పాఠకుల అభిప్రాయాలు

హనుమంతరావు results: 290

  1. నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/28/2007 10:56 am

    రూపాల్లో భేదం – ఓ సందేహం

    ముందుగా, తానా అవార్డు అందుకున్నందుకు వెల్చేరు గారికి అభినందనలు. తెలుగు భాష, సాహిత్య, చరిత్రలపై వారు చేస్తున్న నిర్విరామ కృషి ముందుతరాల వారికి మార్గదర్శకం. వేలూరి గారి వ్యాసం వెల్చేరు గారి బహుముఖ పాండిత్యానికి అద్దం పట్టేటట్లుంది..

    కాని వ్యాసం మొదట్లో అన్న మాటలు – “వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది” – నన్ను చాలా తికమక పెట్టాయి. కాల్పనిక కథకి ఒక్క రూపమే ఉండటమేమిటి? దానిని అంత నొక్కి చెప్తున్నారంటే గొప్ప ప్రాధాన్యత ఉండాలి – అదేంటో నాకర్థం కాలేదు, వేలూరి గారివీ విప్లవ్ గారివీ ఉదాహరణలు సాయపడలేదు.

    సరే, David Shullman అంత పండితుడికే అంతుపట్టని విషయం నాకు అవగతం కాదులే అని సమాధానపడ్డాను. ఇంతలో Dr. Mittapalli వ్యాసంపై నేను వెలిబుచ్చిన అభిప్రాయనికి బదులు రాస్తూ ఓ మిత్రుడు, చెప్పుకోదగ్గ చదువరి, వెల్చేరు రాసిన ఒక వ్యాసం – “When Does Sita Cease To Be Sita? Notes Toward a Cultural Grammar of Indian Narratives” – చదివారా అని అడిగారు. రామాయణం గురించి లవకుశ లాంటి సినిమాలు చూడటం వలన కలిగిన జ్ఞానం కన్నా మించి నాకు లేదు; అలాంటి లోతైన వ్యాసాలు నేనేమీ చదవలేదు మహానుభావా అనుకొని, ఆమధ్య Berkeley వాళ్ళు చవగ్గా అమ్ముతున్నారు కదా అని కొని చదవని ఓ రామాయణం పుస్తకం [1] ఇంట్లో ఉంటే దాంట్లో దీనికి సంబంధించినదేమన్నా ఉండొచ్చు అని తీశాను. దాని మొదటి పేజీలో ప్రస్ఫుటంగా వేసిన వెల్చేరు వాక్యం నన్నాకర్షించింది:

    “Fiction has only one form. True story has inevitably many.”

    దీన్ని నేను తెలుగులోకిలా తర్జుమా చేసుకున్నాను: “సామాన్య కథకి ఉండేది ఒకటే రూపం. కాని సజీవ కథకి సహజంగానే అనేక రూపాలుంటాయి.” నేను పైపైన చదివిన ఆ పుస్తకంలో రామాయణ కథకి గల అనేక రూపాలని వివరించారు. కాలం మారేకొలదీ, సామాజిక పరిస్థితుల్ని బట్టి ఈ కథ కెన్ని మార్పులూ చేర్పులూ చేరాయో విశ్లేషించారు. ఇది నాకర్థమయింది.

    కాని ఆ తిరుపతి మండుటెండలో గంగమ్మ జాతర ఊరేగింపు చూస్తూ వెల్చేరు అన్న మాటల్లో అంతరార్థం ఏమిటో నాకింకా బోధ పడలేదు. అక్కడ అన్నదీ, ఇక్కడ [1] అన్నదీ ఒకటేనా? వేరా?

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:

    [1] “Questioning Ramayanas: A South Asian Tradition,” Edited by Paula Richman. Univesity of California Press, 2001. దీంట్లోని వెల్చేరు వ్యాసం, “The Politics of Telugu Ramayanas: Colonialism, Print Culture, and Literary Movements,” చదవదగ్గది. గత శతాబ్దంలో మన సాహిత్యంలో రామాయాణం మీద వచ్చిన అనేక రకాల రచనల్ని వాటి వెనకవున్న సామాజిక కారణాలపరంగా విశ్లేషించారు.

  2. Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/21/2007 12:09 am

    Indian Complex – ఆధారం లేని సిద్ధాంతం
    ఆసక్తి కలిగించిన వ్యాసమే కాని రాజేశ్వర్ గారితో నేను అంగీకరించే వాటికన్నా అంగికరించని విషయాలే ఎక్కువ వున్నాయి. సాహితీ విమర్శ కానీ, మానసిక విశ్లేషణ కానీ నా సబ్జక్ట్స్ కావు – నేను రాసేదానికి ఆధారం ఓ శనివారపు సాయంకాలపు చదువు వలన కలిగిన అవగాహన మాత్రమే. ముందుగా రాజేశ్వర్ గారన్న రెండు మూడు స్వల్ప విషయాలు:

    “Alpajeevi, together with Buchibabu’s Chivaraku Migiledi (That Which Remains at the End), heralded modernism in Telugu fiction by lending it a new psychological depth. Prior to their publication Telugu novels tended to be patently romantic in orientation and thus hardly served the purpose of truth—psychological or social.”

    “చివరకు మిగిలేది” 1946లో, “అల్పజీవి” 1956లో వచ్చాయి. వీటికి ముందర తెలుగు నవలోద్యానవనం మూడుఫువ్వులూ ఆరు కాయలుగా వికసించిందని ఎవరూ అనరు కాని అది బీటలు బారిన బీడు నేల మాత్రం కాదు. చలం రచనల్ని (మైదానం, 1926) వట్టి రోమాన్స్ అని కొట్టిపారేసినా, ఉన్నవ “మాలపల్లి” (1926), విశ్వనాథ “వేయిపడగలు” (1939), గోపీచంద్ “అసమర్థుని జీవయాత్ర” (1945), కొడవటిగంటి చదువు (1946), ఉప్పల “అతడు-ఆమె” (1950) – ఇవన్నీ “అల్పజీవి” కన్నా ముందర వచ్చినవే! అవేవీ “ఆధునికత”ని ఆవిష్కరించలేదనడం వాస్తవం కాదు. దాదాపు అదే కాలంలో వచ్చిన శ్రీదేవి “కాలాతీత వ్యక్తులు” (1958) కూడా చెప్పుకోదగ్గ నవల.

    “The term [Inferiority Complex] was originated by Alfred Adler, the onetime disciple of Sigmund Freud and the founder of Individual Psychology.”

    మనం “వేలు చీకడం లో సెక్స్ ఉందన్న” ఫ్రాయిడ్ సిద్ధాంతానికీ ప్రతి ఒక్కరి జీవితమూ ఆత్మన్యూనతతోనే మొదలవుతుందన్న ఆడ్లర్ సిద్ధాంతానికీ చాలా తేడా ఉంది. గత శతాబ్దపు మొదట్లో ప్రాచుర్యంలోకొచ్చిన “Psycho Analysis” శాస్త్రానికి ఆద్యుడైన Freudకి ఆడ్లర్ సహచరుడు కావచ్చు కాని అనుచరుడు మాత్రం కాదు. అలా అన్నవాళ్ళ పట్ల ఆడ్లర్ చాలా చిరాకుపడ్డాడు [1].

