పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    01/10/2009 8:36 pm

    చివుకుల చంద్ర మోహన్ గారూ,

    మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను కానీ అంగీకరించలేను.

    ఖచ్చితంగా చెప్పలేని చరిత్రని ఆపోశన పట్టడానికి మీకున్న సర్వశక్తులనూ వినియోగించడం దేనికని? అని మీరన్నారు.
    “తెలుగు సాహిత్యం లో రాజుల జీవిత చరిత్రలకీ, రాజుల గొప్పతనాల్ని చాటి చెప్పే కథలకీ ఇచ్చిన ప్రాముఖ్యత కవుల జీవిత చరిత్రకి లేదు. కవులు రాసిన కావ్యాలకే ప్రాముఖ్యత ఇచ్చారు కానీ కవెలా జీవించాడన్నది ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. లిఖిత పూర్వకంగా చాలామంది కవులూ రాసుకోలేదు. మిగత కవులూ రాయలేదు. అందువల్ల సాహితీకారుల చరిత్రలకి ప్రస్తుతమున్న సాహిత్య గ్రంధాలూ, రాజుల జీవిత చరిత్రలే ప్రమాణికంగా తయారయ్యాయి. మధ్యలో కల్పితాలూ విరివిగా కనిపిస్తాయి. కట్టుకథల ఉక్కుపాదాల క్రింద వాస్తావాలు అతి సులభంగా నలిగిపోతాయి” అంటూ సమగ్రాంధ్ర చరిత్రలో ఆరుద్రగారు వాపోయారు.

    మీలాగే నేనూ త్యాగరాజు అభిమానిని. ఆయన తన జీవిత చరిత్ర రాసుకోలేదు. బ్రిటీషు వాళ్ళు ఎక్కించిన చరిత్రలో ఇలాంటి విషయాలు ఎంతుంటాయో అందరికీ తెలుసున్నదే! ఇహ ఆయన శిష్యులు రాసిన జీవిత చరిత్రలే మనకాధారం. ఏ మాత్రం దాపరికం లేకుండా ఏ పుస్తకాల్లో ఎలా రాసారో చెప్పాను.

    త్యాగరాజు జీవితంలో జరిగిన సంఘటనా క్రమంలోనే వ్యాసం మొత్తమూవుంది. త్యాగరాజుకి రెండు సార్లు రాజాస్థానం నుండి పిలుపొచ్చిందని చెప్పాను. మొదటి సారి పాతికేళ్ళ వయసప్పుడూ, రెండో సారి సుమారు 35 ఏళ్ళ వయసప్పుడూ. తంజావూరుని పరిపాలించిన రాజుల కాలాలూ, వారి పేర్లతో సహా చెప్పాను. ఇది చారిత్రిక ఆధారంగానే ఇది చెప్పాననుకుంటున్నాను. ఈ విషయం రెండో భాగంలో వుంది. కాకపోతే మీరాశించినట్లుగా ఖచ్చితమైన తేదీలూ, గంటలూ లేవు. శిలాశాసనాలు లేవు.

    అలాగే ఇల్లు వేరుపడడం సంఘటనా ఎప్పుడు జరిగిందో చెప్పాను. దానికి తంజావూరు 1802 మెజిస్ట్రేట్ దగ్గర పత్రాల సంగతి చెప్పాను. అలాగే వివిధ రచయితలూ ఎలా తప్పుగా భావించారో చెప్పాను. అలాగే త్యాగరాజు రెండో భార్య కమలాంబ ఆయన 44వ ఏటే పోయిందనీ సూచించాను. ఇవి కాదూ, నాకు తాళ పత్ర గ్రంధాలూ, శిలాశాసనాలే చారిత్రిక ఆధారం అంటారా, దానికి నమస్కరించడం తప్ప, నేనేమీ చెయ్యలేను.

