒకటి కాదు.

    నిందార్థం ఏమీ లేదన్నారు వెల్చేరు. అది వారి వ్యాసంలో నిజమే, కాని గుడిపాటి వ్యాసమంతా నిందలతో నిండి ఉంది! మన కవులు పుస్తకాలు చదవరు, వ్యాకరణం నేర్చుకోరు, వారి కవితల్లో స్పష్టత లేదు, కూర్పు లేదు – ఇవన్నీ నిందలే. ఆయన నిందార్థంలోనే వాడారని తెలుస్తుంది. నిందిస్తే తప్పేమీ లేదు – ఇది వాళ్ళ సాహిత్యాన్ని గురించే గాని వ్యక్తిగత జీవితాల గురించి కాదు. కాని అవి అపనిందలు కాదని పాఠకులకి చూపెట్టాలి. ఆయన ఆపని చెయ్యలేదన్నది నా వాదన సారాంశం.

    అలవోకగా రాసిన అభిప్రాయమని ఒప్పుకుంటాను. అది వ్యాసమంత ముఖ్యం కాదు. గుడిపాటి వ్యాసం లోతైన విశ్లేషణతో విస్తృతాధారాలతో కూడి ఉన్నదా? మన కవులు నిరక్షరాస్యులని తేల్చిన వ్యాసంలో ఏమాత్రం పరిశోధనా, తర్కం ఉన్నాయ్?

    ప్రధాన విషయాన్నించి దారిమళ్ళించలేదు. liberal education లో శిక్షణ ఉండి కూడా ఇలా ఎలా రాశావంటున్నారు. శిక్షణ “ఉండి కూడా” కాదు; “ఉండటం వల్లనే” రాశాను. వివరించే ముందు liberal education అన్నదానికి ఒక నిర్వచనం:

    “Liberal education, which consists in the constant intercourse with the greatest minds, is a training in the highest form of modesty, not to say of humility. It is at the same time a training in boldness: it demands from us the complete break with the noise, the rush, the thoughtlessness, the cheapness of the Vanity Fair of the intellectuals as well as of their enemies. It demands from us the boldness implied in the resolve to regard the accepted views as mere opinions, or to regard the average opinions as extreme opinions which are at least as likely to be wrong as the most strange or the least popular opinions.” — Leo Strauss.

    నాకు ప్రధాన విషయం గుడిపాటి వ్యాసం. దాని ప్రతిపాదన ఇది – అక్షరాస్యత అంటే స్పష్టత, భాషాధికారం, అధ్యయనంపై ఆసక్తి; కొద్ది మంది తప్ప మనకవులంతా నిరక్షరాస్యులు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఈ ప్రతిపాదనకి వ్యాసంలో ఆధారాలేవీ చూపెట్టలేదు. ఆయన చెప్పేదంతా “నాకీ కవులంతా తెలుసు, నమ్మండి” అన్నట్లుగా ఉంది గాని scholarly article లో ఉండాల్సిన పస లేదు.

    నేను తమ్మినేని వ్యాసాన్ని ఎందుకు ఉదహరించాను? అనువాద కవిత్వం గురించి కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని కొన్ని కవితల విశ్లేషణ ద్వారా సమర్థించాడు. అది నాకు scholarly article అనిపించింది. గుడిపాటి అలాంటిది చెయ్యలేదు, కనీసం ప్రయత్నించలేదు. ఆయన సమస్య చాలా విస్తృతమయిందంటారా? కవిత్వమంతా తీసుకోవాల్సిన పనిలేదు. వ్యాసం చదివేవాడికి గూడా బుర్ర ఉంది. ఆయన ప్రస్తావించిన కొన్ని రకాల కవిత్వ వాదాల్లో ఏదో ఒకదానిని తీసుకొని ఆ కవికో కవులకో అస్పష్టత, అనధికారం, అనాసక్తి ఉండటాన వారి కవితలెంత హీనమయ్యాయో చూపెట్టొచ్చు.

    అలా చేస్తే ఆయన వాదానికి బలం చేకూరడమే కాక అంతకన్న ముఖ్యమైన ప్రయోజనమొకటి కలిగేది. అదేంటంటే ఏది మంచి కవిత్వమో ఎందుకో కొంతైనా పాఠకుడికి తెలిసేది. గుడిపాటి వాద విధానంలోని లోపాన్ని వేరే వ్యాసంతో పోల్చి చూపెట్టాను. అది liberal education ఇచ్చిన శిక్షణలో లోపమనుకోను.