    రాజేశ్వర్ గారు చెప్పే ముఖ్య విషయానికొద్దాం:

    ”[Subbayya’s] inferiority complex is however not the same as propounded by Adler. Society as a whole, and his own wife as well, regard Subbaiah as a feckless fellow. But in reality he is a law-abiding and god-fearing man, even if unabashedly pusillanimous.”

    సుబ్బయకున్న ఆత్మన్యూనతకీ ఆడ్లర్ ప్రతిపాదించినదానికీ తేడా ఏమిటో వివరించలేదు. చుట్టూ వున్నవాళ్ళు అతన్ని తేలికగా చూసిన మాట నిజమేకాని, వాళ్ళలా చూడటానికి కారణం కేవలం అతని స్వభావం – వ్యక్తిత్వం లేని స్వభావం. ఆ స్వభావాన్ని మార్చడానికి వాళ్ళు ప్రయత్నించకపోగా దానిని మరింత తీవ్రం చేశారంటే ఒప్పుకోవచ్చుకాని, వాళ్ళ ప్రవర్తన అతని ఆత్మన్యూనతకి మూలకారణం గానీ ముఖ్యకారణం గానీ కాదు.

    సుబ్బయ్య “ఒట్టి చచ్చు దద్దమ్మ” కావడానికి కారణం అతని జీవితంలో మాతృప్రేమ మృగ్యం కావడమే. తల్లి మరణం, సవతి తల్లి క్రూరత్వం అతన్ని తండ్రి ప్రేమించినా అతనూ సుబ్బయ్య సరిగా పెరిగి పెద్దయేలోగానే చనిపోవడం. వీటికితోడు, తండ్రిని కొట్టిన సంఘటన సుబ్బయ్య మనసులో చెరగని ముద్రవేసి, భయానికి కారణమయింది. ఇలా చూస్తే, సుబ్బయ్యకున్న ఆత్మన్యూనత ఆడ్లర్ చెప్పినదానికి చాలా దగ్గరగా ఉంది.

    కోస్తా ప్రాంతాల్లో అగ్రకులాల్లో ఆడవాళ్ళకున్న ఆధిక్యత కి, అది నిజంగా ఉన్నా లేకపోయినా, ఈ వ్యాసంలో రాజేశ్వర్ అనవసరమైన ప్రాముఖ్యత కల్పించారు.

    ”Like Subbaiah, the other important male characters of the novel too had gone through traumatic experiences early in their lives. For example, Venkat Rao was robbed of whatever material wealth he could have inherited from his spendthrift father by his own maternal uncle and a long-standing employee of his zamindari household, and Gavaraiah suffered the ignominy of his wife cheating on him. These experiences, devastating as they are, instead of psychologically destabilizing these two men, only transformed them into hardened individuals. Subbaiah’s experiences, naïve by comparison, have made him only a weakling and psychological wreck. There is thus certainly something innate, and something very ‘Indian’ in him that has subjected him to inferiority complex and made him the man he is”

    వెంకటరావు, గవరయ్య, సుబ్బయ్య – వీళ్ళ ముగ్గురి బాల్యం ఒకే విధంగా లేదు. చిన్నతనంలో పెరిగిన వాతావరణం ముఖ్యమైన పాత్ర వహిస్తుందన్నాడు ఆడ్లర్. గవరయ్య పేదవాడయినా, తండ్రి చిన్నతనంలో రంగూన్ పోయి తిరిగిరాకపోయినా, తల్లి గంగమ్మ కష్టపడి పోషించింది, చదివించింది. ప్రేమతో పెంచింది. ఇది మనిషి వ్యక్తిత్వం పెరగడానికి చాలా ముఖ్యమని ఆడ్లర్ చెప్పాడు. నవలలో వీళ్ళిదరి బాల్యంలో తేడా స్పష్టంగానే ఉంది. సుబ్బయ్య స్వభావానికి ప్రత్యేకంగా “భారతీయ”మైన సహజ కారణాలేమీ నాకు కనిపించడం లేదు.

    “Critics, including the perceptive R.S. Sudarshanam, have famously misread the novel and hastily concluded that Subbaiah finally overcomes his inferiority complex due primarily to Manorama’s love for him.”

    విమర్శకుల [3] గురించి అన్నది వాస్తవమే కాని, అది రాజేశ్వర్ గారి తీర్మానానికి గూడా వర్తిస్తుంది:

    “In all probability Subbaiah will continue with his vacillation, indecisiveness and unfounded fears because, among other things, he is a moral coward, and has been so all his life.”

    నాకు మాత్రం నవల ముగించేటప్పటికి సుబ్బయ్య ఏ దారిన వెళ్తాడో స్పష్టంగా తెలియలేదు. రావిశాస్త్రి కావాలనే అలా ముగించాడు. తన “ఆఖర్నో మాట”లో:

    “ఈ నవల చివరి భాగాలు రాస్తున్నప్పుడు నాకు సుబ్బయ్యంటే అసహ్యం వేసింది. … అయితే, దేముళ్ళూ, రాజులూ, రచయితలూ మంచిగా ఉండాలనీ, సంతానానికి సన్మార్గం చూపించాలనీ విన్నాను. అందుచేత పత్రిక లోంచి పుస్తకంలోకి వచ్చినప్పుడు సుబ్బయ్యకీ ఆత్మ విమర్శనాజ్ఞానం కలిగింది. తన దుస్థితినీ దుర్బుద్ధినీ కొంతగా గుర్తుంచుకుని, మంచి మార్గాన వెళ్ళేవాళ్ళా కనిపిస్తాడు., నవల చివర్న. ఛివరకి అతనా దారంట వెళ్ళొచ్చు. మానొచ్చు. అతని యిష్టం.”

    “In the final analysis it would be better not to accord undue importance to this theory and its operation in the novel. Much of aesthetic value would emerge if the novel is studied on its own terms, as a work of art, and without elaborate reference to Adler and his theories.”

    లేని ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు కాని ఆడ్లర్ మన జీవితంలో ముఖ్యమైన సమస్యలన్నీ సమాజం, మనం చేసే పని, ప్రేమ – ఈ మూటితో ముడిపడి వున్నాయన్నాడు [2]. అది గుర్తుంచుకుంటే “అల్పజీవి” లో మరికొన్ని లోతులు కనిపించవచ్చు.

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:

    [1] “Although individual psychology had obviously diverged from psycho‐ analysis since Adler’s break in 1911, Adler continued to be incensed by popular references to his having once been a “disciple of Freud.” In 1928, when “The Neurotic Constitution” went into a fourth German edition, Adler took the occasion to publish his most explicit denial to date about their nine-year relationship as recounted by Freud in his 1914 monograph, “The History of the Psychoanalytic Movement.”