    ఎక్కడో ఓ సందర్భంలో చెప్పిన ఓ వాక్యాన్ని తీసుకొని దాన్ని వ్యాసం మొత్తమూ పులమడం భావ్యం కాదు. అంతటా అదే అర్థాన్ని తీసుకోడం న్యాయం కాదు. అనుమానం వచ్చినప్పుడు అనుమానంగానే చెప్పాను. అలాగే అదెందుకొచ్చిందో చెప్పాను. వాయుగుండం వస్తోందీ, అది విశాఖ తీరాన్ని తాకచ్చని శాస్త్రీయ పద్ధతుల ద్వారా చెబితే, ఆ వాయుగుండం కాస్తా బుద్ధి మార్చుకోని వేరే దారినెళితే వాతావరణ కేంద్రానిదే తప్పనడం అతి సులువైన పని. అక్కడ ప్రకటనలు హెచ్చరికలు. హెచ్చరికలకి వాస్తవాన్ని ముడివేస్తే నవ్వుకోడానికి బాగానే ఉంటుంది.

    ఈ వ్యాసం ద్వారా త్యాగరాజు సంగీతం సృజన పై పాఠకుల అభిప్రాయం మార్చడం నా వుద్దేశ్యం కాదు. సరితూచలేని ప్రతిభ ఆయనది. అలాగే ఈ వ్యాస రూపంలో సంగీత ప్రియుల మనసు మార్చేద్దామన్న బృహత్తర ప్రణాలిక్కూడా నాకేం లేదు.

    ఆ మధ్య రామదాసూ, అన్నమయ్య సినిమాలొచ్చాయి. చరిత్ర, శోధనా పక్కనబడేసి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కల్పించి రాసేసారు. అడిగే నాధుడులేడు. త్యాగరాజు చరిత్రా అలాగే తయారయ్యింది. అందరికీ ఆయన గురించి సవివరంగా చెప్పాలన్న తపనే తప్ప, ఎదో పీ హెచ్ డీ పరిశోధనగా నేను భావించడం లేదు. వీలయితే ఆరుద్ర గారి సమగ్రాంధ్ర చరిత్ర చదవండి. కవుల కాలాల గురించీ, జీవితాల గురించీ చెప్పడానికి ఆయనకీ కొన్ని సార్లు పుస్తకాలే ఆధారమయ్యాయి.

    వున్నంతలో, నాకున్న పరిధిలో ఆధారాలు చూపించాను. అవి చాలవనే పెద్దలకి నమస్కరించడం ఒకటే నాకున్న మార్గం.
    త్యాగరాజుకి కాస్త కోపం జాస్తనీ, ఆయన దగ్గర కొంతమంది శిష్యులిమడ లేకపోయారన్నది లిఖిత పూర్వకమైన వాస్తవం. కోప ప్రకటననేది ఒక వ్యక్తి గుణం. దానికీ, వారి సంగీత ప్రతిభకీ, అనుసరించిన ధర్మానికీ, నమ్మిన సిద్ధాంతాలకీ ముడి వేయకూడదు. మనక్కావల్సింది సంగీతం కానీ త్యాగరాజు ఎలా వస్త్రధారణ చేస్తే మనకేవిటి అనచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాల ద్వారా అభిమానులు ఆయన వేషాన్నెలా మార్చారన్నది తెలియ చెప్పడమే నా వుద్దేశ్యం. గాంధీ గురించి తెలుసుకోవాలంటే ఆయన సిద్ధాంతాల గురించే కాదు, ఆయన వస్త్ర ధారణ గురించీ, ఆయన అలవాట్ల గురించీ ప్రస్తావన వచ్చి తీరుతుంది. అవి చదివినంత మాత్రాన గాంధీ పై నున్న అభిప్రాయం మారుతుందని నేనకోను. లేదని ఖండిస్తే నేనేమీ చెయ్యలేను.