    “పరమ వినయంగా” దాటేయడం గురించి. వినయాన్ని వెల్లడించ లేదు, చూపాల్సిన సందర్భమూ కాదది. వెల్చేరు గారి వ్యాసం లోతుల్లోకి వెళ్ళని మాట నిజమే. కాని వారు కవుల్నీ విమర్శకుల్నీ చర్చకి పిలిచారు కాని పాఠకుల్ని వదిలేశారు.

    “గుడిపాటీ, నేనూ … చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబంధించింది కాదు. వ్యవస్థకి సంబంధించినది…”

    శిక్షణా సంస్థల గురించి గుడిపాటి ప్రస్తావించ లేదు. అది వెల్చేరు గారి “వివరణ” వ్యాసంలో ఉంది. నేను దానిని గురించి రాయలేదు. గుడిపాటి వ్యాసంలో అర్థంకానంత క్లిష్ట విషయాలేమీ లేవు. అదంతా వ్యక్తుల గొడవే. అస్పష్టత, అనాసక్తి, అవగాహనా రాహిత్యం, పుస్తకాలు చదవక పోవడం – ఇవన్నీ వ్యక్తుల్లో లోపాలు. ఈ లోపాలు కొన్ని వందల కవుల్లో ఉండటాన ఇది వ్యవస్థకి సంబంధించిందని వెల్చేరు అభిప్రాయం కావొచ్చు. దాని గురించి మరో సారి మాట్లాడదాం.

    కొడవళ్ళ హనుమంతరావు

  3. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి వెల్చేరు నారాయణ రావు అభిప్రాయం:

    09/09/2006 10:57 am

    కొడవళ్ల హనుమంత రావుగారు ఈ మాటలో వేలూరి సంపాదకీయం మీద రాసిన అభిప్రాయం/విమర్శ ఎందుకు, ఏంసాధించడానికి రాశారో నాకు అర్థం కాలేదు. కానిఅందులొ కొన్నిమాటలు వార్త లో నేను రాసిన వ్యాసానికి సంబధించినవి కాబట్టిఈ నాలుగు వాక్యాలూ ఇక్కడ రాస్తున్నాను.

    మొదటి సంగతి: గుడిపాటి అడిగిన మన కవులు అక్షరాస్యులేనా అన్న ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని, నేను ఆ ప్రశ్న తిప్పి మన విమర్శకులు అక్షరాస్యులేనా అని అడిగిన ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని నిందార్థం ఏమీ లేదని, వాళ్ళకి అ ఆ లు వొచ్చునా అని ఆ మాటకి అర్థం కాదనీ, ఇంగ్లీషులో cultural literacy, fiscal literacy అనే మాటల్లో literacy లాటిది ఈ అక్షరాస్యత అనే మాట అనీ హనుమంతరావు గారికి తెలియలేదని నేను అనుకోలేకపోతున్నాను. అది ఆయన ఊహకి అందనంత గహనమైన విషయం కాదు. నా వ్యాసం చివరదాకా చదివితే, నేను ఆ వ్యాసంలో అడిగిన ప్రశ్నలు చూస్తే ఈ విషయం తేలిగ్గానే తెలుస్తుంది. ఆయన నా వ్యాసం పూర్తిగా చదవలేదనీ, నేను ఆవ్యాసంలో వేసిన ప్రశ్నలు — తెలుగులో విమర్శకులు తయారవడానికి అందుబాటులో వున్న అవకాశా లేమిటి, వాళ్ళు చదవ వలసిన పుస్తకాలు, పొందవలసిన శిక్షణ ఏమిటి — అనేవి ఆ సంగతుల మీద తెలుగులో ప్రముఖ విమర్శకులు దృష్టిపెట్టేట్టు చెయ్యడానికి వేసిన ప్రశ్నలు అని హనుమంతరావు గారు బోధపరుచుకోలేక పోయారనీ కూడా నేను అనుకోవడం లేదు. పైగాఈ చర్చలలో ప్రధాన విషయాన్ని ఆయన గమనించలేదని అనుకోడానికీ వీలులేదు: “వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది. ” అని ఒక అభిప్రాయం చెప్పారు కాబట్టి. కాని ఆయన పరమ వినయంగా ఈవిషయాన్ని, దీనికి సంబంధించిన వివరాల్నీ వొదిలేసి ఆయనకి ఇష్టమైన మరో విషయంలోకి తన వ్యాఖ్యానాన్ని మళ్లించారు.