    “Mr. Freud has bad luck with [the interpretation of] my spoken word…. My mild rejection, ‘it was no pleasure to stand in his shadow’—i.e., to be made an accomplice to all the absurdities of Freudianism, because I was a co-worker in the psychology of the neuroses—he at once interprets as a confession of my revolting vanity to put before unsuspecting readers. Since to date none of those who know wanted to admit this bad luck of their teacher—not mine, as is often erroneously maintained—I see myself forced to destroy the formation of a legend.”
    From, “The Drive for Self: Alfred Adler and the Founding of Individual Psychology,” by Edward Hoffman, 1996. Page 214.

    [2] “For a long time now I have been convinced that all the questions of life can be subordinated to the three major problems—the problems of communal life, of work, and of love. These three arise from the inseparable bond that of necessity links men together for association, for the provision of livelihood, and for the care of offspring.” From “The Individual Psychology of Alfred Adler: A Systematic Presentation in Selections from His Writings,” Book by Heinz L. Ansbacher, Rowena R. Ansbacher; Harper & Row, 1967. Page 131.

    [3] కోడూరి శ్రీరామమూర్తి “తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ” అనే మంచి పుస్తకం రాశారు. దాంట్లో “అల్పజీవి”ని ఆడ్లర్ సిద్ధాంత దృష్టితో పరిశిలించారు. “శత వసంత సాహితీ మంజీరాలు: వంద పుస్తకాలపై విశ్లేషణ,” లో అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు “అల్పజీవి” పై రాసిన వ్యాసం కూడా చదవదగ్గది.

  3. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    03/03/2007 4:50 pm

    ఒత్తున్న విలేఖరి ఒప్పే!

    నేను చాలాకాలంగా అమెరికాలో ఉండటాన, మన దినపత్రికలు చదివే అలవాటు పోయి, సాహితి గారు సవరిస్తే, భయమేసి తప్పు ఒప్పేసుకున్నాను. కాని “శబ్దార్థ రత్నాకరము” లో వెతికినా, “బ్రౌన్” లో వెతికినా ఆ రెండు మాటలూ కనిపించక ఏది తప్పో ఏది ఒప్పో నిర్ధారణగా తెలియలేదు. బూదరాజు ఏ సందర్భంలో విలేకరులు అన్నది వాడారో వారి పుస్తకాల్లో కనబడలేదు.

    లేఖలు రాసే అలవాటు తప్పినా, చలం రాసిన “ప్రేమలేఖలు” ఇంకా గుర్తున్నాయి. ప్రాచీన కవిత్వంతో పరిచయం లేకపోయినా, కవిత్వం రాయడానికి నిరుపహతిస్థలమూ, ఉయ్యాల మంచమూ, ఊహ తెలిసిన లేఖకులూ, వగైరా అవసరం అని పెద్దన చెప్పిన ఆశుపద్యమొకటి నోటికొచ్చు.

    మరి మన పత్రికల్లోకి విలేకరులు ఎలా జొరబడ్డారా అని నా మనసులో తీరని సందేహం ఉండిపోయింది. ఈవిషయంలో పత్రికల వాళ్ళకన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? అని సరిపుచ్చుకోలేకపోయాను. అల్పప్రాణమా, మహాప్రాణమా అని నాప్రాణం రెంటి మధ్యా చానాళ్ళు ఊగిసలాడింది. చివరకి రాత్రి ఇది నాకంటబడింది. ప్రాణం లేచి వచ్చింది:

    “పత్రికలలో విలేకరి, విలేఖరి అనే మాటలు విస్తృతంగా కనిపిస్తుంటాయి. బహువచనంలో విలేకరులు – విలేఖరులు. విలేఖరుడు వంటి ఏకవచనరూపం కూడా ఉండవచ్చు. ఇక్కడ లిఖ్ అన్నది ధాతువు. అందువల్ల విలేఖరి అనే రూపం ఏర్పడుతుంది. దీనిలో ఖర శబ్దాన్ని విరిచి గాడిదలని చమత్కరించడానికి వీలుంటందన్న భయంతోనేమో కొంతమంది విలేకరి అనేమాటకు ప్రచారం కలిగించారు. చంద్రశేఖర, రాజశేఖర, గుణశేఖర వంటి పేర్లలో కూడా ఈ విధమయిన విరుపునకు అవకాశం ఉంది. అట్లా అని ఈ పేర్లు పెట్టుకోవడం మానలేదు కదా. ఈ భయం తప్పితే విలేఖరిని విలేకరి అనడానికి కారణం కనిపించదు. ఖ-క అయి విలేకరి అనే తద్భవపదం ఏర్పడడంలో అసహజమేమీ లేదు. కాని, ఆధునిక రచనా భాషలో విలేఖరి అని రాయడానికి సందేహించ వలసిన అవసరమేమీ లేదు.”
    — “మన భాష,” డి. చంద్రశేఖర రెడ్డి, పేజీ 28.

    హమ్మయ్య! ఇప్పుడు ప్రాణం కుదుటబడింది.

    ఈ సంచిక సంపాదకీయం లో ప్రస్తావించారు కనుక మరో మాట చెప్తాను. విద్యావంతులు తమ మాతృభాషలోనే స్పెల్లింగు తప్పులు చెయ్యటం చాలా సిగ్గుచేటయిన విషయం. కాని ఇలాంటి తప్పులని సవరించుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళకన్నా సహాయపడే సమగ్రాంధ్ర నిఘంటువు మనకి లేదు. కవిత్వ భాషకి కాకపోయినా వాడుక భాషకన్నా మంచి నిఘంటువు లేకపోవడం మనకున్న పెద్దలోటు. ఇంతకన్నా శోచనీయమైనది మరేముంది? ఈ లోటు తీర్చడం కన్నా ముఖ్యమైన వేరే పనేముంది?

    ఆవుల మంజులత గారు అధికారంలోకి వచ్చినప్పుడు దీనికోసం తప్పక కృషి చేస్తామని మాట ఇచ్చారు. ఆవిడ కార్యదక్షురాలని కూడా విన్నాను. కాని ఆ ప్రాజెక్టు ఏస్థితిలో ఉందో ప్రకటించినట్లు లేదు!

    ఇదేదో కొందరు ఔత్సాహికులు చెయ్యగలిగింది కాదు. అనేకమంది పండితులు దీక్షతో చాలాకాలం కలిసి పనిచేస్తేగాని ఫలితం ఉండదు. దీని కోసం తానా, ఆటా సంస్థలు కృషి చెయ్యాలనీ, అందరూ తమ వంతు సాంకేతిక, ఆర్థిక సహాయం అందజెయ్యాలనీ నా కోరిక.

