కొక్కొండ: అనుబంధం-1

అపరాజిత (పరాజిత) 14 శక్వరి 5824 – IIII IIUI UII UIU న-న-ర-స-ల-గ 9

మునుకొని యిట నీకు మ్రొక్కెద మక్కఱన్
వినుతవుగద వమ్మ బిల్వకనాయికా
విను మనవిని మాది బిల్వక యాత్ర మా
కొనరఁగ వర మీవె యో యపరాజితా – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 12

అమృతవాహిని – సంస్కృతములోని అనుష్టుప్పు శ్లోకము, సరి పాదాలలో 5,6,7 అక్షరాలు జ-గణముగా, బేసి పాదాలలో అవే అక్షరాలు య-గణముగా నుండాలి, తెలుగులో ప్రాస ఉండాలి.

నుతింతున్ తనుమధ్యాంబన్
నుతింతున్ బిల్వనాథునిన్
మతిన్ గౌరీపురీ చిత్ర
హిత చారిత్ర మెంచెదన్ – 2.318

అలసగతి 15 అతిశక్వరి 7648 – IIIII UIII UIII UU న-స-న-భ-య 10

అనువుగను వా రటు విహారమును జేయన్
వన మదియు దానఁ గన వర్ణనను దానున్
ఘనయశముఁ గాంచ ననఁగా నమృతభానుం
డొనరె నపు డీశుఁ డిటు లొప్పుగను జెప్పెన్ – 2.31

అభినవతామరస (కమలవిలాసిని, తామరస, లలితపద, తోదక, తోవక, దోధక, కలరవ) 12 జగతి 4896 – IIII UII UII UU న-జ-జ-య 8

అభినవ తామరసాభ సునేత్రా
శుభకర భక్త సుశోభన గాత్రా
ఋభుముని వందిత శ్రీసుకళత్రా
ప్రభువర రక్షక పక్షిపపత్రా – 3.323

అమృతవాహిని – సంస్కృతములోని అనుష్టుప్పు శ్లోకము, బేసిపాదాలలో 5,6,7 అక్షరాలు జ-గణముగా, సరి పాదాలలో అవే అక్షరాలు య-గణముగా నుండాలి, తెలుగులో ప్రాస ఉండాలి.

నుతింతున్ తనుమధ్యాంబన్
నుతింతున్ బిల్వనాథునిన్
మతిన్ గౌరీపురీ చిత్ర
హిత చారిత్ర మెంచెదన్ – 2.318

అర్ధసమవృత్తము – మొదటి రెండు పాదములు IIII IIU IIII UU న-న-భ-స-గ (1,8) 13 చివరి రెండు పాదములు IIII IIU UII UU న-న-త-య (1,8) 12 సామాన్యముగా అర్ధసమవృత్తములలో సరి పాదములు ఒక విధముగా, బేసి పాదములు ఒక విధముగా ఉంటాయి, కాని ఈ అర్ధసమవృత్తములో మొదటి రెండు పాదములు ఒక విధముగా చివరి రెండు పాదములు ఒక విధముగా నున్నాయి, ఈ లక్షణాలు ఉపజాతికి సరిపోతాయి.

సరిగమపధని స్వరము లివేడున్
బరగఁగ దెలుపున్ బ్రణవముఁ గూడన్
హరియని హర యంచాదటఁ జూడన్
హరిహరుల యభే దాశయ మౌఁగా – 4.145

అశ్వగతి (అశ్వాక్రాంత, పద్మముఖీ, సంగత) 16 అష్టి 28087 – UII UII UII UII UII U భ-భ-భ-భ-భ-గ 10

అప్పుడె తెప్పున గౌరి ప్రయాణము సేయుదమా
యిప్పు డనంగ మహేశ్వరు డేటికి జాగనియెన్
జెప్పఁగ నందఱుఁ గ్రందుగఁ జేరిరి పెండ్లి కనన్
మెప్పుగ వాహిను లంబుధి మేలుగ నందు క్రియన్ – 6 తృతీయ భాగము, కల్యాణరసజ్ఞ పర్వము 111

ఆటబోటి – సూ-సూ-సూ-ఇం-ఇం-చం / సూ-సూ-సూ-సూ-సూ-చం యతి లేక ప్రాసయతి (1.1, 4.1, 6.1)

లేమ గేలి కోలి నేమేమొ యంటిని రామరామ
నీ మది కది గినుకగా ముగిసెనె రామరామ
యేమి సేయువాఁడ నేమన్నఁ బడియెద రామరామ
సౌమనస్య మున్నఁ జామ యోము రామరామ – 2.82

ఆటవెలది – (సూ-సూ-సూ) (ఇం-ఇం) / (సూ-సూ-సూ) (సూ-సూ)

పలువు రెంద్రుగాక స్వస్వభాషోన్నతి
దేశభాషలందుఁ దెలుగు లెస్స
యంచు నెంచెగాఁ హరి కృష్ణదేవరా-
యనికిఁ దెలియ సాక్షి యతని కృతియ – 1.53

ఇంద్రవజ్ర 11 త్రిష్టుప్ 357 – UUI UU IIUI UU త-త-జ-గ-గ 8 సంస్కృతములో యతి లేదు, నేను ఆఱవ అక్షరముతో యతి నుంచుతాను, అప్పుడే వృత్తము మాత్రాబద్ధమై ఉంటుంది.

బిల్వేశ్వరీయ మ్మన వేధ యుబ్బున్
బిల్వేశ్వరీయ మ్మన విష్ణు వుబ్బున్
బిల్వేశ్వరీయ మ్మన భీముఁ డుబ్బున్
బిల్వేశ్వరీయ మ్మన విశ్వ ముబ్బున్ – 6 తృతీయ భాగము, నవాధ్వరత్న పర్వము 13

ఉత్సాహ – (సూ-సూ-సూ-సు) (సూ-సూ-సూ-గ)

సర్వజిత్తు వత్సర మిది సద్విజయకరంబగున్
సర్వజిత్తు శ్రీశ్వరుండు సదవనుండు గావునన్
సర్వజిత్తుగాఁ గృతి యిది సంప్రవృత్త మయ్యెనౌ
సర్వజిత్తుగాదె దైవ సంప్రయుక్తి నంతయున్ – 1.33

ఉత్పలమాల (కామలతా, ఉత్పలమాలిక ) 20 కృతి 355799 – UIIUIUIII UIIUIIUIUIU భ-ర-న-భ-భ-ర-ల-గ 10

శంకరి నీ మొగంబు నెలజానుగఁ గొల్చిన డిందుఁగం దటన్
చంకిలి యేదివచ్చె శశి యాదరమొప్పఁగఁ జూడు వీని మీ-
నాంకుని మామ మామక శిఖాంచితుఁ బ్రాంచితు నుత్పలాప్తునిన్
బొంకమగున్ గదా వినతపోషణ ముత్పలమాలికేక్షణా – 2.32

ఉపేంద్రవజ్ర 11 త్రిష్టుప్ 358 – IUI UU IIUI UU జ-త-జ-గ-గ 8 నాకేమో ఆఱవ అక్షరము యతిగా ఉంటే బాగుందనిపిస్తుంది.

అపర్ణ యాత్మాఖ్య సహార్థముంగా
నుపేంద్రవజ్రంబన నొప్పు కత్తిన్
వ్యపేతశీర్షుండుగ వానిఁ జేసెన్
క్షపాచరాధ్యక్షుని సైంహదేహున్ – 5 ఉత్తర భాగము, 141

కందము – చ-చ-చ / (చ-చ-చ) (చ-చ) నిడుద పాదము గుర్వంతము, బేసి గణముగా జ-గణము నిషిద్ధము, నిడుద పాదములో మూడవ గణము న-లము లేక జ-గణము, అన్ని పాదాలలో మొదట గురువు గాని, లఘువు గాని ఉండవలయును, ప్రాస నియతము.

నే మల్లికార్జునుండను
శ్యామల భ్రమరాంబ వీవు సరిగద యింకన్
నీ మహిమ మెన్నఁ దరమె
కామిని సరసతను గాళికవుగా రుచినిన్ – 2.57

పథ్యా కందము – చ-చ-చ / (చ-చ-న-ల) (చ- గ)అన్ని చోటులలో వీరు ఈ లక్షణాలను సరిగా అనుసరించ లేదు.

సా పలుకుఁగాదె సాంబా
చూపున్ దాండవము నెమలి సుతి పొందన్
నీపేరొందెను గ్రీవన్
నీపదమున్ గనరె నతులు నిఖిలేశా – 4.139

విపులా కందము – చ-చ-చ / (చ-చ-న-ల) (చ- గ) దీని ప్రత్యేక లక్షణము ఏమంటే మొదటి (మూడవ) పాదములోని చివరి పదము స్వతంత్రముగా నిలువకుండ రెండవ (నాలుగవ) పాదపు మొదటి అక్షరములతో చేరవలయును. ఈ పద్యాన్ని కూడ పంతులుగారు అన్ని చోటులలో సరిగా వాడలేదు.

యతమాన భక్తిరత్న సు-
హితకరుఁడ నియోగివిజయ మేలు భవా
క్షితిరథగతి నీవే కా-
కితరు లెట నియోగివిజయు నేళు శివా – నియోగివిజయము, బిల్వేశపీఠిక

చపలాకందము – చపల నాలుగు పాదములకు అప్పకవీయము ప్రకారము లక్షణములు ఇలాగుంటాయి – చ-చ-చ / (జ-చ-చ) (చ-గ) / చ-చ-చ / (జ-చ-ల) (చ-గ). పద్యానికి మొత్తము 57 మాత్రలు (12, 18, 12, 15) మాత్రమే. అప్పకవి ప్రకారము చపలాకందమునకు రెండవ పాదమునకు 18 మాత్రలు ఉంటాయి, నాలుగవ పాదమునకు మాత్రమే 15 మాత్రలు. కాని పంతులుగారు, రెందవ పాదానికి కూడ 15 మాత్రలను ఉంచారు.

సరిగాగాఁ బల్కుటకుఁ ద-
గరయ్యె దక్షుండు గననగుఁగా
సిరిఁ గనె నీదయచే నది
స్మరింపఁ ద్రిదివంబు సమకొనదే – 4.141

ముఖ చపలా కందము – చ-చ-చ / (జ-చ-చ) (చ-గ) / చ-చ-చ / (చ-చ-చ) (చ-గ). రెండవ పాదము మాత్రము చపలాకందములా ఉంటుంది యిందులో, నాలుగవ పాదము పథ్యాకందములా ఉంటుంది ఇందులో.

తనుమధ్య మాప్తినీ ప్రియ
మునీడ్య తనుమధ్య పొరిఁ దనరెన్
గనుగొన మా మధ్యమ గద
వినరే మధ్యములు నరులు బిల్వేశా – 4.142

జఘనచపలా కందము – చ-చ-చ / (చ-చ-చ) (చ-గ) / చ-చ-చ / (జ-చ-ల) (చ-గ). మొదటి అర్ధము పథ్యలా, రెండవ అర్ధము చపలలా ఉంటుంది యీ కందములో.

ఒనరిచి పర్ణాశనమున్
దన ద్విజతకుఁ దగఁ బిక మిది దా నేర్చన్
ఘన పంచమస్వరంబున్
గనుంగొనమి ద్విజత గలదె యిలన్ – 4.143

మాకందము – చ-చ-చ / (చ-చ-జ) (చ-గ). ఇందులో ఆరవ గణము జ-గణము, చివరి గణము చతుర్మాత్రకు బదులు ఒక గురువు. మాకందము అనే మరొక కంద పద్యాన్ని నారాయణారెడ్డిగారు సృష్టించారు. ఈ పద్యాన్ని పంతులుగారు అన్ని చోటులలో సరిగా వాడలేదు.

అనుచుపవాసవ్రతమునఁ
దనుఁ బూజించును బిల్వదళములచేన్
ఘనభక్తి శ్రీఫలములన్
దనకిడ నా రామ రామనామాప్తిన్ – 2.157

రమాకందము – ఇది చపలాకందమువంటిదే, కాని యిందులో సమ పాదములలో ముందుగా జ-గణము ఉండవలసిన నియమము లేదు.

మును గంగభంగి నేనున్
ఘనతన్ గనఁ గోరఁ గమ్మనవే
నను బిల్వముగను దన్మహి-
మ నిపుడు నేఁ గంటి బిల్వ మహిజమనై – 2.196

మహాకందము – ఇది సంస్కృతములోని ఆర్యవంటిది. పాదాలు దీర్ఘాలతోనైనా, హ్రస్వాలతోనైనా ఆరంభించవచ్చును, సామాన్యముగా కందములో పాదములోని మొదటి అక్షరాలు అన్నీ గురువుగానో లఘువుగానో ఉంటుంది.