    అతి పిన్న వయసులో అసమాన సంగీత ప్రతిభ కలిగీ, కర్ణాటక సంగీతాన్ని ఒక మలుపు తిప్పిన ఓ మహా వ్యక్తి జీవిత చరిత్ర గురించి రాయడమే నా ఉద్దేశ్యం. కొత్త విషయాలు తెలిసి ఆనందించామంటే మంచిదే! నేనూ సంతోషిస్తాను. లేదూ మాకన్నీ తెలుసు నువ్వేమిటి చెప్పడమంటారా, నా అజ్ఞానాన్ని మన్నించండని వేడుకోడం తప్ప ఏం చెయ్యలేను.
    మీ సలహా మేరకు ఏ ఏ సంవత్సరాల్లో ఏ ఏ ప్రముఖ సంఘటనలు జరిగాయో చివర్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

  2. జనరంజని: మహానటి సావిత్రి గురించి rohin kumar అభిప్రాయం:

    01/10/2009 12:49 pm

    అద్బుతం ఈ ప్రొగ్రామ్. సావిత్రి గారి స్వరం వినడం ఎంతొ ఆనందంగా ఉంది. చాలా థాంక్స్.

  3. కొండ నుంచి కడలి దాకా గురించి Dr.Tatiraju Venugopal అభిప్రాయం:

    01/10/2009 11:40 am

    ‘ఉప్పొంగిపోయింది గోదావరి- ఆ పాత మధుర గీతం, రూపకం :
    మీరు వినిపించిన రూపకం వింటుంటే బాల్యంలో మా అద్దింట్లో వాకిట్లో ‘ఫ్రీ’గా కురుస్తున్న వెన్నెల్లో పరీక్షలయ్యాక పట్టని నిద్ర వల్ల రేడియో వింటున్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి.

    రూపకం చివర్లో శ్రీరంగం గోపాలరత్నం శ్రావ్య కంఠం ఆహా!

    అన్నట్టు ‘జోర్ సెయ్ ‘ని ‘సిరి సిరి మువ్వ’ సిన్మాలోని ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక’ పాట లోనూ వినవచ్చు. అంతెందుకూ, దేవులపల్లి వారి లలిత గీతం ‘ఎయ్ రా ఏసెయ్ రా గడ’ లో ‘జోరు సెయ్ బారు సెయ్ / కోరంగి రేవుకీ, కోటిపల్లి రేవుకీ (క)వినిపిస్తుంది. —-తాతిరాజు వేణుగోపాల్

  4. కొండ నుంచి కడలి దాకా గురించి రాఘవ అభిప్రాయం:

    01/10/2009 1:53 am

    మా గోదారమ్మతల్లి గురించి ఈ రూపకం వింటున్నంత సేపూ నా కళ్లు రెండు గోదారి పాయలయ్యాయి. అహో… సంగీతం అద్భుతం. నడిపిన విధానం అద్భుతం. ఆద్యంతం అత్యద్భుతం.

  5. ఈమాట గురించి గురించి సాయిరామ్ రాజు అభిప్రాయం:

    01/09/2009 11:50 pm

    ఏమాటకామాటే చెప్పుకొవాలి. ఈమాట నిజంగా చాలా బాగుంది. మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈమాటలో మన మాటలు కలుపుకోవచ్చు.. మంచిచెడులు చెప్పుకోవచ్చు.

  6. ‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి B.Ajay Prasad అభిప్రాయం:

    01/09/2009 11:27 pm

    లక్ష్మన్నగారికి
    రాయ్ సినిమాల మీద మీరు రాస్తున్న వ్యాసాలు చాలా బాగుంటున్నాయి. అలానే రోషమాన్ సినిమా మీద మీరు రాసిన వ్యాసం కూడా చాలా బాగుంది. వీటన్నిటిని పుస్తకరూపంలో తెస్తె మన తెలుగువారికి మరింత ప్రయోజనకరమంగా ఉంటుంది.
    అభినందనలతో
    బి.అజయ్ ప్రసాద్

  7. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి చివుకుల కృష్ణమోహన్‌ అభిప్రాయం:

    01/09/2009 10:03 pm

    బ్రహ్మానందంగారూ, ముందుగా మీ పరిశోధనకి అభినందనలు. ఒక విషయం మీద ఇంత ఆసక్తితో ఇంత శ్రమకోర్చి పరిశోధించడం – ఆ విషయాన్ని జనాలకి అందించాలన్న తపన నిజంగా అభినందనీయం. నిజానికి సంగీతసాహిత్యాలు రెండిటిలోనూ నా ప్రవేశం ఎల్. కే. జీ. కంటా తక్కువే. కాబట్టి ఇక్కడ వ్యాఖ్యానించడానికి నీకేమి అర్హత ఉందోయ్ అనేస్తే ఇంతే సంగతులు – చిత్తగించవలెను. ఒకవేళ మీ వ్యాసంతాలూకు లక్ష్యం చరిత్రని తేదీలతో పుస్తకాలకెక్కించే పి. హెచ్. డి. చేసేవారు అని అంటే ఇంక నేను చెప్పాల్సిందీ లేదు – ఈ వ్యాఖ్యని తొలగించినా నాకు అభ్యంతరం లేదు.

    “పనిలో పనిగా అందులోంచి మరిన్ని కట్టు కథలు పుట్టుకొచ్చాయి. ఇవేమీ సరి కాదు. ఇందులో వాస్తవమెంతుందో చెప్పడం చాలా కష్టం. ” మీ వ్యాసస్ఫూర్తిని ఈ వాక్యం బాగా చెబుతున్నాది అనిపించింది. అంటే ఇవన్నీ తప్పని మీ ఉద్దేశ్యమా లేక, ఎంత తప్పుందో తెలియదనా? మా విశాఖపట్నం వాతావరణకేంద్రం వారి హెచ్చరికలాగ అయితే మబ్బుగా ఉండొచ్చు లేక ఎండగా ఉండొచ్చు అన్నట్టుగా అనిపించింది నాకైతే. మీ పరిశోధనా ఫలితాలని కించపరచటం నా లక్ష్యం కాదు. నేను చెప్పదలుచుకున్నదేమిటంటే ఖచ్చితంగా చెప్పలేని చరిత్రని ఆపోశన పట్టడానికి మీకున్న సర్వశక్తులనూ వినియోగించడం దేనికని. మీరు గత మూడు భాగాలలో పేర్కొన్న చాలా విషయాలు, మీరు పేర్కొన్న పుస్తకాలలో జరిగినట్టుగా జరిగినా, అందులో ఏదో ఒక్క పుస్తకంలో ఉన్నట్టు జరిగినా, లేక అవన్నీ తప్పే అయినా, త్యాగరాజు కర్నాటక సంగీతానికి చేసిన సేవలోగానీ, సంగీతాభిమానులు త్యాగరాజుకి మనసులో అందించే ప్రణామాల స్థాయిలో గానీ ఏమాత్రం మార్పు రాదు. పోనీ, మీ ఈ పరిశోధన ద్వారా “ఇదీ త్యాగరాజు తేదీల చరిత్ర” అని నిర్ద్వంద్వంగా ప్రకటించే అవకాశం వస్తుందా అంటే అది కూడా కనిపించటంలేదు.

    ఉదాహరణకి తాజ్ మహల్ గురించి పరిశోధన ఇలా సాగిందనుకుందాం. తాజ్ మహల్ ఆర్కిటెక్టు దక్షిణభారత దేశం నుంచీ వచ్చాడని ఒక వాదన ఉంది. కాదు పర్షియానుంచి శిల్పిని రప్పించారు అన్న వాదన కూడా బలంగానే ఉంది. ఇందులో ఏది వాస్తవమో చెప్పడం కొంచెం కష్టం. చెక్కుతున్న శిల్పులు కొంతమంది తెలుగు మాట్లాడేవారు. అలాగే ఒక ఇద్దరు ఉర్దూ కూడా మాట్లాడేవారని ప్రతీతి. ప్రధాన శిల్పి ఆరడుగుల ఎత్తుతో ఉండేవాడనీ, కొన్ని చిత్రపటాలలో అతనిని టోపీతో చిత్రీకరించినా అతనికి టోపీ పెట్టుకోవడం అంతగా అలవాటు లేదనీ తెలుస్తోంది. ముఖ్యంగా అతనికి కోపం చాలా ఎక్కువగా ఉండేదనీ, అయినా మిగతా శిల్పులు ఆ కోపానికి భయపడి పారిపోకుండా నిర్మాణాన్ని కొనసాగించి ఇవాళ మనందరం ఆనందించడానికి అనువుగా తాజ్ మహల్ ని నిర్మించారు.