    ఈ దేశంలో liberal education లో భాగంగా చర్చని ప్రధాన విషయాల మీద కేంద్రీకరించే పద్ధతీ, అప్రధాన విషాయలవేపు మళ్లకుండా వుండే జాగ్రత్తలూ నేర్పుతారు. ఈ శిక్షణని హనుమంతరావు గారు పొందలేదని నేను అనుకోను. అయినా ఆయన అసలు విషయాన్ని వొదిలేసి మరొక దారి లో వ్యాఖ్యానాలు చెయ్యడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి.

    తెలుగు సాహిత్యరంగంలో ఆయన కోరుకునే రకమైన పుస్తకాలు రావడంలేదు. ఆయనకి బోధపడేలా ఉదాహరణలూ దృష్టాంతాలూ ఉన్న పుస్తకాలూ, వ్యాసాలూ ఎవరో ఒకరు తప్ప ఎక్కువమంది రాయడం లేదు. ఇది ఆయన లేవనెత్తుతున్న సమస్య. ఈ సమస్య చాలా ముఖ్యమైనది, వివరంగా చర్చించదగినదీని. ఇది అయితే దీన్ని గురించి వేరే వ్యాసంలో పరిశీలన చెయ్యాలి. అంతేకాని వేలూరి వెంకటేశ్వర రావు రాసిన సంపాదకీయం మీద అలవోకగా చేసే వ్యాఖ్యానంలో భాగం చెయ్యకూడదు.

    (హనుమంతరావు గారిని ఇంతగా మథనపెడుతున్న ఈ సమస్య ని ఈమాట లో వివరంగా చర్చించడానికి వొచ్చే నెల సంచిక కోసం నేను ఒక వ్యాసం రాస్తున్నాను. అది ఈమాటలో ప్రచురించబడితే అప్పుడు ఆ విషయం ప్రధానవిషయంగా చర్చలు కొనసాగుతాయని ఆశిస్తాను.)

    వార్తలో గుడిపాటీ, నేనూ, ఆ తరవాత ఈమాటలో వేలూరి చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబధించినది కాదు. వ్యవస్థ కి సంబంధించినది. తెలుగులో కవులూ, విమర్శకులూ శిక్షణ పొందడానికి ఎలాటి సంస్థలు ఉన్నాయి? ఈ రంగం లో ప్రమాణాలు ఎలా నిర్ణయించ బడతాయి? తెలుగు సాహిత్య రంగం కేవలం ఔత్సాహికులు ప్రధానంగా వుండే రంగంగా ఉండి పోకుండా ఇది professionalize ఎలా అవుతుంది? ఈ ప్రశ్నలు ముందు ఈరంగంలో వున్న పదిమందీ వేసుకుంటే — వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో తెలుగు సాహిత్య రంగం వ్యవస్థీకరించ బడడానికి అవసరమైన సంస్థల్ని నిర్మించే ఆలోచనలు చేస్తారని ఒక ఆశ.

    ఈ చర్చ తెలుగు దేశం లోనే జరగ వలసిన అవసరం లేదు. వేలూరి అన్నట్టుగా తెలుగు ప్రపంచ భాషగా ఎదుగుతోంది. అంచేత ఇందులో మనకి కూడా జాగా వుంది.

    VNR

  4. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/04/2006 1:33 pm

    నేను కవినీ కాదు, విమర్శకుణ్ణీ కాదు. కాని ఓ పాఠకుడిగా “మన కవులు అక్షరాస్యులేనా?” అన్న ప్రశ్న అవమానకరమైన మకుటమనిపించిందిగాని మౌలికమైన ప్రశ్నగా అనిపించలేదు. “ఎదుటివారి అభిప్రాయాలనూ వ్యక్తిత్వాలనూ గౌరవించగల పెద్ద మనిషి తరహా” ఉండాలని చెప్పిన వెల్చేరు గారు కూడా “మన విమర్శకులు అక్షరాస్యులేనా?” అని అడగడం ఆశ్చర్యమేసింది. వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది.