అనుభవ మెఱుఁగమి నపుడీ
వనిన నుడినిఁ గొనక యుఱక యట్లైతిన్
కనుగొంటిఁ దత్ఫలము నీ
మానిని నను నింకనైన మైకొనవే – 2.197

కమలవిలసిత (సురుచిర, ఉపచిత్ర, సుపవిత్ర) 14 శక్వరి 4096 – IIII IIII IIII UU న-న-న-న-గ-గ 9

కమలవిలసితము గద యిది గానన్
గమలనయనుఁ దనఁ గనబడునో నాన్
గమలజనని విను కమలజ మాతా
కమలదృగిత మని గరుడుఁడు వల్కెన్ – 3.140

కమలాకర 15 అతిశక్వరి 7033 – IIUII IIUII UII UU స-న-జ-జ-య 11

కమలాకర కమలాకర కంథి నిషంగా
విమలాశయ విమలాశయ విష్ణు విహంగా
యమరాచల సుశరాసన యాసుర శిక్షా
యమరింపుమ యమరింపుమ యాశ్రిత రక్షా – 4.136

కల్యాణ 26 ఉత్కృతి 2184355 – UIUIUII UIUIU IUIUIUIIU UIUIU ర-జ-జ-ర-జ-ర-స-ర-ల-గ 8,13,22

లోకపావనా నతలోకజీవనా ప్లుతాయితాండజేద్గతియాలోకనావనా
యో కృపాకరా వరయోగమాకరా యుమాక్షమారమాంచిత సంయుక్తమాకరా
నాకుభూశయా భువనస్తుతాశయా నమజ్జనప్రియామృత సన్నామసంశ్రయా
స్వాకృతీక్షణా విబుదౌఘరక్షణా యహోబలాలయేశ్వర కల్యాణవీక్షణా – 4.185

కరిబృంహిత 21 ప్రకృతి 782271 – UI IIII UI IIII UI IIII UIU భ-న-భ-న-భ-న-ర 13

కామ మురిగనుఁ గ్రోధ మది సృణి గాఁగఁ గరములఁ గ్రాలఁగా
నాము గురియఁగఁ జెక్కిళుల నొక హస్తమున బలు మచ్చరం
బై మెఱయఁ బెఱచేతఁ గుడుముగ నై తనరఁగను మోహ ము-
ద్దామ కృపణత కొక్కుగను జను దైవతము గణనాథుడా – 6 ప్రథమ భాగము, నంద్యుపాఖ్యానము 23

కవికంఠభూషణ (కవికంఠవిభూషణ) 19 అతిధృతి 177900 – IIUIUIII UIIUIIUIUIU స-జ-స-స-స-జ-గ 9

అమృతాకృతీ యసదహంకృతిభంజన భక్తరంజనా
యమృతాబ్ధిజాధిప సుఖాత్మకజ్ఞానద సత్యసన్నిధీ
కమనీయసద్గుణనికాయ దయాంబుధి కామితార్థదా
విమలాంతరంగ వరవిశ్వపతి జగతీశ శాశ్వతా – 1.343

కవిరాజవిరాజితము (హంసగతి, మహాతరుణీదయిత) 23 వికృతి 3595120 – IIII UII UII UII UII UII UII U న-జ-జ-జ-జ-జ-జ-ల-గ 14 తెలుగులో ఈ వృత్తానికి నన్నయకు తరువాతి కవులు సామాన్యముగా మూడు యతులను ఉంచుతారు.

వెలయఁగ వేల్పులకున్ ద్రిదివం బిలవేల్పులకున్ భువి సోఁకులకున్
విలసిలఁగాను రసాతల మెంతయు బ్రీతి సునీతి జగత్త్రయమున్
జెలఁగెను వారలు గారవ మారఁగఁ జేకొని స్వేష్ట పదార్థము లిం-
పెలయఁగ నేలుము రాజ్యమన గొనియెన్ గవిరాజవిరాజితమున్ – 5 ఉత్తర భాగము, 393

కాంతి (కలికాంత, కాంత, గీతాలంబన, మోటక, మోటనక) 11 త్రిష్టుప్ 877 – UU IIU IIU IIU త-జ-జ-ల-గ 8 నా ఉద్దేశములో ఆఱవ అక్షరము యతిగా ఉంటే పాదము నాలుగు మాత్రలుగా విరుగుతుంది.

ఆదిన్ సుధఁ గాంచిన యట్టులె య-
ప్డా దేవినిఁ గాంచిరి హర్షముతో
నా దేవత లెల్ల మాహా ప్రవణుల్
శ్రీదేవినిఁ గొల్చినఁ జెందరె శ్రీన్ – 5 ఉత్తర భాగము, 111

కుసుమలతావేల్లిత (చంద్రలేఖా, చిత్రలేఖా) 18 ధృతి 37857 – UUUUU IIIIIU UIUUIUU మ-త-న-య-య-య 12 సంస్కృతములో 5,6,7 అక్షరాలకు పాదము విరుగుతుంది. పాదాదిలో మందాక్రాంతముకంటె దీనికి ఒక గురువు ఎక్కువ. ఈ రెండు వృత్తాలకు అదొక్కటే తేడా.

రామారత్నాంబా కనుగొనవె యబ్రంబు బిల్వద్రుమం బా-
రామంబం దిందు న్వివిధ సుమముల్ రాజిలం బూచు రోచుల్
వేమా ఱెంచంగన్ గుసుమితలతావేల్లితంబై తగుంగా
శ్రీమత్కావ్యాలంకృతులు విబుధశ్రీనుతుల్ గారె దాతల్ – 2.16

కుసుమవిచిత్ర (గజలలిత) 12 జగతి 976 – IIII UU IIII UU న-య-న-య 7

గొన బగు దీనిన్ గుసుమవిచిత్రం-
బును గనుగొంటే పొగడఁగ నంగన్
ఘనముగ దృష్టిన్ గనమికిఁ దేంట్లిన్
దొనరు నటం చే నొగి మది నెంతున్ – 2.21

క్రౌంచపద (తెలుగు) 24 సంకృతి 4193479 – UII UU UII UU IIII IIII IIII UU భ-మ-స-భ-న-న-న-య 11, 19 ప్రాసయతి (1,6) సంస్కృత క్రౌంచపదములో చివర గ-గ కు బదులు స-గణము ఉంటుంది. కొందరు కవులు ప్రాసయతిని పాటించరు, వివరాలకు నా వ్యాసము చదవండి. ఈ కవి కూడ ప్రాసయతిని పాటించలేదు, కాని అంత్యప్రాసను పాటించారు.

శ్రీరమణా నన్నారయ మీనాకృతి కమఠ కిటి నృహరి వటూ రా-
మా రఘురామా మా బలరామా స్మరజయ యసికర మహితసునామా
వారణరక్షా వాసవపక్షా వరదయవరద యవనఘనదీక్షా
నారదగేయా నీరదకాయా నతసుర నరతతి నతిసువిధేయా – 2.154

క్షితి 1 శ్రీ 2 – I ల
శి


ను – 2.50

గణనాథ 12 జగతి 911 – UIII UU UIII UU భ-య-భ-య 7

దక్కితివి మూలాధార పరమాత్మా
నిక్కముగ నీవే నేత వరయంగాఁ
జక్కఁగను నాకున్ సంతసము నీవే
మ్రొక్కెదను నీకున్ ముందు గణనాథా – 6 ప్రథమ భాగము, నంద్యుపాఖ్యానము 27

గాయక 23 వికృతి 1794927 – UIIIUIIU IIUU UIIUIIU IIUU భ-జ-జ-య-భ-భ-భ-గ-గ 9,13,20

హే హర నమో భవతేహృదయేశా యీశ్వర విశ్వవిభో మృడ శ్రీశా
బ్రూహి భవ మామవ భో పురుషేశా భోగివిభూషణ శంభుపదేశా
దేహి హిత మే వచ మే ద్రిపతీశా దివ్యచరిత్రనుతాద్రిసుతేశా
పాహి శివశంకర మాం పరమేశా పావన బిల్వపతే ప్రణతేశా – 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 160

గౌరీ (చంచలాక్షీ, ప్రముదితవదనా, మందాకినీ, ప్రభ, ప్రభాత) 12 జగతి 1216 -IIII IIU IU UIU న-న-ర-ర 8 నా ఉద్దేశములో పాదాన్ని 3,3,5,5 మాత్రలుగా కూడ దీనిని విడదీయవచ్చును.

ఒనరెడు కనకద్యుతిన్ గౌరి నీ
వనల రుచిని మించనన్ మించెదౌ
దినకర నవకాంతి నాత్మప్రభన్
బ్రణుత వయితి వీ వడిం గూడవే – 2.211

చంద్రమౌళి 6 గాయత్రి 11 – UIU IUU ర-య

దేవ చంద్రమౌళీ
దేవి చంద్రమౌళీ
కావుఁ డీరు నన్నున్
గావ మీరె కారే – 1.302

చంద్రవదన (కామలతికా, కామలలితా) 6 గాయత్రి 15 – UIII UU భ-య

ఇందుధర నీకే
వందన మొనర్తున్
బొందుగను నీదౌ
సుందరికిఁ గూడన్ – 1.298

చంద్రశ్రీ 15 అతిశక్వరి 5058 – IUUUU UIIII UUI UU య-మ-న-య-య 11

అగున్ చంద్రశ్రీ వీఁడవును ఖసరోబ్జంబు గాడే
నగున్ నామం బియ్య త్రిజుని కెటు లబ్జుం డనంగన్
దగుంగా తేంట్లెంతేఁ దమి గుమిగఁ దార్కొన్న పూగు-
త్తి గంగాఁడే నల్పున్ వెలివెలుఁగు ద్రెక్కోఁడ దేలా – 2.33

చంద్రశేఖర 15 అతిశక్వరి 10928 – IIIIUI UIUI UIUIU న-జ-ర-జ-ర 13

శివ జగదీశ మమ్ము బ్రోవు చంద్రశేఖరా
శివ నగదయ్య కావవేని నల్వె శ్రీకరా
శివమగు నీకు మిత్ర భూత యక్ష శేఖరా
శివమగు మాకు బిల్వనాథ యాప్త శ్రీకరా – 4.147

చంద్రికా (అపరవక్త్ర, ప్రసభ, భద్రికా) 11 త్రిష్టుప్ 704 – III III UI UI U న-న-ర-ల-గ 11

అన నయినను బోద మా గృహం-
బున కనెఁ బతి యైనఁ బోదమం
చనె సతి యిటఁ జంద్రికాప్తి యం
చన రతినుత చంద్రికాప్తి నా – 2.42

చంపకమాల – IIIIUIUIII UIIUIIUIUIU న-జ-భ-జ-జ-జ-ర 11

తను నెవరున్ వరింప మఱి దార్కొన నేరకయుండఁగన్ దపం-
బును బొనరించి యవ్వరముఁ బొందినయట్టి యరుంధతీక్రియన్
వనమున నిందుఁ బొల్చె మధుపంబులు సేరకయుండ దవ్వునన్
జనఁగ సుగంధబంధురత జానగుఁ జంపకమాల సూచితే – 2.19

జన (పుష్ప, మద, మధు, బలి) 2 అత్యుక్త 4 – II ల-ల

అను
మను
మును
కొని – 2.104

జలద 13 అతిజగతి 3543 – UII UIU III UIIU – భ-ర-న-భ-గ 10 ఉత్పలమాలలోని మొదటి 13 అక్షరాలు కలిగి ఉంటుంది యీ జలదవృత్తము.

వేసవి నెండ నుక్కఁ గడు వెక్కసమై
వేసరిజేసినన్ దపము విశ్వజనుల్
వాసిగ వారి నేల హరి వచ్చెనొ నా
భాసిలె నింగినిన్ జలదవార మహా – 5 పూర్వ భాగము, 148

జలధరమాలా (యతి, కాంతోత్పీడా) 12 జగతి 241 – UUU UIIII UUUU మ-భ-స-మ 9

ఆదిన్ దా పింఛములుగ నంతన్ దంతు-
ల్గా దైవారున్ మలలుగఁ గాంచన్ మబ్బుల్
శ్రీదంబుల్ మేలని రహిఁ జెందన్ గాపుల్
శ్రీదంబుల్ ఘోరములని చెప్పన్ బాంథుల్ – 5 పూర్వ భాగము, 149

జాగ్రత్ 17 అత్యష్టి 28540 – IIUII IIUII IIUII UU స-న-జ-న-భ-గ-గ 11

అరుణారుణ కరుణామయి హరిణాధిప మధ్యా
శరణాగత భరణాశశి శరణా తనుమధ్యా
శరణ మ్మని నెఱ నమ్మితిఁ జరణమ్మును నీదే
కరుణింపుము కరుణింపుము కరుణింపుము నన్నున్ – 6 ప్రథమ భాగము, భీమోపాఖ్యానము 37

జాగ్రజ్జాతి – ఆఱు, ఆఱు, ఆఱు, నాలుగు మాత్రలు, యతి 13వ మాత్రపైన

పరఁగింప కుమాశంగ్రుధఁ బాశాంకుశపాణీ
వరమీయవె వెఱఁ బాపవె వరదాభయహస్తా
కరకమలాముక్తైక్షవ కార్ముకసుమబాణా
కరుణింపుము నిశ్చలమతి ఘనధృతిఁ దనుమధ్యా – 6 ప్రథమ భాగము, భీమోపాఖ్యానము 38

జ్ఞాన 16 అష్టి 15805 – UUII IIUII UIIII UU త-న-భ-భ-స-గ 10

అజ్ఞానముఁ దొలగింపు మహ మ్మతిఁ బరమేశా
సుజ్ఞానముఁ గలిగింపుము చొప్పడఁగ నుమేశా
ప్రజ్ఞానము గద బ్రహ్మము భక్తుని కిడు మీశా
విజ్ఞానము శివ మీవని వేఁడెద శివ శ్రీశా – 6 ద్వితీయ భాగము, రత్నదాస సర్గము 96

డమరుక 16 అష్టి 30564 – IIUUUIIU IIIUIIIU స-త-జ-స-న-గ 9 ఈ పద్యపు నడక మాలినీవృత్తము లాటిదే, కాని మాలిని నడకలా ఉండాలంటే యతిని ఎనిమిదవ అక్షరముపైన ఉంచాలి. కాని ఇలాటి మరొక చతుర్మాత్రల నడకతో నేను మాలినీవృత్తాన్ని కూడ వ్రాసియున్నాను.