    అంతవరకూ, భాషావ్యాసాల ద్వారా నాలాంటి సామాన్య పాఠకులకి ఉపయోగపడే రచనల్ని చేస్తున్న భాషావేత్తలకి కృతజ్ఞతలతో,

    కొడవళ్ళ హనుమంతరావు

    [విలేకరి, విలేఖరి అన్న పదాలలో ఏది సరైనదో నిర్ణయించడం అంత సులభం కాదు. -అరి అన్న తెలుగు ప్రత్యయాన్ని సుంకరి, కుమ్మరి, కమ్మరి మొ॥ తెలుగు పదాల్లో వాడితే, -కర/కరి /కార అన్న సంస్కృత ప్రత్యయాలను సుధాకర, అహంకారి మొ॥ సంస్కృత ప్రత్యయాల్లో వాడుతాము. లెక్క ప్రకారం విలేఖ(సంస్కృతం) లను సృష్టించే వాడు విలేఖకరుడు, విలేఖకరి అవ్వాలి. అయితే, రెండు సన్నిహిత ధ్వనులు పక్కపక్కనే ఉన్నప్పుడు, రెండు ధ్వనులకు మారుగా ఒక్క ధ్వనిని మాత్రమే పలకడం అన్ని భాషలలో జరిగే ధ్వని పరిణామమే (ఈ ధ్వని పరిణామాన్ని సదృశ వర్ణలోపం (Haplology) అని అంటారు). ఈరకమైన ధ్వని పరిణామం వలన విలేఖకరి అన్న పదం విలేఖరి/విలేకరి గా మారిందని చెప్పుకోవచ్చు. లిఖించేవాడిని (రాసేవారిని) అచ్చతెలుగులో “లేకరి” అనేవారు (మహాప్రాణాలు అచ్చతెలుగులో అల్పప్రాణాలు అవుతాయి కదా!). విలేఖలు రాసేవాడు, విలేకరి అయినా కావాలి, లేదా విలేఖకరి అయినా కావాలి. బూదరాజు గారెప్పుడూ విలేకరి అనే రాసేవారు – సం.]

  4. పద్యాలు – వాడుకభాష గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    02/14/2007 12:18 am

    “ఛందస్సు లేకుండా కవిత్వం లేదు” – వరద
    కామేశ్వరరావు గారూ,

    కందకీ గీతకీ తేడా తెలియని ‘విద్యావంతుణ్ణి’ నేను. అదేదో గొప్పగా చెప్పుకోడం లేదు; ఉన్న విషయం చెప్తున్నా. అయినా మీ వ్యాసం నాకు బాగా నచ్చింది.

    విశ్వనాథ కవిత్వంలోని తెలుగు వెలుగులు చూపినందుకు సంతోషం. మీరు చెప్పింతర్వాత కొన్ని పద్యాలు చదివి “ఓహో” అనుకున్నాను – “ప్రొద్దుననే లేచి పులికాపు పెట్టును” అంటూ మొదలైన సీసం!

    మధ్యాక్కర వాడుకభాషకు వీలుగా ఉంటుందన్నారుగాని “విశ్వనాథ మధ్యాక్కరల” నీ ఆరుద్ర “శుద్ధ మధ్యాక్కరల”నీ ప్రస్తావించలేదు. ఆరుద్ర రాసినది వాడుక భాషగానే కనపడుతుంది.

    అబ్బూరి ‘చెరకాలం’ రాస్తున్నప్పుడే శ్రీశ్రీ ‘కలకాలం’ తలపెట్టి, ‘చెరకాలం’ కోసం ఉపోద్ఘాతం రాస్తూ,
    “కలకాలం చెరకాలం
    సిలువై తుదికావ్యమై స్పృశించెను వరదా!”

    అని అన్నాడట. అని ‘చెరకాలం’ వ్రాతప్రతిని పట్టుకెళ్ళి పోగొట్టుకున్నాడు! అబ్బూరి దగ్గర మరో కాపీ లేదు! ‘తెలుగు స్వతంత్ర’ లోనూ “అందాకా” లోనూ ప్రచురితమైనవీ, అముద్రితమైనవీ, దొరికినంతవరకు వీళ్ళదగ్గరా వాళ్ళ దగ్గరా సేకరించి, లండన్ వాస్తవ్యులైన పరకాల ప్రభాకర్ 1993లో “కవితా సంచిక” గా ప్రచురించారు. దాంట్లో దాదాపు డెబ్భై పేజీలు ‘చెరకాలా’ నివే! దాని చివర్లో అబ్బూరితో “కవిత్వం అంటే…” అన్న పేరుతో పరకాల జరిపిన ఆసక్తికరమైన ఇంటర్వ్యూ కూడ వుంది.

    విశ్వనాథ వారు అబ్బూరి ప్రయోగాలని చూసి, “నీ స్నేహితులంతా ఛందస్సు మీద విరుచుకు పడతారేం? వాళ్ళకి చాతకావాలి కాని అందులో రాయటానికేం బాధ? నువ్వు రాసి చూపించావు కదా – యింకా యేం కావాలి వాళ్ళకి?” అని మెచ్చుకున్నాడు.

    చెదురుమదురుగా వున్న మరికొన్ని అబ్బూరి రచనల్ని ఒకచోట చేర్చి, వారి కుటుంబసభ్యులు 1995లో “సామిధేని” పేరిట మరో పుస్తకాన్ని ప్రచురించారు. దాంట్లో చేకూరి రామారావు గారి వ్యాసం, “నిరంతరాన్వేషి, నిత్యప్రయోగశీలి వరద,” కోవెల సంపత్కుమారాచార్య గారి వ్యాసం, “ఛందో వరదస్మృతి,” వున్నాయి. నిజం చెప్పాలంటే, ఆ పండితుల వ్యాసాల్లో కన్నా మీ వ్యాసంలో “ప్రవాహ గుణం” బాగుంది.

    ఈ పుస్తకాలు నేను గత రెండేళ్ళ లోపునే కొన్నాను కనుక ఇంకా దొరుకుతున్నాయనుకుంటాను. మీ వ్యాసానికి అవి ఉపయోగపడొచ్చు.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    01/24/2007 12:06 am

    “శాస్తవేత్తలకే గోచరించని Kuhn శాస్త్రీయ స్వరూపం!”
    ”The Structure of Scientific Revolutions” అంటే “శాస్త్రీయ విప్లవాల స్వరూపం” అన్నది నచ్చింది. ”Paradigm Shift” అంటే “రూపావళి మార్పు” అన్నది శ్రావ్యంగా ఉంది గాని, మాట వివరిస్తే తప్ప మనసుకి తట్టదు. ప్రతిమానం అంటే పరవాలేదేమో. ఆలోచించే తీరు, దృక్పథం అంటే సులభంగా అర్థమవుతుంది నాకు. ”Post-positivist” అంటే “ప్రత్యక్ష్యోత్తర” అన్నది మాత్రం ఇంగ్లీషులోనూ అంతకంటే మిన్నగా తెలుగులోనూ కర్ణకఠోరంగా ఉంది. ఆధునికోత్తర వాదం లాంటిదా ఇది? ఇవి పంటికింద పడిన రాళ్ళలా బాధిస్తాయి.

