పురూరవ: శ్రవ్య నాటిక

సేకరణ: పరుచూరి శ్రీనివాస్.

మొదటిసారిగా 1974లో ఆకాశవాణి లో ప్రసారితమైన పురూరవ శ్రవ్యనాటికను మీకందిస్తున్నాం. చలం రచించిన ఈ నాటిక సాహిత్యపరంగానూ, శ్రవ్య రూపంలోనూ కూడా పేరుగన్నదే. ఈ నాటికలో ఊర్వశి నవ్వుకి అప్పటికీ ఇప్పటికీ ఎందరో అభిమానులైనారు, చలంతో సహా. ఈ నాటికలో ఊర్వశి పాత్రకు వాచకాన్ని అందించి ప్రాణం పోసినవారు శ్రీమతి శారదా శ్రీనివాసన్. వారి గురించి, ఈ మధ్యనే ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడ్డ వారి జ్ఞాపకాలలోనే చదవండి.

నిడివి: 61ని.

[మాకు లభించిన ఈ ఆడియోలో చివరి కొన్ని క్షణాల సంభాషణ లేదు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. పరిహారంగా, ఊర్వశి చివరిగా పురూరవునితో అన్న మాటలను ఇక్కడ పొందుపరిచాం . ఈ వాక్యాలు ఆడియో ఆగిపోయినప్పటి సంభాషణల ఆధారంగా పురూరవ పుస్తకం నుంచి సేకరించబడ్డాయి.

పురూరవ నాటికలో చివరి భాగం

[పురూరవ నాటికలో చివరి భాగం — సంపాదకులు]

ఊర్వశి: పిచ్చివాడా, ఊర్వశి అంటే ఏమిటి? మీ లోకం మల్లే యోచించకు. ఊర్వశి అంటే ఒక అనుభవం. శరీరం కాదు. శరీరమైనా ఒక అనుభవమే కదా. ఈ వియోగం, బాధ, ఎందుకని ఏడుస్తావు గాని, వాటి వల్ల కలిగే అశాంతే లేకపోతే ఏం అందుకోగలరు మీరు? అన్నీ సహించు. విధిని ప్రార్ధించు. దిక్కులదిరేట్టు ‘ఊర్వశీ’ అని ప్రశ్నలడుగు. సాధించు. నీకొసమే కాచుకుని ఉంటాను నేను. నేను చాలా సత్యం. నీదాన్ని. నీ జీవితం ఒక్క క్షణం. ఊర్వశితో అనుభవం అనంతం. ఆ లోకంలో కలుసుకుందాం. మన కలలన్నీ సార్ధకం చేసుకుందాం.

నీది పాపమూ కాదు. పొరబాటూ కాదు. తప్పదు. నీ జీవితానుభవానికి అంతే పర్యవసానం. దానినుంచి ఏట్లానూ తప్పించుకోలేవు. నన్ను పొందగలిగిన ఔన్నత్యం ఎట్లానో తెచ్చుకున్నావు కొంతకాలం. అంత ఔన్నత్యాన్నీ మామూలుగా నీ స్వభావానికి తెచ్చుకోగలగాలి నువ్వు. దానికోసమే ఇన్ని యేళ్ళు దారుణ తపనం నమ్ము. సన్నిహితంగా రాలేననుకోకు. కానీ నేను నీకు దగ్గరైనానా, నన్ను వొదలలేవు. నేను వెళ్ళాక ఆ బాధను భరించలేవు. నీతో కలిసి సుఖించిన ఊర్వశినే తలుచుకో, నన్నందుకో గలిగే వరకూ. నేను వెడతాను.

(ఆమె కాంతి అతని చుట్టూ నిలిచి చలించి మాయమయింది)

ఆసక్తి గలవారు పూర్తి నిడివి నాటకం పుస్తక రూపంలో ఇక్కడ చదవవచ్చు.