విచలద్ద్రాఘిష్ఠసటా విచలితారిజలదా
ప్రచరన్నేదిష్ఠనత ప్రతతి సర్వశుభదా
శుచిమద్బంహిష్ఠ చతుశ్శ్రుతిశిరోభివినుతా
శుచిమద్బృందిష్ఠరమా సుభగలోకమహితా – 3.254

డిండిమ 15 అతిశక్వరి 11230 – IUI IIU IIII UIUIU జ-స-న-జ-ర 11 దీని నడక కొద్దిగా ఉపేంద్రవజ్రవృత్తాని పోలినది, ఉపేంద్రవజ్రకంటె దీనికి రెండు మాత్రలు ఎక్కువ.

బిలేశయశయా సువిదిత వీర్యసంశ్రయా
జ్వలజ్జ్వలన్వీక్షణ ఘనసంఘ గర్జనా
కులాచలనిభాంగ వినుతఘోరసంగరా
పలాశముకుళాభనఖర భక్తరక్షణా – 5 ఉత్తర భాగము, 620

తనుమధ్యా 6 గాయత్రి 13 – UU IIU U త-య

శ్రీవాక్తనుమధ్యల్
నీవల్లను గల్గన్
శ్రీ వాద్యవు గావే
దేవీ తనుమధ్యా – 2.215

తనుమధ్యమా 18 ధృతి 77378 – IUUU UUI UUI IIUI UUIU య-మ-య-న-ర-ర 8,15

మహాకాళి వీవౌదు మామానవతి యాదిమా తామసీ
మహాలక్ష్మి వీవౌదు మా బిందుమతి మాదిమా రాజసీ
మహావాణీ వీవౌదు మా జ్ఞానదయ వాదిమా సాత్వికా
మహాశక్తి వీవౌదు మమ్మేలు తనుమధ్యమా (మాతృకా) – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 28

తన్వీ 24 సంకృతి 4155367 – UII UU IIII IIU UII UII IIII UU భ-త-న-స-భ-భ-న-య 13

ధ్యేయవు గాయత్రివి పర వుమా వాగ్దేవివి నాలుగు తెఱఁగుల నుంటన్
నీ యభిదానం బిది శ్రుతిసమవర్ణేడితమై తెలుపును దనుమధ్యా
గేయవు షడ్బీజ వవుటను భవత్కీర్తిత నామము ముఖ మెఱిగించున్
శ్రీ యన బిల్వాఖ్యఁ దనరెదు నతశ్రీకరి శంకరి శివ తనుమధ్యా – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 27

తరళ (ధ్రువకోకిల) 19 అతిధృతి 186040 – III UII UI UII UI UII UIU న-భ-ర-స-జ-జ-గ 12 మత్తకోకిలలో మొదటి గురువును రెండు లఘువులు చేయగా లభించిన వృత్తము యిది.

వెరవునన్ బచరింతు పల్కుల వేవితంబుల వింతగాఁ
గరినిఁ ద్రుంచితి వించు విల్దొరఁ గాల్చి కూల్చితి వయ్యయో
తరళ మయ్యెడు మన్మన మ్మని తాను శంకరి పల్కినన్
గరిముఖాప్తుఁడ నిన్నుఁ గూడితిఁ గాంచవే యను శంభుఁడున్ – 2.25

తరువోజ – (ఇం-ఇం) (ఇం-సూ) (ఇం-ఇం) (ఇం-సూ) పూర్వార్ధమునకు, ఉత్తరార్ధమునకు ప్రాస కూడ ఉన్నది ఈ పద్యములో. అంటే రెండు ద్విపదలను చేర్చి నట్లున్నది.

అయ్యయ్యొ ననుఁ గన్న యయ్య యేమగునొ యయ్యార్యవర్యుని కయ్యెనే నెడరు
సయ్యమివరుఁ దండ్రిఁ జంపించి పాపజయ్యనై డయ్యనే జముచేతఁ జిక్కి
యయ్యయో శైలాది యా శైవరత్న మయ్య భవహయుం డహా యెటు లవునొ
కయ్యంబునన్ గెల్పు గల్గు నెవ్వనికొ క్షయ్యంబు దన ప్రాణసంచయం బంచు – 5 ఉత్తర భాగము, 555

తాండవ (చంచల, చిత్రశోభ) 16 అష్టి 43491 – UI UI UI UI UI UI UI UI ర-జ-ర-జ-ర-ల 9 ఇలాటి వృత్తాన్ని శంకరాచార్యులు తమ స్తోత్రములో ఉపయోగించారు. శంకరులపై నా వ్యాసాన్ని చదవండి.

లక్షితానుకంపయైవ లాలి తోంనమశ్శివాయ
పక్షివాహనద్వయాప్త పార్శ్వతే నమశ్శివాయ
పక్షభూతధాతృవిష్ణూ భావి తోంనమశ్శివాయ
దక్షయజ్ఞనాశకార్య దక్షతే నమశ్శివాయ – 4.64

తాండవజవ 18 ధృతి 63484 – IIU IIII IIII UII IIU U స-న-న-స-న-య 12

అని శంకరవిజయము విధి యాత్మజుఁ డిది సత్యం-
బను నర్థము విశదపఱుప హాయిగ మును సా పా
యని పాడును హరి మురజము నందికొనియు నోమో
మన ధింధి మనుచుఁ బలికెడుఁ ద్ర్యంబకుఁ డిపు డాడున్ – 6 ప్రథమభాగము , శంకరోపాఖ్యానము, 214

తారక 17 అత్యష్టి 31612 – IIUII IIUII UIIII UU స-న-జ-జ-న-గ-గ 11

తరణీందు హుత వహాంబక తారకబిల సింహా
శరణాగత భరణాశ్రిత శంకర సురసింహా
హరిణా లఘుకరణా ఘటికచల నరసింహా
కరుణకర కృతిరత్నముఁ గైకొనుము నృసింహా – 6 తృతీయ భాగము, నవాధ్వరత్న పర్వము 19

తుల్య-1 24 సంకృతి 15978301 – UU IIII UU IIII UU IIII UU IIII త-న-త-న-త-న-త-న 7,13,19

మారాకృతికృతమారా సువిజితమారా సువిధృత మా రాక్షసహర
శూరా గృహకృతశూరా కృతసురశూరా ధృతపరశూ రాజరుధిర
ధీరా శయనితధీరా జనితసుధీ రాజమద సుధీరత్నవినుత
నారాయణ శ్రిత నారాయణ నరనారాయణ హరి నారాయణహిత – 5 ఉత్తర భాగము, 621

తుల్య-2 23 వికృతి 3395380 – IIU UII UU IIII UU IIII UU IIU స-భ-త-న-త-న-త-ల-గ 13

పరమేశా జగదీశా హృత భవపాశా దితిభవనాశా ఘన సం-
గరభీమా జయభూమాప్రజనితకామా శ్రితసురసోమా సుగుణో-
త్కరధామా వరధామా సలిలజదామా మునిజనరామా సముద-
న్నరసింహా సురసింహా శుభకర నారాయణ నరసింహా వర శ్రీ – 4.184

తేటగీతి – సూ-ఇం-ఇం-సూ-సూ, యతి (1.1, 4.1)

ప్రజలు కొక్కొండవేంకటరత్నశర్మ
యంద్రు కవిరత్నమనియేని నార్యు లరసి
వాఁడఁ గవిమణీ నాముఁడఁ బరఁగెడుఁ గడు
మహినిఁ గవిమణి నామము మత్కృతి యిది – 1.31

తేఁటి – సూ-ఇం-ఇం-సూ-సూ-చం, యతి లేక ప్రాసయతి (1.1, 4.1, 6.1)

కృష్ణవేణివి గావునఁ గృష్ణ వయితొ కృష్ణకృష్ణ
కృష్ణమృగనేత్ర వగుటచేఁ గృష్ణవైతొ కృష్ణకృష్ణ
కృష్ణసోదరి వీవౌటఁ గృష్ణవయితొ కృష్ణకృష్ణ
కృష్ణవై తేల కాళికతృష్ణ నొక్కొ కృష్ణకృష్ణ – 2.64

తేఁటిబోటి – సూ-సూ-సూ-ఇం-ఇం-చం యతి లేక ప్రాసయతి (1.1, 4.1, 6.1) పద్యములో మొదటి పాదములో యతి మిశ్రణము ఉన్నది (ప్రాస యతి మఱియు అక్షర యతి). సామాన్యముగా ఒకటి కంటె ఎక్కువ యతి ఉంటే అది పాదమంతా ఒకే విధముగా నుండవలయునన్న నియమము ఉన్నది.

అత్తకంటెఁ గోడ లుత్తమురాలని యంద ఱెంచ
నయ్యరుంధతియొకొ యనసూయయో యని యన జను లా
రత్నదాసు జాయ రామ రామయొ యనఁ బ్రస్తుతయై
సుగుణఖని యనంగ సుమతి యనందగె సుముఖి పేర – 6 ద్వితీయ భాగము, రత్నదాస సర్గము 85

తోటక (ఛిత్తక, భ్రమరావళి, నందినీ) 12 జగతి 1756 – IIU IIU IIU IIU స-స-స-స 9 సంస్కృతములో యతి లేదు. తెలుగులో తొమ్మిదవ అక్షరము, నాకేమో చతుర్మాత్రల అందము పూర్తిగా తెలియాలంటే ఏడవ అక్షరమును యతిగా నుంచాలి, వేదం వేంకటరాయశాస్త్రిగారు కూడ దీనినే ప్రతిపాదించారు. శ్రీవేంకటేశ్వర సుప్రభాతములోని స్తోత్రములోని పద్యాలు ఎక్కువగా తోటక వృత్తములే.

పురుషోత్తమ శ్రీధర భోగిశయా
నరసింహ వినంగదె నా మనవిన్
మరి సూతుఁడు వల్కెను మౌనులతో
స్మరణీయము మౌక్తిక సచ్చరితన్ – 5 ఉత్తరభాగము, 1

దండకము – ఇది చివర గురువుతో నున్న ఒక త-గణ దండకము.

సర్వంసహాత్మా మహాత్మా సుకేశీశ్వరా భాస్వరా భౌమతాతా సమస్తాత్మభూతా విభూ యో విభూతీశ భూతేశ శంభూ స్వయంభూ లసద్భావ సద్భావ సద్వైభవా దేవ సద్యోభవా
శ్రీభవా జీవనాకార ధీరా యహంకారసాకార సోమా సశుక్రా సచక్రాయుధా దేవ యో వాసుదేవాకృతీ
శ్రీపతీ పశ్వినా దేవ యో వహ్నిరూపా స్వపత్నీకృతస్వాహ పుత్రీకృతాంచష్షడాస్యా షడాస్యోరుమంత్రాత్మకా బుద్ధిరూపా యఘోరా మహాఘోర త్రిస్థాన
శ్రీశానదేవా జగత్ప్రాణమూర్తీ శివావల్లభా దుర్లభా యో మనోవేగ రాజద్గురూ మద్గురూ యో ప్రకృత్యాత్మ తత్పూరుషా తత్పరా సత్పరా హస్తవిన్యస్త సద్రామ యో విద్విషద్భీమ
శ్రీభీమదేవా మహేశా నయాకాశరూపా దిశాధీశ సర్గైకభాస్వత్పితా యో త్రివర్గాపవర్గైకదాతా శ్రితప్రీత యో భోక్తక్షేత్రజ్ఞ సర్వజ్ఞ సద్భద్ర
శ్రీరుద్రదేవా మహావీరభద్రాత్మ సూర్యాత్మకా విశ్వకర్మోద్భవాధీశ తేజోమయా చిన్మయా నందనీభూతమందా యమందా మహావ్యాహృతీరథ్యబృందా దయానందితాశేషబృందారకా భక్తసదోహమందార కామేశ
శ్రీమన్మహాదేవ చంద్రస్వరూపా సురూపా కృపాపారకూపార నారీమణీరోహిణీప్రాణకాంతా సుకాంతామృతాంచనిశాంతా సుశాంతా సుపుత్రద్బుధా సద్బుధానందసంధాయకా మానసాకార సన్మానసాకార గాయత్ర్యుపాస్యా వరాస్యా సదామోదితప్రాగ్ర్య
శ్రీయుగ్ర దీక్షాంగనాసంగతా ప్రాప్తసంతాన సంతానసంలక్షితా దీక్షితా యాత్మనిత్యా సుసత్యైకలక్ష్యా మహోంకారవీక్ష్యా జగద్రక్షకా దేవదేవాఖ్య
శ్రీముఖ్యనామాష్టమూర్తీ మహాష్టాపదాద్రీశవర్తీ మరుచ్చక్రవర్తీ హృతాత్మీయభక్తోత్కరార్తీ శివా శంకరా నీకు సాష్టాంగముల్గా నమస్కారముల్ రత్నసంఖ్యాప్తిగాఁ జేయుచున్నాఁడఁ గంగొన్నఁ గాఠిన్యమున్ ద్రవ్యమున్ జీర్ణతోష్ణత్వముల్ ప్రాణముఖ్యాది సామర్థ్యమున్ నాళరంధ్రావకాశంబు చక్షుస్థ్సతేజంబు స్వాంతంబు నయ్యాత్మయున్ నీవయౌ దింతియేకాక తన్మాత్రలున్ జ్ఞానకర్మేంద్రియంబుల్ ద్వదీయంబులే యౌను బంచాననా దేవపంచాననా పంచకృత్యేశ పంచాత్మకా పంచమా పంచమాంచత్సుమంత్రాంచితా ప్రాంచితా వేఱెయం చెంచి నిన్నెన్న సక్యంబె సర్వంబు నీవౌదు సర్వేశ బిల్వేశ మన్నాథ శ్రీనాథ శ్రీబిల్వనాథా యివే నీకునౌ మన్నమస్కారముల్ – 3.206

దేవ 14 శక్వరి 1639 – UIIU UIIU UIIU UU భ-త-య-స-గ-గ 9

కావలె మాకావలె మా కావలి వీ వీశా
కావవలెన్ బ్రోవవలెన్ గామముఁ గామేశా
నీవలెఁ దానీనెవడౌ నీవిడు శ్రీ శ్రీశా
దేవ మహాదేవ మహాదేవ మహాదేవా – 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 61

ఇదే దేవ వృత్తాన్ని ఒక జాతి పద్యముగా కూడ పంతులుగారు వ్రాసినారు. దేవజాతి – 6,6,6,4 మాత్రలు యతి 13వ మాత్రపైన

కావవె నీవెందఱినో గరళగళా శంభూ
భావింతురు సేవింతురు భక్తుల కిడు శుభముల్
నీవు సదాశివుఁడవు గద నీ నతులు సశివులే
కావలయును గద శంకర కరుణింపుము నన్నున్ – 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 62

ద్రుతవిలంబిత (సుందరీ, హరిణప్లుతా) 12 జగతి 1464 – III UII UII UIU న-భ-భ-ర 7

అని నుతించెను హర్షము మీఱగాఁ
జని పదంపడి శాంకరయోగినిన్
వనజనాభునిఁ బద్మదళాక్షునిన్
ఘనసుభక్తునిఁ గాంచెను శ్రీపతిన్ – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 16

ద్విపద (పాటగా )- (ఇం-ఇం) (ఇం-సూ) కొన్ని చోటులలో అక్షరయతికి బదులు ప్రాసయతిని పెట్టా రిందులో. పాటరూపములో వ్రాసినారు కనుక ఇది బహుశా అంగీకృతమే.