    గుడిపాటి తన వ్యాసంలో మన కవుల గురించి చెప్పిన విషయాలు – వేరే వాళ్ళ కవిత్వాన్ని చదవరు, కవిత్వం మీద వచ్చే వ్యాసాల్నీ, సమీక్షల్నీ చదవరు, చదివినా తమ పేరుందో లేదో అన్న ధ్యాసే గాని ఏమి రాశారో అన్న ఆసక్తి లేదు … – ఆ కవులకి సన్నిహితంగా మెలగడాన తెలిసిన సమాచారం కావచ్చు. వాటి గురించి కవులతో కనీసం ముఖ పరిచయం కూడా లేని నాలాంటి పాఠకుడు చర్చించడం వీలవదు.

    వెక్కిరింపులూ, అపహాస్యాలూ మన సాహిత్య చర్చల్లో అనివార్యమయినట్లుంది. అయినా వాటితో పాటు నాలుగు ఉపయోగపడే మాటలు, కాసిని ఉదాహరణలతో చెప్తే నాబోటి వాడు అన్వయించుకుని బోధపరచుకుంటాడు.

    వాడుక భాషలో రాయడంలేదని వాపోయిన రంగనాయకమ్మ రాసిన పుస్తకం చదివితే వాడుక భాష గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది. మాతృభాషే అయినా తెలుగు భాషా స్వరూపం తెలియని యువకుల్ని చూసి బాధ పడ్డ బూదరాజు రాసిన పుస్తకాలు చదివి కొంతయినా వ్యాకరణ జ్ఞానం పెంచుకోవచ్చు.

    అలాగే మన కవిత్వ, విమర్శ రంగాల దుస్థితిని చూసి విచారించేవాళ్ళు కూడా వాటిని సవరించడానికి కృషి చేస్తే బావుణ్ణు. డబ్బుకీ, కీర్తికీ, అవార్డులకీ, రాజకీయాలకీ మన కవులు అమ్ముడు పోయారంటున్నారు. అలాంటి ప్రముఖుల కవితా సంకలనాల్ని కొన్నిటిని తీసుకొని సహేతుకంగా విమర్శించండి. శబ్దం, రూపం, లయ, అవగాహన, పాండిత్యం ఎలా లోపించాయో వివరించండి. వారాల తరబడి జరిగిన చర్చలో ఆరోపణలకు కొదవ లేదు గాని ఉదాహరణలు మాత్రం శూన్యం!

    నాకీ విషయంలో సమకాలికుల్లో తమ్మినేని యదుకుల భూషణ్ ఒక్కరే ఆపని చేస్తున్నట్లనిపిస్తుంది. ఉదాహరణకి నిన్ననే చదివిన వారి వ్యాసం, “ఉమర్ ఖయ్యాం – ఉదాహరణలు.” అనువాదానికి ఉండాల్సిన లక్షణాలేమిటో చెప్పి, మూలంలోని రుబాయి నొకదాన్ని తీసుకొని, కరుణశ్రీ, ముద్దుకృష్ణ మొదలైన వాళ్ళ అనువాదాలు ఎందుకు లోపభూయిష్టమో, చలం, ఆదిభట్ల అనువాదాలు ఎందుకు ఉన్నతమైనవో వివరించారు.

    విశేష ప్రతిభావంతుడనిపించే తమ్మినేని కున్న లోపం తనకి నచ్చని వాళ్ళని ఎద్దేవా చెయ్యటం, పెద్దమనిషి తరహా లేకపోవడం. “బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా” (?) అన్న వేమన వేదాంతం బాగా వంటబట్టించుకున్నట్లుంది. గుద్దులు తిన్నా, చదివినవాడికి కవిత్వం గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. తెలుగు నవలలో అస్తిత్వ వాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/01/2006 11:24 pm

    నవీన్ గారు తమ ప్రసంగ ప్రారంభంలో అస్తిత్వవాదాన్ని పరిచయం చేసి అది అమెరికా జీవితానికి ఎలా సరిపడుతుందో వివరించారు. అమెరికాలో సామాజిక నియమాలు, కట్టుబాట్లు పెద్దగా పనిచెయ్యవు, వ్యక్తి పూర్తిగా స్వతంత్రుడు, అనుకున్నది సాధించగలడు, భారతదేశపు సమాజం అందుకు విరుద్ధంగా ఉంది అని అభిప్రాయపడ్డారు.