    ఇంతకీ నేను చెప్పదలచుకున్నది అనువాదాల గురించి కాదు. సురేష్ తన వ్యాసంలో అన్న మాట:

    ఒక శాస్త్రవేత్త తయారు చేసిన సిద్ధాంతానికి తరువాతి తరం శాస్త్రవేత్తలు మెరుగులు దిద్దటం కానీ, లోపాలు సవరించడం గాని శాస్త్రపరిశోధనారంగంలో ఎల్ల కాలాల్లోను జరుగుతున్న పని.
    దానికేననుకుంటాను, బాపారావు గారు కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు:
    Kuhn పండితుడు Structure of Scientific Revolutions వెలయించి అరశతాబ్దం కావస్తోంది. “Paradigm Shift” అని ఇప్పుడు కాకపోతే కాసేపటికి అనేసేవాడే ప్రతివాడూనూ. ఇప్పటికైనా శాస్త్రీయ పరిశోధన అనేది క్రమపద్ధతిలో, మునుపటి తప్పులని దిద్దుకుంటూ అలాగ్గా పురోగమిస్తుందనే అపప్రథని ప్రచారం చెయ్యడాన్ని నిషేధిస్తే మంచిది. స్థూల స్థాయిలో చూస్తే సైన్సు తన సిద్ధాంతాల్ని ఒక పట్టాన మార్చుకోదనీ, వస్తేగిస్తే అలాంటి సైద్ధాంతి పరిణామం విలయానికేమీ తక్కువకాదనీ ఒప్పుకుతీరాలి. కుశాస్త్ర తరీఖాలని చెండే వ్యాసంలో శాస్త్రగతి తీరుగురించి పాతరోజుల పడికట్టురాళ్లనే తిరగదోడటం అభ్యంతరకరం. .

    వారిద్దరి రాతల్ని బట్టి వాళ్ళు నాకన్నా ఈవిషయాల్లో బాగా తెలిసినవాళ్ళని తెలిసినా, బాపారావు గారు అన్నదానికి అభ్యంతరం తెలపక తప్పడం లేదు. వారు Kuhn గురించి అన్న నాలుగు మాటలకి నేనింత చాటభారతం రాయడం అసందర్భం అనిపించవచ్చు. కాని శాస్త్రీయ పద్ధతులూ స్వరూపం ఈ వ్యాసానికీ జరుతున్న సంభాషణకీ ముఖ్యమనిపించి, మిడిమిడి జ్ఞానంతోనే సాహసిస్తున్నాను. ఎందుకంటే:

    శాస్త్ర చరిత్రకారుడైన Thomas Kuhn సైన్సు స్వరూపాన్నీ స్థితిగతుల్నీ బట్టబయలు చేసి శాస్త్రీయ అవగాహనలో ఓ నూతనోధ్యాయాన్ని సృష్టించాడంటారు కొందరు. సైన్సు “వాస్తవికత”కి దగ్గరగా రావడమన్నదాంట్లో అర్థం లేదనీ, ఓ ప్రతిమానాన్ని నమ్మిన శాస్త్రవేత్తలు దానికి లోబడి వున్న సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారనీ, కాని కొన్ని చిక్కువిడని సమస్యల్ని తీర్చడానికి కొత్త ప్రతిమానాన్ని ప్రతిపాదిస్తారనీ, కొన్నాళ్ళకి దాంట్లోనూ తీర్చలేని సమస్యలుండి, మరో కొత్త ప్రతిమానాన్ని ప్రవేశపెడతారనీ, అది పాతదాన్ని స్థానభ్రంశం చేస్తుందనీ, ఇదే శాస్త్ర స్వరూపం – ఇది Kuhn సారాంశం అనుకుంటాను.

    ఒక ప్రతిమానం మరొకదానికంటె మిన్న అని చెప్పడానికి వాస్తవమైన ఆధారమేమీ లేదు, మిగిలిన శాస్త్రవేత్తలని నమ్మించగలిగితే చాలు అదే నెగ్గుతుంది, అన్నది ఆయన భావన అని అర్థం చేసుకున్నాను. సైన్సు, శాస్త్రవేత్తలు చేసే వ్యాఖ్యానం మాత్రమే, అదొక రకమైన “భాషా క్రీడ”; అంతేగాని కాలం గడిచేకొలదీ సైన్సు “సత్యానికి” దగ్గరగా వస్తుందనటంలో అర్థం లేదన్నది Kuhn వాదన.

    అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే Kuhn తో అంగీకరించరు [1]. Structure లో చెప్పిన ప్రతిమానాల చిత్రీకరణతో ఒప్పుకునే శాస్త్రజ్ఞుల పేర్లివ్వమని బాపారావు గారిని కోరుతున్నాను.

    శాస్త్రవేత్తల కన్నా Kuhn ప్రభావితం చేసింది ఓ తరహా తత్వవేత్తలనీ, సాహిత్యకారులనీ. వాళ్ళకీ శాస్త్రవేత్తలకీ చుక్కెదురు! ఒక తత్వవేత్త అయితే, భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రైజేకాదు, ఆశాస్త్రంలో వాళ్ళ పేరుమీద కొన్ని సూత్రాలున్నా కూడా, వాళ్ళకి జ్ఞానమీమాంస (epistemology) గురించి ఏమీ తెలియనప్పుడు నోటికొచ్చినట్లు వాగకూడదని Kuhn ని విమర్శించినందుకు కొందరు శాస్త్రవేత్తలని అమర్యాదగా తిట్టిపోశాడు [2].

    నా ఉద్దేశంలో శాస్త్రవేత్తలు కాని వాళ్ళు సైన్సు గురించి రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. Quantum Mechanics మూలంగా సైన్సు సత్యాన్ని నిశ్చయంగా తెలుసుకోలేదని రుజువయింది కనుక సైన్సుకి ఆధునికాంతర కాలంలో వేరే అర్థం, ప్రాముఖ్యతా ఇవ్వాలనే వాళ్ళు వాళ్ళ పరిథిని దాటి పోతున్నారని నా అనుమానం [3].

    నామటుకి నాకు ఇవన్నీ అర్థమయానని అనలేను కాని, ఇవి చదవడం వలన ఎవరికీ ఎలాంటి హానీ కలిగిందనుకోను. ఈ భిన్నాభిప్రాయాలలో వేటినీ నిషేధించాల్సిన అవసరం కనబడటం లేదు. నిజం చెప్పాలంటే, Kuhn భావనలని వక్రీకరించి కుశాస్త్రానికి దోహదం చేస్తున్న వాళ్ళు మిక్కిలి హానికరమనుకుంటాను [4].

    బాపారావు గారు, తిరుపతిరావు గారు, Thomas Kuhn, Richard Rorty – వీళ్ళనెవరినీ నేను హానికరమైన వాళ్ళ జాబితాలో చేర్చడం లేదని మనవి.

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:

    1. “The Revolution That Didn’t Happen,” Steven Weinberg, The New York Review of Books, Volume 45, Number 15, October 8, 1998. ఈయన University of Texas at Austin లో Physics professor. చాలా పేరున్న శాస్త్రవేత్త, 1979 ఫిజిక్స్ నోబెల్ గ్రహీత. తన నలభై-ఏభై ఏళ్ళ శాస్త్ర పరిశోధనా జీవితంలో ఎన్నో విప్లవాత్మకైన మార్పుల్ని చూసినా, సిద్ధాంతం సరైనదా కాదా అని పరిశీలించే తీరులో పెద్ద మార్పేమీ లేదనీ, Kuhn ప్రకటించిన Paradigm Shift లాంటివేమీ జరగలేదనీ వాదించాడు.