అనువుగా గౌరికల్యాణ వైభవమె
యని పాడి రినుమాఱు లడరంగ ద్విపద

గౌరీ కల్యాణ వైభవమే – గౌరీ కల్యాణ వైభవమే – పల్లవి

హిమవంతు కూఁతురై యింపుసొంపొందె
హిమకరమౌళిని హితమొందఁ బొందె
వలఱేనిపగవాని వానికిఁ జెలిగ
నలరించెఁ బెండ్లియై యయ్యె నెచ్చెలిగ
కాళికాత్వము వీడఁగా గౌరి యయ్యె
మౌళిగా సిరిపల్కు మగువల కయ్యె
శ్రీరుచికుచ యౌట చేనన మించె
మారేడు మ్రానుగా మహి జన్మించె
తనక్రింద లింగమై తనరారు మగనిఁ
దన యాకు పూజలఁ దనియించె నొగిని
బిల్వదళాంబ నాఁ బేరొందెఁ దాను
బిల్వనాథునిఁ జేసె విభు బాగుగాను
తాను శ్రీతరువయి తనపతిన్ శ్రీశుఁ
గా నొనరించెను గడఁగి భూతేశు
మెఱపుఁదీఁగ యనంగ మెఱయుచు గౌరి
కఱకంఠు సాంధ్యేందుఁగన్ జేసె మూరి
తనుమధ్య యగుటను దనుమధ్య యనఁగ
వినుతయై ప్రోచును వినతుల మనగ
మ్రొక్కెద మందఱ మక్కఱ నిందు
జక్కఁగా శివులకు సత్ఫల మందు
ఈ గౌరికల్యాణ మీ పాట హెచ్చు
శ్రీగౌరియును వాణి శివుఁడును మెచ్చు
కవిరత్న కృత మిది గావున నెల్ల
కవులు గందురు పొందు కర ముల్లసిల్ల – 2.283

నతి 22 ఆకృతి 2023015 – UIIU UIIU UIIII UIIU IIIIU భ-త-య-న-జ-జ-న-గ 9,15 ఆఱు ఆఱు మాత్రలుగా విడదీసి వ్రాస్తే ఇది బాగుంటుంది

దేవ మహాదేవ సుధాధీధితి వహతే స్థిరతేనతిరవతే
శ్రీవసుధా భూతపతే శ్రీవనవసతే శివతేనతిరవతే
శ్రీవరబిల్వేశ పురారే భువనపతే మృడతేనతిరవతే
భావజకాలాంతక సద్భక్త శుభకృతే భవతేనతిరవతే – 4.134

నలినీ (భ్రమరావళి, శ్రీ) 15 అతిశక్వరి 14044 – IIU IIU IIU IIU IIU స-స-స-స-స 10

వినుతించెను మున్మును దేవినిఁ గాళిక న-
త్తనుమధ్యమ నాదిమ భక్తసుఖావహ యో-
గ్యను యోగము సిద్ధి పొసంగను యోగిని శ్రీ
వనపాలనశీలను సర్వనుతన్ దనరన్ – 6 ప్రథమ భాగము, శంకరోపాఖ్యానము 175

నవనందినీ 14 శక్వరి 3820 – IIUI UIII UIII UU స-జ-స-న-గ-గ 9

నినుఁ గొల్చుటన్ గమల నిక్కముగ శ్రీ నాఁ-
గ నెసంగె వెన్నుఁడును గాంచె రమశ్రీశున్
దన నొప్పె వాని నుతినందె విధి వాగీ-
శనుతుండు నయ్యె నతుఁ జల్పుదెటో శ్రీశా – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 32

?
దేవ కళాచంద్రధరా దేవభువనదేవ హరా త్రిపురహరా
భావపూర్ణలోకపతీ భవ్యమధురనాట్యకృతీ భవసుగతీ
జీవములో పావనతా శ్రీభగవతి హృత్సరితా శివ భవితా
కావగ రా కామహరా కామవరద కాలహరా కవితగ రా

నారాయణ 8 అనుష్టుప్ 163 – UIU UUI UI ర-త-గ-ల

ఓన్నమో నారాయణాయ
యన్న నీ మంత్రంబుఁ బూని
వెన్నుఁడా సేవించుచున్న
నన్నుఁ గావన్ రావె దేవ – 2.156

నిశా (నారాచ, నారాచక, మహామలికా, సింహవిక్రీడిత, వరదా ) 18 ధృతి 74944 – IIII IIUI UUI UUI UUI U న-న-ర-ర-ర-ర 9

పులుఁగులు నిదురించు ముద్రించుచున్ జుంచువుల్ గౌశికం-
బులు నిదురయు లేక పోరాడి కాకంబులన్ గూల్చెడున్
గలకలరవ మొప్పఁ గావించుచున్ బైఁడికంటుల్ గడున్
దెలిపెడు శకునాల దేవా నిశావృత్త మిట్లుండెడున్ – 5 ఉత్తర భాగము, 243

పంక్తి (అక్షరోపపదా, అక్షరపంక్తి, కాంచనమాలా, కుంతలతన్వీ, భూతలతన్వీ, హంసా, సుందరి ) 5 సుప్రతిష్ఠ 7 – UII UU భ-గ-గ

బిల్వవనేశా
బిల్వపురేశా
నల్వుగ మాలో
నిల్వుము శ్రీశా – 1.318

పంచచామరము (నారాచ, మహోత్సవ )16 అష్టి 21846 – IUIU IUIU IUIU IUIU జ-ర-జ-ర-జ-గ 10 తెలుగులో గురువుపైన యతి నుంచుతారు, కాని తాళవృత్తపు అందము బాగుగా గోచరమవవలయునన్న పాదాన్ని (8,8) గా విరిచి తొమ్మిదవ అక్షరముపైన యతి నుంచాలి. వేదం వేంకటరాయశాస్త్రిగారు కూడ ఇలాగే అభిప్రాయపడ్డారు.

శివాజ్ఞలేక యెవ్వఁడేని చేరఁ దాఁక శక్తుఁడే
నివానదిన్ మునుంగ దాని నీరు ద్రావ నేవడిన్
నవార్థకాహ్వయుండు నల్వ నల్వఱన్ నిజాఖ్యమౌ
నవిన్ వసించె నీవ నంట కంచుఁ బర్వతుండనెన్ – 6 తృతీయ భాగము, శతరూపశతానంద కల్యాణము 11

పద్మనాభ 25 వికృతి 1198373 – UUIUUIUUIUUI UUIUUIUUIUU త-త-త-త-త-త-త-గ-గ 13 పంచమాత్రలతో గూడిన ఈ వృత్తము దండకములాటిది.

శ్రీసేవ్య భవ్యాభవ బ్రహ్మసంభావ్య శేషాహిశాయీ విహంగేంద్రయాయీ
దాసావనా పావనా వాసుదేవా సదామోద దామోదరా దేవదేవా
వాసిన్ గనన్ గోరి యాసింత్రుగా నీకృపాసింధువున్ దానవేంద్రుల్ సురేంద్రుల్
నీసేవ సర్వార్థసిద్ధిప్రదం బంచు నిన్ గొల్తు విష్ణూ శుభా పద్మనాభా – 2.155

పరమేశ 14 శక్వరి 3452 – IIUI IIIUI UII UU స-న-జ-భ-గ-గ 10

పరమేశ జగదధీశ పన్నగభూషా
గిరిజేశ క్షితిధరేశ కీర్తితవేషా
కరుణామయ కమలేశ కంజజతోషా
శరణాగతభరణేశ సంశ్రితపోషా – 4.138

పురుష 9 బృహతి 31 – UII IIU UU U భ-స-మ 7

ఆదిమ పురుషా యాత్మేశా
శ్రీద్రుమ మహితా శ్రీ–
ఆదుము తనుమధ్యాధీశా
వేదముఖనుతా బిల్వేశా – 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదరకల్యాణము 106

జాతి పద్యముగా – చ-చ-చ-ద్వి, యతి 9వ మాత్రపైన

నారాయణుఁడే నల్వొందన్
శ్రీరాముఁడనన్ క్షితిపతియై
వీరత సీతన్ బెండ్లాడెన్
గౌరవ మెంతో కని మనియెన్ – 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదరకల్యాణము 103

పృథ్వి (ధృతి, విలంబితగతి) 17 అత్యష్టి 38750 – IUII IUIU III UIUUIU జ-స-జ-స-య-ల-గ 9 లేక 12 వీరు వ్రాసిన ఏడు పృథ్వీవృత్తాలలో ఐదింటికి తొమ్మిదవ అక్షరము యతి, రెండింటికి 12వ అక్షరము యతి. యతిని తొమ్మిదవ లేక పదకొండవ అక్షరముగా నుంచితే ఈ తాళవృత్తపు అందము అధికమవుతుంది.

తొమ్మిదవ అక్షరము యతిగా –

శివోऽహ మనఁగా నగున్ శివతరంబు సత్యంబుగా
నవున్ గలయనున్న యట్లని విపదంబులున్ రెండుగన్
బ్రవర్తిలఁగఁ గూడఁగా వఱలు దారకంబంచుఁ ద-
చ్ఛివప్రవణుఁ డెప్పుడున్ శివశివోऽహ మంచుండెడిన్ – 6 ద్వితీయ భాగము, ర త్నేశ సర్గము 7

పన్నెండవ అక్షరము యతిగా –

కనుంగొనెఁ గుఱంగటన్ బిదపఁ గంజశైలంబు నా
ఘనుండు వలఁగొంచు డాని నటఁ గాంచె నీవానదిన్
మునింగెఁ దనుమధ్యమాంబకును మ్రొక్కె శ్రీకాంతు నం-
త నెంచెఁ దనుమధ్యఁ దల్లినిని దండ్రి బిల్వేశ్వరున్ – 6 ప్రథమ భాగము, మత్తోపాఖ్యానము 25

పుష్పితాగ్రా – IIIIUI UIUIUU / IIIIUII UIUIUU బేసిపాదము న-జ-ర-య 9/ సరిపాదము న-జ-ల-ర-య 10. వైతాళీయములోని ఒక ప్రత్యేకత ఇది. సరి పాదములకు యతిని ఎనిమిదవ అక్షరముతో పెట్టుతారు. కాని నాకేమో రెండు పాదాలకు చివరి రెండు గణాలైన ర,య గణాలలోని రగణపు మొదటి అక్షరానికి పెట్టితే బాగుంటుంది. సంస్కృతములో దీనికి యతి లేదు.