    అస్తిత్వవాది Sartre అన్న మాటలని – “మానవుడు సర్వ స్వతంత్రుడు. అంతేకాదు. మానవుడు స్వేచ్ఛా శాపగ్రస్తుడు. స్వతంత్రుడుగా తప్ప మరొకలా ఉండలేడు” – నవీన్ విపులీకరించారు.

    నవీన్ గారు అమెరికా రావడం ఇదే మొదటిసారి. వారు ఇక్కడి జీవితాన్ని చూసి చేసిన వ్యాఖ్యానాన్ని విన్న వెంటనే నాకు Sartre ఏమనేవాడో అనే కుతూహలం కలిగింది. వెతికితే, 1946లో Sartre మొదటిసారి అమెరికా సందర్శించి రాసిన వ్యాసం కనబడింది. అది కొందరికన్నా ఆసక్తిదాయకంగా ఉండొచ్చని ఇస్తున్నాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  6. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/09/2006 5:52 pm

    “అనుక్షణికం”ని సజీవ నవలగా ఏ రీతిలోనూ సమర్థించే సామర్ధ్యత నాకు లేదు. ఆసక్తి ఉన్నవాళ్ళు వేగుంట మోహన్ ప్రసాద్ 2004 లో రాసిన “”అనుక్షణికం-భాష, భాషణ” వ్యాసాన్ని “వెన్నెల నీడలు” సంపుటిలో చదవచ్చు.

    అయినా, మనిషికి కావాల్సిన జ్ఞానమంతా తాజాగా దినపత్రికలలో సులభంగా దొరుకుతుంటే, “అనుక్షణికం” ఏం ఖర్మ, దాదాపు ప్రపంచ సాహిత్యమంతా బూజుపట్టిన పాత చింతకాయపచ్చడి కాదూ?

    చర్చలో ఇప్పటికే పరిమితిని దాటి పాల్గొన్నాను; “ఈమాట” మరో “రచ్చబండ” కావాలనే కోరిక నాకే కోశానా లేదు. సెలవ్.

    కొడవళ్ళ హనుమంతరావు

  7. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/09/2006 10:27 am

    నేనా వ్యాసాన్ని నాకు తెలిసిన ప్రాంతపు భాషలో రాశాను. ఆభాషలో ఒత్తులు, దీర్ఘాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన నియమాల్ని పాటించడంలో జాగ్రత్త తీసుకోకపోవడం – అందునా ఓ సాహిత్యపత్రికకి రాసేదాంట్లో – నా అజ్ఞానాన్నీ బద్ధకాన్నీ తెలుపుతుంది గానీ, అదేదో అభ్యుదయం అని సమర్థించుకుంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.

    ఆ నియమాలు అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా ఉండవని నాకు తెలుసు. ఆ తేడాలని గౌరవించేపాటి సంస్కారం ఉంది. “మెజారిటీ” సంగతేమోగాని, మన ఆధునిక సాహిత్యంలో వేరు వేరు ప్రాంతాల రచయితలు వారి వారి భాషలో రాశారు; వాటిని ఇతర ప్రాంతాల ప్రజలు గూడా బాగానే ఆదరించారు. ఒకే రచనలో అనేక పాత్రలతో ఆయా ప్రాంతాల, వర్గాల భాషలో సంభాషణలు నడిపించిన నవలొకటి గత శతాబ్దానికే తలమానికంగా నిలిచింది:

    “Overwhelmed by sorrow – అంటే యేమిటి?” అని అడిగింది గంగి, పుస్తకంలో వొక పేజీలో గుర్తుపెట్టుకున్న చోట తీసి చూస్తూ.
    “సారో అంటే తెలుసుగా విచారం, దుఃఖం. వోవర్ వ్వెల్మింగ్ అంటే – ” అని రెప్పలు మూతపడని కళ్ళతో, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – గంగి” అన్నాడు అనాలోచితంగా.
    పగలబడి నవ్వింది, గంగి.
    రవి అలాగే చూస్తున్నాడు.
    నవ్వు ఆపుకుని, “యాడున్నవ్ సారూ? పాఠం చెప్తున్నవా, కార్కాన్ల వున్నవా?” అంది.