    2. ”Thomas Kuhn, Rocks and the Laws of Physics,” an essay in “Philosophy and Social Hope,” by Richard Rorty. ఈయన సాహిత్యం, ఫిలాసఫీలో Stanford లో Emeritus professor. Kuhn ని మార్గదర్శకుడిగా గుర్తించిన సమకాలీన తత్వవేత్తలలో ముఖ్యుడు.

    3. “పోస్ట్ మోడర్నిజం,” బి. తిరుపతిరావు. ఈయన విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులు. క్వాంటం సిద్ధాంతం ఎలక్ట్రాన్ స్థలమూ వేగమూ ఒకేసారి నిశ్చయంగా తెలుసుకోలేమని నిరూపించింది గదా. అణుప్రపంచంలో సాధ్యం కానిది స్థూల ప్రపంచంలో ఎలా సాధ్యమవుతుందంటూ, సైన్సులోకానీ సామాజిక శాస్త్రంలోగానీ నియతివాదానికి చోటులేదనీ, ఇదే ఆధునికాంతర సైన్సు ప్రాముఖ్యత అనీ, అందుకు Kuhn రచనల్ని ఆధారంగా చూపెట్టారు. శాస్త్రవేత్తలు వీటికి ఒప్పుకున్న దాఖలాల్లేవు. వీరి అభిప్రాయాలతో అంగీకరించినా లేకపోయినా, తెలుగులో ఆధునికోత్తర వాదాన్ని పరిచయం చేస్తూ ఈ పుస్తకం రాసినందుకు వీరిని మెచ్చుకోవాలి.

    4. “Pseudoscience and Postmodernism: Antagonists or Fellow-Travelers?” by Alan D. Sokal. ఈయన New York University లో Physics professor. పోస్ట్ మోడర్నిజం పేరుతో అన్ని రకాల మూఢత్వమూ సైన్సులోకీ చరిత్రలోకీ జొరబడిందనీ, దురదృష్టవశాత్తూ జాతీయవాదులేకాక వామపక్షవాదులూ దీనికి దోహదం చేస్తున్నారనీ, భారతదేశంలో ఈమధ్యకాలంలో సాగుతున్న శాస్త్రీయ అవగాహనని ఉదాహరణలతో విశ్లేషించి ఖండించాడు.

  6. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    01/15/2007 10:32 pm

    శ్రీనివాస్,

    1. పుస్తకం చదవకుండానే పేరాలు కోట్ చెయ్యడానికి నేనేమీ స్వాములవారిని కాదుగదా! మీరు చదివినంత లోతుగా నేను చదివుండకపోవచ్చు. మీదృష్టీ నాదృష్టీ ఉత్తర దక్షిణ ధ్రువాలు కావచ్చు.

    2. నేను రాసినదాంట్లో చివరి వాక్యం తప్ప మిగిలినదాంట్లో వెనక్కి తీసుకోవాల్సిందేమీ కనబడలేదు. శ్రుతి మించిన స్తోత్రాలకూ, సంయమనం లోపించిన “శాస్త్రీయ” విశ్లేషణకూ విరుగుడుగా కాస్తంత వ్యంగ్యం వాడాను. భావ్యం కాదంటారా?

    3. ఇవి రెండే ముఖ్యమైన విషయాలని గానీ, అదొక చెత్త పుస్తకమని గానీ నేనన లేదు. అక్బరు అంతఃపురం ఎంత వ్యభిచార కేంద్రమో, తాజమహల్ అసలు ఎందుకు హిందూ రాజ్ మహలో, … లాంటి వేడి వేడి కబుర్లనొదిలేసి, నేను అప్రధాన విషయాలని పట్టించుకున్నాననా మీ ఆక్షేపణ? ఇప్పటి వరకూ వచ్చిన చరిత్ర అంతా తప్పుల తడిక, అందుకు ఈ కుహనా చరిత్రకారులే కారణం, మన పురాణాల్లో వున్నవాటిని (కనీసం కాలానికి సంబంధించినంత వరకు) శాస్త్రీయంగా కోటా వెంకటాచలం గారు ఏనాడో నిరూపించారు, అంతకన్నా ఇంకేం కావాలి? అన్నవి రచయిత ఉద్ఘాటించిన ప్రధానాంశాలలో కొన్ని. నేను అసందర్భంగా కోట్ చేస్తే మీరు తప్పు పట్టండి.

    4. ఏదో ఒకటి రెండు పేరాలను తీసుకుంటే చాలదు, పుస్తకం మొత్తం మీద అభిప్రాయం వెలిబుచ్చాలంటారా? దానికి వేరే సందర్భం కావాలి. చరిత్ర గురించి మన జాతి అలవరచుకోవాల్సిన దృక్పధాలని ఆకాశానికెత్తేసే ప్రశంసల్ని చదివి, ఉండబట్టలేక ఒకటి రెండు రచయిత దృక్పధాలని ఉదాహరణలగా ఇచ్చాను.

    5. ఇంకా చాలా రాయొచ్చు కాని, దీనిని పొడిగించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అదీగాక దీనికి సురేష్ వ్యాసంతో కొంత సంబంధమున్నా కాస్త దూరమైన విషయం. చరిత్ర మీదా, “ఏది చరిత్ర?” మీదా కూడా వ్యాసాలు రావాలి. ఆ విషయంలో మీతో ఒప్పుకుంటాను. ఎందుకంటే, కొడవటిగంటి కుటుంబరావు అన్నట్లు, “చరిత్ర గురించి శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటే అన్ని విషయాల గురించీ శాస్త్రీయంగా ఆలోచించగలుగుతాం.”

    కొడవళ్ళ హనుమంతరావు

  7. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    01/13/2007 4:07 pm

    చరిత్ర, ‘శాస్త్రీయ’ దృక్కోణం

    శ్రీనివాస్,

    “తెలుగు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల పునరుజ్జీవనం కోసం నిస్వార్థ కృషి చేస్తున్న” అజో-విభో-కందాళం ఫౌండేషన్ నుండి “చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎట్లా చూడాలో, ఎట్లా చెప్పాలో, ఎట్లా రాయాలో అనే అంశాలమీద మనజాతి అలవరచుకోవలసిన దృక్పధాల్ని” శాస్త్రిగారు నిర్దేశించారని హార్దిక ప్రశంసలను అందుకున్న పుస్తకాన్ని,

    చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారిచే “భారతీయ చరిత్రకు దిద్దిన తిలకం”గా “శాస్త్రీయ ఆయుర్వేద సామాజిక బలవర్థక ఔషధం” గా కీర్తించబడ్డ గ్రంథాన్ని, క్లుప్తంగానన్నా సమీక్షించడానికి నాకు చరిత్రలో డిగ్రీ లేదు సరికదా,కనీసం ఔత్సాహికులకుండాల్సిన పరిజ్ఞానమన్నా లేదు.