అనుచిటు లాగి సూతుఁ డల్ల రత్నా
యన పురి సచ్చరితంబు హర్ష మొప్పం
గను మునులకుఁ జెప్పెఁ గాంచి రా స-
ద్వినుతులు సూతునితోడ బిల్వనాథున్ – 6 తృతీయ భాగము, నవాధ్వరత్న పర్వము 14

ప్రకృతి 8 అనుష్టుప్ 52 – IIUU IIUU స-భ-గ-గ 5

ప్రణుతింతున్ బ్రకృతీ శ్రీ
తనుమధ్యా తలి నిన్నున్
జనయిత్రీ జగదంబా
కని కావంగదె నన్నున్ – 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదరకల్యాణము 105

జాతి పద్యముగా – ష-ష , యతి 7వ మాత్రపైన

శ్రీమతియే సీతయనం-
గా మహిజా ఖ్యాతిఁ గనెన్
రామునికిని రాణియునై
శ్రీ మించెను శ్రీయె యనన్ – 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదరకల్యాణము 102

ప్రభాకలిత 19 అతిధృతి 175472 – IIII UII UIUI IUI UIUIU న-జ-జ-భ-ర-జ-గ 13

హరిహయుఁ డప్పుడె యొప్పగించె సహస్రవాజివిరాజితం
బరదము నాయుధసంభృతంబు సహస్రధామరథోపమం
బరిభయదంబును హారిసింహమహాధ్వజంబు మనోహరం
బరుదని లోకములెల్ల మెచ్చ నహా ప్రభకలితాఖ్యమున్ – 5 ఉత్తర భాగము, 311

ప్రభాత (మృగేంద్రముఖ, సువక్త్రా, అచల) 13 అతిజగతి 1392 – IIII UII UIU IUU న-జ-జ-ర-గ 8

దివియలు రిక్కలు దీప్తిఁ బాసెఁ జీక-
ట్లవిసెను దిక్కుల హా ప్రకాశమొందెన్
రవి యుదయించెను రాజిలెన్ దినాస్యం
బు విససమం బదివో ప్రభాత మయ్యెన్ – 5 ఉత్తర భాగము, 259

ప్రభు 26 ఉత్కృతి 28761088 – IIII IIII IIU IIU IIU IIU IIU IIU న-న-న-జ-జ-జ-జ-జ-ల-గ 9,15,21

మును విధి గొలిచెను బొసగన్ సృజనంబు నొనర్పఁగ నప్పురముల్ గెలువం-
గను హరుఁడును హరి గడలిన్ గపిసంఘము గట్టఁగ నా క్రతు భుగ్దనుజుల్
పనివడి జలనిధి బలిమిన్ దరువన్ భజియించిరి యప్పురమున్ గణనా-
థునిఁ గొలిచిన సిరిదొరయున్ విడువన్ దొడరున్ బెడదల్ ధ్రువమౌ నరయన్ – 6 ప్రథమ భాగము, నంద్యుపాఖ్యానము 10

ప్రమితాక్షర 12 జగతి 1772 – IIU IUI IIU IIU స-జ-స-స 9

శతపత్ర నామకము సారసము
న్నుత బిల్వము న్నవుట నో యటనే
శతరూపకున్ జలజజాతునకున్
హిత మొప్పఁ బెండిలి మహిన్ జరిగెన్ – 6 తృతీయ భాగము, కల్యాణ రసజ్ఞ పర్వము 22

ప్రహరణకలితా (కలికా) 14 శక్వరి 8128 – IIII IIU IIII IIU లేక III IIIU III IIIU న-న-భ-న-ల-గ 8

కరము మెఱయఁగాఁ గలరు గలనిలో
నరికరిహరులై యమితబలముచే
నరయ నొడలితో నవి గలుగుట నీ
వరభటు లెపుడున్ బ్రహరణకలితుల్ – 5 ఉత్తర భాగము, 238

ప్రహర్షిణి (మయూరపిచ్ఛ) 13 అతిజగతి 1401 – UU UII IIU IUI UU మ-న-జ-ర-గ 8 సంస్కృతములో పాదము 3,10 అక్షరాలుగా విరుగుతుంది. నాకేమో ఈ వృత్తము చతుర్మాత్రాబద్ధము, కావున యత్యక్షరము ఆఱు లేక తొమ్మిదిగా ఉండాలి.

మెండై సంతసమొగి మేర మీఱి దుర్వా-
సుండున్ గూఁతును గనె జోటి మేటి హారం
బొండున్ జూపెను గని యుక్త మిత్తు నంచా-
తండున్ బల్కెను విధి దానవారు లెంచన్ – 5 ఉత్తర భాగము, 555

ప్రియంవదా (మత్తకోకిల) 12 జగతి 1400 – III UIII UI UIU న-భ-జ-ర 8

అవధరింపు మణిహారవక్ష మా-
ధవ నృసింహ మణిధామశోభితా
శివద రత్నతనుశీల శ్రీకరా
తవినరత్న చరితంబు నింబుగన్ – 6 ద్వితీయ భాగము, రత్నేశ సర్గము 1

ప్రియకాంతా (కాంత) 16 అష్టి 13264 – IIIIU UIIII UUII UU న-య-న-య-స-గ 11

శివుఁడను నీవో శివవు సుశీలా యహ మన్నన్
దవుదు శివోऽహ మ్మనుటయె తానౌ శివయోగం
బవు మన కిట్లెప్దును గడు హర్షంబుఁదలంతేన్
దవుదువు కోరన్ వరముల ధన్యా ప్రియకాంతా – 2.266

ఫలసదన 16 అష్టి 16384 – IIIII IIII IIIII UU న-న-న-న-స-గ 10

అలరుల నళులకును నవనిజము నీడన్
బొలయు మొగములకును బొనరెడును మేలై
ఫలముల నిగుళులను బతగముల కింపౌఁ
బలు బెఱఁగులను నిది ఫలసదన మయ్యెన్ – 2.22

బంగారము – (ఇం-ఇం) (ఇం-ఇం) (చం) / (ఇం-ఇం) (సూ-సూ) (చం) యతి లేక ప్రాసయతి తేఁటి లేక తేఁబోటి బంగారము తరువాత ఉండాలి.

బిల్వేశ్వరీయమన్ విదిత ప్రబంధంబు
వివిధ సద్వృత్తాళి విస్తరించి పేర్మి మించి
వెండి బంగారముల్ వెలయించి యాంధ్రభా-
షాసీస దుస్థితి నోసరించి వాసిఁ గాంచి
యంతియే కాక రత్నావళుల్ గల్పించి
యాంధ్రు లెందఱనొ భూషాంచితులఁగ నాదరించి
గురుత విశ్వామిత్ర గోత్రగౌరవ మెచ్చఁ-
గన్ గవిబ్రహ్మ నా ఖ్యాతిఁ గాంచి కరము మించి

తేఁటి –
సముచితాక్షర సాంఖ్యశాస్త్రము నొనర్చి సరవిఁ బేర్చి
కనితి వర్ణసాంఖ్యాచార్యుఁ డనఁ బ్రసిద్ధి ఘన సుసిద్ధి
గన మహామహోపాధ్యాయ ఘన బిరుదము వినుతి యెందు
నిఖిల పండిత కవివంద్య నీకె తగును నీకె తగున్ – శ్రీదీక్షితచరిత్రము, అవతారిక, 11

బిల్వ 6 గాయత్రి 55 – UII UII భ-భ

బిల్వదళాపగ
బిల్వదళాంబిక
బిల్వకుజేశుఁడు
గొల్వయి నిల్వగ – 5 ఉత్తర భాగము, 487

బ్రహ్మ (ద్వియోధా, స్రగ్విణీ, హంసమాలా )6 గాయత్రి 19 – UIU UIU ర-ర

ఓన్నమో బ్రహ్మణే
యన్న మంత్రంబుతో
నిన్ను గొల్తున్ విధీ
నన్ను నేలంగదే – 2.104

భాస్కరవిలసితము 25 అభికృతి 8381311 – UII IIII UII UU UII IIII IIII UU భ-న-జ-య-భ-న-న-స-గ 13 ఈ పాదము కందపాదానికి కూడ సరిపోతుంది

కాంచె గణపతి నలక్ష్యముగాఁగన్ గావున నయనుఁ డరదుఁడు నయ్యెన్
గాంచెను రవిదిత కాయత వీత ఖ్యాతరుచియు నయి కని తెలివిన్ సే-
వించెను గనియెను విశ్రుత శోభన్ విశ్వవినుతుఁడయి వెలసెను సంజ్ఞా
పంచశరుఁ డనగ భాసిలెఁ గానన్ భాస్కరవిలసిత మిది కథ యొప్పున్ – 6 ప్రథమ భాగము, నంద్యుపాఖ్యానము 56

భుజంగప్రయాతము (అప్రమేయా) 12 జగతి 586 – IUU IUU IUU IUU య-య-య-య 8 గణాల ప్రకారము ఏడవ అక్షరము యతిగా నూండాలి, కాని తెలుగులో దీర్ఘాక్షరముపైన యతి నుంచడము వాడుక. వేదం వేంకటరాయశాస్త్రి ఏడవ అక్షరముపైన యతి నుంచారు.

నవాధ్వంబనన్ బిల్వనాథీయమంచున్
నవాధ్వంబనన్ రత్ననాథీయమంచున్
నవాంశంబులన్ గల్గి నల్వొందు దీనిన్
శివోऽహమ్మటంచున్ నృసింహుండు గాంచున్ – 6 న తృతీయ భాగము, నవాధ్వరత్న పర్వము 9

భూతిలక 19 అతిధృతి 186039 – UII UII UIU IIUI UII UIU భ-భ-ర-స-జ-జ-గ 12

చంపకవర్ణ తమాలవేణి రసాలపల్లవపాణి మే-
లింపు లతాంగి జపాధరోష్ఠిసమిద్ధ కోకిలవాణి శ్రీఁ
బెంపవు శ్రీకుచమంజరీ స్మితవీక్షణాళి వసంతుతో
సొంపవు నీ వనదేవతోత్తమ చూడ భూతిలకంబవున్ – 2.13

భూనుత (లతా, వనలతా, వలనా) 14 శక్వరి 3515 – UIUI IIUII UII UU ర-న-భ-భ-గ-గ 10

వెన్నుఁ డుంచినవి పెక్కులు వ్రేఁతల వల్వల్
పన్నుగా నిపుడు దాల్చిన భంగి నెసంగున్
గ్రొన్ననల్ చిగుళులాకులు గూడఁగ నిమ్మౌ
పొన్న మ్రాను గను మియ్యది భూనుత మయ్యెన్ – 2.26

భ్రమరవిలసిత 11 త్రిష్టుప్ 1009 – UU UU IIII IIU మ-భ-న-ల-గ 6 నా ఉద్దేశములో యతిని ఐదవ అక్షరముపైన ఉంచాలి, అప్పుడే పద్యపాదము చతుర్మాత్రలుగా విరుగుతుంది.

మానౌఁగా యీ భ్రమరవిలసితం
బౌ నోలిన్ వర్ణ మఱఁగను సితం-
బౌనా జ్యోత్స్నాప్రియ మిట నగుమా
జానౌ నెయ్యం బెసఁగఁగఁ గనుమా – 2.18

అలా వ్రాసిన ఒక పద్యము –

అందమ్మై యీ యలరులు విరియన్
నందమ్మాయెన్ నగవుల వనిలో
స్పందించెన్గా భ్రమరవిలసితం
బీం దీ వేళన్ హృదయము విరిసెన్

మంగళమణి 16 అష్టి 31711 – UIIII UIIII UIIII U భ-స-న-జ-న-గ 11

భృంగకచకు బిల్వకును మహేశ్వరసతికిన్
భృంగసరుచికంఠుని కల బిల్వకపతికిన్
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమగు నెల్లరకును మాన్యతఁ గనరే – 6 తృతీయ భాగము, కల్యాణరసజ్ఞ పర్వము 134

మంగళమణి జాతి – 6, 6, 6, 2 మాత్రలు, యతి 13వ మాత్రపైన

శతరూపకు శతధృతికిని జత గుదిరెనుగా
స్తుతియించిన వినుతించిన శుభము లొనరుగా
కృతులార సుకృతులార సుకృతి సుకృతదమౌ
నతులంబిది మంగళకృతి యరయుఁడి శివమౌ – 6 తృతీయ భాగము, శతరూపాశతానందుల కల్యాణము 27

మంగళమహాశ్రీ 26 ఉత్కృతి 15658735 – UIII UIII UIII UIII UIII UIII UU భ-జ-స-న-భ-జ-స-న-గ-గ 9,17

పాడి రటఁ దుంబురుఁడు పావనియు శ్యామలయు వాణియును రాణ దనరంగా
నాడి రొగి నుర్వశియు నాదటను రంభ శివుఁ డంతటను భృంగియు నెసంగన్
గూడి రమరుల్ మునులు గుంపులుగ మానవుల కోటులన నెంత పువువానల్
పోఁడిగను బెండ్లి యది భూదివులు మెచ్చఁగను బొల్పెసఁగె మంగళమహాశ్రీ – 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదర కల్యాణము 100

మంజరి – చ-చ-చ-చ, యతి 9వ మాత్రపైన విడిచి విడిచి పాదాలకు అంత్యప్రాస

శివుఁ గొలువుండీ శివుఁ గొలువుండీ
శివుఁ గొలువుండీ శివరతులారా
శివుఁడవు బ్రహ్మము సిద్ధము సుండీ
శివమవు సర్వము క్షితి జనులారా – 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 161

పక్కపక్కన పాదాలకు అంత్యప్రాస

కాముని రూపును గాంచుటఁ గాల్చెన్
సా మేనను దన చానను దాల్చెన్
భూమిని దివినేన్ బోలు నెవండీ
స్వామిని శివు నీశ్వరుఁ గొలువుండీ – 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 162

మంజుభాషిణి (కనకప్రభా, జయా, నందినీ, ప్రబోధితా, మనోవతీ, విలంబితా, సునందినీ, సుమంగలీ) 13 అతిజగతి 2796 – IIUI UIII UIU IU స-జ-స-జ-గ 9

మును నేను దిక్పతులఁ బూని గెల్వగాఁ
జనునప్పు డెల్ల నను సంతసంబుతోఁ
బను తెట్టు లట్టిపుడుఁ బంపు మింపుగా
మనకున్ జయం బొదవ మంజుభాషిణీ – 5 ఉత్తర భాగము, 255

మందాక్రాంత (శ్రీధరా) 17 అత్యష్టి 18929 – UUUU IIIIIU UIUUIUU మ-భ-న-త-త-గ-గ 11 సంస్కృతములో పాదము 4,6,7 గా విరుగుతుంది. నా ఉద్దేశములో ఈ వృత్తానికి సంస్కృత యతి బాగుంటుంది.