    తేరుకుని, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – యేదైనా వొక భావంగానీ అనుభూతిగానీ ఫీలింగ్ గానీ – సంతోషమో విచారమో అసూయో ద్వేషమో ప్రేమో యివి యేవీ కాని మరేదో అనిర్వచనీయ భావమో – అట్లాంటిది యేదో వుక్కిరిబిక్కిరిగా పుక్కిలింతలుగా నిర్వీర్యంకాని అశక్తతగా చేసినట్లుగా – ” అని ఆ తరవాత యేం చెప్పాలో రాక ఆగిపోయాడు.
    “నువ్వు చెప్పేది అర్థంకాకపోయినా నువు చెప్తుంటే వింటం బావుంటుంది” అంది.
    రవి ఫక్కున నవ్వాడు.
    “దేన్కి?” అంది కోపంగా.
    “నీ మాటకి. నీ అనుకరణకి నవ్వొచ్చింది” అన్నాడు.
    “నీలాగా మాట్లాడదాఁవని.” అంది.
    నవ్వు ఆపుకుంటూ “దేనికి?” అన్నాడు.
    “మా మాట బగ్గడ్ గుంటదిలే! మీ ఆంద్రోళ్ళు మంచిగ మాట్లాడతరు” అంది.
    “నేను ఆంధ్రావాణ్ని కాదు. తెలంగాణావాణ్నే” అన్నాడు.
    “యేదొకటి. నీ మాట అట్లానే వుంటది. నాకు మంచిగ అనిపిస్తది – ఆతీరు మాట్లాడేది. నా మాట మంచిగుండదులే” అంది.
    “బావుంటం అనేది మాటలోకంటే, ఆ మాట్లాడే మనసులో మనిషిలో భావంలో వుంటుంది! పుట్టిపెరిగిన ప్రాంతపు వాతావరణాన్ని బట్టి మాట తీరు వుంటుంది. వొక్కొక ప్రాంతంలో వొక్కొక రకంగా మాట్లాడతారు. మనసులు మంచివైతే ఆ మాట్లాడే తేడాలు అంత ముఖ్యంకాదు.” అన్నాడు.
    “కాని నా కెందుకో అట్ల మాట్లాడితె మంచిగా అనపిస్తుంది. అటు ఆంధ్రుల అట్లనె మాట్లాడతరు గద?” అంది.
    “లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపూరు చిత్తూరుల వరకు తీసుకుంటే చాలా తేడాలుంటయ్. ఐతే చదువుకుని నాలుగు ప్రదేశాలు చూసిన వాళ్ళు అంతా షుమారుగా అందరూ వొక మాదిరిగానే మాట్లాడతారు. రాస్తారు. దానిని మధ్య సర్కారాంధ్ర భాష అనవొచ్చు. పుస్తకాలలో, సినిమాల్లో, రేడియోలో, పత్రికలల్లో మనం సర్వసాధారణంగా చదివే వినేభాష అది. – ”

    — “అనుక్షణికం,” పేజీలు 267-268.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/07/2006 7:42 pm

    విప్లవ గారన్న ఈక్రింది మాటలు నాకు సరిగా అర్ధం కాలేదు:

    “ఈ బాట ఇట్లనే పట్కోని పోతె మాటల్లోంచి జారిపోయేటివి ఒత్తులు దీర్ఘాలే, సంధులు సమాసాల తర్వాత. వెయ్యేండ్ల గ్రాంథికం ఒకటి కానప్పుడు వందేండ్ల వ్యవహారికం ఒకలాగనే ఉండాలంటె కష్టం. జాగ్రత్త పడేటోళ్ళు పడొచ్చు. లేకపోయినా భాష ఆగదు.”

    ఒత్తులు లేకుండా గాని తప్పుడు ఒత్తులతో గాని రాయడం, మాట్లాడటం వాడుకభాషా? “భాద,” బాథ,” “బాద,” ఇలాంటివి చూస్తే నాకు బాధేస్తుంది. అలారాసేవాళ్ళు తెలియకనే రాస్తున్నారనుకుంటాను – నేను చేసిన పొరబాట్ల లాగా. కాదు, ఆప్రాంతంలో అలాగే మాట్లాడతారు అంటే, అది సబబే.