    “చరిత్ర గతికి, కాలచక్ర గమనానికి సంబంధించినంతవరకూ అస్పష్టతకు తావు లేని ప్రాచీన భారతీయ సారస్వతాన్ని,” “క్షణంలో 1/300 వంతు అయిన వేధ నుంచి 30 కోట్ల 67 లక్షల సంవత్సరాలుండే మన్వంతరం వరకు, ఆపైన కూడా ఆధునిక కంప్యూటర్లకు సైతం అంతుబట్టనంత సూక్ష్మాతి సూక్ష్మ, స్థూలాతిస్థూల కాలగణన అనాదిగా సొంతమైన” భారతీయ మేధని అందుకోడానికి నేను ఎప్పుడో వెలగబెట్టిన కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఏమాత్రం పనికొస్తుంది?

    “ప్రాచీన భారత చరిత్రకు తిరుగులేని ప్రమాణాలైన భవిష్య, మత్స్య, బ్రహ్మాండ, విష్ణు, వాయు పురాణాలు” ఏమైనా చదివానా?

    ప్రాచీన సాహిత్యాన్ని చదవడమేకాక, భర్తృహరి కవిత్వం మీదనే అసమాన విమర్శ రాసి, లెక్కల్లోనూ జన్యుశాస్త్రంలోనూ కృషి చేసి, తనతో అంగీకరించని చరిత్రకారులచేత గూడా ఆద్యుడిగా ప్రశంసించబడ్డ కోశాంబి రచనలతోగానీ, వాటిని తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన బాలగోపాల్ పుస్తకంతోగానీ పోల్చడానికి, వాళ్ళు దేశద్రోహులూ, జాతిద్రోహులూ అయిన మార్క్సిస్టు వర్గానికి చెందిన కుహనా మేధావులాయె!

    భారతీయ ఆత్మని ఆవిష్కరించగల బ్రహ్మజ్ఞాన సంపన్నులెవరన్నా సమీక్షించడానికి అర్హులేమో!

    కొడవళ్ళ హనుమంతరావు

  8. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Suryanarayana Murthy Akella అభిప్రాయం:

    01/07/2007 4:38 am

    సురేష్ గారి వ్యాసం చాలా బాగుంది, అంతే బాగుంది హనుమంతరావు
    గారి అభిప్రాయం. దీనికి further గా వ్యాసాలు, అభిప్రాయాలు వచ్చి సుసంపన్నం చేస్తాయని ఆశిస్తున్నాను.

  9. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    01/05/2007 11:28 pm

    భాషావేత్తల సరదా తగాదా ప్రయాణం

    వార్తాపత్రికలలో మన భాష మీద వచ్చే ఊహాగానాల వలన ఒక ఉపయోగముంది – “ఔత్సాహికులు” వాటిని చదివి నిరాశపడి ఊరుకోకుండా వాటిలోని నిజానిజాల గురించి అద్భుతమైన వ్యాసాలు రాయడం. సురేష్ ఇంతకుమునుపూ, ఇప్పుడూ రాసిన వ్యాసాలు భాషాశాస్త్రంలో ప్రవేశం లేని నాలాంటి వాళ్ళకి సులభంగా అర్థమవడమేకాక ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం కలిగిస్తున్నాయి. ఇవి 201, 301, … సీరీస్ లా కొనసాగుతాయని నా ఆశ.

    స్వల్ప లోపాలనిపించిన రెండు విషయాలు:

    1. అందుబాటులో లేని ఉపయుక్త గ్రంథాలు: గంటి గారి పుస్తకం అరవై ఏళ్ళనాటిది, అది దొరకడం కష్టం. భద్రిరాజు గారి పుస్తకం ఖరీదు డెబ్భై అయిదు డాలర్లు! అమెరికాలో ఉన్న భాషాభిమానులైనా కాస్త వెనకాడతారు. ఇంతకన్నా అందుబాటులో ఉన్నవి ఏవైనా ఉంటే చెప్పండి.

    2. పేరులేని విమర్శలు: “సాహిత్యం కళ, భాషాశాస్త్రం విజ్ఞాన శాస్త్రం” అన్నారు, బావుంది. చరిత్రకారుడిగా పేరున్న ఓ ప్రముఖ రచయిత, తెలుగు పైశాచి భాష నుండి పుట్టిందనీ, అర్జునుడు అమెరికా వెళ్ళొచ్చాడనీ ఘంటాపథంగా చెప్తున్నారనీ విమర్శించారు. సాహిత్యరంగంలో సంప్రదాయాలెలా వున్నా, శాస్త్రీయరంగంలో వేరేవాళ్ళని విమర్శించేటప్పుడు వారి రచనని ప్రస్తావించడం ఆనవాయితీ. కనీసం రచయిత పేరన్నా చెప్తే వారి రచనలని పరిశీలించే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా ఆ రచయిత గూడా “ఈమాట”లో తనని తాను సమర్థించుకోడానికీ లేకపోతే సరిదిద్దుకోడానికీ వీలవుతుంది.

    అర్జునుడు అమెరికా వచ్చాడనడం హాస్యాస్పదం కావచ్చు గాని, పైశాచీ ప్రాకృతమే తెలుగుకు మాతృక అని పేరున్న పండితులే వాదించారని చదివాను. అదీ Caldwell శాస్త్రీయంగా నిరూపించిన వందేళ్ళ తర్వాత గూడా! మన సాహిత్యంపైనేకాక మన భాష మీదకూడా విస్తృతమైన పరిశోధనలు చేసిన చిలుకూరి నారాయణరావు గారు Caldwell తో విభేదించారట. మిడిమిడి జ్ఞానంగల వాళ్ళనీ రాజకీయ ప్రయోజనాల దృష్టి తో చేసే వాదనలనీ వదిలేద్దాం. చిలుకూరి లాంటి గొప్ప పండితుడు గూడా ఒప్పుకోలేదంటే, మనం తెలుసుకోదగ్గ కారణాలు ఏవో ఉండి ఉండాలి. వాటిని స్థూలంగానయినా చెప్తే బావుండేది.

    ఇది చదువుతుంటే, శిథిలావస్థలో ఉన్న తిరుమల రామచంద్ర “సాహితీ సుగతుని స్వాగతం” గుర్తుకొచ్చి తీస్తే, దాంట్లో “దేశినామమాల లోని మరికొన్ని తెలుగు పదాలు” అనే వ్యాసం నన్నాకర్షించింది. మన భాషావేత్తల తగాదాలకు రైలుపెట్టెలకన్నా సరైన చోటు మరి లేనట్లుంది.

    “నిన్ను చూస్తే తందామనిపిస్తుందోయ్!” అన్నారట చిలుకూరి, మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో తిరుమల రామచంద్రని చూసి. “అంతటి అపరాధం ఏం చేశానండీ?” అని అడిగితే, “అపరాధం? మహాపరాధమే చేశావ్. సంస్కృత ప్రాకృత సాహిత్యాలకే ద్రోహం తలపెట్టావు. గాథాసప్తశతిలో తెలుగు పదాలు చేరాయని వ్రాశావు” అన్నారట.