పొందన్ లేకింపును వగవు నే పొందుటన్ జేసి రోసెన్
మందోత్సాహుండయి యతఁడటన్ మానెఁ జేయన్ దపంబున్
మందాక్రాంతం బనఁగఁ దనదౌ మానసం బొప్ప నప్డా-
నందంబొందన్ శుభశకునముల్ నల్వు మీఱన్ స్ఫురించెన్ – 6 ప్రథమ భాగము, నంద్యుపాఖ్యానము 8

మణిదీప్తి 19 అతిధృతి 55513 – UU UII UII UU UII UII UU U మ-స-స-త-జ-య-గ 11

శ్రీమద్బిల్వవనేశ్వర శంభూ శ్రీకర శ్రీకర సంభూతా
నీ మాహాత్మ్యము శక్తులె యెన్నన్ నీరజనాభసరోభూజుల్
గామింగాదె సుపీఠము నీకై కాంచిరి గౌరవ మొక్కింతే
నే మేమారసి స్తోత్రము సేయన్ నేర్తుము శ్రిత తనుమధ్యేశా – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 33

మణిభూషణ (రమణీయక, సుందర, ఉత్సర, మణిభూషణశ్రీ) 15 అతిశక్వరి 11707 – UIUI IIUII UIIU IU ర-న-భ-భ-ర 10

భక్తి నిచ్చెను సునీతియుఁ బన్నుగ నెన్నగన్
ముక్తదేవునికి సన్మణిభూషణరాసులన్
రక్తిఁ దత్పరి జనాళిని రంజిలఁ జేసెఁ దా
యుక్త సత్కృతుల ధన్యతనొందెను బొందుగన్ – 5 ఉత్తర భాగము, 394

మణిమంజరి చ-చ-చ-చ యతి తొమ్మిదవ మాత్రతో, ప్రాస, అంత్యప్రాస ఉండాలి

అంగజవిజయుని కంజలి యిడరే
మంగళకృతి మణిమంజరిఁ గొనరే
అంగనలారా హర్షద మనరే
పుంగవులారా పొలుపును గనరే – 6 ద్వితీయ భాగము, రత్నగుప్తసర్గము 70

మణిమాలా (అబ్జవిచిత్రా, పుష్పవిచిత్రా) 12 జగతి 781 – UUII UU UUII UU లేక UUI IUU UUI IUU

శ్రీశా తనుమధ్యాధీశా జగదీశా
శ్రీశార్చితపాదా శ్రీష్టార్థద సత్యా
ధీశాంచిత వాణీ దివ్యస్తుతిపాత్రా
యాశాంకుశ దుర్వాసోऽభిష్టుత తుష్టా – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 31

మత్తకీర 20 కృతి 372096 – III IIII UI UII UI UII UIU న-న-జ-భ-ర-స-ల-గ 13

అలరఁగను దన కెన్ని పెట్టిన నక్కఱం గడు మెక్కియున్
బలుకులను దన కొప్ప నేర్పగఁ ప్రౌఢిఁ గాంచియు నెంచకే
వెలలు నిలువదు పంజరంబున వేడ్కఁజెందువ నాప్తి రా-
మ లలన యొకను రామచిల్కను మత్తకీర సువృత్తమున్ – 2.15

మత్తకోకిల (చర్చరీ, మల్లికామాల, మాలికోత్తరమాలికా, విబుధప్రియా, హరనర్తన, ఉజ్జ్వల, హరిణప్లుత) 18 ధృతి 93019 – UI UII UI UII UI UII UIU ర-స-జ-జ-భ-ర 11 సంస్కృతములో తొమ్మిదవ అక్షరమును కూడ యతిగా నుంచుతారు.

తన్ను ముందన వార లారయ దారిఁ గానక లాఁతి యిం-
టన్నెఱిన్ నెలకొల్ప వర్ధిలి నాద మబ్బఁగ నుబ్బునన్
బన్ను గాఁదనుఁ బెంచువారినిఁ బానె మ్రోసెడుఁ గృష్ణతన్
మన్న దౌటనొ కాంచు మియ్యది మత్తకోకిల వృత్తమౌ – 2.14

మత్తమయూర (మాయా) 13 అతిజగతి 1633 – UUUU UIIUU IIUU మ-త-య-స-గ 8 సంస్కృత పద్యము కావడమువల్ల యిందులో యతి ప్రాసలు లేవు.

ఆదిక్షాంతా మక్షరమూర్త్యా విలసంతీం
భూతేభూతే భూతకదంబప్రసవిత్రీం
శబ్దబ్రహ్మానందమయీంతాం తనుమధ్యాం
గౌరీం అంబాం అంబురుహాక్షీ మహ మీడే – 6 ప్రథమ భాగము, శంకరోపాఖ్యానము 181

మత్తేభ (అశ్వధాటి) 22 ఆకృతి 1915509 – UUI UIII UUI UIII UUI UIII U త-భ-య-జ-స-ర-న-గ 8,15 దీని గణాలు అశ్వధాటి గణాలు, కాని అశ్వధాటికి ప్రాసయతి, దీనికి అక్షరయతిని ఉంచారు పంతులుగారు. పింగళుని ఛందశ్శాస్త్రములో మత్తేభవృత్తానికి గణాలు – త-భ-జ-జ-స-ర-న-గ, త-భ-య-జ-స-ర-న-గ కాదు.. వీరు వ్రాసిన వృత్తము అశ్వధాటిగా సుప్రసిద్ధము (దేవీ అశ్వధాటి, దశావతారస్తుతి).

శ్రీకార కానన పరిష్కార మౌననఁగ శ్రీ మించు బిల్వపతినిన్
మాకీడ్యయైన తనుమధ్యన్ ద్విపాననుఁ గుమారున్ వృషాదుల నిటన్
శ్రీకాముఁడౌ నరుఁడు సేవించి సర్వసుఖసిద్ధిన్ గనున్ నిజముగా
నాకై వడిన్ జదువ నాలింప నందిది యుపాఖ్యాన మిష్టద మిదౌ – 6 ప్రథమ భాగము, నంద్యుపాఖ్యానము 80

మత్తేభవిక్రీడితము 20 కృతి 298676 – IIUUIIUIUIIIU UUIUUIU స-భ-ర-న-మ-య-ల-గ 14

మగువా పద్మిని పద్మి పద్మినిని నమ్మన్ గ్రమ్మిరుంభద్వయిన్
నగవిద్విద్ఘన బాహుదండనిభశుండన్ జాచుఁగా జూచిరే
మగదన్ నాగము బాగు మీఱెడుఁగదా మత్తేభవిక్రీడితం-
బగు మేల్ నేనటుగానె యంచు శివుఁ డార్యన్ జాల లాలించినన్ – 2.24

మదనవిలసిత (ద్రుతగతి, చపలా, మధుమతి, లటహ, హరివిలసిత) 7 ఉష్ణిక్ 64 – IIII IIU న-న-గ

శివుఁడను మొదటన్
శివయనుఁ బిదపన్
శివకరముగ నిం-
పవుర రగడ నుడుల్ – 2.28

మనోహర 13 అతిజగతి 2731 – UI UI UI UI UI UI U ర-జ-ర-జ-గ 9

దేవదేవ శర్వ సర్వ దేవసేవితా
సేవ సేయుచుందు నిందు శిష్టభావితా
కావవయ్య నన్ను ముందు కాలకంధరా
సేవకుల్ భజింతు రింత శ్రీద శంకరా – 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 63

మనోహర జాతి 3-3-3-3- 3-3-2, యతి 13వ మాత్రపైన.

సర్వమంగళాన్వితాంగ చంద్రశేఖరా
సర్వమంగళంబు లొసఁగు సదయ శంకరా
నేర్వఁ గొలువ నొరులఁ గోర నిన్నె గొల్తురా
శర్వ నన్నుఁ బ్రోవనీవ చాలి దీశ్వరా – 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 63

మహామంగళమణి 15 అతిశక్వరి 14020 – IIUU UUII UIIU IIU స-మ-స-స-స 9

అవుఁ గల్యాణంబో మని యంత నమో యనఁగన్
శివమంత్రం బా పిమ్మటఁ జెల్లు శివాయ యనన్
జవిఁ గొల్పున్ భాగాస్తి రసజ్ఞత నట్లె కనన్
దవుఁ గల్యాణాభిఖ్య ముదంబిడు పర్వ మిదౌ – 6 తృతీయ భాగము, కల్యాణరసజ్ఞ పర్వము 135

మహామంగళమణి జాతి – 6, 6, 6, 4 మాత్రలు, యతి 13వ మాత్రపైన.

శ్రీమతి యన శ్రీమతి యవు శ్రీమతికినిఁ గంద-
ద్దామోదరుఁడవు దామోదరునకుఁ దత్పతికిన్
వేమఱనరె మంగళమని విశ్రుత గురుభక్తిన్
గామితములు సమకొనుఁ దత్కల్యాణము నెన్నన్ – 6 శ్రీమతీదామోదరకల్యాణము 108

మహాస్రగ్ధర 22 ఆకృతి 605988 – IIUUUIUU IIIIIIU UIUUIUU స-త-త-న-స-ర-ర-గ 9,16 స్రగ్ధరలోని మొదటి గురువును రెండు లఘువులుగా మార్చితే ఈ వృత్తము మనకు లభిస్తుంది.

కనియెన్ దుర్వాసుండందున్ గనకవసనునిన్ గౌస్తుభశ్రీసమేతున్
వనజాక్షున్ వైజయంతీపరికలిరతు రవిస్పర్థికోటీరభూష్ణున్
వనజాప్తప్రాయచక్రున్ వనజరిపులస త్పాంచజన్యున్ జగద్రం-
జనునిన్ సాంధ్యారుణాభున్ శకునపతిహయున్ జారురోచిష్ణువిష్ణున్ – 3.9

మానిని (మదిరా, లతాకుసుమ, సంగతా) 22 ఆకృతి 1797559 – UII UII UII UII UII UII UII U భ-భ-భ-భ-భ-భ-భ-గురు 7,13,19 మానినికి సామాన్యముగా మూడు యతుల నుంచుట వాడుక, కాని పాంతులుగారు నన్నయలా ఒక్క యతిని, తరువాతి కవులలా మూడు యతులను ఉంచారు.

ఒక్క యతితో పద్యము –

చేలము నిచ్చెను క్షీరసముద్రుఁడు చెల్వగు సొమ్ములఁ ద్వష్ట మహా
మాలిక నా వరుణుండు ధనేశుఁడు మద్యముఁ గోర హిమాద్రి హరిన్
శూలము శూలియుఁ జక్రముఁ జక్రియుఁ జొప్పడ బ్రహ్మ కమండలువున్
గాలుఁడు దండముఁ గైదువఁ బల్కను గంధవహుం డిషు కార్ముకముల్ – 5 ఉత్తర భాగము, 114

మూడు యతులతో పద్యము –

భర్తయె దైవము భార్యకు నారయ వాని యనుజ్ఞనె వామ కెటన్
వర్తిలు టొప్పును వాఁడెటులున్నను వానిని వీడుట భద్రముగా-
దార్తి యవున్ జెడ దాయిలు వాసి యహా యిలు వాసి గయాళిగరా
ధూర్త వటంచును దోఁచి నినున్ బతి ద్రోచునొ యేచునొ దూషితగాన్ – 6 ప్రథమ భాగము, నంద్యుపాఖ్యానము 37

మాలిని (నాందీముఖీ) 15 అతిశక్వరి 4672 -III III UU UIUUI UU న-న-మ-య-య 9

శరణు శరణు దేవా సర్వ సద్భక్త రక్షా
గురుతర కరుణాబ్ధీ ఘోర తాపాపహారా
హరిహరి మము నీవే యారయన్ గావలెన్ శ్రీ
వర యరికృత భీతిన్ బాపవే చక్రపాణీ – 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదరకల్యాణము 72

మేఘవిలసిత 12 జగతి 2041 – UU UII IIII IIU మ-న-న-స 6

చాలన్ దీధితి సరఘలు దనయం
దోలిన్ గూర్చిన వొనరుఁ బెఱ లివే
యాలోకింపుఁడి యను ననఁగఁ జదల్
గ్రాలెన్ మేఘవిలసితముగ నొగిన్ – 5 పూర్వ భాగము, 150

మౌక్తికమాలా (కుట్మలదంతీ, రుచిరా, సాంద్రపద, భద్రపద) 11 త్రిష్టుప్ 487 – UII UU IIII UU భ-త-న-గ-గ 7

మౌక్తికమాలన్ మహితము దీనిన్
మౌక్తికమాలన్ మఱి యొనరింపన్
యుక్తముగా నీ యురుతర చాతు-
ర్యోక్తి వితానం బుఱునటు లౌటన్ – 5 ఉత్తర భాగము, 541

యశస్వి 22 ఆకృతి 450553 – UU UII IIII IIII UII UII UU U మ-న-న-న-జ-జ-య-గ 6,14,20

ప్రాసాదాక్షర పరిమితముగఁ గ్రమ పద్ధతి నంకము లాఱుండన్
భాసిల్లన్ గనఁబడుఁ బరుఁడును దరువాతను మూటను బిల్వేశుం
డౌ సత్యంబుగ నతఁడవుఁ గద యెనయన్ దనుమధ్యయు యోగంబున్
వాసిన్ గన్పడుఁ బదపడి తుదఁ గనుపట్టెడుఁ దారకమో శ్రీశా – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 36

రగడ – త్రి-చ త్రి-చ త్రి-చ త్రి-చ ప్రాస, అంత్యప్రాస, ఐదవ మాత్రాగణముపైన ప్రాసయతి.

కంటివే యెలమావి గున్నను మంటవలె నిది యలరె సంజనఁ
గంటిఁ దుమ్మెద తుటుము పొగవలె మింట నంటెఁద మంబ నంజనఁ
గాంచితే యల గండుఁగోయిల పంచమస్వర మెందు నీవలెఁ
గాంచితిన్ రతి నిన్ను వేఁడెడు సంచు సూచించుటగఁ గావలె – 2.29

రత్నావళి – 30 మాత్రలు, 17వ మాత్రపైన యతి

విలసిలు రత్నావళి యను పద్యము విద్వద్వంద్యంబయి ప్రాసో-
జ్జ్వలమయి పాడఁగ నెల్లరు విన ముప్పది దినముల నెలవలె నెల నా-
ని లలి వర్ధిల నూతనముగఁ గవు లెక్కువ మక్కువఁ గనఁగొనఁగా
జెలువుగ ముప్పది మాత్రలఁ బాదము చెల్ల విరతి పదునేడింటన్

ప్రాసాదము సర్వాధారంబున్ బ్రాప్యము సర్వఫలప్రద మం-
చా సన్మంత్రస్రజమున కొలికిగనవుఁ దారకమం చది గాంచన్
వాసిగ బిల్వేశ్వరుఁ గొలువన్వలెఁ బ్రబ్బెడు జీవన్ముక్తియు నం-
చీ సముచిత రత్నేశ్వరకృతి వచియించున్ దత్త్వము శివమంచున్ – 6 ద్వితీయ భాగము, రత్నేశ సర్గము 13

ఏకావళి – ఇందులో ఏ పాదము ఆ పాదానికి స్వతంత్రముగా తరువాతి పాదముతో ప్రాస లేక ఉంటుంది.