    అలా కాకుండా తాజ్ మహల్ లో దక్షిణ భారత శిల్పకళ ఎక్కడ చూడవచ్చు – ఏఏ సాంప్రదాయాలు ఎలా కలిసాయి, అసలు చెక్కడంలో కానీ, నిర్మాణ కౌశలాన్ని కానీ ఎలా ఆస్వాదించాలి, నిర్మాణంలో ఎక్కడెక్కడ ఎలాంటి కష్టాలు ఎదురయ్యిఉండవచ్చు, ఒక కళారూపంగా, ఆ కాలంలో నిర్మింపబడ్డ మిగతావాటికంటా ఇది ఎందుకు గొప్పది, ఆ కాలంలోని ఏ ఇతర కళారూపాలు దీనికి ప్రేరణ కావచ్చు – ఇలా పరిశోధన సాగితే ఎలా ఉండేది?
    ఇంత విమర్శించడానికి నీకేమి అర్హత ఉందోయ్ అనెయ్యకండి. నేనిలా అనడానికి అర్హతకన్నా అభిమానం మూలకారణం. ఇంత పరిశ్రమకోర్చి ఇన్ని విషయాలు సేకరించాలన్న మీ తపనకి నేను వీరాభిమానిని. కాకపోతే అదే పరిశ్రమని మరింతమందికి మరిన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా మీరు ఉపయోగిస్తే బాగుంటుందని చిన్న ఆశ. అందుకే ఈ విన్నపం. ఎక్కడైనా కఠినంగా వ్యాఖ్యానించానని అనిపిస్తే క్షమించండి. అది నా భాషా దోషమేగాని, భావదోషం కాదని సవినియంగా మనవి చేసుకుంటూ…

  8. అనువాదంలో మెలకువలు గురించి mOhana అభిప్రాయం:

    01/09/2009 8:03 pm

    వ్యాసం ఆలోచనాదాయకంగా ఉంది. అనువాదాలకు అనువాదాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫిట్స్ జెరాల్డ్ అనువాదం ఉమర్ ఖయ్యాం రుబాయీలకు అనువాదం కాదు. అతడు రాసింది ఉమర్ ఖయ్యాం పైన. Helen Cadell 1889లో ఉమర్ ఖయ్యాంకు దగ్గరగా తర్జుమా చేశారు. ఆమె ఫిట్స్ జెరాల్డ్ తర్జుమాపైన ఇలా
    చెప్పారు –
    While acknowledging that the translator has been, on the whole, successful in catching the sound of the Persian lines, wonderfully so in setting thoughts and phrases from the Persian in his English verses, we contend that this is hardly enough to satisfy us in the translation of a set of epigrams. It is a poem on Omar, rather than a translation of his work….

    ఫిట్స్ జెరాల్డ్ తన అనువాదంలో మార్పులు చేసినప్పుడు తెలుగు వాతావరణం కలిగించడానికి తెలుగు రచయితలు స్వాతంత్ర్యం ఎందుకు తీసికోరాదు? రాయప్రోలు సుబ్బారావుగారి మధుకలశమును ఎందుకు పేర్కొనలేదో వ్యాస రచయిత. అందులోనుండి పద్యం –

    ఈ సుమశాఖసందిట సఖీ రుచు లూరెడు వెన్నరొట్టెయున్
    ఆ సవపూర్ణమౌ పాత్రికయు నందపు పాటల పుస్తకమ్ములున్
    మోసలనుండి, నీ వడవిపొత్తుల నాడుచు పాడుకొంచు నా-
    తో సుఖముందువేని కలదో యిది స్వర్గము గాక యెక్కడో