    కొడవళ్ళ హనుమంతరావు

  9. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/06/2006 6:12 pm

    పొరబాటు సరిచేసినందుకు సాహితిగారికి కృతజ్ఞతలు. భాషావేత్త గురించిన వ్యాసం కాబట్టి మరికాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకొని రాయాలి అని గుర్తున్నా, తప్పులు దొర్లాయి. ప్రత్యేకంగా ఆయన “ఒత్తక్షరాలను (మహాప్రాణాలను) రాయటంలో ఎంతో జాగ్రత్త అవసరం,” చదువుకోని వారి వాడుకలో ఈ భేదం లేదుగాని, చదువుకున్నవారు ఈ భేదం గుర్తించాలని, కాస్త వాత గూడా పెట్టారు. ఉదాహరణలు ఇచ్చారు: అర్థం, అర్ధం; శోధ, శోథ; పలం, ఫలం; గాతం, ఘాతం; కరం, ఖరం.

    చదివి highlight చేసుకున్నాను గాని రాసేటప్పుడు జాగ్రత్త పడలేదు!

    కొడవళ్ళ హనుమంతరావు

  10. నౌషాద్‌ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/04/2006 9:52 am

    తండ్రిని మించిన తనయుడు

    సంగీతం గురించి కనీసపు జ్ఞానం లేకపోయినా నేను రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు చదవడానికి కారణం వారి నిరాడంబర భాషా, శైలీ, క్లిష్టమైన విషయాలను విడమరచి సులభంగా చెప్పే నేర్పూ.

    నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇతర రాష్ట్రాలకన్నా తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా వున్నా కూడా సంగీతంలో ప్రవేశం మనవాళ్ళకంటే వేరే రాష్ట్రాలవాళ్ళకే ఎక్కువున్నట్లనిపించేది. ముఖ్యంగా మనప్రక్కవాళ్ళే అయిన తమిళయన్లలో, ప్రతివాళ్ళూ గాత్రమో వాయిద్యమో చిన్నప్పుడే నేర్చుకునేవాళ్ళని విన్నాను. మనవాళ్ళకి ట్యూషన్లు, కోచింగ్లతో సంగీతానికి సమయం మిగులుతున్నట్లు లేదు. (పల్లెటూళ్ళలో, చిన్న పట్టణాలలో, రెండు మూడేళ్ళకోసారి వెళ్ళి పదిరోజులుండి చూసి ఏర్పరచుకున్న అభిప్రాయమిది; వాస్తవం కాకపోవచ్చు.)

    చిన్నప్పుడే, 3-7 ఏళ్ళ మధ్య ప్రతిబిడ్డకూ ఏదో ఒక కళమీద గురి కుదురుతుందనీ, ఆ అభినివేశం పెద్దయ్యాక ఏర్పడటం దాదాపు అసంభవమనీ, చిన్నప్పుడే తగిన వాతావరణం కలిగించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళకుందనీ కొకు రాశాడు. పాటల్లోపడితే చదువులు పాడవుతాయని తల్లిదండ్రులకి సహజమైన భయం వుండొచ్చుగాని, దానికి కాస్త మందలింపు సరిపోవచ్చు:

    “మా ప్రసాద్ సితార్ తో చదువు పాడు చేసుకోవటం నాకంతగా ఇష్టం లేదు. వాడు పరీక్షలప్పుడు కూడా relax కావటానికి ఓ అరగంట వాయించుకుంటే నేను అభ్యంతరం చెప్పను. కాని social functions లో వాయిస్తే ఇక mind చదువుమీదికి పోదు. ఆమధ్య వాడి స్నేహితులు చిన్న పార్టీ ఏర్పాటు చేసి వాడి చేత రెండున్నర గంటలు సితారు వాయింపించారట. అందులో వున్న ప్రమాదం వాడికీ తెలుసు. అందుకని దాని జోలికిపోక చదువుకోమని రాశాను. డిసెంబరు సెలవుల్లో నెలరోజులూ సితారే వాయిస్తాడు. summer holidays అంతా వాడికి మరోపని వుండదు. వాడికి వ్యక్తిత్వం లేకపోవటమేమిటి? సైన్సులోనూ, సంగీతంలోనూ నాకు వాడు చాలా విషయాలు చెప్పగలడు. నాకున్న వ్యసనాలు కూడా ఆరెండే. అందుచేత వాటిలో నన్ను ఇప్పటికే మించి ముందుకు వెళ్ళాడు.”
    — కృష్ణాబాయికి 11-11-1968 న కొకు రాసిన ఉత్తరం నుండి.

    కొడవళ్ళ హనుమంతరావు