శ్రౌతస్మార్తా గమికములగు బహు సత్కృత్యములను దగఁ జలుపన్
శాస్త్రనిషిద్ధాచారంబులఁ గడుఁ జలుపుదు నేమనఁగల నింకన్ – 6 ద్వితీయ భాగము, రత్నదాస సర్గము 95

ద్వ్యావళి – ఇది రత్నావళి లక్షణములు కలిగిన ద్విపద.

అంతన్ గ్రమముగ సాంఖ్యజ్ఞానం బభివర్ధిల్లం దనుమధ్యా
కాంతుని బిల్వేశ్వరు నెల్లప్పుడు స్వాంతమునందు స్మరించుటచే – 6 ద్వితీయ భాగము, రత్నాయన సర్గము 69

లఘురత్నావళి – 28 మాత్రలు, 17వ మాత్రపైన యతి

తా సమకూడిన యక్షర సాంఖ్య సుధారసమున్ దా నొకఁడే
గ్రాసముగాఁ గొన కెల్లర కిడుట వరంబని సంస్కృత భాషన్
జేసెద తండల మార్గదాయినిని జెప్పెఁ దెనుంగున సారం
బా సువర్ణమణిమాలికఁ జెప్పెద నారయుఁ డీరు దగంగన్ – 6 ద్వితీయభాగము, రత్నాయన సర్గము 53

గురురత్నావళి – 30, 4, 12 మాత్రలు, యతి 17వ, 35వ మాత్రపైన

రత్నమనంగ నరుం డొకరుం డిటు రత్నదాసుఁ డనఁ బరగెన్ బదపడి రత్నగుప్తుఁడనఁ దనరెన్
రత్నవర్మయననై యటుపిమ్మట రత్నశర్మయనఁగఁ దగెన్ సాంఖ్య ప్రజ్ఞానంబును గనుటన్
రత్న మనంగను బ్రాసాదము దారక మని యర్థ మెఱింగెన్ గని త ద్రత్నాయనములఁ జనియెన్
రత్నాయనుఁడని పేరందెన్ మఱి రత్నేశ్వరుఁడే యయ్యెన్ వింతయె రత్నము రత్నమె యయ్యెన్ – 6 ద్వితీయభాగము, రత్నేశ సర్గము 11

మహాగురు రత్నావళి – 30, 2, 14 మాత్రలు, యతి 17వ, 33వ మాత్రపైన

రత్నేశుఁడు బిల్వేశుఁడె యౌటను రత్నములౌదురు తద్భక్తుల్ నర రత్నములౌదురు శ్రీయుక్తుల్
రత్నాయన కృత మగుటను సాంఖ్యము రత్నాయన మది గనుట నరుల్ నవ రత్నా యన నవరత్నేశుల్
రత్నము ప్రాసాదము దారక మా రత్నములన్ గని రంజిలుఁడీ నర రత్నములుగ మీరలు గండీ
రత్నమనన్ బ్రణవంబును బ్రహ్మము రత్నమనన్ నరుఁడౌటఁ గనన్ నర రత్నము బ్రహ్మం బౌనుగదా – 6 ద్వితీయభాగము, రత్నేశ సర్గము 12

రథోద్ధత (పరాంతిక) 11 త్రిష్టుప్ 699 – UI UIII UI UIU ర-న-ర-ల-గ 7

ఏపు మీఱుఁ గను మీ రథోద్ధత
బౌప రింద్రి జగదంచితంబునున్
గోపురౌఘయుత గోపురంబనన్
జూపులోఁ గొనెడు సూర్యబింబమో – 5 ఉత్తర భాగము, 241

రుక్మవతి (చంపకమాలా, పుష్పసమృద్ధి, సుభావా) 10 పంక్తి 199 -UII UU UII UU భ-మ-స-గ 6

ఆరయ కేమో యప్పుడు నిన్నున్
గోరితి నీవున్ గోరవె నన్నున్
గూరితి తన్విన్ గ్రొచ్చెదు తన్విన్
గ్రూరతరోక్తిన్ ద్రోహముగాదే – 2.77

రుచిర (కలావతీ, అతిరుచిరా, సదాగతి) 13 అతిజగతి 2806 – IUIU IIII UIUIU జ-భ-స-జ-గ 9 సంస్కృతములో పాదము 4,9 గా విరుగుతుంది

వనంబిదే కనుఁగొన వాంఛ గొల్పెడున్
మనోజ్ఞమై మనమున మానినీమణీ
ఘనంబులౌ కుటములఁ గ్రాలు తీవెలన్
సునందనం బిది గద చూడ నొప్పెడున్ – 2.11

లక్ష్మీ 22 ఆకృతి 1047760 – IIII UU IIU UII IIII IIII UU న-య-స-భ-న-న-స-గ 13

కనుఁగొను మమ్మా మముఁ గొమ్మానతిఁ గరివరవరదుని కొమ్మా
కనుఁగొన నీకున్ గలదమ్మా సిరి కర మరుదుగ సిరి వమ్మా
ఘనదయవమ్మా ఘన మెమ్మాడ్కిని గడునిదునటు సిరు లమ్మా
ఘనదయ వమ్మా వరలక్ష్మీకృత కమలజముఖ సురలక్ష్మీ – 2.164

లయగ్రాహి – UIII UIII UIII UIII UIII UIII UIII UU 9,16,23

పొంచుచును బైఁ బడగ నెంచుచును నొండొరులఁ గాంచుచును మాటలను మించుచును వాలం-
కించుచును వ్రేయుచును గొంచె మసి వోవఁగను మంచిదని వెండియును గొంచక యయేయన్
ద్రుంచుచును దున్కలుగ నించుకయు డయ్యక గ్రహించుచు గదల్ మఱియుఁ బెంచుచును వ్రేటుల్
నించుచును గాయముల నొంచుచును సొమ్మసిలి రంచితము స్వర్గమును గాంచి రన వారల్ – 5 ఉత్తర భాగము, 355

లలిత (దయి) 4 ప్రతిష్ఠ 16 – IIII న-ల
శివుఁడను
శివకవు
డవుటను
నవరుచి – 2.55

వనమంజరి 21 ప్రకృతి 744304 – IIII UII UII UII UIU IIUI U న-జ-జ-జ-జ-భ-ర 14

అమర మరంద సరిత్తున మున్గియు నంది పుప్పొడి బూదియై
భ్రమరక రాజులనన్ దగు మేల్రుదురాకపేరులఁ దాల్చి తా
క్షమఁ గని మౌనముతోడఁ దపంబును జల్పుచున్నటులున్న దీ
క్షమ నెది కోరెనొ యారయ సుస్తని కాంచు మీ వనమంజరిన్ – 2.17

వనమయూర (ఇందువదనా) 14 శక్వరి 3823 – UIII UIII UIII UU భ-జ-స-న-గ-గ 9

ఔ వనమయూరగళ మట్టు లిది లింగం
బౌ వెలయు బిల్వదళ హార మహి యట్లో
శ్రీ వనమయూర మనఁ జెన్నుగ నిదౌనా
శ్రీ వనమయూర మనఁ జెన్నగు ననెన్ శ్రీ – 3.171

వసంతతిలక (ఉద్ధర్షిణీ, ఔద్ధర్షిణి, కర్ణోత్పలా, మధుమాధవీ, శోభావతీ, సింహోన్నతా, సింహోద్ధతా) 14 శక్వరి 2933 – UUIUIII UIIUIUU త-భ-జ-జ-గ-గ 8

కాంతా వసంతతిలకం బిది కంటె వింటె
స్వాంతంబొ యెంతయును సంతస మందునిందే
కాంతుల్ పరస్పరము గాంచఁగఁ గాంక్షసేయన్
గాంతా యితంబుగదె కమ్రవనంబు గానన్ – 2.12

వసన (కమల, మహి) 8 అనుష్టుప్ 96 – IIIII UIU న-స-ల-గ

ఇది ప్రకృతి భాగమా
ముద మిడెడు నింక నె-
మ్మదిఁ బురుష భాగ మిం-
పొదవు ననె శ్రీశ్వరా – 5 పూర్వభాగము, 226

16 అక్షరాలతో వాణిని అని మరొక వృత్తము సంస్కృతములో ఉన్నది.

వాణి 19 అతిధృతి 106225 – UU UU IIII UII IIU UII UU మ-భ-స-న-య-స-గ 12

వాణిన్ వీణా జపసర పుస్తక వరకీరాంచిత పాణిన్
వీణా హంసవ్రజ శుక సత్పరభృత వాణిన్ విధిరాణిన్
శ్రేణీభూత స్ఫురదళివేణిని భృతసుశ్రోణిని నా గీ-
ర్వాణిన్ గొల్తున్ మదిని సుభక్తిని వలదీక్షణరుచిరైణిన్ – 2.172

వామదేవ 16 అష్టి 21995 – UIUI UIIII UIUI UIU ర-జ-న-ర-జ-గ 10

వామదేవుఁడే యగుఁ గన వాసుదేవుఁ డంచు నీ
భూమిఁ దెల్పెడున్ శసలకుఁ బోలె మాకభేదమున్
సోమమౌళి యజ్యుగళము చూపుఁ గాక భేదమున్
శ్రీమదీశ యోంకృతియయి చెప్పదే యభేదమున్ – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 35

విద్యున్మాలా (విద్యుల్లేఖా) 8 అనుష్టుప్ 1 – UUUU UUUU మ-మ-గ-గ 5 పది అక్షరాలకంటె తక్కువైన వృత్తాలకు తెలుగులో యతిలేకపోయినా, విద్యున్మాలకు మాత్రము
ఐదవ అక్షరముపైన యతి నుంచుట వాడుక, కాని ఈ కవి దీనిని ఆచరించలేదు.

ఆద్యంబుల్ బిందుల్ పుష్పంబుల్
వాద్యంబుల్గా నుర్ముల్ మ్రోయన్
హృద్యామర్త్యస్త్రీ లాస్యంబై
విద్యున్మాలా వృత్తం బొప్పెన్ – 5 పూర్వ భాగము, 151

వెండి – బంగారము పిదప తేటగీతి –

అజుఁ డాది నొక శక్తి నాత్మజగన్ గనె
నది ముత్తెఱంగుల నలరె నొగిని ఆదిశక్తి
గాయత్రి యనఁగను గనుపట్టెఁ దొల్దొల్త
సావిత్రియ ననంత సౌరు మీఱె సన్నుతాంగి
మఱి సరస్వతి నాఁగ మహిత యయ్యెఁ దదాత్మ
భవ యౌటఁ బుత్రి నాఁ బ్రథను గనియె వాణిగదా
ఆ వేదమూర్తి యర్ధాంగ మౌట సువర్ణ
రాశి గ్రైవేయక ప్రభను దనరె రత్నభూష
అంతట హిరణ్యగర్భుఁ డక్కాంతఁ గాంచెఁ
గామవికృతిఁ బ్రదక్షిణ క్రమమౌఁ జలుపు
దాని నలుమొగములఁ జూచి తాను నల్వ
యయ్యె నది మింటి కేగఁ బంచాస్యుఁ డయ్యె – 6 తృతీయ భాగము, శతరూపాశతానందుల కల్యాణము 4

వెండి – సీసము పిదప తేఁటి
నట విట గాయక కుటిల దురోదర
మద్యామిషార్థుల మచ్చిక దగ
దెపుడును మ్రుచ్చుల నెలమిఁ జేర్చుకొనంగఁ
జన దిచ్చకము లాడు జనులఁ గూడ
రాదు గూర్చుకొనంగరాదు వంచకులఁ బం-
చను నుంచుకొనరాదు జనుల నీచు-
లను దురాచారుల నెనయంగఁ గూడదు
కొండెగాండ్రను గూడి యుండరాదు

నాగవాసము నాఁగను నాగవాసమౌఁ గానను
భోగినులను భుజంగులఁ బొంద విసము పొసఁగున్ గద
పారదారికవృత్తినో ప్రబ్బు మిత్తి పాతకమౌ
దుష్టసాంగత్యమే యెల్ల దొసఁగుల నిడుఁ దొడర కయ్య – 6 ద్వితీయ భాగము, రత్నవర్మ సర్గము 96

శంకర-1 15 అతిశక్వరి 7135 – UIIII UIIII UIIU U భ-స-న-జ-య 11

శంకర శ్రితశంకర భవసంకటనాశా
పంకజభవ పంకజదృగుపాసిత శ్రీశా
పంకజశరకంకశమన పాలితసోమా
యింకనయినఁ గింకరి నను నేలవె సోమా – 4.137

శంకర-2 16 అష్టి 30703 – UIIII UIIII UIIII U భ-జ-న-స-న-గ 11

శంకర శివశంకర శివశంకర యనరే
శంకర శివశంకరి శివశంకరి యనరే
పంకము లఱుఁ బుణ్యములు శివంకరములుగాఁ
బొంకములగు మీకెపుడును బొంకము కనఁగా – 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 59

శంభునటనము 26 ఉత్కృతి 31317470 – IUIIIUIII UIIIUIII UIIIUIIIU జ-స-న-భ-జ-స-న-భ-ల-గ 10,18 నేను దీనికి నంది వృత్తము అని పేరుంచాను. సంస్కృతములో దీనిని IUIIIUII IUIIIUII IUIIIUII IU గా విరిచెదరు.