    తిరుమల రామచంద్ర, “నాదేముందండీ, ఆచార్య హేమచంద్రుడంతటి వాడే శ్రమపడి అలాంటి పదాలని “దేశి నామమాల” గా క్రోడీకరిస్తే,” అన్నారట. “పదకొండో శతాబ్దపు హేమచంద్రుడా నీకు ప్రామాణికం?” అంటే, “నేను గూడా సొంతంగా పరిశోధించి కనుగొన్నానన్నా”రట తిరుమల. “ఏదీ చెప్పు చూద్దాం” అంటే, గుక్క తిప్పుకోకుండా, తెలుగు, కన్నడం, తమిళం నుండి సంస్కృతంలో వచ్చి చేరిన పదాలను – వరసలు, వస్తువులు, జంతువులు, రుతువుల గురించి – ఇలా అనేక పదాల పుట్టుపూర్వోత్తరాలని తిరుమల తడువుకోకుండా వివరించారు.

    నాకు బాగా నచ్చిన ఒక పదం గురించి మాత్రం రాస్తాను. అందుకు కారణం చిన్నప్పుడు ఆడిన ఆటలూ పెద్దయింతర్వాత చదివిన కవితలూ గుర్తుకురావడమే.

    శ్రీశ్రీ Swinburne కవితల్ని “షెల్లీ కవనపు హల్లీసకం” తో పోల్చాడు. నేను పాతికేళ్ళుగా, “హల్లీసకం” అంటే అర్థం తెలియకుండానే ఆ కవితని గుర్తుచేసుకునే వాణ్ణి. ఈ మధ్య, వేలూరి గారితో పరిచయమయిన తర్వాత, “అర్థం తెలియకుండా చదివిన చదువూ ఒక చదువేనా!” అని ఆయన మెత్తని “దీవెనలు” ప్రసాదిస్తే, బుద్ధిగా నిఘంటువు చూడటం అలవాటు చేసుకున్నాను.

    “హల్లీసకం” అంటే స్త్రీలు గుండ్రంగా నిలిచి ఆడే ఆట అని బ్రౌన్ లో ఉంది. అది సంస్కృత పదం. దానికి తిరుమల వ్యాఖ్యానం చూడండి:

    “హాల్లీసో = రాసకః. మండలేని స్త్రీణాం నృత్యం. మనకు, కన్నడం వారికి హళ్ళి అనే పదం ఉంది. ఇది సున్నకు పర్యాయపదం. చిన్న వర్తులానికి అల్లి అంటారు కొన్ని ప్రాంతాలలో. గోలీలను అల్లి కాయలంటారు. అల్లికాయలంటే గుండ్రని గుళ్ళు. బొంగరాలాటలో నేలమీద గుండ్రని గీటుగీచి దాని మధ్యన ఒక బొంగరాన్ని ఉంచుతారు చూచారా? అలా గీచే గుండ్రని గిరిని అల్లి అంటారు. అలాగే పిల్లలు ఒకరి చేయి ఒకరు పట్టుకుని గుండ్రంగా పందెం కట్టి నిలవడాన్ని అల్లి కట్టడం అంటారు. కనుక ఈ అల్లే హల్లీసో అయిందేమో! హల్లీసం నుంచే అల్లీ కాకూడదూ అని ఎదురు ప్రశ్న వేస్తారు కదూ? కావచ్చు. కాని హేమచంద్రుడు దీన్ని దేశి పదంగా పరిగణించాడు కనుకనే ఈ శ్రమంతా.”

    అలా మాట్లాడుకుంటూ పోతే రైలు అరక్కోణంలో ఆగినప్పుడు గాని తెలియలేదట, ఎంతసేపు అయిందనీ, తను టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాననీ! అప్పుడు చిలుకూరి:

    “చూచావా! నీకిదే శిక్ష. తెల్లవారుజాము బండి ఎక్కి మద్రాస్ చేరుకో. మరొకమారి హోరాహోరిగా పోట్లాడుకుందాం. ద్రావిడ భాషావాద సన్నిపాతం ముంచుకొచ్చింది. మీ కందరికీ స్వాస్థ్యం కలగాలంటే కొంతకాలం పడుతుంది,” అన్నారు.

    జులై 1959 “భారతి”లో వచ్చిన ఈ వ్యాసాన్ని తిరుమల ఇలా ముగించారు: “నేను బండి దిగాను. బండి కదిలింది. సాహిత్యంలో అభిప్రాయ భేదాలను వ్యక్తిగత ద్వేషంగా భావించుకొని పగపట్టే ఈ కాలం ఎక్కడ? అభిప్రాయ భేదాలు వేరు. అభిమానాదరాలకూ, మానవత్వానికి సాహిత్యంలోని మత భేదాలు అడ్డురావనే ఆ సహృదయ విమర్శక పరిశోధకాగ్రణి ఎక్కడ? అలాంటి ఉదాత్త హృదయుడు మరొకడు నాకు కనిపించలేదు. ఆయన కీర్తిమూర్తికి నా నమోవాకాలు.”

    ఇంతకీ చిలుకూరి తెలుగు సంస్కృత ప్రాకృతాలనుంచి పుట్టిందనడానికి కారణాలేవిటో నాకు తెలియలేదు. రైలు ప్రయాణం లో ఎక్కువ మాట్లాడింది తిరుమలే. చిలుకూరి రాసిన “ఆంధ్ర భాషా చరిత్ర” కూడా అందుబాటులో లేదు. ఈ లోటుని ముందు ముందు సురేష్ పూరించాలని కోరుకుంటూ,

    కొడవళ్ళ హనుమంతరావు

  10. అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/16/2006 1:01 pm

    “పనికిమాలిన” లెక్కల ప్రాధాన్యత

    తెలుగులో శాస్త్రీయ విషయాల్ని ఇంత తేలిగ్గా తెలియపరిచిన వేమురి వ్యాసం చాలా బావుంది. “పెద్దవాళ్ళు పుస్తకాలు రాస్తారు, యువకులు సిద్ధాంతాలని రుజువు చేస్తారు,” అన్న సూత్రాన్ని భార్గవ మరోసారి రుజువు చేశారు.

    ఇలాంటి లెక్కల సొగసుల్ని చూడాలన్నా,
    “Not all the water in the rough rude sea
    Can wash the balm off from an anointed king;”
    కన్నా
    “After life’s fitful fever he sleeps well; ”
    ఎందుకు గొప్ప కవిత్వమో తెలుసుకోవాలన్నా, తప్పక చదవాల్సిన పుస్తకం, రామానుజన్ ని కనుగొన్న Hardy రాసిన “A Mathematician’s Apology.” అచ్చుప్రతిలో ఉన్న C. P. Snow రాసిన ముందుమాట గూడా చదవదగ్గది.

    కొడవళ్ళ హనుమంతరావు