    ఆదిభట్ల గారి తెలుగు అనువాదం యిక్కడ –

    పచ్చిక బీడచ్చోటన్
    మచ్చికతో నీవు కొలది మై మఱపున నె-
    ల్గెచ్చిన పాటలఁ గుల్కుట
    నెచ్చెలి మన కారు బ్రతుకు నే మెచ్చఁ దగున్

    ఉమర్ అలీషా కూడా రుబాయీలను తెలిగించారు. వీరికి పారసీకం బాగా తెలుసు కనుక మూలాన్ని క్షుణ్ణంగా చదివి అనువదించారు.
    విధేయుడు – మోహన

  9. కొండ నుంచి కడలి దాకా గురించి kasinadhuni rajasankar అభిప్రాయం:

    01/09/2009 6:51 pm

    పరచూరి శ్రీనివాస్ గారు,
    ఎన్నో చిన్ననాటి విషయాలు గుర్తుకొచ్చాయి ఈ రూపకం విని. శతసహస్ర వందనాలు అందించినందుకు. “ఉప్పొంగి పోయింది గోదావరి…” ఎప్పటిదో తెలుగు పాఠ్యపుస్తకంలో చదివిన గుర్తు. Hyderabad AIRలో “ఈ మాసపు పాట” తదితర లలిత సంగీత కార్యక్రమాలలో చాలా మంచి గేయాలు ప్రసారమయ్యేవి. వాటిలో “నదీ సుందరి సుధాస్యందిని నగాధీశ్వర నందిని…” ఇంకా “గోదావరీ, నాదఝరీ, ఎన్నెన్ని యుగాల స్మృతులు యద బరువై పారుదువో…” ఇప్పటికీ గుర్తున్నాయి. చక్కని సాహిత్యం, అంతకు మించిన సంగీతం ఈ పాటలు ఇప్పటికీ గుర్తుండడానికి కారణం. ఇవి మీరు సేకరించి ఈమాటలో అందించగలిగితే మీకు సదా ఋణపడి ఉంటాను.
    రాజాశంకర్

  10. కొండ నుంచి కడలి దాకా గురించి రానారె అభిప్రాయం:

    01/09/2009 3:11 pm

    ఉప్పొంగిపోయింది గోదావరి … ఈ గీతాన్ని ఎప్పుడో విన్నట్టు లీలగా జ్ఞాపకం. ఈ సంగీతరూపకంలో అది మళ్లీ వినబడేసరికి ఏదో ఆనందం.

    జోర్ సెయ్ బార్ సెయ్ … ఈ మాటలు శేఖర్‌కమ్ముల సినిమా ‘గోదావరి’లోని – ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి – అనే పాటలో కూడా వినబడతాయి. ఈ రూపకంలో వినేటప్పుడు నాకనిపించింది బహుశా ఇవి నదిలో లయబద్ధంగా తెడ్డు వేసేటప్పుడు అలుపురాకుండా పాడే ఊతపదాలని. నదీప్రవాహాలు, సముద్రతీరాలు, జాలర్లు, నావలు… వీటితో నాకు పరిచయం లేదు. నేను పెరిగిన (కరువు)ప్రాంతంలో ఇవేవీ లేకపోయినా, గోదావరిని నేనెప్పుడూ చూడకపోయినా, వింటూవుంటే చాలా బాగుంది.

    మాచిరాజు సావిత్రిగారి కథ ‘తరవాణి కేంద్రం’లో చెప్పినట్టుగా, మనజీవనవిధానంలో సంస్కృతిలో వస్తున్న మార్పులతోపాటుగా శ్రామికులపాటలూ కనుమరుగు కావలసిందే, వాటినిలా భద్రపరచి విని తెలుసుకొని ఆనందించడం మాత్రమేనేమో మనం చేయగలిగినది!

    కృతజ్ఞతలు శ్రీనివాస్ గారూ.