నృసింహ సురసింహ కృతి నీయదిది దీనిఁ గొను నీవనుచు శంభునటనం
బెసంగెఁ గవిరత్ననిధి నీయది జనించెఁ గన నిందిర గదా యిదనుచున్
బొసంగఁ దనుమధ్య తనువున్ మఱియు మత్తనువుఁ బొల్చుఁ గద శ్రీగ ననుచు
న్నొసంగు కవిరత్నమున కొప్పఁగ నభీష్టముల నోలి శ్రితపాళి కనుచున్ – 6 తృతీయ భాగము, నవాధ్వరత్న పర్వము 16

శతపత్ర (చారుమతి) 25 అభికృతి 14872303 – UIII UIII UIII UIII UIII UIII U భ-జ-స-న-భ-జ-స-న-గ 9,17

కామరిపు సాముగను గ్రాలెఁ దనుమధ్య యనఁ గాంచితి తదర్థ తనువున్
నేమమునఁ బూరుషత నేము తనుమధ్యమును నెమ్మిఁ గనుఁగొంటి మిపు డో
స్వామి పురుషోత్తముని వారిభవనాభు నిను బాగుగ గంటి మహహా
మా మహిత నీవె తనుమధ్యవుగఁ దోఁచెదు నమస్కృతులు నీకవు హరీ – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 19

శశివదనా (కనకలతా, చతురంశా, మకరశీర్షా, ముకులితా) 6 గాయత్రి 16 – IIII UU న-య

అని సనకాదుల్
వినుతి యొనర్పన్
ఘన శివతత్త్వం
బొనరఁగ నెందున్ – 1.319

శార్దూలవిక్రీడితము 19 అతిధృతి 149337 – UUUIIUIUIIIU UUIUUIU మ-స-జ-స-త-త-గ 13

నిఃఖేదీకృత దాసపాశహరణా నీకున్ నతుల్ సద్దయా
దుఃఖధ్వాంతనిరాసకా త్రిణయనా దుర్వారశౌర్యోదయా
వాఃఖాగ్నిక్షితివాయుసూర్యశశి విప్రప్రాయకాయా జయాం
తఃఖేలాస్మర కాల కాలహర నిత్యా సత్యసక్తాశయా – 1.316

శిఖరిణి 17 అత్యష్టి 59330 – IUU UUU III IIU UIIIU య-మ-న-స-భ-ల-గ 13 సంస్కృతములో పాదము 6,11 గా విరుగుతుంది.

ఒసంగెన్ శంభుం డాత్మభవునికి సర్వోత్తమములౌ
లసద్భూషల్ విష్ణుం డజుని కిడు లీలన్ శ్రుతిరతుల్
రసస్ఫూర్తుల్ మించన్ రమరమణుఁ డార్యాకలితుతో
వెసన్ బెండ్లిన్ జేయన్వలయు నలరన్ వీని కనియెన్ – 5 ఉత్తర భాగము, 421

శివ 6 గాయత్రి 43 – UI UI UI ర-జ *

ఓన్నమశ్శివాయ
యన్న మంత్ర మూని
నిన్ను నెన్నుచున్న
నన్నుఁ బ్రోవు శ్రీశ – 2.192

శివశంకర (సురభి) 18 ధృతి 126844 – IIUII IIUII IIUII IIU స-న-జ-న-భ-స 11 ఈ వృత్తమును జయకీర్తి, హేమచంద్రులు పేర్కొన్నారు. సంస్కృతములో పాదము 3,5,5,5 గా విరుగుతుంది. నాకేమో పంతులుగారి యతి బాగుంది.

శివశంకర శివశంకర శివశంకర యనరే
శివశంకరి శివశంకరి శివశంకరి యనరే
శివుఁ డాత్మగ శివబుద్ధిగఁ జెలువొందఁగఁ గనరే
శివభక్తిని భజియింపుఁడు స్థిర సౌఖ్యముఁ గనరే – 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 60

శోభనమహాశ్రీ 25 అభికృతి 14498421 – UUI UIII UUI UIII UUI UIII UIIU త-భ-య-జ-స-ర-న-భ-గ 8,15,22

చూడంగదే చంద్రు సోఁకెన్ కనుంబరిది సొక్కెన్ చెఁజెందొరలు శోభనమే
వాడేంగదే కల్పవల్లీమతల్లి యిది భాసిల్లె మంజరులు బాగనమే
వీడెంగదే రిక్క పిండొప్పె నర్ధముల బింబంబునం ?ఱులు వీలనమే
యాడంగ లేదేల యంచన్న శోభనమహాశ్రీ యిదౌ ననిరి యౌ ఘనమే – 5 ఉత్తర భాగము, 598

శ్రీ 1 శ్రీ 1 –
U గ
శ్రీ
బి
ల్వే
శా – 6 ద్వితీయ భాగము, రత్నేశ భాగము 2

శ్రీకర 13 అతిజగతి 2732 – IIUI UIUI UIUIU స-జ-ర-జ-గ 9

జగదీశ మమ్ము బ్రోవు చంద్రశేఖరా
నగదయ్య కావవేని నల్వె శ్రీకరా
యగు నీకు మిత్ర భూత యక్ష శేఖరా
యగు మాకు బిల్వనాథ యాప్త శ్రీకరా – 4.147

శ్రీమతి 17 అత్యష్టి 22115 – UIU UUII UUII UIUI UU ర-త-య-స-జ-గ-గ 12 *

రామమౌ రామాయణ మూలం బిది ప్రాకటంబ యౌటన్
క్షేమమున్ యోగంబును గూర్చుందనుఁ జేరువారి కెప్డున్
దా మహిన్ స్వర్గంబును మోక్షంబును దద్ద యిచ్చుఁ గానన్
శ్రీమతీ దామోదర కల్యాణము శ్రీకరంబుగ నౌ – 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదరకల్యాణము 107

సంజ్ఞా (కమలలోచనా, కమలాక్షీ, చండీ) 13 అతిజగతి 1792 – IIII IIII UII UU న-న-స-స-గ 9

అని విని యతఁ డతి హర్షముతోఁ గూ-
తును గనుఁగొని యిదె తోడనె వత్తున్
జను మిరవున కనె సంజ్ఞయు ఛాయం
గని మయిమఱువనఁగన్ గ్రహియించెన్ – 6 ప్రథమ భాగము, నంద్యుపాఖ్యానము 47

సన్నుత 15 అతిశక్వరి 15851 – UI UI UI III UI III U ర-జ-న-భ-స 10

ఓన్నమశ్శివాయ యనుట యొప్పగు వినరే
ఓన్నమశ్శివాయ యనుచు నొప్పుగ ననరే
ఓన్నమశ్శివాయ యనుచు నోరిమిఁ గనరే
ఓన్నమశ్శివాయ యని సమున్నతిఁ గొనరే – 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 159

సభా (గురుమధ్యా) 6 గాయత్రి 52 – IIU UII స-భ

అనఁగా నిమ్మని
యనఁ గానిమ్మని
పనిచెన్ నాయిక
పని చెన్నా యిక – 5 ఉత్తర భాగము, 543
(ఈ పద్యములో యమకము కూడ ఉన్నది)

సరసిజ (మదలేఖా, విధువక్త్రా, సురుచిర) 7 ఉష్ణిక్ 31 – UII IIU U లేక UIII IUU భ-స-గ. సరసిజము అనే మరో వృత్తము (క్రౌంచపదములా) ఉన్నది

బిల్వవనియు దానన్
బిల్వపురి యనంగన్
జెల్వయి యలరెన్ శ్రీ
చెల్వ యనఁగనింగన్ – 1.308

సలిల 5 సుప్రతిష్ఠ 28 – IIUII స-ల-ల

అని సూతుఁడు
మును లెట్లది
యని వేఁడగ
ననె నిట్లని – 6 రత్నేశ భాగము 6

సాయం 11 త్రిష్టుప్ 345 – UU UII UIUI UU మ-స-జ-గ-గ 6

ఆ యాదిత్యుఁడు నస్తమింప విప్రుల్
సేయన్ సాంధ్య సుసిద్ధ కృత్య మాస్థన్
డాయన్ గూళ్ల నడంగ నండజంబుల్
సాయంవృత్తము జానుమీఱెఁ జూడన్ – 5 ఉత్తర భాగము, 213

సీసము – (ఇం-ఇం) (ఇం-ఇం) / (ఇం-ఇం) (సూ-సూ) మొదటి అర్ధపాదములో నాలుగు ఇంద్రగణాలు, రెందవ అర్ధ పాదములో రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలు ఉంటాయి సీసపాదానికి, ఎరండు అర్ధపాదాలలో మూడవ ఉపగణముతో యతి లేక ప్రాసయతి చెల్లుతుంది. సీస పద్యానికి చివర ఆటవెలది లేక తేటగీతి తప్పని సరిగా ఉండాలి.

ముద్దియ నెమ్ముద్దు మొగము నెంచుటగాదె
తథ్యంబుగా విధు ధ్యాన మమర
బిబ్బోకవతి గబ్బిగుబ్బ లెంచుటగాదె
బిల్వేశ్వరుని సేవ విశ్రుతముగఁ
బొలఁతుక నడకను బొసఁగ నెంచుటగాదె
యంచరౌతును బ్రస్తుతించు టరయ
సుందరీరత్నంబు సొగసు నెంచుటగాదె
శ్రీమహాశక్తిఁ బూజించుట గనఁ
తే. దరుణి షోడశ కళలను ధ్యాన మొనరఁ
జేయుటే పరమాత్మకుఁ జేయు షోడ
శోపచారంబులకుఁ గాన నా పయోజ
పత్రనేత్ర స్మరించెద భక్తి ముక్తి – 5 ఉత్తరభాగము 513

సుకాంతి (జయా, నగానితా, నగణికా, లాసినీ, విలాసినీ) 4 ప్రతిష్ఠ 6 – IU IU జ-గ

గణేశ నా
ప్రణామమున్
గనంగదే
మణిస్తుతా – 6 ప్రథమ భాగము, నంద్యుపాఖ్యానము 54

సుగంధి (ఉత్సవ, ఉత్సాహ, చామర, తూణక, మహోత్సవ, శాలిని, ప్రశాంతి) 15 అతిశక్వరి 10923 -UIUIUIUI UIUIUIU ర-జ-ర-జ-ర 9

చిన్నదైన ఉత్సాహవృత్తము

సర్వభక్షకుండ వయ్య సర్వపావనుండవై
యుర్వినిన్ దివిన్ వెలింగె దున్నతిన్ జగన్నుతిన్
బర్వ దింక నింద యంచుఁ బావకున్ స్వఫాల దృ-
క్పర్వ ధూర్వహున్ బొనర్చె వారణాస్యుఁ డీశుడున్ – 6 ప్రథమ భాగము, నంద్యుపాఖ్యానము 76

సుభగ 8 అనుష్టుప్ 52 – IIUU IIUU స-భ-గ-గ పాదానికి ఎనిమిది అక్షరాలు ఉండే వృత్తములో యతి నుంచారు యిక్కడ.

అని సూతుం డను వొందన్
వినిపింపన్ విని మౌనుల్
గని రాత్మన్ ఘను బిల్వే-
శుని దుర్వాసుని ప్రోలన్ – 5 ఉత్తర భాగము 617

సుముఖీ (ద్రుతపాదగతి) 11 త్రిష్టుప్ 880 – IIII UII UII U న-జ-జ-ల-గ 7 నా ఉద్దేశములో యత్యక్షరము ఎనిమిదిగా ఉండాలి, అప్పుడే చతుర్మాత్రల అందము గోచరమవుతుంది.

అనె నిటులం బయగాత్మ జయం-
బున నమృతంబుఁ బొసంగ నొసం-
గు నిది యదో యగు మోహిని యం-
చును శివుఁ డెంచ సుమాళముగాన్ – 2.36

స్రగ్ధర 21 ప్రకృతి 302993 – UUUUIUU IIIIIIU UIUUIUU మ-ర-భ-న-య-య-య 8,14

ఎక్కెన్ గంజాద్రిమీఁదన్ హితమతి నతఁ డయ్యింతితో నిట్లు పల్కెన్
జిక్కెన్ నా మానసం బీ శిఖరి సరసి నీ చిత్ప్రకాశంబునందున్
దక్కెన్ స్వాభావికంబౌ ధనము విబుధవంద్యంబు లింగౌఘ మిందే
నిక్కొండన్ బాయఁజాలన్ హృదయ మలరు నా కిందె యుండంగ నంచున్ – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 2

స్రగ్విణీ (లక్ష్మీధర, పద్మినీ) 12 జగతి 1171 – UIU UIU UIU UIU ర-ర-ర-ర 7

వామదేవా ఘనధ్వాన కంఠద్యుతీ
కామకాలా జయోత్కంఠ కాలాహితా
సోమనేత్రద్దినేట్సోమశుక్రాకృతీ
సోమమౌళీ శ్రితేష్టోత్సవా యౌ నతుల్ – 4.149

స్వాగతము 11 త్రిష్టుప్ 443 – UIUI IIUII UU ర-న-భ-గ-గ 7

భోగ మోక్షములఁ బొందగఁ గోర్కుల్
బాగుగాఁ గలుగు వారలు సేరన్
యోగు లచ్చట సముత్సుకు లుండన్
రాఁగఁ గంజపురి రంజిలెఁ జాలన్ – 4.173

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...